24, మే 2012, గురువారం

నీటిపారుదల రంగంలో తెలంగాణ వివక్షకు గురయ్యిందా?






Our case for a united state - అభివృద్ధి సూచికలలో తెలంగాణ తీసిపోయిందా?

'విశాలాంధ్ర మహాసభ' ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సమైక్యతను పరిరక్షించడానికి పాటుపడుతున్న సంస్థ, స్వలాభాపేక్ష లేని  కొంతమంది  వ్యక్తుల సమూహం.'రాష్ట్ర సమైక్యతను కాపాడుదాం' అనే అంశం పై 'విశాలాంధ్ర మహాసభ' ఇప్పటికే ఢిల్లీ, హైదరాబాద్, విజయవాడ, తిరుపతిలలో మీడియా వర్క్ షాప్  మరియు  ప్రదర్శనలను ఏర్పాటు చేసింది. అంతే కాక పుస్తకప్రచురణ, ప్రసార మాధ్యమాల ద్వారా మా వాదనను అందరికి వినిపించే ప్రయత్నం చేస్తున్నాము. అన్ని అడ్డంకులను అధిగమించి, వేర్పాటువాదుల అసత్య ప్రచారాలను ఎండగట్టి, రాష్ట్రసమైక్యతను కాపాడవలసిన అవసరం గురించి అన్ని ప్రాంతాల ప్రజలకు తెలియచెప్పాలనేదే మా సంకల్పం. అంతర్జాలంలో కూడా మా వాదనను పది మందికీ తెలియజేయాలనే ఉద్దేశంతో మా ప్రదర్శనల్లోని కొన్ని చార్టుల సారాంశాన్ని పోస్ట్ చేయతలపెట్టినాము.

నలమోతు చక్రవర్తి
అధ్యక్షుడు, విశాలాంధ్ర మహాసభ


ముందుగా ముఖ్యమైన ఆర్ధిక,సామాజిక సూచికలను చూద్దాం


29, ఏప్రిల్ 2012, ఆదివారం

ఉక్రోషాలు వద్దు!ఉభయతారక పరిష్కారం రాబోతుంది!

ఆంధ్రప్రభ వ్యాసం: అడపా దడపా అన్య విషయాలపై కూడా రాస్తున్నా, ఈ శీర్షిక కింద గత అయిదారేళ్లుగా వారం వారం ప్రచురితమవుతున్న నా వ్యాసాల్లో ప్రతిబింబించిన అంతస్సూత్రం, ఒకవేళ ఈ రాష్ట్ర విభజన జరిగితే, యావత్‌ప్రపంచంలోని తెలుగు ప్రజలందరికీ, ఇప్పటికే సగం చచ్చి ఉన్న తెలుగు భాషకి అలాగే యావద్భారత దేశ సమైక్యతకు తీరని నష్టం వాటిల్లుతుందన్నది మాత్రమే! ఈ చేదు ఆవేదనకి అప్పుడప్పుడు సభ్యత వీడని వ్యంగ్యం, అపహాస్యం దరిచేరని హాస్యం రంగరించడం తప్పనుకోవడం లేదు. ఈ వ్యాస పరంపరలో'విడిపోతే నష్టమెవరికి' అన్న శీర్షికన 4-4-12న ప్రచురితమైన వ్యాసంలోని అంశాలకు మళ్లీ ఉక్రోషం వచ్చిన చొల్లేటి శ్రీశైలం గుప్త -అదుపు చేసుకోలేని ఆగ్రహంతో రాసిన 'విడిపోతే లాభమెవరికి' అన్న వ్యాసానికి (18-4-12న) తగువిధంగా ప్రతిస్పందించడం, నా పవిత్ర పాత్రికేయ బాధ్యతగా అంగీకరిస్తున్నాను. అలానే, తన వ్యాసంలో వారు నాపై చేసిన ఆరోపణలకి (నిజానికి దూషణ లనాలి!) గతంలో లానే చొల్లేటికి స్వభాషీయునిగా గౌరవాభిమానాలు ప్రకటిస్తూనే, స్వీయ నిర్దేశిత సంయమనా ప్రమాణాలకి లోబడి తగు వివరణ లీయడం నా వ్యక్తిగత హక్కుగా కూడా భావిస్తున్నాను. అయితే స్థలాభావం దృష్ట్యాను, గతంలోనే పలుమార్లు ఆధారాలు, గణాంకాల సహితంగా తగు సమాధానాలిచ్చి ఉన్నందున, వాటిని మళ్లీ వివరంగా చెప్పాల్సిన అవసరం లేదనే చర్చా సూత్రాన్ని కూడా పాటిస్తూ, నా జవాబుని క్లుప్తీకరిస్తున్న విషయం గ్రహించాలని ప్రార్థన -(నిజానికి చొల్లేటి వారి తాజా వ్యాసం ఇప్పటికే అభూత కల్పనలు, కల్పిత గణాంకాలు, అపోహలుగా నిరూపితమైన తేలిపోయిన అపస్వరాలతో కూడిన పాతపాట మాత్రమే).

ముందుగా తన వ్యాసారంభంలోనే చొల్లేటి పట్టలేని ఉక్రోషంతో మూడు వ్యక్తిగత ఆరోపణలు (దూషణలు) చేశారు. నా వ్యాసాలలో తెలంగాణ ప్రాంతంపై అక్కసుతో అక్కరకురాని 'ప్రేలాపనలు' చేస్తున్నానని (2) సీమాంధ్ర పక్షపాతినని (3) ప్రత్యేక రాష్ట్ర వాదం సాధించిన అఖండ విజయాలను చూసి బెంబేలెత్తిపోయి సమైక్యవాదాన్ని వదిలేస్తూ ఒక్కో మెట్టు దిగుతున్నానని. ఈ అసత్యారోపణలకు చొల్లేటి కోసమేకాదు... అన్ని ప్రాంతాల తెలుగు ప్రజలకోసం సమాధానమీయాలనుకుంటున్నాను. నా వ్యాసాలలో నేను పదే పదే సహేతుకంగా ప్రస్తావించిన అంశం, తెలుగు జాతి, భాష  తెలంగాణాగా నేడు వ్యవహరింపబడుతున్న ఈ ప్రాంతంలోనే ఆవిర్భవించి కాలక్రమేణా నదీ నదాల ప్రవాహాల వెంబడి ఇతర ప్రాంతాలకు విస్తరించిందని, ఆ విధంగా నేడు సీమాంధ్రులుగా పిలువబడుతున్న వాళ్లకి మూలపురుషులు తెలంగాణీయులేనన్నది -నన్నయ నుండి నారాయణరెడ్డి వరకు పోతన వేమనాది సాహితీమూర్తులంతా ప్రాంతాలకు అతీతంగా మనకు ఆరాధనీయులని ఎన్నోసార్లు పేర్కొన్నాను. అంతేకాదు విభజనవాదం ఏ ప్రాంతంలో తలెత్తినా కాలకూట విషమని, ఆ ప్రాంతానికి ప్రజలకి కూడా చాలా చేటు చేస్తుందని, అన్ని ప్రాంతాలలోని విభజన వాదాన్ని సమంగా నిష్పక్షపాతంగా నిష్కర్షగా విమర్శించడం జరిగింది. విభజన వాదాన్నే గానీ, ఏ ప్రాంతపు ప్రజల్నీ కించపరచలేదు.

బహుశా, మనోళ్లు ఎలానూ సాధించలేరు కనీసం అక్కడోళ్లైనా విభజన కోసం ఉద్యమిస్తే బాగుంటుందనే దింపుడు కళ్లాం ఆశతో ఉన్న చొల్లేటి లాంటి వారికి ఈ ధోరణి నచ్చడం లేదు. పైగా ఉక్రోషాన్ని రేపుతోందని అనుకుని ఊరుకుందాం.

సకల జనుల సమ్మె అఖండ విజయం సాధించిందన్న చొల్లేటి వారి ప్రగల్భం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. తమకు సకల సంకేతాలు ప్రసాదించిన ఆ సమ్మె(ట) దెబ్బకి విలవిల లాడిపోయింది -ప్రధానంగా తెలంగాణ ప్రజలే! పొరుగు రాష్ట్రాల ప్రజల్లోను, ఆ మాటకొస్తే యావద్భారత దేశ ప్రజల్లో అత్యధిక సంఖ్యాకుల్లో ప్రత్యేక తెలంగాణ వాదం పట్ల దేశం ఏమైపోయినా సరే 'మాది మాగ్గావాలే' అంటున్న విభజన వాదుల ప్రజాప్రతినిధుల మొండి చర్యల మూలంగా, చాలా వైముఖ్యం ఏర్పడిందన్నది వాస్తవం. మరి ఆ అఖండ విజయాన్ని గ్రహించి బెంబేలెత్తిపోయి ఒక్కో మెట్టు దిగుతున్నది కెసిఆర్‌ తో సహా విభజనవాదులే గానీ నాలాంటి రాజకీయేతర సమైక్యతావాదులు కాదని చొల్లేటి గ్రహిస్తే బాగుంటుంది. వారు గ్రహించితీరాల్సిన మరో ముఖ్యమైన అంశం విభజన కనుకూలంగా తనతో సహా కొందరు చెప్పే పరిపాలనా సౌలభ్యం -చిన్న రాష్ట్రాలు, పాత సంస్థానాల పునరుద్ధరణ సంస్కృతులలో స్వల్ప వ్యత్యాసాలు... ఇలాంటి ఏ ఒక్క కారణాన్ని వర్తింపజేసినా ఈ దేశాన్ని వందలాది రాష్ట్రాలుగా చీల్చాల్సివస్తుంది. తెలంగాణని కూడా ఎన్నో చిన్న చిట్టి రాష్ట్రాలుగా చీల్చాల్సివస్తుంది!

చొల్లేటి వారి పాత పాట లోని మరికొన్ని అపస్వరాలని కూడా క్లుప్తంగా పరిశీలిద్దాం. ఈ ప్రాంతాన్ని ఆ ప్రాంతం వాళ్లు జల దోపిడీ చేశారన్నారు (అందుకు కారణం ఈ ప్రాంతపు నేతల నిర్వాకం అని కూడా అన్నారనుకోండి!) విలీనం తర్వాత 1956 నుండి 2007 వరకు, ప్రణాళికా సంఘం యొక్క అధికారిక గణాంకాల ప్రకారం కోస్తాలో నీటి పారుదల కింద అదనంగా వచ్చిన భూమివృద్ధి శాతం 57, రాయలసీమలో 44 శాతం ఉంటే తెలంగాణాలో 91 శాతం ఉంది. వ్యవసాయ ఉత్పత్తుల పరిమాణాల్లో వృద్ధి కోస్తాలో 107 శాతం, రాయలసీమలో 15 శాతం ఉండేది. తెలంగాణలో 244 శాతం ఉంది. అలాగే పరిశ్రమల పురోగతి, ఉపాధి కల్పన, విద్యావ్యాప్తి సగటు ఆదాయం ఇలా ఏ పెరామీటరు (అభీష్ట పరిమాణం)లో చూసినా తెలంగాణాలో విలీనం తర్వాత బహుముఖీన అభివృద్ధి జరిగి ఉన్నది వాస్తవం. ఇది గ్రహించే కెసిఆర్‌తో సహా విభజనవాదులు వెనకబాటు తనం అన్న ప్రాతిపదికను ఎప్పుడో వదిలేశారు. చొల్లేటి వారే ఇంకా పట్టుకుని వేలాడుతున్నారు. వారు గ్రహించాల్సిన మరో అంశం. గోదావరి, కృష్ణా నదులు మన రాష్ట్రంలోని ఏ ఒక్క ప్రాంతానికో సొంతం కాదు. అవి అంతర్‌ రాష్ట్ర నదులు. ఇప్పటికే దిగువనున్న మన రాష్ట్రానికి అన్యాయం జరుగుతోంది. మన అనైక్యత దాన్ని ఇంకా పెంపొందిస్తుంది. మనలో మనం తగు విధంగా జలపంపిణీ న్యాయంగా చేసుకోవాలి. వరదలతో నష్టపోయే దిగువ రాష్ట్రంగా మన హక్కుల్ని ఐక్యంగా సాధించుకోవాలి. ఆఖర్లో ఒకమాట - భద్రాచలం మాత్రమే కాదు.. రాయలసీమ, కోస్తాంధ్రలు కూడా నైజాం తన స్వార్థ ప్రయోజనాలకోసం ఆంగ్లేయులకి ధారాదత్తం చేసే వరకు కలిసే ఉన్నాయి కదా. మరి కెసిఆర్‌ ఇతరులు రహస్యంగా రాజీపడుతున్న విధంగా 1956 అక్టోబర్‌ 31 నాటి సరిహద్దుల రాష్ట్రం కోరుకోవడమెందుకు? ఏది ఏమైనా, ఉద్యమం పేరుతో తెలుగు వైతాళికుల విగ్రహాలను విధ్వంసం చేయడాన్ని, ఉద్యమం ముసుగులో కుటుంబ ఆస్తుల్ని పెంచుకుంటున్నవారిని ఖండించలేకపోతున్న చొల్లేటి వారి నిస్సహాయతకు నా సానుభూతి ప్రకటిస్తూ ముగిస్తున్నా.

-చేగొండి రామజోగయ్య,
విశ్రాంత బ్యాంకు అధికారి, విశాలాంధ్రమహాసభ సభ్యులు

21, ఏప్రిల్ 2012, శనివారం

శభాష్‌ కవితమ్మా!

ఆంధ్రప్రభ వ్యాసం : సహజ ప్రవృత్తి, సంస్కారాలకి విరుద్ధంగా ఎవరైనా సరే తాత్కాలికంగా తప్పనిసరి పరిస్థితుల్లో తప్పుడు కార్యక్రమాల్లో పాలుపంచుకున్నా, నెమ్మదిగా వాటి నుంచి వైదొలగుతూ, క్రమంగా (ఒక్కసారిగా సాధ్యం కాదు కదా!) మంచి కార్యక్రమాలకు మరలుతూంటే ఆ పరివర్తనా పరిణామాన్ని ప్రోత్సహించాలి, హర్షించాలి. శభాష్‌ అనాలి. అందుకే, పోయినవారంలో, తనలోని పరివర్తనా క్రమానికి నాందిగా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాసనసభ ఆవరణలో మాత్రమే కాదు, భారతదేశంలోని అన్ని చట్టసభల ప్రాంగణాల్లో కూడా, మనరాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ విగ్రహాల్ని సత్వరం నెలకొల్పాలన్న ఒక సముచిత డిమాండ్‌తో ఏకంగా 48 గంటల నిరాహారదీక్ష చేసిన కల్వకుంట్ల కవితమ్మను అభినందించాలి. శభాష్‌ తల్లీ అనాలని అనిపించింది.

రాజకీయ (కొండొకచో ఆర్థికం కూడా!) వారసత్వాల్ని గాఢంగా కోరుకునే కుమార్తెలు పుట్టింటి ఇంటిపేరుతో చలామణి కావడం మనదేశంలో కొత్త కాదు. తప్పు అసలే కాదు! కాబట్టి మన తెలుగింటి ఆడపడుచు, కవిత వివాహానంతర రికార్డుల్లో సర్టిఫికెట్లతో అమెరికా వీసా పత్రాలలో ఇంకా ఇతర అపార ఆస్తుల పత్రాల్లో ఏ ఇంటిపేరు నమోదై ఉందో మనకనవసరం! ఆ రమణి కల్వకుంట్ల వంశంలో జన్మించిన ఒక మహోజ్వలమణి! అగధా సంగ్మా, సుప్రియా సూలె, ప్రియాదత్‌, కనిమొళి (వారందరూ ఇప్పటికే ఎంపిలు) వంటి దేశంలోని ఇతర మహిళా నేతల సరసన ఉండాల్సిన అర్హతలున్న గొప్పమహిళ. ఈమెకు కూడా వారికి లభించినంత పితృవాత్సల్యం, వారసత్వ బలం లభించడం ఒక నేతగా వెలిగేందుకు కొంతవరుకు తోడ్పడిన మాట వాస్తవమే కావచ్చు. అయితే జయలలిత, మమత, మాయావతిల స్థాయి స్వీయప్రతిభ చొరవ, చతురత తనకున్నాయని కవితమ్మ నిరూపించుకున్నారని మర్చిపోరాదు. అంతేకాదు, సహజ వాగ్ధాటి, వాదనా పటిమ, నాయకత్వ లక్షణాలు, శ్రమించేతత్వం, సొంత అనుచరణగణాల్ని ఏర్పరచుకునే నైపుణ్యం, తగు సమయం సందర్భం కోసం ఎదురు చూసే ఓర్మి కవితను ఇప్పటికే మన రాష్ట్రంలో ఒక అగ్రశ్రేణి అసామాన్య నేతగా నిలిపాయనడంలో అతిశయోక్తి లేదు. ఆమాటకొస్తే ఃనాన్న, అన్న కన్న మిన్నః అనిపించుకుని వారికీ సంతుష్టి, సంతోషాల్ని కలగజేస్తూండడం సామాన్యమైన విషయం కాదు. కవితే ఒకసారి చెప్పేరు, బాల్యంలో ఆదర్శనగర్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో నివాస కాలంలో ఉన్నత విద్యాభ్యాస సమయంలో తాను అమెరికాలో ఉన్నట్లు, తనకు అన్ని ప్రాంతాల, వర్గాల తెలుగు ప్రజలతో సన్నిహిత సంబంధాలేర్పడ్డాయని, అవి ఇప్పటికీ చక్కగా కొనసాగుతున్నాయని. ఇకపోతే ప్రస్తావిత దీక్షా విరమణ సమయంలో కవిత, ఇతర ప్రాంతాల ప్రజల నుంచి తన కార్యక్రమానికి అపారంగా లభించిన ఆదరణకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో తాను జాతీయ స్థాయి సమస్యలపై పోరాటాలు చేస్తానని కూడా ప్రతిజ్ఞ చేశారు. ఉదాహరణకి జాతీయ ఉపాధి పథకంలో పనిదినాల్ని, వేతనాల్ని బాగా పెంచాలని దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తానని అన్నారు. ఇకముందు తన కార్యకలాపాలు ఏదో ఒక ఉపప్రాంతానికి మాత్రమే పరిమితం చేయబోనని చెప్పకనే చెప్పారు. ఇదంతా ఒక సత్పరిణామక్రమాన్ని స్పష్టంగా సూచిస్తోందని అర్థం చేసుకోకపోతే అది మన తప్పే అవుతుంది. అన్ని ప్రాంతాల ప్రజల సమస్యలపై పోరాడతానంటే స్వాగతించక పోవడం మూర్ఖత్వం అవుతుంది. నిజానికి ముందే చెప్పినట్లు కవిత సహజ ప్రవృత్తి, సంస్కారం రీత్యా విభజన వాది కాదు.

