28, మార్చి 2012, బుధవారం

అయ్యో, అన్ని బుకాయింపులా?!

ఆంధ్రప్రభ వ్యాసం: ఈ శీర్షిక కింద 29.2.12న ప్రచురితమైన 'విభజనవాదం విషతుల్యం' అన్న నా వ్యాసానికి, నిజానికి మళ్లీ ఆగ్రహించిన చొల్లేటి శ్రీశైలం గుప్త విభజన వాదం ప్రజాస్వామ్య స్ఫూర్తి అనే (ఇది విధ్వంసంతో శాంతికి పోరాటం  అన్నట్లు లేదూ?) అనే నూరు శాతం విడ్డూరమైన మకుటంతో (21.3.12న) రాసిన వ్యాసంలో, ఎటువంటి తటపటాయింపులు లేకుండా చేసిన బుకాయింపులకు గతంలోలానే తొలుత సాటి తెలుగు వ్యక్తిగా గౌరవం ప్రకటిస్తూనే తగువిధంగా ప్రతిస్పందించడం, సరైన సమాధానాలు సహేతుకంగా ఇవ్వడం, నా పవిత్ర కర్తవ్యంగా భావిస్తున్నాను. స్వోత్కర్ష అవుతుందేమోనని, ఆ వ్యాసంలో ప్రస్తావించలేదు కానీ, దానికో నేపథ్యముంది. ఎప్పుడూ ఏ రాజకీయ పార్టీలోనూ లేని నేను, ఇటీవలి కాలంలో రాష్ట్ర సమైక్యతను పరిరక్షించే కృషిలో భాగంగా దేశ, రాష్ట్ర రాజధానుల లోను, రాష్ట్రంలోని ముఖ్య ప్రాంతాల్లోను సమైక్య సదస్సులు, నిజానిజాల ఆవిష్కరణ ప్రదర్శనలను నిర్వహించిన ఒక రాజకీయేతర సంస్థ, విశాలాంధ్ర మహాసభలో ఒక సామాన్య కార్యకర్తను. ఈ సంస్థ ఫిబ్రవరి 25న తిరుపతిలో ఒక సదస్సు నిర్వహించింది. పలువురు స్థానిక విద్యార్థులు, ప్రముఖులు పాల్గొన్న ఈ సమైక్య సదస్సులో నేను అప్పటికప్పుడు అడిగితే ఆశువున ప్రసంగించాల్సొచ్చింది. పలువురు వక్తలున్న కారణంగా కేవలం రెండు, మూడు నిమిషాలు మాత్రమే చేసిన ఆ క్లుప్త ప్రసంగంలో, తెలంగాణ ప్రాంతంలోనూ గణనీయ సంఖ్యలో ఉన్న సమైక్యవాదులు ప్రశంసార్హులని అలాగే, సీమాంధ్రలో కూడా కొద్దో గొప్పో ఉన్న విభజనవాదాన్ని కూడా తుదముట్టించాలని, సందర్భతోచితంగా సమైక్యవాద నిబద్ధతతో, పాత్రికేయ సహజమైన నిర్మొహమాటంతో చెప్పడం జరిగింది. అక్కడ క్లుప్తంగా చెప్పిన విషయాన్నే బాగా విస్తరించి వివరించి రాసిన వ్యాసం నాలుగు రోజుల తర్వాత ఈ శీర్షిక కింద ప్రచురితమైంది. విభజన వాదం విషతుల్యం అన్న మకుటంతో సీమాంధ్రలోని వేరు కుంపట్లనీ ఆర్పాలి అన్న మకుటంతో ఏ ప్రాంతంలో తలెత్తినా విభజనవాదం కాలకూట విషం లాంటిదన్న నిశ్చితాభిప్రాయాన్ని ఆ విధంగా పాఠకులతో పంచుకున్నానన్నమాట. చొల్లేటి వారికి మళ్లీ పట్టలేని కోపం వచ్చింది. ఇంకోసారి మండిపడ్డారు. గతంలో చేసిన విమర్శలనే మళ్లీ వండివార్చడం.

వారి మంటకు కారణాలు ఊహించడానికి ప్రయత్నిద్దాం. 'మనోళ్ల' అంతిమ ధ్యేయం ప్రత్యేక రాష్ట్ర సాధన మాత్రం కాదన్న నిజం ఇప్పటికైనా అర్థమైకాబోలు, లేదా వీళ్ల నిర్వాకం ఎలా ఏడ్చినా పోనీ, అక్కడి ప్రజలైనా విసిగివేసారి, మా పీకలు మేమే కోసుకుంటాంలే, విభజనకు సహకరిస్తాంలే అంటే బాగుంటుంది, నా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు వాళ్ల మూలంగానైనా సాకారమవుతుందేమోనన్న దింపుడు కళ్ళం మాదిరి పేరాశ శ్రీశైలం గుప్తకి గుప్తంగా ఉన్నందువల్ల, సీమాంధ్రలోని విభజనవాదాన్ని నా వ్యాసంలో అంత కఠినంగా విమర్శించడం నచ్చలేదని అనుకోవచ్చేమో!

చొల్లేటివారు తన తాజా వ్యాసం మకుటంలోనే విభజనం వాదం ప్రజాస్వామ్య స్ఫూర్తి అంటూ బుకాయింపు ప్రారంభించేరు. సమైక్య వాదం పలికేవారి నాలుకలు కోస్తాం, చేతులు నరికేస్తాం, ఈ ప్రాంతంలో తిరగనివ్వం వంటి బెదిరింపులతో కూడిన విభజన వాదంలో ప్రజాస్వామ్య స్ఫూర్తి కానీ, వారు ఘనంగా పేర్కొన్న భావ ప్రకటనా స్వేచ్ఛ వగైరాలు ఎంత మేరకు, ఎలా ఉన్నాయో వారే చెప్పాలి! ఇంతకీ నా ప్రస్తావిత వ్యాసంలో ఉన్న కొన్ని అంశాల్ని చొల్లేటి వారు చీల్చి చెండాడి నిందించారు కాబట్టి, వాటిని దాదాపు యధాతథంగా మరోసారి చెప్పుకోవాల్సిన అవసరమేర్పడింది. నేను రాసిందేమిటంటే 'విభజన వాదం కాలకూట విషం --ఆ విషాన్ని ఏ ప్రాంతంలో తాగినా, కాకినాడలో కాచి వడబోసి తీపి కాజాలో కలిపితిన్నా --ఏ పాత్రలో తాగినా, కొద్దిగానే రుచిచూసినా ఆ ప్రాంతానికి, ప్రజలకి మాత్రమే కాదు మొత్తం దేశానికే చేటు చేస్తుంది. ఇది చొల్లేటి వారికి రుచించకపోవడం, ఎంత నిజమైనా చేదుగా ఉందనిపించడం సహజమే! ముందే చెప్పుకున్నాం కదా, అక్కడి ప్రజలనైనా మభ్యపెడితే, రాష్ట్ర విభజన సాధ్యం కావచ్చేమోనన్న పేరాశ కొందరికి ఉందని. నిస్పృహ నుంచి ఆగ్రహం పుట్టడం కూడా అసహజం కాదు. ఆయన మండిపడి చీల్చి చెండాడిన నా వ్యాసంలోని మరో వాక్యం --'ప్రత్యేక రాష్ట్ర వాద అసత్యాల పునాదులపై చారిత్రక సాంస్కృతిక వక్రీకరణల సున్నంతో వంకర టింకర రాళ్లు కల్తీ రాజకీయ పొత్తుల ఇసుక మిశ్రమంతో నిర్మితమైన ఒక (అయో)మయ సభ' న్యాయంగా ఈ వాక్యాల్ని వ్యాసం శీర్షికరీత్యా ఇరుప్రాంతాల్లోని విభజన వాదాల్ని అభివర్ణించినట్లు లేదా సమంగా విమర్శించినట్లు అర్థం చేసుకోవాలి. అయితే చొల్లేటివారు దీన్ని నేను తెలంగాణవాదానికి మాత్రమే అన్వయించుకుంటానంటే అది వారిష్టం. (గతంలో రాసిన కొన్ని వ్యాసాల్లో ఆయనే 'తెలంగాణ వాదాన్ని' 'వేర్పాటువాదం' అంటే, 'అలా కాదు చొల్లేటి సారూ, విభజన వాదమంటే గౌరవంగా ఉంటుందని' నేనే రాయాల్సి వచ్చిందిలెండి!)

