10, జూన్ 2012, ఆదివారం

తెలంగాణ ఉద్యమం తెరాసకు తాకట్టా?

An article on Telengana agitation published in Andhra Bhoomi on 10/06/2012.
The link: http://www.andhrabhoomi.net/content/telangana-agitation-0

    రాజ్యం ఏర్పడిన నాటినుంచి రాజ్యానికి వ్యతిరేకంగా ప్రజలు వివిధ నాయకత్వాల క్రింద పోరాడుతునే ఉన్నారు. చరిత్రను నిర్మించడం, తిరగరాయడం చేస్తూనే ఉన్నారు. రాజ్యం ఉన్నంతవరకు ఇది జరుగుతూనే ఉంటుంది. ఈ పోరాటాలు విభిన్న రూపాల్లో ఉండవచ్చు. ఒక ప్రాంతానికి పరిమితమైనా, ఇరు దేశాల మధ్య జరిగినా ఐక్య సంఘటనలు లేకుండా ఉద్యమాలు, పోరాటాలు విజయవంతమైన దాఖలాలు చరిత్రలో లేవు. ఈ చారిత్రక అంశాలు ఏవి పట్టని రాజకీయ, రాజకీయేతర శక్తులు తెలంగాణ ఉద్యమాన్ని హైజాక్ చేసి ఉప ఎన్నికలపై ఉప ఎన్నికల్ని సృష్టిస్తూ ప్రజల మాన, ప్రాణ, ఆస్తులను కొల్లగొట్టుతున్నాయి. దీనికి పరాకాష్టనే పరకాల ఉప ఎన్నిక.
    ఉద్యమాల ద్వారానే తెలంగాణ సాధ్యమని, ఉద్యమ రాజకీయ పార్టీగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి 2004లోనే ప్రధాన శత్రువైన కాంగ్రెస్‌తోనే పొత్తు పెట్టుకొని 28 అసెంబ్లీ, 4 పార్లమెంటు స్థానాల్ని దక్కించుకుంది. కాని నీతి, నిజాయితి లేని (ఇంకేదైనా వాడచ్చు!) తెలంగాణ ముసుగులో ఎన్నికైన రాజకీయ నాయకులు కాంగ్రెస్‌కు అమ్ముడుపోయి చరిత్రను పునరావృతం చేసారు. దీన్ని నిలవరించడంలో కెసిఆర్ వేచిన ఏ పాచిక పారలేదు. తిరిగి 2009లో మరో శత్రువు టిడిపితో జత కట్టినా సగానికి సగం సీట్లను కోల్పోయి 12 అసెంబ్లీ స్థానాలకు, 2 పార్లమెంటు స్థానాలకే పరిమితమైంది టిఆర్‌ఎస్. ఈ చారిత్రక సత్యాన్ని గుర్తించని కెసిఆర్ ఇంకా ఎన్నికల ద్వారానే తెలంగాణ సాధిస్తానని, పరకాల ఎన్నికలు చివరి రెఫరండమని చెబుతున్నాడు.
    తన రాజకీయ ఆధిపత్య ధోరణిని కాపాడుకోవడానికి గత ఎనిమిది సంవత్సరాలుగా ఆయన తొమ్మిది ఉప ఎన్నికలకు కారకుడైనాడు (పరకాలకు తప్ప!). తెలంగాణకోసం ప్రాణాలర్పిస్తామని కథలను చెప్పి గద్దెనెక్కిన జగ్గారెడ్డి, మందాడి, శార్వారాణి తదితరులు ఇప్పుడు టిఆర్‌ఎస్‌కే ప్రధాన శత్రువులయ్యారు. తన కవితా చాతుర్యంతో ఈటెలకు ముందు మీడియాల్లో కనపడిన మందాడి సత్యనారాయణరెడ్డి ఇప్పుడెక్కడున్నాడో కూడా తెలియడం లేదు. 2014లో కూడా అత్యధిక సభ్యుల్ని గెలిపించుకున్నా, టిఆర్‌ఎస్ పక్షాన గెలుపొందిన వారు గతంలో అమ్ముడుపోయిన వారిలాగా సంతలో అమ్ముపోరనే గ్యారంటీ ఏమి లేదు.
    బిజెపి పక్షాన గెలిచిన యెన్నం శ్రీనివాస్‌రెడ్డి 2009 దాకా టిఆర్‌ఎస్ జిల్లా శాఖ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తే! రాజకీయ కారణాలతో బిజెపిలోకి ఆయన వలస పోయాడు. గత ఉప ఎన్నికల్లో అతి తక్కువ మార్జిన్ ఓట్లతో ఆయన గెలుపొందాడు. ఈ సందర్భంగా గెలిచిన పార్టీ బిజెపి అయినా, వ్యక్తి మాత్రం మాజీ టిఆర్‌ఎస్ అభ్యర్థే! బహుశా ఆయన పట్ల సానుభూతి కూడా పనిచేసి ఉండవచ్చు! కాని ఓడిపోయిన ద్వేషంతో బిజెపిని మతతత్వంతో, ముస్లిం వ్యతిరేకతతో గెలిచిందని టిఆర్‌ఎస్ ప్రచారం చేస్తున్నది. ఈ సందర్భంగా ఆలోచించాల్సిన అంశాలు అనేకం! ఒకటి, బిజెపి మతతత్వ పార్టీ అని భావిస్తే నిజామాబాద్‌లో ఎందుకు పొత్తు పెట్టుకున్నట్లు? బిజెపితో కలిసి జెఎసిలో ఎందుకు భాగస్వామి అయింది? రెండు, ఒక వ్యక్తి టిఆర్‌ఎస్‌తో ర్యాలీ అయితే లౌకిక వాది, బిజెపితో అయితే మతతత్వ వాది అవుతాడా? టిఆర్‌ఎస్‌కు నిజంగా లౌకిక వాదమే ఉంటే మధ్యమధ్యన చండీయాగాలెందుకు జరుగుతున్నాయి? ఈ యాగాలు దేన్ని సూచిస్తాయి?