అరాచకవాది అసలే కాదు. అయినా ఆమె తన విశాల భావాల నుంచి తాత్కాలికంగా నైనా మరలడం తెలుగు ప్రజల దురదృష్టమనుకుందాం. నాన్న వద్దన్నప్పటికీ అమెరికాలో సుఖజీవనాన్ని వదలుకుని, తనకు తానే నిర్ణయించుకుని హైదరాబాద్‌కు తిరిగొచ్చేసి, ప్రజాక్షేత్రంలోకి దూకేశానని తనే చాలాసార్లు చెప్పారు. కాబట్టి ఆయన్ని నిందించడం తగదు. కానైతే, ఆమె తనకు ఏ రాజకీయ పరమైన ఆకాంక్షలు లేవని, కేవలం తెలంగాణ ప్రజల సాంస్కృతికోద్ధరణకు మాత్రమే పాటు పడతానని కూడా ఎన్నోమార్లు వక్కాణించారు. (ఇప్పటికీ తనకు తెరాసతో సంబంధం లేదని కూడా చెబుతుంటారు.) కానీ ప్రస్తుతం చేసేవన్నీ రాజకీయ కార్యక్రమాలే! మొదట్లో, అంటే అమెరికా నుంచి తిరిగొచ్చేసిన కొత్తలో ఎంతో శ్రమించి మెదక్‌ జిల్లాలో ఇటీవల బయల్పడిన కొన్ని ప్రాచీన తెలుగు శాసనాల గురించి, ఉమ్మడి తెలుగు భాష విశిష్టత గురించి ప్రచారం చేశారు. తనే స్వయంప్రకటిత అధ్యక్షురాలిగా తెలంగాణ జాగృతి సంస్థను స్థాపించి, దాన్ని అనతికాలంలో బాగా విస్తరించేరు. బతుకమ్మ పండుగ వైశిష్ట్యాన్ని ఊరూవాడా తిరిగి ప్రచారం చేశారు. కనిమొళినీ తీసుకోచ్చేరు. ఉప ఎన్నికలు వచ్చినప్పుడల్లా తండ్రి తరఫున ఎన్నికల ప్రచారాన్ని సమర్థవంతంగా, ఫలవంతంగా నిర్వహించిన ఘనత సాధించడంతో తృప్తి పడలేదు. పలు రాజకీయ కార్యక్రమాల్లో సంసారాన్ని కూడా విస్మరించి పాల్గొంటూ వచ్చారు. దూరదృష్టితో తన సొంత సంస్థ -జాగృతిని ప్రణాళికా బద్ధంగా ఈ ప్రాంతమంతటా విస్తరించారు, పార్టీకి సమాంతరంగా జాగృతికిప్పుడు రాజధానిలో మాత్రమే కాదు, పలు పట్టణాలలో కార్యాలయాలు, వనరులు, నిధులతోబాటు మంచి కార్యకర్తల పటాలాలు ఏర్పడ్డాయి. ఆ విధంగా నాన్న, అన్నల కన్న కొన్ని విషయాలలో నైనా మిన్న అని నిరూపించుకున్నారన్నమాటే కదా!

ఃఅదుర్సు రభసః ఇంటర్‌ విద్యార్థుల పరీక్షా పత్రాలు ప్రాంతీయ మూల్యాంకనం, సినిమా షూటింగులకు ఆటంకాలు ఇటువంటి కొన్ని కార్యక్రమాలు మరీ ఃదూకుడుఃగా నిర్వహించి కొంత అప్రదిష్టని మూటకట్టుకున్నారని, ఉద్యమపరంగా కొన్ని చాలా లాభదాయకమైన చందాల దందాల ముడుపుల విభాగాల్ని సొంతం చేసుకున్నారని, ఇలాంటి కొన్ని విమర్శలు కవితమ్మపై విభజనవాద వర్గాల నుంచే వచ్చేయి. ఇంకా వస్తున్నాయి ఈ విమర్శల్లోని నిజానిజాల సంగతెలా ఉన్నా ఒకటిమాత్రం నిజంగా నిజం. తెరాస పార్టీ పరంగా జరిగిన అన్ని ఉద్యమ కార్యకలాపాల్లోనూ ప్రజలకు ఏర్పడిన విలాపాల్లోను) కవితమ్మ పాత్ర చాలా ఎక్కువగా ఉంటూ వచ్చింది. వంటావార్పూ కానీండి, రైల్‌రోకో, లేదా సకల జనుల సమ్మె కానీండి ఇతర పార్టీ నేతల కన్న, ఆ మాటకొస్తే నాన్న, అన్నల కన్న మిన్నగా ప్రజాక్షేత్రంలోకి ప్రత్యక్షంగా దూసుకుపోయేరు. పోరాట పట్టాలపై కూర్చున్నారు. ఎక్కువ రాజకీయ చతురత చూపారు. ఆవిధంగా అందరికన్న అధికంగా దృశ్యతః (విజిబిలిటీ) సాధించారు.

ఇతర ప్రాంతాల ప్రజలనూ ఆకట్టుకున్నారనే చెప్పాలి. ఇంతటి అసామాన్య ప్రతిభగల ఒక తెలుగు యువతి జాతీయ స్థాయి రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటే దానికి నాందిగా వచ్చే ఎన్నికలలో నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి ఎన్నికలలో పోటీ చేయాలనుకుంటే అది మనం హర్షించదగిన విషయమే. వచ్చే ఎన్నికల నాటికి దొరవారికే నియోజకవర్గాన్ని మార్చవలసిన అవసరమేర్పడి తానే నిజామాబాద్‌కే తరలిపోదామనుకుంటే చెప్పలేం గానీ, కుమార్తె ముచ్చట తీర్చడానికే ఆయన మొగ్గు చూపవచ్చు. లేదా కరుణానిధి కనిమొళికి ప్రసాదించినట్లు రాజ్యసభకి పంపించే అవకాశం ఎలానూ ఉంటుంది. ఏమైనా మన కవితమ్మ త్వరలో ఎంపీ కావడం, తర్వాత కేంద్రంలో మంత్రి పదవిని పొందడం దాదాపు ఖాయం, కాదంటే ఆమె భర్తకి, అన్నకి రాష్ట్రంలోనే వేరే పదవుల్ని చూడాల్సి ఉంటుంది దొరవారికి. తనది జాతీయ స్థాయి అన్న ఆత్మ విశ్వాసం ఉన్నందువల్ల, ఎలానూ అంతిమంగా విభజనేతర పరిష్కారమే రానున్నదన్న విజ్ఞత, అవగాహన ఉన్నందువల్లనే కల్వకుంట్ల కవితమ్మ తన పంథాని క్రమంగా మార్చుకుంటున్నారని, విస్తరించుకుంటున్నారని అర్థమవుతూనే ఉంది. మన తెలుగింటి ఆడపడుచుకి అభినందనలు చెబుదాం. శభాష్‌ కవితమ్మా! అందాం.

( దీనిని వ్యంగ్యం అనుకునేరు సుమా!)

-చేగొండి రామజోగయ్య,
విశ్రాంత బ్యాంకు అధికారి, విశాలాంధ్ర మహాసభ సభ్యులు 

19, ఏప్రిల్ 2012, గురువారం

విశాలాంధ్రమహాసభ ఆధ్వర్యంలో ‘తెలంగాణలో విశాలాంధ్రోద్యమం’ పుస్తకావిష్కరణ

Eenadu 18/04/2012

విశాలాంధ్ర దినపత్రిక : ‘తెలంగాణలో విశాలాంధ్రోద్యమం” పుస్తకావిష్కరణ సభ మంగళవారం నగరంలో జరిగింది. తెలంగాణలో జరిగిన ఉద్యమ ఘట్టాలు, విశాలాంధ్ర దినపత్రికతో పాటు వివిధ పత్రికల్లో ప్రచురించిన వార్తలు, కథనాలతో కూడిన విశాలాంధ్ర మహాసభ ముద్రించిన పుస్తకాన్ని స్వాతంత్య్ర సరమయోధులు నర్రా మాధవరావు ఆవిష్కరించారు. సభకు విశ్రాంత ఐపిఎస్‌ అధికారి సి. ఆంజనేయరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సంద ర్భంగా మాధవరావు మాట్లాడుతూ, దేశంలో భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ, కమ్యూనిస్టులు గతంలో తీర్మానం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. విశాలాంధ్ర నుంచి తెలంగాణను వీడదీయవద్దని కోరారు. తెలుగు మాట్లాడే ప్రజలంతా ఒకే రాష్ట్రంగా ఉండాలని కోరుతూ ఆనాడు పెద్ద ఎత్తున పోరాటాలు చేశామని ఆయన చెప్పారు. విశాలాంధ్ర మహాసభ ప్రధానకార్యదర్శి పరకాల ప్రభాకర్‌ మాట్లాడుతూ, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో పోరాటాలు సాగాయని, అనంతరం ఆంధ్ర మహాసభ విశాలాంధ్రగా మారింద న్నారు. స్వాతంత్య్ర సమ యోధుడు మహబూబ్‌ అలీ మాట్లా డుతూ, విశాలాంధ్రలో ప్రజారాజ్యం కోసం కమ్యూనిస్టులు పోరాటాలు జరిపా రని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్న మాటల్లో నిజం లేదని అభిప్రాయపడ్డారు. విశా లాంధ్ర మహాసభ అధ్యక్షులు ఎన్‌. చక్రవర్తి, నాయకులు వి.లక్ష్మణరెడ్డి చేగొండి రామజోగయ్య పాల్గొన్నారు.


 

Download E-Book here తెలంగాణలో విశాలాంధ్రోద్యమం

15, ఏప్రిల్ 2012, ఆదివారం

"తెలంగాణలో విశాలాంధ్రోద్యమం" - పుస్తకావిష్కరణ సభ



"విశాలాంధ్ర మహాసభ" 17.04.2012 మంగళవారం ఉదయం 11.00 నుండి మధ్యాహ్నం 1.00 వరకు, హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఆవరణలో పుస్తకావిష్కరణ సభ నిర్వహించనున్నది. విభజనవాదులు గత కొంతకాలంగా, ఏకపక్షంగా దుష్ప్రచారం  చేస్తున్న చారిత్రక అసత్యాలను, సాంస్కృతిక వక్రీకరణలను ఖండించి, నిజానిజాలను, ప్రతివాదాన్ని తగు ఆధారాలతో సహా ప్రజల ముందుంచే ప్రయత్నంలో భాగంగా ఈ పుస్తకం సంకలనం కాబడింది. పుస్తకావిష్కరణ సభలో తెలంగాణ ప్రాంతానికి చెందిన స్వాతంత్య్రసమరయోధులు, నాటి విశాలాంధ్రోద్యమ భాగస్వామ్యులు  శ్రీ నర్రా మాధవరావు మరియు శ్రీమతి శాఖమూరి సుగుణమ్మ పాల్గొంటారు. "విశాలాంధ్ర మహాసభ" సంస్థ తరపున శ్రీయుతులు సి.ఆంజనేయరెడ్డి, పరకాల ప్రభాకర్, చేగొండి రామజోగయ్య, కుమార్ యాదవ్ చౌదరి, సుంకర వెంకటేశ్వరరావు, వి. లక్ష్మణరెడ్డి, కె.శ్రీనివాసరెడ్డి ప్రభ్రుతులు పాల్గొంటారు.


 నలమోతు చక్రవర్తి
అధ్యక్షుడు
విశాలాంధ్ర మహాసభ 

Visalandhra.org : ‘Telanganalo Visalandhrodyamam’ – Book Release Function

Date: Tuesday, April 17th 2012

Time: 11.00 AM

Venue: Somajiguda Press Club, Hyderabad


Andhra Pradesh was the first linguistic State that came into existence after India achieved independence. The State came into being as a result of collective sacrifices made by scores of our venerable leaders such as Amarajeevi Potti Sriramulu, Burgula Ramakrishna Rao, Konda Venkatapayya, Tanguturi Prakasam Pantulu, Suravaram Patap Reddy, Andhra Pitamaha Madapati Hanumanth Rao, Ravi Narayan Reddy, Ayyadevara Kaleswar Rao and many more.

When the dream of a Telugu State was close to fruition, Nehru criticized Telugu’s desire for a linguistic state as bearing a “tint of imperialist expansionism”. A few opportunistic politicians of that era saw an opening to further their feudal politics. They have brought up the demand for a separate Telangana state that will be carved out of erstwhile Nizam ruled Hyderabad State. However, the demand which lacked intellectual honesty, never gained traction.

Right from 1950s, the history of separatist movement is littered with half-truths and falsehoods. Also, ironically almost all the separatist leaders were once integrationists. Some of the prominent flip-floppers are the most respected leaders of the current separatist movement. For example, Konda Laxman Bapuji, the man that was in the forefront of the 1969 separatist movement was originally a staunch integrationist. K.V. Ranga Reddy, Marri Chenna Reddy as well as the current separatist movement leader K. Chandra Shekhar Rao also once strongly stood for integration. There are leaders from Kosta and Rayalaseema who were once integrationists that turned separatists. Former Deputy C.M. B.V. Subbar Reddy and Kakani Venkatratnam fall into that category. This goes on to show the opportunistic nature of the separatist leaders across all regions of the State.

The research material unearthed by Visalandhra Mahasabha shows how the separatist leaders have changed colors and misled people over the past few decades with their false propaganda. Our team came up with an intelligent way of showcasing the hypocrisy of the separatist leaders. They extracted newspaper clips starting from 1950’s as well as quotes of the prominent separatist leaders from the Assembly proceedings. As a result, readers are presented with the original content from the last sixty years, that will take them by surprise.
This book will be an eye opener for anyone that was led to believe that Andhra Pradesh State came into existence against the wishes of people of Nizam Telangana state. VMS offers ample evidence to prove that there was a groundswell support for a united Telugu State across Nizam Telangana, Coastal Andhra, and Rayalaseema in 1950s.

As the separatists make an attempt to revive their movement by feeding false information to the young minds, this book will provide a perspective that is badly needed in the countering the divisive propaganda.

After the book is released, a link to the soft copy of the book will be posted on this website.
I request you to join us and show your solidarity for a United Andhra Pradesh State.

Nalamotu Chakravarthy


11, ఏప్రిల్ 2012, బుధవారం

వన విహారమూ నేరమేనా?!