పేరు చెప్పకుండా ఫలానా వారిని శుక్రాచార్యుడన్నావు ఇంకొకరిని మయుడన్నావు. అన్న చొల్లేటి వారి ఊహాశక్తిని కించపరిచే లేదా ప్రశ్నించే సాహసం కలగడం లేదు కానీ, ఈ సందర్భంలో ఒక విషయం చెప్పాలి. దివంగత ప్రొఫెసర్‌ జయశంకర్‌ ఒక గొప్ప విద్యావేత్త చుక్కారామయ్యలా, ఉన్నత స్థానాలలో, విదేశాలలో ఎంతోమంది శిష్యులున్న గొప్ప గురువు అని గతంలో ఒక వ్యాసంలో శ్లాఘించాను. అలానే ఆర్‌.విద్యాసాగర్‌రావు, మోక్షగుండం విశ్వేశ్వరయ్యను, కె.ఎల్‌.రావు అంతటి గొప్ప ఇంజనీర్‌ అంటారు. (ఇద్దరూ సీమాంధ్రులే అంటే ఏమీ చెప్పలేను కానీ హైదరాబాద్‌కి, తెలంగాణకి సేవలందించారని గుర్తు చేయగలను) అంతేకానీ, నేను కూడా కొన్ని వ్యాసాల్లో నిన్ను చాలా పౌరుషంగా వ్యక్తిగతంగా విమర్శించాను గదా, అందుకని కెసిఆర్‌తో సమానంగా నన్ను కూడా గుర్తించమని, అడిగితే మాత్రం అంగీకరించలేను. ఆయనెక్కడ, మీరెక్కడ? అయితే జయశంకర్‌, విద్యాసాగర్‌ల మేధోసంపత్తిలో నాకు ఆవగింజంతైనా లేదంటూ చొల్లేటి వారు చెప్పిన సత్యాన్ని వినమ్రంగా అంగీకరిస్తాను.

సందర్భం ఎలానూ వచ్చింది కాబట్టి చొల్లేటి తన తాజా వ్యాసంలో చేసిన మరో బుకాయింపుని వారి మాటల్లోనే చూద్దాం. కెసిఆర్‌ తన రాజకీయ ప్రస్థానంలో ఎక్కడా, అశ్లీల పదాలు ఒక్కటికూడా ఉపయోగించలేదు అన్నారు. ఓ దేవుడా! టీవీ ప్రత్యక్ష ప్రసారాల్లో, ప్రింట్‌ మీడియాలో ఉన్న సాక్ష్యాల్ని కాదనే వారిని ఏమంటానులే గాని, నేనైతే దొరవారి దుర్భాషలను యధాతథంగా పేర్కొనే సంస్కారం లేనందువల్ల 'ల' గుణింతంలో తెలుగు ఉర్దూ మిశ్రమ తిట్లు అని రాసేవాణ్ణి. లేదా 'మై సన్స్‌' 'సన్స్‌ ఆఫ్‌ డాంకీ' అనే ఆంగ్ల పదాలకి ముతకానువాదాలు అని చెప్పేవాణ్ణి అని మాత్రం జ్ఞాపకంచేసి ఊరుకుంటాను. ఏమైనా కొందరి దుర్భాషలను 'తెలంగాణ యాస' అని సమర్థించడం ఈ ప్రాంతాన్ని అతి దారుణంగా అవమానించడమేనని గ్రహించాల్సిందిగా చొల్లేటి వారికి మనవి.