    ఇక పరకాల ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ది ఒంటెత్తు పోకడనే కావచ్చు! మేధావుల సమ్మేళనంగా చెప్పుకుంటున్న పొలిటికల్ జాక్ (పేరేమో పొలిటికల్ జాక్- కాని రాజకీయాలకు అతీతంగా అని చెపుతుంది) పాత్ర కుడితిలో పడ్డ బల్లిలాగా తయారైంది. కనీస విచక్షణ లేకుండానే టిఆర్‌ఎస్‌కు సరెండరైంది. దీనికి గల కారణాల్ని నాయకత్వం వహిస్తున్న కోదండరాం చెప్పాలి. జాక్‌లోని మెజారిటీ సభ్యుల నిర్ణయం మేరకు టిఆర్‌ఎస్‌కే మద్దతు ఇవ్వాలని అంటే కాదన్నది ఎవరు? దీనికోసం ఇన్ని రకాల పిల్లిమొగ్గలు వేయాలా! నాటకాలాడాలా? ‘సర్వే’ పేరున జాక్ చేపట్టి టిఆర్‌ఎస్‌కే మెజారిటీ వస్తుందని భావించి మొగ్గుచూపడం ఉద్యమాన్ని రెండుగా చీల్చడమే అవుతుంది. ఒకవేళ పరకాల పరిణామాలు ఊహించిన దానికంటే భిన్నంగా వస్తే జవాబుదారీతనం ఎవరు వహిస్తారు? పొలిటికల్ జాకా, లేక టిఆర్‌ఎస్సా? లేదా ఇద్దరు కలిసి బిజెపి పైన దాడి చేస్తారా? టిఆర్‌ఎస్ గెలిస్తే మాత్రం, తానే నిజమైన ఉద్యమ రాజకీయ పార్టీ అని, మిగతావి కావని, ప్రజలు బుద్ధిచెప్పారని అంటుంది. జాక్ మాత్రం తన సహకారంతోడే టిఆర్‌ఎస్ గెలిచిందని, ఇది చేయనందుకే మహబూబ్‌నగర్‌లో టిఆర్‌ఎస్ ఓడిపోయిందని ప్రచారం చేయకున్నా అంతర్గతంగా మాత్రం భావిస్తుంది.
    అనుకోకుండా బిజెపి గెలిస్తే తిరిగి అదే మతతత్వ వాదనను ముందుకు తెచ్చి ముస్లిం వ్యతిరేక పార్టీగా బిజెపిని జాక్ నుంచే కాక, 2014 ఎన్నికల్లో కూడా శాశ్వతంగా టిఆర్‌ఎస్ దూరం ఉంచుతుంది. అంటే 2014లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలోనే నాలుగు ప్రధాన పార్టీలు పోటీలో ఉంటాయి. అంటే పరీక్ష తెలంగాణ వాదానికే కాకుండా తెలంగాణ ముసుగులో ప్రజలకు జరుగుతుంది. పరకాలలో ఒకవేళ జగన్ పార్టీ గెలిస్తే తెలంగాణలో మానుకోట పునరావృతం అవుతుందా? లేక జగన్‌తో టిఆర్‌ఎస్ జత కడుతుందా? ఇది అంత సులభంగా తేలని ప్రశే్న! కాని పూజించాలనుకుంటున్న మానుకోట ఉద్యమ రాళ్ళలో టిఆర్‌ఎస్‌వే కాక, కాంగీవి, బిజెపివి, సిపిఐవి, న్యూడెమోక్రసివి, టిడిపివి కూడా ఉన్నాయనే విషయాన్ని టిఆర్‌ఎస్ గుర్తించలేదు. పరకాల ఎన్నికలో తెలంగాణ భవిష్యత్తు ఎటూ తేలకపోగా, మరింత చిక్కుముడుల్లోకి వెళుతుందని జాక్ గ్రహించకపోవడం దాని ఉద్యమ అవగాహన రాహిత్యమే అవుతుంది. బిజెపికి తెలంగాణ పట్టణ ప్రాంతాల్లో ముఖ్యంగా విద్యావంతుల్లో, యువకుల్లో పట్టు ఉంది. దానికో బలమైన విద్యార్థి సంఘం ఉంది. మంచో, చెడో ఓ జాతీయ భావం ఉంది. ఉద్దేశం ఏదైనా పార్లమెంటు ఉభయ సభల్లో తెలంగాణ వాదాన్ని గొంతు విప్పి చెప్పుతున్నది. గతంలో చేసిన తప్పిదాన్ని గుర్తించి, ఈసారి అధికారంలోకి