ఆంధ్రప్రభ వ్యాసం: అడపా దడపా అన్య విషయాలపై కూడా
రాస్తున్నా, ఈ శీర్షిక కింద గత అయిదారేళ్లుగా వారం వారం ప్రచురితమవుతున్న
నా వ్యాసాల్లో ప్రతిబింబించిన అంతస్సూత్రం, ఒకవేళ ఈ రాష్ట్ర విభజన జరిగితే,
యావత్‌ప్రపంచంలోని తెలుగు ప్రజలందరికీ, ఇప్పటికే సగం చచ్చి ఉన్న తెలుగు
భాషకి అలాగే యావద్భారత దేశ సమైక్యతకు తీరని నష్టం వాటిల్లుతుందన్నది
మాత్రమే! ఈ చేదు ఆవేదనకి అప్పుడప్పుడు సభ్యత వీడని వ్యంగ్యం, అపహాస్యం
దరిచేరని హాస్యం రంగరించడం తప్పనుకోవడం లేదు. ఈ వ్యాస పరంపరలో'విడిపోతే
నష్టమెవరికి' అన్న శీర్షికన 4-4-12న ప్రచురితమైన వ్యాసంలోని అంశాలకు మళ్లీ
ఉక్రోషం వచ్చిన చొల్లేటి శ్రీశైలం గుప్త -అదుపు చేసుకోలేని ఆగ్రహంతో రాసిన
'విడిపోతే లాభమెవరికి' అన్న వ్యాసానికి (18-4-12న) తగువిధంగా
ప్రతిస్పందించడం, నా పవిత్ర పాత్రికేయ బాధ్యతగా అంగీకరిస్తున్నాను. అలానే,
తన వ్యాసంలో వారు నాపై చేసిన ఆరోపణలకి (నిజానికి దూషణ లనాలి!) గతంలో లానే
చొల్లేటికి స్వభాషీయునిగా గౌరవాభిమానాలు ప్రకటిస్తూనే, స్వీయ నిర్దేశిత
సంయమనా ప్రమాణాలకి లోబడి తగు వివరణ లీయడం నా వ్యక్తిగత హక్కుగా కూడా
భావిస్తున్నాను. అయితే స్థలాభావం దృష్ట్యాను, గతంలోనే పలుమార్లు ఆధారాలు,
గణాంకాల సహితంగా తగు సమాధానాలిచ్చి ఉన్నందున, వాటిని మళ్లీ వివరంగా
చెప్పాల్సిన అవసరం లేదనే చర్చా సూత్రాన్ని కూడా పాటిస్తూ, నా జవాబుని
క్లుప్తీకరిస్తున్న విషయం గ్రహించాలని ప్రార్థన -(నిజానికి చొల్లేటి వారి
తాజా వ్యాసం ఇప్పటికే అభూత కల్పనలు, కల్పిత గణాంకాలు, అపోహలుగా నిరూపితమైన
తేలిపోయిన అపస్వరాలతో కూడిన పాతపాట మాత్రమే).
ముందుగా తన
వ్యాసారంభంలోనే చొల్లేటి పట్టలేని ఉక్రోషంతో మూడు వ్యక్తిగత ఆరోపణలు
(దూషణలు) చేశారు. నా వ్యాసాలలో తెలంగాణ ప్రాంతంపై అక్కసుతో అక్కరకురాని
'ప్రేలాపనలు' చేస్తున్నానని (2) సీమాంధ్ర పక్షపాతినని (3) ప్రత్యేక రాష్ట్ర
వాదం సాధించిన అఖండ విజయాలను చూసి బెంబేలెత్తిపోయి సమైక్యవాదాన్ని
వదిలేస్తూ ఒక్కో మెట్టు దిగుతున్నానని. ఈ అసత్యారోపణలకు చొల్లేటి
కోసమేకాదు... అన్ని ప్రాంతాల తెలుగు ప్రజలకోసం సమాధానమీయాలనుకుంటున్నాను.