తెలంగాణ ప్రజల సంస్కారం చాలా గొప్పది. వారు తీవ్ర అభ్యంతరం చెప్పిన మరో అంశం, కర్మకాలి ఒకవేళ విభజనంటూ జరిగితే అది ఏదో దేముడి ముందు ఒడుపుగా కొట్టిన కొబ్బరికాయలా రెండు చెక్కలే అవదు బలంగా నేలకేసి కొట్టిన గాజుగ్లాసులా పలు ముక్కలవుతుందని చెప్పడం ఎవరికీ నచ్చదని నిజం చెప్పకుండా ఉండలేం కదా. విభజన వాదులు చెప్పే ఏ ఒక్క కారణం వెనకబాటుతనం, చిన్న రాష్ట్రాల్లో పరిపాలనా సౌలభ్యం, ప్రత్యేక సంస్కృతి, యాసా భేదాలు వగైరా వగైరాల్లో ఏది వర్తింపచేసినా తెలంగాణ ప్రాంతాన్నే పలు చిన్న చిట్టి రాష్ట్రాలుగా చీల్చాల్సి వస్తుందన్నది నిర్వివాదాంశం.

ఐదారు సంవత్సరాలుగా వారం వారం ఈ శీర్షిక కింద ప్రచురితమైన పలు వ్యాసాల్లో విభజన వాదంలోని అన్ని అంశాల్ని నేను సహేతుకంగా విశ్లేషణాత్మకంగా ఖండించడం దేశ సమగ్రత కోసమైనా విభజన వాదాన్ని వీడడం ఎంత అవసరమో వివరించడానికే. ఇది నిరంతరంగా జరుగుతూనే ఉంది. కాబట్టి ఈ వ్యాసంలో కొన్ని ముఖ్యాంశాల్ని మాత్రమే ప్రస్తావించడానికి పరిమితమయ్యాను. ఎన్నో బుకాయింపులను ఇంకోసారి ఖండించే అవసరం లేదని భావిస్తున్నాను. సాటి తెలుగువాడిగా చొల్లేటినే కాదు, ఇంకా విభజన వాదాన్ని వీడలేకపోతున్న సాటి తెలుగువారందరికీ కూడా మాతృభాషాభిమాన పూరిత ప్రణామాలర్పిస్తూ ఈ వ్యాసాన్ని ముగిస్తున్నాను.


-చేగొండి రామజోగయ్య,
విశ్రాంత బ్యాంకు అధికారి, విశాలాంధ్రమహాసభ సభ్యులు

7, మార్చి 2012, బుధవారం

దొరవారూ, సీమాంధ్రకు వెళ్లరూ...!

