మొదటి భాగము తరువాయి
ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రము కావలెననియు, మద్రాసు నుండి విడిపోవలెననియు అభిప్రాయము మొట్టమొదటిసారి 1912 లో కలిగినది. తమిళులతో కూడిన మద్రాసు రాష్ట్రములో ఆంధ్రుల సర్వతోముఖాభివృద్ధికి సరియైన అవకాశాలు దొరకకపోవుటే ఈ అభిప్రాయానికి మూలము. ఆంధ్రరాష్ట్రోద్యమమును ప్రారంభించి దానికి నాయకత్వం వహించినది స్వర్గీయ కొండా వెంకటప్పయ్య పంతులు, స్వర్గీయ నాగేశ్వరరావు పంతులు, స్వర్గీయ న్యాయపతి సుబ్బారావు పంతులు, స్వర్గీయ కట్టమంచి రామలింగారెడ్డి గారలతో పాటు, స్వర్గీయులు ప్రకాశం పంతులుగారు , బులుసు సాంబమూర్తిగారు, పట్టాభి సీతారామయ్య పంతులు గారు మొదలైన పెద్దలు. మొట్టమొదట భాషా రాష్ట్రవాదము కాంగ్రెసు వర్గాలలో కొంత అలజడిని కల్గించినది. భాషారాష్ట్రాల ఆవశ్యకతను గూర్చి ఇంగ్లీషులో ఒక ఉద్గ్రంథమును వ్రాసి, భాషారాష్ట్ర వాదమును పట్టాభి సీతారామయ్యగారు సహేతుకముగ సమర్ధించిరి. ఆంధ్ర కాంగ్రెసు నాయకులు అఖిల భారత కాంగ్రెసుచే భాషా రాష్ట్రాల సూత్రమును ఆమోదింపచేసి, మద్రాసు రాష్ట్రములోని ఆంధ్ర ప్రాంతానికి ప్రత్యేక కాంగ్రెసు సంఘమును సాధించిరి. తరువాత క్రమక్రమముగ ఆంధ్ర రాష్ట్రోద్యమము బలపడి, మనకు స్వాతంత్ర్యము వచ్చిన తరువాత ఆంధ్రరాష్ట్రము ఏర్పడినది. ఆంధ్రరాష్ట్రోద్యమమును గూర్చి ఆంధ్రదేశములో ఎటువంటి అభిప్రాయ భేదము లేకుండెను. అన్ని రాజకీయపక్షాలీ ఉద్యమమును సమర్థించినవి. మద్రాసులో జరిగిన ఇరువదవ ఆంధ్రమహాసభ సమావేశానికి ఆచార్య రాధాకృష్ణగారు అధ్యక్షత వహించిరి. తరువాత వారు ఇంగ్లాండుకు వెళ్లి, ఆంధ్ర రాష్ట్ర స్థాపన గూర్చి సెక్రటరీ ఆఫ్ స్టేట్స్ తో సంప్రదింపులు కూడ జరిపిరి. మొదటినుండియు ఆంధ్రోద్యమము పట్ల సంపూర్ణమైన సానుభూతిని కలిగి రాధాకృష్ణ గారు అవసరమైనపుడు తగిన సహాయమును చేసినారు.
విమోచన ఉద్యమము
భారత దేశమునకు స్వాతంత్య్రము వచ్చిన తరువాత హైదరాబాదు ప్రజల యొక్క విమోచనోద్యమానికి క్రొత్త బలము చేకూరినది. భారత యూనియన్లో ప్రవేశించుటకు హైదరాబాదు నిజామ్ నిరాకరించుటతో హైదరాబాదు ప్రజల విముక్తి ఉద్యమములో నూతనాధ్యాయము ప్రారంభమైనది. 1947 లో చెలరేగిన రజాకారు అమానుష చర్యల ఫలితముగ హైదరాబాదు ప్రజలు వేల సంఖ్యలో పొరుగు రాష్ట్రాలకు తాత్కాలికముగా వలస పోయిరి. హైదరాబాదాంధ్రులు విజయవాడ,కర్నూలు ప్రాంతాలకు వెళ్ళిరి. ఈ వెళ్ళుటలో ఉభయ ప్రాంతాల రాజకీయ సమైక్యత యొక్క మనస్తత్వము వెల్లడియగుచున్నది. 1947 జూలైలో విజయవాడయందు అయ్యదేవర కాళేశ్వరరావు గారి యింటిలో స్వామీరామానంద తీర్థ అధ్యక్షతన ఇట్లు తాత్కాలికముగ వలసపోయిన రాజకీయ కార్యకర్తల సమావేశము జరిగి, హైదరాబాదు ప్రజల స్వాతంత్ర్య పోరాట చర్యా సంఘము స్థాపితమైనది. దీని శాఖ యొకటి కర్నూలులో స్థాపితమైనది. ఈ చర్యా సంఘము పక్షాన మాట్లాడుచు, హైదరాబాదులో ప్రజలకు ఫాసిస్టు పరిపాలననుండి విముక్తి కలిగి బాధ్యతాయుత ప్రభుత్వ స్థాపన జరుగవలెనని స్వామి రామానంద తీర్థ ఉద్ఘాటించిరి. ఇదే నెలలో మద్రాసు రాష్ట్రములోని ఆంధ్ర కాంగ్రెసు సంఘమువారు హైదరాబాదు ప్రజల సహాయ సంఘము నొకదానిని కాళేశ్వరరావు గారి అధ్యక్షతన నెలకొల్పిరి.
పోలీసు చర్య
1948 ఏప్రిల్ 26 నాడు బొంబాయిలో రాజేంద్రబాబుగారి అధ్యక్షతన అఖిల భారత కాంగ్రెసు స్థాయీ సంఘ రహస్య సమావేశము జరిగినది. దీనికి హైదరాబాదు కాంగ్రెసు నాయకులు కూడ వెళ్ళియుండిరి. ఈ రహస్య సమావేశములో హైదరాబాదుపై పోలీసుచర్య జరుపవలెనని వాదించిన వారిలో కాళేశ్వరరావు గారు ముఖ్యులు. ఈ సందర్భమున ఆంధ్ర రాష్ట్రము కావలెనని ఆంధ్ర నాయకులు రాజేంద్రబాబును కోరగా, వారు ఆంధ్రులకు మాత్రమే వెంటనే రాష్ట్రము నిచ్చుటకు నిర్ణయించినచో మహారాష్ట్ర, కర్నాటకలకు కూడ ఈయవలసి యుండుననియు, ఈ అన్ని సమస్యలు ఒకే సారి నిర్ణయించుట మంచిదని తెలిపిరి. మొత్తముమీద 13 సెప్టెంబర్ నుండి 17 సెప్టెంబర్ (1948 ) వరకు హైదరాబాదు పై పోలీసు చర్య జరిగి ప్రజల విముక్తి జరిగినది. 1948 నవంబరులో హైదరాబాదుకు కాళేశ్వరరావుగారు వచ్చి, స్థానిక కాంగ్రెసు నాయకులైన స్వామీజీ మొదలైన వారితో సంప్రదించిరి. ఆ సందర్భంలో హైదరాబాదు విభజన జరిగి, విశాలాంధ్ర, ఐక్య కర్ణాటక, సంయుక్త మహారాష్ట్రాల కొరకు పనిచేయవలెనని నిర్ణయింపబడినది. 