ఆంధ్రప్రభ వ్యాసం : ఎంత అన్యాయం! మాట్లాడితే విమర్శలు! మౌనం వహిస్తే కూడా విమర్శల జడివాన! ఇవన్నీ ఓపిగ్గా దిగమింగుకుంటున్న దొరవారికి ఈ వారం ఇంకోసారి ఎదురవుతున్న విడ్డూరమైన విమర్శ. వారు సన్నిహిత కుటుంబీకులతో కలిసి మెదక్‌ జిల్లా జగదేవ్‌పూర్‌ శివారులో, సొంత వ్యవసాయ క్షేత్రంలోని విలాస గృహంలో కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని, మీడియాకి దూరంగా దాదాపు అజ్ఞాతంలో ఉండాలన్న వ్యక్తిగత నిర్ణయం తీసుకోవడం! మరీ ఇంగితం లేకుండా చేస్తున్న విమర్శలేమంటే (1) తెలంగాణలో మళ్ళీ కొన్ని బలిదానాలు జరుగుతుంటే వారినేం పట్టించుకోకుండా సొంత తోటలో (కోటలో) తొంగోటమేంటి? (2) సొంత జిల్లాలో మతఘర్షణలు చెలరేగితే వాటిని అరికట్టడానికి ఒక నేతగా తమరికేబాధ్యతా లేదా? (3) అసలు ఇంత విలాసవంతమైన వ్యవసాయ క్షేత్రం, ఇంకా అపారమైన కుటుంబ ఆస్తులు ఎలా వచ్చాయి? (4) ఫాంహౌజ్‌ నుంచే కాంగ్రెస్‌ హైకమాండర్లతో రహస్య సంప్రదింపులు జరుగుతూ ఉంటాయని అంతిమంగా విభజనేతర పరిష్కారానికి క్రమంగా ఒప్పుకోవడానికి రాజకీయ ఆర్థిక కుటుంబ రక్షణ ప్యాకేజీ ఇప్పటి నిర్ణయమై పోయిందన్న లీకేజీ గుసగుసల్లో పసలేకపోలేదూ? (5) కేవలం కుమారుడు కుమార్తెలకు తప్ప, కనీసం, విజయశాంతి, హరీష్‌, వినోద్‌ వంటి వారికి కానీ, పార్టీలోని జిల్లా ప్రముఖులకు కానీ ఎందుకు 'ప్రవేశం' ఉండదు? ఇవండీ ఇప్పుడు వెల్లువెత్తుతున్న ప్రశ్నలు-

వ్యంగ్యం అనుకున్నా, నమ్మలేకపోయినా, ఏమీ చేయలేను కానీ ఆయన విశాల దేశ ప్రయోజనాల కోసం అంతిమంగా ఏదో ఒక విభజనేతర పరిష్కారాన్ని సాధించడానికి తోడ్పడతారని, ఆ క్రమంలో త్వరలో సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బృహత్తర బాధ్యతను స్వీకరించడానికి భయపడరన్న విశ్వాసం ఈ వ్యాసకర్తకుంది -అందుకేపైన పేర్కొన్న విడ్డూరమైన విమర్శలకు విలోమ క్రమంలో, దేశ కాలమాన పరిస్థితుల కనుగుణమైన సమాధానాలిచ్చే ప్రయత్నం చేద్దామనుకుంటున్నాను -తమకు తామే వివరణలు, సంజాయిషీలిచ్చుకోవడం దొరలకు నామోషీ కదా?

(1) ఆయన నెహ్రూ జీ అంతటి ప్రజాకర్షక నేత. పండిట్‌ జీకి కూడా అప్పుడప్పుడు కుమార్తె ఇందిరతో కలిసి కొంతకాలం ప్రశాంతంగా ఏదో ఒక ప్రాంతంలో రాజకీయాలకు దూరంగా ఉండి, విశ్రాంతి తీసుకునే అలవాటుండేది -ప్రపంచాధినేతలలో కూడా చాలామంది ఈ పనే చేస్తుంటారు -మరి పన్నెండేళ్లుగా అవిశ్రాంత పోరాటం చేస్తున్న (అంతిమ ధ్యేయం ఏమిటన్నది వదిలేయండి!) నిన్నా మొన్న సహజ అభీష్టానికి వ్యతిరేకంగా పార్లమెంటుకి హాజరై ఏకంగా ముచ్చటగా మూడురోజులు పరిమిత లొల్లి చేసి, బాగా అలసిపోయిన అధినేత కొంత విశ్రాంతి కోరుకోవడం తప్పా? దానికి సొంత తోటని, కోటని ఎంచుకోవడం దొరవారి దోషమా? సన్నిహిత బంధువుల కన్న పార్టీ శ్రేణులకన్న సంతానానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం భారతదేశ రాజకీయ నాయకులందరిలో ఉన్న గుణం -అయినా రాజ్‌ఠాక్రే వంటి మేనల్లుణ్ణి మరీ నెత్తికెక్కించుకోకూడదు. విజయశాంతి వంటి విలక్షణ, చంచల స్వభావురాలినీ అంతే! (2) ఫాంహౌజ్‌ నుంచే కాంగ్రెస్‌ హైకమాండర్లతో సంప్రదింపులు జరుగుతాయని ఆరోపిస్తున్న వారి ఉద్దేశమేంటి? అటువంటి జాతీయ ప్రాముఖ్యం కల అంశాల్ని ఆంతరంగికంగా రహస్యంగా కాకుండా, బహిరంగంగా, అబిడ్స్‌ ప్రధాన తంతి తపాలా కార్యాలయానికొచ్చి పబ్లిక్‌ బూత్‌ నుంచి బిగ్గరగా మాట్లాడాలా? (3) ఇన్ని విలాసవంతమైన వ్యవసాయ క్షేత్రాలు, అపార కుటుంబ ఆస్తులు, నౌకావ్యాపారాలు సొంత మీడియా ఎలా వచ్చేయని ప్రశ్నించే వాళ్లకి దేశ కాల మాన పరిస్థితులపై ఏమాత్రం అవగాహన లేదని అనుకోవాలి.

ఈ దేశంలో ఒక్క టర్మ్‌ సర్పంచిగా పనిచేసిన వాడే ఎంత సంపాదిస్తున్నాడు? పలుదఫాలు ఎమ్మెల్యేగా, ఎంపిగా, కొంతకాలం రాష్ట్రంలో, కేంద్రంలో మంత్రిగా, గత పుష్కరకాలంగా ఒక మహోద్యమ నేతగా వెలిగిన ఒక మహానేతను మీ వర్తమాన కుటుంబ ఆస్తుల విలువెంతో చెప్పమని అడగడం భావ్యంకాదు. ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు కాకపోతే ఆ విషయం ఎప్పటికైనా బయటపడుతుంది. ఇప్పుడా శషభిషలనవసరం! (4) మొదటి రెండవ విమర్శలు కూడా అన్యాయమే -తెలంగాణలో బలిదానాలు, సొంత జిల్లాలో మతఘర్షణలు జరుగుతున్నప్పుడు తోటలో తొంగొటమేమిటనే వాళ్లకు, ఈ పరిణామాలు కలుగజేసిన ఆవేదనని మరిచిపోవడానికే, తన అసంతృప్తిని వెలిగక్కడానికే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఆవేదనల్ని మర్చిపోవడానికి ఎవరి వ్యక్తిగత అలవాట్లు వాళ్లకుంటాయి! ఆఖర్లో స్థలాభావం దృష్ట్యా దొరవారికి క్లుప్తంగా కొన్ని విజ్ఞప్తులు:

-(1) పచ్చని వ్యవసాయ క్షేత్రాల్ని అభివృద్ధి పరచడాన్ని డబ్బు రంగు మార్చే ప్రక్రియగా విమర్శించే వాళ్లని పట్టించుకోవద్దు -అది ప్రకృతి పరిరక్షణ కోసం ఏమాత్రం సొమ్ము ఉన్నవాళ్లైనా చేయాల్సిన సత్కార్యం -(2) ప్రపంచంలో ఇప్పటికే నెలకొని ఉన్న క్లిష్టమైన సమస్య నీటికరవు -మీ వ్యవసాయ క్షేత్రాల్లో ప్రారంభించిన బిందుసేద్య ప్రయోగాలు కొనసాగించండి (3) మీ విశాల దృక్పథానికి అనుగుణంగా మీ క్షేత్రాల్లో నూజివీడు మామిడి చెట్లు, మహబూబ్‌నగర్‌ ఫలవృక్షాలు, టెక్కలి టేకు చెట్లు, కోనసీమ కొబ్బరి చెట్లు, అదిలాబాద్‌ అరటి, జామ రకాలు, గుంటూరు మిర్చి, నెల్లూరు నేరేళ్లు ఇంకా తూర్పు గోదావరి జిల్లా కడియం నర్సరీల చామంతి, గులాబీ, మల్లెల అంటులు, అన్నీ పెంచండి -అన్నట్టు ఆనపకాయ అన్నా సరే సొరకాయ అన్నా సరే, ఆ పాదులతో పాటు అన్ని కూరగాయలు, ఆకుకూరలు పండించండి -దొరవారికి దండాలతో ఉంటాను మరి.
-చేగొండి రామజోగయ్య,
విశ్రాంత బ్యాంకు అధికారి, విశాలాంధ్ర మహాసభ సభ్యులు  

6, ఏప్రిల్ 2012, శుక్రవారం

విడిపోతే నష్టమెవరికి ?

ఆంధ్రప్రభ వ్యాసం: ఆలస్యంగానైనా, నిజాలు తెలిస్తే అదిన్నూ పన్నెండేళ్లుగా, పుట్టెడు పచ్చి అబద్ధాల్ని గుక్కతిప్పుకోకుండా చెబుతూ వచ్చిన వారి పరంగానే జరిగితే తెలంగాణ ప్రజలు సంతోషిస్తారు. ఇన్నాళ్లుగా అన్నేసి అబద్ధాలతో, సాంస్కృతిక చారిత్రక వక్రీకరణలతో మభ్యపెట్టి, మోసం చేసినందుకు కాస్తో కూస్తో కోపం రాకపోదు కానీ, ఇప్పటికైనా నిజాలు కక్కేరు, వినాశనాన్ని, మనకి అప్రతిష్ఠని నివారించారులే అనే ఆనందంలో అది మరుగున పడిపోతుంది! అయినా పరివర్తనని, పశ్చాత్తాపాన్ని, అంతిమంగా నిజాల ఒప్పుకోలుని సహృదయంతో స్వాగతించే సుగుణం తెలంగాణ ప్రజలకి ఉండదేమోనని అనుమానించడం సరైంది కాదు. కాబట్టి ఇన్నేళ్లుగా 'గోబెల్స్‌' మాదిరిగా ప్రతివాదం వినిపించనీయని, హింసాయుత ధోరణులనాశ్రయించి, ప్రయోగించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రవాదం పేరిట, ఏకపక్షంగా ప్రచారం చేసిన అసత్యాలు, అభూతకల్పనలు, చారిత్రక, సాంస్కృతిక వక్రీకరణలు, తప్పుడు గణాంకాలు, తమ దుష్ప్రభావాన్ని చాలావరకు కోల్పోయిన ఈ తరుణంలో, విభజనవాద వక్రచక్రాల మాయారథసారథి, ఆయన కుటుంబీకులు, అనుంగు అనుయాయులు, ఇతర విభజన వాదులందరూ తెలంగాణ ప్రజల ముందుకొచ్చి, నిజాయితీగా, పశ్చాత్తాప పూర్వకంగా ఒప్పుకోవాల్సిన నిజాల్ని, అంశాల్ని చర్చించుకుందాం. ఎంతైనా 'మనోళ్లే' కదా అన్న అభిమానంతో ఇటువంటి పశ్చాత్తాప ప్రకటన నిజాల ఒప్పుకోలు క్రమంలో, మరీ ప్రమాదం జరగకుండా ఉండడానికి పాటించాల్సిన కొన్ని కిటుకుల్ని లేదా జాగ్రత్తల్ని కూడా సూచించుదాం. విభజన వాద సెల్‌టవర్‌ శిఖరాగ్రం నుంచి తమ అనివార్య అవరోహణా క్రమాన్ని, మెట్టుమెట్టుగా దిగే రీతిలోనే జరపాలి గానీ, ఒక్కసారిగా పైనుంచి సమైక్యంగా నేలపైకి దూకేయరాదని, దొరవారితో సహా, ప్రత్యేక రాష్ట్రవాదులుగా ప్రస్తుతానికి చలామణి అవుతున్న వాళ్లందరికీ తెలుసు! 'మాది మాగ్గావాలె' అని అరవడం మానకుండానే, ఏదోటి తేల్చండి అని సన్నాయి నొక్కులూ మంద్రస్వరంలో ఆలపిస్తున్నారందుకే?

ఏమైనా ఇప్పటికే అధినేతతో సహా, వీర విభజనవాదులందరూ తాము గతంలో పదే పదే వల్లె వేసిన వితండ వాదాంశాలెన్నింటినో, వెనకబాటుతనం, ఒప్పందాల ఉల్లంఘనలు, నీళ్లు, ఉపాధి అవకాశాల దోపిడీ, చిన్న రాష్ట్రాల ఏర్పాటు ఆవశ్యకత, వంటివాటిని తమకు తామే పరిత్యజించేశారు, అవన్నీ అసమంజసమైనవిగా, నిర్ద్వంద్వంగా నిరూపితమైనందువల్ల ఇకపోతే మనజాతి, సంస్కృతి, రీతి వేషభాషలు, ఆఖరికి దేవుళ్లు, దేవతలు కూడా లేరన్నది పిచ్చివాదనగా తేలిపోయిందనీ గ్రహించేరు! రాష్ట్రానికి దేశానికి ఏం నష్టం జరిగినా మాకనవసరం, మాది మాగ్గావాలె అంతే, అనడం మొత్తం దేశ ప్రజలలో అత్యధిక సంఖ్యాకులు ఏమాత్రం నచ్చడం లేదన్నదీ తెలుసుకున్నారు. 2009, డిసెంబర్‌ 9న చిదంబరం చేసిన ప్రకటన అమలు చేస్తే బాగుంటుందంటూనే, పోనీ ఏదోటి తేల్చండి అనీ అంటున్నారు. దీని భావమేమి తిరుమలేశ?! రాకపోతే పోనీలే, ఇవ్వలేకపోతే సరేలే, మా రాజకీయ మెడలకే ఉచ్చు చుట్టుకోకుండా ప్రజలకేం చెప్పుకోవాలన్నదే మన ఘనత వహించిన ప్రజా ప్రతినిధులు ఎదుర్కొంటున్న సమస్య ఈ నేపథ్యంలో వాళ్లు పాటించాల్సిన అవరోహణా క్రమవ్యూహం ఎలా ఉంటే బాగుంటుందో, రాజకీయ అట్టుని ఎలా తిరగేయాలో సూచించుదాం పాపం!

మేమైతే ఇప్పటికీ విభజన భక్తులమే! పదవులపై మోజులేని త్యాగరాజులమే (!?) కానీ విభజన జరిగితే, సంభవించే కష్టనష్టాల్ని మీకు, అంటే మా ప్రియమైన తెలంగాణ ప్రజలకు ముందుగా చెప్పడం మా పవిత్ర కర్తవ్యంగా భావిస్తున్నాం. ఇలాంటి ఉపోద్ఘాత సన్నాయి నొక్కులతో ప్రారంభించి, ఇంకా ఏం చెప్పాలంటే (1) మనం ముందుగా భారతీయులం, తర్వాతనే తెలంగాణీయులం, దేశ ప్రజలలో అత్యధిక సంఖ్యాకులు మన కోరికకు ప్రతికూలంగా ఉన్నారు. ఇక్కడిస్తే అది అన్ని ఇతర రాష్ట్రాల విభజనకు దారితీస్తుందని తద్వారా ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందని అంతిమంగా దేశ సమైక్యతకే ముప్పు కలుగుతుందన్న భయాందోళనలు సర్వత్రా ఉన్నాయి. మనం మొండి పట్టుదల పట్టడం మంచిదికాదేమో, అలాంటి చెడ్డపేరు మా ప్రజలకి రావడం మాకిష్టం లేదు. అయినా మాదేముంది, మీరే సోచాయించండి? (2) అదలా ఉంచి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకి మనం చెబుతున్న ఏ ఒక్క కారణాన్ని- వెనుకబాటుతనం, చిన్న రాష్ట్రాల ఆవశ్యకత, యాస,సంస్కృతిలలో స్వల్ప భేదాలు, ఇలా ఏది వర్తింప చేసినా తెలంగాణను మరెన్నో చిట్టి రాష్ట్రాలుగా చేయవలసి వస్తుంది  (3) హైదరాబాద్‌ మన గుండెకాయ (నిజం చెప్పాలంటే ఈ నగరంలో 45 శాతం సీమాంధ్రలో మూలాలున్న వాళ్లు, 20 శాతం భాషాపరంగా మైనారిటీలు, మరో 20 శాతం మతపరంగా మైనారిటీలు ఉన్నారు. వీళ్లలో అందరూ కానీ, ఏ ఒక్కవర్గం కానీ సంఘటితమైతే మాలో ఏ ఒక్కరూ ఎన్నికలలో గెలవం. ఇతర జిల్లాల్లో కూడా కనీసం 20 శాతం తెలంగాణేతరులున్నారు. వాళ్లూ ఎన్నికల ఫలితాల్ని శాసించగలరు. కొత్త రాష్ట్రం ఏర్పడినా తెలంగాణేతరులు, హైదరాబాద్‌ని కానీ ఏ ఇతర ప్రాంతాన్ని కానీ వీడిపోరు. అలాగే మనోళ్లు కూడా ఇతర రాష్ట్రాల్లో ఉన్నారు. సోచాయించండి. (4) ఇంకో చేదు నిజం ఏమంటే హైదరాబాద్‌తో కూడిన ప్రత్యేక రాష్ట్రం వచ్చే అవకాశం లేనేలేదు. భాగ్యనగరం లేని దౌర్భాగ్యం మనకెందుకన్నా! అది మన గుండెకాయ కదా!! (5) మనకి మనమే 1954, నవంబర్‌ 1 నాటి సరిహద్దులతో కూడిన రాష్ట్రం కావాలని కమిటైపోయాం. భద్రాచలం డివిజన్‌, మునగాల పరగణా వదలుకోవాల్సిందే గదా! తిరుపతి, శ్రీశైలం వంటి ఎన్నో పుణ్యక్షేత్రాలు అటే ఉన్నాయి. భద్రాద్రి రాముణ్ణి కూడా వదలుకుందామా? (6) చిన్న రాష్ట్రం చిన్నబోతుంది. ఉన్న రాష్ట్రాన్ని ఉంచేసుకుంటే పోలా? (7) విభజన జరిగితే, సీమాంధ్రోళ్లు మహా అసాధ్యులు, నీళ్లలో, నిధుల్లో పెద్ద వాటా కొట్టేస్తారు, లాబీయింగు చేసేసి మనమే నష్టపోతాం -నీళ్లు పల్లమెరుగునన్నది తెలుసుకదా. ప్రపంచంలో ఏ నది అయినా దిగువ ప్రాంతాల్నే డెల్టాలుగా రూపొందిస్తుందని, అది ప్రకృతి సహజ సూత్రమని తెలుసుకదా. అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారం కూడా, దిగువ ప్రాంతాలకే కొన్ని ప్రత్యేక జల హక్కులుంటాయి. ఐనా మనమంతా సమష్టిగా కర్ణాటక మహారాష్ట్ర వంటి ఎగువ రాష్ట్రాల వారి జలదోపిడీని ఎదుర్కోవాలి కానీ, దిగువన స్వభాషీయులతో పోటీ తగదు. (8) ఉద్యోగాల సంగతి ఆలోచించండి. రాష్ట్రం విడిపోతే ఇక్కడి ఉద్యోగులకి ఏదో ఒక రాష్ట్రంలో సర్వీసు ఎంచుకునే హక్కు ఉంటుంది.బలవంతంగా పంపించేయడం కుదరదు. ఇక్కడ ఇళ్లు, ఆస్తులు, పిల్లల చదువులు ఉన్నవాళ్లంతా సహజంగా ఇక్కడే ఉండిపోతారు. అంటే మనకి ఎక్కువ ఉద్యోగులు అక్కడ ఖాళీలు మనకు వాళ్లు పదవీ విరమణ చేసే వరకు ఖాళీలుండవు. ఆ కొత్త రాష్ట్రంలో ఎన్నో కొత్త ఉద్యోగాలు, కొత్త రాజధాని నిర్మాణం కోసం ఎన్నో నిధులు, కొత్త పరిశ్రమలు మనకేమో నిరుద్యోగం ప్రబలడం, అభివృద్ధి మందగించడం, పరిశ్రమలు తరలిపోవడం -జర సోచాయించాల్సిన విషయాలే కదా -విడిపోదామంటారా -బాగా సోచాయించండి. మాదేముంది ప్రజల నిర్ణయమే మాకు శిరోధార్యం.

