8, జులై 2012, ఆదివారం

విభజనకు ప్రాతిపదిక ఏమిటి?

ఆంధ్రజ్యోతి సంపాదకీయ పేజీ (25/5/2010) : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలనే డిమాండ్ 1969 నుంచి ఉన్నదే. ఈ అంశం సున్నితమైనదేకాని అత్యవసరమైనది కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ప్రగతి పథంలో అగ్రగామిగా ఉందనే విషయం నిర్వివాదం. 2003-09 సంవత్సరాల మధ్య జాతీయ జిడిపి వృద్ధిరేటు సగటున 8.5 శాతం ఉంటే రాష్ట్రంలో జిఎస్‌డిపి (స్థూల రాష్ట్ర ఉత్పత్తి) రేటు సగటున 9.17 శాతం ఉంది.

రాష్ట్రంలో ఉపాధి పొందుతున్నవారిలో 60శాతం మందికి వ్యవసాయ రంగమే అవకాశం కల్పిస్తోంది. వ్యవసాయరంగంలో వృద్ధిరేటు గత ఐదేళ్లలో జాతీయ స్థాయిలో సగటున 3 శాతం కాగా, రాష్ట్రంలో 6.74 శాతం ఉండడం విశేషం. గత 53 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ సాధించిన అభివృద్ధిని నిష్పాక్షికంగా పరిశీలిస్తే దానిలో తెలంగాణదే అధిక భాగమనే విషయం స్పష్టమవుతుంది.

బి.పి. ఆర్.విఠల్ (రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి జరిగిన కృషిలో కీలక పాత్ర వహించిన మాజీ ఐఏఎస్ అధికారి) రాసిన విషయాలను పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ సమయానికి రెండు ప్రాంతాల స్థితిగతులు ఎలా వుండేవో అర్థమవుతాయి. మద్రాసు,హైదరాబాద్ రాష్ట్రాల్లోని తక్కువ అభివృద్ధి చెందిన ప్రాంతాలతో మన రాష్ట్రం ఏర్పాటైంది. పూర్వ హైదరాబాద్ రాష్ట్రంలోని, ఆంధ్రప్రదేశ్‌లో కలిసిన తెలంగాణ ప్రాంతంలో ఆ రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల కంటే అభివృద్ధి చాలా తక్కువ. అయితే కేరళ, కర్ణాటకలుభాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పాటైనప్పుడు వాటిలో కలిసిన ఆయా భాషలు మాట్లాడే ప్రాంతాలైన తిరువాన్కూర్-కొచ్చిన్, మైసూర్‌లు కొత్త రాష్ట్రాలలో ఎంతో అభివృద్ధి సాధించిన ప్రాంతాలుగా వచ్చి కలిశాయి.

navya.
ఆంధ్ర ప్రాంతంలోని ఏడు జిల్లాలు, తెలంగాణ ప్రాంతంలోని ఎనిమిది జిల్లాలు బాగా వెనకబడడంతో , ఒక సమగ్ర రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించే సమయానికి తలసరి ఆదాయం, ఆర్థిక వృద్ధి, మానవాభివృద్ధి, తలసరి విద్యుత్ వినియోగం , వ్యవసాయక ఉత్పాదకత, అక్షరాస్యత, జనాభావృద్ధిరేటు, తలసరి మోటారు వాహనాలు, విద్యుదీకరించిన గ్రామాలు వంటి అన్ని ముఖ్య అంశాలలో రాష్ట్రం దేశ సగటు కంటే ఎంతో వెనుకబడి ఉంది.

జిల్లా స్థాయిలో ఉత్పత్తి వృద్ధిరేటు ఎంత ఉన్నదో 1994-95 నుంచి లెక్కలు వేయడం జరిగింది. ఆ నివేదిక ప్రకారం 1994-95 నుంచి 2006-07 మధ్య రాష్ట్ర వృద్ది రేటు 6.68 శాతం ఉంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే తెలంగాణలోని పది జిల్లాలలో నిజామాబాద్ 6.3 శాతం వార్షిక వృద్ధిరేటుతో చాలావెనుక బడి వుండగా , గణనీయంగా అభివృద్ధి చెందిన జిల్లాలనుకుంటున్న గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో వృద్ధిరేటు వరుసగా 4.81; 5.09 శాతం మాత్రమే ఉంది.

