29, ఫిబ్రవరి 2012, బుధవారం

విభజన వాదం విషతుల్యం!

ఆంధ్రప్రభ వ్యాసం : మన తెలంగాణలో ఉన్నా, దేశంలో, రాష్ట్రంలో ఏ ఇతర ప్రాంతంలో ఏ రూపంలో, ఏ స్థాయిలో ఉన్నా 'విభజన వాదం' 'కాలకూట విషం' లాంటిదే! ఏ కారణం లేదా పొరపాటు చేతగాని ఎవరి ప్రోత్సాహం బలవంతం మీద సేవించినా ఈ విషం తాలూకు దుష్ప్రభావం ఒకేలా ఉంటుంది. పాత్రలు, ప్రాంతాలు, స్వార్థ రాజకీయ నేతల చేతలు, కూతలను బట్టి మారదు. ప్రమాదం తగ్గదు. అంటే ఈ విషాన్ని బంగారు పాత్రలో తాగినా, రాగిపాత్రలో తాగినా, కాకినాడలో కాచివడబోసి, తీపికాజాతో కలిపి తిన్నా, మహబూబ్‌నగర్‌లో నాగం లేక మరో ఆగం వారి మాయమాటలు బుట్టల్లోని అసత్యాల అప్పచ్చిలతో నంజుకుని మింగినా, విజయనగరం జిల్లాలో మూలాలున్న మా(మూ)టకారి దొరవారి దుర్భాషలకి విసిగివేసారి, అయిష్టంగా సేవించినా, తూర్పు గోదావరి జిల్లా యాసలో 'అరిచే కరిచే' 'రాములమ్మ'ను కాదనలేక ఆరగించినా, ప్రజా గాయకుని దరువులకు జడిసి గుటకేసినా, వయోధికుడు కొండాలక్ష్మణ్‌ వడ్డిస్తున్నాడన్న మొహమాటంతో చప్పరించినా, కొద్దిగానే రుచిచూసినా, ఆ ప్రాంతానికి, ఆ ప్రజలకి మాత్రమే కాదు, మొత్తం రాష్ట్రానికి, దేశానికి చేటు చేస్తుంది.

సరే, ఈ శీర్షిక కింద ప్రత్యేక తెలంగాణవాదంలో ఇమిడి ఉన్న డొల్లతనం, కల్లల గురించి, అది దేశ సమైక్యతకే ప్రమాదాన్ని కల్పిస్తున్న వైనం గురించి ఎప్పటికప్పుడు చర్చించుకుంటూనే ఉన్నాం. ప్రత్యేక రాష్ట్రవాదం, అసత్యాల పునాదులపై, చారిత్రక, సాంస్కృతిక వక్రీకరణల సున్నంతో, దుర్భాషల వంకరటింకర కంకరరాళ్లు, కల్తీ రాజకీయ పొత్తుల ఇసుక మిశ్రమంతో, ఒక మోసకారి మేస్త్రీ, (శుక్రాచార్య సమాన ప్రతిభావంతులైన ఒక ప్రొఫెసర్‌, ఇంజనీరు సంయుక్తంగా గీసిచ్చిన 'ప్లాన్‌' ప్రకారం) నిర్మించిన ఒక (అయో)మయసభ, అని చెప్పుకున్నాం -ఈ భవనం, వాదం పట్ల కొంతకాలం, కొందరు ఆకర్షితులైన మాట వాస్తవమే కానీ, ఇప్పుడిప్పుడే ప్రజలు, ప్రధానంగా తెలంగాణవాసుల్లోని అధిక సంఖ్యాకులు ఉద్యమకారుల అసలు రంగుల్ని, ధ్యేయాల్ని వాళ్లు తమ కుటుంబ భోషాణాల్ని నింపుకొంటున్న వైనాన్ని క్రమంగా అర్థం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, తరుణంలో తెలంగాణేతర ప్రాంతాల్లో కూడా ఇక్కడున్నంత స్థాయిలో కాకపోయినా, చాపకింది బురద నీరులా, పెరట్లో దాక్కున్న పాములా ఉన్న 'విభజనవాదం' గురించి కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. అక్కడా పొంచి ఉన్న ప్రమాదం గురించి చర్చించుకోవాల్సిన అగత్యముంది -ఒక్కమాటలో చెప్పాలంటే తెలంగాణవాదం, బలహీన పడుతోందిలే అని మురిసిపోవడమూ మంచిది కాదు, సీమాంధ్రలో కూడా కొద్దో, గొప్పో ఉన్న విభజన వాదాన్ని విస్మరించడం అసలే కాదు. ఎక్కడున్నా విభజన వాదాన్ని సమూలంగా నిర్మూలించాలి. దురదృష్టవశాత్తు, తెలంగాణేతర ప్రాంతాల్లోనూ కేవలం స్వార్థ రాజకీయాలకోసం, అక్కడి ప్రజల్ని, విద్యార్థుల్ని, ఉద్యోగ వర్గాల్ని రెచ్చగొట్టడానికి, విభజన వాద గరళాన్ని తాగించడానికి ప్రయత్నిస్తున్న నేతలు, మేధావులు ఉన్నారు. వాళ్లు రాష్ట్ర విభజనకనుకూలంగా చెప్పే కారణాలన్నీ ఎంత అసమంజసమైనవో చెప్పుకుందాం. మొదటగా నసిగేది / 'కలిసి ఉంటే బాగుంటుందిలే కానీ... ఇంపల్సివ్‌గా కంపల్సివ్‌గా విడిపోదామంటున్నాం అని, (ఔను తెలంగాణవాదులు ఎక్కువగా ఉర్దూ పదాలు వాడుతారని ఎద్దేవా చేసేవాళ్లు ఎక్కువగా ఆంగ్లపదాలు ఉపయోగిస్తారు లెండి) తప్పనిసరి (కంపల్సివ్‌)గానో తాత్కాలిక స్పందనగానో (ఇంపల్సివ్‌గా) 'విడిపోదాంలే' అనడం మూర్ఖత్వం కాదా?! రాష్ట్రపరంగా, జాతీయపరంగా విశాల, దీర్ఘకాలిక ప్రయోజనాల గురించి పట్టించుకోవద్దా? ఇంకో కారణం, దొరవారు వ్యూహాత్మకంగా ప్రారంభించి, నిరంతరం కొనసాగిస్తున్న తిట్లపురాణాన్ని ఎంతకాలం సహించగలం? మా ప్రాంతపు ప్రజల్ని గంపగుత్తగా, దొంగలు దోపిడీదారులు, మోసకారులు, రాక్షస సంతతి అని తిట్టి పోస్తుంటే మా ఆత్మాభిమానాన్ని సంరక్షించుకోవాలి కదా అన్నది. అయ్యా, ప్రకటిత ధ్యేయంపై చిత్తశుద్ధి లేనివాడు అంతిమ పరిణామం అపజయమే అని ముందు నుంచీ తెలిసి ఉన్నవాడు తిట్లపురాణాన్ని ఆశ్రయిస్తాడని మనోవిజ్ఞాన వేత్తలు చెబుతారు. దీన్ని ప్రత్యర్థి లేదా ప్రతివాదంలోని అధిక బలాన్ని పరోక్షంగా అంగీకరించే ఉద్వేగంగా, ఉన్మాదంగా అర్థం చేసుకోవాలి. సానుభూతి చూపాలి. సహనం వహించాలి. అంతేకానీ తిట్టుకి తిట్టు ఒట్టుకి ఒట్టు, బెట్టుకి బెట్టు రూపంలో మనకు ఇష్టంలేని అధర్మ యుద్ధానికి, ధ్యేయానికి, సహకరించ తగదు. అయినా, ఈ కూతలు కూస్తున్నది కొందరు విభజన వాద నేతలేకానీ, అత్యధిక శాతం తెలంగాణ ప్రజలకు ఇతర ప్రాంతాల స్వభాషీయుల పట్ల ఆదరాభిమానాలు మెండుగా ఉన్నాయి. అందుకే గతంలో కూడా విలీనానికి తహ తహ లాడారు. ఇప్పుడూ విభజనను వ్యతిరేకిస్తున్నారు. దొరల దుర్భాషలను ఏవగించుకుంటున్నారు. కాబట్టి ఎవరో మిట్టమధ్యాహ్నం లేచి దుర్భాషలాడుతున్నారన్న కారణంగా దేశానికి, రాష్ట్రానికి, మాతృభాష వికాసానికి చేటు తెచ్చే విభజన పట్ల మొగ్గు చూపడం మూర్ఖత్వమే అవుతుంది.

అన్ని ప్రాంతాల తెలుగు ప్రజలు గ్రహించాల్సిన వాస్తవం మరొకటి ఉంది. అదేమిటంటే ఖర్మకాలి, ఒకవేళ ఈ రాష్ట్ర విభజనంటూ జరిగితే, అది రెండు ముక్కలతో ఆగిపోదు. ఒడుపుగా దేముడి ముందు కొట్టే కొబ్బరికాయలా, రెండు చెక్కలే అవుతుందనుకోవద్దు. బలంగా నేలకేసి కొట్టిన గాజుగ్లాసులా, పలుముక్కలవుతుంది పగలిన ప్రాంతాల్ని, అక్కడి ప్రజల్ని బాగా గాయపరుస్తుంది. ఎలాగంటే, విభజనవాదులు పదే పదే వాగే ఏకైక కారణం యాస, సంస్కృతి, ఆచార వ్యవహారాల్లో స్వల్ప తారతమ్యాలు కానివ్వండి, (ఇవి ప్రతి పది ఇరవై మైళ్లకు మారతాయి) లేదా చిన్న రాష్ట్రాలలో పరిపాలనా సౌలభ్యం కానివ్వండి, మరేదైనా సరే, వర్తింపజేస్తే, ఒక్క తెలంగాణ ప్రాంతాన్నే పలు చిన్న చిట్టి రాష్ట్రాలుగా చీల్చాల్సి ఉంటుంది. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, కాకతీయ నాడు, గిరినాడు, గ్రేటర్‌ హైదరాబాద్‌, ఇలా పలు రాష్ట్రాలుగా, యాసా ప్రయుక్త ప్రదేశాలుగా చీల్చాలి. అలాగే ఉత్తరాంధ్ర, డెల్టాంధ్ర, ఉభయ గోదావరి, పల్నాడు, మన్యసీమ, రాయలసీమ, ఇలా సీమాంధ్రను పలు చిన్న రాష్ట్రాలుగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆయా రాష్ట్రాల రాజధానుల నిర్ణయాల విషయంలో మళ్లీ ఎన్ని కొట్లాటలొస్తాయో ఊహించబూనుకోవడమే కడుదుర్భరం. భాషా ప్రయుక్త రాష్ట్రాల విధానానికి ఆద్యులమైన మనం 'యాసా ప్రయుక్త రాష్ట్రాల ఉన్మాదానికి', అన్ని ఇతర రాష్ట్రాల విచ్ఛిత్తికి, దేశ సమైక్యత భంగం కావడానికి, స్వల్ప కారణాల రీత్యా ఏర్పడిన మన అనైక్యత మూలంగా కారకులమయ్యామన్న పాపం మూటకట్టుకోరాదు. ఇప్పటికే తెలుగువాళ్లంటేనే అందరికీ చులకన భావం ఏర్పడిపోయింది!

ఇంకా ఎక్కువ అప్రమత్తత వహించాల్సిన విషయం గురించీ ప్రస్తావించి తీరాలి. పొత్తులు, జిత్తులు మార్చి, ఏమార్చి అన్నిట్లోనూ వైఫల్యం చెందిన దొరవారు, అంతిమ అస్త్రంగా 'అట్నుంచి నరుక్కొని వద్దాం' అనే వ్యూహాన్ని ఫామ్‌హౌస్‌లో సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే అందుకు సంకేతంగా సీమాంధ్రలో విభజనవాదాన్ని రెచ్చగొట్టే, ప్రోత్సహించే పనులు ప్రారంభించారు. కోవూరులో తెరాస అభ్యర్థిని నిలబడతానని ప్రకటించారు. సీమాంధ్రలో పర్యటిస్తానని అంటున్నారు. పర్యటిస్తే పూలమాలలతో సత్కరించాలి సీమాంధ్రులు, సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రివి కావాలని ఆశీర్వదించాలి. అంతేకానీ 'అట్నుంచి నరుక్కుని వద్దామన్న' కుతంత్రానికి సహకరించవద్దు, అక్కడికి వచ్చినా రాకపోయినా, కెసిఆర్‌, జగన్‌ వర్గంతో, సీమాంధ్రలోని ప్రధాన రాజకీయ పార్టీలలోని అసంతృప్తులతో, కులసంఘాలతో దోస్తీ పెట్టుకునే ప్రయత్నాలు తెలంగాణ భవన్‌ నుంచో, ఫామ్‌హౌస్‌ నుంచో చేయడం తథ్యం. తస్మాత్‌ జాగ్రత్త. జగన్‌తో సహా ఎవరు దొరవారి బుట్టలో పడినా వారికి సొమ్మూ పోతుంది, సీమాంధ్రలో సోకూ పోతుంది. అక్కడా, ఇక్కడా నీళ్లు పుట్టవు -రెంటికీ చెడ్డ రేవడి గతి పడుతుంది. జగన్‌ మాత్రమే కాదు, బాబు, నందమూరి వారసులు, నారాయణ, రాఘవులు, వెంకయ్య నాయుడు ప్రభృతులు ఇది గ్రహించాలి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని, ఈ రాష్ట్రంలోని సమైక్యవాదులు ప్రధాన రాజకీయ పార్టీలు, మాతృభాషాభిమానులు, దేశ సమైక్యతను కోరుకునేవారు కేంద్ర ప్రభుత్వం తెలంగాణవాదంతో పాటు, సీమాంధ్రలోని విభజన వాదాన్ని, అన్ని ఇతర రాష్ట్రాలలోని ప్రత్యేక రాష్ట్ర వాదాల్ని సమూలంగా నిర్మూలించే ప్రయత్నాలు చేయాలి. ఇందుకు అవసరమైతే రాజ్యాంగాన్ని సవరించి ఆర్టికల్‌ (3)ని మరింత కఠినతరం చేయాలి. ఏ కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్నా పార్లమెంటులో, ఇతర రాష్ట్ర శాసనసభలలో 2/3 మెజారిటీ సభ్యుల ఆమోదం ఉండాలన్న నిబంధనను తీసుకుని రావాలి.

-చేగొండి రామజోగయ్య ,
విశ్రాంత బ్యాంకు అధికారి, విశాలాంధ్ర మహాసభ సభ్యులు 

5 కామెంట్‌లు:

  1. మీ మూర్ఖత్వం..పైశాచికం..వ్యతిరేకత..అహంకారం నూరేళ్లు వర్ధిళ్లుగాక..శుభమస్తు

    రిప్లయితొలగించండి
  2. "ఏ కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్నా పార్లమెంటులో, ఇతర రాష్ట్ర శాసనసభలలో 2/3 మెజారిటీ సభ్యుల ఆమోదం ఉండాలన్న నిబంధనను తీసుకుని రావాలి"

    ఈ పని 1952లో చేసుంటే పీడా విరగడయ్యేది, ఎవరు చచ్చినా ఆంద్ర రాష్ట్రం ఏర్పడేది కాదు. Na rahega baas, na bhajega bhansuri :)

    రిప్లయితొలగించండి
  3. 1952 లో ఐతే పార్లమెంటు ఆమోదం వచ్చివుండేది కాదు అన్న మూర్ఖపు ఆలోచన ఎలా వస్తుందో..

    రిప్లయితొలగించండి
  4. అసలు ఆ మూడో ఆర్టికల్ పీకేస్తే పోతుందేమో

    రిప్లయితొలగించండి