-చేగొండి రామజోగయ్య,
విశ్రాంత బ్యాంకు అధికారి, విశాలాంధ్ర మహాసభ సభ్యులు 

28, మార్చి 2012, బుధవారం

అయ్యో, అన్ని బుకాయింపులా?!

ఆంధ్రప్రభ వ్యాసం: ఈ శీర్షిక కింద 29.2.12న ప్రచురితమైన 'విభజనవాదం విషతుల్యం' అన్న నా వ్యాసానికి, నిజానికి మళ్లీ ఆగ్రహించిన చొల్లేటి శ్రీశైలం గుప్త విభజన వాదం ప్రజాస్వామ్య స్ఫూర్తి అనే (ఇది విధ్వంసంతో శాంతికి పోరాటం  అన్నట్లు లేదూ?) అనే నూరు శాతం విడ్డూరమైన మకుటంతో (21.3.12న) రాసిన వ్యాసంలో, ఎటువంటి తటపటాయింపులు లేకుండా చేసిన బుకాయింపులకు గతంలోలానే తొలుత సాటి తెలుగు వ్యక్తిగా గౌరవం ప్రకటిస్తూనే తగువిధంగా ప్రతిస్పందించడం, సరైన సమాధానాలు సహేతుకంగా ఇవ్వడం, నా పవిత్ర కర్తవ్యంగా భావిస్తున్నాను. స్వోత్కర్ష అవుతుందేమోనని, ఆ వ్యాసంలో ప్రస్తావించలేదు కానీ, దానికో నేపథ్యముంది. ఎప్పుడూ ఏ రాజకీయ పార్టీలోనూ లేని నేను, ఇటీవలి కాలంలో రాష్ట్ర సమైక్యతను పరిరక్షించే కృషిలో భాగంగా దేశ, రాష్ట్ర రాజధానుల లోను, రాష్ట్రంలోని ముఖ్య ప్రాంతాల్లోను సమైక్య సదస్సులు, నిజానిజాల ఆవిష్కరణ ప్రదర్శనలను నిర్వహించిన ఒక రాజకీయేతర సంస్థ, విశాలాంధ్ర మహాసభలో ఒక సామాన్య కార్యకర్తను. ఈ సంస్థ ఫిబ్రవరి 25న తిరుపతిలో ఒక సదస్సు నిర్వహించింది. పలువురు స్థానిక విద్యార్థులు, ప్రముఖులు పాల్గొన్న ఈ సమైక్య సదస్సులో నేను అప్పటికప్పుడు అడిగితే ఆశువున ప్రసంగించాల్సొచ్చింది. పలువురు వక్తలున్న కారణంగా కేవలం రెండు, మూడు నిమిషాలు మాత్రమే చేసిన ఆ క్లుప్త ప్రసంగంలో, తెలంగాణ ప్రాంతంలోనూ గణనీయ సంఖ్యలో ఉన్న సమైక్యవాదులు ప్రశంసార్హులని అలాగే, సీమాంధ్రలో కూడా కొద్దో గొప్పో ఉన్న విభజనవాదాన్ని కూడా తుదముట్టించాలని, సందర్భతోచితంగా సమైక్యవాద నిబద్ధతతో, పాత్రికేయ సహజమైన నిర్మొహమాటంతో చెప్పడం జరిగింది. అక్కడ క్లుప్తంగా చెప్పిన విషయాన్నే బాగా విస్తరించి వివరించి రాసిన వ్యాసం నాలుగు రోజుల తర్వాత ఈ శీర్షిక కింద ప్రచురితమైంది. విభజన వాదం విషతుల్యం అన్న మకుటంతో సీమాంధ్రలోని వేరు కుంపట్లనీ ఆర్పాలి అన్న మకుటంతో ఏ ప్రాంతంలో తలెత్తినా విభజనవాదం కాలకూట విషం లాంటిదన్న నిశ్చితాభిప్రాయాన్ని ఆ విధంగా పాఠకులతో పంచుకున్నానన్నమాట. చొల్లేటి వారికి మళ్లీ పట్టలేని కోపం వచ్చింది. ఇంకోసారి మండిపడ్డారు. గతంలో చేసిన విమర్శలనే మళ్లీ వండివార్చడం.

వారి మంటకు కారణాలు ఊహించడానికి ప్రయత్నిద్దాం. 'మనోళ్ల' అంతిమ ధ్యేయం ప్రత్యేక రాష్ట్ర సాధన మాత్రం కాదన్న నిజం ఇప్పటికైనా అర్థమైకాబోలు, లేదా వీళ్ల నిర్వాకం ఎలా ఏడ్చినా పోనీ, అక్కడి ప్రజలైనా విసిగివేసారి, మా పీకలు మేమే కోసుకుంటాంలే, విభజనకు సహకరిస్తాంలే అంటే బాగుంటుంది, నా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు వాళ్ల మూలంగానైనా సాకారమవుతుందేమోనన్న దింపుడు కళ్ళం మాదిరి పేరాశ శ్రీశైలం గుప్తకి గుప్తంగా ఉన్నందువల్ల, సీమాంధ్రలోని విభజనవాదాన్ని నా వ్యాసంలో అంత కఠినంగా విమర్శించడం నచ్చలేదని అనుకోవచ్చేమో!

చొల్లేటివారు తన తాజా వ్యాసం మకుటంలోనే విభజనం వాదం ప్రజాస్వామ్య స్ఫూర్తి అంటూ బుకాయింపు ప్రారంభించేరు. సమైక్య వాదం పలికేవారి నాలుకలు కోస్తాం, చేతులు నరికేస్తాం, ఈ ప్రాంతంలో తిరగనివ్వం వంటి బెదిరింపులతో కూడిన విభజన వాదంలో ప్రజాస్వామ్య స్ఫూర్తి కానీ, వారు ఘనంగా పేర్కొన్న భావ ప్రకటనా స్వేచ్ఛ వగైరాలు ఎంత మేరకు, ఎలా ఉన్నాయో వారే చెప్పాలి! ఇంతకీ నా ప్రస్తావిత వ్యాసంలో ఉన్న కొన్ని అంశాల్ని చొల్లేటి వారు చీల్చి చెండాడి నిందించారు కాబట్టి, వాటిని దాదాపు యధాతథంగా మరోసారి చెప్పుకోవాల్సిన అవసరమేర్పడింది. నేను రాసిందేమిటంటే 'విభజన వాదం కాలకూట విషం --ఆ విషాన్ని ఏ ప్రాంతంలో తాగినా, కాకినాడలో కాచి వడబోసి తీపి కాజాలో కలిపితిన్నా --ఏ పాత్రలో తాగినా, కొద్దిగానే రుచిచూసినా ఆ ప్రాంతానికి, ప్రజలకి మాత్రమే కాదు మొత్తం దేశానికే చేటు చేస్తుంది. ఇది చొల్లేటి వారికి రుచించకపోవడం, ఎంత నిజమైనా చేదుగా ఉందనిపించడం సహజమే! ముందే చెప్పుకున్నాం కదా, అక్కడి ప్రజలనైనా మభ్యపెడితే, రాష్ట్ర విభజన సాధ్యం కావచ్చేమోనన్న పేరాశ కొందరికి ఉందని. నిస్పృహ నుంచి ఆగ్రహం పుట్టడం కూడా అసహజం కాదు. ఆయన మండిపడి చీల్చి చెండాడిన నా వ్యాసంలోని మరో వాక్యం --'ప్రత్యేక రాష్ట్ర వాద అసత్యాల పునాదులపై చారిత్రక సాంస్కృతిక వక్రీకరణల సున్నంతో వంకర టింకర రాళ్లు కల్తీ రాజకీయ పొత్తుల ఇసుక మిశ్రమంతో నిర్మితమైన ఒక (అయో)మయ సభ' న్యాయంగా ఈ వాక్యాల్ని వ్యాసం శీర్షికరీత్యా ఇరుప్రాంతాల్లోని విభజన వాదాల్ని అభివర్ణించినట్లు లేదా సమంగా విమర్శించినట్లు అర్థం చేసుకోవాలి. అయితే చొల్లేటివారు దీన్ని నేను తెలంగాణవాదానికి మాత్రమే అన్వయించుకుంటానంటే అది వారిష్టం. (గతంలో రాసిన కొన్ని వ్యాసాల్లో ఆయనే 'తెలంగాణ వాదాన్ని' 'వేర్పాటువాదం' అంటే, 'అలా కాదు చొల్లేటి సారూ, విభజన వాదమంటే గౌరవంగా ఉంటుందని' నేనే రాయాల్సి వచ్చిందిలెండి!)

పేరు చెప్పకుండా ఫలానా వారిని శుక్రాచార్యుడన్నావు ఇంకొకరిని మయుడన్నావు. అన్న చొల్లేటి వారి ఊహాశక్తిని కించపరిచే లేదా ప్రశ్నించే సాహసం కలగడం లేదు కానీ, ఈ సందర్భంలో ఒక విషయం చెప్పాలి. దివంగత ప్రొఫెసర్‌ జయశంకర్‌ ఒక గొప్ప విద్యావేత్త చుక్కారామయ్యలా, ఉన్నత స్థానాలలో, విదేశాలలో ఎంతోమంది శిష్యులున్న గొప్ప గురువు అని గతంలో ఒక వ్యాసంలో శ్లాఘించాను. అలానే ఆర్‌.విద్యాసాగర్‌రావు, మోక్షగుండం విశ్వేశ్వరయ్యను, కె.ఎల్‌.రావు అంతటి గొప్ప ఇంజనీర్‌ అంటారు. (ఇద్దరూ సీమాంధ్రులే అంటే ఏమీ చెప్పలేను కానీ హైదరాబాద్‌కి, తెలంగాణకి సేవలందించారని గుర్తు చేయగలను) అంతేకానీ, నేను కూడా కొన్ని వ్యాసాల్లో నిన్ను చాలా పౌరుషంగా వ్యక్తిగతంగా విమర్శించాను గదా, అందుకని కెసిఆర్‌తో సమానంగా నన్ను కూడా గుర్తించమని, అడిగితే మాత్రం అంగీకరించలేను. ఆయనెక్కడ, మీరెక్కడ? అయితే జయశంకర్‌, విద్యాసాగర్‌ల మేధోసంపత్తిలో నాకు ఆవగింజంతైనా లేదంటూ చొల్లేటి వారు చెప్పిన సత్యాన్ని వినమ్రంగా అంగీకరిస్తాను.

సందర్భం ఎలానూ వచ్చింది కాబట్టి చొల్లేటి తన తాజా వ్యాసంలో చేసిన మరో బుకాయింపుని వారి మాటల్లోనే చూద్దాం. కెసిఆర్‌ తన రాజకీయ ప్రస్థానంలో ఎక్కడా, అశ్లీల పదాలు ఒక్కటికూడా ఉపయోగించలేదు అన్నారు. ఓ దేవుడా! టీవీ ప్రత్యక్ష ప్రసారాల్లో, ప్రింట్‌ మీడియాలో ఉన్న సాక్ష్యాల్ని కాదనే వారిని ఏమంటానులే గాని, నేనైతే దొరవారి దుర్భాషలను యధాతథంగా పేర్కొనే సంస్కారం లేనందువల్ల 'ల' గుణింతంలో తెలుగు ఉర్దూ మిశ్రమ తిట్లు అని రాసేవాణ్ణి. లేదా 'మై సన్స్‌' 'సన్స్‌ ఆఫ్‌ డాంకీ' అనే ఆంగ్ల పదాలకి ముతకానువాదాలు అని చెప్పేవాణ్ణి అని మాత్రం జ్ఞాపకంచేసి ఊరుకుంటాను. ఏమైనా కొందరి దుర్భాషలను 'తెలంగాణ యాస' అని సమర్థించడం ఈ ప్రాంతాన్ని అతి దారుణంగా అవమానించడమేనని గ్రహించాల్సిందిగా చొల్లేటి వారికి మనవి.

తెలంగాణ ప్రజల సంస్కారం చాలా గొప్పది. వారు తీవ్ర అభ్యంతరం చెప్పిన మరో అంశం, కర్మకాలి ఒకవేళ విభజనంటూ జరిగితే అది ఏదో దేముడి ముందు ఒడుపుగా కొట్టిన కొబ్బరికాయలా రెండు చెక్కలే అవదు బలంగా నేలకేసి కొట్టిన గాజుగ్లాసులా పలు ముక్కలవుతుందని చెప్పడం ఎవరికీ నచ్చదని నిజం చెప్పకుండా ఉండలేం కదా. విభజన వాదులు చెప్పే ఏ ఒక్క కారణం వెనకబాటుతనం, చిన్న రాష్ట్రాల్లో పరిపాలనా సౌలభ్యం, ప్రత్యేక సంస్కృతి, యాసా భేదాలు వగైరా వగైరాల్లో ఏది వర్తింపచేసినా తెలంగాణ ప్రాంతాన్నే పలు చిన్న చిట్టి రాష్ట్రాలుగా చీల్చాల్సి వస్తుందన్నది నిర్వివాదాంశం.

ఐదారు సంవత్సరాలుగా వారం వారం ఈ శీర్షిక కింద ప్రచురితమైన పలు వ్యాసాల్లో విభజన వాదంలోని అన్ని అంశాల్ని నేను సహేతుకంగా విశ్లేషణాత్మకంగా ఖండించడం దేశ సమగ్రత కోసమైనా విభజన వాదాన్ని వీడడం ఎంత అవసరమో వివరించడానికే. ఇది నిరంతరంగా జరుగుతూనే ఉంది. కాబట్టి ఈ వ్యాసంలో కొన్ని ముఖ్యాంశాల్ని మాత్రమే ప్రస్తావించడానికి పరిమితమయ్యాను. ఎన్నో బుకాయింపులను ఇంకోసారి ఖండించే అవసరం లేదని భావిస్తున్నాను. సాటి తెలుగువాడిగా చొల్లేటినే కాదు, ఇంకా విభజన వాదాన్ని వీడలేకపోతున్న సాటి తెలుగువారందరికీ కూడా మాతృభాషాభిమాన పూరిత ప్రణామాలర్పిస్తూ ఈ వ్యాసాన్ని ముగిస్తున్నాను.


-చేగొండి రామజోగయ్య,
విశ్రాంత బ్యాంకు అధికారి, విశాలాంధ్రమహాసభ సభ్యులు

7, మార్చి 2012, బుధవారం

దొరవారూ, సీమాంధ్రకు వెళ్లరూ...!

