30, అక్టోబర్ 2011, ఆదివారం

విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో రాష్ట్రావతరణ దినోత్సవం

తెలుగు సోదర , సోదరీమణులారా........!
విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నవంబరు 1 వ తేదీన ఉదయం 11.30 గంటలకు హైదరాబాదు సచివాలయం ఎదురుగా ఉన్న తెలుగు తల్లి విగ్రహానికి పుష్ప మాల సమర్పణ మరియు స్వాతంత్ర్య సమరయోధులకు సన్మాన కార్యక్రమం నిర్వహింపబడును .ఈ కార్యక్రమము లో సర్వశ్రీ నర్రా మాధవ రావు గారు (స్వాతంత్ర్య సమరయోధులు ) , ఆంజనేయ రెడ్డి గారు ( మాజీ డీ జీ పీ ),డా.పరకాల ప్రభాకర్,ప్రొఫెసర్ . ఆర్ వీ ఆర్ చంద్ర శేఖర్ రావు గారు, ,ప్రొఫెసర్ మురళి ,ఏ బీ కే ప్రసాద్ గారు , సి .నరసింహా రావు గారు,కుమార్ చౌదరి యాదవ్ ,కొడిచర్ల వెంకటయ్య,పీ .రవితేజ ,నల్లమోతు చక్రవర్తి ,చేగొండి రామ జోగయ్య గారు,సుంకర వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొందురు.కావున తామెందరు ఈ కార్యక్రమములో పాల్గొని జయప్రదం చేయవలసినదిగా కోరుచున్నాము .

వేదిక : హైదరాబాదు ,సచివాలయం ఎదురుగా ఉన్న "మన తెలుగు తల్లి విగ్రహం "

సమయం : ది . 1 నవంబరు ఉదయము 11.30 గంటలకు

ఇట్లు,
విశాలాంధ్ర మహాసభ

రాజు బూజు ఘనం! రాష్ట్ర ఏర్పాటు ద్రోహం!!

ప్రజాశక్తి: ప్రత్యేక రాష్ట్రంగా వుండాలన్న కాంక్ష భూస్వామ్య శక్తుల కోర్కె అని ఆనాటి సభలో అప్పటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు వ్యాఖ్యానించారు. కనుక చట్టసభ చర్చ ద్వారా జరిగిన ఈ నిర్ణయం విద్రోహం కాజాలదు.తర్వాత కూడా కాంగ్రెస్‌ నాయకత్వంలో రెండు సార్లు రెండు ప్రాంతాల్లో విభజన ఉద్యమాలు వచ్చి విఫలమైనాయి. వాటి నాయకులంతా పదవుల్లో కుదురుకోగా ప్రజలే నష్టపోయారు. ఇప్పుడు కూడా ప్రధాన పార్టీల నాయకులు దశలవారీగా గొంతులు మారుస్తున్న తీరు చూస్తూనే వున్నాం. ఏదైనా ద్రోహం అంటూ జరిగితే దానికి ఇలాటి స్వార్థ రాజకీయాలే కారణమని చెప్పక తప్పదు.


తెలంగాణా పేరిట నాటి నిజాం రాజు నిరంకుశత్వాన్ని ఈనాటి కార్పొరేట్‌ రాజకీయాన్ని కూడా సమర్థించడం ద్వారా టిఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర రావు గతాన్ని వర్తమానాన్ని కూడా గందరగోళ పరచేందుకు ప్రయత్నిస్తున్నారు. శుక్రవారం నాడు ఆయన పోలవరం టెండర్లపై పత్రికాగోష్టిలో చేసిన వ్యాఖ్యలు, అదే రోజు సాయింత్రం ఒక పుస్తకావిష్కరణ సభలో వెలిబుచ్చిన భావాలు ఆ దిశలోనే వున్నాయి.


తెలంగాణా సంసృతి, చరిత్రల గురించి పదే పదే ప్రస్తావించే కెసిఆర్‌ వంటి వారు ఆ చరిత్రను ఆజరామరం చేసిన వీర తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట వారసత్వాన్ని గౌరవించేవారైతే ఇలా జరిగేది కాదు. విగ్రహాల విషయం వచ్చినప్పుడు అయిలమ్మ, కొమరయ్యల పేర్లు స్మరించేవారు నిజంగా వారు ఎవరిపై ఎందుకు పోరాడారో తెలియనట్టు నిజాంను కీర్తిస్తున్నారని అనుకోలేము.


ఓ నిజాం పిశాచమా! కానరాడు
నిన్ను పోలిన రాేజు మాకెన్నడేని
తీగలను తెంపి అగ్నిలో దింపినావు
నా తెలంగాణా కోటి రతనాల వీణ అని దాశరథి నిజాం జైలు గోడలపై బొగ్గుతో రాశాడు! మా నిజాం రాజు జన్మ జన్మాల బూజు అని నిప్పులు కక్కాడు.


చుట్టుపట్ట సూర్యాపేట
నట్టనడుమ నల్లగొండ
ఆవాల హైద్రాబాదు
తర్వాత గోలకొండ
గోలకొండ ఖిల్లా కింద -
నీ గోరి కొడతాం కొడకో
నైజాం సర్కరోడా!
ఆనాడు తెలంగాణా పోరాట యోధుడైన ప్రజాకవి యాదగిరి రాసిన గీతం ఆయన తుపాకి గుళ్లకు నేలకొరిగినా ఇప్పటికీ జనాన్ని వుర్రూతలూగిస్తుంది.


మరినీ గోరికాడకొచ్చి నేను మొక్త కొడకో అని పాడుకోవలసిన పరిస్థితి కెసిఆర్‌కు ఎందుకు కలిగింది? నాలుగేళ్ల కిందట ఆయన నిజాం వర్ధంతికి హాజరై ప్రశంసలు కురిపించినపుడు నిజమూ నిజామూ పేరిట రాసిన వ్యాసంలో నేను అడిగిన ప్రశ్న ఇది. దీన్నే తర్వాత ఆయనతో టీవీ చర్చలో పాల్గొన్నప్పుడూ లేవనెత్తాను. దీనిపై కెసిఆర్‌ ఎవరైనా పిలిచినప్పుడు వెళ్లడం, నాలుగు మంచి మాటలు చెప్పడం మర్యాద అన్నారు. వ్యక్తిగతంగా వెళ్లి మాట్లాడితే ఫర్వాలేదుగాని ఒక పార్టీ నాయకుడుగా నిజాం ఘనతను కీర్తించడం చరిత్రను తలకిందులు చేయడమేనని అంటే కాటన్‌ దొర ప్రసక్తి తీసుకొచ్చారు. ధవళేశ్వరం కట్టిన కాటన్‌ను విదేశీయుడైనా పూజిస్తుంటే నిజాం సాగర్‌ కట్టించిన నిజాంను ఎందుకు కీర్తించకూడదని ఎదురు ప్రశ్న వేశారు. దాన్నే శుక్రవారం సభలో ప్రస్తావించినట్టు మీడియాలో చూశాను.కాటన్‌ విదేశీ పాలకుల దగ్గర ఉద్యోగిగా వున్న సాంకేతిక నిపుణుడే తప్ప పాలకుడు కాదు. పైగా ఆయన బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని ఈ ఆనకట్ట కోసం ఒప్పించేందుకు అనేక అవస్థలు పడ్డాడు. దీనివల్ల కరువు తగ్గి జన నష్టం ఆగిపోతుందని, పన్నులు పనుల రూపంలో బ్రిటిష్‌ ఖజానాకు బోలెడు ఆదాయం వస్తుందని నచ్చచెప్పాడు. పంటలకు నీళ్లు అందించిన కాటన్‌ దొరను రైతులు అభిమానంగా కొలుచుకుంటారు తప్ప బ్రిటిష్‌ రాణిని పూజించరని చెప్పాను.


నిజాం వ్యవహారం ఇందుకు పూర్తి భిన్నం. సర్పెఖాస్‌ పేరిట ఆయన లెక్కలేనంత స్వంత భూమిని కలిగివుండటమే గాక రైతులను అనేక విధాల పీడించి వెట్టి చేయించాడు, దేశ్‌ముఖుల పెత్తనానికి ప్రజలను బలిచేసి మధ్యయుగాల నాటి బానిసత్వంలో మగ్గిపోవడానికి కారకుడైనాడు. బ్రిటిష్‌ వారికి తొత్తుగా మారి తెలుగు నేలను అంచలంచెలుగా ధారదత్తం చేస్తూ ప్రజలను విడదీశాడు. ఆఖరి వరకూ తన ఏలుబడిలోనే వున్న హైదరాబాద్‌ సంస్థాన భాగంలో ప్రజాస్వామ్య పవనాలు ఏ మాత్రం చొరనీకుండా అన్ని విధాల నిరంకుశత్వం సాగించాడు.భాషా పరమైన మతపరమైన ఆధిపత్యంతో పాటు గ్రంథాలయాల ఏర్పాటు, పత్రికా నిర్వహణ వగైరాలపై కూడా ఆంక్షలు పెట్టి వేధించాడు. కమ్యూనిస్టుల నాయకత్వంలో తిరుగుబాటు చేసిన ప్రజలపై రజాకార్లను పురికొల్పి మారణహోమం సాగించాడు. సైన్యాలను ఎగదోలాడు. స్వాతంత్రానంతరం కూడా దేశంలో కలవకపోగా స్వతంత్రం నిలబెట్టుకోవడానికి విదేశాలతో కలసి కుట్రలు పన్నాడు. పాకిస్తాన్‌కు దూతలను పంపించాడు. ఐక్యరాజ్యసమితిలోనూ ఫిర్యాదు చేశాడు. ఇవన్నీ సాగక నెహ్రూ ప్రభుత్వంతో చేతులు కలిపి కమ్యూనిస్టులపై నరమేధం సాగించేందుకు సహకరించాడు.ఇదంతా చరిత్ర. ఈ చరిత్రను మార్చింది వీర తెలంగాణా ప్రజానీకమైతే వారికి నాయకత్వం వహించి నడిపింది కమ్యూనిస్టులు, ఆంధ్ర మహాసభ.ప్రపంచ చరిత్రలోనే అదొక మహోజ్వల పోరాటం.


నిజాం హైదరాబాదులో భవనాలు కట్టించాడని గొప్పగా చెప్పడంలో అర్థం లేదు. అందులో కొన్ని మాత్రమే ప్రజల కోసం కట్టించినవి. అత్యధిక భాగం ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నాక వినియోగిస్తున్నవి. ఈ వాదన ప్రకారమైతే పార్లమెంటు భవనం, రాష్ట్రపతి భవనం కట్టించినందుకు బ్రిటిష్‌ వారికి మోకరిల్లాల్సి వుంటుంది! నిజాం ప్రాజెక్టులు కట్టించింది చాలా నామమాత్రం. ఆయన అనుభవించిన దాచి వుంచిన సంపదతో పోలిస్తే అది సముద్రంలో నీటిబొట్టు మాత్రమే. ప్రజల నుంచి కొల్లగొట్టిందానికి లెక్క లేదు. వారి రక్తమాంసాలు పీల్చిన వెట్టిచాకిరీకి అసలే విలువ లేదు.ఆఖరుకు నాటి తెలంగాణా తల్లుల మాన ప్రాణాలకు కూడా విలువ లేని రాక్షస రాజ్యమది. సంస్కృతి పేరిట బతకమ్మ పండుగలు చేసే వారు బతుకులనే చిదిమేసిన రాక్షస రాజ్యానికి భజన కీర్తనలు పాడుతున్నారంటే అది కరుడుకట్టిన భూస్వామ్య భావజాలాన్ని ప్రతిబింబిస్తుంది తప్ప తెలంగాణా పోరాట స్పూర్తిని కాదు. కెసిఆర్‌ ప్రస్తావించిన నాటి చర్చను చెప్పాలంటే నాతోపాటు పాల్గొన్న నాగేశ్వర్‌ జోక్యం చేసుకున్న మీదట కెసిఆర్‌ నిజాంలో ప్లస్‌ల కన్నా మైనస్‌లే ఎక్కువన్న ఒప్పుకోలుతో ముగించారు.


నిజాంను కూల్చివేసిన తర్వాత ఆయన హయాంలో ముక్కచెక్కలైన తెలుగు కన్నడ మరాఠీ ప్రజలు భాషా ప్రాతిపదికన కలసిపోవడం సహజంగా జరిగిపోయింది. పునర్విభజనపై ఏర్పడిన ఫజలాలీ కమిషన్‌ కూడా 1962 వరకూ చూసి తర్వాత సమైక్య రాష్ట్రం ఏర్పరచవచ్చునని చెప్పిందే తప్ప వ్యతిరేకించలేదు. పైగా ఈ విషయమై తెలంగాణా ప్రాంతంలో స్పష్టత లేదని కూడా వ్యాఖ్యానించింది తప్ప వ్యతిరేకత వుందని చెప్పలేదు. ఐచ్ఛికంగా చట్టసభల చర్చల ద్వారా జరిగిన ఈ పరిణామం వెనక తెలంగాణా యోధుల బలీయమైన మద్దతువుంది. నిజామాంధ్ర మహాసభల చిరకాల స్వప్నం వుంది. మామ కెవిరంగారెడ్డి, అల్లుడు మర్రి చెన్నారెడ్డి వంటి కొద్ది మందిని మినహాయిస్తే నాటి హైదరాబాదు శాసనసభ చర్చలో ఎక్కువ మంది విశాలాంధ్ర ఏర్పాటును స్వాగతించారు. పైగా అప్పుడు తెలంగాణా ప్రాంతం నుంచి కమ్యూనిస్టులే అధికంగా ఎన్నికై వున్నారు. ప్రత్యేక రాష్ట్రంగా వుండాలన్న కాంక్ష భూస్వామ్య శక్తుల కోర్కె అని ఆ సభలో ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు కూడా వ్యాఖ్యానించారు. కనక చట్టసభ చర్చ ద్వారా జరిగిన ఈ నిర్ణయం విద్రోహం కాజాలదు.


తర్వాత కూడా కాంగ్రెస్‌ నాయకత్వంలో రెండు సార్లు రెండు ప్రాంతాల్లో విభజన ఉద్యమాలు వచ్చి విఫలమైనాయి. వాటి నాయకులంతా పదవుల్లో కుదురుకోగా ప్రజలే నష్టపోయారు. ఇప్పుడు కూడా ప్రధాన పార్టీల నాయకులు దశలవారీగా గొంతులు మారుస్తున్న తీరు చూస్తూనే వున్నాం. ఏదైనా ద్రోహం అంటూ జరిగితే దానికి ఇలాటి స్వార్థ రాజకీయాలే కారణమని చెప్పక తప్పదు. కాగా నవంబరు 1న రాష్ట్ర ఏర్పాటును ద్రోహం అనడం అర్థరహితం. రేపు కేంద్రం ఏ నిర్ణయం ప్రకటించినా (అసలంటూ ప్రకటిస్తే) అది లెక్కల్లో వెనకటికి వర్తింపు(రెట్రాస్పెక్టివ్‌ ఎఫెక్ట్‌)లాగా 1956 నవంబరు 1 ని ద్రోహంగా మార్చేస్తుందా?


పోలవరం టెండర్ల విషయానికి వస్తే టిఆర్‌ఎస్‌ అధినేతకు సన్నిహితుడైన, నమస్తే తెలంగాణా పత్రికలో కీలకమైన వ్యక్తికి అందులో భాగం వున్న మాట కాదనడం లేదు. ఎంత వాటా అన్న దానిపైనే అభ్యంతరాలు చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టు వల్ల కలిగే నివారణీయ నష్టాలను గురించి సిపిఎం మొదటి నుంచి చెబుతున్నది. వివిధ కోణాల నుంచి టిఆర్‌ఎస్‌ ఇతర సంస్థలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. తాము వ్యతిరేకించే ప్రాజెక్టు టెండర్లలో తమకు సన్నిహితమైన వ్యక్తి వుండటాన్ని ఎంత సమర్థించుకున్నా అది సమర్థనగానే వుంటుంది. అలాగే తాము రాజకీయ లక్ష్యంగా చేసుకున్న తెలుగుదేశం వారికి ఇందులో 97 శాతం వాటాలున్నాయని చెప్పడం కూడా రాజకీయంగా పొసిగేది కాదు. దీన్ని ప్రాంతంపై ఉద్యమంపై దాడిగా చిత్రించడం అసలే అసంగతం. ఎవరు ఏ ప్రాంతం ఏ పార్టీ అన్నది పక్కన పెడితే అన్ని చోట్లా కార్పొరేట్‌ శక్తులే చక్రం తిప్పుతున్నాయని ఈ ఉదంతం మరో సారి నిరూపిస్తోంది.జరగాల్సింది తక్షణమే ఆ టెండర్లు రద్దు చేయడం. పోలవరంపై అందరితో చర్చించి నష్ట రహితమైన నమూనాకు రూపకల్పన చేయడం. ఆ దిశలో ఆలోచించే బదులు పరస్పర దూషణలతో కాలం గడపడం కాంగ్రెస్‌ ప్రభుత్వానికే మేలు చేస్తుంది.


మొత్తంపైన తెలంగాణా లేదా మరే ప్రాంతం పేరు చెప్పినా దానికదే విప్లవాత్మక విధానమైపోదు.ఆ పేరిట గతాన్ని తప్పుగా చూపించడం, వర్తమానాన్ని వక్రంగా వ్యాఖ్యానించడం హక్కుగా సంక్రమించదు. నిజాం రాజు కాలపు ఫ్యూడల్‌ దోపిడీ అయినా కార్పొరేట్‌ యుగపు కాంట్రాక్టు దోపిడీ అయినా రకరకాల విద్రోహాలు వెన్నాడుతుంటాయి. అందువల్ల ప్రజలెప్పుడూ అప్రమత్తంగా వుండాల్సిందే.

-తెలకపల్లి రవి

భవిష్యత్తుపై బెంగ

ఆంధ్రజ్యోతి సంపాదకీయ పేజి: సకలజనుల సమ్మె ముగిసిందనుకున్నా, లేక వాయిదా పడిందన్నా, ప్రస్తుతానికి కొంత ప్రశాంత వాతావరణం ఏర్పడింది. సమ్మె జరిపిన తీరు, అందులో పాల్గొన్న వారెవరు, ఎందరు, ఎవరికి ఎంత నష్టం జరిగింది, ఎవరు లాభపడ్డారు అన్న విషయాలపై రకరకాల భాష్యాలు వినపడడం అనివార్యం. వాస్తవాలు చూస్తే, ఎన్ని రోజులు పని ఎగ్గొట్టినా తమకు వ్యక్తిగతంగా నష్టం లేని వర్గాలే సమ్మెను సాగదీశాయి. దీనివల్ల వివిధ వృత్తుల్లోని ప్రైవేటు వ్యక్తులకు, అసంఘటిత వర్గాలకు, తద్వారా రాష్ట్రం మొత్తానికి జరిగిన నష్టం అపారం, అది ఎవరూ పూడ్చలేనిది.

బొగ్గు కొరత కారణంగా మన రాష్ట్రమే కాక పొరుగున ఉన్న దక్షిణాది రాష్ట్రాలు కూడా భారీగా నష్టపోయాయి. విపరీతమైన కరెంటు కోతలతో అల్లాడిన మన రాష్ట్రంలోనయితే కోల్పోయిన ఉత్పత్తిని లెక్కించడం కూడా కష్టం. ఆర్థిక నష్టం మాత్రమే కాక, చెప్పిన సమయానికి సరుకు అందజేయలేకపోవడంతో ఫార్మా, రసాయన, ఇంజనీరింగ్ ఉత్పత్తుల రంగా లు తమ కస్టమర్ల వద్ద నమ్మకం, విశ్వసనీయత కోల్పోవాల్సి వచ్చింది.

టెక్నాలజీ, రవాణా వ్యవస్థలు ఆధునికమై, విపరీతమైన పోటీ వాతావరణం కారణంగా, యంత్రాలు, వినియోగ వస్తువులు తయారుచేసే వారందరూ ఏ గంటకు కావలసిన ముడిసరుకు అప్పుడే దించుకునే వ్యవస్థ ఏర్పడింది. నెలల తరబడి ఉత్పత్తికి కావలసిన ముడి సరుకు ఎవరూ తమ దగ్గర పేర్చి పెట్టుకోవడం లేదు. ఈ పరిస్థితుల్లో ఒక్క రోజు రవాణా లేదా ఉత్పత్తి స్తంభించినా కూడా ఉత్పత్తి గొలుసు కట్టుమీద తీవ్రమయిన దుష్ప్రభావం చూపుతుంది. అలాంటిది నెలరోజుల పాటు జరిగిన సమ్మెతో ఉత్పత్తి రంగం పడినపాట్లు వర్ణనాతీతం. పోయిన కాలం తిరిగిరానిది.

ముఖ్యంగా విద్యార్థులు, రైతులకు, ప్రతిరోజూ పది, పదిహేను గంటల బోధన, చదువు ఆటంకాలు లేకుండా కొనసాగితే తప్ప జాతీయ స్థాయిలో జరిగే పరీక్షల్లో ర్యాంకులు సాధించలేని పరిస్థితి. అలాంటిది కనీసం ఇరవై, ఇరవై అయిదు రోజులు చదువు కోల్పోయిన విద్యార్థులు ఎలా కోలుకుంటారు? తెలంగాణ కాలేజీలు బందు పెట్టారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల విద్యార్థులకు, ఇతర రాష్ట్రాల్లోని విద్యార్థుల చదువుకు ఏ విఘాతమూ లేదు. దీంతో నష్టపోయిందెవ రు? పోటీ పరీక్షల్లో తెలంగాణ విద్యార్థులకు జరిగే నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు? పూనక పరిస్థితుల్లో కేజీ నుండి పీజీ దాకా విద్యాసంస్థల నిరవధిక బందుకు ఏ ఆచార్యులు ఏ అధికారం, ఏ నైతిక హక్కుతో పిలుపులిచ్చారు?

అలాగే కరెంటు కోతల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ఎవరు, ఏవిధంగా పరిహారమివ్వగలరు? అధికారికంగా ఆరుగంటలు కరెంటిచ్చినట్లు చెప్పినా, అది అయిదారు విడతల్లో, పూర్తిగా రాత్రివేళల్లో ఇచ్చి, పొట్టమీదున్న పంటలను ఎండగట్టిన పాపం ఎవరిది? ఇప్పటికే ప్రతిదానికీ ప్రభుత్వాన్ని అడుక్కోవలసిన స్థితికి దిగజారిన రైతులు, ఇకనుంచి తమను కాపాడమని ఉద్యమ నాయకులను కూడా అడుక్కోవాలా?

ఈ సకలజనుల మీద సమ్మె వల్ల రాష్ట్రవ్యాప్తంగా నష్టపోయారు. ఒక కంటికి దెబ్బతగిలితే రెండు కళ్ళలోనూ నీరుబుకుతుందని రుజువైంది. దీన్ని ఆపడమో, వాయిదా వెయ్యడమో ఎందుకు చేశారన్న చర్చ కంటే, భవిష్యత్తులో మళ్ళీ ఇలా జరగదని నమ్మకం లేకపోవడమే భయాందోళనలకు గురిచేస్తోంది. పోలవరం టెండర్లకూ, సమ్మె నిలుపుదలకు సంబంధం ఉందో లేదో గానీ, ముందు ముందు ఇంకెవరన్నా ఇలాగే ఉద్యమాలు లేవదీసి, సమాజాన్ని బ్లాక్‌మెయిల్ చేసి, ప్రభుత్వాలను బెదిరించి సొమ్ము చేసుకోరనే గ్యారంటీ అయితే లేదు. ఇలాంటి ఉద్యమాలకు ఉచిత శలభాలుగా మారుతున్న వ్యక్తులు ఆత్మపరిశీలన చేసుకోవాలి. వారి ఆలోచన, రాజకీయ విశ్లేషణలో తీవ్రమైన మార్పులొస్తే తప్ప, ఇటువంటి పరిస్థితుల నుంచి సమాజం బయటపడదు.

ఏదైనా సంక్లిష్టమైన రాజకీయ ప్రశ్న ఎదురైనపుడు దాన్ని నైతికత అనే గీటురాయి మీద పరీక్షించి చూడాలే తప్ప, ప్రజాస్వామ్యం, మెజారిటీ వాదనల త్రాసులో తూయకూడదు. అలా తూస్తే అది చాలా ప్రమాదకరమైన పరిణామాలకు దారితీస్తుంది. ఉదాహరణకు, ప్రజాస్వామ్యం, మెజారిటీ వాదనలే ప్రామాణికాలయితే జర్మనీలో యూదుల ఊచకోత, గుజరాత్ మారణకాండ, కాందమాల్‌లో క్రిస్టియన్ ఫాదరీల సజీవ దహనం - వీటన్నిటికీ మెజారిటీ ప్రజల మద్దతు ఉంది. కాబట్టి తెలంగాణ అయినా, రాయలసీమ, ఉత్తరాంధ్ర అయినా ప్రతి విభజన వాదాన్నీ నైతికత దృష్ట్యా పరిశీలించి, పరీక్షించాల్సిందే.

ఇవాళ విభజన వాదులు చెబుతున్న తెలంగాణ ప్రజల స్వయం పరిపాలనాభిలాష రేపు హైదరాబాద్ ప్రజల స్వయంపాలనాభిలాషగా, తర్వాత ఆదిలాబాద్ మొదలుకుని ఏ జిల్లాకు, ఆ జిల్లా, ఏ మండలానికా మండలం, చివరికి ఏ ఊరికావూరు స్వయంపాలనాభిలాషగా మారే అవకాశం లేకపోలేదు. అలా జరిగిన నాడు ఆ అభిలాషలను గౌరవిస్తామని, అంగీకరిస్తామని చెప్పగలిగితేనే స్వయం పరిపాలనాభిలాష ప్రాతిపదికపై తెలంగాణ విభజన సమర్థనీయమవుతుంది. ప్రతి ఊరిలోని ప్రతి వ్యక్తీ స్వయం పాలనాభిలాషను వ్యక్తం చేసిననాడు ప్రభుత్వమే మాయమవుతుంది. స్వేచ్ఛావాదులు కోరుకునేది కూడా అదే.

అలా కాకుండా తెలంగాణపై పరిపాలనాధికారాలు తెలంగాణ వారికే ఉండాలనడం, దాని కోసమే విభజన కోరడం అస్పష్టం, అహేతుకం. పరిపాలనాధికారాలు దేనికోసం? ప్రభుత్వ భూములు తమకిష్టమైన వాళ్ళకు కట్టబెట్టడానికా? ప్రభుత్వ పనులు టెండర్లన్నీ తనవారికే ధారపోయడానికా. దొంగల పేర్లు, ముఖాలు మారడం తప్ప దోపిడీ తప్పనప్పుడు విభజన జరిగితేనేం జరక్కపోతేనేం? భౌగోళిక తెలంగాణ, సామాజిక తెలంగాణ మీమాంసలు, ఉద్యమ నాయకత్వం కోసం ఎత్తులకు పైఎత్తులు చూస్తుంటేనే అర్థమవుతోంది - రాజ్యాధికార రొట్టెకోసం ఎన్ని కొట్లాటలు జరగబోతున్నాయో.

ముఖ్యంగా రెండు విషయాల్లో స్పష్టత అవసరం. ఒక మిత్రుడన్నట్లు తెలంగాణ కావాలనుకునేవారు అధికారాభిలాషతో కాక, కేవలం వెనుకబాటు తనం పోగొట్టడానికే విభజన కోరుకుంటున్నారనుకుందాం. తెలంగాణ వెనుకబాటుతనం చారిత్రక కారణాల వల్ల ఉండిందా లేక కోస్తా, రాయలసీమ ప్రాంతాలతో కలిసి ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడ్డం వల్ల వచ్చిందా?

ఒకవేళ చారిత్రక కారణాల వల్ల ఉండుం టే, ఆంధ్రప్రదేశ్ అవతరణ తరువాత వెనుకబాటు తనం తగ్గిందా, పెరిగిందా? కళ్ళకు కనబడ్డమే కాక, గణాంకాలతో సహా రుజువై, ఆంధ్రప్రదేశ్ అవతరణానంతరం తెలంగాణలో జరిగిన అభివృద్ధికి కారకులెవరు? ఉమ్మడి రాష్ట్రంలోని ఇతర ప్రాం తాల నుండి ప్రవహించిన నిధులు, మాన వ వనరుల ప్రభావమెంత? ఈ విషయాల్లో శాస్త్రీయ ఆధారాలతో కూడిన స్పష్టత రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇక రెండోది, విభజనలు, విడిపోవడాలు కోరుకునే హక్కెవరికుంటుంది? ఏ పరిస్థితుల్లో ఉంటుంది? స్వేచ్ఛాభిలాషతో ఒక నియంతృత్వం నుంచి వేరుపడే అ«ధికారం, హక్కు ప్రతి మానవుడికి, ప్రతి సమూహానికి ఉంటుంది. అంతే తప్ప ఒక నియంతృత్వం నుంచి ఇంకో నియంతృత్వంలోకి వెళ్ళేందుకు, ఒక లంచగొండి ప్రభుత్వం స్థానంలో ఇంకో లంచగొండి ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేందుకు జాతీయత లేదా ప్రాంతీయతల్లాంటి అహేతుక ప్రాతిపదికలపై విభజన కోరుకునే హక్కు ఎవరికీ, ఎప్పటికీ ఉండదు.

విభజన తర్వాత తెలంగాణలో ప్రజలకు పూర్తి స్వేచ్ఛనిచ్చి, ఎవరి బ్రతుకు వారిని బతకనిస్తారనే నమ్మకముంటే విభజనను సమర్థించొచ్చు. అంతే తప్ప ఇప్పుడున్న పాలకవర్గాల స్థానే కొత్త దొరల మోచేతి నీళ్ళు త్రాగుతూ బతకాల్సొస్తే, ఈ తెలంగాణ వద్దు, నీ రాజ్యం వద్దు, ఆ రాజ్యం వద్దు అని ప్రజలు గ్రహించాలి. స్వేచ్ఛకోసం త్యాగం చేసినా అర్థం ఉంది, కొత్త దొరల దగ్గర బానిసత్వం కోసం త్యాగాలు చెయ్యడం శుద్ధదండగ.

- జాహ్నవి

రాష్ట్ర సమైక్యతే ఇందిరమ్మకు ఘన నివాళి!

ఆంధ్రప్రభ సంపాదకీయం: 'భావోద్వేగాలతో ముడిపడి ఉన్న అంశాలపై తొందరపడి హడావుడిగా నిర్ణయాలు తీసుకుంటే అవి జాతి ప్రయోజనాలను దెబ్బతీస్తాయి. అలాంటి నిర్ణయాలు తీసుకునే వారిని భవిష్యత్‌ తరాలు క్షమించవు. తాత్కాలిక రాజకీయ ప్రయోజనం కన్నా దేశ విశాల ప్రయోజనాలే నాకు మిన్న' అని మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ దాదాపు నలభై ఏళ్ళ క్రితం జై ఆంధ్ర ఉద్యమం సమయంలో స్పష్టం చేసిన అభిప్రాయాలు నేడు మన రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు వర్తిస్తాయి. ధీరవనితగా, కలకత్తా మహాకాళీగా ఆనాటి ప్రతిపక్ష నాయకుడు అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రశంసలు అందుకున్న ఇందిరాగాంధీని పదిమంది మగవారిపెట్టు అని అమెరికా మాజీ అధ్యక్షుడు రిచర్డ్‌ నిక్సన్‌ ఓ సందర్భంలో కొనియాడారు. బ్యాంకుల జాతీయ కరణ, రాజభరణాల రద్దు వంటి సాహసోపేతమైన నిర్ణయాలను ఆమె ప్రధానమంత్రి పదవిని చేపట్టిన రెండేళ్ళకే తీసుకున్నారు. సాహసానికి పర్యాయపదంగా నేటికీ నిఘంటువుల్లో నిలిచిపోయిన ఇందిరాగాంధీ తన అంగరక్షకుల తుపాకీ గుళ్ళకు నేలకొరిగి రేపటికి (అక్టోబర్‌ 31వ తేదీ నాటికి) 27 సంవత్సరాలు పూర్తి అవుతుంది. అయినప్పటికీ ఇందిరాగాంధీ పేరు చెబితే నేటికీ ఓట్లు రాలుతాయి, రాలుతున్నాయి. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో ఇందిరమ్మ రాజ్యం తెస్తానన్న వాగ్దానంతోనే దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చారు.

ఇందిరాగాంధీ ఎంతటి సాహసోపేతురాలైనా, ఈ దేశ సంస్కృతీ సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను, ఇంకా చెప్పాలంటే, భారతీయ సంస్కృతిని పుణికి పుచ్చుకోవడమే కాక, వాటిని పరిరక్షించడం కోసం జీవితాంతం కృషి చేశారు.