1949 ఏప్రిల్ లో తిరిగి కాళేశ్వరరావుగారు హైదరాబాదుకు వచ్చినప్పుడు హైదరాబాదు తెలుగు నగరమనియు, అది తెలుగు సీమకు రాజధాని యనియు మహారాష్ట్ర నాయకులు ఒప్పుకొని ఉద్ఘాటించుట జరిగినది. ఆ సమయమున రామకృష్ణారావుగారిచ్చిన తేనేటి విందు సందర్భమునకూడ హైదరాబాదు సకలాంధ్రమునకు రాజధానియని అందరు ఒప్పుకొనుట జరిగినది. సకలాంధ్రమునకు హైదరాబాదు రాజధానియని వ్యాపించుచున్న భావము సర్దారు పటేలుగారి దృష్టికి ఎట్టులో తీసుకొని రాబడినది. అపుడాయన ఈ విషయమై కాళేశ్వరరావు గారికి వ్రాసిన ఉత్తరములో ఇప్పుడే హైదరాబాదు విభజనను గూర్చిన ఆందోళన చేయవద్దని హెచ్చరించిరి. తరువాత 1949 మే నెలలో డెహ్రాడూన్ జరిగిన అఖిల భారత కాంగ్రెసు కమిటీ సమావేశ సందర్భమున హైదరాబాదు కాంగ్రెసు నాయకులతో మాట్లాడుచు సర్దార్ పటేల్ గారు హైదరాబాదు విభజన గూర్చి ఆందోళన చేయు సమయము ఆసన్నము కాలేదనియు, ఒక అయిదు సంవత్సరాల కాలమున ఈ పని జరుగుటకు తగిన వాతావరణము సృష్టింప బడగలదనియు తెలిపిరి. ఈ విధముగ, తరువాత హైదరాబాదు విభజనోద్యమమునకు తగిన వాతావరణము కల్గించబడినది. హైదరాబాదు సకలాంధ్రమునకు రాజధానియని కూడ గుర్తించబడినది. ఇట్లు గుర్తించిన అప్పటి మద్రాసు ఆంధ్ర కాంగ్రెసు నాయకులలో మొదటివారు కాళేశ్వరరావుగారు. మద్రాసు ఆంధ్రులకు లభించదని వీరు మొదటి నుండియు అభిప్రాయపడిరి. జనవరి 1950 లో మద్రాసులో సమావేశమయిన ఆంధ్ర కాంగ్రెసు శాసనసభ్యులు కర్నూలు ఆంధ్రుల తాత్కాలిక రాజధానియని , హైదరాబాదు శాశ్వత రాజధాని యనియు నిర్ణయించుట గమనింపదగిన విశేషము. ఆంధ్రరాష్ట్ర అవతరణమునకు ఒక రోజు ముందు అనగా 3౦ వ సెప్టెంబరు 1953 నాడు సమావేశమైన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు సంఘమువారు కూడ కర్నూలు తాత్కాలిక రాజధాని, హైదరాబాదు శాశ్వత రాజధానియని నిర్ణయించిరి. కమ్యునిస్ట్ పార్టీవారు మొదట నుండియు, అనగా 1947 వ సంవత్సరము నుండియు హైదరాబాదు సంస్థానమును విచ్చిన్నము గావించి, మదరాసు రాష్ట్రములోని ఆంధ్ర ప్రాంతమును తెలంగాణాముతో కలిపి వేసి విశాలాంధ్రమును హైదరాబాదు రాజధానిగా ఏర్పాటు చేయుట తమ ఆశయమని ఉద్ఘాటించుచు, యీ ఉద్యమము జనసామాన్యములో వ్యాపించుటకు కృషి సల్పుచుండిరి.
కృత్రిమ రాష్ట్రము - ప్రజల ఆకాంక్ష
ఇంగ్లీషువారి రాజ్యవిస్తరణ ఫలితముగ ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటకములతో కూడిన కృత్రిమ రాష్ట్రము అసఫ్జాహి పరిపాలన క్రింద ఏర్పడినది. మధ్య యుగములో నిరంకుశ పరిపాలన క్రింద ప్రజలు నలిగిపోయినారు. పోలీసు చర్య తరువాత ఏర్పడిన ప్రజాస్వామిక వాతావరణమున హైదరాబాదు విభజన జరిగి ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలు పొరుగు రాష్ట్రాలలోని ఆయా భాషాప్రాంతాలతో కలిసి విశాలాంధ్ర, సంయుక్త మహారాష్ట్ర, ఐక్య కర్ణాటకములు ఏర్పడవలలెనని ప్రజలు ఆకాంక్షించినారు. ఈ ఆకాంక్ష పోలీసు చర్య తరువాత హైదరాబాదు రాష్ట్రములోని అన్ని రాజకీయ పక్షాల