ఆంధ్ర ప్రభ వ్యాసం: పోయిన వారం వ్యాసంలో సీమాంధ్రలోని కోవూరు నియోజకవర్గం ఉప ఎన్నికలో 'తెరాస' అభ్యర్థిని నిలుపుతానని అక్కడికి రోడ్డు మార్గాన ఎన్నికల ప్రచారానికి వెళ్తానని కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు ప్రకటించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆనందించి, వారు కాని నిజంగా కాని పర్యటిస్తే సీమాంధ్ర ప్రజలు పూలమాలలతో స్వాగతించాలని, సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రవ్వాలని ఆశీర్వదించాలని క్లుప్తంగా ప్రస్తావించడం జరిగింది. అయితే, ఇదేదో ఈ వ్యాసకర్తకు కొత్తగా వచ్చిన ఆలోచన కాదని చెప్పడానికి మాత్రమే ప్రస్తావించాల్సొస్తోంది. ఇదే శీర్షిక కింద 25 నెలల క్రితమే 27.1.2010న 'కెసిఆర్‌ సీమాంధ్రలో పర్యటించాలి' అన్న మకుటంతో, ప్రచురితమైన నా వ్యాసంలో ఈ భావాన్ని వ్యక్తీకరించాను. (దీన్ని వంకర వ్యంగ్యంగా అపోహపడి కాబోలు, కొందరు 'వీర విభజనవాదులు' బెదిరింపు కాల్స్‌ చేయడం వేరే విషయం అనుకోండి!) ఇంతకీ ఈ వ్యాసం రాస్తున్న సమయానికి దొరవారి సీమాంధ్ర పర్యటన నిజంగా ఉంటుందో లేదో, కచ్చితంగా నిర్థారణ కాకపోవడం, నిరుత్సాహాన్ని కలిగిస్తున్నా, ఈ విషయం గురించి మరికొంత ఈ వారం చర్చించాలన్న కోరిక (దయ ఉంచి, దురద అనుకోవద్దు) కలిగింది.

తారక రామారావు, కవితమ్మలు నిజాల్ని నిజాయితీగా ఒప్పుకోవాలన్న (తప్పనిసరైన తరుణం వరకు ఆగా?!) నైజాన్ని పితృదేవుని నుంచి పుణికి పుచ్చుకున్నామని ఒకసారి ఉద్ఘాటించారు. అందుకు అందరూ హర్షించదగ్గ నిదర్శనాలుగా కుమారరత్నం (మొదట్లో కాదని దబాయించినా) తను గుంటూరులో విద్యాభ్యాసం చేశానని, అమెరికా నుంచి అమాంతంగా తిరిగొచ్చేసి, ఉద్యమంలో దూకేసిన పిదప కూడా, సీమాంధ్ర మిత్రులతో వ్యాపారాలు కొనసాగిస్తున్నానని ఒప్పుకున్నారు. కుమార్తె ఏమో, తనకు ఇప్పటికీ సోకాల్డ్‌ ఆంధ్రోళ్లతో, ఆమాటకొస్తే కనిమొళితో కూడా ప్రాంతేతర స్నేహ బాంధవ్యాలున్నాయని చెప్పి (వాణిజ్య సంబంధాల గురించేమీ చెప్పలేదు) ప్రచా(సా)రమాధ్యమాల సాక్షిగా తన నిజాయితీని ప్రదర్శించేరు. ఇవేమీ తప్పులు కావు గదా! కవితమ్మ ఇంకా ముందుకుపోయి, ఒక వారపత్రికలో ప్రచురితమైన ఇంటర్వ్యూలో, తన తండ్రికి, అపారంగా ధూమపానం, పరిమితంగా మద్యంసేవించే అలవాటుండేదని, ఇప్పుడు సంపూర్ణంగా మానేశారని, 'నాన్న విల్‌ పవర్‌' కిది నిదర్శనమని సగర్వంగా పేర్కొన్నారు. మానేసిన విషయాన్ని నమ్మని వాళ్లెవరైనా ఉంటే అది వాళ్ల ఖర్మ! ఏమైనా, రాబోయే రోజుల్లో ఈ సూపర్‌ అన్నా చెల్లెళ్ల ఖర్మ! ఏమైనా రాబోయే రోజుల్లో ఈ సూపర్‌ అన్నా చెల్లెళ్ల నుంచి మరికొన్ని కుటుంబపరమైన ఉద్యమ సంబంధమైన నిజా నిజాల ఆవిష్కరణ, నిజాయితీల ప్రదర్శనలను ఆశించవచ్చు. అప్పటివరకు మనం సహనం వహిస్తే బాగుంటుంది. అంతేకానీ, ఈలోగానే విపరీత ఊహలకు, అనవసరపు అపోహలకు రెక్కలు తొడగరాదు. ఇక పెద్దాయన సంగతికొస్తే, 'తెలంగాణ ఇస్తనని' సోనియా నా చెవిలో ఎప్పుడూ చెప్పలేదులే అన్న దానితో ప్రారంభించి మరెన్నో నిజాలు, మనకు 'చెప్పేసే' శుభ సమయం కోసం వేచి ఉందాంలే కానీ, ప్రస్తుతానికి ఆయన సీమాంధ్ర పర్యటన అవసరం గురించి చర్చించుకోవడానికే పరిమితమవుదాం!

దొరవారి కుటుంబ మూలాల ప్రస్తావన కాస్త పక్కన పెడదాం. అంటే బీహార్‌ టు విజయనగరం జిల్లా టు కరీంనగర్‌ జిల్లా టు, మెదక్‌ జిల్లాలో చింత మండక గ్రామం టు సిద్ధిపేట టౌన్‌ టు హైదరాబాద్‌ నగరానికి వలస ప్రస్థావనం, అలానే మెదక్‌ జిల్లాలో ఎకరాల విస్తీర్ణంలో నివాస గృహాలు, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌ వంటి ఇతర తెలంగాణ జిల్లాల్లో (ఎక్కడ పోటీ చేస్తే అక్కడ) అతిథి గృహాలు, హైదరాబాద్‌లో భవంతులు, గుజరాత్‌లో, గుర్గావ్‌లో వ్యాపారాలు, ఇలాంటి వాటి గురించి ప్రచారంలో ఉన్న ఊసులిప్పుడొద్దు, ఆయన ఒక ఉద్యమ కారుడు. ఒక గొప్ప పార్టీకి అధ్యక్షుడు. ఇంతవరకు ఎన్నికలలో అపజయం ఎదురవ్వని ప్రజాప్రతినిధి -ఇవన్నీ ఎందుకు? ఒక భారతీయపౌరుడు, ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎక్కడికైనా వెళ్లే హక్కు ఆయనకు ఉందా లేదా? 2000కి ముందు ఉన్న రాజ్యాంగమే ఇప్పుడూ ఉంది గదా! నిజానికి మంత్రిగా ఉన్నప్పుడు అరుదుగానైనా ఆయన ఆయా ప్రాంతాలకు వెళ్లేవారు. ఆంధ్రుల ఆదికవి నన్నయ నడయాడిన రాజమహేంద్రవరం వెళ్ళారు. కోటిలింగాల రేవుని చూసి తరించారు. పల్నాడులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల శిక్షణ శిబిరంలో పాఠాలు చెప్పారు. పల్నాడులో ప్రఖ్యాతి పొందిన 'నాగమ్మ' అసలు కరీంనగర్‌ నుంచి వలస వెళ్లిన భామ అన్నది ఈ సందర్భంలో గమనార్హం. ఓరుగల్లు పోతన పద్యాలే కాదు పల్నాటి శ్రీనాథుని పద్యాలు కూడా కెసిఆర్‌కి కంఠతా వచ్చు. వారిద్దరూ బావ బావమరదులని కూడా తెలుసు. సహజ వాగ్ధాటితో బాటు, మాతృభాషపై గట్టి పట్టు ఉన్న కెసిఆర్‌ని సీమాంధ్రలోని పార్టీ కార్యకర్తలు చాలా అభిమానించే వారు. విజన్‌ 2020 లో ఇంకా ఎన్నో పార్టీ పథకాల రూపకల్పనలో ఆయన పాత్ర గణనీయంగా ఉండేదని చాలామందికి తెలుసు. తెలుగు ప్రజల దురదృష్టవశాత్తు 1999లో ఆయనకి మంత్రిపదవి రాలేదు. ఆ అవమానాన్ని ఆయన జీర్ణించుకోలేక పోయారు. అంతే 2001లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ప్రారంభమైంది. సీమాంధ్ర ప్రజలకు దొరవారి దర్శన భాగ్యం బుల్లితెరకే పరిమితమై పోయింది! ఆయన పర్యటనలు లేక సీమాంధ్ర చిన్నబుచ్చుకుంటోంది, బోసి పోతోంది. ఆయన ప్రత్యక్ష దర్శనానికి ముఖం వాచి ఉంది. నిజానికి కెసిఆర్‌కి కూడా సీమాంధ్ర వెళ్లాలనే ఉంటుందనుకోవడానికి కొన్ని ఉదాహరణలు చెప్పాలి. ఉద్యమం ప్రారంభించిన తర్వాత ఒకేసారి తన ఇష్టదైవమైన వేంకటేశ్వరుని దర్శనార్థం, 2004 ఎన్నికలకు ముందు తిరుపతికి వెళ్లారు. 26 సీట్లు వచ్చాయి. 2008లో తెలుగుదేశం పార్టీలో పొత్తుకుదురిన సందర్భంలో, ఆ ఏడు విశాఖపట్నంలో జరిగిన మహానాడుకి రోడ్డు మార్గాన, మందీ మార్బలం, వాహన శ్రేణితో వెళ్తానని ఆనందంగా ప్రకటించారు. ఎందుకనో మనసు మార్చుకుని వెళ్లనేలేదు. సీమాంధ్రలో పర్యటిస్తానని 2009 ఎన్నికల సందర్భంగా కూడా మిత్రపక్షాలకు ప్రచారం చేస్తానని చెప్పారు కానీ వెళ్లలేదు. తను వెళ్లకపోయినా, కొడుకుని కూతుర్నీ పంపించక పోయినా, ఇతర తెలంగాణ వాదులను సీమాంధ్ర పర్యటనలు చేయవద్దని ఎప్పుడూ అనలేదు. వెళ్లమనే పరోక్షంగా ప్రోత్సహించేరు. వెళ్లినవాళ్లకీ ఎటువంటి ఆటంకాలు ఎదురవ్వలేదు. ఉద్యమం బహు ఉద్ధృతంగా ఉన్నప్పుడు వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గం తెరాస ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్‌ తిరుపతిలో అంగరంగ వైభోగంగా వివాహం చేసుకున్నారు. ఒక సంవత్సరం క్రితం హరీష్‌రావు శ్రీకాళహస్తిలో ఎంచక్కా రాహుకేతుపూజ చేసుకున్నారు (ఆయన రాహుకేతువులుగా పార్టీలో ఎవర్ని భావిస్తున్నారన్న విషయంలో ప్రచారంలో ఉన్న కథనాల ఊసుమనకొద్దులెండి!) తెలంగాణ వాదులుగా చలామణి అవుతున్న పలువురు గద్దర్‌ కొండాలక్ష్మణ్‌లతో సహా సీమాంధ్రలో సభలు పెట్టుకున్నారు. పోయిన శనివారం నాడు పొన్నం ప్రభాకర్‌ గుంటూరులో రాయపాటి ఇంటిని పావనం చేశారు. మధుయాష్కి గౌడ్‌ అదేరోజు (4.3.12న) గుంటూరులో ఉన్నారు. వివేక్‌ వంటి టిఎంపిలు కొందరికి సీమాంధ్రలో వ్యాపార సామ్రాజ్యాలున్నందున తరచుగా అక్కడికి వెళ్తూనే ఉంటారు. వి.హెచ్‌. విషయం వేరే చెప్పాలా? ఈ విషయాలపై కెసిఆర్‌ ఏ విధమైన విమర్శలు చేయలేదు. అభ్యంతరాలు చెప్పలేదు. ఆవిధంగా అఖిలాంధ్రపై తనకున్న ఆదరాన్ని పరోక్షంగా చాటుకుంటూనే ఉన్నారు. అర్థం చేసుకోలేకపోతే అది మన తప్పే అవుతుంది కానీ, ఆయనది కాదు. తూర్పు గోదావరి జిల్లాకి చెందిన విజయశాంతిని ఎంపిని చేశారు. పదో చెల్లిగా ప్రకటించారన్న నిజం మర్చిపోతే ఎలా?

కిరణ్‌, బాబు, చిరంజీవి, బొత్సలు తెలంగాణలో పర్యటిస్తున్నట్లే ఒక పార్టీ అధ్యక్షుడిగా కెసిఆర్‌ సీమాంధ్రలో ఎందుకు పర్యటించకూడదు? ఒబామా కెన్యా వెళ్తే ఆ దేశ ప్రజలు ఎంత ఆనందించారో, స్వాగతించారో, సీమాంధ్రులు కూడా ప్రపంచ ప్రఖ్యాతి పొందిన సాటి తెలుగువాడు, కెసిఆర్‌ని అదేవిధంగా అక్కున చేర్చుకుంటారు. అసలే తెలుగువాళ్లందరికీ 'తెగువ' ఎక్కువ. కెసిఆర్‌లో కూడా. పైగా ఆయన హనుమంతుని కన్న గొప్పవాడు. స్వీయ శక్తి సామర్థ్యాల గురించి ఎవరూ చెప్పనవసరం లేకుండానే తనకే బాగా తెలుసున్న మేధావి. అలా చేయాలనుకుంటే విడిపోతే మీకే మేలు అని చెప్పగలిగే వాక్చాతుర్యం ఉన్నదాయనకు. విభజనకు సహకరించమని అక్కడి ప్రజల్ని అభ్యర్థించి, ఇక్కడి వాళ్లకి, మనోళ్లు ఒప్పుకోవడంలేదు, ఏం చేస్తం మరి, ప్రజాస్వామ్యంలో అధిక సంఖ్యాకుల అభిమతాన్నే ఆమోదించాలి, కదా ఊర్కొందాం అని నచ్చచెప్పగలిగే తెలివితేటలు, వాక్చాతుర్యం ఆయనకున్నాయి. సరే ఇవన్నీ ఎలాగున్నా ఆయన తరచుగా చెప్పేమాట, ప్రజాక్షేత్రమంటారే, అందులోకి అడుగిడి మాటలతో దున్నేసి ఆడ కూడా విభజన విత్తులు నాటివస్తాను. ఏమో, పంట పండావచ్చు -గుర్రం ఎగరావచ్చు. 'నా ప్రయత్నాన్ని అపార్థం చేసుకోవద్దు' అని ప్రస్తుతానికి తెలంగాణ ప్రజలకు చెప్పుకోవచ్చు. కాబట్టి కెసిఆర్‌ తటపడాయించకండి. సీమాంధ్రలో త్వరగా పర్యటించండి -ఆఖర్లో కొందరి మనసుల్లో కదలాడే అనుమానాన్ని కూడా నివృత్తి చేయాలి. అక్కడికి కెసిఆర్‌ వెళ్లినప్పుడు ఒకవేళ సంస్కారం లేని మూర్ఖుడెవరైనా, 'మమ్మల్ని అలా తిట్టారు' 'ఇలా అన్నారు' అని ప్రశ్నిస్తే, 'అదేం కాదు సోదరా -తిట్టనే లేదు, మై సన్స్‌ అంటే నా పుత్రసమానులని అర్థం. అలానే సన్స్‌ ఆఫ్‌ డాంకీ అంటే నన్ను నేనే తిట్టుకున్నట్లు అని చెప్పేసి అందర్నీ నవ్వించగలిగే హాస్యసంభాషణా చతురత కెసిఆర్‌కి ఉంది. కాబట్టి ఆయన త్వరలో సీమాంధ్రలో పర్యటించి తీరాలి. తెలుగువారి చరిత్రలో ఒక మేలు మలుపుకి ఆద్యుడు కావాలి. దొరవారూ ప్లీజ్‌ వెళ్లరూ...

- చేగొండి రామజోగయ్య ,
విశ్రాంత బ్యాంకు అధికారి, విశాలాంధ్ర మహాసభ సభ్యులు

29, ఫిబ్రవరి 2012, బుధవారం

విభజన వాదం విషతుల్యం!

