21, ఫిబ్రవరి 2012, మంగళవారం

భాషారక్షణ ప్రభుత్వ బాధ్యత కాదా?

ఆంధ్రభూమి సంపాదకీయ పేజీ:  మళ్ళీ యీ ఏడు అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవం వచ్చింది. ప్రపంచంలోని భాషాజాతులన్నీ తమ భాషల్ని కాపాడుకోవాలని ఐక్యరాజ్యసమితి వారి విద్యాసాంస్కృతిక విభాగం- యునెస్కో-ఒక పుష్కరకాలంగా ప్రతి ఫిబ్రవరి 21న పిలుపు ఇస్తూనే ఉంది. సరిగ్గా ఆరోజున 1952లో తూర్పు పాకిస్తాన్‌లోని ప్రజలు, రచయితలు తమ మాతృభాష బెంగాలీకోసం రక్తతర్పణం చేశారు. ఆ ఉద్యమం చిలికి చిలికి, తర్వాత ఇరవైఏళ్ళకల్లా అది స్వతంత్ర దేశంగా-బంగ్లాదేశ్‌గా-ఆవిర్భవించడానికి దారితీసింది. మాతృభాషను తమ హక్కుగా స్వాభిమానసంపన్నులైన ఆ ప్రజలు భావించబట్టే అంతటి పరిణామం చోటు చేసుకుంది.

అప్పుడు ఒక చిన్న భూభాగంలో పాలకులపైన తమ భాషకోసం ప్రజలు పోరాడి సాదించిన ఘన విజయం అది. కాని, ఇప్పుడు ప్రపంచీకరణ వల్ల మాతృభాషలన్నిటికీ పెనుముప్పు ముంచుకొస్తోంది. ప్రపంచీకరణ వాహికగా ఆంగ్లభాషముందుకు దూసుకొస్తోంది. అది ఒక వరదలాగా వస్తూ చిన్నచిన్న భాషల్ని మా యం చేస్తున్నది. వేలాది చిన్నచిన్న భాషలు పాశ్చాత్యదేశాల్లో, ఆఫ్రికన్ దేశాల్లో ఆ వరదలో కొట్టుకుపోతున్నాయి. ఈ ప్రమాదాన్ని గుర్తించిన యునెస్కో సర్వప్రతినిధిసభ రెండు మూడు సార్లు సమావేశమై లోతుగా చర్చించి 12 ఏళ్ళనాడు ప్రపంచదేశాలకు ఆ పిలుపు ఇచ్చింది. ఏడాదిలో ఒకరోజును ప్రత్యేకించి రుూ విషయంలో ప్రపంచ ప్రజలను మేల్కొల్పడానికై కేటాయించింది. బెంగాలీ ప్రజలు త్యాగం చేసిన ఆ రోజును అందుకై ఎంపిక చేసింది.ఆఫ్రికాలోని రోబీ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న గుగీవాథియాంగో అనే ఆంగ్లబోధకుడు తన మాతృభాష ‘గికురుూ’ రక్షణకోసం, అట్లాగే మరికొందరితో కలిసి ‘సావహిలీ’ వంటి తోటి చిన్న భాషల రక్షణకోసం చేసిన పోరాటం, నైజీరియాలోని ‘చెనువా అబీబీ’ చేసిన పోరాటం చిన్నవేమీకావు. ప్రపంచప్రఖ్యాత అమెరికన్ విద్యావేత్త నామ్‌చోమ్‌స్కీ చేస్తున్న పోరాటం ప్రపంచవ్యాప్తంగా మాతృభాషల రక్షణకోసం, విద్యారంగ సంస్కరణలకోసం జరుగుతున్న ఉద్యమాలకు స్ఫూర్తిదాయకంగా ఉంది. మున్ముందు ప్రపంచంలో రాగల సంఘర్షణలకు యుద్ధాలకు ‘్భష’ కూడా ఒక అంశంగా తయారయ్యే అవకాశాల్ని విజ్ఞులు త్రోసిపుచ్చడంలేదు.

ఈ ఏడాది యునెస్కో డైరెక్టర్ జనరల్ ఇరినా బొకోవా అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవం సందర్భంగా ఇచ్చిన సందేశం ప్రకారం బహుళభాషల సమాజాల మనుగడ వాస్తవం అవుతున్నది. ఏ సమాజమూ బహుళబాషల మనుగడను తిరస్కరించే అవకాశంలేదు. అనేక చారిత్రక, రాజకీయ కారణాలవల్ల ఒకటికంటె ఎక్కువ భాషలు ఒక సమాజంలో మనుగడ సాగించాల్సిన పరిస్థితుల్లో కూడ మాతృభాషల రక్షణ తప్పనిసరి అవుతోంది. ఇలాంటి పరిస్థితి ఇప్పుడు మనదేశంలో త్వరత్వరగా ఏర్పడుతోంది. ప్రపంచీకరణ ప్రభావాలు ఇందుకు తోడై సమాజాల్లో భాషాపరమైన గందరగోళం నెలకొనే అవకాశం ఉంది. ప్రభుత్వాలకు స్పష్టమైన భాషావిధానం ఉండకపోతే, మాతృభాషల రక్షణకు ప్రభుత్వాలు దీక్ష వహించకపోతే, భాషా జాతుల్లో ఏర్పడే నైరాశ్యం వల్ల కాలక్రమంలో సంఘర్షణలకు, రాజకీయ పరిణామాలకు దారితీయక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.

తెలుగుభాషాజాతి గురించీ దాని గతం, వర్తమానం, భవిష్యత్తు గురించీ లోతుగా చర్చ ఎప్పుడూ జరుగుతూనే ఉంది. కానీ, అది ఇప్పుడు వేగం అందుకొంది. కొత్త ఆలోచనలు ముందుకు తెస్తున్నారు. వేలాది సంవత్సరాల తెలుగుజాతి భాషాపరంగా ఎదుర్కొంటున్న సంక్షోభానికి ఎన్నో కారణాలేకాదు, దాని వస్తుస్థితిని పరిశీలిస్తే ఎన్నో కోణాలు కూడా మనముందు ప్రత్యక్షమవుతాయి. గతంలో కవుల సాహితీ సృజనలోనే వెల్లడైన ధోరణులు వేరు, నాటి అవసరాల వరకే వారి చూపు సాగింది. నేటి అవసరాలకు తగ్గ కొత్త ఆలోచనలు తప్పనిసరి. కొత్త పదాలను కూర్చుకోవడమూ తప్పనిసరే. అయితే ఇదంతా తెలుగు మూలాలపై ఆధారపడే జరగాలి గాని ఇతర భాషల మూల పదాలపై ఆధారపడి కాదు. భాషను స్వంతమూలాలపై ఆధారపడి ఎదిగించుకొంటేనే, ఆ భాష నిలుస్తుంది. అన్ని అవసరాలకూ తగ్గట్లుగా ప్రపంచస్థాయి భాషగా పెంచుకుంటేనే తెలుగుకు భవిష్యత్తుంటుంది. దీనికి కర్త, కర్మ క్రియ తెలుగు ప్రజలే కావాలి. వారి భాషా సాంస్కృతిక వారసత్వమే ఇందుకు ఆధారం కావాలి.

నేడు ఎదుర్కొంటున్న సంక్షోభాన్నుంచి మన మాతృభాషను రక్షించుకోవాలంటే ప్రాథమిక స్థాయినుంచి స్నాతకోత్తర విద్యదాకా, ఆపైన వృత్తి విద్యలదాకా అన్ని దశల్లోనూ తెలుగుకు గౌరవస్థానం దక్కాలి. ప్రజాజీవితంలో అన్ని దశల్లోనూ-పుట్టుకనుంచి జీవితాంతం వరకూ అన్ని అవసరాలకూ తెలుగే తెలుగు ప్రజాజీవితాన్ని వికసింపజెయ్యాలి. పరిపాలనలో, ఉద్యోగ వ్యాపారాల్లో తెలుగే రాజ్యం చెయ్యాలి. ఇందుకు తగ్గట్లుగా మన ప్రభుత్వ విధానాలుండాలి. కాని, మన ప్రభుత్వానికి తెలుగును కాపాడుకోవాలన్న ఉద్దేశం కనిపించడంలేదు. మనతోపాటే భాషా ప్రాతిపదికన ఏర్పడిన పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలు స్పష్టమైన భాషా విధానంతో అంకిత భావంతో ముందుకు సాగుతుంటే, మన ప్రభుత్వం మాత్రం భాషా రక్షణ తన బాధ్యతేకానట్లు వదిలివేసింది. మన పొరుగు రాష్ట్రాల్లో వారి భాషలకోసం ప్రత్యేక మంత్రిత్వశాఖలు తొలినుండీ ఉన్నాయి. మన రాష్ట్రంలో మాత్రం 60ఏళ్ళయినా ఇంతవరకూ ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. 2001లో తమిళానికి మాత్రమే ప్రాచీన భాష హోదానిచ్చి, తోటి తెలుగు, కన్నడలను కేంద్రం నిర్లక్ష్యం చేస్తే తెలుగు ప్రజలు తిరగబడ్డారుగాని ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదు. తప్పని పరిస్థితుల్లో తమకు రాజకీయంగా దెబ్బతగులకుండా ఉండ టం కోసం కేంద్రాన్ని బ్రతిమాలి, గుర్తింపును సాధించినా, కేంద్రం ఇప్పుడిచ్చిన లక్షలాది రూపాయలను వినియోగించుకోవడానికి కావలసిన వ్యవస్థను ఏర్పరచేందుకు కూడా మన ప్రభుత్వం ముందుకు రావడం లేదు. ఇక-ఆధునిక భాషగా తెలుగును అభివృద్ధిచేసుకోవడం సంగతి సరేసరి.

కొందరు పెద్దలు తమ ప్రసంగాల్లో ప్రజలే తెలుగును రక్షించుకోవాలని చెప్తుంటారు. నిజమే.విస్తృతమైన తెలుగు సమాజం తెలుగును రక్షించుకోగలదు. ప్రభుత్వాలు తమ బాధ్యతను విస్మరించి ఇదే రీతిగా వ్యవహరిస్తుంటే ప్రజలే ఇందుకు పూనుకుంటారు. అయితే ఇది రాజకీయాలను ప్రభావితం చేసేంత మలుపు తీసుకుంటుందా అనే ప్రశ్న ఉండనే ఉన్నది. సమాజానికి, దాని స్వాభిమానానికి దెబ్బతగిలే ఏ అంశమైనా సున్నితంగా ఉంటుంది. తెలుగు సమాజంలో భాష ఒక కీలకమైన రాజకీయాంశంగా మారేందుకు తగిన పరిణామాలు ఎప్పుడెలా వస్తాయో ఎవరూ చెప్పలేరు. పొరుగున ఉన్న రాష్ట్రాల్లో రెండవ పెద్ద భాషగా ఉన్న తెలుగు ప్రజల్లో అసంతృప్తి ఆ ప్రభుత్వాల మనుగడకు ప్రశార్థకంగా మారగల పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే, 50 ఏళ్ళ క్రితం తమిళనాడులోవున్న స్థితిలో యిప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న తెలుగు రానున్న 50 ఏళ్ళలో ప్రజా రాజకీయోద్యమాలను ప్రభావితం చెయ్యజాలదని ఎవరూ అనుకోకూడదు. ఇప్పుడు నడుస్తున్న తెలుగు భాషోద్యమం అలాంటి పరిణామశీలాన్ని పెంపొందించుకొంటే చాలు.

 -డాక్టర్ సామల రమేష్‌బాబు

12 కామెంట్‌లు:

  1. తెలుగు భాషోద్యమం అంటూ ఒకటి గొప్పగా నడుస్తున్నట్లు నా దృష్టికి రాలేదు.
    ఒక వేళ తెలుగు భాషోద్యమం అంటూ నడిపించదలిస్తే చేయవలసిన పనులు చాలానే ఉన్నాయి. ఎవరూ యేమీ పట్టించుకుంటున్నట్లు కనిపించదు. లబ్ధప్రతిష్టులు కొంతమంది సమావేశమై వాళ్ళలో వాళ్ళే మాట్లాడేసుకుని, పరస్పరడబ్బా వాయించుకుని మళ్ళీ సమావేశానికి తేదీ నిర్ణయించుకుని నిష్క్కమిస్తూ ఉండటం తెలుగు భాషోద్యమం క్రిందకి వస్తుందా? (కనీసం అలాంటిదయినా జరుగుతున్నట్లు లేదు!) ఎక్కడుంది తెలుగు భాషోద్యమం?
    ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు యేది ప్రయత్నం? ప్రభుత్వం తప్పో ఒప్పో పక్కన పెట్టండి. మనమేం చేస్తున్నాం?

    రిప్లయితొలగించండి
  2. ప్రభుత్వస్థాయిలో తెలుగుని నిషేధించినంత పని చేస్తున్నారు. తెలుగుబళ్ళని మూసేస్తున్నారు. తెలుగు లేకుండానే స్కూళ్ళు నడపడానికి అనుమతిస్తున్నారు. తెలుగుమీడియమ్ లో చదివిన ఉపాధ్యాయులు ప్రిన్సిపాల్ పోస్టులకి పనిరారని ఏకంగా ఒక జీవోయే తెచ్చారు. తెలుగుమీడియమ్ అభ్యర్థులకి ప్రభుత్వ ఉద్యోగాలివ్వడం లేదు. తెలుగులో నెంబర్ ప్లేటు పెట్టుకుంటే వాహనాన్ని సీజ్ చేసి ఫైన్లు వేస్తున్నారు. నిఱుడు తెలుగుభాష గుఱించి నేను పాల్గొన్న సమావేశం దగ్గఱ పోలీసుల్ని మోహరించి మా అందఱి పేర్లూ, చిరునామాలూ, ఫోన్ నంబర్లూ రికార్డులోకి ఎక్కించుకున్నారు. అలా భాషాభిమానుల్ని భయపెట్టాలని చూస్తున్నారు. చూస్తూంటే ఏదో పరాయి బ్రిటీషుపాలనలో ఉన్నట్లుంది గానీ స్వతంత్రభారతదేశంలో మన తెలుగుగడ్డమీద బ్రతుకుతున్నట్లు లేదు. అలా పరాయీకరించేశారు మనల్ని మన భాషనుంచి ! ఇక్కడ తెలుగు అనేది ఇప్పుడొక నిషిద్ధ టాపిక్కు. ఇందుకోసమేనా మన పూర్వీకులు బ్రిటీషువారిపై పోరాడింది ? అనిపిస్తుంది., ఈమాత్రం బానిసత్వానికి మనం ఏ దేశపు పాలన కింద ఉన్నా సరిపోతుంది వీళ్లే ఎందుకు ? అనిపిస్తుంది.

    నోరూ, వాయీ లేని ప్రజలు, ఏ డబ్బూ అధికారమూ, పలుకుబడీ లేని ప్రజలు ఏం చేయగలరు మనసులో ఎంత అభిమానమున్నా ? ఏ దేశంలోనైనా ఎక్కడైనా ప్రజల చొఱవతో భాషలు బ్రత్రికినట్లు దాఖాలా ఉందా ? భాషల్ని ప్రభుత్వాలే బ్రతికించాలి. ప్రజలు ఏం చేయగలరు ? ఇక్కడ తెలుగుభాషని ప్రజలే కాపాడాలంటే, మఱి అమెరికాలోనూ, UK లోనూ ఏ ప్రజలు కాపాడుతున్నారు వాళ్ళ భాషని ? TOEFL, ELTS పరీక్షలలో స్కోర్లు కొడితేనే గానీ మా గడ్డమీద అడుగుపెట్టొద్దని తెగేసి చెబుతున్న ఆ ప్రభుత్వాలు కాదా ? ఇక్కడ తెలుగుభాషని అభిమానిస్తే చాలు భాషోన్మాది అని పేరుపెట్టేస్తున్నారు. మిగతా రాష్ట్రాల్లోనూ, దేశాల్లోనూ సర్వసామాన్యమైన భాషాభిమానమే తెలుగుగడ్డ మీద ఘోరనేఱమైపోయింది.

    భాష వ్యక్తిగత విషయం కాదు, మనవంతుగా మనమేదో చేయడానికి. వ్యక్తిగత భాషాభిమానాలతో ఏమీ ఒఱగదు. ఎందుకంటే మన స్థాయిలో మనం చేయగలది అత్యంత పరిమితం. మహా అయితే ఇలా మాట్లాడగలం. ఒక బ్లాగు రాసుకోగలం. అంతకంటే ఏమీ జఱగదు. కానీ మన జాతిని ఒక జాతిగా నిలబెట్టడానికి ఇది సరిపోదు. మనం ఎవఱినీ శాసించలేం. ఎందుకంటే భాష మానవుల యావద్ జీవన పరిధిని ఆవరించిన శక్తి. అంత పరిధి మనలాంటి మామూలు వ్యక్తులకుండదు. అది ప్రభుత్వానికే ఉంటుంది. భాష ఒక జాతికి సంబంధించినది., ఒక సమాజానికి సంబంధించినది. ఒక ప్రభుత్వానికి సంబంధించినది. అది ఒక ఆర్థిక విషయం. ఒక రాజకీయ విషయం. దాని రాజకీయ విషయం కాబట్టే దాని ప్రాతిపదికన రాష్టాలేర్పడ్డాయి. దేశాలు కూడా ఏర్పడ్డాయి. భాషని కాపాడడం, ఆ భాషాప్రజల డబ్బుతో నడుస్తున్న ప్రభుత్వపు కర్తవ్యం. అంతే తప్ప తెలుగుప్రజల డబ్బుతో ఇతరభాషల్ని బాగుచేయడం పూర్తి అభ్యంతరకరం. జపాన్ ప్రజల డబ్బుతో చైనాభాషని ఎవఱూ ఉద్ధరించరు. ఫ్రెంచివాళ్ళ డబ్బుతో ఇటాలియన్ భాషని ఎవఱూ రుద్దరు. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో జఱుగుతున్నది మాత్రం - రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఇంగితజ్ఞానాలకీ తిలోదకాలిచ్చి, అన్ని న్యాయసూత్రాలకీ, మానవహక్కులకీ స్వస్తిచెప్పి నిరంకుశంగా నియంతృత్వంగా అణగదొక్కి పారేయడం ప్రజల భాషైన తెలుగుభాషని ! దీన్ని ఆంగ్లభాషోన్మాదం అనాల్సి వస్తుంది. దీని వల్ల నిజంగానే భవిష్యత్తులో తెలుగుభాషోన్మాదులు తయారవుతారని మఱువరాదు. ఇప్పటికే ఇదంతా చూసి కడుపుమండిన చాలామంది భాషాపరమైన అతివాదులుగా మారుతున్న దశావస్థలో ఉన్నారు.

    రిప్లయితొలగించండి
  3. సామల రమేష్ గారితో ఏకీభవిస్తున్నాను.ప్రభుత్వము తలచుకుంటే చెయ్యగలదు అలా చేపించేందుకు భాషా చైతన్యం అవసరం.
    రవిశేఖర్ ఒద్దుల .

    రిప్లయితొలగించండి
  4. ఏది అతివాదం?
    నా తల్లిదండ్రులు నాకిచ్చిన నా భాషను నేను ప్రేమించటం నేరంకాదే? అతివాదం కాదే
    నాకు ఇంగితం నేర్పిన సంస్కృతిని నేను ప్రేమించటం నేరంకాదే? అతివాదం కాదే
    నేను పుట్టిపెరిగిన నేలను నేను ప్రేమించటం నేరంకాదే? అతివాదం కాదే

    బ్లాగు ఓనర్ గారికి:
    అయ్యా మీ వెరిఫికేషన్ మోడల్ చాల ఇబ్బందికరంగా ఉంది. దయచేసి కాస్త సులభమైన పధ్ధతి వాడతారా?

    రిప్లయితొలగించండి
  5. క్షమించాలి. వెరిఫికేషన్ దేనికి? గూగుల్ ఖాతాలో లాగ్ అయ్యి వ్యాఖ్య చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు

    రిప్లయితొలగించండి
  6. "Blogger->settings->comments->Show word verification for comments?", select NO.

    I too felt it very inconvenient.

    రిప్లయితొలగించండి
  7. తాడేపల్లి గారు, బాగా చెప్పారు.

    ఈ ప్రభుత్వం వారు మాకేమీ చెయ్యద్దు. మమ్మల్ని ఉద్ధరించనూ వద్దు. మా మానాన ఏదో మూల పల్లెటూరిలో పొలం దున్నుకునో, పౌరోహిత్యమో, లేదా ఏ మెస్సో పెట్టుకుని మా బతుకీడుస్తాం. మా పిల్లలకు తెలుగు నేర్పించుకునే అవకాశం ఇవ్వండి. తెలుగును ఇతరభాషలతో సమానంగా చూడండి, సమాన అవకాశాలివ్వండి. రేప్పొద్దున పిల్లలు పెద్దగయి, నాన్నా మాకు తెలుగు నేర్పించి మాకు అన్యాయం చేశావ్ అని ఆక్రోశిస్తారేమోనని భయపడి ఇంగ్లీషు మీడియంలో చదివించుకునే దౌర్భాగ్యానికి మమ్మల్ని గురి చేసి వేడుక చూడ్డం న్యాయం కాదు. మా అరణ్యరోదనను కనీసం వినండి బాబూ!

    రిప్లయితొలగించండి
  8. @Chaitanya: With due respect to the various eminent personalities involved, I suggest they should practice instead of preaching. Mr. Chukka Ramayya runs his instituite in English and so does Dr. Prabhakar Parakala.

    Merely extolling Telugus to use the language everywhere or demanding Govt. use Telugu in courts & offices will not get us anywhere.

    A few suggestions from my side:

    1. Popularize Telugu among other language speakers through a concerted campaign.
    2. Encourage Telugu as a third language in Hindi speaking state schools.
    3. Build a brand new lexicon covering technical terminology. (e.g. అంతర్జాలం for internet).
    4. Aggressively market folk arts like burrakatha, oggukatha etc.
    5. Encourage the use of loan words in Telugu. The natural richness of the language comes from its flexibility.

    In short, a look-out approach instead of berating insiders. The above holds good for all Indian languages too. Punjabi has pulled it off quite well so there is no reason why others can't do it.

    రిప్లయితొలగించండి
  9. /I suggest they should practice instead of preaching. /
    యస్సు యస్సో. మీరు బాగా చెప్పింగు, నాను అగ్రీయింగు. ప్రీచింగ్.. ప్రీచింగ్... నో పీకింగు.
    ఫస్ట్ యు ప్రాక్టీసింగు ఆ తరవాత పీకింగు. యువర్ ఇంగ్లీస్ బాగుందింగ్. :D

    Exactly! You Could have said that in Telugu.

    రిప్లయితొలగించండి
  10. వ్యాసం ఆలోచింపచేసేదిగా వుంది.
    తెలుగు టీచర్లు ప్రిన్స్‌పల్ అవకూడని అంటే ట్రైబ్యునల్‌లో సవాలు చేయాలి. వుద్యోగావకాశాలు తెలుగులో చదివిన వారికి తక్కువ అవడం తెలుగు మీడియం ప్రాధాన్యత తగ్గడానికి ప్రధాన కారణం. ప్రజల నుంచి డిమాండ్ లేనిదే ప్రభుత్వం మాత్రం ఏమిచేయగలదు? అలా అని ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయట్లేదు. ప్రజలు ప్రభుత్వం మెడలు వంచి రాష్ట్ర సర్వీసుల్లో మాతృభాషామాధ్యమంలో చదివిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు వుండేలా తగు ప్రాధాన్యత కల్పించాలి.

    రిప్లయితొలగించండి
  11. "With due respect to the various eminent personalities involved, I suggest they should practice instead of preaching. Mr. Chukka Ramayya runs his instituite in English and so does Dr. Prabhakar Parakala.Merely extolling Telugus to use the language everywhere or demanding Govt. use Telugu in courts & offices will not get us anywhere."


    వ్యక్తులు ఎవరైనా వ్యవస్థకు అనుగుణంగా నడుచుకుంటారు.అందరూ విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ లాగా శాంతినికేతన్లు స్థాపించి కొత్త ఒరవడి సృష్టించలేరు కదా? తెలుగులో శాస్త్ర సాంకేతిక రంగంలో సరైన పాఠ్యపుస్తకాలే లేవు. చుక్కా రామయ్య గారు ఐఐటీ కోచింగ్ తెలుగులో అందించినా,పరకాల గారు ఒక స్కూల్ మేనేజ్మెంట్ సభ్యునిగా ఉన్నంత మాత్రాన IIT లు, ICSE లేదా స్టేట్ బోర్డు వారు తమ పద్ధతులు మార్చుకోరు కదా?


    ఏదో కొన్ని వేల మంది పాల్గొనే పోటీపరీక్షలు గురించి(అది కూడా జాతీయ స్థాయి పరీక్షలు) మాట్లాడి ప్రయోజనం లేదు. రాష్ట్రస్థాయిలో వ్యవస్థాగత మార్పులు, రోజువారి కార్యాలలో తెలుగు భాషనే వినియోగించడం, రాష్ట్ర స్థాయి ఉద్యోగులకు ఒక తెలుగుభాష పేపర్లో పాస్ కావడం తప్పనిసరి చేయడం, తెలుగు భాషకు ఆదరణ పెంచడం , నేర్చుకోవడానికి ప్రోత్సాహకాలు ఇవ్వడం, పాఠ్యపుస్తకాలను అందుబాటులోకి తేవడం మొదలైన వన్నీ ప్రభుత్వం మాత్రమే చేయగలదు. ఇవన్నీ జరిగిననాడు వ్యక్తులు తదనుగుణంగా మారక తప్పదు

    రిప్లయితొలగించండి
  12. చైతన్య గారూ, చుక్కా రామయ్య, పరకాల ప్రభాకర్ గార్లను చులకన చేయడం నా ఉద్దేశ్యం కాదు. ప్రభుత్వాన్ని నిలదీసే బదులు మనకు చాతనైంది చేయడం మంచిదనే నా ఉద్దేశ్యం. నేను చేసిన సలహాలన్నీ ఆ కోవకు చెందినవే. అదే రకంగా అవన్నీ కూడా బయటి ప్రపంచానికి తెలుగును (లేదా ఇతర ఏ భాషయినా సరే) దగ్గర చేస్తాయి. In some ways, this may be the secret of Punjabi's success.

    నాకు అన్ని భాషలు సమానమే. ఎన్ని ఎక్కువ భాషలు నేర్చుకుంటే అంత మంచిదని నా అభిప్రాయం. నేను తెలుగు భాషను కాపాడాలని కంకణం కట్టుకోలేదు, అందరూ తెలుగులోనే మాట్లాడాలని ఆంక్షలు పెట్టలేదు. My commenting in English is therefore not against what I "preach".

    I do "preach and practice" that children study their mothertongue as a language at school.

    రిప్లయితొలగించండి