ముల్కీ నిబంధనల వంటి భావోద్వేగాలకు సంబంధించిన అంశాలపై ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు అన్ని వర్గాలతోనూ చర్చించి, అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందనీ, ముఖ్యంగా, ప్రాంతీయ వాదాలు తలెత్తినప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం కాక, జాతి విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి పార్టీ నిర్ణయాలు తీసుకోవాలనీ, ఈ విషయంలో అధికారంలో ఉన్న పార్టీపై బాధ్యత మరింత ఎక్కువ ఉంటుందని ఆనాడు ఆమె పార్లమెంటులో చేసిన ప్రసంగంలో స్పష్టం చేశారు. ప్రభుత్వం అన్ని ప్రాంతాలకూ, వర్గాలకూ, ప్రజలకూ బాధ్యత వహిస్తుంది కనుక, అధికారంలో ఉన్నవారు అన్ని ప్రాంతాలకూ న్యాయం చేకూర్చే రీతిలో తమ వైఖరులను స్పష్టం చేయాలి. తాత్కాలికమైన భావోద్రేకాలకూ, ఒత్తిడులకు లోనై నిర్ణయాలు ప్రకటించకూడదు. ఈ విషయం ప్రత్యేకాంధ్ర, ప్రత్యేక తెలంగాణా డిమాండ్లకే కాక, దేశంలోని ప్రత్యేక రాష్ట్రాల కోసం ఉద్యమాలు సాగుతున్న విదర్భ, గూర్ఖాలాండ్‌ వంటి డిమాండ్లకు కూడా వర్తిస్తుందని ఆమె ఆనాడు స్పష్టం చేసిన మాటలు ఎంత నిత్యనూతనమైనవో, నేటికీ అవి ఏ తీరులో వర్తిస్తాయో వేరే చెప్పనవసరం లేదు.

ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ల నేపధ్యాలను శ్రద్ధగా పరిశీలిస్తే, వెనకబాటుతనం, అధికారంలో ఉన్నవారి అనాదరణ, అన్యాయాలకు గురికావడం వంటివి ఉమ్మడిగా కనిపించే లక్షణాలు. అయితే, అంతమాత్రాన రాష్ట్రాలను ముక్క చెక్కలు చేస్తూ పోతే మన దేశం చివరికి పూర్వపు సంస్థానాలుగా చీలికలు పీలికలు అవుతుంది. ఈ సమస్యలకు పరిష్కారం విభజన ఎంత మాత్రం కాదు, అలాగే, దోపిడీ అనే దానికి ఆద్యంతాలు లేవు. అలాగే, కుల, మత,ప్రాంతీయ విభేదాలు లేవు. దోపిడీ స్వభావం గలవారు తమ సొంత వారినే, ఆఖరికి రక్తం పంచుకుని పుట్టిన వారిని సైతం చేస్తారన్నది తరతరాలుగా నిరూపితమైన నిప్పు కణికలాంటి సత్యం. స్వాతంత్య్రం వచ్చే నాటికి దేశంలోని సంస్థానాలను ఇండియన్‌ యూనియన్‌లో విలీనం చేయడానికి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ఎంత కష్టపడ్డారో ఒక్కసారి చరిత్ర పుటలను తిరగేస్తే తెలుస్తుంది. ఆనాడు ఆయన ప్రదర్శించిన ధైర్య సాహసాల కారణంగానే కాశ్మీర్‌, హైదరాబాద్‌ రాష్ట్రాలు ఇండియన్‌ యూనియన్‌లో విలీనం అయ్యాయి. అందుకే ఆయనకు ఉక్కుమనిషి అని పేరొచ్చింది. తెలంగాణా సమస్య ఐదున్నర దశాబ్దాలుగా కొనసాగుతున్న సమస్య అని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఇటీవల చేసిన ప్రకటనలో ఎంతమాత్రం అసత్యం లేదనడానికి రుజువు ఈ పాత చరిత్రే. ఆనాడు ఇందిరాగాంధీ తొందరపడి నిర్ణయం తీసుకుని ఉండి ఉంటే, తెలుగుజాతిని నిలువునా చీల్చిందన్న అపప్రథను మూటగట్టుకుని ఉండేది. భాషాప్రయుక్త రాష్ట్రాల పుట్టుపూర్వోత్తరాల గురించి క్షుణ్ణంగా తెలుసుండటం వల్ల ఆమె తన హయాంలో రెండుసార్లు విభజనోద్యమాలు తలెత్తినప్పుడు ఆంధ్రప్రదేశ్‌ విభజనకు ససేమిరా అంగీకరించలేదు. 1969లో మర్రి చెన్నారెడ్డి సారథ్యంలో సాగిన తెలంగాణా ఉద్యమం సమయంలోనూ, 1972లో జైఆంధ్ర ఉద్యమం కాలంలోనూ ఆమె దృఢ వైఖరిని ప్రదర్శించారు. ఈ రెండు ఉద్యమాల సందర్భంగా స్థానికుల భావోద్వేగాలను (సెంటిమెంట్లను) గౌరవిస్తామని ప్రకటిస్తూనే, విభజన డిమాండ్‌కి ఎంతమాత్రం తలొగ్గేది లేదని నిష్కర్షగా స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ అవతరణ సమయంలో రెండు ప్రాంతాల ప్రజల మధ్య కుదిరిన పెద్ద మనుషుల ఒప్పందాన్ని తుచ అమలు జరపాల్సిన బాధ్యత పాలకులదనీ, అలాగే, ఆ ఒప్పందం అమలు జరిగేట్టు ఒత్తిడి తేవలసిన బాధ్యత ఆవలి వర్గం (తెలంగాణా) వారిదని ఆమె స్పష్టం చేశారు. ఒకే భాష మాట్లాడే ప్రజల మధ్య భావసమైక్యతను సాధించడం ఎంతో సులభమని ఆనాటి పెద్దలు భావించారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర విభజన చేయాలని పీకమీద కత్తిపెట్టి ఒత్తిడి తేవడం ఎంత మాత్రం సమంజసం కాదు.

ఇందిరాగాంధీ అధికార వారసత్వాన్ని కాకపోయినా, రాజకీయ వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని 125 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీకి ప్రస్తుతం సారధ్యం వహిస్తున్న సోనియా గాంధీ సమష్టి నిర్ణయాలకు ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ, ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ విషయంలో మాత్రం ఒత్తిడులకు లోను కావడం వల్లనే ప్రస్తుత సంక్లిష్ట స్థితి ఏర్పడిందనే అభిప్రాయం జనంలో నాటుకుంది. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు రెండవ కమిషన్‌ (ఎస్సార్సీ) ఏర్పాటుకు పార్టీ కట్టుబడి ఉన్నట్టు 2004 ఎన్నికల ప్రణాళికలో పేర్కొనడం జరిగింది. ఎన్ని ఒత్తిడులు వచ్చినా కాంగ్రెస్‌ పార్టీ వైఖరి అదేనని సోనియా స్పష్టం చేసి ఉండి ఉంటే ఆమెకు ప్రస్తుత తలనొప్పులు ఉండేవి కావు. అలాగే, తెలుగు ఆమె తన అత్తగారి పంధానే అనుసరిస్తోందని జనం భావించడానికి వీలుండేది. బతికున్నంత కాలం ఇందిరమ్మ రాజ్యం జపం చేసిన రాజశేఖరరెడ్డి కూడా ఇందిరమ్మ విధానాన్నే కొనసాగించారు. ఆయన అడ్డుపడటం వల్లే తెలంగాణా ఆగిపోయిందంటూ ప్రచారంచేస్తూ వచ్చిన ప్రత్యర్ధులు ఆయన మరణానంతరం తెచ్చిన ఒత్తిడి కారణంగా కాంగ్రెస్‌ అధిష్ఠానం విభజనపై ఊగిసలాట వైఖరిని ప్రదర్శిస్తూ వస్తోంది. అదే ఇప్పుడు అధిష్టానం మెడకు చుట్టుకుంది. ఈ ఊబిలోంచి ఎలా బయటపడాలా అని నేటికీ మేధోమథనం చేస్తోంది.

తెలంగాణా సెంటిమెంట్‌ని గౌరవిస్తూనే సమైక్యరాష్ట్రాన్ని కొనసాగించడం అసాధ్యమైన విషయం కానేకాదు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి పదవులను వంతుల వారీగా ఆంధ్ర, తెలంగాణా ప్రాంత నాయకులు నిర్వహిస్తూ, నీళ్ళు, నిధుల పంపకంలో పారదర్శకతను పాటిస్తూ వచ్చి ఉంటే తాజా ఉద్యమం తెరమీదికి వచ్చి ఉండేది కాదు. అలాగే, ప్రాజెక్టులు, కాంట్రాక్టులు, ముఖ్యమైన పదవుల పంపిణీ విషయంలో ఇచ్చి పుచ్చుకునే ధోరణితో వ్యవహరించి ఉన్నా ప్రస్తుత పరిస్థితి తలెత్తి ఉండేది కాదు, నాయకుల మధ్య అహం వల్ల అపోహలు పెరిగి, అంతరాలు పెరిగాయన్నది కాదనలేని వాస్తవం. వెనుకటి అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకుని ఉండి ఉంటే విభజనోద్యమం వచ్చి ఉండేది కాదు. నాయకుల అహానికి తోడు, రాజకీయ స్వార్ధం వల్లే విభజనోద్యమాలు తరచుగా పుట్టుకొస్తున్నాయన్నది తిరుగులేని నిజం. సర్దుబాటు గుణం ఉంటే ఎంతటి జటిలమైన సమస్యలనైనా పరిష్కరించుకోవచ్చు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే ఇందిరమ్మకు మనం అర్పించే నిజమైన నివాళి.

29, అక్టోబర్ 2011, శనివారం

ఆచార్యుని గందరగోళం

ఆంధ్రజ్యోతి సంపాదకీయ పేజి: మన దేశంలో అసలు లోపమంతా ప్రజాస్వామ్య వ్యవస్థలోనే వుందని సూత్రీకరించడానికి మావోయిస్టు మేధావులు నిరంతరం తాపత్రయపడుతుంటారు. ఈ కోవలో జి.హరగోపాల్ వ్యాసం (అక్టోబర్ 26, ఆంధ్రజ్యోతి 'స్నేహపూరితంగా విడిపోవాలి') మావోయిస్టు ఆలోచనలకు ప్రాంతీయ విద్వేషవాదాన్ని పెనవేసి, తెలంగాణ విభజనవాదాన్ని మన ముందుకు తెచ్చింది.

తెలంగాణ ఉద్యమంలో వేర్పాటువాద నాయకులు రెండు ప్రాంతాల మధ్య విద్వేషాలు రగిల్చినా ప్రజాప్రతినిధులపై దాడులు చేసినా మరో అభిప్రాయం వ్యక్తం కాకుండా సమావేశాలను అడ్డుకున్నా సినిమా షూటింగులపై దండెత్తినా, మహనీయుల విగ్రహాలను పడగొట్టినా, విచ్చలవిడిగా బంద్‌లు ప్రకటించినా, బలవంతంగా స్కూళ్ళు మూయించినా బస్సు ప్రయాణీకులపై రాళ్ళ వర్షం కురిపించినా, బస్సులను తగులబెట్టినా రెండు సంవత్సరాలుగా ప్రజాజీవనాన్ని అతలాకుతలం చేసినా పోలీసులు మౌన ప్రేక్షకులుగా మిగిలిపోయారు. ఇటీవల రైల్‌రోకో సందర్భంలో మాత్రం ఆందోళన కారులను అడ్డుకొని వారిపై కేసులు పెట్టారు. బహుశా అందుకే అయివుంటుంది ఆయన పోలీసులపై విరుచుకుపడటం. పోలీసులు క్రూరంగా, కఠినంగా, విచ్చలవిడిగా హింసను ప్రయోగిస్తారని చెబుతూ పోలీసుల బలప్రయోగం రాజకీయ ప్రక్రియకు ప్రత్యామ్నాయం కాదని తెలియజేశారు.

ఈ సందర్భంలోనే విప్లవకారులకు కూడా రాజ్యాంగబద్ధ పౌరహక్కులు ఉంటాయని చెప్పారు. చట్టబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాలపై యుద్ధం ప్రకటించి నిరంతరం ఆయుధాలతో సంచరిస్తూ విచ్చలవిడిగా హత్యాకాండకు పాల్పడుతూ అజ్ఞాతంలో వుం టున్న వారికి కూడా సాధారణ పౌరులలాగా పౌర హక్కులుంటాయని చెప్పే హరగోపాల్ తెలంగాణ వాదులు నిరంతరం చట్టాలను ఉల్లంఘించడాన్ని కూడా ప్రజాస్వామ్య ఉద్యమంలో భాగంగా చెప్పడంలో ఆశ్చర్యం లేదు. చట్ట విరుద్ధంగా మారణాయుధాలతో సంచరించే వారు పౌరహక్కుల పరిధిలోకి రారనిగాని, ప్రజల మధ్య విద్వేషాలు పౌర జీవనానికి విచ్చలవిడిగా ఆటంకం కలిగించే వారిపై చట్టపరమైన కేసులు పెట్టి వారిని న్యాయస్థానాల ముందు నిలిపే బాధ్యత పోలీసులదనిగాని హరగోపాల్ వంటి పౌరహక్కుల నేతలు ఎన్నడూ చెప్పరు.

పోలీసు వ్యవస్థ పట్ల ఆయన అభిప్రాయాలు మావోయిస్టు మేధావులందరూ ప్రకటించే పాత ఆలోచనలే. కాని హరగోపాల్ తనదైన శైలిలో ప్రాంతీయ విద్వేషాన్ని వెళ్లగక్కడం వామపక్ష మేధావుల దిగజారుడుతునానికి ఒక మచ్చుతునక. 'ఆ ప్రాంతం నుంచి వచ్చి తెలంగాణలో స్థిరపడ్డ వారు తెలంగాణ జీవన వైవిధ్యంలో వాళ్ళ చైతన్యంలో మమేకం కావాలి'. ఇంతటి దుర్మార్గపు ప్రతిపాదన చేసిన వారు మరొకరు లేరు. తెలంగాణ జీవన వైవిధ్యంలో, వాళ్ళ చైతన్యంలో మమేకం కావాలంటే ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి స్థిరపడినవారు ఏమి చేయాలి? ఆంధ్ర ప్రాంతపు వారి ఆస్తులపై దాడిచేయాలా? బందులు చేయించాలా? సమైక్యవాదులను తరిమికొట్టాలా? టిఆర్ఎస్‌లో సభ్యత్వం తీసుకోవాలా? నమస్తే తెలంగాణ పత్రికనే చదవాలా? టి ఛానెల్‌ను మాత్రమే చూడాలా? ఆంధ్రప్రాంతం నుంచి వచ్చి తెలంగాణలో స్థిరపడ్డ వారి దృక్పథం మారాలని హరగోపాల్ హెచ్చరిస్తే అలా మార్చుకున్న వారిపట్ల జాలితో వ్యవహరించాలని కూడా ఆయన తెలంగాణ ఉద్యమకారులకు సలహా ఇచ్చారు.

అలాగే ఇక్కడ స్థిరపడ్డ బెంగాలీలు, మళయాళీలు, మరాఠీలు, కన్నడ ప్రాంతీయులు ఎవ్వరూ ఈ చైతన్యంలో మమేకం కావాలని ఆయన కోరలేదు. భారతదేశంలో ఉన్న క్రైస్తవులు, ముస్లింలు, తమ మత సంప్రదాయాలకు తిలోదకాలిచ్చి, భారతీయతను అలవర్చుకోవాలనే హిందూ మతతత్వవాదల కోవలో హరగోపాల్ కూడా ఇక్కడ స్థిరపడిన ఆంధ్రప్రాంతం వారిని బెదిరించడానికి పూనుకున్నారు. 'ఆంధ్రప్రాంతం వారిమీద దాడులంటూ జరిగితే అవి సాధారణ, అమాయకపు కుటుంబాల మీద ఎక్కువ జరిగే ప్రమాదముందని' ఆయన హెచ్చరించడం చూస్తే ఆ దాడులు సంపన్నులపై జరిగితే పట్టించుకోనక్కర లేదనే భావం ధ్వనిస్తోంది. అలాగే 'హైదరాబాద్ తన సంయమనాన్ని కోల్పోతే, ఆ ప్రాంతం పట్ల అసహనం పెరిగితే పరిస్థితి విషమంగా మారే ప్రమాదముంది' అని బెదిరించడం ఆయన నిజస్వరూపాన్ని తెలియజేస్తోంది.

ఎవ్వరిపై ఎవ్వరు దాడులు చేసినా, అది నేరమని, పోలీసు యంత్రాంగం అటువంటి వారి పట్ల కఠినాతి కఠినంగా వ్యవహరించాలని ఆయన ఎన్నడూ చెప్పరు. అందుకు భిన్నంగా తెలంగాణావారి చైతన్యంలో మమేకం కావాలన్న ఆయన వికృత ప్రతిపాదనను సభ్యసమాజం అసహ్యించుకుంటుంది. ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి తమ దృక్పథం మార్చుకున్న వారితో సఖ్యంగా వుండాలని సలహా ఇచ్చే సమయంలోనే హరగోపాల్‌లోని మావోయిస్టు మేధావి భీకరరూపంలో బయటకు వచ్చారు. తన ఈ ప్రజాస్వామ్య దృక్పథం పెట్టుబడిదారులకు, దోపిడీదారులకు, భూ ఆక్రమణదారులకు వర్తించదని, వాళ్ళ విషయంలో అసలు మానవీయంగా ఆలోచించడమే సాధ్యం కాదని స్పష్టం చేశారు. అంటే ఆం ధ్ర పెట్టుబడిదారుల పట్ల అమానవీయంగా అంటే దౌర్జన్య పూరితం గా, హింసాయుతంగా వ్యవహరించాలన్నట్లు ఆయన సూచించారు.

ప్రజాస్వామ్య వ్యవస్థ పారిశ్రామికవేత్తలను, వాణిజ్యవేత్తలను సంపదను సృష్టించేవారిగా, లక్షలాది మందికి జీవనోపాధి కల్పించే వారిగా, కోట్లాది మంది జీవన ప్రమాణాలు పెంపొందించే వారిగా గుర్తించి గౌరవిస్తుంది. ఇందుకు భిన్నంగా మావోయిస్టు సిద్ధాంతీకులు వారిని పెట్టుబడిదారులుగాను, దోపిడీదారులుగాను, వర్గ శత్రువులుగాను పరిగణిస్తూ ఆ శత్రుసంహారంతోనే విప్లవం సాధ్యమవుతుందని నమ్ముతుంటారు. పారిశ్రామికవేత్తలు ఎవరైనా చట్టాలను ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడుతుంటే వారిని శిక్షించడానికి తగిన చట్టాలు, న్యాయస్థానాలు మనకు ఎలాగూ ఉన్నాయి.

ఇక రాజ్యాంగంపట్ల, చట్టాల పట్ల ఏమాత్రం నమ్మకంలేని మావోయిస్టులు మాత్రం వారిని ప్రజాద్రోహులుగా పరిగణిస్తూ తామే వారిని శిక్షించాలనుకుంటారు. హరగోపాల్ కూడా అదే కోవలో వారిపట్ల మానవీయంగా ఆలోచించడమే అసలు సాధ్యం కాదంటున్నారు. అలాగే తెలంగాణ ఉద్యమం సఫలమై ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే మావోయిస్టు విప్లవం వచ్చినట్లేనని అప్పుడు పెట్టుబడిదారులపట్ల కనికరం చూపాల్సిన అవసరం కూడా వుండదని వారు భావిస్తున్నారు. వేర్పాటువాదాన్ని అతి తీవ్రంగా సమర్ధించే హరగోపాల్ అసలు రాష్ట్రాన్ని ఏ ప్రాతిపదికన విభజించాలో తన వ్యాసంలో ఎక్కడా పేర్కొనలేదు.

విభజనకు ప్రాతిపదిక ఏమిటి? వెనుకబాటుతనమా? వేరుభాషా? భిన్న జాతా? రాజధానికి దూరంగా వుండటమా? అనేది చెప్పకుండా ఈ ఉద్యమం ఎందుకు సాగుతుందో ఒకే ఒక వాక్యంలో చెప్పారు. "ఆంధ్ర పెట్టుబడిదారుల లూటింగ్‌లకు వ్యతిరేకంగా ఈ ఉద్యమం జరుగుతోంది'' అని అన్నారు. అంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈ రాష్ట్రంలో మావోయిస్టు వ్యవస్థ ఏర్పడుతుందా? అసలు పెట్టుబడిదారులే లేని, ప్రపంచంలో మరెక్కడాలేని, సోషలిస్టు సమాజం ఏర్పడుతుందా? ఇటువంటి పెట్టుబడిదారుల లూటింగ్ భారతదేశంలో మరెక్కడైనా వుందా? లేక కేవలం తెలంగాణలో మాత్రమే వుందా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అసలు పెట్టబడిదారీ వ్యవస్థ వుండని విధంగా రా జ్యాంగాన్ని, చట్టాల్ని మార్చివేస్తారా? ప్రజాస్వామ్యం పట్ల, మార్క్సి జం పట్ల, నేటి ఉద్యమం తీరుతెన్నుల పట్ల కనీస పరిజ్ఞానం లేని వారు మాత్రమే ఇటువంటి విపరీతమైన సూత్రీకరణలు చేయగలరు.

రాష్ట్ర విభజన ఎందుకు జరగాలో ఆయన మరో చోట ఇలా వివరించారు. "ఒక ప్రాంత ప్రజలు తమ పాలన తాము చేసుకుంటామన్నప్పుడు ఆ భావనకుండే ప్రజాస్వామ్య కోణాన్ని గౌరవించడం కనీసం బాధ్యత లేదు. మా ఆధిపత్యంలోనే తెలంగాణ వుండాలనడం ఎంతవరకూ సమంజసం?'' ఒక రాజకీయ శాస్త్ర ఆచార్యుడు ఇంతటి అయోమయంగా అవివేకంగా, అమాయకంగా మాట్లాడడం విస్తుగొలుపుతోంది. ప్రజాస్వామ్యం అంటే స్వయంపాలన. స్వయంపాలన అంటే ప్రజాస్వామ్యం. రాజరికాలకు, విదేశీ పాలనకు వ్యతిరేకంగా తలెత్తిన 'స్వయంపాలన' సిద్ధాంతాన్ని ఇప్పుడు వల్లెవేయడం కంటే ప్రమాదకరమైన అంశం మరొకటి వుండదు.

ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం లేనివారు, ఈ వ్యవస్థను కుప్పకూల్చాలని భావించే వారు మాత్రమే ఈ స్వయంపాలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించగలరు. ఈ స్వయంపాలన క్రింది స్థాయి వరకు విస్తరించడానికి స్థానిక సంస్థలు ఏర్పడ్డాయి. పంచాయతీలలో, మున్సిపాలిటీలలో, జిల్లా పరిషత్‌లలో పాలకులు స్థానికులు కారా? ఎంపీలు, ఎమ్మెల్యేలు స్థానికులు కారా? ఈ స్వయంపాలన అనే బూటకపు సిద్ధాంతాన్ని ఉపేక్షించితే అది క్రమంగా దేశవిచ్ఛిత్తికి త్రోవతీస్తుంది. స్వయంపాలన, ఆత్మగౌరవం పేరిట భారతదేశం నుంచి ఏ రాష్ట్రమైనా మరోదేశంగా విడిపోవచ్చా? ఆ తరువాత ఇదే నినాదాలతో అలా విడిపోయిన ప్రాంతం నుండి వివిధ జిల్లాలు విడిపోవచ్చా? దేశాన్ని ముక్కలు చెక్కలు చేసే ప్రతిపాదన చేయడం కంటే దేశద్రోహం మరేంవుంటుంది? "తెలంగాణను తన ఆధిపత్యంలో వుంచుకోవడం ఎంతవరకు సమంజసం'' అని ప్రశ్నిస్తున్న హరగోపాల్ అసలు రాజకీయ శాస్త్ర ఆచార్యులుగా పనిచేశారా? అని అనుమానం కలుగుతోంది.

నేటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ప్రాంత ఆధిపత్యంలో మరొక ప్రాంతం వుండడం సాధ్యమా? తెలంగాణ అంటే ఒక ముఖ్యమంత్రి పదవి, ఇతర మంత్రి పదవులు కాదు. కోట్లాది మంది సామాన్య ప్రజల విస్తృత ప్రయోజనాలు, ఈ ప్రయోజనాలను పరిరక్షించటానికి విస్తృత ప్రభుత్వ యంత్రాంగం, అనేక రాజ్యాంగబద్ధ సంస్థ లు, న్యాయస్థానాలు నిరంతరం కృషి చేస్తుంటాయి. ఈ కనీస వాస్తవాన్ని గుర్తించకుండా ఒకే భాషా ప్రాంతం వారి మధ్య ఆధిపత్య భావనను ప్రవేశపెట్టి విద్వేషాలు రెచ్చగొట్టగలిగిన విద్వేషవాదులు, తమ ప్రయత్నాలలో విజయం సాధిస్తే ఏమి జరుగుతుంది? అతి త్వరలోనే వివిధ మతాల మధ్య, వివిధ భాషా ప్రాంతాల మధ్య సులభంగా విద్వేషాలు సృష్టించి భారతదేశాన్ని కల్లోలభరితం చేయగలుగుతారు. బహుశా మావోయిస్టుల అంతిమ లక్ష్యం అదేకావచ్చు. మావోయిస్టు సిద్ధాంతకారులు, ప్రాంతీయ విద్వేషవాదు లు అసత్యాలను జంకుబొంకు లేకుండా అలవోకగా వల్లించుతూ వుం టారు. అసత్య పునాదులపై తమ వాదనలు నెలకొల్పుతూ ఉంటారు. హరగోపాల్ గారికి అసత్యాలు వల్లించడం వెన్నతో పెట్టిన విద్య.

"ప్రభుత్వంలో గత ఇరవై సంవత్సరాలుగా ప్రపంచబ్యాంకు పుణ్యమా అని మూడు, నాలుగు లక్షల ఉద్యోగాలు మాయమయిపోయాయి'' అని ఆయన తన వ్యాసంలో పేర్కొన్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 1981 నాటి ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 7 లక్షల 66వేలు. (ప్రభుత్వ ఉద్యోగులు 3.43 లక్షలు. ప్రభుత్వరంగ సంస్థలలో 1.65 లక్షలు, స్థానిక సంస్థలలో 2.26 లక్షలు, యూనివర్సిటీలలో 14వేలు) 2006 నాటి ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 12.16 లక్షలు (ప్రభుత్వ ఉద్యోగులు 6.16 లక్షలు, ప్రభుత్వరంగ సంస్థలలో 2.54 లక్షలు, స్థానిక సంస్థలలో 3.30 లక్షలు, యూనివర్సిటీలలో 16 వేలు) గత పాతిక సంవత్సరాలలో ప్రభుత్వరంగంలో కొత్తగా నాలుగున్నర లక్షల ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. హరగోపాల్ గారు మాత్రం నాలుగు లక్షల ఉద్యోగాలు మాయమయిపోయాయి అని తన సహజ ధోరణిలో చెబుతున్నారు.

"కృష్ణానది 300 కిలోమీటర్లు ప్రవహిస్తున్నా, ఏ మాత్రం నీటి వసతిలేని మహబూబ్‌నగర్ జిల్లా రైతులు ఏం చేయాలి? సమైక్యంగా వున్నప్పుడు మహబూబ్‌నగర్ జిల్లా రైతుల మీద ప్రేమ, సానుభూతి అవసరం లేదా? ఏ సానుభూతి లేని వాళ్ళకు సమైక్యతను గురించి మాట్లాడే నైతికత ఎక్కడ వస్తుంది?'' అని హరగోపాల్ తన వ్యాసంలో సూటిగా ప్రశ్నిస్తున్నారు. ప్రాంతీయ విద్వేషవాదాన్ని ఝుళిపించడానికి, సమైక్యవాదులను తెలంగాణలోని పేద ప్రజల కష్టాలను పట్టించుకోని వారిగా, నైతిక విలువలు లేనివారిగా చిత్రీకరిస్తూ, వారిపై విషం చిమ్మడానికి, బాగా వెనుకబడి వుందనుకున్న మహబూబ్‌నగర్ జిల్లా రైతులను హరగోపాల్ ఒక ఉదాహరణగా ఎంచుకొన్నారు.

మహబూబ్‌నగర్ జిల్లా వెనుకబాటుతనాన్ని గురించి తాను ఎప్పుడో విన్న విషయాలను హరగోపాల్ ప్రస్తావిస్తున్నారే తప్ప ఆ జిల్లా ప్రస్తుత స్థితిగతుల గురించి ఆయనకు కనీస అవగాహన గాని, పరిజ్ఞానం గాని లేదు. 2009-10 సంవత్సరంలో మహబూబ్‌నగర్ జిల్లాలో 20 లక్షల 23వేల ఎకరాల విస్తీర్ణంలో మొదటి పంట సాగుచేయడం జరిగింది. 2 లక్షల 22 వేల ఎకరాలలో రెండవ పంట సాగుచేయడం జరిగింది. అంటే మొత్తం 22 లక్షల 65 వేల ఎకరాల విస్తీర్ణంలో మహబూబ్‌నగర్ జిల్లాలో సాగుచేయడం జరిగింది. సాగు విస్తీర్ణంలో ఇది రాష్ట్రంలోని జిల్లాల్లో మూడవ స్థానంలో వుంది. ఇంతటి విస్తీర్ణంలో కోస్తా జిల్లాల్లో ఎక్కడా సాగు చేయడం జరగలేదు.

ఇక మహబూబ్‌నగర్ జిల్లాలో 13 లక్షల 83 వేల ఎకరాలలో ఆహార ధాన్యాలను పండించారు. ఆహార ధాన్యాలను పండించడంలో కూడా కృష్ణా జిల్లా (14 లక్షల 95 వేల ఎకరాలు), గుంటూరు జిల్లా (14 లక్షల 45వేల ఎకరాలు) తరువాత మహబూబ్‌నగర్ జిల్లా మూడవ స్థానంలో వుంది. కోస్తా జిల్లాలన్నీ సముద్ర మట్టానికి 100 అడుగుల లోపు వుంటే మహబూబ్‌నగర్ జిల్లా సముద్ర మట్టానికి 1700 అడుగుల ఎత్తున వుంది. ఆ జిల్లాను ఆనుకుని వున్న శ్రీశైలంలోని గరిష్ట నీటి మట్టం కూడా సముద్రపు మట్టానికి 1000 అడుగుల లోపే! అయినా మహబూబ్‌నగర్ జిల్లాలో వ్యవసాయం ఉచ్ఛస్థాయిలో వుంది. సమైక్యవాదులు సానుభూతి చూపవలసింది హరగోపాల్ మాటల్లో "నీటి వసతి లేని మహబూబ్‌నగర్ జిల్లా రైతుల'' పట్ల కాదు. మిడిమిడి జ్ఞానంతో, మావోయిస్టు సిద్ధాంతాలను, ప్రాంతీయ విద్వేషవాదాన్ని కలగలిపి వేర్పాటు వాదులకు సైద్ధాంతిక ప్రాతిపదిక ఏర్పరచుతున్నానని భ్రమలలో మునిగి తేలుతున్న విశ్రాంత ఆచార్యులు హరగోపాల్ గందరగోళం పట్ల!

- అడుసుమిల్లి జయప్రకాష్
మాజీ శాసనసభ్యులు

26, అక్టోబర్ 2011, బుధవారం

''టీ''బ్రేక్‌లో గుబులు కబుర్లు

ఆంధ్రప్రభ సంపాదకీయ పేజీ: ప్రస్తుతం ఆంగ్లపత్రికలలో మాత్రమే కాక తెలుగు ప్రచార మాధ్యమాలలో కూడా, ఇంగ్లీషు అక్షరం ‘‘టీ’’ తో మొదలై లేదా జోడించబడి వాడబడుతున్న పలు తెలంగాణకు సంబంధించిన పదబంధాలలో ‘‘ి ఇసశీ’’ ఒకటి. మరికొన్ని ఉదాహరణలు టీ కాంగ్రెస్‌ టీ టి దేశం, టీ ఉద్యోగులు, టీ చర్చలు, టీ మీటింగులు, టీ కలెక్షన్లు, టీ పొగలు, టీ సెగలు, టీ తగవు, టీ ఆందోళన, టీ సమ్మెలు వగైరా, వగైరా ఈ పదాలలోని టి అక్షరం తెలంగాణ పదానికి సూక్ష్మీకరణమని తెలుసుకదా. కొద్దిపాటి స్వోత్కర్షను అనుమతిస్తామంటే ఒక విషయం చెప్పాలి. 17 నెలల క్రితం ఈ వ్యాసకర్త హైదరాబాద్‌లో శ్రీకృష్ణ కమిషన్‌ ముందు హాజరై  టీ tangle  అన్న శీర్షికన ఆంగ్లంలో 20 పేజీలు వినతి పత్రం సమర్పించటం జరిగింది. కమిషన్‌ సభ్య కార్యదర్శి దుగ్గల్‌ టి. అక్షరం దేనికి క్లుప్త సూచికగా వాడబడిందో వెంటనే గ్రహించి, ఆ విషయాన్ని ఇతర సభ్యులతో నవ్వుతూ పంచుకుని టీ తాగుతూ నాతో టీ తో మీ పదప్రయోగం బాగుందని అన్నారు. సరే యాదృచ్ఛికంగానే కావచ్చు ఇప్పుడు, ఈ టి పద ప్రయోగాలు మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. (టి అక్షరం పవిత్రపదమైన తెలుగుకి సూచికగా గతంలోలా మళ్లీ మారిపోతే ఎంతో బాగుంటుంది కదా! సరే ఇప్పుడు వార్తాపత్రికలు టీవీ ఛానళ్లు సకల జనుల సమ్మె (నిజానికిందులో జనం పాల్గొనలేదు, ఉద్యోగులు మాత్రమే పాల్గొని వాళ్లని 'అబ్బో' అని ప్రశంసించేలా కాదు 'అబ్బా' అని బాధతో విల విల లాడేలా చేశారన్నది వేరే విషయం) సడలిన సందర్భాన్ని టి బ్రేక్‌గా ప్రస్తావిస్తున్నారు.