నా వ్యాసాలలో నేను పదే పదే సహేతుకంగా ప్రస్తావించిన అంశం, తెలుగు జాతి, భాష తెలంగాణాగా నేడు వ్యవహరింపబడుతున్న ఈ ప్రాంతంలోనే ఆవిర్భవించి
కాలక్రమేణా నదీ నదాల ప్రవాహాల వెంబడి ఇతర ప్రాంతాలకు విస్తరించిందని, ఆ
విధంగా నేడు సీమాంధ్రులుగా పిలువబడుతున్న వాళ్లకి మూలపురుషులు
తెలంగాణీయులేనన్నది -నన్నయ నుండి నారాయణరెడ్డి వరకు పోతన వేమనాది
సాహితీమూర్తులంతా ప్రాంతాలకు అతీతంగా మనకు ఆరాధనీయులని ఎన్నోసార్లు
పేర్కొన్నాను. అంతేకాదు విభజనవాదం ఏ ప్రాంతంలో తలెత్తినా కాలకూట విషమని, ఆ
ప్రాంతానికి ప్రజలకి కూడా చాలా చేటు చేస్తుందని, అన్ని ప్రాంతాలలోని విభజన
వాదాన్ని సమంగా నిష్పక్షపాతంగా నిష్కర్షగా విమర్శించడం జరిగింది. విభజన
వాదాన్నే గానీ, ఏ ప్రాంతపు ప్రజల్నీ కించపరచలేదు.
బహుశా, మనోళ్లు
ఎలానూ సాధించలేరు కనీసం అక్కడోళ్లైనా విభజన కోసం ఉద్యమిస్తే బాగుంటుందనే
దింపుడు కళ్లాం ఆశతో ఉన్న చొల్లేటి లాంటి వారికి ఈ ధోరణి నచ్చడం లేదు. పైగా
ఉక్రోషాన్ని రేపుతోందని అనుకుని ఊరుకుందాం.
సకల జనుల సమ్మె అఖండ
విజయం సాధించిందన్న చొల్లేటి వారి ప్రగల్భం గురించి ఎంత తక్కువ
చెప్పుకుంటే అంత మంచిది. తమకు సకల సంకేతాలు ప్రసాదించిన ఆ సమ్మె(ట) దెబ్బకి
విలవిల లాడిపోయింది -ప్రధానంగా తెలంగాణ ప్రజలే! పొరుగు రాష్ట్రాల
ప్రజల్లోను, ఆ మాటకొస్తే యావద్భారత దేశ ప్రజల్లో అత్యధిక సంఖ్యాకుల్లో
ప్రత్యేక తెలంగాణ వాదం పట్ల దేశం ఏమైపోయినా సరే 'మాది మాగ్గావాలే' అంటున్న
విభజన వాదుల ప్రజాప్రతినిధుల మొండి చర్యల మూలంగా, చాలా వైముఖ్యం
ఏర్పడిందన్నది వాస్తవం. మరి ఆ అఖండ విజయాన్ని గ్రహించి బెంబేలెత్తిపోయి
ఒక్కో మెట్టు దిగుతున్నది కెసిఆర్ తో సహా విభజనవాదులే గానీ నాలాంటి
రాజకీయేతర సమైక్యతావాదులు కాదని చొల్లేటి గ్రహిస్తే బాగుంటుంది. వారు
గ్రహించితీరాల్సిన మరో ముఖ్యమైన అంశం విభజన కనుకూలంగా తనతో సహా కొందరు
చెప్పే పరిపాలనా సౌలభ్యం -చిన్న రాష్ట్రాలు, పాత సంస్థానాల పునరుద్ధరణ
సంస్కృతులలో స్వల్ప వ్యత్యాసాలు... ఇలాంటి ఏ ఒక్క కారణాన్ని వర్తింపజేసినా ఈ
దేశాన్ని వందలాది రాష్ట్రాలుగా చీల్చాల్సివస్తుంది. తెలంగాణని కూడా ఎన్నో
చిన్న చిట్టి రాష్ట్రాలుగా చీల్చాల్సివస్తుంది!
చొల్లేటి వారి
పాత పాట లోని మరికొన్ని అపస్వరాలని కూడా క్లుప్తంగా పరిశీలిద్దాం. ఈ
ప్రాంతాన్ని ఆ ప్రాంతం వాళ్లు జల దోపిడీ చేశారన్నారు (అందుకు కారణం ఈ
ప్రాంతపు నేతల నిర్వాకం అని కూడా అన్నారనుకోండి!) విలీనం తర్వాత 1956 నుండి
2007 వరకు, ప్రణాళికా సంఘం యొక్క అధికారిక గణాంకాల ప్రకారం కోస్తాలో నీటి
పారుదల కింద అదనంగా వచ్చిన భూమివృద్ధి శాతం 57, రాయలసీమలో 44 శాతం ఉంటే
తెలంగాణాలో 91 శాతం ఉంది. వ్యవసాయ ఉత్పత్తుల పరిమాణాల్లో వృద్ధి కోస్తాలో
107 శాతం, రాయలసీమలో 15 శాతం ఉండేది. తెలంగాణలో 244 శాతం ఉంది. అలాగే
పరిశ్రమల పురోగతి, ఉపాధి కల్పన, విద్యావ్యాప్తి సగటు ఆదాయం ఇలా ఏ పెరామీటరు
(అభీష్ట పరిమాణం)లో చూసినా తెలంగాణాలో విలీనం తర్వాత బహుముఖీన అభివృద్ధి
జరిగి ఉన్నది వాస్తవం. ఇది గ్రహించే కెసిఆర్‌తో సహా విభజనవాదులు వెనకబాటు
తనం అన్న ప్రాతిపదికను ఎప్పుడో వదిలేశారు. చొల్లేటి వారే ఇంకా పట్టుకుని
వేలాడుతున్నారు. వారు గ్రహించాల్సిన మరో అంశం. గోదావరి, కృష్ణా
నదులు మన రాష్ట్రంలోని ఏ ఒక్క ప్రాంతానికో సొంతం కాదు. అవి అంతర్ రాష్ట్ర
నదులు. ఇప్పటికే దిగువనున్న మన రాష్ట్రానికి అన్యాయం జరుగుతోంది. మన
అనైక్యత దాన్ని ఇంకా పెంపొందిస్తుంది. మనలో మనం తగు విధంగా జలపంపిణీ
న్యాయంగా చేసుకోవాలి. వరదలతో నష్టపోయే దిగువ రాష్ట్రంగా మన హక్కుల్ని
ఐక్యంగా సాధించుకోవాలి. ఆఖర్లో ఒకమాట - భద్రాచలం మాత్రమే కాదు..
రాయలసీమ, కోస్తాంధ్రలు కూడా నైజాం తన స్వార్థ ప్రయోజనాలకోసం ఆంగ్లేయులకి
ధారాదత్తం చేసే వరకు కలిసే ఉన్నాయి కదా. మరి కెసిఆర్ ఇతరులు రహస్యంగా
రాజీపడుతున్న విధంగా 1956 అక్టోబర్ 31 నాటి సరిహద్దుల రాష్ట్రం
కోరుకోవడమెందుకు? ఏది ఏమైనా, ఉద్యమం పేరుతో తెలుగు వైతాళికుల విగ్రహాలను
విధ్వంసం చేయడాన్ని, ఉద్యమం ముసుగులో కుటుంబ ఆస్తుల్ని పెంచుకుంటున్నవారిని
ఖండించలేకపోతున్న చొల్లేటి వారి నిస్సహాయతకు నా సానుభూతి ప్రకటిస్తూ
ముగిస్తున్నా.
-చేగొండి రామజోగయ్య,
విశ్రాంత బ్యాంకు అధికారి, విశాలాంధ్రమహాసభ సభ్యులు