దీనిని బట్టి తెలంగాణలో అతి తక్కువ వృద్ధి రేటు కలిగిన జిల్లా కంటే ఆంధ్రప్రాంతంలోని జిల్లాల వృద్ధి రేటు చాలా తక్కువగా ఉన్నదనే విషయం తెలుస్తోంది. అంతేగాక అనేక దశాబ్దాలుగా కొనసాగిన అసమానతలు కూడా పూర్తిగా తొలగిపోలేదని తెలుస్తోంది. కాని ఒకటి మాత్రం నిజం- తెలంగాణలోని పది జిల్లాలూ గణనీయంగా అభివృద్ధిని సాధించాయి. ఇక రాయలసీమ మొదటినుంచీ అనావృష్టి ప్రాంతమే. దేశంలోని అత్యల్ప వర్షప్రాంతం గల జిల్లాల్లో రాయలసీమలోని అనంతపురం జిల్లా రెండవది. ఒరిస్సా,ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఉన్న మూడు ఉత్తరాంధ్ర జిల్లాలు కూడా గత యాభై మూడేళ్ళుగా వెనుకబడిన ప్రాంతాలు గానే మిగిలిపోయాయి.

కొత్త రాష్ట్రాల ఏర్పాటు విషయంలో విస్త­ృత ప్ర్రజా ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా అది అందరికీ ఆమోదయోగ్యమే అవుతుంది. అయితే ఆ నిర్ణయం మొదటి ఎస్సార్సీ నివేదిక ప్రకారం రాష్ట్రాలు ఏర్పాటు చేసినట్లుగా సమర్థనీయంగా ఉండాలి. రాజ్యాంగంలోని 3వ అధికరణంప్రకారం ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి గల విశేషాధికారాలను ఎవరూ కాదనలేదు. అయితే కేంద్రం తీసుకునే నిర్ణయం పారదర్శకంగా, సహేతుకంగా ఉండాలి.

జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌లు పెద్ద సంఖ్యలో ఉన్న గిరిజనుల అభిమతానికి అనుగుణంగా ఏర్పడ్డాయి. కొండ ప్రాంతమైన ఉత్తరాఖండ్ సాంస్క­ృతిక నేపథ్యం, సమస్యలు చాలా భిన్నమైనవి. అయితే ప్రత్యేక తెలంగాణ డిమాండ్ వెనుక హేతుబద్ధమైన కారణాలేమైనా ఉన్నాయా? ఉంటే, అవేమిటి?

వెనుకబాటు గురించి కొందరు తెలంగాణ నేతలు చేస్తున్న ఆరోపణల్లో నిజం ఎంత? అనే విషయాన్ని పాలనా నిపుణులతో పరిశీలింపచేయాలి. అదే నిజమైతే వెనుకబాటుకు కారణాలేమిటి? తెలంగాణ వెనుకబాటుతనం ఆంధ్రతో విలీనం వల్ల ఉత్పన్నమైనదా? 1956లో ఆంధ్రలో కలియడానికి ముందు తెలంగాణ ప్రాంతం సుసంపన్నంగా ఉన్నదా? ఉద్దేశపూర్వక విచక్షణ వల్ల ఆ వెనుకబాటు వచ్చిందా? లేక చారిత్రక కారణాలేమైనా ఉన్నాయా? రాష్ట్ర విభజనే ఆ వెనుకబాటుకు పరిష్కారమా?

ఆంధ్రలో కలవకపోతే తెలంగాణ మరింతగా అభివృద్ధి చెందడానికి ఆస్కారమున్నదనే విషయాన్ని ఎవరైనా నిరూపించగలరా? రాయలసీమ లోని నాలుగు జిల్లాలు, ఉత్తర కోస్తాలోని మూడు జిల్లాలు కూడా చాలా వెనుకబడినవే. తెలంగాణ కంటే కూడా ఈ జిల్లాలు వెనుకబడి ఉన్నాయని చెప్పవచ్చు.కేంద్ర ప్రభుత్వం కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు వెనుకబాటును ప్రాతిపదికగా తీసుకొనేట్లయితే ప్రత్యేక రాయలసీమ, ప్రత్యేక ఉత్తరాంధ్ర రాష్ట్రాల ఏర్పాటుకు కూడా అంగీకరించగలరా?

నిజానికి వెనుకబడిన ప్రాంతాలు లేదా జిల్లాలు లేని రాష్ట్రాలు దేశంలో ఎక్కడా లేవు. ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రులైన ఆంధ్ర నాయకులకు ప్రాంతీయతత్వం ఎప్పుడూ ఉండేది కాదు. మొత్తం రాష్ట్రానికి చెందిన భారీ పరిశ్రమలైనప్పటికీ, హైదరాబాద్ చుట్టుపక్కలగల రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోనే వాటిని నెలకొల్పడానికి వారు చేయూత నివ్వడమే అందుకు నిదర్శనం. వాటిలో కొన్నిటిని నిజానికి రాయలసీమ, మధ్య కోస్తా జిల్లాల్లోను ఏర్పాటు చేయవచ్చు. హెచ్ ఎ ఎల్ యూనిట్లు ఉన్న ఒరిస్సాలో కోరాపుట్ ప్రాంతం, బిహెచ్ఇఎల్ యూనిట్లు ఉన్న హరిద్వార్ కంటేమన రాయలసీమ , మధ్య కోస్తా జిల్లాల్లో వ్యవస్థాపనా సౌకర్యాలు నిజానికి ఎక్కువే ఉన్నాయి.

కేంద్రప్రభుత్వరంగసంస్థలు రాష్ట్రంలో ఎక్కువే ఉన్నా అవన్నీ హైదరాబాద్ చుట్టుపక్కలే కేంద్రీ కృత మయ్యాయి. అలాగే కేంద్రీయ విశ్వవిద్యాలయం, ఐఐటి, నేషనల్ స్కూల్ ఆఫ్ లా వంటివన్నీ కూడా హైదరాబాద్‌లోనే ఉన్నాయి. ఆంధ్ర ప్రాంతంవారు తెలంగాణ ప్రాంతానికి వచ్చి వారిని దోపిడీకి గురి చేశారనే తెలంగాణ నేతల వాదనలో ఎంత మాత్రం నిజం లేదు. లేకపోగా మొత్తం రాష్ట్రానికి చెందిన భారీ పరిశ్రమలు,భారీ పెట్టుబడులు తెలంగాణ ప్రాంతానికే లభించాయనే సత్యం ఇక్కడ మరువకూడదు.

పైపెచ్చు ఆంధ్ర ప్రాంతంవారే హైదరాబాద్ చుట్టు పక్కల అనేక భారీ పరిశ్రమలు స్థాపించారనే విషయం కూడా విస్మరించకూడదు. అనేక రంగాలలో, అనేక ప్రాంతాలలో ఆంధ్రప్రాంతం వారు పరిశ్రమలు నెలకొల్పి ఆ ప్రాంతాల అభివృద్ధికి తమ వంతు కృషి చేశారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజల అభిమతానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటయిందనీ, ఆంధ్రప్రాంతం వారు విశాలాంధ్ర కోసం చొరవ చూపారనే దుష్ప్రచారం కూడా ఇటీవల ఎక్కువగా జరుగుతోంది. నిజానికి అది కూడా తెలంగాణ నేతలు చేస్తున్న పెద్ద తప్పుల్లో మరొకటి. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలతో, ఆ ప్రాంతాల మనోవాంఛకు తగినట్లుగా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించింది గాని ఏ ఒక్కరివల్లనో కాదు. ఇది చారిత్రక సత్యం.