మీటింగులలోను, టీ బ్రేక్‌ ఉంటుంది. ప్రత్యేక రాష్ట్ర సాధనోద్యమం పేరిట జరుగుతున్న రాజకీయ ఆట ఇది కాబట్టి క్రికెట్‌ ఆటలో వచ్చే టీ బ్రేక్‌తో దీన్ని పోల్చటం అనుచితం కాబోదు. ఎందుకంటే, టెస్ట్‌ మ్యాచ్‌లలానే, ఇదీ సుదీర్ఘంగానే సాగుతోంది. ఆట ఇంకా పూర్తికాలేదు. ఆధిక్యం ప్రస్తుతానికి లేదా ఆఖరిరోజున టీ బ్రేక్‌కి ముందు ఏ జట్టుకన్నా తుది ఫలితం గురించి ఉత్కంఠ ఉంటుంది. ఓడిపోబోతున్నవాళ్లు కూడా ప్రగల్భాలు పలుకుతూనే ఉంటారు పైకి. లోలోపల ఓటమికి ఏ సాకులు చెప్పాలా, ఎవరిపై నిందలు మోపాలా అని ఆలోచించుకుంటూనే మరి ఇప్పుడు ఈ టీ విరామం సమయంలో టీ కెప్టెన్‌ ఇతర టీ ఆటగాళ్లు ఎలాంటి టీ కబుర్లు, గుబుళ్లు గుసగుసలుగా చెప్పుకుంటారో వాస్తవాధారిత కల్పనా శక్తితో ఊహించుకుందామా! మళ్లీ ఆట మొదలయ్యేవరకు ఖాళీగా ఉండకుండా ''టి కెప్టెన్‌'' కనుసైగలనర్థం చేసుకుని మిగిలిన ఆటగాళ్లు దూరంగా ఉండిపోగా వారసత్వ బలంతో జట్టులో ప్రధాన లేదా టాప్‌ ఆర్డర్‌ బాట్స్‌మెన్‌గా రూపొందిన కొడుకు, కూతురు మాత్రమే ఆయన్ని ఒక మూలకి అనుసరిస్తారు.

నాన్నోయ్‌ మేం మొదట్లో కొంచెం విముఖంగా ఉన్నా, బోలెడన్ని రాజకీయ ఆర్థిక ప్రయోజనాలుంటాయని ఆశ, నసపెట్టి జట్టులోకి లాక్కొని వచ్చేవు. ఇంతవరకు బడుల నుంచి రాబడులు, ముట్టడుల భయంతో ముడుపులు, ఓట్లెలా ఉన్నా కోట్లు బాగానే దక్కేయి. కాని ఇప్పుడో! పోలవరం పొగలు కమ్ముకుంటూ ఊపిరాడనివ్వటం లేదు. నౌకా వ్యాపారం గురించి కూడా అంతా బట్టబయలవుతుందేమోనన్న దిగులు పెరిగిపోతుంది. కరుణానిధి సంతానం గతి మాకూ పట్టకూడదంటే, జల్దీ ఏదోటి చెయ్యాలె -ప్రత్యేక రాష్ట్రానికి ప్రత్యామ్నాయంగా కుటుంబ రక్షణ ప్యాకేజీ కుదుర్చుకోవాలె! టి మేనల్లుడి గురించి ఫికరు చేయొద్దుసుమా -అతనికి అవసరమైతే ఇంకో జట్టులోకి జంప్‌ చేసేటి తెలివి తేటలున్నాయిలె. ఏందలా మన బొబ్బిలి దగ్గరి అనకాపల్లి బెల్లం కొట్టినరాయిలా గమ్మునూర్కుని ఉన్నావు. క్విక్‌ ఏదోటి చెయ్యినాన్నా చేతితో కలిసి పోవటంతో సహా అనొచ్చు.'

ఇంకో మూలకి చేరిన ఒకే సామాజిక వర్గానికి చెందిన వృత్తి ధర్మాన్ని కాలదన్ని, ప్రభుత్వంపై (ఒక ప్రాంతపు ప్రజలపై కూడా) వాచాలత్వపు బౌన్సర్లు విసిరిన ఇద్దరు ఉద్యోగ నేతల గుసగుసలిలా ఉండొచ్చు -ఉద్యమంలోకి రాకముందే కడుపులో చల్లకదలకుండా, మనపాట్లేవో పడి కొన్నిప్లాట్లు సంపాదించాం -ఏందో ఎమ్మెల్యేనో, తదుపరి మంత్రో అయిపోవాలని ఈ అగ్గిలోకి దూకుడుగా వచ్చేం -ఇప్పుడు ఉద్యమం పూర్తిగా చల్లారిపోతే ఎస్మా గిస్మా ఏసిబి, గీసిబి, విజిలెన్సు గిజలెన్స్‌ జాన్తానై అవడానికి వీలుంటుందా టోపీ పెట్టుకున్నా అవన్నీ మాఫీ అవుతయ్యా ఏం చెయ్యాలె!

ఇకపోతే వైస్‌ కెప్టెన్‌ హిజ్‌ మాస్టర్స్‌ వాయిస్‌, ఒంటరిగా నిల్చుని, ఏవో కాగితాలు చూసుకుంటున్నాడు. అవి ఆయన ఉద్యమకాలపు సాలరీ స్లిప్పులో, లీవ్‌ రికార్డుల్లో కావొచ్చు. లేదా జట్టు ఓటమి చెందిన తర్వాత టీవి వాళ్లకి గడగడా చెప్పాల్సిన సాకుల ప్రసంగపాఠాలు కావొచ్చు. ఈ జట్టులోకి వద్దంటున్నా కెప్టెన్‌ నిత్యం తిడుతున్నా, దూరిపోయి స్వపక్షంపైననే బౌన్సర్లు వేయడానికి విభజనవాద జట్టుకి బ్యాటింగు చేయడానికి శాయశక్తులా ప్రయత్నించిన టి కాంగ్రెస్‌ పేపర్‌ టైగర్లు ఇంకో మూలకి చేరి, యుటర్న్‌ తీసుకోవడానికి ఏం చేయాలో చర్చించుకుంటున్నారు. వారి చర్చల్లో వచ్చే మొదటి అంశం అమ్మ చెప్పిందే మాకు వేదం అని ముందే చెప్పలా -

''పన్నెండో ఆటగాడు'' (ఈయన పేరు చెప్పేసుకుందాం లెండి కెకె) గడ్డం పీక్కుంటూ వ్యాకరణం, ఫుల్‌స్టాప్‌లు కామాలు లేని మిశ్రమ భాషలో ఇంకో మూలన నిలబడి అక్కడున్న గోడను కాసేపు మైకుగా భావించుకుని స్వగతంగా అనుకునే మాటలు ఇలా ఉండొచ్చు -నాన్సెన్స్‌ స్టోరీ అంటే ఎస్‌టిఓఆర్‌వై కథ అని అర్థం -అడ్డం తిరిగింది -హౌ టు గెట్‌ రీనామినేషన్‌ టు రాజ్యసభ? అఫ్‌కోర్స్‌ వర్కింగు కమిటీలో మళ్లీ దూరాలె' -ఇంకా టీ టి దేశం నేతలు వీళ్లలానే ఎంతగా అడిగినా టి జట్టులో స్థానం లభించక పోయినందువలన కోపగించి, ఏదోలా ఆటకి అంతరాయం కలిగించాలని ప్లాన్లు వేసినవాళ్లు, స్టేడియం లోనే ఉన్నారు గాని, టీ జట్టు కోలుకోవాలని, టి గేమ్‌ నెగ్గాలని కోరుకోవటం లేదు. బ్లేమ్‌ గేమ్‌ ప్లాన్లు చర్చించుకుంటున్నారు.

ఇకపోతే సమైక్యవాద జట్టు సభ్యులంతా ఐక్యంగా ఉండి తలోచోటుకి పోకుండా, ఒక్క చోటుకే చేరుకుని ఈ టి బ్రేక్‌లో చర్చించుకునేది ఇలా ఉంటే బాగుంటుంది -సులభంగా నెగ్గాల్సిన మేచ్‌ని ఇంతవరకు తెచ్చుకున్నాం, అతి విశ్వాసంతో ఒక అంపైరు చిదంబరం తప్పుడు నిర్ణయం ఇంతవరకు తెచ్చింది. కనీసం రెండో అంపైరు ప్రణబ్‌ సరిగానే వ్యవహరిస్తున్నారు. అదే పదివేలు. థర్డ్‌ అంపైరు కాంగ్రెస్‌ అధిష్టానం -మేచ్‌ రిఫరీ కేంద్ర ప్రభుత్వం కూడా సరిగానే వ్యవహరిస్తారన్న విశ్వాసం ఉంది. ఐనా మనం ప్రపంచవ్యాప్తంగా ఉన్న 18 కోట్ల మంది తెలుగువాళ్లు 121 కోట్ల భారతీయుల ఆశలనూ వమ్ము చేయకూడదు. అంపైర్ల మీద ఆశలు పెట్టుకోవద్దు. మీ స్వశక్తిని నిరూపించుకుని, చిత్తశుద్ధితో సంకల్పబలంతో ఆడి గేమ్‌ గెల్చుకుందాం. ఇంకో విషయం ఓడిపోబోతున్న జట్టు వాళ్లు తమకు అలవాటైన తిట్ల పురాణాన్ని ఇంకా పెంచుతారు. మనం సంయమనం సంస్కారం చూపాలి. అంతేకాదు ఓడిన జట్టుని కించపరచకూడదు క్రీడా స్ఫూర్తిని చూపాలి.'

ఇప్పటికే తుది ఫలితం సమైక్య వాదానికి అనుకూలంగా 18 కోట్ల మంది, తెలుగు ప్రజలు (తెలంగాణవాసులు కూడా) మొత్తం 121 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షల కనుగుణంగానే ఉండబోతోందన్న సంకేతాలున్నా కొంత ఉత్కంఠ తప్పటంలేదు గాని, భయపడొద్దు -అంతా మేలే జరుగుతుంది. కాని ఇలాంటి రాజకీయ క్రీడలు మళ్లీ మళ్లీ జరగకుండా రాజ్యాంగ బద్ధమైన నిషేధం విధించాలి.

-చేగొండి రామజోగయ్య
వ్యాసకర్త విశ్రాంత బ్యాంకు అధికారి, విశాలాంధ్రమహాసభ సభ్యులు

గమ్యం చేరని ఉద్యమం

ఆంధ్రజ్యోతి సంపాదకీయ పేజీ: కార్ల్ పాపర్ అనే సామాజిక శాస్త్రవేత్త చెప్పినట్లు సామాజిక శాస్త్రజ్ఞుడికి రెండు లక్షణాలు తప్పక ఉండాలి. ఒకటి వాస్తవాలను పరిశీలించడం, వాటిని ఒకదానితో ఒకటి ముడిపడివున్నవని గ్రహించడం. రెండవది ఆ వాస్తవాల ఆధారంగా ఆ నిర్దిష్ట సమస్య మీద ఒక ప్రెడిక్షన్ చెయ్యడం. ఒక దాన్ని 'వ్యరిఫయబిలిటీ' అని, మరోదాన్ని 'ప్రెడిక్టబిలిటీ' అనీ అంటారు.

2009 డిసెంబర్ 9 నాటి చిదంబరం ప్రకటన ఏ వాస్తవాల నేపథ్యంలో వచ్చింది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కె.విపి.రామచంద్రరావు, వారి చుట్టూ రూపొందిన మంత్రులు, శాసనసభ్యులు ప్రభుత్వాన్ని పడగొట్టి తాము తిరిగి రాజకీయ అధికారంలోకి రావాలనే ఒక బలమైన ప్రక్రియ నడుస్తున్నప్పుడు, అకస్మాత్తుగా తెలంగాణ సమస్య మళ్ళీ తెరమీదికి వచ్చింది. ఆనాడు దాదాపు 140 మంది శాసనసభ్యులు, ముప్పావు మంత్రి మండలి జగన్-కెవిపి చెప్పుచేతల్లో ఉన్నారు.

అయినా కాంగ్రెస్ అధిష్ఠానం జగన్‌ను ముఖ్యమంత్రిని చెయ్యడానికి సిద్ధంగా లేదు. తమ ప్రభుత్వాన్ని కూలగొట్టకుండా చూసుకోవడం ఆనాడు కాంగ్రెస్ ముందున్న రాజకీయ కర్తవ్యం. ఇక్కడ కాంగ్రెస్ బచ్చాగా భావించే జగన్ ప్రభుత్వాన్ని కూలగొడితే కేంద్రంలో సోనియా గాంధీ రాజకీయ నైతిక ఆధిక్యతకు ఎంతో ప్రమాదమున్న రోజులవి.

ఈ దశలోనే టిఆర్ఎస్ నేత అన్నిరకాలుగా బలహీనంగా ఉన్నందు వల్ల అతనిచే 'ఉపస ఉద్యమం' చేయించి తెలంగాణపై తెగకుండా ముడులుపెట్టే ప్రకటన చేయాల్సిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీ కొచ్చింది. ఇక్కడే తెలంగాణ ప్రాంతానికి మూడవ దశ 'ఉద్యమ ఉరితాడు'ను కాంగ్రెస్ బిగించింది. డిసెంబర్ 9న 'తెలంగాణ రాష్ట్ర నిర్మాణ ప్రక్రియ మొదలైంది. అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం పెడుతుంది' అన్న ప్రకటన ఒకవైపు జిత్తుల ఆశను తెలంగాణ ప్రజల ముందుపెట్టి రెండవ వైపు జగన్, కెవిపి ఆటలను కట్టించే మ్యాఖవెల్లియన్ రాజకీయం చేసింది.

కాంగ్రెస్ నుంచి ఇక్కడ స్వరాష్ట్ర నినాదం, అక్కడ సమైక్య నినాదం ఏకదాటిన రప్పించి ముందు జగన్-కెవిపిల ఆటకట్టి వేశారు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు మరోపని అప్పచెప్పారు. అదే రెండు ప్రాంతాల్లో ఉద్యమాలు. ఈ స్వయం సృష్టి ఉద్యమం ద్వారా చేతుల జారకుండా కాల్పులు జరగకుండా డబ్బు మార్పిడి అటు నుంచి ఇటు, ఆత్మహత్యల పేరుతో రాజకీయ హత్యలు జాగ్రత్తగా జరగనిచ్చారు. సాధారణ తెలంగాణ ప్రజల్లో తెలంగాణ ఇక వచ్చే స్తుందనే భ్రమను కేంద్రమే కల్పించి, అది జరక్కుండ ఉండేందుకు రాజకీయ రంగాన్ని నిత్య నాటకంగా జరగనిచ్చారు.

1969 ఉద్యమానికి, ఇప్పటి ఉద్యమానికి ఒక ప్రధాన తేడా ఏమిటంటే అప్పుడు తెలంగాణ ఇచ్చే సమస్యే లేదని మొదటి నుంచి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కనుక కాల్పులు, నిర్బంధం నిరంతరంగా కొనసాగించింది. ఉద్యమంలో డబ్బు వ్యాపారానికి ఆస్కారం లేదు. ఆనాడు అంత డబ్బు కూడ రాష్ట్రంలో లేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే మరో సమస్యను పరిష్కరించేందుకు ఉద్యమాన్ని సృష్టించింది. కనుక అది కాల్పులకు పూనుకోలేదు.

కొంత మంది విద్యార్థులు తప్ప నాయకులు, పాత ఉద్యమ జీవులు, కొత్తగా ఉద్యోగ రంగం నుంచి సృష్టించబడినోళ్ళు ప్రభుత్వ బంధువులగా తిరగనారంభించారు. అటు, ఇటు నాయకులు తిట్టుకున్నట్లు కనబడినా డబ్బు లావాదేవీలు బాగా నడిచాయి. తెలంగాణలోని పై నాయకత్వానికి ఖర్చుకు మించిన ఆదాయం పెరిగి 'ఉద్యమ వ్యాపారాలు' చాలా పుట్టుకొచ్చాయి. 1969లో ఇవి మనకు కనపడవు. ఆంధ్రులు పదవుల ఆశలు చూపారు కాని పైసలు అంతగా ఇవ్వలేదు.