ఆంధ్ర ప్రభ వ్యాసం: పోయిన వారం వ్యాసంలో సీమాంధ్రలోని కోవూరు నియోజకవర్గం ఉప ఎన్నికలో 'తెరాస' అభ్యర్థిని నిలుపుతానని అక్కడికి రోడ్డు మార్గాన ఎన్నికల ప్రచారానికి వెళ్తానని కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు ప్రకటించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆనందించి, వారు కాని నిజంగా కాని పర్యటిస్తే సీమాంధ్ర ప్రజలు పూలమాలలతో స్వాగతించాలని, సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రవ్వాలని ఆశీర్వదించాలని క్లుప్తంగా ప్రస్తావించడం జరిగింది. అయితే, ఇదేదో ఈ వ్యాసకర్తకు కొత్తగా వచ్చిన ఆలోచన కాదని చెప్పడానికి మాత్రమే ప్రస్తావించాల్సొస్తోంది. ఇదే శీర్షిక కింద 25 నెలల క్రితమే 27.1.2010న 'కెసిఆర్‌ సీమాంధ్రలో పర్యటించాలి' అన్న మకుటంతో, ప్రచురితమైన నా వ్యాసంలో ఈ భావాన్ని వ్యక్తీకరించాను. (దీన్ని వంకర వ్యంగ్యంగా అపోహపడి కాబోలు, కొందరు 'వీర విభజనవాదులు' బెదిరింపు కాల్స్‌ చేయడం వేరే విషయం అనుకోండి!) ఇంతకీ ఈ వ్యాసం రాస్తున్న సమయానికి దొరవారి సీమాంధ్ర పర్యటన నిజంగా ఉంటుందో లేదో, కచ్చితంగా నిర్థారణ కాకపోవడం, నిరుత్సాహాన్ని కలిగిస్తున్నా, ఈ విషయం గురించి మరికొంత ఈ వారం చర్చించాలన్న కోరిక (దయ ఉంచి, దురద అనుకోవద్దు) కలిగింది.

తారక రామారావు, కవితమ్మలు నిజాల్ని నిజాయితీగా ఒప్పుకోవాలన్న (తప్పనిసరైన తరుణం వరకు ఆగా?!) నైజాన్ని పితృదేవుని నుంచి పుణికి పుచ్చుకున్నామని ఒకసారి ఉద్ఘాటించారు. అందుకు అందరూ హర్షించదగ్గ నిదర్శనాలుగా కుమారరత్నం (మొదట్లో కాదని దబాయించినా) తను గుంటూరులో విద్యాభ్యాసం చేశానని, అమెరికా నుంచి అమాంతంగా తిరిగొచ్చేసి, ఉద్యమంలో దూకేసిన పిదప కూడా, సీమాంధ్ర మిత్రులతో వ్యాపారాలు కొనసాగిస్తున్నానని ఒప్పుకున్నారు. కుమార్తె ఏమో, తనకు ఇప్పటికీ సోకాల్డ్‌ ఆంధ్రోళ్లతో, ఆమాటకొస్తే కనిమొళితో కూడా ప్రాంతేతర స్నేహ బాంధవ్యాలున్నాయని చెప్పి (వాణిజ్య సంబంధాల గురించేమీ చెప్పలేదు) ప్రచా(సా)రమాధ్యమాల సాక్షిగా తన నిజాయితీని ప్రదర్శించేరు. ఇవేమీ తప్పులు కావు గదా! కవితమ్మ ఇంకా ముందుకుపోయి, ఒక వారపత్రికలో ప్రచురితమైన ఇంటర్వ్యూలో, తన తండ్రికి, అపారంగా ధూమపానం, పరిమితంగా మద్యంసేవించే అలవాటుండేదని, ఇప్పుడు సంపూర్ణంగా మానేశారని, 'నాన్న విల్‌ పవర్‌' కిది నిదర్శనమని సగర్వంగా పేర్కొన్నారు. మానేసిన విషయాన్ని నమ్మని వాళ్లెవరైనా ఉంటే అది వాళ్ల ఖర్మ! ఏమైనా, రాబోయే రోజుల్లో ఈ సూపర్‌ అన్నా చెల్లెళ్ల ఖర్మ! ఏమైనా రాబోయే రోజుల్లో ఈ సూపర్‌ అన్నా చెల్లెళ్ల నుంచి మరికొన్ని కుటుంబపరమైన ఉద్యమ సంబంధమైన నిజా నిజాల ఆవిష్కరణ, నిజాయితీల ప్రదర్శనలను ఆశించవచ్చు. అప్పటివరకు మనం సహనం వహిస్తే బాగుంటుంది. అంతేకానీ, ఈలోగానే విపరీత ఊహలకు, అనవసరపు అపోహలకు రెక్కలు తొడగరాదు. ఇక పెద్దాయన సంగతికొస్తే, 'తెలంగాణ ఇస్తనని' సోనియా నా చెవిలో ఎప్పుడూ చెప్పలేదులే అన్న దానితో ప్రారంభించి మరెన్నో నిజాలు, మనకు 'చెప్పేసే' శుభ సమయం కోసం వేచి ఉందాంలే కానీ, ప్రస్తుతానికి ఆయన సీమాంధ్ర పర్యటన అవసరం గురించి చర్చించుకోవడానికే పరిమితమవుదాం!

