12, సెప్టెంబర్ 2013, గురువారం

మేలుకో కావూరి మేలుకో!


నిరసన పత్రం


గౌరవనీయులు శ్రీ కావూరి సాంబశివరావు
కేంద్ర మంత్రివర్యులు

ఆర్య,

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన ప్రతిపాదన అమలయితే అన్ని ప్రాంతాల తెలుగు ప్రజలు నష్టపోతారు. మన రాష్ట్ర విభజన దేశవ్యాప్తంగా ఎన్ని విపరిమాణాలకు, విభజనలకు, విద్వేషాలకు, విధ్వంసాలకు, దారి తీస్తుందో మీకు ప్రత్యేకంగా వివరించనవసరం లేదు. 

కేంద్రంలో మంత్రి పదవి చేపట్టక ముందు, తమరే సహీతుకంగా చాటి చెప్పిన సమైక్య వాదనలు ప్రజలు మరిచిపోలేదు. సమైక్యవాద ప్రవక్తగా, ఐక్యతా ఆశాజ్యోతిగా, మిమ్మల్ని నిన్న మొన్నటి వరకు, నెత్తిన పెట్టుకున్న ప్రజలే నేడు ఎందుకు కత్తి దూస్తున్నారో, ఎందుకు దూషిస్తున్నారో మీరు గుర్తించాలి. మీ వర్తమాన ప్రవర్తన, పదవీ వ్యామోహం, గతంలో ఎంతగానో అభిమానించిన వారందరిలో మీ పట్ల విముఖతను ఆగ్రహాన్ని పెంచాయి.

దళపతిగా వ్యవహరించిన మిమ్మల్ని బుట్టలో వేసుకుంటే సమైక్య సమరం చతికిలబడిపోతుందని అంచనా వేసారు ఢిల్లీ పెద్దలు. ఆ కుట్రలు నేడు వమ్ము అయిపోయాయి. ఈ రోజు నాయకులు లేకుండానే కోట్లాది సామాన్య ప్రజలు సమైక్య సమరంలో అలుపెరుగని వీరుల్లా పోరాడుతున్నారు.

కాబట్టి కావూరి వారు, ఇప్పటికయినా తమరు అంతరాత్మ ప్రబోధానికనుగుణంగా తక్షణం కేంద్రంలోని మంత్రి పదవికి రాజీనామా చేసి రాష్ట్ర సమైక్యతకు పాటు పడవలసిందిగా అభ్యర్ధిస్తున్నాం. మీ రాజీనామా ఇతర సహచర తెలుగు కేంద్ర మంత్రులకు, పార్లమెంట్ సభ్యులకు మార్గదర్శకం అవుతుంది. రాజీనామా చేసి రాష్ట్ర సమగ్రతను తద్వారా దేశ సమైక్యతను కాపాడండి.

సమైక్య ఉద్యమానికి మీ పెదవి సానుభూతి చాలదు. మీ పదవీ త్యాగం కావాలి.

నలమోతుచక్రవర్తి
అధ్యక్షులు
విశాలాంధ్ర మహాసభ

4 కామెంట్‌లు:

  1. మన రాష్ట్ర విభజన దేశవ్యాప్తంగా ఎన్ని విపరిమాణాలకు,
    విభజనలకు,
    విద్వేషాలకు,
    విధ్వంసాలకు,
    దారి తీస్తుందో
    మీకు ప్రత్యేకంగా వివరించనవసరం లేదు.
    <<<<>>>>
    స్వాతంత్ర్యం వచ్చాక పదహారో పదిహేడో రాష్త్ర విభజనలు జరిగాయి
    నిన్న గాక మొన్న
    జార్ఖండ్
    ఉత్తరాంచల్,
    చత్తీస్ ఘడ్
    రాష్త్రాలు ఏర్పడ్డాయి
    ఎక్కడా ఎప్పుడూ ఏ విధ్వంసం జరగలెదే....!
    ఎందుకీ
    బూటకపు
    దుర్మార్గపు,
    గోబెల్ ప్రచారాలు ????

    రిప్లయితొలగించండి
  2. "ఎందుకు దూషిస్తున్నారో"
    నిన్నటిదాకా తెలంగాణా వారిని దూషించిన నలమొతు గారు ఇప్పుడు ఆంద్ర నాయకులపై పడ్డారా?


    "కోట్లాది సామాన్య ప్రజలు సమైక్య సమరంలో అలుపెరుగని వీరుల్లా పోరాడుతున్నారు"

    బెజవాడలో నాకు కనిపించలేదు. నలమొతు వారికి ఎక్కడ కనిపించారో ఏమో?

    రిప్లయితొలగించండి
  3. జై గారూ, నల్లమోతు గారు తెలంగాణ వారిని దూషించారా? అదెప్పుడబ్బా? అసలాయనకు మీరు ఆ అవకాశం ఎప్పుడిచ్చారు? ప్రెస్సుమీట్ పెడితే తెవాద జర్నలిస్టులు మాట్టాడనివ్వరు. పుస్తకం విడుదల చేద్దామనుకుంటే తెవాదులు బీభత్సం చేస్తారు, సభ పెట్టుకుండామంటే రభస చేస్తారు. పైగా దూషించారనే ఆరోపణా!? మీ బెజవాడ కథ కూడా ఈ ఆరోపణ లాంటిదేనాండీ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భస్మాసుర హస్తం, wily Professor వగైరాలు దూషణలు కావా? సభలో మాట్లాడినవి మాత్రమె దూషణలు కావండీ. బ్లాగులలో "పుస్తకాలలో" కూడా రాయొచ్చు.

      నేను బెజవాడ నుండి రాసింది ప్రత్యక్ష రిపోర్టు. మీకు కథగా అనిపిస్తే నేను ఏమీ చేయలేను. కావాలంటే తమరే ఆంద్ర అంతా తిరిగి మీకు కనిపించిన వాస్తవాలు రాయండి.

      తొలగించండి