ఆంధ్రప్రభ వ్యాసం : మన తెలంగాణలో ఉన్నా, దేశంలో, రాష్ట్రంలో ఏ ఇతర ప్రాంతంలో ఏ రూపంలో, ఏ స్థాయిలో ఉన్నా 'విభజన వాదం' 'కాలకూట విషం' లాంటిదే! ఏ కారణం లేదా పొరపాటు చేతగాని ఎవరి ప్రోత్సాహం బలవంతం మీద సేవించినా ఈ విషం తాలూకు దుష్ప్రభావం ఒకేలా ఉంటుంది. పాత్రలు, ప్రాంతాలు, స్వార్థ రాజకీయ నేతల చేతలు, కూతలను బట్టి మారదు. ప్రమాదం తగ్గదు. అంటే ఈ విషాన్ని బంగారు పాత్రలో తాగినా, రాగిపాత్రలో తాగినా, కాకినాడలో కాచివడబోసి, తీపికాజాతో కలిపి తిన్నా, మహబూబ్‌నగర్‌లో నాగం లేక మరో ఆగం వారి మాయమాటలు బుట్టల్లోని అసత్యాల అప్పచ్చిలతో నంజుకుని మింగినా, విజయనగరం జిల్లాలో మూలాలున్న మా(మూ)టకారి దొరవారి దుర్భాషలకి విసిగివేసారి, అయిష్టంగా సేవించినా, తూర్పు గోదావరి జిల్లా యాసలో 'అరిచే కరిచే' 'రాములమ్మ'ను కాదనలేక ఆరగించినా, ప్రజా గాయకుని దరువులకు జడిసి గుటకేసినా, వయోధికుడు కొండాలక్ష్మణ్‌ వడ్డిస్తున్నాడన్న మొహమాటంతో చప్పరించినా, కొద్దిగానే రుచిచూసినా, ఆ ప్రాంతానికి, ఆ ప్రజలకి మాత్రమే కాదు, మొత్తం రాష్ట్రానికి, దేశానికి చేటు చేస్తుంది.

సరే, ఈ శీర్షిక కింద ప్రత్యేక తెలంగాణవాదంలో ఇమిడి ఉన్న డొల్లతనం, కల్లల గురించి, అది దేశ సమైక్యతకే ప్రమాదాన్ని కల్పిస్తున్న వైనం గురించి ఎప్పటికప్పుడు చర్చించుకుంటూనే ఉన్నాం. ప్రత్యేక రాష్ట్రవాదం, అసత్యాల పునాదులపై, చారిత్రక, సాంస్కృతిక వక్రీకరణల సున్నంతో, దుర్భాషల వంకరటింకర కంకరరాళ్లు, కల్తీ రాజకీయ పొత్తుల ఇసుక మిశ్రమంతో, ఒక మోసకారి మేస్త్రీ, (శుక్రాచార్య సమాన ప్రతిభావంతులైన ఒక ప్రొఫెసర్‌, ఇంజనీరు సంయుక్తంగా గీసిచ్చిన 'ప్లాన్‌' ప్రకారం) నిర్మించిన ఒక (అయో)మయసభ, అని చెప్పుకున్నాం -ఈ భవనం, వాదం పట్ల కొంతకాలం, కొందరు ఆకర్షితులైన మాట వాస్తవమే కానీ, ఇప్పుడిప్పుడే ప్రజలు, ప్రధానంగా తెలంగాణవాసుల్లోని అధిక సంఖ్యాకులు ఉద్యమకారుల అసలు రంగుల్ని, ధ్యేయాల్ని వాళ్లు తమ కుటుంబ భోషాణాల్ని నింపుకొంటున్న వైనాన్ని క్రమంగా అర్థం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, తరుణంలో తెలంగాణేతర ప్రాంతాల్లో కూడా ఇక్కడున్నంత స్థాయిలో కాకపోయినా, చాపకింది బురద నీరులా, పెరట్లో దాక్కున్న పాములా ఉన్న 'విభజనవాదం' గురించి కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. అక్కడా పొంచి ఉన్న ప్రమాదం గురించి చర్చించుకోవాల్సిన అగత్యముంది -ఒక్కమాటలో చెప్పాలంటే తెలంగాణవాదం, బలహీన పడుతోందిలే అని మురిసిపోవడమూ మంచిది కాదు, సీమాంధ్రలో కూడా కొద్దో, గొప్పో ఉన్న విభజన వాదాన్ని విస్మరించడం అసలే కాదు. ఎక్కడున్నా విభజన వాదాన్ని సమూలంగా నిర్మూలించాలి. దురదృష్టవశాత్తు, తెలంగాణేతర ప్రాంతాల్లోనూ కేవలం స్వార్థ రాజకీయాలకోసం, అక్కడి ప్రజల్ని, విద్యార్థుల్ని, ఉద్యోగ వర్గాల్ని రెచ్చగొట్టడానికి, విభజన వాద గరళాన్ని తాగించడానికి ప్రయత్నిస్తున్న నేతలు, మేధావులు ఉన్నారు. వాళ్లు రాష్ట్ర విభజనకనుకూలంగా చెప్పే కారణాలన్నీ ఎంత అసమంజసమైనవో చెప్పుకుందాం. మొదటగా నసిగేది / 'కలిసి ఉంటే బాగుంటుందిలే కానీ... ఇంపల్సివ్‌గా కంపల్సివ్‌గా విడిపోదామంటున్నాం అని, (ఔను తెలంగాణవాదులు ఎక్కువగా ఉర్దూ పదాలు వాడుతారని ఎద్దేవా చేసేవాళ్లు ఎక్కువగా ఆంగ్లపదాలు ఉపయోగిస్తారు లెండి) తప్పనిసరి (కంపల్సివ్‌)గానో తాత్కాలిక స్పందనగానో (ఇంపల్సివ్‌గా) 'విడిపోదాంలే' అనడం మూర్ఖత్వం కాదా?! రాష్ట్రపరంగా, జాతీయపరంగా విశాల, దీర్ఘకాలిక ప్రయోజనాల గురించి పట్టించుకోవద్దా? ఇంకో కారణం, దొరవారు వ్యూహాత్మకంగా ప్రారంభించి, నిరంతరం కొనసాగిస్తున్న తిట్లపురాణాన్ని ఎంతకాలం సహించగలం? మా ప్రాంతపు ప్రజల్ని గంపగుత్తగా, దొంగలు దోపిడీదారులు, మోసకారులు, రాక్షస సంతతి అని తిట్టి పోస్తుంటే మా ఆత్మాభిమానాన్ని సంరక్షించుకోవాలి కదా అన్నది. అయ్యా, ప్రకటిత ధ్యేయంపై చిత్తశుద్ధి లేనివాడు అంతిమ పరిణామం అపజయమే అని ముందు నుంచీ తెలిసి ఉన్నవాడు తిట్లపురాణాన్ని ఆశ్రయిస్తాడని మనోవిజ్ఞాన వేత్తలు చెబుతారు. దీన్ని ప్రత్యర్థి లేదా ప్రతివాదంలోని అధిక బలాన్ని పరోక్షంగా అంగీకరించే ఉద్వేగంగా, ఉన్మాదంగా అర్థం చేసుకోవాలి. సానుభూతి చూపాలి. సహనం వహించాలి. అంతేకానీ తిట్టుకి తిట్టు ఒట్టుకి ఒట్టు, బెట్టుకి బెట్టు రూపంలో మనకు ఇష్టంలేని అధర్మ యుద్ధానికి, ధ్యేయానికి, సహకరించ తగదు. అయినా, ఈ కూతలు కూస్తున్నది కొందరు విభజన వాద నేతలేకానీ, అత్యధిక శాతం తెలంగాణ ప్రజలకు ఇతర ప్రాంతాల స్వభాషీయుల పట్ల ఆదరాభిమానాలు మెండుగా ఉన్నాయి. అందుకే గతంలో కూడా విలీనానికి తహ తహ లాడారు. ఇప్పుడూ విభజనను వ్యతిరేకిస్తున్నారు. దొరల దుర్భాషలను ఏవగించుకుంటున్నారు. కాబట్టి ఎవరో మిట్టమధ్యాహ్నం లేచి దుర్భాషలాడుతున్నారన్న కారణంగా దేశానికి, రాష్ట్రానికి, మాతృభాష వికాసానికి చేటు తెచ్చే విభజన పట్ల మొగ్గు చూపడం మూర్ఖత్వమే అవుతుంది.

అన్ని ప్రాంతాల తెలుగు ప్రజలు గ్రహించాల్సిన వాస్తవం మరొకటి ఉంది. అదేమిటంటే ఖర్మకాలి, ఒకవేళ ఈ రాష్ట్ర విభజనంటూ జరిగితే, అది రెండు ముక్కలతో ఆగిపోదు. ఒడుపుగా దేముడి ముందు కొట్టే కొబ్బరికాయలా, రెండు చెక్కలే అవుతుందనుకోవద్దు. బలంగా నేలకేసి కొట్టిన గాజుగ్లాసులా, పలుముక్కలవుతుంది పగలిన ప్రాంతాల్ని, అక్కడి ప్రజల్ని బాగా గాయపరుస్తుంది. ఎలాగంటే, విభజనవాదులు పదే పదే వాగే ఏకైక కారణం యాస, సంస్కృతి, ఆచార వ్యవహారాల్లో స్వల్ప తారతమ్యాలు కానివ్వండి, (ఇవి ప్రతి పది ఇరవై మైళ్లకు మారతాయి) లేదా చిన్న రాష్ట్రాలలో పరిపాలనా సౌలభ్యం కానివ్వండి, మరేదైనా సరే, వర్తింపజేస్తే, ఒక్క తెలంగాణ ప్రాంతాన్నే పలు చిన్న చిట్టి రాష్ట్రాలుగా చీల్చాల్సి ఉంటుంది. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, కాకతీయ నాడు, గిరినాడు, గ్రేటర్‌ హైదరాబాద్‌, ఇలా పలు రాష్ట్రాలుగా, యాసా ప్రయుక్త ప్రదేశాలుగా చీల్చాలి. అలాగే ఉత్తరాంధ్ర, డెల్టాంధ్ర, ఉభయ గోదావరి, పల్నాడు, మన్యసీమ, రాయలసీమ, ఇలా సీమాంధ్రను పలు చిన్న రాష్ట్రాలుగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆయా రాష్ట్రాల రాజధానుల నిర్ణయాల విషయంలో మళ్లీ ఎన్ని కొట్లాటలొస్తాయో ఊహించబూనుకోవడమే కడుదుర్భరం. భాషా ప్రయుక్త రాష్ట్రాల విధానానికి ఆద్యులమైన మనం 'యాసా ప్రయుక్త రాష్ట్రాల ఉన్మాదానికి', అన్ని ఇతర రాష్ట్రాల విచ్ఛిత్తికి, దేశ సమైక్యత భంగం కావడానికి, స్వల్ప కారణాల రీత్యా ఏర్పడిన మన అనైక్యత మూలంగా కారకులమయ్యామన్న పాపం మూటకట్టుకోరాదు. ఇప్పటికే తెలుగువాళ్లంటేనే అందరికీ చులకన భావం ఏర్పడిపోయింది!

ఇంకా ఎక్కువ అప్రమత్తత వహించాల్సిన విషయం గురించీ ప్రస్తావించి తీరాలి. పొత్తులు, జిత్తులు మార్చి, ఏమార్చి అన్నిట్లోనూ వైఫల్యం చెందిన దొరవారు, అంతిమ అస్త్రంగా 'అట్నుంచి నరుక్కొని వద్దాం' అనే వ్యూహాన్ని ఫామ్‌హౌస్‌లో సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే అందుకు సంకేతంగా సీమాంధ్రలో విభజనవాదాన్ని రెచ్చగొట్టే, ప్రోత్సహించే పనులు ప్రారంభించారు. కోవూరులో తెరాస అభ్యర్థిని నిలబడతానని ప్రకటించారు. సీమాంధ్రలో పర్యటిస్తానని అంటున్నారు. పర్యటిస్తే పూలమాలలతో సత్కరించాలి సీమాంధ్రులు, సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రివి కావాలని ఆశీర్వదించాలి. అంతేకానీ 'అట్నుంచి నరుక్కుని వద్దామన్న' కుతంత్రానికి సహకరించవద్దు, అక్కడికి వచ్చినా రాకపోయినా, కెసిఆర్‌, జగన్‌ వర్గంతో, సీమాంధ్రలోని ప్రధాన రాజకీయ పార్టీలలోని అసంతృప్తులతో, కులసంఘాలతో దోస్తీ పెట్టుకునే ప్రయత్నాలు తెలంగాణ భవన్‌ నుంచో, ఫామ్‌హౌస్‌ నుంచో చేయడం తథ్యం. తస్మాత్‌ జాగ్రత్త. జగన్‌తో సహా ఎవరు దొరవారి బుట్టలో పడినా వారికి సొమ్మూ పోతుంది, సీమాంధ్రలో సోకూ పోతుంది. అక్కడా, ఇక్కడా నీళ్లు పుట్టవు -రెంటికీ చెడ్డ రేవడి గతి పడుతుంది. జగన్‌ మాత్రమే కాదు, బాబు, నందమూరి వారసులు, నారాయణ, రాఘవులు, వెంకయ్య నాయుడు ప్రభృతులు ఇది గ్రహించాలి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని, ఈ రాష్ట్రంలోని సమైక్యవాదులు ప్రధాన రాజకీయ పార్టీలు, మాతృభాషాభిమానులు, దేశ సమైక్యతను కోరుకునేవారు కేంద్ర ప్రభుత్వం తెలంగాణవాదంతో పాటు, సీమాంధ్రలోని విభజన వాదాన్ని, అన్ని ఇతర రాష్ట్రాలలోని ప్రత్యేక రాష్ట్ర వాదాల్ని సమూలంగా నిర్మూలించే ప్రయత్నాలు చేయాలి. ఇందుకు అవసరమైతే రాజ్యాంగాన్ని సవరించి ఆర్టికల్‌ (3)ని మరింత కఠినతరం చేయాలి. ఏ కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్నా పార్లమెంటులో, ఇతర రాష్ట్ర శాసనసభలలో 2/3 మెజారిటీ సభ్యుల ఆమోదం ఉండాలన్న నిబంధనను తీసుకుని రావాలి.

-చేగొండి రామజోగయ్య ,
విశ్రాంత బ్యాంకు అధికారి, విశాలాంధ్ర మహాసభ సభ్యులు 

26, ఫిబ్రవరి 2012, ఆదివారం

రాష్ట్రం సమైక్యంగా ఉండాలి : తిరుపతి సదస్సులో వక్తలు

ఆంధ్ర భూమి: అధికార దాహంతో కూడిన కొందరు రాజకీయ నాయకులను మినహాయిస్తే తెలంగాణలో సైతం రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకునే వారి సంఖ్యే అధికంగా ఉందని, ఇది వాస్తవమని విశాలాంధ్ర మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరకాల ప్రభాకర్ అన్నారు. తిరుపతిలోని నెహ్రూ లలిత కళా ప్రాంగణంలో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి (శాప్స్), విశాలాంధ్ర మహాసభ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన విశాలాంధ్ర మహాసభను, గణాంక ప్రదర్శనను రిటైర్డ్ విసి వెంకట్‌రెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల అభివృద్ధిపై వాస్తవాలను గణాంకాలతో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అన్ని రంగాల్లోనూ తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి పథంలో నడుస్తోందో విస్పష్టంగా చూపించారు. అంతేకాకుండా రాష్ట్ర సమైక్యతను కాపాడుదాం అనే పేరుతో ముద్రించిన బుక్‌లెట్స్‌లో నాగం జనార్దన్‌రెడ్డి ఒకప్పుడు తాను తెలంగాణ వాదినని - ఇప్పుడు సమైక్య వాదినని చేసిన వాఖ్యలను, అలాగే కోస్తా మహానుభావులే తమకు చదువులు చెప్పించారని దేవేంద్ర గౌడ్ చేసిన వ్యాఖ్యలను, ముసలివాళ్లకు విడాకులు ఇప్పిస్తారా.. అని కడియం శ్రీహరి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను చదవి వినిపించారు. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమమే నాదని చెప్పుకుంటున్న కెసిఆర్ జై తెలంగాణ నినాదాలు పెరగకుండా ముఖ్యమంత్రి తక్షణం చర్యలు చేపట్టాలని అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను కూడా చదివి వినిపించారు. ఉద్యోగాలు రానంత వరకూ తెలంగాణ, రాయలసీమ ఉద్యమాల పేరుతో సంఘాలు, సమితులు ఏర్పాటు చేస్తారని ఉద్యోగాలోస్తే వాటి గురించి పట్టించుకోరని కెసిఆర్ చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. స్వాతంత్ర సమర యోధుడు నర్రా మాధవరావు, మహమ్మద్ ఆలీ, విశాలాంధ్ర మహాసభ రాష్ట్ర అధ్యక్షులు నలమోతు చక్రవర్తి, మాజీ డిజిపి ఆంజనేయరెడ్డి, సుగుణమ్మ, కరీంనగర్‌కు చెందిన శ్రీనివాసులరెడ్డికన్నా తెలంగాణ ప్రజలను కెసిఆర్ ఎక్కువగా ప్రేమిస్తున్నాడా? అని ప్రశ్నించారు. తమను సభలు పెట్టమని తెలంగాణ ప్రాంతం నుండి అనేక మంది అడుగుతున్నారన్నారు. అయితే నిజాలు మాట్లాడిన వారి పీకనొక్కి అసత్య ప్రచారాలు బయటపడకుండా తెలంగాణ వాదులు జాగ్రత్త పడుతున్నారన్నారు. తెలంగాణ ఉద్యమం చల్లారిందనే నిర్లక్ష్యం తగదని సమైక్యావాదులను హెచ్చరించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన స్వాతంత్ర సమరయోధుడు నర్రా మాధవరావు మాట్లాడుతూ తెలుగువారంతా సమైక్యంగా ఉండాలని కోరుతూ 8 వేల మంది స్వాతంత్ర సమరయోధులు అనేక పోరాటాలు చేశామన్నారు. నిజాం నవాబులకు, రజాకార్లకు, పటేల్, పట్వారీ వంటి అనేక బానిసత్వాలకు వ్యతిరేకంగా పోరాడామన్నారు. తాము చేసిన ఉద్యమాల ఫలితంగానే నేడు తెలంగాణ ఈ స్థాయిలో అభివృద్ధి చెందిందిన్నారు. నలబోతు చక్రవర్తి, శ్రీనివాసరెడ్డి, మహమ్మద్ ఆలీ, మాజీ డిజిపి ఆంజనేయరెడ్డి, శాప్స్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం, ఎన్ రాజారెడ్డి, తదితరులు మాట్లాడుతూ కెసిఆర్ ఓడిపోయినప్పుడు ఒక మాట, గెలిచినప్పుడు మాత్రం తెలంగాణ వాదం పేరు చెప్పడం విడ్డూరంగా వుందన్నారు.