దొరవారి కుటుంబ మూలాల ప్రస్తావన కాస్త పక్కన పెడదాం. అంటే బీహార్‌ టు విజయనగరం జిల్లా టు కరీంనగర్‌ జిల్లా టు, మెదక్‌ జిల్లాలో చింత మండక గ్రామం టు సిద్ధిపేట టౌన్‌ టు హైదరాబాద్‌ నగరానికి వలస ప్రస్థావనం, అలానే మెదక్‌ జిల్లాలో ఎకరాల విస్తీర్ణంలో నివాస గృహాలు, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌ వంటి ఇతర తెలంగాణ జిల్లాల్లో (ఎక్కడ పోటీ చేస్తే అక్కడ) అతిథి గృహాలు, హైదరాబాద్‌లో భవంతులు, గుజరాత్‌లో, గుర్గావ్‌లో వ్యాపారాలు, ఇలాంటి వాటి గురించి ప్రచారంలో ఉన్న ఊసులిప్పుడొద్దు, ఆయన ఒక ఉద్యమ కారుడు. ఒక గొప్ప పార్టీకి అధ్యక్షుడు. ఇంతవరకు ఎన్నికలలో అపజయం ఎదురవ్వని ప్రజాప్రతినిధి -ఇవన్నీ ఎందుకు? ఒక భారతీయపౌరుడు, ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎక్కడికైనా వెళ్లే హక్కు ఆయనకు ఉందా లేదా? 2000కి ముందు ఉన్న రాజ్యాంగమే ఇప్పుడూ ఉంది గదా! నిజానికి మంత్రిగా ఉన్నప్పుడు అరుదుగానైనా ఆయన ఆయా ప్రాంతాలకు వెళ్లేవారు. ఆంధ్రుల ఆదికవి నన్నయ నడయాడిన రాజమహేంద్రవరం వెళ్ళారు. కోటిలింగాల రేవుని చూసి తరించారు. పల్నాడులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల శిక్షణ శిబిరంలో పాఠాలు చెప్పారు. పల్నాడులో ప్రఖ్యాతి పొందిన 'నాగమ్మ' అసలు కరీంనగర్‌ నుంచి వలస వెళ్లిన భామ అన్నది ఈ సందర్భంలో గమనార్హం. ఓరుగల్లు పోతన పద్యాలే కాదు పల్నాటి శ్రీనాథుని పద్యాలు కూడా కెసిఆర్‌కి కంఠతా వచ్చు. వారిద్దరూ బావ బావమరదులని కూడా తెలుసు. సహజ వాగ్ధాటితో బాటు, మాతృభాషపై గట్టి పట్టు ఉన్న కెసిఆర్‌ని సీమాంధ్రలోని పార్టీ కార్యకర్తలు చాలా అభిమానించే వారు. విజన్‌ 2020 లో ఇంకా ఎన్నో పార్టీ పథకాల రూపకల్పనలో ఆయన పాత్ర గణనీయంగా ఉండేదని చాలామందికి తెలుసు. తెలుగు ప్రజల దురదృష్టవశాత్తు 1999లో ఆయనకి మంత్రిపదవి రాలేదు. ఆ అవమానాన్ని ఆయన జీర్ణించుకోలేక పోయారు. అంతే 2001లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ప్రారంభమైంది. సీమాంధ్ర ప్రజలకు దొరవారి దర్శన భాగ్యం బుల్లితెరకే పరిమితమై పోయింది! ఆయన పర్యటనలు లేక సీమాంధ్ర చిన్నబుచ్చుకుంటోంది, బోసి పోతోంది. ఆయన ప్రత్యక్ష దర్శనానికి ముఖం వాచి ఉంది. నిజానికి కెసిఆర్‌కి కూడా సీమాంధ్ర వెళ్లాలనే ఉంటుందనుకోవడానికి కొన్ని ఉదాహరణలు చెప్పాలి. ఉద్యమం ప్రారంభించిన తర్వాత ఒకేసారి తన ఇష్టదైవమైన వేంకటేశ్వరుని దర్శనార్థం, 2004 ఎన్నికలకు ముందు తిరుపతికి వెళ్లారు. 