దేశ సుదీర్ఘ చరిత్రలో 1947 కి ముందు 150 సంవత్సరాలు మినహా తెలుగువారంతా ఒక్కటిగానే ఉన్నారు. పరాయి పాలనలో ముక్కలుచెక్కలు అయిన తెలుగు ప్రాంతాలను ఏకం చేయడానికి, తెలుగువారందరినీ ఒక్కతాటిపైకి తేవడానికి 1900 ప్రాంతంలో హైదరాబాద్‌లో శ్రీకృష్ణదేవరాయాంధ్ర నిలయం ఏర్పాటైంది. కొమర్రాజు లక్ష్మణరావు వంటి మహనీయులు తెలుగు సంస్క­ృతి పునరుద్ధరణకు నడుం బిగించడంతో తర్వాత అది ఒక మహోద్యమంలా రూపుదిద్దుకుంది.

తెలంగాణకు చెందిన మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, రావి నారాయణ రెడ్డి, మందుముల నర్సింగరావు వంటి ఎందరో మహానుభావుల నాయకత్వంలో విశాలాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున సాగింది. తెలుగువారుకాకపోయినా తెలుగు ప్రాంతాలు సమైక్యం కావడానికి స్వామి రామానంద తీర్థ అందించిన తోడ్పాటును ఎలా విస్మరించగలం? విశాలాంధ్ర కోసం హైదరాబాద్ ముఖ్యమంత్రి పదవిని సైతం త్యాగం చేసిన మహనీయుడు బూర్గుల రామకృష్ణరావు.

తెలుగువారికి సమైక్య రాష్ట్రం కోసం ఇంతటి మహత్తరమైన కృషి తొలుత జరిగింది తెలంగాణలోనేనన్న చారిత్రక సత్యాన్ని ఎవరు తుడిచివేయగలరు? అంతే కాదు, హైదరాబాద్ శాసనసభలో మూడింట రెండు వంతుల మంది సభ్యులు ఆమోదించిన తరువాతే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైందనే సత్యాన్ని కాదనగలమా?ఆంధ్రప్రదేశ్‌నువిభజించడానికి తర్వాత కాలంలో కొందరు ప్రయత్నంచినప్పుడు అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ లోక్‌సభలో మాట్లాడుతూ అటువంటి వేర్పాటువాదం ఎంత మాత్రం మంచిది కాదంటూ హితవు పలికిన ఘటన మరువ గలమా? ఆంధ్రప్రదేశ్‌గా అవతరించిన తర్వాత రాష్ట్రం సర్వతో ముఖంగా అభివృద్ధి చెందింది.

పారిశ్రామికంగా, వ్యావసాయకంగా తెలంగాణ ప్రాంతం కూడా ఎంతో అభివృద్ధి సాధించింది. ముఖ్యంగా 974 కిలో మీటర్లు ఉన్న కోస్తా తీరం, ప్రపంచంలోనే అత్యధికంగా కోస్తాలో ఉన్న సహజవాయు నిక్షేపాలు రాష్ట్రాన్ని ప్రగతిపథం వైపు మరింతగా నడిపించాయి. ఒరిస్సా, బీహార్, మధ్య ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ లోని కొన్ని ప్రాంతాలతో పోల్చితే తెలంగాణలో ఉన్నదంటున్న వెనుకబాటు అతి స్వల్పమే. తెలంగాణకు మంచి భవిష్యత్తు సమైక్య అంధ్ర ప్రదేశ్‌లోనే ఉంటుంది. ఏవైనా నిజమైన సమస్యలు ఉన్నట్లయితే వాటిని ప్రజాస్వామ్య పద్ధతిలో పరిష్కరించుకోవచ్చు.

- అడుసుమిల్లి జయప్రకాశ్
విజయావాడ మాజీ శాసనసభ్యులు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి