29, ఫిబ్రవరి 2012, బుధవారం

విభజన వాదం విషతుల్యం!

ఆంధ్రప్రభ వ్యాసం : మన తెలంగాణలో ఉన్నా, దేశంలో, రాష్ట్రంలో ఏ ఇతర ప్రాంతంలో ఏ రూపంలో, ఏ స్థాయిలో ఉన్నా 'విభజన వాదం' 'కాలకూట విషం' లాంటిదే! ఏ కారణం లేదా పొరపాటు చేతగాని ఎవరి ప్రోత్సాహం బలవంతం మీద సేవించినా ఈ విషం తాలూకు దుష్ప్రభావం ఒకేలా ఉంటుంది. పాత్రలు, ప్రాంతాలు, స్వార్థ రాజకీయ నేతల చేతలు, కూతలను బట్టి మారదు. ప్రమాదం తగ్గదు. అంటే ఈ విషాన్ని బంగారు పాత్రలో తాగినా, రాగిపాత్రలో తాగినా, కాకినాడలో కాచివడబోసి, తీపికాజాతో కలిపి తిన్నా, మహబూబ్‌నగర్‌లో నాగం లేక మరో ఆగం వారి మాయమాటలు బుట్టల్లోని అసత్యాల అప్పచ్చిలతో నంజుకుని మింగినా, విజయనగరం జిల్లాలో మూలాలున్న మా(మూ)టకారి దొరవారి దుర్భాషలకి విసిగివేసారి, అయిష్టంగా సేవించినా, తూర్పు గోదావరి జిల్లా యాసలో 'అరిచే కరిచే' 'రాములమ్మ'ను కాదనలేక ఆరగించినా, ప్రజా గాయకుని దరువులకు జడిసి గుటకేసినా, వయోధికుడు కొండాలక్ష్మణ్‌ వడ్డిస్తున్నాడన్న మొహమాటంతో చప్పరించినా, కొద్దిగానే రుచిచూసినా, ఆ ప్రాంతానికి, ఆ ప్రజలకి మాత్రమే కాదు, మొత్తం రాష్ట్రానికి, దేశానికి చేటు చేస్తుంది.

సరే, ఈ శీర్షిక కింద ప్రత్యేక తెలంగాణవాదంలో ఇమిడి ఉన్న డొల్లతనం, కల్లల గురించి, అది దేశ సమైక్యతకే ప్రమాదాన్ని కల్పిస్తున్న వైనం గురించి ఎప్పటికప్పుడు చర్చించుకుంటూనే ఉన్నాం. ప్రత్యేక రాష్ట్రవాదం, అసత్యాల పునాదులపై, చారిత్రక, సాంస్కృతిక వక్రీకరణల సున్నంతో, దుర్భాషల వంకరటింకర కంకరరాళ్లు, కల్తీ రాజకీయ పొత్తుల ఇసుక మిశ్రమంతో, ఒక మోసకారి మేస్త్రీ, (శుక్రాచార్య సమాన ప్రతిభావంతులైన ఒక ప్రొఫెసర్‌, ఇంజనీరు సంయుక్తంగా గీసిచ్చిన 'ప్లాన్‌' ప్రకారం) నిర్మించిన ఒక (అయో)మయసభ, అని చెప్పుకున్నాం -ఈ భవనం, వాదం పట్ల కొంతకాలం, కొందరు ఆకర్షితులైన మాట వాస్తవమే కానీ, ఇప్పుడిప్పుడే ప్రజలు, ప్రధానంగా తెలంగాణవాసుల్లోని అధిక సంఖ్యాకులు ఉద్యమకారుల అసలు రంగుల్ని, ధ్యేయాల్ని వాళ్లు తమ కుటుంబ భోషాణాల్ని నింపుకొంటున్న వైనాన్ని క్రమంగా అర్థం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, తరుణంలో తెలంగాణేతర ప్రాంతాల్లో కూడా ఇక్కడున్నంత స్థాయిలో కాకపోయినా, చాపకింది బురద నీరులా, పెరట్లో దాక్కున్న పాములా ఉన్న 'విభజనవాదం' గురించి కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. అక్కడా పొంచి ఉన్న ప్రమాదం గురించి చర్చించుకోవాల్సిన అగత్యముంది -ఒక్కమాటలో చెప్పాలంటే తెలంగాణవాదం, బలహీన పడుతోందిలే అని మురిసిపోవడమూ మంచిది కాదు, సీమాంధ్రలో కూడా కొద్దో, గొప్పో ఉన్న విభజన వాదాన్ని విస్మరించడం అసలే కాదు. ఎక్కడున్నా విభజన వాదాన్ని సమూలంగా నిర్మూలించాలి. దురదృష్టవశాత్తు, తెలంగాణేతర ప్రాంతాల్లోనూ కేవలం స్వార్థ రాజకీయాలకోసం, అక్కడి ప్రజల్ని, విద్యార్థుల్ని, ఉద్యోగ వర్గాల్ని రెచ్చగొట్టడానికి, విభజన వాద గరళాన్ని తాగించడానికి ప్రయత్నిస్తున్న నేతలు, మేధావులు ఉన్నారు. వాళ్లు రాష్ట్ర విభజనకనుకూలంగా చెప్పే కారణాలన్నీ ఎంత అసమంజసమైనవో చెప్పుకుందాం. మొదటగా నసిగేది / 'కలిసి ఉంటే బాగుంటుందిలే కానీ... ఇంపల్సివ్‌గా కంపల్సివ్‌గా విడిపోదామంటున్నాం అని, (ఔను తెలంగాణవాదులు ఎక్కువగా ఉర్దూ పదాలు వాడుతారని ఎద్దేవా చేసేవాళ్లు ఎక్కువగా ఆంగ్లపదాలు ఉపయోగిస్తారు లెండి) తప్పనిసరి (కంపల్సివ్‌)గానో తాత్కాలిక స్పందనగానో (ఇంపల్సివ్‌గా) 'విడిపోదాంలే' అనడం మూర్ఖత్వం కాదా?! రాష్ట్రపరంగా, జాతీయపరంగా విశాల, దీర్ఘకాలిక ప్రయోజనాల గురించి పట్టించుకోవద్దా? ఇంకో కారణం, దొరవారు వ్యూహాత్మకంగా ప్రారంభించి, నిరంతరం కొనసాగిస్తున్న తిట్లపురాణాన్ని ఎంతకాలం సహించగలం? మా ప్రాంతపు ప్రజల్ని గంపగుత్తగా, దొంగలు దోపిడీదారులు, మోసకారులు, రాక్షస సంతతి అని తిట్టి పోస్తుంటే మా ఆత్మాభిమానాన్ని సంరక్షించుకోవాలి కదా అన్నది. అయ్యా, ప్రకటిత ధ్యేయంపై చిత్తశుద్ధి లేనివాడు అంతిమ పరిణామం అపజయమే అని ముందు నుంచీ తెలిసి ఉన్నవాడు తిట్లపురాణాన్ని ఆశ్రయిస్తాడని మనోవిజ్ఞాన వేత్తలు చెబుతారు. దీన్ని ప్రత్యర్థి లేదా ప్రతివాదంలోని అధిక బలాన్ని పరోక్షంగా అంగీకరించే ఉద్వేగంగా, ఉన్మాదంగా అర్థం చేసుకోవాలి. సానుభూతి చూపాలి. సహనం వహించాలి. అంతేకానీ తిట్టుకి తిట్టు ఒట్టుకి ఒట్టు, బెట్టుకి బెట్టు రూపంలో మనకు ఇష్టంలేని అధర్మ యుద్ధానికి, ధ్యేయానికి, సహకరించ తగదు. అయినా, ఈ కూతలు కూస్తున్నది కొందరు విభజన వాద నేతలేకానీ, అత్యధిక శాతం తెలంగాణ ప్రజలకు ఇతర ప్రాంతాల స్వభాషీయుల పట్ల ఆదరాభిమానాలు మెండుగా ఉన్నాయి. అందుకే గతంలో కూడా విలీనానికి తహ తహ లాడారు. ఇప్పుడూ విభజనను వ్యతిరేకిస్తున్నారు. దొరల దుర్భాషలను ఏవగించుకుంటున్నారు. కాబట్టి ఎవరో మిట్టమధ్యాహ్నం లేచి దుర్భాషలాడుతున్నారన్న కారణంగా దేశానికి, రాష్ట్రానికి, మాతృభాష వికాసానికి చేటు తెచ్చే విభజన పట్ల మొగ్గు చూపడం మూర్ఖత్వమే అవుతుంది.

అన్ని ప్రాంతాల తెలుగు ప్రజలు గ్రహించాల్సిన వాస్తవం మరొకటి ఉంది. అదేమిటంటే ఖర్మకాలి, ఒకవేళ ఈ రాష్ట్ర విభజనంటూ జరిగితే, అది రెండు ముక్కలతో ఆగిపోదు. ఒడుపుగా దేముడి ముందు కొట్టే కొబ్బరికాయలా, రెండు చెక్కలే అవుతుందనుకోవద్దు. బలంగా నేలకేసి కొట్టిన గాజుగ్లాసులా, పలుముక్కలవుతుంది పగలిన ప్రాంతాల్ని, అక్కడి ప్రజల్ని బాగా గాయపరుస్తుంది. ఎలాగంటే, విభజనవాదులు పదే పదే వాగే ఏకైక కారణం యాస, సంస్కృతి, ఆచార వ్యవహారాల్లో స్వల్ప తారతమ్యాలు కానివ్వండి, (ఇవి ప్రతి పది ఇరవై మైళ్లకు మారతాయి) లేదా చిన్న రాష్ట్రాలలో పరిపాలనా సౌలభ్యం కానివ్వండి, మరేదైనా సరే, వర్తింపజేస్తే, ఒక్క తెలంగాణ ప్రాంతాన్నే పలు చిన్న చిట్టి రాష్ట్రాలుగా చీల్చాల్సి ఉంటుంది. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, కాకతీయ నాడు, గిరినాడు, గ్రేటర్‌ హైదరాబాద్‌, ఇలా పలు రాష్ట్రాలుగా, యాసా ప్రయుక్త ప్రదేశాలుగా చీల్చాలి. అలాగే ఉత్తరాంధ్ర, డెల్టాంధ్ర, ఉభయ గోదావరి, పల్నాడు, మన్యసీమ, రాయలసీమ, ఇలా సీమాంధ్రను పలు చిన్న రాష్ట్రాలుగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆయా రాష్ట్రాల రాజధానుల నిర్ణయాల విషయంలో మళ్లీ ఎన్ని కొట్లాటలొస్తాయో ఊహించబూనుకోవడమే కడుదుర్భరం. భాషా ప్రయుక్త రాష్ట్రాల విధానానికి ఆద్యులమైన మనం 'యాసా ప్రయుక్త రాష్ట్రాల ఉన్మాదానికి', అన్ని ఇతర రాష్ట్రాల విచ్ఛిత్తికి, దేశ సమైక్యత భంగం కావడానికి, స్వల్ప కారణాల రీత్యా ఏర్పడిన మన అనైక్యత మూలంగా కారకులమయ్యామన్న పాపం మూటకట్టుకోరాదు. ఇప్పటికే తెలుగువాళ్లంటేనే అందరికీ చులకన భావం ఏర్పడిపోయింది!

ఇంకా ఎక్కువ అప్రమత్తత వహించాల్సిన విషయం గురించీ ప్రస్తావించి తీరాలి. పొత్తులు, జిత్తులు మార్చి, ఏమార్చి అన్నిట్లోనూ వైఫల్యం చెందిన దొరవారు, అంతిమ అస్త్రంగా 'అట్నుంచి నరుక్కొని వద్దాం' అనే వ్యూహాన్ని ఫామ్‌హౌస్‌లో సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే అందుకు సంకేతంగా సీమాంధ్రలో విభజనవాదాన్ని రెచ్చగొట్టే, ప్రోత్సహించే పనులు ప్రారంభించారు. కోవూరులో తెరాస అభ్యర్థిని నిలబడతానని ప్రకటించారు. సీమాంధ్రలో పర్యటిస్తానని అంటున్నారు. పర్యటిస్తే పూలమాలలతో సత్కరించాలి సీమాంధ్రులు, సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రివి కావాలని ఆశీర్వదించాలి. అంతేకానీ 'అట్నుంచి నరుక్కుని వద్దామన్న' కుతంత్రానికి సహకరించవద్దు, అక్కడికి వచ్చినా రాకపోయినా, కెసిఆర్‌, జగన్‌ వర్గంతో, సీమాంధ్రలోని ప్రధాన రాజకీయ పార్టీలలోని అసంతృప్తులతో, కులసంఘాలతో దోస్తీ పెట్టుకునే ప్రయత్నాలు తెలంగాణ భవన్‌ నుంచో, ఫామ్‌హౌస్‌ నుంచో చేయడం తథ్యం. తస్మాత్‌ జాగ్రత్త. జగన్‌తో సహా ఎవరు దొరవారి బుట్టలో పడినా వారికి సొమ్మూ పోతుంది, సీమాంధ్రలో సోకూ పోతుంది. అక్కడా, ఇక్కడా నీళ్లు పుట్టవు -రెంటికీ చెడ్డ రేవడి గతి పడుతుంది. జగన్‌ మాత్రమే కాదు, బాబు, నందమూరి వారసులు, నారాయణ, రాఘవులు, వెంకయ్య నాయుడు ప్రభృతులు ఇది గ్రహించాలి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని, ఈ రాష్ట్రంలోని సమైక్యవాదులు ప్రధాన రాజకీయ పార్టీలు, మాతృభాషాభిమానులు, దేశ సమైక్యతను కోరుకునేవారు కేంద్ర ప్రభుత్వం తెలంగాణవాదంతో పాటు, సీమాంధ్రలోని విభజన వాదాన్ని, అన్ని ఇతర రాష్ట్రాలలోని ప్రత్యేక రాష్ట్ర వాదాల్ని సమూలంగా నిర్మూలించే ప్రయత్నాలు చేయాలి. ఇందుకు అవసరమైతే రాజ్యాంగాన్ని సవరించి ఆర్టికల్‌ (3)ని మరింత కఠినతరం చేయాలి. ఏ కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్నా పార్లమెంటులో, ఇతర రాష్ట్ర శాసనసభలలో 2/3 మెజారిటీ సభ్యుల ఆమోదం ఉండాలన్న నిబంధనను తీసుకుని రావాలి.

-చేగొండి రామజోగయ్య ,
విశ్రాంత బ్యాంకు అధికారి, విశాలాంధ్ర మహాసభ సభ్యులు 

26, ఫిబ్రవరి 2012, ఆదివారం

రాష్ట్రం సమైక్యంగా ఉండాలి : తిరుపతి సదస్సులో వక్తలు

ఆంధ్ర భూమి: అధికార దాహంతో కూడిన కొందరు రాజకీయ నాయకులను మినహాయిస్తే తెలంగాణలో సైతం రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకునే వారి సంఖ్యే అధికంగా ఉందని, ఇది వాస్తవమని విశాలాంధ్ర మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరకాల ప్రభాకర్ అన్నారు. తిరుపతిలోని నెహ్రూ లలిత కళా ప్రాంగణంలో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి (శాప్స్), విశాలాంధ్ర మహాసభ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన విశాలాంధ్ర మహాసభను, గణాంక ప్రదర్శనను రిటైర్డ్ విసి వెంకట్‌రెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల అభివృద్ధిపై వాస్తవాలను గణాంకాలతో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అన్ని రంగాల్లోనూ తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి పథంలో నడుస్తోందో విస్పష్టంగా చూపించారు. అంతేకాకుండా రాష్ట్ర సమైక్యతను కాపాడుదాం అనే పేరుతో ముద్రించిన బుక్‌లెట్స్‌లో నాగం జనార్దన్‌రెడ్డి ఒకప్పుడు తాను తెలంగాణ వాదినని - ఇప్పుడు సమైక్య వాదినని చేసిన వాఖ్యలను, అలాగే కోస్తా మహానుభావులే తమకు చదువులు చెప్పించారని దేవేంద్ర గౌడ్ చేసిన వ్యాఖ్యలను, ముసలివాళ్లకు విడాకులు ఇప్పిస్తారా.. అని కడియం శ్రీహరి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను చదవి వినిపించారు. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమమే నాదని చెప్పుకుంటున్న కెసిఆర్ జై తెలంగాణ నినాదాలు పెరగకుండా ముఖ్యమంత్రి తక్షణం చర్యలు చేపట్టాలని అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను కూడా చదివి వినిపించారు. ఉద్యోగాలు రానంత వరకూ తెలంగాణ, రాయలసీమ ఉద్యమాల పేరుతో సంఘాలు, సమితులు ఏర్పాటు చేస్తారని ఉద్యోగాలోస్తే వాటి గురించి పట్టించుకోరని కెసిఆర్ చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. స్వాతంత్ర సమర యోధుడు నర్రా మాధవరావు, మహమ్మద్ ఆలీ, విశాలాంధ్ర మహాసభ రాష్ట్ర అధ్యక్షులు నలమోతు చక్రవర్తి, మాజీ డిజిపి ఆంజనేయరెడ్డి, సుగుణమ్మ, కరీంనగర్‌కు చెందిన శ్రీనివాసులరెడ్డికన్నా తెలంగాణ ప్రజలను కెసిఆర్ ఎక్కువగా ప్రేమిస్తున్నాడా? అని ప్రశ్నించారు. తమను సభలు పెట్టమని తెలంగాణ ప్రాంతం నుండి అనేక మంది అడుగుతున్నారన్నారు. అయితే నిజాలు మాట్లాడిన వారి పీకనొక్కి అసత్య ప్రచారాలు బయటపడకుండా తెలంగాణ వాదులు జాగ్రత్త పడుతున్నారన్నారు. తెలంగాణ ఉద్యమం చల్లారిందనే నిర్లక్ష్యం తగదని సమైక్యావాదులను హెచ్చరించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన స్వాతంత్ర సమరయోధుడు నర్రా మాధవరావు మాట్లాడుతూ తెలుగువారంతా సమైక్యంగా ఉండాలని కోరుతూ 8 వేల మంది స్వాతంత్ర సమరయోధులు అనేక పోరాటాలు చేశామన్నారు. నిజాం నవాబులకు, రజాకార్లకు, పటేల్, పట్వారీ వంటి అనేక బానిసత్వాలకు వ్యతిరేకంగా పోరాడామన్నారు. తాము చేసిన ఉద్యమాల ఫలితంగానే నేడు తెలంగాణ ఈ స్థాయిలో అభివృద్ధి చెందిందిన్నారు. నలబోతు చక్రవర్తి, శ్రీనివాసరెడ్డి, మహమ్మద్ ఆలీ, మాజీ డిజిపి ఆంజనేయరెడ్డి, శాప్స్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం, ఎన్ రాజారెడ్డి, తదితరులు మాట్లాడుతూ కెసిఆర్ ఓడిపోయినప్పుడు ఒక మాట, గెలిచినప్పుడు మాత్రం తెలంగాణ వాదం పేరు చెప్పడం విడ్డూరంగా వుందన్నారు.

బూర్గుల విగ్రహాన్ని ఎర్పాటు చేయాలి
తెలుగు ప్రజల చిరకాల స్వప్నమైన విశాలాంధ్ర ఆవిర్భావానికి తన ముఖ్యమంత్రి పదవిని సైతం త్యాగం చేసిన ప్రముఖ తెలంగాణ ప్రాంత నేత బూర్గుల రామకృష్ణారావు విగ్రహాన్ని తిరుపతిలో ఏర్పాటు చేయాలని శనివారం తిరుపతి నెహ్రూ లలిత కళా ప్రాంగణంలో జరిగిన విశాలాంధ్ర మహాహభ తీర్మానించింది. విశాలాంధ్ర రాష్ట్ర అధ్యక్షుడు రవితేజ అధ్యక్షతన జరిగిన ఈ సభ జరిగింది. ఈ సందర్భంగా పలు ముఖ్యమైన తీర్మానాలకు సంబదింధించి శాప్స్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ కోడూరు బాలుసుబ్రహ్మణ్యం, ఎన్ రాజారెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌లో ట్యాంక్‌బండ్‌పై తెలుగు వైతాళికు విగ్రహాలను ధ్వంసం చేయడాన్ని సమావేశం తీవ్రంగా ఖండించిందని తెలిపారు. అంతేకాకుండా విగ్రహాలను పునః ప్రతిష్ఠించాలని తీర్మానించామన్నారు.

ఆంధ్రప్రభ : తెలంగాణాలోని మెజారిటీ ప్రజలు రాష్ట్రం సమైక్యంగా వుండాలని కోరుకుంటున్నారని విశాలాంధ్ర మహాసభ ప్రధాన కార్యదర్శి పరకాల ప్రభాకర్‌ అభిప్రాయపడ్డారు. శనివారం స్థానిక నెహ్రూ లలితకళా వేదికలో రాష్ట్ర సమైక్యతను కాపాడుకుందామన్న నినాదనంతో విశాలాంధ్ర మహాసభ, సమైక్యాంధ్ర పరిరక్షణ సమితీలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అబద్దాలు చెప్పి ప్రజలను రెచ్చగొట్టే వారిని కోతలరాయుడు అంటారని, ఆ పేరు తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావుకు చక్కగా సరిపోతుందని అన్నారు. మోసపు మాటలతో ప్రజలను ఎల్లకాలం వంచించలేరని, అసత్య ప్రచారాలు, అభూత కల్పనలతో తెలంగాణా ప్రత్యేక ఉద్యమం సాగుతోందని ఆయన ఆరోపించారు. తెలంగాణా ప్రాంతానికి చెందిన సాయుధపోరాట యోధులు నర్రా మాదవరావు, మహబూబ్‌ అలి, విశాలాంధ్ర మహాసభ నాయకులు నలమోతు చక్రవర్తి, పదిరి రవితేజ, కె.శ్రీనివాసులురెడ్డి, చేగొండి రామజోగయ్యలు రాష్ట్రం సమైక్యంగా వుండాలని పోరాడుతున్నారని ఆయన పేర్కొన్నారు.

వీరికంటే కె.చంద్రశేఖర్‌రావు తెలివైన వాడేమీకాదని ఆయన అన్నారు. సిక్స్‌ పాయింట్‌ ఫార్ములాలు, జోనల్‌ సిస్టంలు పెట్టుకుని మనందెబ్బ తింటున్నామని, ఎక్కడైనా ప్రాజెక్టుల కింద స్టాప్‌ మిగిలి పోతే వారిని రాష్ట్రంలో ఏ మూలనైనా సరె వాడుకునేందుకు వెసులు ఉండాలని ఈ జోనల్‌ సిస్టంను తొలగించుకునే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టాలని కె.చంద్రశేఖర్‌రావు 1996 జూలై 18న అసెంబ్లిdలో వాదించారని ప్రభాకర్‌ గుర్తు చేశారు. అలాగే తెలంగాణా - రాయలసీమల్లో ఉద్యమాల కోసం ఏదో సమితి అని పెడుతున్నారని, రాయలసీమ విమోచన సమితి, తెలంగాణా ప్రజాసమితిలు అలాంటివేనని, ఉద్యమం చేపట్టే ఉద్యమకారులు ఏవైనా ఉద్యోగం దొరికితే దాన్ని అనుభవిస్తున్నారని ముఖ్యమంత్రి ఇలాంటి వాటిపై తక్షణం చర్యలు తీసుకోవాలని 1997 ఫిబ్రవరి 26న కె.సి.ఆర్‌ అసెంబ్లిdలో మాట్లాడారని ఆయన తెలిపారు.

సదస్సులో విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు నలమోతు చక్రవర్తి, కార్యదర్శి పదిరి రవితేజ, చేగొండి రామజోగయ్య, తెలంగాణా సాయుధ పోరాట యోధులు నర్రా మాదవరావు, మహబూబ్‌ అలి, సమైక్యాంద్ర పరిరక్షణ సమితి అధ్యక్ష, కార్యదర్శులు కోడూరు బాలసుబ్రమణ్యం, ఎన్‌. రాజారెడ్డిలు పాల్గొన్నారు.

సాక్షి:  సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి(సాప్స్) విశాలాంధ్ర మహాసభల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ఆలోచింప చేసింది. మొదట ఈ ఎగ్జిబిషన్‌ను ఎస్‌కే యూనివర్సిటీ మాజీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కె.వెంకటరెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఇందులో రాష్ట్ర విభజన పేరుతో రాష్ట్రంలో చోటుచేసుకున్న పలు హింసకాండకు సంబంధించిన దృశ్యాలు, వేర్పాటువాదుల అరాచకాలు కళ్లకు కట్టినట్టు ఫొటో ఎగ్జిబిషన్‌లో ఉంచారు. అందులో శాసనసభలో గవర్నర్‌పై దాడి, శాసనసభ ఆవరణలో లోక్‌సత్తా, బీజేపీ నాయకులపై తెలంగాణా వాదుల దాడులు, ఓ కానిస్టేబుల్, వేర్పాటు వాదుల పైశాచికదాడి, పోటీపరీక్షలను తెలంగాణావాదులు అడ్డుకుంటున్న దశ్యం, ట్యాంకుబండ్‌పై మహనీయుల విగ్ర హాలను ధ్వంసం చేస్తున్న దృశ్యాలు ప్రతి ఒక్కరినీ ఆలోచింప చేశాయి. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి వాస్తవ గణాంకాలు తెలిపే పోస్టర్లు ఆకట్టుకున్నాయి. ఈ ఎగ్జిబిషన్‌ను నగరంలోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు తిల కించారు. అనంతరం ఏర్పాటు చేసిన సదస్సుల్లో వక్తలు సమైక్యాంధ్ర పరిరక్షణ గురించి ప్రసంగించారు. అనంతరం మాతెలుగు తల్లికి మల్లెపూదండ , మాకన్నతల్లికి మంగళారతులు అంటూ జయం కళాశాల అధ్యాపక, విద్యార్థులు రాధికా సౌజన్య బృందం ఆలపించిన గీతం సభికులను అలరించింది. కార్యక్రమంలో విశాలాంధ్ర మహాసభ అధ్యక్ష, కార్యదర్శులు నలమోతు చక్రవర్తి, పరకాల ప్రభాకర్, కార్యదర్శి రవితేజ, శ్రీనివాసరెడ్డి (కరీంనగర్), చేగొండి రామజోగయ్య, తెలంగాణా సాయుధపోరాట యోధులు న ర్రామాధవరావు, మహబూబ్‌ఆలీ, సాప్స్ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం, ఎన్.రాజారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌రెడ్డి, జయం షరీఫ్ మహ్మద్ఫ్రీ, వెంకటరెడ్డి పాల్గొన్నారు.

22, ఫిబ్రవరి 2012, బుధవారం

‘రాష్ట్ర సమైక్యతను కాపాడుదాం’- ఫిబ్రవరి 25 న తిరుపతిలో సదస్సు మరియు ప్రదర్శన


మన సంఖ్యాబలంపై అయోమయం!

ఆంధ్రప్రభ: ఈ శీర్షికన ప్రచురితమవుతున్న నా వ్యాసాలకు స్పందించి, కొందరు సమైక్యవాదులు, విభజనవాదులు నాతో వ్యక్తిగతంగా కూడా మాట్లాడడం, పోట్లాడడం గత నాలుగైదు సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. వ్యాసాల రూపంలో తమ అభిప్రాయాలను వెలిబుచ్చినవారికి, ఎప్పటికప్పుడు తగువిధంగా, సామరస్యంగా సమాధానాలివ్వడమూ జరిగింది. అయితే పోయిన వారం, ఈ శీర్షిక కింద ప్రచురితమైన 'దీర్ఘకాల తెలుగు తెగుళ్లు!' వ్యాసానికి సమైక్య విభజన వాదుల నుంచి వచ్చిన ప్రతిస్పందనలు కడు ఆవేదనతో కూడిన ఆశ్చర్యాన్ని కలుగజేశాయి! కారణం, ఆ వ్యాసంలో అన్ని ప్రాంతాల తెలుగువాళ్లకున్నాయంటూ (ప్రవాసులతో సహా!) పేర్కొనబడిన 'దీర్ఘకాల రోగాలు', అసలే లేవని కానీ, ఉన్నా నేను చెప్పినంత స్థాయిలో లేవని కానీ వక్కాణించి నన్ను సరిదిద్దే, సంతోషింపజేసే ప్రయత్నం మాత్రం ఏ ఒక్కరూ చేయలేదు! 'అయితే ఏంది?' లేదా ఈ రోగాలతోనే బతికేయాలి -నివారణకోసం చికిత్స వృధా అనే రీతిలో స్పందించడం ఆవేదనని కలిగించింది.

ఆశ్చర్యంతో కూడిన ఆవేదనని కలిగించిన అంశం ఏమిటంటే మాట్లాడిన, విభేదించిన సమైక్య, విభజనవాదులు ఉభయులూ, మన రాష్ట్రంలో దేశంలో, విదేశాల్లో ఉన్న మొత్తం తెలుగువారిదిగా నేను పేర్కొన్న సంఖ్యాబలాన్ని ప్రశ్నించడం లేదా అనుమానాన్నో, అయోమయాన్నో వ్యక్తపరచడం. ఆ విధంగా అన్ని ప్రాంతాల (ప్రవాసాంధ్రులతో సహా) తెలుగు వాళ్లకున్న తెగుళ్లుగా నేను ప్రస్తావించిన (1) అనైక్యత (2) యాసా సంబంధిత విద్వేషాలు (3) అన్యభాషలు, సంస్కృతులపై అతిమోజుతో కూడిన మాతృభాషపై నిరాదరణ (4) ప్రాంతీయ, ఉపప్రాంతీయ దురభిమానం (5) ప్రాంతేతర బంధాలపై విముఖత వంటి వాటికి, ఆరో రోగంగా, 'స్వీయ సంఖ్యాబలంపై అవగాహనా లేమి'ని కూడా కలుపుకోవాలేమోనన్న సంశయం ఏర్పడింది. విశ్వామిత్ర మహర్షి శాపాలలో ఇది కూడా ఉందేమో మరి! ఇంతకీ పలువురు ప్రశ్నించిన లేదా అనుమానించిన అంశం పోయిన వారం వ్యాసంలో సందర్భోచితంగా మన రాష్ట్రంలో (సరిహద్దు ప్రాంతాలలో ఉన్నవారితో కలిపి) ఉన్న తెలుగువాళ్లు పదికోట్లమందని, ఇతర రాష్ట్రాలలో విదేశాల్లో మరో ఎనిమిది కోట్ల మంది ఉన్నారని చేసిన ప్రస్తావన -ఈ సంఖ్యకు సంబంధించిన ఆధారాలు గతంలోనే చెప్పి ఉన్నా మరోసారి వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం, సందర్భం ఏర్పడింది. రెండు మూడేళ్ల క్రితం వరకు నేను 16 కోట్ల మంది తెలుగువాళ్లనే రాసేవాణ్ణి -2011 జనాభా లెక్కల వివరాలు స్థూలంగా వెలువడిన తర్వాత 18 కోట్లమంది అనడం ప్రారంభించాను. ఎవరూ ప్రశ్నించలేదు.

కానీ ఈసారి మాత్రం, కొందరైతే 'ఆ! గాడిద గుడ్డేం కాదూ, మహా ఉంటే ఐదారు కోట్లుంటాం అంతే' అనేశారు! ఇంకా నయం, 'ముక్కోటి ఆంధ్రులం' అన్న బూర్గుల వారి 'ముచ్చట'ను 'కోటి రత్నాలవీణ నా తెలంగాణ' అన్న దాశరథి పల్లవిని మార్చడానికి వీల్లేదు, ఆ లెక్కలకే కట్టుబడి ఉందామని అనలేదు! అన్నా చెల్లదు -అవి 60 సంవత్సరాల నాటి లెక్కలు -ఆరు దశాబ్దాలలో నమోదైన జనాభావృద్ధి రేటుని, ఇతర సంబంధిత అంశాల్ని పరిగణనలోకి తీసుకుంటే నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 'తెలుగువాళ్ల' సంఖ్య 18 కోట్లు అనడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదని అర్థమవుతుంది. ఈ సందర్భంలో నాలుగున్నర కోట్ల మంది తెలంగాణ ప్రజలు అని విభజన వాదులే అంటున్నదీ గుర్తుంచుకోవాలి. కోటి నాలుగున్నర కోట్లయినప్పుడు నాలుగు కోట్లు 18 కోట్లు అవదా?

మన సంఖ్యాబలాన్ని గురించి దీన్ని తగ్గించి చూపడానికి ఇతరులు చేసే ప్రయత్నాలు, కుతంత్రాల గురించి చెప్పుకుందాం. ముందుగా మన రాష్ట్రంలో, సరిహద్దు ప్రాంతాల్లో పది కోట్ల మంది తెలుగువాళ్ళన్న దానిపై వివరణ -2011 జనాభా లెక్కల ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర జనాభా కొంచెం తక్కువగా తొమ్మిది కోట్లు ఒక సంవత్సరం గడిచింది. కాబట్టి అది నేడు తొమ్మిది కోట్లు దాటింది. ఉర్దూ ఇతర భాషల వారిని మినహాయిస్తే (వీరిలో కూడా 80 శాతం మందికి తెలుగువచ్చు) ఏమైనా, రాష్ట్రంలో తెలుగువాళ్లు ఎనిమిది కోట్ల పైమాటే! ఇకపోతే ఆంధ్రప్రదేశ్‌, నిజానికి 'విశాలాంధ్ర' కాదు పొరుగున ఉన్న నాలుగు రాష్ట్రాల్లో జిల్లాలకి జిల్లాలే తెలుగువాళ్లు అధిక సంఖ్యాకులుగా కానీ గణనీయ సంఖ్యాబలంతో ఉన్నవెన్నో ఉన్నాయి. రాష్ట్రంలో, సరిహద్దు ప్రాంతాల్లో పది కోట్ల మంది తెలుగువాళ్లున్నారన్న లెక్క తప్పుకాదు -అయితే ఆయా రాష్ట్రాల రాజధానుల్లో ఇతర జిల్లాల్లో కూడా ఉన్నవారిని వేరే లెక్కించాలి.

తెలుగు మేధావి, మాజీ ప్రధాని పి వి నరసింహారావు పదిహేనేళ్ల క్రితమే ప్రవాసాంధ్రుల సంఖ్యల గురించి రాష్ట్రాలవారీగా లెక్కలు వివరించారు. వాటిని జనాభావృద్ధి రేటు ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని నవీకరిస్తే మన పొరుగు రాష్ట్రాలలోని తెలుగువాళ్ల సంఖ్య ఎలా ఉంటుందో స్థూలంగా చెప్పవచ్చు. (ఈ సందర్భంలో మనం గమనించాల్సిన అంశం ఈనాటికీ తమిళనాడు కర్ణాటక రాష్ట్ర శాసనసభలలో 50 మందికి తక్కువ కాకుండా తెలుగువాళ్లు ఎమ్మెల్యేలుగా ఉంటున్నారు, పది మందైనా మంత్రులుగా ఉంటున్నారన్నది). ముందుగా తమిళనాడు విషయం -విభజనవాదనేత దొరవారు పదే పదే చెప్పేది, అనుయాయులు నిస్సిగ్గుగా వల్లించే అబద్ధం, తమిళనాడు నుండి విడిపోయినప్పుడు రాజాజీ 'గెట్‌ లాస్ట్‌' అన్నారన్నది -ఆయన తెలుగు మూలాలున్న విశాల జాతీయ భావాలున్న నేత. ఆయన అలా అనలేదు సరికదా, ఆంధ్ర విడిపోయాక కూడా 'మెడ్రాస్‌' (అప్పుడలానే అనేవారు)లో 45 శాతం ఇతర జిల్లాల్లో 25 నుంచి 35 శాతం తెలుగువాళ్లున్నారన్నారు. ఇప్పుడూ తమిళనాడులోని మూడు ప్రధాన రాజకీయ పార్టీల నేతలు వైగో, రామదాస్‌, విజయకాంత్‌ తెలుగువాళ్లే. ఈ విషయాన్ని వాళ్లు బహిరంగంగా ఒప్పుకోరన్నది వేరే విషయం. ముందే చెప్పినట్లు కనీసం అరవై మంది తెలుగు ఎమ్మెల్యేలు, పదిమంది మంత్రులున్నారు. 2001 జనాభా లెక్కల ప్రకారం ఈ రాష్ట్రంలో 27 శాతం మంది ప్రజల మాతృభాష తెలుగు#. ఇది అధికారిక లెక్క. కృష్ణయ్యలు, కృష్ణన్‌ లా అధికారిక రికార్డుల్లో ఉంటారు. దానికి కారణం ప్రధానంగా తమిళ ఉద్యోగుల నిర్వాకం. అలానే మాతృభాషగా తమిళమే నమోదై ఉంటుంది. ఇంట్లో తెలుగు మాట్లాడుకుంటారు. తెలుగు మాధ్యమ పాఠశాలలు కనుమరుగైనందువల్ల ఇప్పటి తరాలవారు మాతృభాషకు దూరమవుతున్నారు క్రమంగా. ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్నా తమిళనాడులో ఉన్న తెలుగువాళ్ల సంఖ్య మూడు కోట్లుగా చెప్పవచ్చు. కర్ణాటకలో పరిస్థితులు అంత దారుణంగా లేవు. ఈ రాష్ట్రంలో రెండు కోట్లు, మహారాష్ట్రలో 150 లక్షలు, ఒరిస్సాలో ఒక కోటి, చత్తీస్‌ఘడ్‌లో 50 లక్షల మంది తెలుగువాళ్లున్నారని స్థూలంగా చెప్పవచ్చు. ఇక, ఇతర రాష్ట్రాలలో, విదేశాల్లో ఉన్న తెలుగువాళ్లని కలుపుకుని మొత్తం తెలుగువాళ్లు 18 కోట్ల మంది అనడం సరైన లెక్కే. అందుకే మన సంఖ్యాబలాన్ని తగ్గించి చెప్పడానికి ఇతరులు చేసే ప్రయత్నాల్ని ఖండించాలి. ఎందుకోమరి మనం ఆ పని చేయం. నిర్లిప్తంగా ఉండిపోతాం.

ఉదాహరణకి 2011 ఆగస్టు 5న పార్లమెంటులో తెలంగాణ విషయంలో మీలోమీరే తేల్చుకోవాలన్న ప్రకటన చేస్తున్న సందర్భంలో తమిళ తంబి చిదంబరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న 12 కోట్ల మంది తెలుగువాళ్లు అంటూ ఓ తప్పుడు లెక్క (ఉద్దేశపూర్వకంగానే అయ్యుండొచ్చు!) చెప్పారు. అయినా మన సమైక్యవాదులు కూడా కిమ్మనలేదు. ఇందుకు వాపోతూ నేను 24.8.11న ఆంధ్రప్రభలో తెలుగువారి సంఖ్యపై చిదంబరం తప్పుడు లెక్క అన్న వ్యాసాన్ని రాశాను. కల్‌తోల్‌ తోండ్రియన్‌ తోంబాల కాలతే (రాళ్లురప్పలు సృష్టిలో లేని కాలంలో కూడా తమిళం ఉంది అని అర్థం) అనే తమిళ సోదరుల భాషాభిజాత్యాన్ని ప్రశంసిస్తూనే 'ఎన్నాసార్‌ ఇందకన్నాక్కుల్‌ (ఏమిటండీ ఈ దొంగ లెక్కలు), అని నాకు రాని అరవంలో అరిచేను. ఆ వ్యాసంలో ఏమైనా, నాలెక్క తప్పైతే తగు ఆధారాలతో సరైన లెక్క ఏమిటో చెప్పండి. సరిదిద్దుకోవడానికి నామోషీ లేదు. కానీ నాలెక్క సరైనదేనన్న విశ్వాసం ఉంది. కాదంటే ఆ వ్యాసంలోనే వాపోయినట్లు ఇప్పటికే తెలుగు సగం చచ్చిపోయింది, జాగ్రత్త పడకపోతే మృతభాష అయిపోతుందన్న యునెస్కో వారి జోక్యం నిజమైపోతుందన్న భయంకూడా ఉంది.

(# వ్యాసకర్త 2001 అని పేర్కొన్నారు. అది ఆంధ్రప్రభలో అలాగే ప్రచురితమైంది. ఈ లెక్క రాష్ట్రాల పునర్విభజన జరిగిన కాలం నాటిదని మా భావన) 

- చేగొండి రామజోగయ్య,
విశ్రాంత బ్యాంకు అధికారి, విశాలాంధ్ర మహాసభ సభ్యులు

21, ఫిబ్రవరి 2012, మంగళవారం

అన్ని ప్రధాన నగరాల్లో విశాలాంధ్ర మహాసభలు


ఈనాడు.నెట్  21/02/2012

భాషారక్షణ ప్రభుత్వ బాధ్యత కాదా?

ఆంధ్రభూమి సంపాదకీయ పేజీ:  మళ్ళీ యీ ఏడు అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవం వచ్చింది. ప్రపంచంలోని భాషాజాతులన్నీ తమ భాషల్ని కాపాడుకోవాలని ఐక్యరాజ్యసమితి వారి విద్యాసాంస్కృతిక విభాగం- యునెస్కో-ఒక పుష్కరకాలంగా ప్రతి ఫిబ్రవరి 21న పిలుపు ఇస్తూనే ఉంది. సరిగ్గా ఆరోజున 1952లో తూర్పు పాకిస్తాన్‌లోని ప్రజలు, రచయితలు తమ మాతృభాష బెంగాలీకోసం రక్తతర్పణం చేశారు. ఆ ఉద్యమం చిలికి చిలికి, తర్వాత ఇరవైఏళ్ళకల్లా అది స్వతంత్ర దేశంగా-బంగ్లాదేశ్‌గా-ఆవిర్భవించడానికి దారితీసింది. మాతృభాషను తమ హక్కుగా స్వాభిమానసంపన్నులైన ఆ ప్రజలు భావించబట్టే అంతటి పరిణామం చోటు చేసుకుంది.

అప్పుడు ఒక చిన్న భూభాగంలో పాలకులపైన తమ భాషకోసం ప్రజలు పోరాడి సాదించిన ఘన విజయం అది. కాని, ఇప్పుడు ప్రపంచీకరణ వల్ల మాతృభాషలన్నిటికీ పెనుముప్పు ముంచుకొస్తోంది. ప్రపంచీకరణ వాహికగా ఆంగ్లభాషముందుకు దూసుకొస్తోంది. అది ఒక వరదలాగా వస్తూ చిన్నచిన్న భాషల్ని మా యం చేస్తున్నది. వేలాది చిన్నచిన్న భాషలు పాశ్చాత్యదేశాల్లో, ఆఫ్రికన్ దేశాల్లో ఆ వరదలో కొట్టుకుపోతున్నాయి. ఈ ప్రమాదాన్ని గుర్తించిన యునెస్కో సర్వప్రతినిధిసభ రెండు మూడు సార్లు సమావేశమై లోతుగా చర్చించి 12 ఏళ్ళనాడు ప్రపంచదేశాలకు ఆ పిలుపు ఇచ్చింది. ఏడాదిలో ఒకరోజును ప్రత్యేకించి రుూ విషయంలో ప్రపంచ ప్రజలను మేల్కొల్పడానికై కేటాయించింది. బెంగాలీ ప్రజలు త్యాగం చేసిన ఆ రోజును అందుకై ఎంపిక చేసింది.ఆఫ్రికాలోని రోబీ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న గుగీవాథియాంగో అనే ఆంగ్లబోధకుడు తన మాతృభాష ‘గికురుూ’ రక్షణకోసం, అట్లాగే మరికొందరితో కలిసి ‘సావహిలీ’ వంటి తోటి చిన్న భాషల రక్షణకోసం చేసిన పోరాటం, నైజీరియాలోని ‘చెనువా అబీబీ’ చేసిన పోరాటం చిన్నవేమీకావు. ప్రపంచప్రఖ్యాత అమెరికన్ విద్యావేత్త నామ్‌చోమ్‌స్కీ చేస్తున్న పోరాటం ప్రపంచవ్యాప్తంగా మాతృభాషల రక్షణకోసం, విద్యారంగ సంస్కరణలకోసం జరుగుతున్న ఉద్యమాలకు స్ఫూర్తిదాయకంగా ఉంది. మున్ముందు ప్రపంచంలో రాగల సంఘర్షణలకు యుద్ధాలకు ‘్భష’ కూడా ఒక అంశంగా తయారయ్యే అవకాశాల్ని విజ్ఞులు త్రోసిపుచ్చడంలేదు.

ఈ ఏడాది యునెస్కో డైరెక్టర్ జనరల్ ఇరినా బొకోవా అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవం సందర్భంగా ఇచ్చిన సందేశం ప్రకారం బహుళభాషల సమాజాల మనుగడ వాస్తవం అవుతున్నది. ఏ సమాజమూ బహుళబాషల మనుగడను తిరస్కరించే అవకాశంలేదు. అనేక చారిత్రక, రాజకీయ కారణాలవల్ల ఒకటికంటె ఎక్కువ భాషలు ఒక సమాజంలో మనుగడ సాగించాల్సిన పరిస్థితుల్లో కూడ మాతృభాషల రక్షణ తప్పనిసరి అవుతోంది. ఇలాంటి పరిస్థితి ఇప్పుడు మనదేశంలో త్వరత్వరగా ఏర్పడుతోంది. ప్రపంచీకరణ ప్రభావాలు ఇందుకు తోడై సమాజాల్లో భాషాపరమైన గందరగోళం నెలకొనే అవకాశం ఉంది. ప్రభుత్వాలకు స్పష్టమైన భాషావిధానం ఉండకపోతే, మాతృభాషల రక్షణకు ప్రభుత్వాలు దీక్ష వహించకపోతే, భాషా జాతుల్లో ఏర్పడే నైరాశ్యం వల్ల కాలక్రమంలో సంఘర్షణలకు, రాజకీయ పరిణామాలకు దారితీయక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.

తెలుగుభాషాజాతి గురించీ దాని గతం, వర్తమానం, భవిష్యత్తు గురించీ లోతుగా చర్చ ఎప్పుడూ జరుగుతూనే ఉంది. కానీ, అది ఇప్పుడు వేగం అందుకొంది. కొత్త ఆలోచనలు ముందుకు తెస్తున్నారు. వేలాది సంవత్సరాల తెలుగుజాతి భాషాపరంగా ఎదుర్కొంటున్న సంక్షోభానికి ఎన్నో కారణాలేకాదు, దాని వస్తుస్థితిని పరిశీలిస్తే ఎన్నో కోణాలు కూడా మనముందు ప్రత్యక్షమవుతాయి. గతంలో కవుల సాహితీ సృజనలోనే వెల్లడైన ధోరణులు వేరు, నాటి అవసరాల వరకే వారి చూపు సాగింది. నేటి అవసరాలకు తగ్గ కొత్త ఆలోచనలు తప్పనిసరి. కొత్త పదాలను కూర్చుకోవడమూ తప్పనిసరే. అయితే ఇదంతా తెలుగు మూలాలపై ఆధారపడే జరగాలి గాని ఇతర భాషల మూల పదాలపై ఆధారపడి కాదు. భాషను స్వంతమూలాలపై ఆధారపడి ఎదిగించుకొంటేనే, ఆ భాష నిలుస్తుంది. అన్ని అవసరాలకూ తగ్గట్లుగా ప్రపంచస్థాయి భాషగా పెంచుకుంటేనే తెలుగుకు భవిష్యత్తుంటుంది. దీనికి కర్త, కర్మ క్రియ తెలుగు ప్రజలే కావాలి. వారి భాషా సాంస్కృతిక వారసత్వమే ఇందుకు ఆధారం కావాలి.

నేడు ఎదుర్కొంటున్న సంక్షోభాన్నుంచి మన మాతృభాషను రక్షించుకోవాలంటే ప్రాథమిక స్థాయినుంచి స్నాతకోత్తర విద్యదాకా, ఆపైన వృత్తి విద్యలదాకా అన్ని దశల్లోనూ తెలుగుకు గౌరవస్థానం దక్కాలి. ప్రజాజీవితంలో అన్ని దశల్లోనూ-పుట్టుకనుంచి జీవితాంతం వరకూ అన్ని అవసరాలకూ తెలుగే తెలుగు ప్రజాజీవితాన్ని వికసింపజెయ్యాలి. పరిపాలనలో, ఉద్యోగ వ్యాపారాల్లో తెలుగే రాజ్యం చెయ్యాలి. ఇందుకు తగ్గట్లుగా మన ప్రభుత్వ విధానాలుండాలి. కాని, మన ప్రభుత్వానికి తెలుగును కాపాడుకోవాలన్న ఉద్దేశం కనిపించడంలేదు. మనతోపాటే భాషా ప్రాతిపదికన ఏర్పడిన పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలు స్పష్టమైన భాషా విధానంతో అంకిత భావంతో ముందుకు సాగుతుంటే, మన ప్రభుత్వం మాత్రం భాషా రక్షణ తన బాధ్యతేకానట్లు వదిలివేసింది. మన పొరుగు రాష్ట్రాల్లో వారి భాషలకోసం ప్రత్యేక మంత్రిత్వశాఖలు తొలినుండీ ఉన్నాయి. మన రాష్ట్రంలో మాత్రం 60ఏళ్ళయినా ఇంతవరకూ ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. 2001లో తమిళానికి మాత్రమే ప్రాచీన భాష హోదానిచ్చి, తోటి తెలుగు, కన్నడలను కేంద్రం నిర్లక్ష్యం చేస్తే తెలుగు ప్రజలు తిరగబడ్డారుగాని ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదు. తప్పని పరిస్థితుల్లో తమకు రాజకీయంగా దెబ్బతగులకుండా ఉండ టం కోసం కేంద్రాన్ని బ్రతిమాలి, గుర్తింపును సాధించినా, కేంద్రం ఇప్పుడిచ్చిన లక్షలాది రూపాయలను వినియోగించుకోవడానికి కావలసిన వ్యవస్థను ఏర్పరచేందుకు కూడా మన ప్రభుత్వం ముందుకు రావడం లేదు. ఇక-ఆధునిక భాషగా తెలుగును అభివృద్ధిచేసుకోవడం సంగతి సరేసరి.

కొందరు పెద్దలు తమ ప్రసంగాల్లో ప్రజలే తెలుగును రక్షించుకోవాలని చెప్తుంటారు. నిజమే.విస్తృతమైన తెలుగు సమాజం తెలుగును రక్షించుకోగలదు. ప్రభుత్వాలు తమ బాధ్యతను విస్మరించి ఇదే రీతిగా వ్యవహరిస్తుంటే ప్రజలే ఇందుకు పూనుకుంటారు. అయితే ఇది రాజకీయాలను ప్రభావితం చేసేంత మలుపు తీసుకుంటుందా అనే ప్రశ్న ఉండనే ఉన్నది. సమాజానికి, దాని స్వాభిమానానికి దెబ్బతగిలే ఏ అంశమైనా సున్నితంగా ఉంటుంది. తెలుగు సమాజంలో భాష ఒక కీలకమైన రాజకీయాంశంగా మారేందుకు తగిన పరిణామాలు ఎప్పుడెలా వస్తాయో ఎవరూ చెప్పలేరు. పొరుగున ఉన్న రాష్ట్రాల్లో రెండవ పెద్ద భాషగా ఉన్న తెలుగు ప్రజల్లో అసంతృప్తి ఆ ప్రభుత్వాల మనుగడకు ప్రశార్థకంగా మారగల పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే, 50 ఏళ్ళ క్రితం తమిళనాడులోవున్న స్థితిలో యిప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న తెలుగు రానున్న 50 ఏళ్ళలో ప్రజా రాజకీయోద్యమాలను ప్రభావితం చెయ్యజాలదని ఎవరూ అనుకోకూడదు. ఇప్పుడు నడుస్తున్న తెలుగు భాషోద్యమం అలాంటి పరిణామశీలాన్ని పెంపొందించుకొంటే చాలు.

 -డాక్టర్ సామల రమేష్‌బాబు

భాషా విప్లవం రావాలి

 ( నేడు మాతృభాషా దినోత్సవం )

ఆంధ్రజ్యోతి సంపాదకీయ పేజీ: పాశ్చాత్య దేశాలు ముఖ్యంగా అమెరికా కేంద్రంగా ప్రపంచీకరణ ఫలితంగా ఆంగ్ల భాష ఆధిపత్యం ప్రపంచంలోని మాతృభాషలకు ప్రమాదంగా పరిణమించింది. ప్రపంచంలోని సుమారు 6,500 భాషల్లో సగానికిపైగా అంతరించిపోతున్నాయని ఐక్యరాజ్యసమితి సాంస్కృతిక విభాగం 'యునెస్కో' 12 ఏళ్ళ క్రితం ప్రపంచంలోని భాషా జాతులను హెచ్చరించింది. ప్రజల భాషలు నశిస్తే భాషా వైవిధ్యంతోపాటు జీవ వైవిధ్యం కూడా నశిస్తుందని, ఈ పరిస్థితిని ఎదుర్కొని మీ మీ భాషల్ని కాపాడుకోండని పిలుపునిచ్చింది. ప్రతి ఏటా ఫిబ్రవరి 21ని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా ప్రకటించింది.

ఈ పిలుపునందుకొని తమ తమ భాషల్ని రక్షించుకోవడానికి ఉద్యమించిన భాషా ప్రజల్లో తెలుగువారు కూడా ఉన్నారు. 2003లోనే తెలుగువారు ఇందుకోసం తెలుగు భాషోద్యమ సమాఖ్య పేరుతో ఉద్యమం ప్రారంభించారు. అయితే ప్రభుత్వాలు తెలుగుపట్ల ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యం వల్ల తెలుగును కాపాడుకోవడం కోసం దీర్ఘకాల ఉద్యమం అవసరమయ్యేట్లే ఉంది. మన రాష్ట్రంలో విచిత్రమేమిటంటే ప్రజల భాషపట్ల ప్రభుత్వాలు విముఖంగా ఉండటం. ఇది భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోని ఏ దేశంలో కూడా కనిపించని ప్రత్యేక పరిస్థితి.

ఈ పట్టనితనం వల్ల ఏ భాషా ప్రాతిపదికపైనేతే ఈ రాష్ట్రం ఏర్పడిందో, ఆ మౌలిక అవసరాలే దెబ్బతింటున్నాయి. ప్రజల భాషలో పరిపాలించుకోవాలని, వారి భాషలోనే పిల్లలకు చదువు చెప్పాలని, వారి భాషా సంస్కతులు అన్నివిధాలా విలసిల్లేందుకు, వారి సాహిత్యం, వారి ప్రతిభా సంపత్తి అనంతంగా ఎదగాలనే మహత్తర ఆశయంతో ఏర్పడిన రాష్ట్రంలో ఈ మౌలిక అంశాలకే హానికలిగించి, ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకమైన విధానాలను ఈ 60 ఏళ్ళుగా ప్రభుత్వాలు అనుసరించబట్టే ఇప్పుడు ఈ అన్నిరంగాల్లో అస్తిత్వ ఉద్యమాలు తలెత్తి ముందుకు సాగుతున్నాయి.

ఈ ప్రజల భాష తెలుగు. తెలుగుజాతి విస్తరించేకొద్దీ భాషా సంస్కృతుల్లో ప్రాంత ప్రాంతానికీ వైవిధ్యం తొణికిసలాడుతుంటుంది. ఆ క్రమంలో ఎన్నో మాండలికాలు భాషలోనూ, ఎన్నో రీతుల జానపద కళలు, జీవన విధానాలు మనకు కనిపిస్తాయి. వీటన్నింటినీ అర్థం చేసుకోవాలంటే జాతికి ప్రాణమైన తెలుగు భాషకు పాలనావ్యవస్థలో ఒక మంత్రిత్వశాఖ ఉండాలి. పొరుగు రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటకలలో ఇలాంటి ఏర్పాటు ఉంది. మన పాలకులకు మాత్రం ఈ ఆలోచనే ఇన్నేళ్ళుగా ముందుకు రాలేదు. తెలుగును విద్యారంగంలో, శాస్త్ర సాంకేతిక అవసరాలకు సరిపడే విధంగా అభివృద్ధి చేసుకునే ప్రయత్నమే కనిపించదు.

పైగా, తెలుగును సాహిత్యం వరకే పరిమితం చేసి, ఇతర జీవన రంగాల్లో, ఆధునిక జ్ఞాన సంబంధమైన అవసరాల్లో పూర్తిగా ఆంగ్లానికి తావివ్వడం వల్ల తెలుగు ఎదుగుదలకు గల అవకాశాలను మనం నిరోధించడమవుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగును ఒక మాతృభాషగా రక్షించుకోవడానికి ప్రజలే ఉద్యమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అవసరమైన ఏ ఇతర భాషనైనా నేర్చుకోవద్దని ఎవరూ అనరు. తల్లి భాషలో గట్టి పట్టు ఉంటే, ఆ పునాది మీద ఇతర భాషలు నేర్చుకోవచ్చు.

తల్లి భాషనే కోల్పోయినప్పుడు ఇక జ్ఞానార్జనకు కావలసిన ప్రాతిపదికనే కోల్పోతాము. మన భాషను కాపాడుకుంటూ, అభివృద్ధి చేసుకుంటూ అన్ని అవసరాలకు తగ్గట్లుగా వినియోగించగల పరిస్థితికి మనం చేరుకోవాలి. ఈ లక్ష్యం దిశగా జాతిని పురోగమింపజేసేందుకు తెలుగు భాషోద్యమం దీక్ష వహించింది. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో తెలుగు భాషోద్యమం ప్రభుత్వం ముందు తొమ్మిది అత్యవసర డిమాండ్లు ఉంచింది. వీటిని సాధించడం కోసం ఈ మాతృభాషా దినోత్సవం నాడు రాష్ట్రమంతటా దీక్షా దినంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నది.

(1) తెలుగు భాష రక్షణ, అభివృద్ధికై ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను వెంటనే ఏర్పాటు చేసుకోవాలి. (2) రాష్ట్రంలో అన్ని స్థాయిల్లో అధికార భాషగా తెలుగును అమలుచేయాలి. చట్టసభలు, ముఖ్యమంత్రి కార్యాల యం, సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లో వెంటనే దీన్ని అమలుచేయాలి. జిల్లా స్థాయివరకు న్యాయస్థానాల్లో తెలుగులో వ్యవహారాలు జరిగేందుకు జి.ఓ.నెం. 485(1974)ను అమలుపరచాలి. అధికార భాషా సంఘానికి తగిన అధికారాలు కల్పించి వెంటనే నియమించాలి. (3) ప్రభు త్వ, ప్రభుత్వేతర పాఠశాలలన్నింటిలోనూ మాతృభాషలోనే పాఠశాల విద్యను బోధించడాన్ని తప్పనిసరి చేయాలి. మొదటి తరగతి నుంచి ఒక సబ్జెక్టుగా మాత్రమే ఆంగ్లాన్ని బోధించాలి.

(4) ఇంటర్మీడియట్, డిగ్రీ, పి. జి. ఎం.బి.బి.యస్ వంటి వృత్తి విద్యాకోర్సులలోను, సాంకేతిక విద్యారంగంలోను రాష్ట్రంలో తెలుగుభాషను ఒక సబ్జెక్టుగా తప్పనిసరి చేయాలి. (5) ఇతర రాష్ట్రాల్లోని తెలుగువారి విద్య, భాషా సంస్కృతుల రక్షణకై శాశ్వత స్థాయిన సంయుక్త సభాసంఘాన్ని అన్ని వనరులతో ఏర్పరచాలి. (6) క్లాసికల్ భాషగా తెలుగులో పరిశోధనా కేంద్రానికి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసినా, దాన్ని ఆంధ్రప్రదేశ్‌లో స్థాపించడానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ వహించకపోవడం అన్యాయం. వెంటనే తగిన సౌకర్యాలు చూపడంతోపాటు తమిళ, కన్నడలకు దీటుగా క్లాసికల్ తెలుగు అధ్యయన సంస్థను పూర్తిస్థాయిలో స్థాపించడానికి తగిన చర్యలు తీసుకోవాలి.

(7) పోటీ పరీక్షల్లో తెలుగు మాధ్యమ అభ్యర్థులను ప్రోత్సహించడానికి 5 శాతం అదనపు మార్కులు కలపాలి. (8) ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీని, రద్దయిన తక్కి న అకాడమీలను తిరిగి నెలకొల్పాలి. (9) ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో తెలుగు మాట్లాడడాన్ని నేరంగా పరిగణించి శిక్షలు వేయడం రాష్ట్రమంతటా ఒక అలవాటుగా మారింది. తెలుగు భాషను తక్కువ చూపు చూడడం, పలు రంగాల్లో తెలుగును అవమానించడం సర్వసాధారణమైంది. వివిధ ప్రాంతాల మాండలికాలను, యాసలను హేళనచేయడం, వక్రీకరించడం జరుగుతోంది. ఈ పరిస్థితిని నివారించి తెలుగుభాషా సంస్కృతుల పట్ల గౌరవాన్ని ఇనుమడింపజేసేందుకు వెంటనే ఒక చట్టాన్ని తీసుకురావాలి.

పై డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తీర్చాలని, తెలుగు భాషపట్ల, తెలుగు జాతిపట్ల తన నిబద్ధతను నిరూపించుకోవాలని కోరుతున్నాను. చివరగా తెలుగు భాషోద్యమం చెప్పదలచుకున్నదొక్కటే. తెలుగు ప్రజలు రాష్ట్రంలో కోట్లుండగా బయటి రాష్ట్రాల్లో కూడా ఇంచుమించి అంతమందే ఉన్నారు. అనేక చారిత్రక కారణాల వల్ల దూర దూర ప్రాంతాల్లో ప్రత్యేకమైన రాజకీయ నేపథ్యాల్లో, సాంస్కృతిక భిన్నత్వంలో ఉన్నారు. అయినా అందరి భాషా మౌలికంగా తెలుగే. అందులోనే ఎవరి ప్రత్యేకతలు వారికున్నాయి.

అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రాంతీయ వైవిధ్యం ఉంది. ప్రత్యేక తెలంగాణ కోసం సాగుతున్న ఉద్యమం అనేక ఆర్థిక, రాజకీయ, సామాజిక కారణాల మీద ఆధారపడి ఉంది. పరిపాలనా యంత్రాంగాన్ని పేదల వద్దకు తీసుకుపోవడానికై భాష ఉపయోగపడడమే కాకుండా ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరుస్తుంది. కోర్టులలో క్లైంట్ యొక్క భాషే తీర్పులకు జవాబుదారీతనం యిస్తుంది. భాషలోను, పాఠ్యపుస్తకాల్లోని బోధనాంశాల్లోనూ ఎంతో విప్లవం జరిగితే గానీ మన పిల్లలకు చదువు అబ్బడానికి తగిన పరిస్థితులు ఏర్పడతాయని నా దృఢమైన అభిప్రాయం.

- డా. చుక్కారామయ్య
శాసనమండలి సభ్యులు, తెలుగు భాషోద్యమ సమాఖ్య గౌరవాధ్యక్షులు

15, ఫిబ్రవరి 2012, బుధవారం

దీర్ఘకాల తెలుగు తెగుళ్లు!

ఆంధ్రప్రభ వ్యాసం: ఒక పెనుముప్పుని తక్షణాగత్యంగా ఎదుర్కొంటున్న అనివార్యతా క్రమంలో, లేదా దేహంలోని ఒక భాగంలో ప్రస్తుతం విపరీతంగా బాధిస్తున్న 'పుండు' ని నయం చేసుకునే ప్రయత్నంలో, ఇంకా ప్రమాదకరమైన ఇతర సమస్యల్ని, అనారోగ్యాల్ని అలక్ష్యం చేయటం సహజంగా జరుగుతుంటుంది. కానీ ప్రస్తుత సమస్య కొంత ఉపశమించిన తర్వాతనైనా, ఇతర జాఢ్యాలపై దృష్టి సారించాలి. సమాంతర వైద్యం జరగాలి. ఊపిరితిత్తుల్లో వ్యాధికి మందులిచ్చి ఊరుకోకుండా కాలి గోటికున్న పుండుకి కూడా మందుపూయాలి. అంతిమంగా అన్ని సమస్యలకు పరిష్కారం, సంపూర్ణ ఆరోగ్యం లభించేలా ఏ రోగమూ తిరగబెట్టని రీతిలో బహుళ చికిత్స జరగాలి. (దీన్నే వైద్యుల పరిభాషలో (మల్టిపుల్‌ ట్రీట్‌మెంట్‌) అంటారు). ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే, ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ వాదం కొంత బలహీనపడిందన్నది నిర్వివాదాంశం.

ఈ పరిణామానికి ప్రశంసార్హులు క్రమంగా వాస్తవాలను, ఉద్యమకారుల అరాచకాల్ని మూ(మా)టకారుల అసలు ధ్యేయాల్ని, రంగుల్ని గ్రహించిన తెలంగాణ ప్రజలు మాత్రమే కానీ, ఏ ఎండకాగొడుగు పట్టే మన రాజకీయ నేతలు సంచలనాలు, అరాచకాలకే ప్రాధాన్యమిచ్చే మీడియా కానీ కానే కాదు! తెలంగాణ ప్రజల్లో అంతర్మథనం పరివర్తన ప్రారంభమైన ఈ తరుణంలో, అన్ని ప్రాంతాల తెలుగువాళ్లకున్న తెగుళ్ల గురించి, వాటి నివారణోపాయాల గురించి చర్చించుకోవాల్సిన అగత్యముంది, ప్రస్తుత సమస్యకు మూలకారణాలు అవే కాబట్టి వర్తమాన ప్రపంచంలో అన్ని వర్గాల వారికున్న జాఢ్యాలన్నీ, స్వార్థం, అవినీతి, విలువల పతనం వంటివి మనకూ ఉన్నాయి. అయితే, తెలుగువాడికున్న కొన్ని ప్రత్యేక రోగాల గురించి మాత్రమే చెప్పుకొందాం.

(1) అనైక్యత: ఆరంభ శూరత్వం మాటేమోకానీ, అమెరికాలో అస్సాంలో, అమలాపురంలో, ఆదిలాబాద్‌లో ఎక్కడున్నా సరే, ఒక బండగుర్తుగా తెలుగువాళ్లని పట్టిచ్చే గుణం అనైక్యత. ఎక్కడైనా ఇద్దరు తెలుగువాళ్లుంటే మూడు సంఘాలుంటాయన్న ఖ్యాతి మనకుంది గదా! ఇంకే ఇతర భాషా వర్గానికి లేనిది, మనకు మాత్రమే ఉన్న దుర్గుణం 'యాసా వైషమ్యం'. ప్రపంచంలో ఆరువేల భాషలున్నాయంటారు. అన్ని ఏకలిపి భాషల్లోనూ అసంఖ్యాక యాసలుంటాయి (స్లాంగ్స్‌). యాస అనేది, ఒక వ్యక్తి కుటుంబ నేపథ్యం, విద్యాస్థాయి, జన్మస్థలం, శాశ్వత నివాస ప్రాంతం, వృత్తి ఇతర భాషలతో, వర్గాలతో సాహచర్యం, ఇలా ఎన్నో అంశాలపై ఆధారపడి ఉంటుంది.

తెలంగాణ ప్రాంతంలో ఆ మాటకొస్తే ఏ ఊళ్లోనూ, ఏ కుటుంబంలోకూడా ఒకే యాస ఉందని చెప్పలేం. ఉదాహరణకి కెసిఆర్‌, ఈ మధ్యకాలంలో ఎంతో కష్టపడి అభ్యాసం చేసి, కృతకంగా అలవరచుకున్న యాసను ఆయన కొడుకు, కూతురు కూడా సంపూర్ణంగా అనుకరించలేకపోతున్నారు! యాసలు భాషా సూర్యుని శతకోటి కిరణాలు. దేని గొప్ప దానిదే. ఎప్పుడో, సినారె అన్నట్లు 'వచ్చాడన్నా, వచ్చిండన్నా' రెండూ తీపి తెలుగుపదాలే! కాని మన ఖర్మ ఏమిటో కానీ యాసా సంబంధిత ద్వేషాలు మనకు మాత్రమే సొంతం. ఈ సమస్యకు పరిష్కారం ఒక ప్రామాణిక వ్యవహారిక భాషను రూపొందించుకొని, నిర్దేశించడం కాదు.

ఇతర భాషల వారి లాగానే భాషాభిమానం పెంపొందించుకోవడం, ఇతర స్వభాషీయులు మాట్లాడే తీరుల్లోని స్వల్ప తారతమ్యాలను ఎగతాళి చేసే దుర్గుణాన్ని మానుకోవటం, మాత్రమే ఈ మాయరోగానికి మందు. యాసాద్వేషాలని ప్రేరేపించే వారిని వెలివేయాలంతే! ఏది ఏమైనా అనైక్యత మూలాన్నే తెలుగువాళ్లంటేనే అందరికీ చులకన భావం ఏర్పడిపోయి ఉంది. జాతీయ స్థాయిలో కూడా మన సంఖ్యాబలానికి తగిన దామాషాలో రాజకీయ ప్రాధాన్యం, గౌరవం, నిధులు, ప్రాజెక్టులు లభించడం లేదని తెలుసుకదా.

(2) మనకు మాత్రమే ఉన్న అవలక్షణం మాతృభాషపై ఉండాల్సినంత గౌరవం, ఆదరణ లేకపోవడం. తర్వాతి తరాలవారికి భాషాభిమానం కల్పించే ప్రయత్నం చేయకపోగా, వారి పరంగా నిరాదరణను ప్రోత్సహించడం 'మనోళ్ల'కే చెల్లు అన్యభాషా మాధ్యమాల్లో పిల్లలకి ప్రాథమిక స్థాయి నుంచి చదువులు చెప్పించడం మనలో అధిక సంఖ్యాకులు తెలిసీ చేస్తున్న పాపం. కొన్ని సంవత్సరాల క్రితమే, యునెస్కో వారు రానున్న కొద్ది దశాబ్దాలలో తెలుగు మృత భాషగా మారనున్నదనే హెచ్చరిక చేసినా మనకు చీమకుట్టినట్లైనా లేదు. దాదాపు 30 శాతం మందికి ఆ భాషలో రాయడం, చదవడం రాకపోతే, అది త్వరలో అంతరించిపోతుందన్న ప్రామాణికతను మనం ఇప్పటికే సాధించాం.
ఎలాగంటే, ఇతర రాష్ట్రాలలో విదేశాల్లో ఉన్న ఎనిమిది కోట్ల మంది తెలుగువారిలో, వారి వారసుల్లో దాదాపు సగం మందికి తెలుగు రాయడం, చదవడం సంగతలా ఉంచి మాట్లాడడమూ అంతంత మాత్రమే. మన రాష్ట్రంలోను సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న 10 కోట్ల మంది తెలుగువాళ్లలోనైనా రాయడం, చదవడం వచ్చిన వాళ్ల శాతం సంగతలా ఉంచి, ఇష్టంగా స్వచ్ఛంగా మాట్లాడే వాళ్లెంతమందో చెప్పుకోవాలంటే సిగ్గుపడాలి. కాబట్టి ఇప్పటికే తెలుగు సగం చచ్చిపోయి ఉంది. మృత భాషగా మిగిలి పోకూడదంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రవాసాంధ్రులు భాషాంతరీకరణం చెందకుండా మనవంతు సహకారం అందించాలి. ఈ విషయంలో తమిళ సోదరులను ఆదర్శంగా తీసుకోవాలి.

(3) అన్యభాషలపై మోజు: ఇది మనకున్న మరో పెద్ద అవలక్షణం. ఇతర భాషలను నేర్చుకోవడం తప్పుకాదు, మాతృభాషకే పెద్ద పీట వేసినంత వరకు తెలంగాణ ప్రజాకవి కాళోజీ 'అన్యభాషలు నేర్చి ఆంధ్రము రాదని సకిలించువేందిరా' అని అందుకే మనల్ని తిట్టేరు. ఇతర భాషల వారు కూడా అన్యభాషా పదాల్ని అవసరమైన మేరకు ఆహ్వానిస్తారు. ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలో మన హిందీ పదాలు, ఘెరావ్‌, బంద్‌ వంటివి చేరేయి కానీ వాళ్లు తమ భాషలో సరైన పదాలు లేకపోతేనే ఆ పని చేస్తారు. కానీ మనం అలాకాదు. మనకున్న మంచి పదాల స్థానంలో వాటిని నెత్తికెక్కించుకుంటాం. పాలకుల, ఇతరుల ప్రాపకం కోసం మన ఊళ్లపేర్లు కూడా మార్చేసుకున్నాం. ఊళ్లకు, పట్టణాలకు ఉర్దూ పేర్లు తెలంగాణాలో మాత్రమే ఉన్నాయనుకోవద్దు. ఉర్దూ పేర్లున్న ఊళ్లెన్నో సీమాంధ్రలో ఉన్నాయి. ఆంగ్లేయులు తమ సౌకర్యం కోసం, రాజమండ్రి, బెజవాడ అని మార్చిన పేర్లు మనకింపుగానే ఉన్నాయి ఇంకా.

(4) ప్రాంతీయ తత్వం: ఇతరులకన్న ఎంతో అధికంగా మనకున్న మరో అవలక్షణం ప్రాంతీయ దురభిమానం సొంత ఊరుని ప్రేమించడం తప్పుకాదు. కానీ ఉంటున్న ఊరుని, అక్కడి సంస్కృతీ, సంప్రదాయాల్ని సంపూర్ణంగా అలవరచుకోలేకపోయినా గౌరవించాలి. అన్నిప్రాంతాల తెలగువాళ్లకీ ఈ సుగుణం తగుస్థాయిలో ఉండదన్నది వాస్తవం. అందుకే విభజనవాదులు స్థానికులకి, స్థిరపడిన వారికి మధ్య విభేదాలు సృష్టించడంలో కొంతమేరకు సఫలమయ్యారన్నది గ్రహించాలి.

(5) ప్రాంతేతర బంధాలపై విముఖత తమిళులు కానీ, ఇతర భాషల వారు కానీ, ఎక్కడ కలుసుకున్నా తమ భాషలోనే మాట్లాడుకుంటారు. ఏ ప్రాంతం వాళ్లవెరన్న దానికి అసలేమీ ప్రాధాన్యమివ్వరు. మనోళ్లు అలాకాదు. విదేశాల్లో ఉన్న వాళ్లలో కూడా ఒక ప్రాంతం, జిల్లా వాళ్ల మధ్యనే ఎక్కువ సౌహార్దం ఉంటుంది. మతపరమైన కట్టుబాట్లు, కులాల కుంపట్లు కూడా తెలుగువాళ్లలో అధికం. ప్రాంతీయ భావాలు మరీ ఎక్కువ. ఒక ప్రాంతం వాళ్లు అన్యప్రాంతాల వాళ్లతో వైవాహిక బంధాలకి అంతగా ఇష్టపడరు. మతాంతర, కులాంతర వివాహాలు జరుగుతున్న స్థాయిలోనైనా తెలుగువాళ్లలో ప్రాంతేతర వివాహాలు జరగడం లేదు. అసలు జరగడం లేదని చెప్పలేం కానీ, ఆ రోజుల్లోనే హైదరాబాద్‌ వాసి, మాజీ కేంద్ర మంత్రి పుంజాల శివశంకర్‌, విజయనగరం జిల్లా వాసి ద్వారం వెంకటస్వామి నాయుడుగారి కుటుంబంతో వివాహబంధం ఏర్పరచుకొన్నారు. ఇది మర్చిపోని సీమాంధ్రులు ఆయన్ని తెనాలి నుంచి ఎంపి గా గెలిపించుకున్నారు. వర్తమానకాలంలో కూడా మహబూబ్‌నగర్‌ మంత్రి డి.కె.అరుణ, మొగల్తూరు మొనగాడు చిరంజీవి, కృష్ణా జిల్లా కోనమేరు రంగారావు, తెరాస దళిత నేత చంద్రశేఖర్‌ల కుటుంబాలు ఇతర ప్రాంతాలతో వియ్యమందాయి. 

కానీ ఇలాంటి ప్రాంతేతర వివాహాలు బహు అరుదుగానే ఉంటున్నాయి.అమెరికాలో ఉన్న అమలాపురం కుర్రాడు, ఆస్ట్రేలియాలోని ఆదిలాబాద్‌ పోరడు, తమ తల్లిదండ్రులతో, మనవైపు సంబంధమే చూడమనే చెప్తుంటాడు! పూర్వం మొఘలులు, రాజ్‌పుత్‌లతో వైవాహిక బంధాలనేర్పరుచుకుని సత్ఫలితాలు సాధించారు. అలానే ఆంగ్లేయులు, ఫ్రెంచ్‌ వారితో, ఇతర యూరోపియన్లతో వివాహబంధాల ద్వారానే వారికి తమపట్ల ఉన్న వైషమ్యాన్ని తగ్గించగలిగారు. కాబట్టి తెలుగువాళ్లలో కూడా ప్రాంతాంతర వివాహాలు ఇంకా ఎక్కువగా జరిగితే బాగుంటుంది. తర్వాతి తరాల వారిలోనైనా ప్రాంతీయ విభేదాలు తగ్గుతాయి. స్వల్ప సాంస్కృతిక తారతమ్యాలను భూతద్దంలో చూసే దుర్గుణం కూడా తగ్గుతుంది.

ఈ తెలుగు తెగుళ్లన్నీ త్వరలో మాసిపోయి, పాత చరిత్ర అయిపోతుందని ఆశిద్దామా?!


-చేగొండి రామజోగయ్య 
విశ్రాంత బ్యాంకు అధికారి, విశాలాంధ్ర మహాసభ సభ్యులు

13, ఫిబ్రవరి 2012, సోమవారం

భాషాప్రయుక్త రాష్ట్రాల విధానం వీడితే దేశ సమగ్రతకే ముప్పు : విశాలాంధ్రమహాసభ సదస్సులో వక్తలు



మొగల్రాజపురం, న్యూస్ టుడే: విభజన పేరుతో రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూస్తున్న స్వార్థపరుల కుట్రను భగ్నం చేయాల్సిన అవసరం అందరిపైనా ఉందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. విశాలాంధ్రమహాసభ అధ్వర్యంలో సనివారం మొగల్రాజపురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో నిర్వహించిన మీడియా వర్కుషాపులో పలువురు సమైక్యవాదులు పాల్గొని, తమ వాణీని వినిపించారు. విడిపోవడానికి తెలంగాణవాదులు 100 కారణాలు చెబితే రాష్ట్రం సమైక్యంగా ఎందుకు ఉండాలో తాము వెయ్యి కారణాలు చూపుతామంటూ సవాల్ విసిరారు.రాష్ట్ర విభజన కోసం  జరుగుతున్న యత్నాలను ఆందోళనకారులను మహాసభ తీవ్రంగా ఖండిస్తోందని, విభాజనవాదులు చేస్తున్నవన్నీ కేవలం అసత్యాలు, అభూతకల్పనలని, 1956 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని ప్రాంతాలలో గణనీయమైన అభివృద్ధి జరిగిందనేది నిర్వివాదమని, ఒక ప్రాంతంలో ఆర్ధికపరమైన సమస్యలకు విభజన పరిష్కారమని ఆందోళన చేపట్టడంలో అర్థం లేదని, భాషాప్రయుక్త రాష్ట్రాలు దేశఐక్యతకు పట్టుకొమ్మలని, భాషాప్రయుక్త రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ అవతరణ అంకురార్పణ చేసిందని, భాషా ప్రయుక్త రాష్ట్రాల విచ్ఛిన్నం దేశ సమైక్యతకు, సమగ్రతకు ప్రమాద హేతువని, దేశంలో ఏ భాషాప్రయుక్త రాష్ట్రాన్ని కూడా విభజించే ఆలోచనను భారత  ప్రభుత్వం చేయరాదంటూ పలు తీర్మానాలు చేశారు.

ఈ సందర్భంగా విభజన పేరుతో కొన్ని నెలల కిందట తెలంగాణవాదులు సృష్టించిన బీభత్సకాండ, భౌతికదాడులకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శన ప్రతీఒక్కరినీ ఆలోచింపజేసింది. పలువురు విద్యార్థులు ఈ ప్రదర్శనను తిలకించి వేర్పాటువాదుల చేతుల్లో రాష్ట్రం అగ్నిగుండంగామారిన దృశ్యాలను చూసి చలించిపోయారు. మిలియన్ మార్చ్ సందర్భంగా విగ్రహాల విధ్వంసం,రాజధానిలో చెలరేగిన విధ్వంసకాండ, రాష్ట్ర ప్రథమ పౌరుడిపైన , లోక్ సత్తా అధినేతపైన దాడి,బస్సులు , రైళ్లపై ఆందోళనకారుల ప్రతాపం, వరుస సమ్మెలు, బంద్ లతో జనజీవనం అస్తవ్యస్తం , ఒస్మానియా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో సంఘ వ్యతిరేకుల తిష్ట, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల విధ్వంసం ...ఇలా పలు చిత్రాలతో పాటు తెలంగాణ అభివృద్ధిపై స్పష్టమైన గణాంకాలతో ఏర్పాటు చేసిన అందర్నీ ఆలోచింపజేసింది. 

దీనిలో పాల్గొన్న వక్తలు ఎవరేమన్నారంటే... 

గణాంకాలు తప్పుల తడకలు : పరకాల ప్రభాకర్ , ప్రధాన కార్యదర్శి , విశాలాంధ్ర మహాసభ
తెలంగాణవాదుల వాదన మొత్తం అసత్యంతో కూడుకుంది. వారు చూపుతున్న గణాంకాలన్నీ తప్పుల తడకలే. విశాలాంధ్ర మహాసభ సభ్యుల్లో ఎక్కువమంది నైజాం ప్రాంతానికి చెందినవారున్నారు. తెలంగాణ ప్రజల్లో రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నవారు ఎక్కువ మంది ఉన్నారు.ఈ విషయాన్ని ప్రశ్నించే వారిపై భౌతికదాడులకు పాల్పడడంతో ఎవరూ బయటకొచ్చి మాట్లాడే సాహసం చేయడంలేదు. రానున్న కాలంలో ఈ ప్రదర్శనను రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ నిర్వహిస్తాం
సమైక్యవాదం వినిపిస్తాం : నలమోతూ చక్రవర్తి, విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు 
రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఎదాదికాలంగా కృషి చేస్తున్నాం.అందులో భాగంగానే ఢిల్లీ తరువాత ప్రదర్శనను హైదరాబాద్, విజయవాడల్లో ఏర్పాటు చేశాం. రాష్ట్రం సమైక్యంగా ఉండేందుకు ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది.
విభజన జరిగితే తెలుగు ఉనికికే నష్టం: ఆంజనేయరెడ్డి, రాష్ట్ర మాజీ డీజీపీ
కొందరు స్వార్థపరులు విభజన యత్నం కోరడం బాధాకరం. విభజన జరిగితే తెలుగు ఉనికికే నష్టం వాటిల్లుతుంది. రాజకీయాలకతీతంగా కలిసో సమైక్యవాదం వినిపిస్తాం
తాత్కాలిక ప్రయోజనాల కోసమే : నరసింహారావు, విశాలాంధ్ర మహాసభ అడ్వైజర్ 
ప్రధాన రాజకీయ పక్షాలన్నీకలిసి భయంకరమైన కుట్ర చేశాయి. తాత్కాలిక ప్రయోజనాల కోసమే విభజన యత్నం చేస్తున్నారు. పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్రాన్ని చీల్చాల్సిన అవసరం లేదు.
ఇటువంటి ప్రదర్శనలు అవసరం : అడుసుమిల్లి జయప్రకాశ్, మాజీ ఎమ్మెల్యే 
విభజన పేరుతో తెలంగాణవాదులు దాడులకు పాల్పడినప్పటికీ సమైక్యంగా ఉద్యమం సాగించడం అభినందనీయం. రాగద్వేషాలు పక్కన పెట్టాలి. ఇటువంటి ప్రదర్శనలు ప్రజల్లో చైతన్యం తీసుకువస్తాయి.
విభజనకు ఎక్కువమంది అనుకూలం కాదు: రామజోగయ్య, విశ్రాంత బ్యాంకు అధికారి,సమైక్యవాది 
తెలంగాణ ప్రాంతంలోని సమైక్యవాదులందర్నీ అభినందించాలి. విభజన కోరేవారిలో ఎక్కువమంది అనుకూలురు కారు.ఉద్యమం ముసుగులో కొందరు స్వార్థపరులు కుటుంబ ఆస్తులను పెంచుకుంటున్నారు. ఈ విషయాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.



భౌతికదాడులు దారుణం: శ్రీనివాసరెడ్డి, మహాసభ సభ్యులు, కరీంనగర్ 
స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నారు. సమైక్యతా అన్నవారిపైన భౌతికదాడులకు తెగబడడం దారుణం. కొందరు రాజకీయ పార్టీల నాయకులు విభజన పేరుతో కబ్జాకు యత్నిస్తున్నారు
కనువిప్పు కలగాలి : వేములపల్లి వామనరావు, స్వాతంత్య్ర సమరయోధులు
రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూడడం సమంజసం కాదు. వాస్తవం తెలుసుకొని మాట్లాడాలనుకునేవారికి ఈ ప్రదర్శన కనువిప్పు కలిగిస్తుంది. తెలంగాణ ప్రాంతంలో నాకు చాలా బాంధవ్యం ఉంది. 60 ఏళ్ళ పాటు ఖమ్మంలోని ఓ గ్రామంలో వ్యవసాయం చేశాను. పడి ఊళ్లలో ఉపాధ్యాయునిగా పనిచేశాను.రాజకీయ పార్టీల నాయకులు ఆత్మస్తుతి చేసుకోవాల్సిన అవసరం ఉంది. బయటకు చెప్పేది ఒకటైతే మనస్సులో మరొకటి ఉంటుంది.

ఇతర మీడియా కథనాలు
ఆంధ్రజ్యోతి : రాష్ట్ర విభజన ప్రమాదకరం

ఆంధ్రభూమి: భాషాప్రయుక్త రాష్ట్రాల విధానం వీడితే దేశ సమగ్రతకే ముప్పు

విశాలాంధ్ర : ప్రాంతీయ విద్వేషాలు పక్కన పెట్టి...

సాక్షి: విశాలాంధ్ర సభ సమైక్యతా సమరం

ప్రజాశక్తి:  రాష్ట్ర సమగ్రతే ఆశయం

సూర్య: ప్రాంతీయతత్వం విడనాడదాం

 
 

9, ఫిబ్రవరి 2012, గురువారం

ఫిబ్రవరి 11 న విజయవాడలో 'విశాలాంధ్రమహాసభ' సదస్సు మరియు ప్రదర్శన

మిత్రులారా,

‘విశాలాంధ్ర మహాసభ’ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమైక్యతను కాపాడడం కోసం కృషి చేస్తున్న సంస్థ. రాజకీయాలకు అతీతమైనది. ‘విశాలాంధ్ర మహాసభ’ తెలంగాణ, కోస్తా మరియు రాయలసీమ ప్రాంతాలకు చెందిన మేధావులు, నిపుణులు, విద్యావేత్తలు మరియు సమాజశ్రేయస్సు కోసం కృషి చేస్తున్న అనేకమంది వ్యక్తులు కలిసి స్థాపించిన సంస్థ.