తీర్మానాలయందు ప్రతిబింబితమైనది. సాంస్కృతిక సంస్థలు యీ అభిప్రాయములను బలపరచినవి. పోలీసు చర్య తరువాత తూపురాన్ జరిగిన ఆంధ్ర సారస్వత పరిషత్తు 1949 ఫిబ్రవరి సమావేశములో భాషా రాష్ట్రాలను బలపరుచటయే కాక అది వాస్తవముగా విశాలాంధ్ర సారస్వత సమావేశాముగ జరిగినది. తరువాత పరిషత్తు సభలు యీ మార్గముననే నడిచినవి. ఆలంపురములో రాధాకృష్ణ పండితుని ఆశీర్వచనములతో ప్రారంభమైన ఆంధ్ర సారస్వత పరిషత్తు సభలు వాస్తవముగ సకలాంధ్ర సారస్వత సభలు. ఆంధ్ర సారస్వత పరిషత్తు, ఇతర సారస్వత సంస్థలు విశాలాంధ్రోద్యమమును సంపూర్ణముగ బలపరిచినవి. పోలీసు చర్య జరిగిన వెంటనే కీ.శే. సర్దారు జమలాపురం కేశవరావుగారి అధ్యక్షతన ఘణపురంలో జరిగిన ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెసు సమావేశములో విశాలాంధ్ర కావలెనని ఉద్ఘాతించు తీర్మానము ఆమోదింపబడినది. ఈ తీర్మానమును అప్పటి తెలంగాణా ఏకైక దినపత్రికయగు గోలకొండ సంపాదకీయమున బలపరిచిరి. రాజకీయముగ, ఒక బహిరంగ సభలో ఇట్టి ఉద్ఘాటన జరుగుట బహుశా ఇదియే మొదటి పర్యాయమేమో! నిజామాబాదులో 1950 మార్చి నెలలో శ్రీ దిగంబరరావు బిందూ అధ్యక్షతన జరిగిన హైదరాబాదు స్టేటు కాంగ్రెసు సమావేశమున హైదరాబాదు రాష్ట్రమును విభజించి ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలను తత్పరిసర భాషా ప్రాంతాలతో కలిపి వేయవలెనని తీర్మానింపబడినది. ఈ తీర్మానమును ప్రతిపాదించినవారు బూర్గుల రామకృష్ణారావు గారు. ఈ తీర్మానమునకు రంగారెడ్డి, చెన్నారెడ్డి గారాల ఆమోదము కూడ లభించెను. 1950 వ సంవత్సరమున ఫిబ్రవరి 12, 13 తేదీలలో వరంగల్లులో అయ్యదేవర కాళేశ్వరరావు అధ్యక్షతన జరిగిన విశాలాంధ్ర మహాసభ స్థాయీ సంఘ సమావేశములో విశాలాంధ్ర తీర్మానము ఆమోదించుట జరిగినది. ఈ సమావేశములో ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులుగారు పాల్గొనిరి. ఈ విశాలాంధ్ర స్థాయీ సంఘ సభ్యుల పట్టికను పరిశీలించినపుడు ఇందులో అన్ని రాజకీయ పక్షాల ప్రతినిధులు, అన్ని వర్గాల ప్రతినిధులు, సాంస్కృతిక సంస్థల ప్రతినిధులు కనిపించుచున్నారు. కాంగ్రెస్సే కాక ఇతర రాజకీయ పక్షాలు కూడా, ముఖ్యముగా కమ్యునిస్టు, సోషలిస్టు పక్షాలు విశాలాంద్రోద్యమానికి ఎంతో బలమును చేకూర్చినవి.
డా.దేవులపల్లి రామానుజరావు
తెలంగాణా లో ఆంద్ర నేతల మాయ మాటలకు భ్రమసి
రిప్లయితొలగించండి"విశాలాంధ్ర ఝెండా" పట్టుకుని ప్రజల చేతుల్లో రాళ్ళ దెబ్బలు తింటూ కూడా వరంగల్ లో ఊరేగిన వారిలో కాళోజి కూడా వున్నాడు.
ఆయన ఆంధ్ర నేతల మోసాన్ని, తెలంగాణా చవట నాయకుల స్వార్ధాన్ని గ్రహించి ఆ తర్వాత ఎంతోమంది లాగే ప్రత్యెక తెలంగాణా ఉద్యమంలో చేరాడు .