ప్రపంచంలో ఏ ఉద్యమంలో లేనిది, తెలంగాణలో కూడ ఎప్పు డు లేనిది ఆశాజీవులను 'ప్రేరేపించి చంపడం' అందులో నాయకు లు కుల-వర్గాల వారినికాక మొదటి తరం విద్యారంగంలోకి వచ్చిన అమాయకులను చావుకు 'ఉరికి పురికొల్పడం' మనం మొదటిసారి చూస్తాం. తడిగుడ్డతో తలకోసినట్లు, ఉద్యమంలో డబ్బు, పలుకుబడి సంపాదించుకోవడం ఒకవైపు 'అమాయక జీవుల చావులు' మరో వైపు ఒకే నాణానికి బొమ్మ, బొరుసులా సాగాయి.

విద్యా రంగంలో తమ కర్తవ్యాన్ని ఎప్పుడూ సీరియస్‌గా నిర్వహించని మేధావి బృందమొకటి రెండు ప్రాంతాల్లో కమిటీలేసుకుని కట్టలు సంపాదించడం మనకు మొదటిసారి కనిపిస్తుంది. అయితే తెలంగాణలో బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీలు చదువుకొనే అన్ని విద్యాసంస్థలను నిరంతరంగా మూయించడం, బంద్‌ల ద్వారా కూలి, నాలి జనాల నిత్య జీవితాన్ని మరింత పాడు చెయ్యడం ఒక అవసర ఉద్యమంగా ముం దుకు తెచ్చారు. సకల జనుల సమ్మెతో దాన్ని పరాకాష్టకు చేర్చారు. దీనికి గైడెన్స్ కూడ కాంగ్రెస్‌దే. తెలంగాణ వెనుకబడిందని చెబుతూనే ఇక్కడ వెనుకబడినవారిని ఎప్పుడు పైకి రాకుండా ప్రభుత్వ స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు నిరంతరం మూసేసి వారిని రోడ్లమీద నిలబెట్టకపోతే రాష్ట్రాన్ని ఎట్లా సాధిస్తామని, సంపాదించే వారు, ప్రభుత్వ బంధువులు సిద్ధాంతం చెప్పడం మనం చూస్తాం.

ప్రభుత్వం అసలు నాయకులను గాని, అగ్రకుల మేధావులనుగాని తీవ్ర నిర్బంధంలోకి నెట్టిన స్థితి కూడ లేదు. వారిని చాలా గౌరవంగా చూస్తున్నారు. కేంద్రం రాల్చదల్చుకోని తెలంగాణను రాలుస్తానని చెప్పింది కనుక దానికి రాళ్ళు కొడుతూనే ఉండడం ఉద్యమ కర్తవ్యమైంది. తాను కాల్పుల్లో చంపకుండా, యువత స్వయంగా చస్తున్నట్లు చూపబడుతున్న హత్యాకాండలో అందరికీ ఒక ఆనందం కనిపించింది.

వెనుకటి కాలంలో స్త్రీలను చంపి సతి అయిందని శవానికి మొక్కినట్లు నేతల-మేధావుల మొక్కుళ్ళు కూడ మొదటిసారి చూస్తున్నాం. తెలంగాణ రాదని అర్థమైనా దానికి మరో రెండు రాళ్ళు కొట్టి, అట్లా కొట్టని వాళ్ళను తిట్టడం కూడ ఇప్పుడొక ఉద్యమమైంది. ఉద్యమం ఊపు పెరిగితే చావులు పెరుగుతున్నాయి. ఊపు తగ్గితే చావులు తగ్గుతున్నాయి. ఇది ప్రపంచంలోనే మొదటి వింత. ఆంధ్ర పెట్టుబడి ప్రభుత్వం పిల్లలు చస్తూంటే సంతోషిస్తూ, ఉద్యమ నాయకులను ఎనలేని విధంగా గౌరవిస్తూంది. ఎందుకు? ఈ మొత్తం ప్రక్రియ వల్లనే పడిపోయే ప్రభుత్వం నడుస్తూ ఉంది.

కనుక దాన్ని పడగొట్టడానికి సిద్ధంగా వున్న దేవుని బిడ్డ రెండు మతాల మధ్య ఊగిసలాడడం వలనో ఏమో 'శ్రీకృష్ణ జన్మస్థానం' పోయే రోజులు దగ్గరపడుతున్నాయి. అంటే చిదంబరం చిటుకు బాగానే పనిచేసింది. ఇక్కడ మనం మీడియా మీమాంసను కూడ జాగ్రత్తగా చూడాలి. ఒకవైపు రాలని తెలంగాణకు 1969 నుంచి రాళ్ళు కొడుతూనే ఉంటే, స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీల్లో పాఠాలు నేర్చుకోవడానికి బదులు విద్యార్థులు, ధూమ్‌ధామ్ చెయ్యడం, బతుకమ్మ లాడడం, టివి ఛానళ్ళకు కన్నుల పండుగైంది.

ధనవంతులు కాక, బీదోళ్ళంత రోడ్లమీద వంటలు చేసుకు తింటుంటే, దీనిని ఒక ఉద్యమంగా చూపించడం ఆనందంగా ఉంది. ఈ క్రమంలోనే ఓబులాపురం ఇనుము గాలి బ్రదర్స్ ఇంట్లో బంగారమైనట్లు, జలయజ్ఞం జగన్ ఆజ్ఞతో ఇంద్ర భవనాలుగా మారినట్లు ఉద్యమ ధనం తెలంగాణ మీడియాగా మారుతుంది. మన శవాలను మన మీడియాలో చూసుకొని, వాటి గురించి చదువుకొని బడుగు మేధావులు సైతం స్వాతంత్య్రం వచ్చేసినట్లు ఉపన్యసిస్తూనే ఉన్నారు. ఇక్కడ మేధావి తనానికి కొత్త నిర్వచనం ఇచ్చారు. పరిస్థితులను రాజకీయంగా అంచనా వెయ్యడం మానేశారు.

ఈ క్రమంలోనే ఆంధ్ర పెట్టుబడిదారులకొకటి అర్థమైంది. తెలంగాణలో చదువుల పోటీ పెరగకుండా ఉండాలంటే ఉద్యమాలను నిరంతరం చేస్తూనే ఆ ప్రాంతం నుంచి కొన్ని కుటుంబాల గర్భస్త పెట్టుబడిదారుల్ని తయారుచేయాలి. ప్రాంతీయ ఉద్యమాలు కూడా పైకులాల్లో పంపిణీ సరిగా లేకపోతే ముందుకు వస్తాయి. కనుక ఇప్పుడు తెలంగాణ మీడియాకు అడ్వర్‌టైజ్‌మెంట్లు అధిక టారిఫ్‌కు, అడిగినన్ని ఇస్తూపోతే, పెట్టుబడి కొంత చేతులు మారినా 'కుల -వర్గ' ప్రయోజనాలు కాపాడుకోవచ్చు. ఈ సిద్ధాంతం అమలు చేసే క్రమంలోనే ఫోన్లమీద ప్రాంతాలకు అతీతంగా మితృత్వం, రోడ్ల మీద ప్రాంతాల వారీగా శతృత్వం చూపడం చాలా సులభమైంది.

యూపీఏ -2లో తప్పులు చేస్తూన్నట్లు కనబడుతూ ప్రభుత్వాన్ని కాపాడుకునే నూతన ప్రక్రియ పకడ్బందీగా అమలవుతోంది. ఢిల్లీలో ఒక బలమైన కమిటీ కష్టాలు తెస్తూంది, వాటిని అతి సులభంగా అధిగమిస్తుంది. ఇక్కడ జగన్ ప్రమాదం నుంచి బయటపడడం, టిడిపిని బలహీనమైన ప్రతిపక్షంగానే కొనసాగించేందుకు, తెలంగాణ ఉద్యమం, టిఆర్ఎస్‌ను బలపర్చడం రెండు అవసరమయ్యాయి.

టిఆర్ఎస్ ఢిల్లీకి ఎప్పుడూ శత్రువు కాదు. అక్కడి నుంచి వచ్చే కను సైగలను అది కనిపెడుతూనే ఉంటుంది. తెలంగాణ నాయకత్వం రాజకీయ వ్యాపారంతో ఆస్తులు పెంచుకున్నంత కాలం నిజంగా తెలంగాణ రావడం కూ డా అద్దంలో ప్రతిబింబమే. జగన్ జైలుకు పోతే మిగిలే శత్రువు టిడిపి. దానిచుట్టూ వున్న తెలంగాణ బిసిలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మత్తులో పడి టిఆర్ఎస్ చుట్టూ భజన చేస్తున్నారు.

ఈ ప్రాంతంలోని అన్ని సీట్లు 2014లో టిఆర్ఎస్ గెలిచినా కాంగ్రెస్‌కు నష్టమేమి లేదు. ఆ పార్టీ నాయకుని కుటుంబ కంపెనీల చుట్టూ పెరుగుతున్న ఆస్తుల్ని యథేచ్ఛగా పెరగనిచ్చి ఆక్రమ ఆస్తుల పెరుగుదల కర్ర చూపితే చాలు వాళ్ళు ఎక్కడ ఓటు వెయ్యమంటే అక్కడ వేస్తారు. అంతిమంగా టిఆర్ఎస్ వాపు కాంగ్రెస్ బలుపే. ఆ పార్టీ రాజకీయ అధికారం లేకుండానే 'ఉద్యమ అధికారం'తో ఈ ప్రాంతపు 'ముడుపుల పాయ' నొకదాన్ని తయారు చేసుకుంటుంది.

అదే కాంగ్రెస్‌కు కావలసింది. పాఠాలు చెప్పకుండా పంతుళ్ళకు జీతాలు, పనిచేయకుండా ఉద్యోగులకు జీతాలు, కాల్పులు లేకుండా కొంతమంది యువకులు 'అమరవీరు'లవ్వడం మొదలైన వాటితో ప్రభుత్వానికి సమస్యేమీలేదు. రాష్ట్రాన్ని విభజించి బిజెపి పన్నిన చిన్న రాష్ట్రాల వలలో పడితే కేంద్రంలో కూడా అధికారముండదని కాంగ్రెస్ వారికి తెలుసు. యూపీఏ మిత్రపక్షాలు ప్రత్యేక రాష్ట్రానికి మద్దతివ్వరనీ తెలుసు. అయినా డిసెంబర్ 9 ప్రకటన చేశారు.

ఆ మరుసటి రోజు తెలంగాణ తమ్ముళ్ళు ఫ్రెంచి విప్లవం వచ్చిందని, బట్టలిప్పుకొని ధూంధాం చేసుకుంటే, పెద్ద చదువులు చదివిన దొరసాన్లు బతకమ్మలాడారు. తెలంగాణ మేధావివర్గం సైతం 'అమ్మ పుట్టినరోజు ప్రకటించింది' అని ఫ్యూచర్ ప్లాన్లు చాలా వేసుకున్నారు. తరువాత కమిటీలొచ్చినాయి. తెలంగాణ వానరసేనకు చావులొచ్చినాయి, కేసులొచ్చినాయి. నాయకులుగా ఉన్నవారికి, కొత్తగా ఎదిగిన వారికి ఆంధ్రోళ్ళు అడిగినన్ని చందాలిచ్చి, తెలంగాణ కూడ ఇవ్వరు కదా!

తెలంగాణ ఇంక రాలే, వచ్చే అవకాశం కూడ లేదు. ఉద్యమాలు మాత్రం నడుస్తూనే ఉంటాయి. 2014 దాకా వాటి అవసరం ఇరుపక్షాలకు ఉన్నది. తెలంగాణ చదువును సంపూర్ణంగా చంపితే తప్ప ఆ ప్రాంతానికి పాత వైభవం రాదని పాటలు రాసుడు, పుస్తకాలేసుడు ఇప్పుడు ఎంతో అవసరం. తెలంగాణ-నా తెలంగాణ -విద్యావంతులు కనిపెట్టిన ఏకైక పోరాటరూపమిది.

ఈ పోరాటం 2014, ఆ తరువాత 2019... 2024 ఎన్నికల గుండా పయనిస్తూ జై తెలంగాణ నినాదంతో కొనసాగుతూనే ఉంటుంది. దాని అసలు లక్ష్యం ఈ ప్రాంతంలోని సకల బడుగుజీవుల చదువుల్ని అభివృద్ధిని, సంపూర్ణంగా చంపేయడం...చూస్తూ ఉందామా... చూస్తూనే ఉందామా... సకల జనుల చావునీ సంపదల జోరునీ...?

- కంచ ఐలయ్య
వ్యాసకర్త సామాజిక శాస్త్రవేత్త, సుప్రసిద్ధ రచయిత

25, అక్టోబర్ 2011, మంగళవారం

మేం బకరాలా?


ఆంధ్రప్రభ : మరిమామాటేమిటని అడుగుతున్నారు సకల జనుల సమ్మె కాలంలో విధులకు హాజరైన ఉద్యోగులు. తెలంగాణ నాన్‌గెజిటెడ్‌ అధికారుల సంఘంతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలంకావడంతో సమ్మె విరమించడంపై తీసుకున్న నిర్ణయాన్ని ఆహ్వానిస్తూనే మరి సమ్మె కాలంలో పని చేసిన తాము బకరాలుగానే మిగిలిపోవాలా? సమ్మెలో పాల్గొనకుండా అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు అండగానిలిచి అనేక వత్తిళ్లు తట్టుకుని పనిచేసినందుకు ఏం లాభం?... 42 రోజులు పనిచేసినవారితో సమ్మెలో పాల్గొన్నవారినీ సమానంగా “ట్రీట్‌’ చేసి అన్ని సౌకర్యాలు సమకూర్చినప్పుడు తమకు చివరకు మిగిలింది నిరాశేనా? అని విధులకు హాజరైనవారు అడుగుతున్నారు.

సమ్మె విరమణపై టిఎన్‌జివో నాయకులతో ప్రభుత్వం జరిపిన చర్చల సారాంశం బయటకు పొక్కగానే తాము బకరాలుగా మిగిలిపోయామని విధులకు హాజరైన ఉద్యోగులు వాపోయారు. ముఖ్యంగా సమ్మె విరమణపై కుదిరిన అంగీకారంలో భాగంగా 42 రోజులు విధులకు దూరంగా ఉన్న సమయాన్ని ప్రత్యేక సెలవు దినాలుగా పరిగణించడంపై వీరు పూర్తి అభ్యంతరం తెలియజేస్తున్నారు. సుదీర్ఘంగా 42 రోజులు సమ్మెలో పాల్గొన్న వారు హాయిగా ఇంటి దగ్గర కూర్చుని వారి జీతాలు తీసుకుంటున్నారని, ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి తాము విధులకు హాజరయినందుకు తమకు వెంటనే ప్రభుత్వం ఇన్సెంటివ్‌ ప్రకటించాలని వీరు డిమాండ్‌ చేస్తున్నారు.

1983లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఎన్‌జివోలు చేసిన సమ్మెకు దూరంగా ఉన్నవారికి ప్రోత్సాహకరంగా ఒక ఇంక్రిమెంట్‌ ఇచ్చిందని, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ దిశలో ఆలోచించకపోతే విధులకు హాజరైన ఉద్యోగుల నైతికస్థైర్యం దెబ్బతినే ప్రమాదముందని వారు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. గతంలో ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం 1983లో స్వర్గీయ ఎన్‌టిఆర్‌ అధికారంలో ఉండగా రాష్ట్రవ్యాప్తంగా ఎన్‌జివోలు 43 రోజులు సమ్మెలో పాల్గొన్నారు. తర్వాత సమ్మె విరమణ అంగీకారం కుదరడంతో ఈ ఉద్యోగులు విధులకు హాజరయ్యారు. అయితే, ఈ అంగీకారంలో భాగంగా సమ్మె కాలాన్ని ప్రత్యేక సెలవు దినాలుగా ప్రకటించి ప్రభుత్వం జీతం చెల్లించడానికి అంగీకరించింది. కాగా, సమ్మెలో పాల్గొనని ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఒక ప్రత్యేక ఇంక్రిమెంట్‌ ఇచ్చి ఉద్యోగుల అంకితభావాన్ని ప్రోత్సహించిందని, ప్రస్తుత కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రభుత్వం కూడా తక్షణం ఈ దిశగా ఆలోచించవలసిన అవసరం ఉందని సమ్మెకాలంలో పనిచేసిన ఉద్యోగులు అంటున్నారు.