బూర్గుల విగ్రహాన్ని ఎర్పాటు చేయాలి
తెలుగు ప్రజల చిరకాల స్వప్నమైన విశాలాంధ్ర ఆవిర్భావానికి తన ముఖ్యమంత్రి పదవిని సైతం త్యాగం చేసిన ప్రముఖ తెలంగాణ ప్రాంత నేత బూర్గుల రామకృష్ణారావు విగ్రహాన్ని తిరుపతిలో ఏర్పాటు చేయాలని శనివారం తిరుపతి నెహ్రూ లలిత కళా ప్రాంగణంలో జరిగిన విశాలాంధ్ర మహాహభ తీర్మానించింది. విశాలాంధ్ర రాష్ట్ర అధ్యక్షుడు రవితేజ అధ్యక్షతన జరిగిన ఈ సభ జరిగింది. ఈ సందర్భంగా పలు ముఖ్యమైన తీర్మానాలకు సంబదింధించి శాప్స్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ కోడూరు బాలుసుబ్రహ్మణ్యం, ఎన్ రాజారెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌లో ట్యాంక్‌బండ్‌పై తెలుగు వైతాళికు విగ్రహాలను ధ్వంసం చేయడాన్ని సమావేశం తీవ్రంగా ఖండించిందని తెలిపారు. అంతేకాకుండా విగ్రహాలను పునః ప్రతిష్ఠించాలని తీర్మానించామన్నారు.

ఆంధ్రప్రభ : తెలంగాణాలోని మెజారిటీ ప్రజలు రాష్ట్రం సమైక్యంగా వుండాలని కోరుకుంటున్నారని విశాలాంధ్ర మహాసభ ప్రధాన కార్యదర్శి పరకాల ప్రభాకర్‌ అభిప్రాయపడ్డారు. శనివారం స్థానిక నెహ్రూ లలితకళా వేదికలో రాష్ట్ర సమైక్యతను కాపాడుకుందామన్న నినాదనంతో విశాలాంధ్ర మహాసభ, సమైక్యాంధ్ర పరిరక్షణ సమితీలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అబద్దాలు చెప్పి ప్రజలను రెచ్చగొట్టే వారిని కోతలరాయుడు అంటారని, ఆ పేరు తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావుకు చక్కగా సరిపోతుందని అన్నారు. మోసపు మాటలతో ప్రజలను ఎల్లకాలం వంచించలేరని, అసత్య ప్రచారాలు, అభూత కల్పనలతో తెలంగాణా ప్రత్యేక ఉద్యమం సాగుతోందని ఆయన ఆరోపించారు. తెలంగాణా ప్రాంతానికి చెందిన సాయుధపోరాట యోధులు నర్రా మాదవరావు, మహబూబ్‌ అలి, విశాలాంధ్ర మహాసభ నాయకులు నలమోతు చక్రవర్తి, పదిరి రవితేజ, కె.శ్రీనివాసులురెడ్డి, చేగొండి రామజోగయ్యలు రాష్ట్రం సమైక్యంగా వుండాలని పోరాడుతున్నారని ఆయన పేర్కొన్నారు.

వీరికంటే కె.చంద్రశేఖర్‌రావు తెలివైన వాడేమీకాదని ఆయన అన్నారు. సిక్స్‌ పాయింట్‌ ఫార్ములాలు, జోనల్‌ సిస్టంలు పెట్టుకుని మనందెబ్బ తింటున్నామని, ఎక్కడైనా ప్రాజెక్టుల కింద స్టాప్‌ మిగిలి పోతే వారిని రాష్ట్రంలో ఏ మూలనైనా సరె వాడుకునేందుకు వెసులు ఉండాలని ఈ జోనల్‌ సిస్టంను తొలగించుకునే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టాలని కె.చంద్రశేఖర్‌రావు 1996 జూలై 18న అసెంబ్లిdలో వాదించారని ప్రభాకర్‌ గుర్తు చేశారు. అలాగే తెలంగాణా - రాయలసీమల్లో ఉద్యమాల కోసం ఏదో సమితి అని పెడుతున్నారని, రాయలసీమ విమోచన సమితి, తెలంగాణా ప్రజాసమితిలు అలాంటివేనని, ఉద్యమం చేపట్టే ఉద్యమకారులు ఏవైనా ఉద్యోగం దొరికితే దాన్ని అనుభవిస్తున్నారని ముఖ్యమంత్రి ఇలాంటి వాటిపై తక్షణం చర్యలు తీసుకోవాలని 1997 ఫిబ్రవరి 26న కె.సి.ఆర్‌ అసెంబ్లిdలో మాట్లాడారని ఆయన తెలిపారు.

సదస్సులో విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు నలమోతు చక్రవర్తి, కార్యదర్శి పదిరి రవితేజ, చేగొండి రామజోగయ్య, తెలంగాణా సాయుధ పోరాట యోధులు నర్రా మాదవరావు, మహబూబ్‌ అలి, సమైక్యాంద్ర పరిరక్షణ సమితి అధ్యక్ష, కార్యదర్శులు కోడూరు బాలసుబ్రమణ్యం, ఎన్‌. రాజారెడ్డిలు పాల్గొన్నారు.

సాక్షి:  సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి(సాప్స్) విశాలాంధ్ర మహాసభల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ఆలోచింప చేసింది. మొదట ఈ ఎగ్జిబిషన్‌ను ఎస్‌కే యూనివర్సిటీ మాజీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కె.వెంకటరెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఇందులో రాష్ట్ర విభజన పేరుతో రాష్ట్రంలో చోటుచేసుకున్న పలు హింసకాండకు సంబంధించిన దృశ్యాలు, వేర్పాటువాదుల అరాచకాలు కళ్లకు కట్టినట్టు ఫొటో ఎగ్జిబిషన్‌లో ఉంచారు. అందులో శాసనసభలో గవర్నర్‌పై దాడి, శాసనసభ ఆవరణలో లోక్‌సత్తా, బీజేపీ నాయకులపై తెలంగాణా వాదుల దాడులు, ఓ కానిస్టేబుల్, వేర్పాటు వాదుల పైశాచికదాడి, పోటీపరీక్షలను తెలంగాణావాదులు అడ్డుకుంటున్న దశ్యం, ట్యాంకుబండ్‌పై మహనీయుల విగ్ర హాలను ధ్వంసం చేస్తున్న దృశ్యాలు ప్రతి ఒక్కరినీ ఆలోచింప చేశాయి. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి వాస్తవ గణాంకాలు తెలిపే పోస్టర్లు ఆకట్టుకున్నాయి. ఈ ఎగ్జిబిషన్‌ను నగరంలోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు తిల కించారు. అనంతరం ఏర్పాటు చేసిన సదస్సుల్లో వక్తలు సమైక్యాంధ్ర పరిరక్షణ గురించి ప్రసంగించారు. అనంతరం మాతెలుగు తల్లికి మల్లెపూదండ , మాకన్నతల్లికి మంగళారతులు అంటూ జయం కళాశాల అధ్యాపక, విద్యార్థులు రాధికా సౌజన్య బృందం ఆలపించిన గీతం సభికులను అలరించింది. కార్యక్రమంలో విశాలాంధ్ర మహాసభ అధ్యక్ష, కార్యదర్శులు నలమోతు చక్రవర్తి, పరకాల ప్రభాకర్, కార్యదర్శి రవితేజ, శ్రీనివాసరెడ్డి (కరీంనగర్), చేగొండి రామజోగయ్య, తెలంగాణా సాయుధపోరాట యోధులు న ర్రామాధవరావు, మహబూబ్‌ఆలీ, సాప్స్ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం, ఎన్.రాజారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌రెడ్డి, జయం షరీఫ్ మహ్మద్ఫ్రీ, వెంకటరెడ్డి పాల్గొన్నారు.

22, ఫిబ్రవరి 2012, బుధవారం

‘రాష్ట్ర సమైక్యతను కాపాడుదాం’- ఫిబ్రవరి 25 న తిరుపతిలో సదస్సు మరియు ప్రదర్శన


మన సంఖ్యాబలంపై అయోమయం!

ఆంధ్రప్రభ: ఈ శీర్షికన ప్రచురితమవుతున్న నా వ్యాసాలకు స్పందించి, కొందరు సమైక్యవాదులు, విభజనవాదులు నాతో వ్యక్తిగతంగా కూడా మాట్లాడడం, పోట్లాడడం గత నాలుగైదు సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. వ్యాసాల రూపంలో తమ అభిప్రాయాలను వెలిబుచ్చినవారికి, ఎప్పటికప్పుడు తగువిధంగా, సామరస్యంగా సమాధానాలివ్వడమూ జరిగింది. అయితే పోయిన వారం, ఈ శీర్షిక కింద ప్రచురితమైన 'దీర్ఘకాల తెలుగు తెగుళ్లు!' వ్యాసానికి సమైక్య విభజన వాదుల నుంచి వచ్చిన ప్రతిస్పందనలు కడు ఆవేదనతో కూడిన ఆశ్చర్యాన్ని కలుగజేశాయి! కారణం, ఆ వ్యాసంలో అన్ని ప్రాంతాల తెలుగువాళ్లకున్నాయంటూ (ప్రవాసులతో సహా!) పేర్కొనబడిన 'దీర్ఘకాల రోగాలు', అసలే లేవని కానీ, ఉన్నా నేను చెప్పినంత స్థాయిలో లేవని కానీ వక్కాణించి నన్ను సరిదిద్దే, సంతోషింపజేసే ప్రయత్నం మాత్రం ఏ ఒక్కరూ చేయలేదు! 'అయితే ఏంది?' లేదా ఈ రోగాలతోనే బతికేయాలి -నివారణకోసం చికిత్స వృధా అనే రీతిలో స్పందించడం ఆవేదనని కలిగించింది.

ఆశ్చర్యంతో కూడిన ఆవేదనని కలిగించిన అంశం ఏమిటంటే మాట్లాడిన, విభేదించిన సమైక్య, విభజనవాదులు ఉభయులూ, మన రాష్ట్రంలో దేశంలో, విదేశాల్లో ఉన్న మొత్తం తెలుగువారిదిగా నేను పేర్కొన్న సంఖ్యాబలాన్ని ప్రశ్నించడం లేదా అనుమానాన్నో, అయోమయాన్నో వ్యక్తపరచడం. ఆ విధంగా అన్ని ప్రాంతాల (ప్రవాసాంధ్రులతో సహా) తెలుగు వాళ్లకున్న తెగుళ్లుగా నేను ప్రస్తావించిన (1) అనైక్యత (2) యాసా సంబంధిత విద్వేషాలు (3) అన్యభాషలు, సంస్కృతులపై అతిమోజుతో కూడిన మాతృభాషపై నిరాదరణ (4) ప్రాంతీయ, ఉపప్రాంతీయ దురభిమానం (5) ప్రాంతేతర బంధాలపై విముఖత వంటి వాటికి, ఆరో రోగంగా, 'స్వీయ సంఖ్యాబలంపై అవగాహనా లేమి'ని కూడా కలుపుకోవాలేమోనన్న సంశయం ఏర్పడింది. విశ్వామిత్ర మహర్షి శాపాలలో ఇది కూడా ఉందేమో మరి! ఇంతకీ పలువురు ప్రశ్నించిన లేదా అనుమానించిన అంశం పోయిన వారం వ్యాసంలో సందర్భోచితంగా మన రాష్ట్రంలో (సరిహద్దు ప్రాంతాలలో ఉన్నవారితో కలిపి) ఉన్న తెలుగువాళ్లు పదికోట్లమందని, ఇతర రాష్ట్రాలలో విదేశాల్లో మరో ఎనిమిది కోట్ల మంది ఉన్నారని చేసిన ప్రస్తావన -ఈ సంఖ్యకు సంబంధించిన ఆధారాలు గతంలోనే చెప్పి ఉన్నా మరోసారి వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం, సందర్భం ఏర్పడింది. రెండు మూడేళ్ల క్రితం వరకు నేను 16 కోట్ల మంది తెలుగువాళ్లనే రాసేవాణ్ణి -2011 జనాభా లెక్కల వివరాలు స్థూలంగా వెలువడిన తర్వాత 18 కోట్లమంది అనడం ప్రారంభించాను. ఎవరూ ప్రశ్నించలేదు.

కానీ ఈసారి మాత్రం, కొందరైతే 'ఆ! గాడిద గుడ్డేం కాదూ, మహా ఉంటే ఐదారు కోట్లుంటాం అంతే' అనేశారు! ఇంకా నయం, 'ముక్కోటి ఆంధ్రులం' అన్న బూర్గుల వారి 'ముచ్చట'ను 'కోటి రత్నాలవీణ నా తెలంగాణ' అన్న దాశరథి పల్లవిని మార్చడానికి వీల్లేదు, ఆ లెక్కలకే కట్టుబడి ఉందామని అనలేదు! అన్నా చెల్లదు -అవి 60 సంవత్సరాల నాటి లెక్కలు -ఆరు దశాబ్దాలలో నమోదైన జనాభావృద్ధి రేటుని, ఇతర సంబంధిత అంశాల్ని పరిగణనలోకి తీసుకుంటే నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 'తెలుగువాళ్ల' సంఖ్య 18 కోట్లు అనడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదని అర్థమవుతుంది. ఈ సందర్భంలో నాలుగున్నర కోట్ల మంది తెలంగాణ ప్రజలు అని విభజన వాదులే అంటున్నదీ గుర్తుంచుకోవాలి. కోటి నాలుగున్నర కోట్లయినప్పుడు నాలుగు కోట్లు 18 కోట్లు అవదా?

మన సంఖ్యాబలాన్ని గురించి దీన్ని తగ్గించి చూపడానికి ఇతరులు చేసే ప్రయత్నాలు, కుతంత్రాల గురించి చెప్పుకుందాం. ముందుగా మన రాష్ట్రంలో, సరిహద్దు ప్రాంతాల్లో పది కోట్ల మంది తెలుగువాళ్ళన్న దానిపై వివరణ -2011 జనాభా లెక్కల ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర జనాభా కొంచెం తక్కువగా తొమ్మిది కోట్లు ఒక సంవత్సరం గడిచింది. కాబట్టి అది నేడు తొమ్మిది కోట్లు దాటింది. ఉర్దూ ఇతర భాషల వారిని మినహాయిస్తే (వీరిలో కూడా 80 శాతం మందికి తెలుగువచ్చు) ఏమైనా, రాష్ట్రంలో తెలుగువాళ్లు ఎనిమిది కోట్ల పైమాటే! ఇకపోతే ఆంధ్రప్రదేశ్‌, నిజానికి 'విశాలాంధ్ర' కాదు పొరుగున ఉన్న నాలుగు రాష్ట్రాల్లో జిల్లాలకి జిల్లాలే తెలుగువాళ్లు అధిక సంఖ్యాకులుగా కానీ గణనీయ సంఖ్యాబలంతో ఉన్నవెన్నో ఉన్నాయి. రాష్ట్రంలో, సరిహద్దు ప్రాంతాల్లో పది కోట్ల మంది తెలుగువాళ్లున్నారన్న లెక్క తప్పుకాదు -అయితే ఆయా రాష్ట్రాల రాజధానుల్లో ఇతర జిల్లాల్లో కూడా ఉన్నవారిని వేరే లెక్కించాలి.