వస్తే బిల్లును ప్రవేశపెడుతానని నిజాయితిగా చెపుతున్నది. కేంద్రంలో అధికారంలోకి రాకున్నా దాదాపు 100 సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా మాత్రం ఉంటుంది. తిరిగి కాంగ్రెస్ మిత్రపక్షాలతో కలిసి (ఇప్పుడున్న పార్టీలు తారుమారైనా) పాలక పక్షంగా మారితే, టిఆర్‌ఎస్ ఎవరి మద్దతుతో తెలంగాణను సాధిస్తుందో తెలియదు. దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? ఇదేమి ఉద్యమ పద్ధతి? ఐక్య పోరాటం? జాక్‌కు టిఆర్‌ఎస్‌ను ఒప్పించే శక్తి లేనప్పుడు తటస్థ వాదం బాగా పనిచేసేది. గెలుపు ఓటమిల గుణపాఠంతో టిఆర్‌ఎస్‌ను, బిజెపిని తన గుప్పిట్లో పెట్టుకొని ఉద్యమాన్ని నిజాయితితో, ధైర్యంగా నడపగలిగేది. ఈ మాత్రం ఆలోచన పొలిటికల్ జాక్ నాయకులకు లేదని అనుకోగలమా?
    పరకాల ఎన్నికల్లో నిర్ధ్వందంగా తేలేదేంటంటే, తెలంగాణ ఉద్యమానికి టిఆర్‌ఎస్సే కర్త, కర్మ, క్రియ కావాలనుకోవడం! దానికి జాక్ ఉత్ప్రేరకంగా పని చేయాలనుకోవడం! దీంతో నావను గట్టుకు చేర్చనూ వచ్చు! నదిలోనైనా ముంచవచ్చు! 1969నాటి చెన్నారెడ్డి, ఆమోసు, మల్లికార్జున్, స్వామినాథ్‌ల పాత్రలే తిరిగి పేర్లు మార్చుకొని నేడు తిరిగి కనపడుతున్నారు. అందుకే ఒకవైపు ఎన్నికలకు పోతూనే, దుష్ట కాంగ్రెస్‌ను దులుపుతూనే, మూనె్నళ్లల్లో తెలంగాణ వస్తుందని తిరిగి కెసిఆర్ చెట్టుకింది చిలుక జోస్యం చెప్పడం ప్రారంభించారు.
    తెలంగాణ ఉద్యమాన్ని గత 8 సంవత్సరాలుగా ఎన్నికల చుట్టూ తిప్పుతూ, పిల్లల ఉసురు పోసుకుంటున్న వైనాన్ని గుణపాఠంగా తీసుకొని పొలిటికల్ జాక్ ఎన్నికలకు దూరంగా ఉండాలనే ఓ నిర్ణయాన్ని తీసుకోలేని దుస్థితిలో ఉండడం శోచనీయం. ఉద్యమాలే ఏ రాజకీయ పార్టీనైనా నిర్దేశిస్తాయని, ఎన్నికలు ఉద్యమాల్ని పక్కదారి పట్టించి, నీరుగారుస్తాయనే చారిత్రిక వాస్తవాల్ని, సంఘటనల్ని ఉటంకిస్తూ, యువతను, ఉద్యోగుల్ని, ప్రజల్ని జాక్ చైతన్యవంతం చేయాల్సింది పోయి, రాజకీయ పార్టీలకు ఏకతాటిపై నడుపుతూ, వాటికి దశ, దిశల్ని నిర్దేశిస్తూ, ఉద్యమాల్ని తన గుప్పిట్లో ఉంచుకోవాల్సిన ‘జాక్’ టిఆర్‌ఎస్ గుప్పిట్లోకి వెళ్ళడం తెలంగాణ ప్రజల దౌర్భాగ్యమే! ఉద్యమం ముందుకు పోవడమేమోగాని, ఉద్యమాన్ని తిరిగి నలభై ఏండ్ల వెనక్కి తీసుకెళ్ళడం పరకాల చర్యతో ప్రారంభమైంది. ఈ ఎన్నిక తెలంగాణ భవిష్యత్తును తేల్చడమేమోగాని ముంచకుండా ఉంటే అదే చాలు!

    - జి.లచ్చయ్య

    1 కామెంట్‌:

    1. A tragic part was revealed during this byelection campaign.When jagan's mother and sister were allowed to tour ,why the same courtesy was not shown to jagan himself some time back?Why was the youth then provoked to stop jagan from entering telangana at any cost? Many inncent lives were lost because of that provocation.It is now clear that those who incited the youth then were surely responsible for the mayhem that followed jagan's t-visit.Why play political games with the lives of comman people?

      రిప్లయితొలగించండి