ఎన్‌టిఆర్‌ ప్రభుత్వం ఆగస్టు 8, 1983న ఆర్థిక శాఖ విడుదల చేసిన జీవో ఎంఎస్‌ నెంబర్‌.226 ద్వారా సమ్మెలో పాల్గొనని ఉద్యోగులకు స్పెషల్‌ ఇంక్రిమెంట్‌ ఇచ్చిందని అదే విధంగా ప్రస్తుతం సమ్మెలో పాల్గొనని ఉద్యోగుల గురించి ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టవలసిన అవసరం ఉందని వీరు గట్టిగా డిమాండ్‌ చేస్తున్నారు. సకల జనుల సమ్మె వలన రవాణా సౌకర్యం లేకపోయినా ఎన్నో కష్టాలకోర్చి తమ విధులకు హాజరయ్యామని, ఎన్నో వత్తిళ్ల మధ్య పనిచేశామని, ఈ కష్టం నిరాశగా మిగిలిపోకూడదని అంటున్నారు. సమ్మెలో పాల్గొన్న వారు చాలా మంది కుటుంబ సభ్యులతో హాయిగా విహారయాత్రలకు వెళ్ళారని, కొంతమంది 'కాలక్షేపం క్రీడలతో' గడిపారని, వీరందరికీ సమ్మె కాలాన్ని ప్రత్యేక సెలవుదినాలుగా పరిగణించి వారి జీతాలకు ఎలాంటి ఢోకా ఉండదని ప్రకటించడం సోదరభావంతో తమకు సంతోషమే అయినా, తమ కష్టానికి కూడా తగిన ప్రతిఫలం లేకుంటే కష్టపడిన వారికి అన్యాయం చేసినట్లు అవుతుందని అంటున్నారు.

23, అక్టోబర్ 2011, ఆదివారం

గవర్నర్‌ను కలిసిన విశాలాంధ్ర మహాసభ ప్రతినిధులు

ఆంధ్ర భూమి, హైదరాబాద్, అక్టోబర్ 22: విశాలాంధ్ర మహాసభ సదస్సును రాజధానిలో ఏర్పాటు చేసేందుకు వీలు కల్పిస్తూ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని విశాలాంధ్ర మహాసభ ప్రతినిధులు పరకాల ప్రభాకర్, నర్రా మాధవరావు, డాక్టర్ సయ్యద్ ఫాహిమ్, సూర్యమోహన్, కుమార్ చౌదరి యాదవ్ తదితరులు గవర్నర్‌ను కోరారు. వారు గవర్నర్ ఇఎల్‌ఎస్ నరసింహన్‌ను శనివారం మధ్యాహ్నం కలుసుకుని వినతిపత్రం సమర్పించారు. అంతకుముందు విశాలాంధ్ర మహాసభ 21, 22 * తేదీల్లో జూబ్లీహాల్‌లో సదస్సు, ప్రదర్శనను నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. కాని పోలీసులు చివరి నిమిషంలో ఈ సదస్సు నిర్వహణకు అనుమతిని నిరాకరించారు. జూబ్లీహాల్‌ను ఈ సభ నిర్వహించేందుకు ఇవ్వబోమంటూ అనుమతిని సంబంధించిన అధికారులు రద్దు చేశారు. దీంతో నిర్వాహకులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసి సభ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని హౌస్ మోషన్ ప్రతిపాదించగా స్వీకరించలేదు. కోర్టును ఆశ్రయించాలని ఆదేశించారని విశాలాంధ్ర మహాసభ ప్రతినిధి పరకాల ప్రభాకర్ తెలిపారు. దీంతో నిర్వాహకులు గవర్నర్‌ను కలుసుకుని తమకు సభను నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. భావస్వేచ్ఛ, వ్యక్తీకరణను హరించే విధంగా అధికారుల ధోరణి ఉందన్నారు. గతంలో ఢిల్లీలో తమ సంస్ధ మహాసభను నిర్వహించామన్నారు. ఆంధ్రమహాసభ స్ఫూర్తితో సభను నిర్వహించాలనుకున్నట్లు తెలిపారు. మహానుభావులు రావి నారాయణ రెడ్డి, మాడపాటి హనుమంతరావు, సురవరం సుధాకర్ రెడ్డి**, అయ్యదేవర కాళేశ్వరరావు, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, బూర్గుల రామకృష్ణారావు తెలుగు ప్రజల ఐక్యత కోసం కృషి చేశారన్నారు. రాష్ట్ర విభజన కోసం జరుగుతున్న ఉద్యమాల తీరు తమకు ఆందోళన కలిగిస్తోందన్నారు. తెలుగు ప్రజల ఐక్యత కోసం విశాలాంధ్ర మహాసభను హైదరాబాద్‌లో కూడా నిర్వహించాలని చాలా మంది కోరారని చెప్పారు. కాగా జూబ్లీహాల్ వద్ద ముందు జాగ్రత్త చర్యగా శనివారం ఉదయం నుంచి పోలీసులు భద్రత ఏర్పాట్లు చేశారు.


 * 22, 23

**సురవరం ప్రతాపరెడ్డి అని చదవగలరు 

ఏరి? పౌరహక్కుల సంఘ నాయకులేరి?


 






 





22, అక్టోబర్ 2011, శనివారం

ఎందరో మహానుభావులు!

వీక్ పాయింట్, ఆంధ్రభూమి: తమ్ముడు తమ్ముడే. పేకాట పేకాటే. రాజకీయం రాజకీయమే. వ్యాపారం వ్యాపారమే.

తెలంగాణ వాదులంటే సమైక్యవాదులకు చిర్రు. సమైక్యవాదులంటే తెలంగాణ వాదులకు గుర్రు. వారినీ వీరినీ ఎగదోసేదీ, ఆగర్భశత్రువుల్లా కొట్లాడుకునేట్టు చేసేదీ వారికీ వీరికీ నెత్తినెక్కిన నేతలు. పాపం, ఆ పుణ్యాత్ములూ జనాన్ని రెచ్చకొట్టి ఊరుకోరు. తమలో తాము కూడా తీవ్రాతి తీవ్రంగా, ఘోరాతి ఘోరంగా కలహించుకుంటారు. తెల్లారితే ఒకరినొకరు అనరాని, వినరాని బండబూతులతో టీవీల్లో, పత్రికల్లో చడామడా తిట్టేసుకుంటారు. అది చూసి మా ప్రాంతం కోసం, మా క్షేమంకోసం మా నాయకులు ఎంత చండ ప్రచండంగా పోరాడుతున్నారోనని వెర్రిజనం తెగ ముచ్చటపడతారు.

వారికి అర్థం కానిది ఏమిటంటే... సుందోపసుందుల్లా అంత భీకరంగా పోట్లాడుకునే నాయకులే తమకు దిక్కుమాలిన అక్కర వచ్చినప్పుడు, పార్టీ వైరాలను తీసి గట్టున పెట్టి, ప్రాంతీయ మమకారాలను పక్కకు నెట్టి పాపభీతి లేకుండా చాటుమాటున చేతులు కలుపుతారు. పగలు పగవాళ్లలా ఒకరిమీద ఒకరు కత్తులు దూసుకునే వాళ్లు కూడా చీకటి వ్యాపారాల్లో పాలూ నీళ్లలా కలిసిపోతారు. వాళ్ల మాటలు నమ్మి, వెర్రిజనం చొక్కాలు చించుకుని తమలో తాము కలబడి, కొంపలు తగలెట్టుకోవలసిందే తప్ప - వారిని రెచ్చగొట్టే నాయకశ్రీల మధ్య ఎక్కడలేని ఐకమత్యం.

పోలవరం ప్రాజెక్టు కడితే రక్తం ఏరులైపారుతుందని తెలంగాణ రాజకీయ వీరులు ఎప్పటినుంచో వార్నింగులిస్తున్నారు. తెలంగాణ వాసులకు తీరని అన్యాయం చేసే ప్రాజెక్టుకు అనుమతులివ్వకూడదు; టెండర్లను తెరవకూడదంటూ కింది నుంచి సుప్రీంకోర్టు దాకా కేసుమీద కేసు పెట్టారు. ఆ ప్రాజెక్టు అడుగు ముందుకు కదిలితే తెలంగాణకు కలగబోయే అరిష్టాలూ, అనర్థాల గురించి తెలంగాణ గుండె చప్పుడు పత్రిక మొన్నటిదాకా రంకెలు పెట్టింది. వాటిని ఆలకించి తెలంగాణ జనం బ్లడ్ ప్రెషర్ పెంచేసుకుని భగభగలాడుతూండగానే అదే పత్రిక యజమానికి సంబంధించిన కంపెనీ అదే పోలవరం ప్రాజెక్టును కట్టించే కాంట్రాక్టును చడీ చప్పుడు కాకుండా అప్పనంగా కొట్టేసింది.

అంటే - తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించేవారే తెలంగాణ నోట మన్నుకొట్టే ప్రాజెక్టునూ స్వహస్తాలతో కట్టిస్తారన్నమాట!

పోనీ - ఈ సంగతి అల్లరయ్యాకైనా తెరాస నాయకశ్రీలు దిగ్భ్రాంతి చెందారా? జరిగింది తప్పు అని ఒక్కరైనా ఖండించారా? లేదు. కాంట్రాక్టు కొట్టేసిన కంపెనీలో మావాడి వాటా 3 శాతం మాత్రమే లెమ్మని వెనకేసుకొచ్చారు. తెరాసీయులూ, తక్కుంగల తెలంగాణ ఉద్యమకారులూ ద్వేషించే రెండు కళ్ల చంద్రబాబు ఇలాకా వాళ్లదే పేద్ధవాటా అని వాదులాడుతున్నారు. అంటే - చేసింది తప్పా కాదా అన్నది పాపంలో వాటా ఎక్కువా తక్కువా అన్నదాని మీద ఆధారపడుతుందన్నమాట. తెలంగాణ వాది పోయిపోయి సమైక్యవాదులతో వ్యాపారం కోసం చేతులు కలిపి, తెలంగాణ కొంప ముంచుతుందంటున్న ఆంధ్రా ప్రాజెక్టు కట్టుబడికి ఓ చెయ్యి వేయటం అంతా రైటేనన్నమాట.
మనలో మనకు ఎన్ని గొడవలైనా ఉండనీ. బయటి శత్రువుల దగ్గరికి వచ్చేసరికి మనం మనం ఒక్కటే - అంటాడు భారతంలో ధర్మరాజు. కొంచెం తేడాతో మన నాయకరత్నాలూ అదే టైపు. వారిలో వారికి కొన్ని గొడవలైనా ఉండనీ! పార్టీలూ, ప్రాంతాలూ, వాదాలూ, విధానాలూ వేరు వేరేకానీ! జనం కంట్లో కారం కొట్టి తమ పబ్బం గడుపుకునే విషయంలో వారూ వారూ ఒక్కటే. జనాన్ని ఎంత విడదీసినా, మన నాయకుల మధ్య వ్యాపార సంబంధాలు, కుటుంబ బాంధవ్యాలు, రహస్య ప్రేమానుబంధాలు షరామామూలే.

తెలంగాణ ఉద్యమం ఉద్ధృతంగా సాగుతున్న సమయాన జై తెలంగాణ అంటూ బోనమెత్తుకున్న పాలమూరు మంత్రమ్మ, సమైక్యాంధ్ర కోసం కడదాకా పోరాడతానని ఘోషించిన నెల్లూరు మంత్రయ్య ఎంచక్కా వియ్యమందలేదా? ఆంధ్రోళ్లను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టే తెరాస యువరాజు తనకు ఆంధ్రావాళ్లతో వ్యాపార సంబంధాలు బాగానే ఉన్నాయని స్వయంగా ఒప్పుకోలేదా? సాక్షాత్తూ తెరాస మారాజే లక్షలమంది సాక్షిగా తన ప్రియశత్రువు లగడపాటికి ఐ లవ్ యూ చెప్పలేదా? వై.ఎస్. జలయజ్ఞాన్ని తెలుగుదేశీయులు ఒక చెంప అడ్డంగా తిట్టిపోస్తూండగానే వారి పార్టీ పెద్దాయన అదే జల యజ్ఞంతో భారీ కాంట్రాక్టు కొట్టెయ్యలేదా? ఎమార్ గోల్‌మాల్‌పై నారా బాబూజీ అలుపెరగని పోరాటం సాగిస్తూండగానే ఆయన కుటుంబీకులకు అదే ఎమార్ దందాలో కారు చౌకగా స్థలం దక్కిన వైనం ఎవరికి తెలియదు? ఆ మాటకొస్తే అందులో అందినకాడికి ప్లాట్లు నొక్కెయ్యకుండా ఏ పార్టీవాళ్లు మడికట్టుకు కూచున్నారు?

ప్రభుత్వం రెక్కలు విరచడానికి ఏకధాటిగా సకల జనుల సమ్మె చేపట్టి అందులో భాగంగా బడులూ, కాలేజీలూ వారాలతరబడి బందు చేయంచి, సామాన్య విద్యార్థుల చదువులు పాడుచేసినవారు తమ బిడ్డలను మాత్రం తాము ద్వేషించే సీమాంధ్రలోని విద్యాసంస్థల్లో ముందే జాగ్రత్తపడి చేర్పించలేదా? మిగతా విద్యాసంస్థలను తెరవబోతే రాళ్లేయంచి నానా ఆగం చేసిన వాళ్లు తమ ఇంటి చిన్నారులు చదివే ఖరీదైన కార్పొరేట్ చదువుల దుకాణాలపై మాత్రం దాడి జరగకుండా చూసుకోలేదా? సమ్మె కట్టించి సకల జనులను నానా బాధలకు గురిచేసిన నేతాశ్రీలు సమ్మె కారణంగా తాము నష్టపోయన దాఖలాలున్నాయా? రాజకీయ నాయకులు పొద్దునే్న వచ్చి కాసేపు మొగం చూపించి, మళ్లీ ఎవరి కాంట్రాక్టులను వాళ్లు, ఎవరి వ్యాపారాలు వాళ్లు చూసుకుంటున్నారని తెలంగాణ ఉద్యోగుల నాయకుడే కుండబద్దలు కొట్టలేదా? ఆంధ్రోళ్ల పేరు చెబితే భగ్గుమనే తెలంగాణ హేమాహేమీల్లో ఎంతమంది ఆంధ్రా పెట్టుబడిదారులతో కుమ్మక్కయ నదీనదాల్లో అక్రమంగా ఇసుక తోడేస్తూ, కొండలు, గుట్టలు ముక్కలు చేస్తూ తెలంగాణ రుణం ఎంత బాగా తీర్చుకోవటం లేదు?

ఇలా చెబుతూపోతే ఎందరో మహానుభావులు!

- సాక్షి 

కోర్టుకు వెళతాం : విశాలాంధ్ర మహాసభ





పౌర హక్కులను కాపాడండి

ప్రెస్ నోట్

మేము తలపెట్టిన మీడియా వర్క్ షాప్ & ఎగ్జిబిషన్ ను అకారణంగా ప్రభుత్వం నిషేధించడాన్ని 'విశాలాంధ్ర మహాసభ' తీవ్రంగా ఖండిస్తోంది.

శాంతియుతంగా, ప్రజాస్వామ్య బద్ధంగా మా అభిప్రాయాలను వ్యక్తపరచుకొనే హక్కును ప్రభుత్వం హరించడం విషాదకరం.

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం మా ధ్యేయం. మా ధ్యేయాన్ని, మా ఆలోచనలను వ్యక్తపరచుకొనే హక్కును పోలీసు, ప్రభుత్వ వ్యవస్థ నిషేధించడాన్ని పౌరహక్కులను కాపాడేందుకు కృషి చేస్తున్న అన్ని సంస్థలు, ప్రజాస్వామ్యకవాదులు ముక్తకంఠంతో ఖండించాలని 'విశాలాంధ్ర మహాసభ' కోరుతుంది.

-విశాలాంధ్ర మహాసభ

21, అక్టోబర్ 2011, శుక్రవారం

క్షమించాలి!


పోలీసులు ఆఖరి నిమిషంలో పర్మిషన్ ఇవ్వడం లేదు అని చెప్పడం మూలంగా రేపటినుండి తలపెట్టిన మీడియా వర్క్ షాప్ మరియు ఎగ్జిబిషన్ వాయిదా వేయవలసివచ్చింది.తదుపరి కార్యక్రమ వివరాలు తెలియజేయడం జరుగుతుంది.

-విశాలాంధ్ర మహాసభ




'రాష్ట్ర సమైక్యతను కాపాడుదాం'


18, అక్టోబర్ 2011, మంగళవారం

రాష్ట్ర సమైక్యతను కాపాడుదాం : విశాలాంధ్ర మహాసభ


మిత్రులారా,


‘విశాలాంధ్ర మహాసభ’ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమైక్యతను కాపాడడం కోసం కృషి చేస్తున్న సంస్థ. రాజకీయాలకు అతీతమైనది. ‘విశాలాంధ్ర మహాసభ’ తెలంగాణ, కోస్తా మరియు రాయలసీమ ప్రాంతాలకు చెందిన మేధావులు, నిపుణులు, విద్యావేత్తలు మరియు సమాజశ్రేయస్సు కోసం కృషి చేస్తున్న అనేకమంది వ్యక్తులు కలిసి స్థాపించిన సంస్థ.
మనరాష్ట్రంలో జరుగుతున్న వేర్పాటువాద ఆందోళన, హింస మరియు విధ్వంసక చర్యలను ప్రోత్సహిస్తూ, తెలంగాణ ప్రజలు అన్యాయానికి గురైయ్యారన్న అసత్య ఆరోపణల ఆధారంగా సాగుతున్నది. విభజనవాదులు అబద్ధాలను నిజాలుగా చిత్రీకరిస్తున్నారు. వాస్తవాలను వక్రీకరిస్తున్నారు.మా ఉద్దేశంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరుగుతున్న ఆందోళన పూర్తిగా అసమంజసమైనది.
ఈ సందర్భంలో, విశాలాంధ్ర మహాసభ రాష్ట్ర సమైక్యతను కాపాడుదాంఅనే అంశం పై మీడియా వర్క్ షాప్ మరియు ఎగ్జిబిషన్ నిర్వహించతలపెట్టింది. మన రాష్ట్రానికి సంబంధించిన సామాజిక, ఆర్ధిక, రాజకీయ, సాంస్కృతిక మరియు చారిత్రక నిజాలను మీడియా వర్క్ షాప్ మరియు ఎగ్జిబిషన్ ద్వారా ప్రజల ముందుకు తేవడం యీ ప్రయత్నం యొక్క ముఖ్య ఉద్దేశం.
వేర్పాటువాద ఆందోళన ప్రచారం చేస్తున్న నిందలు,అవాస్తవాలు,వక్రీకరణలు, అసత్యాలను ఖండించి నిజానిజాలను తెలిసుకోవడంలో మా యీ ప్రయత్నం సహాయపడుతుందని ఆశిస్తున్నాము.
వర్క్ షాప్ 1:
అక్టోబర్ 22nd 11.00 AM – 1.00 PM
వర్క్ షాప్ 2:
అక్టోబర్ 23rd 2.00 PM – 4.00 PM
   ఎగ్జిబిషన్
   అక్టోబర్ 22nd 1.00 PM- 4.00 PM
   
అక్టోబర్ 23rd 11.00 AM - 4.00 PM

    
వేదిక: జూబిలీ హాల్, పబ్లిక్ గార్డెన్స్,
                
నాంపల్లి, హైదరాబాద్.



ఇట్లు ,
నలమోతు చక్రవర్తి

16, అక్టోబర్ 2011, ఆదివారం

... మాటలకు అర్థాలే వేరులే

‎"An RTC bus burns at Tarnaka in Hyderabad"- The Hindu 
ఆంధ్రజ్యోతి సంపాదకపేజీ : ఉద్యమ సందర్భాల్లో ముందుగా బలయ్యేది భాష. పదాలకు అర్థాలు మారిపోతాయి. అవాస్తవాలు నిజాలవుతాయి. భావాలకు నిర్వచనాలు పునర్లిఖించబడతాయి. ఈ భావగందరగోళంలో కొట్టుకుపోతూ నిజమేమిటో, అబద్ధమేమిటో, వాస్తవమేదో, కల్పితమేదో అర్థం చేసుకోలేని అస్పష్టతకు గురవుతాం. ప్రాథమికంగా అహేతుకాలైన గుంపు, తెగ, వర్గ మనస్తత్వాలు, అస్తిత్వాల ఆధ్వర్యంలో జరిగే ఉద్యమాల్లో ఈ ధోరణులు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఏ ఉద్యమంలోనైనా మీడియా తటస్థంగా ఉండదు. ఏదో ఒక వైపు వాదాన్ని భుజానేసుకుంటుంది.

కాబట్టి మీడియాలో వచ్చే ప్రతి సమాచారాన్ని, కథనాన్ని స్వయంగా ఆలోచించాకే దాన్ని పూర్తిగానో, పాక్షికంగానో నమ్మాలో వద్దో నిర్ణయించుకోవాల్సిన బాధ్యత పాఠకులది, వీక్షకులదీ. ఉద్యమ నిఘంటువుల ప్రకారం జాగో, భాగో అన్నది బెదిరింపు కాదట. కేవలం ప్రాంతీయ నుడికారమట. సెలవులకు ఇంటికెళ్తున్న వాళ్ళను పూటల తరబడి నడిరోడ్డు మీద నిలిపివేయడం శాంతియుత ఉద్యమమని సెలవిస్తారు. రోడ్డు పొడవునా బస్సులు, కార్లపైన రాళ్ళేసి అద్దాలన్నీ పగలగొట్టడం కూడా 'శాంతియుత'మేనట.

మతి కోల్పోయి, గతి తప్పిన కొందరు యువకులు చేసిన తొందరపాటు పనులను తప్పు అని ఖండించాల్సింది పోయి, అది మఫ్టీలో ఉన్న పోలీసుల పని అని గౌరవ ప్రొఫెసర్లు వ్యాఖ్యానించడం వాస్తవాలను ఏమేరకు వక్రీకరిస్తున్నారో సూచిస్తుంది. రైళ్ళు నడవకుండా ఆపడం శాంతియుతమైన ఉద్యమమట. అది ఉద్యమకారుల హక్కట. సమ్మె విరమించిన ఆర్టీసీ కార్మికులు బస్సులు నడపడం కవ్వింపు చర్యట. కాబట్టి వాటిని ధ్వంసం చెయ్యడం సబబేనట. రైళ్లు, బస్సుల్లో ప్రయాణించదలచిన వ్యక్తుల హక్కుల మాటేమిటి? మన పిచ్చిగానీ, వ్యక్తులకు హక్కులెక్కడేడ్చాయి? హక్కులు కేవలం గుంపులు, మూకలకు మాత్రమే ఉంటాయి!!

ఈ స్వభావం, ఇలా వాదించే విధానం ప్రస్తుతం నడుస్తున్న ఉద్యమం ఒక్కదానికే పరిమితం కాదు. మూకహక్కుల కోసం చేసే ఉద్యమంలోనైనా ఈ లక్షణాలను చూస్తాం. మూకకు ప్రాతిపదిక ప్రాంతం కావచ్చు, కులం, ఉపకులం, మతం, వర్గం - ఏదైనా కానీయండి, కాలరాయబడేవి మాత్రం వ్యక్తి హక్కులే. బడులు, కాలేజీలు బలవంతాన, బెదిరింపులతో మూసేయిస్తారు. ఇదేమి అన్యాయమని ప్రశ్నించినవాళ్ళను ఉద్యమ విచ్ఛిన్నకారులని నిందిస్తారు. రెచ్చగొట్టవద్దని హెచ్చరిస్తారు.

మనిషి మౌనంగా ఏడవడం తప్ప చేయగలిగిందేమీ లేదు. ఈ అసమానతల నుండి మనిషిని కాపాడ్డానికి, మనిషి హక్కలను రక్షించడానికి బోలెడు పన్నులు కట్టి ఏర్పరుచుకున్న ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్టు? శూన్యం. అసలీ మూకలను పెంచిపోషించేది ప్రభుత్వాలే. ప్రజలను పలువర్గాలు, తెగలు, ప్రాంతాలు, కులమతాలుగా విడగొట్టి, రాజకీయ అవసరాల మేరకు ఒకరిమీద ఒకరిని ఎగదోసి పబ్బం గడుపుకున్న వాళ్ళు ఏ మొహం పెట్టుకుని ఈ అరాచకాన్ని ఆపగలరు?

మిశ్రమ ఆర్థిక వ్యవస్థ రకరకాల గుంపులను తయారు చేస్తుంది. పన్నుల ద్వారా వసూలు చేసిన అపారమైన డబ్బును కొన్ని గుంపులకు ఎక్కువ మొత్తంలో వెదజల్లి, లేదా వెదజల్లుతామని హామీలిచ్చి, ఓట్లేయించికుని, అధికారం హస్తగతం చేసుకుంటారు. కొన్నిరోజుల తర్వాత ఇతర గుంపుల్లో అసహనం, వ్యతిరేకత మొదలవుతుంది. వారిని సంతుష్టులను చెయ్యడానికి కొన్ని ఎంగిలి మెతుకులు విదిలిస్తారు.

ఎన్ని పాట్లు పడినప్పటికీ అన్ని గుంపులను, గుంపుల్లోని అందరినీ తృప్తిపరచడం ఏ పార్టీ, ఏ ప్రభుత్వం వల్లా కాదు. అందుకే అప్పుడప్పుడు ప్రభుత్వాలు, పాలకులు మారుతుంటారు. కానీ గుంపుల మధ్య రగిల్చిన అసూయలు, కక్షలు అలాగే ఉండిపోతాయి. మందబలంతో ప్రభుత్వాన్ని ఉపయోగించుకుని ఎక్కువ లబ్ధి ఎలా పొందాలా అన్న కొట్లాటలే తప్ప, వ్యక్తుల మధ్య ఏ గొడవలూ ఉండవు. ఈ రకమైన ఉద్యమాల్లో అంశాలు, డిమాండ్లు, కోపాలు, అసూయలు, ద్వేషాలు ప్రభుత్వ పెత్తనంలో నడిచే విషయాల చుట్టూనే తిరుగుతుంటాయి.

ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వం చేసిన భూపందేరాలు, మంత్రి పదవులు, అడ్వకేట్ జనరల్ నియామకాలు, ప్రాజెక్టులు, కాంట్రాక్టులు, నువ్వెంత తిన్నావు, నాకెంత పెట్టావు - ఉద్యమాలన్నీ ఈ విషయాల చుట్టే పరిభ్రమిస్తాయి. ప్రైవేటు రంగంలో ఇవేవీ కానరావు. కానీ ఒకసారి ఉద్యమం మొదలయ్యాక అసహాయ స్థితిలో ఉండే ప్రైవేటురంగం మీదే పడతారు, పడ్డారు కూడా. నిధుల సమీకరణకు పాడి ఆవులాంటి ప్రైవేటురంగం సిద్ధంగా కనబడింది. ప్రతి ఉద్యమకారుడు ఈ పాడి ఆవును ఒట్టిపోయే దాకా పిండుకునే వేరే.

ఈ విపరీత ధోరణులు ఈ ఒక్క ఉద్యమానికే పరిమితం కావు, మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. ఈ ఉద్యమాన్ని ఎవరు, ఎందుకు, ఎప్పుడు, ఎలా మొదలెట్టారో, కాలక్రమేణా ప్రజలను ఎంత తప్పుదారి పట్టించి విద్వేషాల్ని రగిల్చారో కాస్త తెలివున్న వారందరికీ తెలుసు. ఎవరికి వారు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఎలా పరితపిస్తున్నారో స్పష్టంగా కనబడుతూనే ఉంది. చివరికి ఎలాంటి ముగింపు వచ్చినా, జనబాహుళ్యానికి ఒనగూడేదేమీలేదని ఉద్యమ నాయకులు, మేధావులు, మీడియాలతో సహా అందరికీ తెలుసు. కానీ ఎవరూ నోరు విప్పి నిజం పలికే స్థితిలో లేరు. తమ వ్యక్తిగత జీవితాల్లోని కష్టాలకు, అనిశ్చితులకు ఎవరు కారణమో, ఎవర్ని నిందించాలో తెలియని అమాయక జనం ఒకరిని ఒకరు వేలెత్తి చూపుకుని ఆత్మ సంతృప్తి పొందుతున్నారు.

లక్షల్లో ఉద్యోగాలు సృష్టిస్తామంటున్న నాయకుల మాటలకు గొర్రెల్లా తలూపుతున్నారు. ప్రస్తుతం జనాభాలో ఒకటి, రెండు శాతం ఉన్న ప్రభుత్వోద్యోగుల జీతభత్యాలకే వేల కోట్లు పన్నులుగా కడుతున్నాం. ఇంకొన్ని వేలకోట్లు లంచాలుగా సమర్పించుకుంటున్నాం. ఇది చాలదన్నట్టు మరో ఒకటి, రెండు శాతం ప్రభుత్వోద్యోగాలు సృష్టిస్తే, వాళ్ళ జీతాలు మనమే కదా చెల్లించాల్సింది? మనమెడకు మనమే ఉరేసుకుందామా? ఆ ముగ్గురు, నలుగురిని మేపడానికి తొంభై ఆరు మంది కష్టపడి, సంపాదించి, పన్నులు కట్టాలి. ఎక్కువ మంది ప్రజలు ఆ తొంభై ఆరుమందిలోనే ఉంటారు కదా! అయినా ఆ ఉద్యోగాలన్నీ తమకో, తమ పిల్లలకో మాత్రమే వచ్చిపడతాయన్న పిచ్చి ఆశలతో ఉద్యమం పేరిట శివాలెత్తుతున్నారు. ప్రభుత్వాల నిష్కృయాపరత్వంతో సమాజం గూండాల జాగీరుగా మారింది.

అబద్ధపు ప్రచారాలతో, వాస్తవాల వక్రీకరణలతో మొగుణ్ణి కొట్టి మొగసాల కెక్కడమే మేధావి తనంగా చెల్లుబాటవుతోంది. ఇటువంటి మూక, మూఢ వాదనల ప్రాతిపదికగా విభజనలు జరిగితే నాజీ ఊచకోతలను తప్పించుకోగలరా? ఆ అరాచకాన్ని ఆపే నైతికస్థాయి ఏ నేతలకైనా ఉందా? అది వ్యక్తుల హననానికి, సమాజ పతనానికి దారితీయడం ఖాయం. సామాజిక, భౌగోళిక, ఉపప్రాంతీయ, కుల, ఉపకుల, మత ప్రాతిపదికలపై మరిన్ని కొత్త మూకలు, ఉద్యమాలు, సెంటిమెంట్లు, ఆత్మగౌరవాలు, అల్లర్లు తప్పవు.

ఈ పరిస్థితుల్లో వ్యక్తులకు దారేది? అరాచక పరిస్థితుల్లో తమను తాము రక్షించుకునే మార్గమేది? స్వీయ రక్షణ కోసం ఆయుధాలు ధరించడం, ఉపయోగించడం వ్యక్తుల ప్రాథమిక హక్కు. 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత భారతీయుల్ని క్రమంగా నిరాయుధుల్ని చేయడం కోసం తెచ్చిన చట్టాల వల్లే ప్రతిమనిషీ స్వీయ రక్షణ కోసం ప్రభుత్వాన్ని దేచిరించాల్సి వస్తోంది. స్వాతంత్రోద్యమ సమయంలో, ముఖ్యంగా జలియన్ వాలాబాగ్ మారణకాండ తర్వాత ఇంకాస్త కఠినంగా అమలు చేసిన ఆయుధ చట్టాలను గాంధీజీ కూడా వ్యతిరేకించారు.

భారత ప్రజల్ని నపుంసకులుగా చేస్తున్నారని దుయ్యబట్టారు. కానీ స్వాతంత్య్రం వచ్చాక నల్లదొరలు ఆ చట్టాలను ఇంకా కఠినతరం చేసి, వ్యక్తిగత రక్షణ కోసం పూర్తిగా ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడేలా చేశారు. దాని ఫలితమే నేటి అభద్రతా పరిస్థితులు. ప్రతి మూకా వ్యక్తుల్ని నిర్భయంగా బెదిరించగలుగుతోంది. తనను తాను రక్షించుకోలేని మనిషి స్వేచ్ఛాజీవి కాదు, బానిస మాత్రమే. ఓట్ల కోసం మూకలను తయారుచేసి వాళ్ళు కొట్టుకుచస్తుంటే గుడ్లప్పగించి చూస్తూ, ఏం చేస్తే ఎన్ని ఓట్లు పోతాయోనని లెక్కేసుకునే ప్రభుత్వాల మీద ఆధారపడడం బుద్ధిహీనత అవుతుంది. ఎవరి స్వీయ రక్షణ వారే చూసుకోవాల్సిన సమయం వచ్చింది. ఆ హక్కు ఎవరూ కాదనలేనిది.

- జాహ్నవి 
https://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2011/oct/16/edit/16edit3&more=2011/oct/16/edit/editpagemain1&date=10/16/2011