కాళోజీ ఎంతో ఆవేదనతో రాసిన ఈ కవితే
మీకు తిరుగులేని సమాధానం :
చదవండి
ఎవరనుకున్నారు ఇట్లౌనని ఎవరనుకున్నారు,
ఆంధ్ర తెలంగాణలకు అన్యత ఏర్పడుతుందని
హామీలిచ్చినవారే అంతా స్వాహా చేస్తారని ||ఎవర||
అన్నలు ఒప్పందానికి సున్నా చుట్టేస్తారని
పరిపాలనతో తమ్ముల ‘ఫజీత’ పాలు చేస్తారని ||ఎవర||
ముఖ్యమంత్రియే స్వయముగ సఖ్యత ఛేదిస్తాడని
ప్రాంతీయాధ్యక్షుండు ప్రక్క తాళమేస్తాడని ||ఎవర||
‘కావలి కుక్కలు’ దొంగల గంజికాసపడతాయని
కావలివాడే దొంగల కావళ్లను మోస్తాడని ||ఎవర||
సిబ్బందిలోగల తమ్ముల ఇబ్బంది పెడతారని
అన్నలమను మాట మరచి అహంకార పడతారని ||ఎవర||
తమ్ముని తల బోడిచేసి దక్షత అనుకుంటారని
తంతే-తమ్ముడు అన్నను తన్నిండని అంటారని ||ఎవర||
తపుడు లెక్కతొ తమ్ముల నెప్పుడు ఒప్పిస్తారని
అంకెల గారడి చేస్తూ చంకలు ఎగిరేస్తారని ||ఎవర||
పోచంపాడు, శకుని పాచిక పాలౌతుందని
తెలంగాణవాసులకు త్రిశంకుస్థాయి వస్తుందని ||ఎవర||
ప్రాంతాన్ని పాడుచేసి శాంతి శాంతి అంటారని
కడుపుల్లో చిచ్చుపెట్టి కళ్ళు తుడువ వస్తారని ||ఎవర||
అధికార ప్రకటనలో అబద్దాలె ఉంటాయని
బాధ్యతగల మంత్రికూడ బాతాలే కొడతాడని ||ఎవర||
మంత్రి అయిన మురిపెముతో మనిషి దయ్యమౌతాడని
ప్రజాస్వామ్య విధానాన్ని బదనాము చేస్తాడని ||ఎవర||
ఓట్లు పొంది సీటు దొరక నోట్ల మన్ను పోస్తాడని
నమ్మకద్రోహం చేస్తూ గమ్మున కూర్చుంటాడని ||ఎవర||
ప్రజాస్వామ్యమీ తీరుగ పాడుచేయబడుతుందని
శాసనసభ వుండికూడ మోసమె సాగిస్తారని ||ఎవర||
విశాలాంద్రులను సైతము విషాదులను చేస్తారని
తెలంగాణ వేర్పాటుకు తీరులు కల్పిస్తారని ||ఎవర||
తీరవాసులైనంతనె తీర్థంకరులౌతారని
తెలంగాణ వాసులను దేభ్యాలుగ చూస్తారని ||ఎవర||
అభయమిచ్చి కుత్తుకనే అదిమి అదిమి పడతారని
ఆక్రోశిస్తే శాంతికి అంతరాయమంటారని ||ఎవర||
తెలంగాణ వేరంటె తెలివి లెక్క పెడతారని
ఆత్మహత్య ధోరణంచు హంగామా చేస్తారని ||ఎవర||
‘ముల్కి’ మంత్రులందరును ముఖ్యమంత్రి భజన చేస్తారని
దొడ్డిదారి పదవులతో దొడ్డవారు అవుతారని ||ఎవర||
ప్రతినిధులు ప్రజల మరచి పదవిపథము పడతారని
బ్రహ్మానందునిపదమున బ్రహ్మపదముకంటారని ||ఎవర||
విచ్చలవిడి ఖర్చులతో విలాసాలు చేస్తారని
కేంద్రంపై నిందమోపి కేరింతలు కొడతారని ||ఎవర||
బార్డరువీరులు ద్రోహుల ఆర్డరు పాటిస్తారని
చేటుగూర్చినోనికి తమ ఓట్లు అందజేస్తారని ||ఎవర||
చేతకు సిద్ధాంతానికి చీమ ఏన్గు తేడాయని
వట సావిత్రి వ్రతమును వారకాంత చేస్తుందని
ఎవరనుకొన్నారు ఇట్లౌనని ఎవరనుకున్నారు.