26 సీట్లు వచ్చాయి. 2008లో తెలుగుదేశం పార్టీలో పొత్తుకుదురిన సందర్భంలో, ఆ ఏడు విశాఖపట్నంలో జరిగిన మహానాడుకి రోడ్డు మార్గాన, మందీ మార్బలం, వాహన శ్రేణితో వెళ్తానని ఆనందంగా ప్రకటించారు. ఎందుకనో మనసు మార్చుకుని వెళ్లనేలేదు. సీమాంధ్రలో పర్యటిస్తానని 2009 ఎన్నికల సందర్భంగా కూడా మిత్రపక్షాలకు ప్రచారం చేస్తానని చెప్పారు కానీ వెళ్లలేదు. తను వెళ్లకపోయినా, కొడుకుని కూతుర్నీ పంపించక పోయినా, ఇతర తెలంగాణ వాదులను సీమాంధ్ర పర్యటనలు చేయవద్దని ఎప్పుడూ అనలేదు. వెళ్లమనే పరోక్షంగా ప్రోత్సహించేరు. వెళ్లినవాళ్లకీ ఎటువంటి ఆటంకాలు ఎదురవ్వలేదు. ఉద్యమం బహు ఉద్ధృతంగా ఉన్నప్పుడు వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గం తెరాస ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్‌ తిరుపతిలో అంగరంగ వైభోగంగా వివాహం చేసుకున్నారు. ఒక సంవత్సరం క్రితం హరీష్‌రావు శ్రీకాళహస్తిలో ఎంచక్కా రాహుకేతుపూజ చేసుకున్నారు (ఆయన రాహుకేతువులుగా పార్టీలో ఎవర్ని భావిస్తున్నారన్న విషయంలో ప్రచారంలో ఉన్న కథనాల ఊసుమనకొద్దులెండి!) తెలంగాణ వాదులుగా చలామణి అవుతున్న పలువురు గద్దర్‌ కొండాలక్ష్మణ్‌లతో సహా సీమాంధ్రలో సభలు పెట్టుకున్నారు. పోయిన శనివారం నాడు పొన్నం ప్రభాకర్‌ గుంటూరులో రాయపాటి ఇంటిని పావనం చేశారు. మధుయాష్కి గౌడ్‌ అదేరోజు (4.3.12న) గుంటూరులో ఉన్నారు. వివేక్‌ వంటి టిఎంపిలు కొందరికి సీమాంధ్రలో వ్యాపార సామ్రాజ్యాలున్నందున తరచుగా అక్కడికి వెళ్తూనే ఉంటారు. వి.హెచ్‌. విషయం వేరే చెప్పాలా? ఈ విషయాలపై కెసిఆర్‌ ఏ విధమైన విమర్శలు చేయలేదు. అభ్యంతరాలు చెప్పలేదు. ఆవిధంగా అఖిలాంధ్రపై తనకున్న ఆదరాన్ని పరోక్షంగా చాటుకుంటూనే ఉన్నారు. అర్థం చేసుకోలేకపోతే అది మన తప్పే అవుతుంది కానీ, ఆయనది కాదు. తూర్పు గోదావరి జిల్లాకి చెందిన విజయశాంతిని ఎంపిని చేశారు. పదో చెల్లిగా ప్రకటించారన్న నిజం మర్చిపోతే ఎలా?