మనరాష్ట్రంలో జరుగుతున్న వేర్పాటువాద ఆందోళన, హింస మరియు విధ్వంసక చర్యలను ప్రోత్సహిస్తూ, తెలంగాణ ప్రజలు అన్యాయానికి గురైయ్యారన్న అసత్య ఆరోపణల ఆధారంగా సాగుతున్నది. విభజనవాదులు అబద్ధాలను నిజాలుగా చిత్రీకరిస్తున్నారు. వాస్తవాలను వక్రీకరిస్తున్నారు.మా ఉద్దేశంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరుగుతున్న ఆందోళన పూర్తిగా అసమంజసమైనది.

ఈ సందర్భంలో, విశాలాంధ్ర మహాసభ రాష్ట్ర సమైక్యతను కాపాడుదాంఅనే అంశం పై మీడియా వర్క్ షాప్ మరియు ఎగ్జిబిషన్ నిర్వహించతలపెట్టింది. మన రాష్ట్రానికి సంబంధించిన సామాజిక, ఆర్ధిక, రాజకీయ, సాంస్కృతిక మరియు చారిత్రక నిజాలను మీడియా వర్క్ షాప్ మరియు ఎగ్జిబిషన్ ద్వారా ప్రజల ముందుకు తేవడం యీ ప్రయత్నం యొక్క ముఖ్య ఉద్దేశం.

వేర్పాటువాద ఆందోళన ప్రచారం చేస్తున్న నిందలు,అవాస్తవాలు,వక్రీకరణలు, అసత్యాలను ఖండించి నిజానిజాలను తెలిసుకోవడంలో మా యీ ప్రయత్నం సహాయపడుతుందని ఆశిస్తున్నాము.

సదస్సు 1:
ఫిబ్రవరి 11, 11.00 AM – 1.00 PM
సదస్సు 2:
ఫిబ్రవరి 11,  3.00 PM – 5.00 PM
   ప్రదర్శన
   ఫిబ్రవరి 11, 11.00 AM- 5.00 PM
 

వేదిక:సిద్ధార్థ ఆడిటోరియం,పి.బి.సిద్ధార్థ కాలేజి             మొగల్ రాజ్ పురం, విజయవాడ
              





ఇట్లు,
నలమోతు చక్రవర్తి
ప్రెసిడెంట్, విశాలాంధ్రమహాసభ 


8, ఫిబ్రవరి 2012, బుధవారం

ఎవరి 'పన్నాగం' వారిది !

ఆంధ్రప్రభ వ్యాసం:  'పెడదారి వీడడానికి మరికొంత సమయం 'మాగ్గావాలె', ప్రస్తుతానికి మాత్రం 'మా తెలంగాణ మాగ్గావాలె' అని పైకి అంటూనే ఉంటం. అంతిమంగా, ఇవ్వకపోయినా 'ఫర్వాలె' గానీ ఇప్పటికిప్పుడే ఇవ్వమని మరీ స్పష్టంగా చెప్పొద్దు, కుండబద్ధలు గొట్టొద్దు' అని బతిమాలుకుంటున్న మన విభజనవాదుల (తమతో రహస్య ఒప్పందం ఉన్న దొరవారితో సహా) ఆక్రందనలకి, 'అఖిల భారత కాంగ్రెస్‌' కొంత కరుణించిందనుకోవడానికి ఆస్కారమిస్తున్న పరిణామమొకటి గతవారం చోటుచేసుకుంది. అది ఒక రకంగా గొంతులో పచ్చివెలక్కాయపడ్డ రీతిలో ఉన్నా, ఎప్పుడూ మిశ్రమ భాషలో కేకలేసే కెకెతో సహా తెలంగాణ వాదులెవరూ దానిపై పెద్దగా స్పందించలేదు. దొరవారూ కోప్పడలేదు, వీర విభజనవాదులూ పట్టించుకోలేదు. అంతగా రుచించకపోయినా సమైక్యవాద నేతలూ మౌనం దాల్చారు. ఇంతకీ ఆ పరిణామమేమంటే, 31, జనవరి, 2012న అఖిల భారత కాంగ్రెస్‌ కేంద్రమంత్రి సిబాల్‌, తదితరుల ద్వారా విడుదలైన, ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ప్రణాళిక (వాగ్దాన) పత్రంలో తెలంగాణ సమస్యపై చేసిన ఒక క్లుప్త ప్రస్తావన! ఉత్తరప్రదేశ్‌ శాసనసభకు ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలకు వున్న ప్రాధాన్యం దృష్ట్యా, అందులో ప్రస్తావించిన ఏ ఒక్క విషయమూ సోనియా, రాహుల్‌ గాంధీల ప్రమేయం, పూర్వానుమతి, 'గేమ్‌' ప్లాన్‌ల ప్రభావం లేకుండా చోటు చేసుకుందని భావించలేం. ఎక్కడో ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి పార్టీ వాగ్దానాల పత్రంలో స్థానం సంపాదించిన ఆ క్లుప్త ప్రస్తావన లోని గుప్తార్థాన్ని విశ్లేషించుకోవాలంటే, దాన్ని యధాతథంగా, తెలుగులోకి అనువదించుకోవాలి. చిన్నదైనా, ఆ పేరానంతా ఒక్కసారే పూర్తిగా కాకుండా ఒక్కోవాక్యాన్ని (ఉన్నవే నాలుగు) అనువదించుకుంటూ అధికార పార్టీ అంతరార్థాన్ని గ్రహించడానికి ప్రయత్నిద్దాం.

మొదటి వాక్యం ఇలా ఉంది. 'మెరుగైన పరిపాలన, అమలు యంత్రాంగం సమర్థ వినియోగం కోసం 'చిన్న రాష్ట్రాలు' అవసరం ఐతే కావచ్చు. ఇందులో చివరి పదం 'కావచ్చు' అన్నదే బహుకీలకం, 'కాకపోవచ్చు' అన్న భావం కూడా ఇందులో ఇమిడి ఉంది! (మే ఆల్సో మీన్స్‌ మే నాట్‌!) స్పష్టమైన విధాన నిర్ణయం కాదు. సందేహం పాలే ఎక్కువగా ఉంది. అంతేకాదు అన్ని రాష్ట్రాల్లోని విభజనవాదులకు ఒక హెచ్చరిక కూడా ఉంది ఇందులో. ప్రత్యేకంగా తెలంగాణ వాదులకిదో చురక. కీలెరిగి పెట్టిన వాత కూడా! ఔను మరి, 'మనోళ్లు' పదే పదే వల్లించే చిన్న రాష్ట్రాల మంత్రం లేదా చెప్పే ఏ ఇతర కారణాన్ని వర్తింపజేసినా, హైదరాబాద్‌నీ, ఒక ప్రత్యేక రాష్ట్రంగా, ఆ మాటకొస్తే తెలంగాణ ప్రాంతాన్ని ఎన్నో చిన్ని, చిట్టి రాష్ట్రాలుగా చీల్చాల్సివస్తుంది గదా, 'చిన్న' అనే దానికి ప్రామాణికత ఏముంది? 

ఇక రెండో వాక్యం, 'ఒక కొత్త రాష్ట్రం లేదా రాష్ట్రాలను ఏర్పాటు చేసే క్రమంలో అనేక సంక్లిష్ట సమస్యలను ఆహ్వానించరాదు'. పొయ్యిమీద నుంచి పెనంలో పడే ఉద్దేశం లేదని ఆ మధ్యన, సాక్షాత్తు ప్రధానమంత్రి మన్మోహన్‌, అన్నదాన్నే ఇంకా స్పష్టంగా ప్రతిబింబిస్తోందీ రెండో వాక్యం. మొదటి వాక్యాన్ని మాత్రం చదివి మురిసిపోయే వాళ్లెవరైనా ఉంటే, గింటే వారికిదో చేదుమందు, మంటపుట్టించే మాత్ర. నా చెవిలో 'ఇస్తనని' చెప్పేరులే అని ఇంకా అంటున్న వారికో చెంపపెట్టు. కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఎప్పటికైనా ఇస్తదిలే అని గప్పాలు కొడుతున్న టి.కాంగ్రేస్సోళ్ల కప్పుల్ని, గొప్పల్ని బద్ధలు చేస్తున్న సుతిమెత్తని దెబ్బ. నిజానికి కాంగ్రెస్‌ పార్టీ కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఎప్పుడూ తెలంగాణ 'ఇస్తనని' చెప్పనే లేదు, కాంగ్రెస్‌ పార్టీ 2004లో తెరాసతో కుదుర్చుకున్న లిఖిల ఒప్పందంలో కానీ ఏ ఎన్నికల ప్రణాళికలో కానీ తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేస్తామని నిర్దిష్టంగా చెప్పలేదు.రాష్ట్రంలో, దేశంలో ఏకాభిప్రాయం వంటి షరతులతోబాటు, విభజన మూలంగా సంభవించే పలు సమస్యలను, కాంగ్రెస్‌ పార్టీ, అధికార ప్రతినిధులు, కేంద్ర మంత్రులు పలు సందర్భాల్లో పేర్కొంటూనే ఉన్నారు. విభజన కుదరదని పరోక్షంగా చెబుతూనే వచ్చారు. 'అమ్మో నీకదిస్తే ఎన్నో వినాశకర పరిణామాలుంటాయి, నీకూ, నాకూ, అందరికీ' అంటే 'ఇవ్వను' అని చెప్పడమే కదా! 

ఆ బుల్లి పేరాలోని మూడోవాక్యాన్ని పరిశీలిద్దాం, కొత్త రాష్ట్రాల ఏర్పాటుకి సంబంధించిన డిమాండ్లన్నింటినీ రాష్ట్రాల పునర్‌ వ్యవస్థీకరణ కమిటీ ద్వారా భావోద్వేగాలకతీతంగా చర్చించవలసిన అవసరముంది', దీని అర్థం ఏమిటి? 'మాది మాగ్గావాలె' అంటే కుదరదు. ఇదో జాతీయ సమస్య, మొత్తం దేశానికి ఒకే విధానం ఉండాలి అనేకదా! మేము ఏ మోసమూ చేయలేదు, 1999లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ ఇదే చెప్పాం 2004లో తెరాస కూడా లిఖిత పూర్వకంగా ఎస్సార్సీకి ఒప్పుకుంది. మాదెప్పుడూ ఒకటే మాట, అది ఎస్సార్సీ బాట అని చెప్పుకునే అవకాశం కాంగ్రెస్‌కు ఉంది కదా. 'భావోద్వేగాలకతీతంగా' అన్నమాటను ఇప్పుడు అదనంగా కలిపారు. సెంటిమెంటు (అబద్దాలు చెప్పి చెప్పి దొరవారు, అనుయాయులు రగిల్చిన మంటే తప్ప, నిజానికి ఇది విస్తృత ప్రజాభిప్రాయం కానేకాదు!) 'గింటిమెంట్‌ జాన్తానై' అన్న బేఖాతరు మాదిరి నిర్ణయం ఉంది ఇందులో. విభజనవాదులకీ ఇది తెలుసు. రెండో ఎస్సార్సీ విషయాన్ని పరిశీలిస్తే, మొదటి ఎస్సార్సీ నిర్ణయాన్నే పునరుద్ఘాటిస్తూ, కలపాలని అది చెప్పింది. కలిసే ఉండాలని నిష్పక్షపాతంగా ఉండే ఏ ఇతర నిపుణుల కమిటీ అయినా, మరోసారి చెబుతుందని తెలుసుకాబట్టే ఎస్సార్సీ, గిస్సార్సీ వద్దంటారు విభజనవాదులు. 

ఇక ఆఖరి వాక్యం ఇలా ఉంది. 'ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే సమస్యకు (అంటే తెలంగాణతో సహా అన్ని ఇతర రాష్ట్రాలలోని విభజన డిమాండ్లను ఏక మొత్తంగా) పరిష్కారం చూపేందుకు రెండో ఎస్సార్సీ వేయమని కేంద్రాన్ని కోరతాం', శభాష్‌! ఇందులోనే ఉంది, 125 సంవత్సరాల అనుభవం, రాజకీయ చతురత. ఉత్తరప్రదేశ్‌లో అధికారంలోకి కాంగ్రెస్‌ రాదని అందరికీ తెలుసు.మహాఅయితే సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామ్యం లభించవచ్చేమో కానీ, అంతకు మించి జరిగేదేమీ లేదు, భాజపా కూడా తెలంగాణ విషయంలో 1999లో అలానే అంది, సంకీర్ణ సంకటాల మూలంగా ఇవ్వలేమంటూ అధికారంలో ఉన్నప్పుడు తప్పించుకుంది. ఎలానూ అధికారంలోకి రాలేములే, అన్న భరోసాతో మళ్లీ ఇప్పుడు ఇస్తానని అంటోంది. సరే ఇదంతా అలా ఉంచి, ఈ వాక్యంలో ఇమిడి ఉన్న కాంగ్రెస్‌ 'గేమ్‌ ప్లాన్‌' ని అర్థం చేసుకోవద్దా? ఇస్తామన్న హామీ లేనే లేదు. ఎస్కేప్‌ రూటుని ఉంచుకుంటున్నారు కదా. ఎస్సార్సీ సిఫార్సులని యధాతథంగా అమలు చేస్తారన్న గ్యారంటీ కూడా లేదు.

అయినా ఏ ఎస్సార్సీ. ఏ భాషాప్రయుక్త రాష్ట్ర విభజనకూ అనుకూలంగా సిఫార్సు చేసే అవకాశం లేదు. ఒకవేళ చేసినా విభజన ప్రతిపాదన పార్లమెంటులో గట్టెక్కే పరిస్థితి ఉండదు. తెలంగాణ కొరివితో తమ సొంత రాష్ట్రాల సమగ్రతకు చిచ్చుపెట్టే ప్రయత్నాన్ని అన్ని ఇతర రాష్ట్రాల ఎంపీలు (వారేపార్టీవారైనా సరే), అడ్డుకుని తీరుతారు. సంకీర్ణ సంకాటాలు ఎలానూ ఉంటాయి. కాబట్టి ఏతావాతా చూస్తే తెలంగాణ సమస్యను మరి కొంతకాలం నాన్చి తుదకు విభజనేతర పరిష్కారాన్ని సాధించాలన్నదే కాంగ్రెస్‌ పార్టీ గేమ్‌ప్లాన్‌ అని అర్థమవుతోంది కదా! 

యుపి గురించే ఇదంతా వచ్చింది కాబట్టి మాయావతి గేమ్‌ ప్లాన్‌ సంగతీ చెప్పుకోవాలి. కేవలం ఎన్నికల్లో లబ్దిపొందే ధ్యేయంతోనే యుపిని విభజించాలని ఆమె ప్రతిపాదించిందే తప్ప చిత్తశుద్ధి, లక్ష్యసిద్దితో కాదని అందరికీ తెలుసు.ఇప్పటికే ఆమెకు కొంత జ్ఞానోదయమై, ఎన్నికల ప్రచారంలో విభజనాంశాన్ని పెద్దగా ప్రచారం చేయడం లేదు. అధికారంలోకి వచ్చినా, రాకపోయినా చంచల స్వభావురాలైన మాయావతి ఎన్నికలైన తర్వాత తన రూటు ఎలాగైనా మార్చుకోగలరు. 

