4, సెప్టెంబర్ 2013, బుధవారం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సమైక్యతను కాపాడవలసిందిగా భారత రాష్ట్రపతి గారిని కోరుతూ తీర్మానం


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేయడం, ఆ దరిమిలా రాష్ట్ర విభజన ప్రక్రియను త్వరలో ప్ర్రారంభిస్తామని రాజ్యసభ లో ప్రభుత్వం తరపున ప్రకటన రావడం మమ్మల్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. 

మేము దీనిని తీవ్రం గా వ్యతిరేకిస్తున్నాము.

రాష్ట్రాన్ని విభజించాలని తెలంగాణా ప్రాంతం లో కొంత మంది లేవదీసిన ఆందోళన అసత్యాల మీద, అపోహలమీద, అర్ధ సత్యాల మీద, వక్రీకరణల మీద, ద్వేష భావన మీద ఆధారపడి నిర్మాణ మయినది. ఈ ఆందోళనకు ప్రాతిపదిక లేదు. చరిత్రను వక్రీకరించి, ఆర్ధిక గణాంకాలను దాచిపెట్టి, ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి కొంతమంది స్వార్ధ రాజకీయ నాయకులు పనిగట్టుకుని నడిపిన ఆందోళన ఇది. ఈ ఆందోళనకు పెద్ద ఎత్తున ప్రజల మద్దతు లేదు. 2004 నుండి జరిగిన సాధారణ ఎన్నికల నుండి మొన్న జరిగిన పంచాయితీ ఎన్నికల వరకు వెల్లడైన ఫలితాలు ఇందుకు బలమైన నిదర్శనాలు. ఉద్వేగ భరిత వాతావరణం లో జరిగిన కొన్ని ఉపఎన్నికల ఫలితాలు మినహా, రాష్ట్ర విభజనకు విస్తృత మద్దతు ఉన్నదనడానికి ఎలాంటి దాఖలాలు లేవు.

తెలుగు ప్రజలు అందరూ ఒకే పాలన కిందకు రావాలని, స్వరాష్ట్రం ఏర్పాటు చేసుకోవాలనీ దశాబ్దాలుగా జరిగిన ఉద్యమాల ఫలితం గా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం 1956 లో ఏర్పడింది. అనేక మంది నాయకులు సుదీర్ఘ కాలం తెలుగు జాతి ఐక్యతకు కఠోర మైన తపస్సు చేసి సాధించుకున్న భాషా ప్రయుక్త రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్.

తెలుగు జాతి ఐక్యత కేవలం కొంత మంది స్వార్ధ శక్తుల కుట్రలకు, అసత్యాలకు, అర్ధసత్యాలకు, వక్రీకరణలకు బలికాకూడదు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన ఆలోచనను, ప్రతిపాదనను భారత ప్రభుత్వం తక్షణం వెనక్కు తీసుకోవాలని కోరుతూ మా పంచాయితీ సభ్యులందరం ఏకగ్రీవం గా తీర్మానించాము.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సమైక్యతను కాపాడ వలసినదిగా భారత రాష్ట్ర పతి గారిని కోరుతూ ఏకగ్రీవం గా ఈ తీర్మానం చేయడమైనది.    

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి