16, అక్టోబర్ 2013, బుధవారం

'విశాలాంధ్ర మహాసభ' పత్రికా ప్రకటన, అక్టోబర్ 16, 2013


విశాలాంధ్ర మహాసభ కేంద్ర మంత్రులు కిల్లి క్రుపారాణి, దగ్గుబాటి పురందేశ్వరి, ఇతర కేంద్ర మంత్రులు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తోంది. కొద్ది రోజుల క్రితం వరకు విభజనను వ్యతిరేకిస్తామన్న మంత్రులు ఇప్పుడు మాట మార్చటం సోనియా గాంధీకి అమ్ముడుపోయారనటానికి నిదర్శనం.

ఈ రోజు తెలుగు ప్రజల భవిష్యత్తు విషయంలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎం. పీ. ల, ఎం. ఎల్. ఏ. ల పాత్ర నిరర్ధకం, శూన్యం అయిపొయింది. వారందరినీ సాంఘికంగా బహిష్కరించి వారి ఉనికిని గుర్తించటానికి నిరాకరించాలి.

యుపీఏ నియమించిన ఆంథోని కమిటీ మన రాష్ట్రానికి రానే రాలేదు. ఆ కమిటీ రిపోర్ట్ తయారు కాకముందే, కేంద్ర ప్రభుత్వ కాబినెట్ లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన టేబుల్ నోట్ ద్వారా పెట్టటం ద్వారా అన్ని ప్రజాస్వామ్య విలువలను కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కింది.

కేంద్ర ప్రభుత్వం నియమించిన రాష్ట్ర విభజన మంత్రుల కమిటీ ప్రజలు, నాయకుల సూచనలు మన రాష్ట్రానికి వచ్చి తీసుకుంటుందని చెప్పటం జరిగింది. కాని నేడు కేవలం ఈమెయిలు ద్వారా ప్రజలు తమ సూచనలు పంపించాలని ప్రభుత్వం కోరింది. అంటే సామాన్య ప్రజలు, రైతులు, కార్మికులను ఈ ప్రక్రియనుంచి దూరం పెట్టినట్లే. ఇదేమి ప్రజాస్వామ్యం?

ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు డెబ్బై ఐదు శాతం ప్రజానీకం విభజనకు వ్యతిరేకం. తెలంగాణాలో కూడా గణనీయమయిన సంఖ్యలో సమైక్యవాదులు ఉన్నారు. కేవలం వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కొద్ది స్థానాల్లో గెలుపొండటానికి ప్రజస్వామ్యాన్నే ఖూనీ చేసే ప్రయత్నం దేశ సమగ్రతకు ఎనలేని హాని చేకూరుస్తుంది.

కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన బిల్లుని ముందుకు తీసుకుపోవటానికి శాయశక్తులా కృషిచేస్తోంది. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో దీనిని ప్రవేశ పెట్టే ప్రయత్నాలు చేస్తుంది. కాబట్టి ఉద్యోగులు, రైతులు, విద్యార్థులు, కార్మికులు, అన్ని ఇతర వర్గాలు ఉద్యమాన్ని మరింత ఉధృతం చెయ్యాల్సిన అవసరాన్ని గుర్తించాలి.

విజయనగరంలో కొందరు రాజకీయ నాయకుల ప్రోద్బలంతో ప్రజల మౌలిక హక్కులను కాలరాసే విధంగా కర్ఫ్యూ విధించి ఉద్యమకారులని, ముఖ్యంగా విద్యార్థులని పోలీసులు మరియు రాజకీయ నాయకుల అనుచరులు వేదించటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.

2 కామెంట్‌లు:

  1. "తెలంగాణాలో కూడా గణనీయమయిన సంఖ్యలో సమైక్యవాదులు ఉన్నారు"

    గణనీయం అంటే ఎంత శాతం? మీ ఆధారాలు ఏమిటి?

    రిప్లయితొలగించండి