తెలుగు మేధావి, మాజీ ప్రధాని పి వి నరసింహారావు పదిహేనేళ్ల క్రితమే ప్రవాసాంధ్రుల సంఖ్యల గురించి రాష్ట్రాలవారీగా లెక్కలు వివరించారు. వాటిని జనాభావృద్ధి రేటు ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని నవీకరిస్తే మన పొరుగు రాష్ట్రాలలోని తెలుగువాళ్ల సంఖ్య ఎలా ఉంటుందో స్థూలంగా చెప్పవచ్చు. (ఈ సందర్భంలో మనం గమనించాల్సిన అంశం ఈనాటికీ తమిళనాడు కర్ణాటక రాష్ట్ర శాసనసభలలో 50 మందికి తక్కువ కాకుండా తెలుగువాళ్లు ఎమ్మెల్యేలుగా ఉంటున్నారు, పది మందైనా మంత్రులుగా ఉంటున్నారన్నది). ముందుగా తమిళనాడు విషయం -విభజనవాదనేత దొరవారు పదే పదే చెప్పేది, అనుయాయులు నిస్సిగ్గుగా వల్లించే అబద్ధం, తమిళనాడు నుండి విడిపోయినప్పుడు రాజాజీ 'గెట్‌ లాస్ట్‌' అన్నారన్నది -ఆయన తెలుగు మూలాలున్న విశాల జాతీయ భావాలున్న నేత. ఆయన అలా అనలేదు సరికదా, ఆంధ్ర విడిపోయాక కూడా 'మెడ్రాస్‌' (అప్పుడలానే అనేవారు)లో 45 శాతం ఇతర జిల్లాల్లో 25 నుంచి 35 శాతం తెలుగువాళ్లున్నారన్నారు. ఇప్పుడూ తమిళనాడులోని మూడు ప్రధాన రాజకీయ పార్టీల నేతలు వైగో, రామదాస్‌, విజయకాంత్‌ తెలుగువాళ్లే. ఈ విషయాన్ని వాళ్లు బహిరంగంగా ఒప్పుకోరన్నది వేరే విషయం. ముందే చెప్పినట్లు కనీసం అరవై మంది తెలుగు ఎమ్మెల్యేలు, పదిమంది మంత్రులున్నారు. 2001 జనాభా లెక్కల ప్రకారం ఈ రాష్ట్రంలో 27 శాతం మంది ప్రజల మాతృభాష తెలుగు#. ఇది అధికారిక లెక్క. కృష్ణయ్యలు, కృష్ణన్‌ లా అధికారిక రికార్డుల్లో ఉంటారు. దానికి కారణం ప్రధానంగా తమిళ ఉద్యోగుల నిర్వాకం. అలానే మాతృభాషగా తమిళమే నమోదై ఉంటుంది. ఇంట్లో తెలుగు మాట్లాడుకుంటారు. తెలుగు మాధ్యమ పాఠశాలలు కనుమరుగైనందువల్ల ఇప్పటి తరాలవారు మాతృభాషకు దూరమవుతున్నారు క్రమంగా. ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్నా తమిళనాడులో ఉన్న తెలుగువాళ్ల సంఖ్య మూడు కోట్లుగా చెప్పవచ్చు. కర్ణాటకలో పరిస్థితులు అంత దారుణంగా లేవు. ఈ రాష్ట్రంలో రెండు కోట్లు, మహారాష్ట్రలో 150 లక్షలు, ఒరిస్సాలో ఒక కోటి, చత్తీస్‌ఘడ్‌లో 50 లక్షల మంది తెలుగువాళ్లున్నారని స్థూలంగా చెప్పవచ్చు. ఇక, ఇతర రాష్ట్రాలలో, విదేశాల్లో ఉన్న తెలుగువాళ్లని కలుపుకుని మొత్తం తెలుగువాళ్లు 18 కోట్ల మంది అనడం సరైన లెక్కే. అందుకే మన సంఖ్యాబలాన్ని తగ్గించి చెప్పడానికి ఇతరులు చేసే ప్రయత్నాల్ని ఖండించాలి. ఎందుకోమరి మనం ఆ పని చేయం. నిర్లిప్తంగా ఉండిపోతాం.

ఉదాహరణకి 2011 ఆగస్టు 5న పార్లమెంటులో తెలంగాణ విషయంలో మీలోమీరే తేల్చుకోవాలన్న ప్రకటన చేస్తున్న సందర్భంలో తమిళ తంబి చిదంబరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న 12 కోట్ల మంది తెలుగువాళ్లు అంటూ ఓ తప్పుడు లెక్క (ఉద్దేశపూర్వకంగానే అయ్యుండొచ్చు!) చెప్పారు. అయినా మన సమైక్యవాదులు కూడా కిమ్మనలేదు. ఇందుకు వాపోతూ నేను 24.8.11న ఆంధ్రప్రభలో తెలుగువారి సంఖ్యపై చిదంబరం తప్పుడు లెక్క అన్న వ్యాసాన్ని రాశాను. కల్‌తోల్‌ తోండ్రియన్‌ తోంబాల కాలతే (రాళ్లురప్పలు సృష్టిలో లేని కాలంలో కూడా తమిళం ఉంది అని అర్థం) అనే తమిళ సోదరుల భాషాభిజాత్యాన్ని ప్రశంసిస్తూనే 'ఎన్నాసార్‌ ఇందకన్నాక్కుల్‌ (ఏమిటండీ ఈ దొంగ లెక్కలు), అని నాకు రాని అరవంలో అరిచేను. ఆ వ్యాసంలో ఏమైనా, నాలెక్క తప్పైతే తగు ఆధారాలతో సరైన లెక్క ఏమిటో చెప్పండి. సరిదిద్దుకోవడానికి నామోషీ లేదు. కానీ నాలెక్క సరైనదేనన్న విశ్వాసం ఉంది. కాదంటే ఆ వ్యాసంలోనే వాపోయినట్లు ఇప్పటికే తెలుగు సగం చచ్చిపోయింది, జాగ్రత్త పడకపోతే మృతభాష అయిపోతుందన్న యునెస్కో వారి జోక్యం నిజమైపోతుందన్న భయంకూడా ఉంది.

(# వ్యాసకర్త 2001 అని పేర్కొన్నారు. అది ఆంధ్రప్రభలో అలాగే ప్రచురితమైంది. ఈ లెక్క రాష్ట్రాల పునర్విభజన జరిగిన కాలం నాటిదని మా భావన) 

- చేగొండి రామజోగయ్య,
విశ్రాంత బ్యాంకు అధికారి, విశాలాంధ్ర మహాసభ సభ్యులు

21, ఫిబ్రవరి 2012, మంగళవారం

అన్ని ప్రధాన నగరాల్లో విశాలాంధ్ర మహాసభలు


ఈనాడు.నెట్  21/02/2012

భాషారక్షణ ప్రభుత్వ బాధ్యత కాదా?

ఆంధ్రభూమి సంపాదకీయ పేజీ:  మళ్ళీ యీ ఏడు అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవం వచ్చింది. ప్రపంచంలోని భాషాజాతులన్నీ తమ భాషల్ని కాపాడుకోవాలని ఐక్యరాజ్యసమితి వారి విద్యాసాంస్కృతిక విభాగం- యునెస్కో-ఒక పుష్కరకాలంగా ప్రతి ఫిబ్రవరి 21న పిలుపు ఇస్తూనే ఉంది. సరిగ్గా ఆరోజున 1952లో తూర్పు పాకిస్తాన్‌లోని ప్రజలు, రచయితలు తమ మాతృభాష బెంగాలీకోసం రక్తతర్పణం చేశారు. ఆ ఉద్యమం చిలికి చిలికి, తర్వాత ఇరవైఏళ్ళకల్లా అది స్వతంత్ర దేశంగా-బంగ్లాదేశ్‌గా-ఆవిర్భవించడానికి దారితీసింది. మాతృభాషను తమ హక్కుగా స్వాభిమానసంపన్నులైన ఆ ప్రజలు భావించబట్టే అంతటి పరిణామం చోటు చేసుకుంది.

అప్పుడు ఒక చిన్న భూభాగంలో పాలకులపైన తమ భాషకోసం ప్రజలు పోరాడి సాదించిన ఘన విజయం అది. కాని, ఇప్పుడు ప్రపంచీకరణ వల్ల మాతృభాషలన్నిటికీ పెనుముప్పు ముంచుకొస్తోంది. ప్రపంచీకరణ వాహికగా ఆంగ్లభాషముందుకు దూసుకొస్తోంది. అది ఒక వరదలాగా వస్తూ చిన్నచిన్న భాషల్ని మా యం చేస్తున్నది. వేలాది చిన్నచిన్న భాషలు పాశ్చాత్యదేశాల్లో, ఆఫ్రికన్ దేశాల్లో ఆ వరదలో కొట్టుకుపోతున్నాయి. ఈ ప్రమాదాన్ని గుర్తించిన యునెస్కో సర్వప్రతినిధిసభ రెండు మూడు సార్లు సమావేశమై లోతుగా చర్చించి 12 ఏళ్ళనాడు ప్రపంచదేశాలకు ఆ పిలుపు ఇచ్చింది. ఏడాదిలో ఒకరోజును ప్రత్యేకించి రుూ విషయంలో ప్రపంచ ప్రజలను మేల్కొల్పడానికై కేటాయించింది. బెంగాలీ ప్రజలు త్యాగం చేసిన ఆ రోజును అందుకై ఎంపిక చేసింది.ఆఫ్రికాలోని రోబీ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న గుగీవాథియాంగో అనే ఆంగ్లబోధకుడు తన మాతృభాష ‘గికురుూ’ రక్షణకోసం, అట్లాగే మరికొందరితో కలిసి ‘సావహిలీ’ వంటి తోటి చిన్న భాషల రక్షణకోసం చేసిన పోరాటం, నైజీరియాలోని ‘చెనువా అబీబీ’ చేసిన పోరాటం చిన్నవేమీకావు. ప్రపంచప్రఖ్యాత అమెరికన్ విద్యావేత్త నామ్‌చోమ్‌స్కీ చేస్తున్న పోరాటం ప్రపంచవ్యాప్తంగా మాతృభాషల రక్షణకోసం, విద్యారంగ సంస్కరణలకోసం జరుగుతున్న ఉద్యమాలకు స్ఫూర్తిదాయకంగా ఉంది. మున్ముందు ప్రపంచంలో రాగల సంఘర్షణలకు యుద్ధాలకు ‘్భష’ కూడా ఒక అంశంగా తయారయ్యే అవకాశాల్ని విజ్ఞులు త్రోసిపుచ్చడంలేదు.

ఈ ఏడాది యునెస్కో డైరెక్టర్ జనరల్ ఇరినా బొకోవా అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవం సందర్భంగా ఇచ్చిన సందేశం ప్రకారం బహుళభాషల సమాజాల మనుగడ వాస్తవం అవుతున్నది. ఏ సమాజమూ బహుళబాషల మనుగడను తిరస్కరించే అవకాశంలేదు. అనేక చారిత్రక, రాజకీయ కారణాలవల్ల ఒకటికంటె ఎక్కువ భాషలు ఒక సమాజంలో మనుగడ సాగించాల్సిన పరిస్థితుల్లో కూడ మాతృభాషల రక్షణ తప్పనిసరి అవుతోంది. ఇలాంటి పరిస్థితి ఇప్పుడు మనదేశంలో త్వరత్వరగా ఏర్పడుతోంది. ప్రపంచీకరణ ప్రభావాలు ఇందుకు తోడై సమాజాల్లో భాషాపరమైన గందరగోళం నెలకొనే అవకాశం ఉంది. ప్రభుత్వాలకు స్పష్టమైన భాషావిధానం ఉండకపోతే, మాతృభాషల రక్షణకు ప్రభుత్వాలు దీక్ష వహించకపోతే, భాషా జాతుల్లో ఏర్పడే నైరాశ్యం వల్ల కాలక్రమంలో సంఘర్షణలకు, రాజకీయ పరిణామాలకు దారితీయక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.

తెలుగుభాషాజాతి గురించీ దాని గతం, వర్తమానం, భవిష్యత్తు గురించీ లోతుగా చర్చ ఎప్పుడూ జరుగుతూనే ఉంది. కానీ, అది ఇప్పుడు వేగం అందుకొంది. కొత్త ఆలోచనలు ముందుకు తెస్తున్నారు. వేలాది సంవత్సరాల తెలుగుజాతి భాషాపరంగా ఎదుర్కొంటున్న సంక్షోభానికి ఎన్నో కారణాలేకాదు, దాని వస్తుస్థితిని పరిశీలిస్తే ఎన్నో కోణాలు కూడా మనముందు ప్రత్యక్షమవుతాయి. గతంలో కవుల సాహితీ సృజనలోనే వెల్లడైన ధోరణులు వేరు, నాటి అవసరాల వరకే వారి చూపు సాగింది. నేటి అవసరాలకు తగ్గ కొత్త ఆలోచనలు తప్పనిసరి. కొత్త పదాలను కూర్చుకోవడమూ తప్పనిసరే. అయితే ఇదంతా తెలుగు మూలాలపై ఆధారపడే జరగాలి గాని ఇతర భాషల మూల పదాలపై ఆధారపడి కాదు. భాషను స్వంతమూలాలపై ఆధారపడి ఎదిగించుకొంటేనే, ఆ భాష నిలుస్తుంది. అన్ని అవసరాలకూ తగ్గట్లుగా ప్రపంచస్థాయి భాషగా పెంచుకుంటేనే తెలుగుకు భవిష్యత్తుంటుంది. దీనికి కర్త, కర్మ క్రియ తెలుగు ప్రజలే కావాలి. వారి భాషా సాంస్కృతిక వారసత్వమే ఇందుకు ఆధారం కావాలి.

నేడు ఎదుర్కొంటున్న సంక్షోభాన్నుంచి మన మాతృభాషను రక్షించుకోవాలంటే ప్రాథమిక స్థాయినుంచి స్నాతకోత్తర విద్యదాకా, ఆపైన వృత్తి విద్యలదాకా అన్ని దశల్లోనూ తెలుగుకు గౌరవస్థానం దక్కాలి. ప్రజాజీవితంలో అన్ని దశల్లోనూ-పుట్టుకనుంచి జీవితాంతం వరకూ అన్ని అవసరాలకూ తెలుగే తెలుగు ప్రజాజీవితాన్ని వికసింపజెయ్యాలి. పరిపాలనలో, ఉద్యోగ వ్యాపారాల్లో తెలుగే రాజ్యం చెయ్యాలి. ఇందుకు తగ్గట్లుగా మన ప్రభుత్వ విధానాలుండాలి. కాని, మన ప్రభుత్వానికి తెలుగును కాపాడుకోవాలన్న ఉద్దేశం కనిపించడంలేదు. మనతోపాటే భాషా ప్రాతిపదికన ఏర్పడిన పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలు స్పష్టమైన భాషా విధానంతో అంకిత భావంతో ముందుకు సాగుతుంటే, మన ప్రభుత్వం మాత్రం భాషా రక్షణ తన బాధ్యతేకానట్లు వదిలివేసింది. మన పొరుగు రాష్ట్రాల్లో వారి భాషలకోసం ప్రత్యేక మంత్రిత్వశాఖలు తొలినుండీ ఉన్నాయి. మన రాష్ట్రంలో మాత్రం 60ఏళ్ళయినా ఇంతవరకూ ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. 2001లో తమిళానికి మాత్రమే ప్రాచీన భాష హోదానిచ్చి, తోటి తెలుగు, కన్నడలను కేంద్రం నిర్లక్ష్యం చేస్తే తెలుగు ప్రజలు తిరగబడ్డారుగాని ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదు. తప్పని పరిస్థితుల్లో తమకు రాజకీయంగా దెబ్బతగులకుండా ఉండ టం కోసం కేంద్రాన్ని బ్రతిమాలి, గుర్తింపును సాధించినా, కేంద్రం ఇప్పుడిచ్చిన లక్షలాది రూపాయలను వినియోగించుకోవడానికి కావలసిన వ్యవస్థను ఏర్పరచేందుకు కూడా మన ప్రభుత్వం ముందుకు రావడం లేదు. ఇక-ఆధునిక భాషగా తెలుగును అభివృద్ధిచేసుకోవడం సంగతి సరేసరి.

కొందరు పెద్దలు తమ ప్రసంగాల్లో ప్రజలే తెలుగును రక్షించుకోవాలని చెప్తుంటారు. నిజమే.విస్తృతమైన తెలుగు సమాజం తెలుగును రక్షించుకోగలదు. ప్రభుత్వాలు తమ బాధ్యతను విస్మరించి ఇదే రీతిగా వ్యవహరిస్తుంటే ప్రజలే ఇందుకు పూనుకుంటారు. అయితే ఇది రాజకీయాలను ప్రభావితం చేసేంత మలుపు తీసుకుంటుందా అనే ప్రశ్న ఉండనే ఉన్నది. సమాజానికి, దాని స్వాభిమానానికి దెబ్బతగిలే ఏ అంశమైనా సున్నితంగా ఉంటుంది. తెలుగు సమాజంలో భాష ఒక కీలకమైన రాజకీయాంశంగా మారేందుకు తగిన పరిణామాలు ఎప్పుడెలా వస్తాయో ఎవరూ చెప్పలేరు. పొరుగున ఉన్న రాష్ట్రాల్లో రెండవ పెద్ద భాషగా ఉన్న తెలుగు ప్రజల్లో అసంతృప్తి ఆ ప్రభుత్వాల మనుగడకు ప్రశార్థకంగా మారగల పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే, 50 ఏళ్ళ క్రితం తమిళనాడులోవున్న స్థితిలో యిప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న తెలుగు రానున్న 50 ఏళ్ళలో ప్రజా రాజకీయోద్యమాలను ప్రభావితం చెయ్యజాలదని ఎవరూ అనుకోకూడదు. ఇప్పుడు నడుస్తున్న తెలుగు భాషోద్యమం అలాంటి పరిణామశీలాన్ని పెంపొందించుకొంటే చాలు.

 -డాక్టర్ సామల రమేష్‌బాబు