కిరణ్‌, బాబు, చిరంజీవి, బొత్సలు తెలంగాణలో పర్యటిస్తున్నట్లే ఒక పార్టీ అధ్యక్షుడిగా కెసిఆర్‌ సీమాంధ్రలో ఎందుకు పర్యటించకూడదు? ఒబామా కెన్యా వెళ్తే ఆ దేశ ప్రజలు ఎంత ఆనందించారో, స్వాగతించారో, సీమాంధ్రులు కూడా ప్రపంచ ప్రఖ్యాతి పొందిన సాటి తెలుగువాడు, కెసిఆర్‌ని అదేవిధంగా అక్కున చేర్చుకుంటారు. అసలే తెలుగువాళ్లందరికీ 'తెగువ' ఎక్కువ. కెసిఆర్‌లో కూడా. పైగా ఆయన హనుమంతుని కన్న గొప్పవాడు. స్వీయ శక్తి సామర్థ్యాల గురించి ఎవరూ చెప్పనవసరం లేకుండానే తనకే బాగా తెలుసున్న మేధావి. అలా చేయాలనుకుంటే విడిపోతే మీకే మేలు అని చెప్పగలిగే వాక్చాతుర్యం ఉన్నదాయనకు. విభజనకు సహకరించమని అక్కడి ప్రజల్ని అభ్యర్థించి, ఇక్కడి వాళ్లకి, మనోళ్లు ఒప్పుకోవడంలేదు, ఏం చేస్తం మరి, ప్రజాస్వామ్యంలో అధిక సంఖ్యాకుల అభిమతాన్నే ఆమోదించాలి, కదా ఊర్కొందాం అని నచ్చచెప్పగలిగే తెలివితేటలు, వాక్చాతుర్యం ఆయనకున్నాయి. సరే ఇవన్నీ ఎలాగున్నా ఆయన తరచుగా చెప్పేమాట, ప్రజాక్షేత్రమంటారే, అందులోకి అడుగిడి మాటలతో దున్నేసి ఆడ కూడా విభజన విత్తులు నాటివస్తాను. ఏమో, పంట పండావచ్చు -గుర్రం ఎగరావచ్చు. 'నా ప్రయత్నాన్ని అపార్థం చేసుకోవద్దు' అని ప్రస్తుతానికి తెలంగాణ ప్రజలకు చెప్పుకోవచ్చు. కాబట్టి కెసిఆర్‌ తటపడాయించకండి. సీమాంధ్రలో త్వరగా పర్యటించండి -ఆఖర్లో కొందరి మనసుల్లో కదలాడే అనుమానాన్ని కూడా నివృత్తి చేయాలి. అక్కడికి కెసిఆర్‌ వెళ్లినప్పుడు ఒకవేళ సంస్కారం లేని మూర్ఖుడెవరైనా, 'మమ్మల్ని అలా తిట్టారు' 'ఇలా అన్నారు' అని ప్రశ్నిస్తే, 'అదేం కాదు సోదరా -తిట్టనే లేదు, మై సన్స్‌ అంటే నా పుత్రసమానులని అర్థం. అలానే సన్స్‌ ఆఫ్‌ డాంకీ అంటే నన్ను నేనే తిట్టుకున్నట్లు అని చెప్పేసి అందర్నీ నవ్వించగలిగే హాస్యసంభాషణా చతురత కెసిఆర్‌కి ఉంది. కాబట్టి ఆయన త్వరలో సీమాంధ్రలో పర్యటించి తీరాలి. తెలుగువారి చరిత్రలో ఒక మేలు మలుపుకి ఆద్యుడు కావాలి. దొరవారూ ప్లీజ్‌ వెళ్లరూ...

- చేగొండి రామజోగయ్య ,
విశ్రాంత బ్యాంకు అధికారి, విశాలాంధ్ర మహాసభ సభ్యులు