ఇక దొరవారి గేమ్‌ ప్లాన్‌ కూడా మనకు తెలిసిందే. తనకు, తన కుటుంబానికి రాజకీయ, ఆర్థిక, రక్షణ ప్యాకేజీ కోసమే ఆయన ప్రయత్నమంతా, అందుకే సంక్రాంతి వెళ్లాక ఇప్పుడు 'మార్చి' అంటున్నారు, కేవలం ప్రజలను ఏమార్చడానికే! టి. కాంగ్రెస్సోళ్ల గేమ్‌ ప్లాన్‌ ముందే చెప్పుకున్నాం. టిటి దేశం వాళ్ళు, 'ఇస్తే ఇచ్చుకోండి' అని పైకి అంటున్నా, ఇవ్వకపోతేనే మంచిదన్నది వాళ్ల ఆకాంక్ష. ఇలా ఎవరి గేమ్‌ ప్లాన్‌ వారి కున్నా అంతిమంగా విభజనేతర పరిష్కారమే అందరూ కోరుకుంటున్నారు. అదే జరుగుతుంది.

-చేగొండి రామజోగయ్య 
విశ్రాంత బ్యాంకు అధికారి, 'విశాలాంధ్రమహాసభ' సభ్యులు

7, ఫిబ్రవరి 2012, మంగళవారం

విజయవాడ, తిరుపతిలలో 'విశాలాంధ్రమహాసభ' సమావేశాలు

ఢిల్లీ, హైదరాబాద్ లలో విజయవంతంగా తన వాదనను వినిపించిన 'విశాలాంధ్రమహాసభ' ఈ నెల విజయవాడ, తిరుపతిలలో ‘రాష్ట్ర సమైక్యతను కాపాడుదాం’ అన్న అంశంపై మీడియా వర్క్ షాప్ మరియు ఎగ్జిబిషన్ నిర్వహించబోతుంది.

ఆంధ్రజ్యోతి: రాష్ట్ర సమైక్యతను పరిరక్షించేందుకు విశాలాంధ్ర మహసభ ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు పరకాల ప్రభాకర్ తెలిపారు.ఈనెల 11 న విజయవాడలో, 25న తిరుపతిలో సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఎవరికైనా తన వాదనను చెప్పుకునే స్వేచ్ఛ ఉందని, తెలంగాణను వ్యతిరేకించే వారిపై దాడులు, హెచ్చరికలు సరికాదని ప్రభాకర్ అన్నారు.

4, ఫిబ్రవరి 2012, శనివారం

నొప్పించకండి!

ఆంధ్రప్రభ వ్యాసం : ఇంకో పది, పదిహేను రోజుల్లో మన రాష్ట్ర శాసనసభ శీతాకాలం సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈసారి మరీ వారం పదిరోజులకు పరిమితం కాకుండా, ఏకంగా నెల రోజులకు పైనే జరుగుతాయి. పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు కూడా వచ్చేనెల మొదటివారంలో ప్రారంభం కానున్నాయి. ఈ మధ్యకాలంలో మన రాజకీయ నేతలే కాదు పార్టీలు కూడా వాద ప్రతివాదాల ముసుగులో ఎంత విపరీతంగా, అసభ్యంగా పరస్పరం దూషించుకుంటున్నాయో చూస్తున్నాం వింటున్నాం. విమర్శను ఎదుర్కోవడానికి, ప్రత్యర్థుల వాదాన్ని తిప్పికొట్టడానికి, తిట్ల పురాణాన్ని ఆశ్రయించటం తప్పని సరన్న రీతిలో అన్ని పార్టీలు వ్యవహరిస్తున్నాయి. మన రాజకీయ నేతలు, ఉద్యమకారులు (రాజకీయ, ఆర్థిక, సామాజిక, సమైక్య, విభజన, వర్గ ప్రయోజన, ఇలా ఉద్యమం ఏదైనా కానీండి) కొంత హాస్య ప్రియత్వం, సమయస్ఫూర్తి, సందర్భ శుద్ధి నేర్చుకుంటే ఎంతో బాగుంటుంది. అందుకే ఈ వారం 'రిపార్టీ' కళ గురించి చెప్పుకుందాం.

నవరసాలలో హాస్యం అందరికీ ఇష్టమైందని తెలిసిందే. హాస్యం లాస్యం చేసే 'రిపార్టీని' కూడా అందరూ మెచ్చుతారు. 'రిపార్టీ' అనే ఆంగ్లపదానికి నిఘంటువులో ఉన్న అర్థం -తెలివిగా, హాస్యాన్ని జోడించి వెంటనే ఇచ్చే జవాబు -ఇది సమస్త ప్రజల్ని మెప్పించి, నవ్వించటంతో బాటు, కువిమర్శ చేసిన ప్రబుద్ధుణ్ణ నవ్వులపాలు చేసే, అతడికి కూడా నవ్వితీరాల్సిన (ఏడ్వలేకే) అనివార్యత కల్పించే ఒక చమత్కార ప్రక్రియ -ఇదేదో ఆంగ్లేయులే మనకి నేర్పించారనుకోరాదనడానికి, మన ప్రాచీన సాహిత్యంలో కూడా కొన్ని ఉదాహరణలున్నాయి.

ఒక్కటే చెప్పుకుందాం 'తెనాలి రామకృష్ణుడు కోడిపెట్టను ఒళ్లో పెట్టుకుని ఉన్న 'మొల్ల'ను ఏదో అశ్లీలంగా అడిగితే, ఆమె సాంతంగా 'నేనమ్మనుగా' అంటుంది -నీకు మాతృ సమానురాలిని, విక్రయించను అనే అర్థాల్లో -సరే ప్రస్తుతాంశం చట్టసభలలో, వాద ప్రతివాదాల్లో చర్చల్లో హాస్యం లాస్యం చేయాలన్న దాని గురించి కాబట్టి, ప్రజాస్వామ్య విధానాలకి 'మూలపుటమ్మ' లాంటి బ్రిటిష్‌ పార్లమెంటులో నవ్వులు పూయించిన ఉదంతాల గురించి, ముందుగా కొన్ని చెప్పుకుని, తర్వాత మన దేశానికి, రాష్ట్రానికి వద్దాం -హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ (బ్రిటన్‌లో దిగువసభ) లో ఒకసారి చర్చ సందర్భంగా సభా నాయకుడు గ్లాడ్‌స్టన్‌కి విపరీతమైన ఉక్రోషం వచ్చి 'డిజ్రేలి' (ప్రతిపక్ష నాయకుడు) తో ఇలా అన్నాడు 'నువ్వు ఎప్పటికైనా ఏదో గుడిసెలో భయంకరమైన సుఖవ్యాధితో దిక్కులేని చావు చస్తావ్‌ -తప్పదు'. దానికి డిజ్రేలీ అతిశాంతంగా 'ఆ ఖర్మ నాకు నీ విధానాల్ని గానీ, నీ భార్యని గానీ కౌగిలించుకుంటే మాత్రమే సంభవిస్తుంది -అలా చేయనులే' అన్నాడు. ఈ జవాబుతో ప్రత్యర్థికి చావురాలేదు గాని, ముఖంలో ప్రేతకళ వచ్చింది. అయినా నవ్వాల్సి వచ్చింది. 

మన పార్లమెంటుకి వద్దాం. బ్రిటిష్‌ వారి కాలంలో, మన పార్లమెంటులో పాలకుల తాబేదార్లే ఎక్కువమంది ఉన్నప్పుడు బిపిన్‌ చంద్రపాల్‌కి ప్రసంగించే అవకాశం వచ్చింది.ఆయన గొప్ప వక్తే గాని, పార్లమెంటుకి ఎన్నికైన తర్వాత చేస్తున్న తొలి ప్రసంగం అదే కాబట్టి కొంత తత్తరపాటుకిగురై, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి హెచ్చు స్వరంలో మాట్లాడసాగేరు. సభా నాయకుడు 'సర్‌ మాల్కొమ్‌హైలీ' ఆయన్ని అపహాస్యం చేయాలన్న ఉద్దేశంతో తన చెవుల్ని రెండు చేతుల్లో మూసుకున్నాడు. అది చూసిన ఇతర సభ్యులు పాల్‌ని గేలి చేయడానికి చప్పట్లు కొట్టేరు. అప్పుడు పాల్‌ ఒక్క క్షణం మాత్రం మౌనం వహించి, వెంటనే ఇలా అన్నారు. 'ప్రజలగోడు పట్టని' వినపడని చెవిటి ప్రభుత్వానికి ఏం చెప్పాలన్నా గట్టిగా అరవాల్సి వస్తోంది'. దాంతో హైలీ చేతులు చెవులమీద నుంచి తొలగిపోయాయి, అందరూ ఆయన ప్రసంగాన్ని కిమ్మనకుండా విన్నారు. లాల్‌ బహదూర్‌ శాస్త్రి ప్రధానిగా ఉన్నప్పుడు ఓ ప్రతిపక్ష సభ్యురాలు తను ప్రధానికి రోజుకో ఉత్తరం రాస్తున్నా అసలేం పట్టించుకోవటం లేదని ఆరోపిస్తూ 'నా ఉత్తరాల్ని చించి చెత్తబుట్టలో పారేస్తున్నారా' అని నిలదీసింది. దానికి శాస్త్రీజీ అమాయకంగా ముఖం పెట్టి' 'మీకెలా తెలిసిందో గాని నిజమేనండి. మీ ఉత్తరాల్ని వచ్చినవి వచ్చినట్లుగా చించి పడేస్తున్నా. ఎందుకంటే ఒక అందమైన స్త్రీ నాకు రోజూ ఉత్తరం రాస్తోందని నా భార్యకు తెలిస్తే ప్రమాదం కదా మరి, అన్నారు. దాంతో ఆ ప్రతిపక్ష నాయకురాలి బుగ్గలు కందిపోయేయి. నాడు మంత్రిణిగా సభలో ఉన్న ఇందిరాగాంధీతో సహా అందరి పొట్టలు పగిలిపోయేయి. ఆపుకోలేని నవ్వులతో, ఇలాంటిదే మరో రిపార్టీ ఉదంతం -ఒకసారి విదేశీయులతో భారతీయుల వివాహాల గురించి పార్లమెంటులో వాడి వేడి చర్చ జరుగుతున్న సందర్భమది. రామ్‌మనోహర్‌ లోహియాని ఉద్దేశించి మంత్రి తారకేశ్వరి సిన్హా 'బ్రహ్మచారి అయిన లోహియాకు సంసారాల గొడవెందుకు?' అని ఎత్తిపొడిస్తే, దానికి ఆయన వెంటనే 'నేను పెళ్లి చేసుకోవడానికి రెడీనే. నువ్వే ఛాన్స్‌ ఇవ్వటంలేదు' అని తిప్పికొట్టేరు. ఇంకోసారి బక్కగా ఉన్న ఒక కేంద్రమంత్రిని చూపిస్తూ పీలూమోడీ అనే స్వతంత్ర పార్టీ సభ్యుడు దేశంలో కరవుకు ప్రతిరూపంలో ఉన్నావని అన్నారు. దానికాయన కరవు దేశంలో ఎందుకు వచ్చిందో నిన్ను చూస్తే తెలుస్తోందని బదులిచ్చారు.మోడీ చాలా స్థూలకాయుడు లెండి. 

ఇక మన శాసనసభకి వద్దాం. బడ్జెట్‌ ప్రసంగం చేస్తూ గౌతు లచ్చన్న 'ప్రభుత్వం దగ్గర కాసులు లేవు, ప్రజలకు నూకలు లేవు' అన్నారు. నాడు కాసు బ్రహ్మానందరెడ్డి ఆర్థికమంత్రి నూకల రామచంద్రారెడ్డి, వ్యవసాయ శాఖామంత్రి ముందే చెప్పినట్టు ఈ 'మాటకు మాట' (రిపార్టీ) కళ సాహితీ మూర్తులలోనే చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణలు పెక్కు. కొన్ని చెప్పుకోవాలన్నా ఒక పెద్ద గ్రంథం రాయాలి. ఒకట్రెండు మాత్రం చెప్పుకుందాం -ఒకసారి ఏదో కవి సమ్మేళనానికి హాజరవ్వడానికి వచ్చిన శ్రీశ్రీ విశ్వనాథలకు ఒకేచోట బసకల్పించారు. శ్రీశ్రీ తువ్వాలు కట్టుకుని, ఆరుబయట నూతిదగ్గర స్నానం చేస్తూంటే చూసి, విశ్వనాథ, 'కవిశ్రేష్టులు నీళ్లాడుచున్నారు' అని చమత్కరిస్తే, శ్రీశ్రీ తడుముకోకుండా 'ఔను కవిసార్వభౌములు కనుచుండగా' అనేశారు. నెలతప్పిన అనే అర్థంలో నీళ్లాడుతున్నావా అని ఆయన అంటే 'ప్రసవిస్తున్న' అనే అర్థంలో ఈయన కనుచుండగా అన్నారన్నమాట. ఇంకోసారి విశ్వనాథ వారు 'నా అంతటికవి మరో వెయ్యేళ్లదాకా పుట్టడు' అంటే శ్రీశ్రీ 'తమరు వెయ్యేళ్ల కిందటే పుట్టేరు' అన్నారట, ఆయన ఛాందసత్వాన్ని ఎత్తిపొడుస్తూ. ఇద్దరూ నవ్వుకున్నారని వేరే చెప్పాలా -కూర్మా గోపాలస్వామి నాయుడు ఆంధ్రా యూనివర్శిటీలో రిజిస్ట్రారుగా ఉన్నప్పుడు ఒక సభలో ఆయన్ని ఉద్దేశించి ఒక విద్యార్థి ఆయన స్థూలకాయాన్ని ఎద్దేవా చేయాలని, 'హాయ్‌ భీమా' అని అరిస్తే దానికాయన 'ఓయ్‌! ఘటోత్కచా!' అని చేతులూపి అందర్నీ నవ్వించేరు.  

ఇలాంటి చమత్కార భరిత వాద ప్రతివాద పటిమను మన రాజకీయనేతలు, ఉద్యమకారులు అలవర్చుకోవాలి గాని, దొరవారు నేర్పుతున్న తిట్ల పురాణాల్ని కాదు

-చేగొండి రామజోగయ్య,
విశాలాంధ్ర మహాసభ సభ్యులు