ఆంధ్రప్రభ: ఈ శీర్షికన ప్రచురితమవుతున్న నా వ్యాసాలకు స్పందించి, కొందరు సమైక్యవాదులు, విభజనవాదులు నాతో వ్యక్తిగతంగా కూడా మాట్లాడడం, పోట్లాడడం గత నాలుగైదు సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. వ్యాసాల రూపంలో తమ అభిప్రాయాలను వెలిబుచ్చినవారికి, ఎప్పటికప్పుడు తగువిధంగా, సామరస్యంగా సమాధానాలివ్వడమూ జరిగింది. అయితే పోయిన వారం, ఈ శీర్షిక కింద ప్రచురితమైన 'దీర్ఘకాల తెలుగు తెగుళ్లు!' వ్యాసానికి సమైక్య విభజన వాదుల నుంచి వచ్చిన ప్రతిస్పందనలు కడు ఆవేదనతో కూడిన ఆశ్చర్యాన్ని కలుగజేశాయి! కారణం, ఆ వ్యాసంలో అన్ని ప్రాంతాల తెలుగువాళ్లకున్నాయంటూ (ప్రవాసులతో సహా!) పేర్కొనబడిన 'దీర్ఘకాల రోగాలు', అసలే లేవని కానీ, ఉన్నా నేను చెప్పినంత స్థాయిలో లేవని కానీ వక్కాణించి నన్ను సరిదిద్దే, సంతోషింపజేసే ప్రయత్నం మాత్రం ఏ ఒక్కరూ చేయలేదు! 'అయితే ఏంది?' లేదా ఈ రోగాలతోనే బతికేయాలి -నివారణకోసం చికిత్స వృధా అనే రీతిలో స్పందించడం ఆవేదనని కలిగించింది.
ఆశ్చర్యంతో కూడిన ఆవేదనని కలిగించిన అంశం ఏమిటంటే మాట్లాడిన, విభేదించిన సమైక్య, విభజనవాదులు ఉభయులూ, మన రాష్ట్రంలో దేశంలో, విదేశాల్లో ఉన్న మొత్తం తెలుగువారిదిగా నేను పేర్కొన్న సంఖ్యాబలాన్ని ప్రశ్నించడం లేదా అనుమానాన్నో, అయోమయాన్నో వ్యక్తపరచడం. ఆ విధంగా అన్ని ప్రాంతాల (ప్రవాసాంధ్రులతో సహా) తెలుగు వాళ్లకున్న తెగుళ్లుగా నేను ప్రస్తావించిన (1) అనైక్యత (2) యాసా సంబంధిత విద్వేషాలు (3) అన్యభాషలు, సంస్కృతులపై అతిమోజుతో కూడిన మాతృభాషపై నిరాదరణ (4) ప్రాంతీయ, ఉపప్రాంతీయ దురభిమానం (5) ప్రాంతేతర బంధాలపై విముఖత వంటి వాటికి, ఆరో రోగంగా, 'స్వీయ సంఖ్యాబలంపై అవగాహనా లేమి'ని కూడా కలుపుకోవాలేమోనన్న సంశయం ఏర్పడింది. విశ్వామిత్ర మహర్షి శాపాలలో ఇది కూడా ఉందేమో మరి! ఇంతకీ పలువురు ప్రశ్నించిన లేదా అనుమానించిన అంశం పోయిన వారం వ్యాసంలో సందర్భోచితంగా మన రాష్ట్రంలో (సరిహద్దు ప్రాంతాలలో ఉన్నవారితో కలిపి) ఉన్న తెలుగువాళ్లు పదికోట్లమందని, ఇతర రాష్ట్రాలలో విదేశాల్లో మరో ఎనిమిది కోట్ల మంది ఉన్నారని చేసిన ప్రస్తావన -ఈ సంఖ్యకు సంబంధించిన ఆధారాలు గతంలోనే చెప్పి ఉన్నా మరోసారి వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం, సందర్భం ఏర్పడింది. రెండు మూడేళ్ల క్రితం వరకు నేను 16 కోట్ల మంది తెలుగువాళ్లనే రాసేవాణ్ణి -2011 జనాభా లెక్కల వివరాలు స్థూలంగా వెలువడిన తర్వాత 18 కోట్లమంది అనడం ప్రారంభించాను. ఎవరూ ప్రశ్నించలేదు.
కానీ ఈసారి మాత్రం, కొందరైతే 'ఆ! గాడిద గుడ్డేం కాదూ, మహా ఉంటే ఐదారు కోట్లుంటాం అంతే' అనేశారు! ఇంకా నయం, 'ముక్కోటి ఆంధ్రులం' అన్న బూర్గుల వారి 'ముచ్చట'ను 'కోటి రత్నాలవీణ నా తెలంగాణ' అన్న దాశరథి పల్లవిని మార్చడానికి వీల్లేదు, ఆ లెక్కలకే కట్టుబడి ఉందామని అనలేదు! అన్నా చెల్లదు -అవి 60 సంవత్సరాల నాటి లెక్కలు -ఆరు దశాబ్దాలలో నమోదైన జనాభావృద్ధి రేటుని, ఇతర సంబంధిత అంశాల్ని పరిగణనలోకి తీసుకుంటే నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 'తెలుగువాళ్ల' సంఖ్య 18 కోట్లు అనడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదని అర్థమవుతుంది. ఈ సందర్భంలో నాలుగున్నర కోట్ల మంది తెలంగాణ ప్రజలు అని విభజన వాదులే అంటున్నదీ గుర్తుంచుకోవాలి. కోటి నాలుగున్నర కోట్లయినప్పుడు నాలుగు కోట్లు 18 కోట్లు అవదా?
మన సంఖ్యాబలాన్ని గురించి దీన్ని తగ్గించి చూపడానికి ఇతరులు చేసే ప్రయత్నాలు, కుతంత్రాల గురించి చెప్పుకుందాం. ముందుగా మన రాష్ట్రంలో, సరిహద్దు ప్రాంతాల్లో పది కోట్ల మంది తెలుగువాళ్ళన్న దానిపై వివరణ -2011 జనాభా లెక్కల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా కొంచెం తక్కువగా తొమ్మిది కోట్లు ఒక సంవత్సరం గడిచింది. కాబట్టి అది నేడు తొమ్మిది కోట్లు దాటింది. ఉర్దూ ఇతర భాషల వారిని మినహాయిస్తే (వీరిలో కూడా 80 శాతం మందికి తెలుగువచ్చు) ఏమైనా, రాష్ట్రంలో తెలుగువాళ్లు ఎనిమిది కోట్ల పైమాటే! ఇకపోతే ఆంధ్రప్రదేశ్, నిజానికి 'విశాలాంధ్ర' కాదు పొరుగున ఉన్న నాలుగు రాష్ట్రాల్లో జిల్లాలకి జిల్లాలే తెలుగువాళ్లు అధిక సంఖ్యాకులుగా కానీ గణనీయ సంఖ్యాబలంతో ఉన్నవెన్నో ఉన్నాయి. రాష్ట్రంలో, సరిహద్దు ప్రాంతాల్లో పది కోట్ల మంది తెలుగువాళ్లున్నారన్న లెక్క తప్పుకాదు -అయితే ఆయా రాష్ట్రాల రాజధానుల్లో ఇతర జిల్లాల్లో కూడా ఉన్నవారిని వేరే లెక్కించాలి.
తెలుగు మేధావి, మాజీ ప్రధాని పి వి నరసింహారావు పదిహేనేళ్ల క్రితమే ప్రవాసాంధ్రుల సంఖ్యల గురించి రాష్ట్రాలవారీగా లెక్కలు వివరించారు. వాటిని జనాభావృద్ధి రేటు ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని నవీకరిస్తే మన పొరుగు రాష్ట్రాలలోని తెలుగువాళ్ల సంఖ్య ఎలా ఉంటుందో స్థూలంగా చెప్పవచ్చు. (ఈ సందర్భంలో మనం గమనించాల్సిన అంశం ఈనాటికీ తమిళనాడు కర్ణాటక రాష్ట్ర శాసనసభలలో 50 మందికి తక్కువ కాకుండా తెలుగువాళ్లు ఎమ్మెల్యేలుగా ఉంటున్నారు, పది మందైనా మంత్రులుగా ఉంటున్నారన్నది). ముందుగా తమిళనాడు విషయం -విభజనవాదనేత దొరవారు పదే పదే చెప్పేది, అనుయాయులు నిస్సిగ్గుగా వల్లించే అబద్ధం, తమిళనాడు నుండి విడిపోయినప్పుడు రాజాజీ 'గెట్ లాస్ట్' అన్నారన్నది -ఆయన తెలుగు మూలాలున్న విశాల జాతీయ భావాలున్న నేత. ఆయన అలా అనలేదు సరికదా, ఆంధ్ర విడిపోయాక కూడా 'మెడ్రాస్' (అప్పుడలానే అనేవారు)లో 45 శాతం ఇతర జిల్లాల్లో 25 నుంచి 35 శాతం తెలుగువాళ్లున్నారన్నారు. ఇప్పుడూ తమిళనాడులోని మూడు ప్రధాన రాజకీయ పార్టీల నేతలు వైగో, రామదాస్, విజయకాంత్ తెలుగువాళ్లే. ఈ విషయాన్ని వాళ్లు బహిరంగంగా ఒప్పుకోరన్నది వేరే విషయం. ముందే చెప్పినట్లు కనీసం అరవై మంది తెలుగు ఎమ్మెల్యేలు, పదిమంది మంత్రులున్నారు. 2001 జనాభా లెక్కల ప్రకారం ఈ రాష్ట్రంలో 27 శాతం మంది ప్రజల మాతృభాష తెలుగు#. ఇది అధికారిక లెక్క. కృష్ణయ్యలు, కృష్ణన్ లా అధికారిక రికార్డుల్లో ఉంటారు. దానికి కారణం ప్రధానంగా తమిళ ఉద్యోగుల నిర్వాకం. అలానే మాతృభాషగా తమిళమే నమోదై ఉంటుంది. ఇంట్లో తెలుగు మాట్లాడుకుంటారు. తెలుగు మాధ్యమ పాఠశాలలు కనుమరుగైనందువల్ల ఇప్పటి తరాలవారు మాతృభాషకు దూరమవుతున్నారు క్రమంగా. ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్నా తమిళనాడులో ఉన్న తెలుగువాళ్ల సంఖ్య మూడు కోట్లుగా చెప్పవచ్చు. కర్ణాటకలో పరిస్థితులు అంత దారుణంగా లేవు. ఈ రాష్ట్రంలో రెండు కోట్లు, మహారాష్ట్రలో 150 లక్షలు, ఒరిస్సాలో ఒక కోటి, చత్తీస్‌ఘడ్‌లో 50 లక్షల మంది తెలుగువాళ్లున్నారని స్థూలంగా చెప్పవచ్చు. ఇక, ఇతర రాష్ట్రాలలో, విదేశాల్లో ఉన్న తెలుగువాళ్లని కలుపుకుని మొత్తం తెలుగువాళ్లు 18 కోట్ల మంది అనడం సరైన లెక్కే. అందుకే మన సంఖ్యాబలాన్ని తగ్గించి చెప్పడానికి ఇతరులు చేసే ప్రయత్నాల్ని ఖండించాలి. ఎందుకోమరి మనం ఆ పని చేయం. నిర్లిప్తంగా ఉండిపోతాం.
ఉదాహరణకి 2011 ఆగస్టు 5న పార్లమెంటులో తెలంగాణ విషయంలో మీలోమీరే తేల్చుకోవాలన్న ప్రకటన చేస్తున్న సందర్భంలో తమిళ తంబి చిదంబరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న 12 కోట్ల మంది తెలుగువాళ్లు అంటూ ఓ తప్పుడు లెక్క (ఉద్దేశపూర్వకంగానే అయ్యుండొచ్చు!) చెప్పారు. అయినా మన సమైక్యవాదులు కూడా కిమ్మనలేదు. ఇందుకు వాపోతూ నేను 24.8.11న ఆంధ్రప్రభలో తెలుగువారి సంఖ్యపై చిదంబరం తప్పుడు లెక్క అన్న వ్యాసాన్ని రాశాను. కల్‌తోల్ తోండ్రియన్ తోంబాల కాలతే (రాళ్లురప్పలు సృష్టిలో లేని కాలంలో కూడా తమిళం ఉంది అని అర్థం) అనే తమిళ సోదరుల భాషాభిజాత్యాన్ని ప్రశంసిస్తూనే 'ఎన్నాసార్ ఇందకన్నాక్కుల్ (ఏమిటండీ ఈ దొంగ లెక్కలు), అని నాకు రాని అరవంలో అరిచేను. ఆ వ్యాసంలో ఏమైనా, నాలెక్క తప్పైతే తగు ఆధారాలతో సరైన లెక్క ఏమిటో చెప్పండి. సరిదిద్దుకోవడానికి నామోషీ లేదు. కానీ నాలెక్క సరైనదేనన్న విశ్వాసం ఉంది. కాదంటే ఆ వ్యాసంలోనే వాపోయినట్లు ఇప్పటికే తెలుగు సగం చచ్చిపోయింది, జాగ్రత్త పడకపోతే మృతభాష అయిపోతుందన్న యునెస్కో వారి జోక్యం నిజమైపోతుందన్న భయంకూడా ఉంది.
(# వ్యాసకర్త 2001 అని పేర్కొన్నారు. అది ఆంధ్రప్రభలో అలాగే ప్రచురితమైంది. ఈ లెక్క రాష్ట్రాల పునర్విభజన జరిగిన కాలం నాటిదని మా భావన)
- చేగొండి రామజోగయ్య,
విశ్రాంత బ్యాంకు అధికారి, విశాలాంధ్ర మహాసభ సభ్యులు
"2001 జనాభా లెక్కల ప్రకారం ఈ రాష్ట్రంలో 27 శాతం మంది ప్రజల మాతృభాష తెలుగు#. ఇది అధికారిక లెక్క"
రిప్లయితొలగించండిWhat is your source please? The census datasheet on "PART A: Distribution of the 22 Scheduled Languages- India/ States/ Union Territories - 2001 Census" shows 35 lakhs Telugus (against 5.5 crore Tamils).
"వీరిలో కూడా 80 శాతం మందికి తెలుగువచ్చు": Does that make them Telugus? If yes, do you accuse them of the same తెగుళ్లు? Are these తెగుళ్లు relating to their real mother tongue (that they chose to declare) or Telugu (that others are thrusting on them)?
"కోటి నాలుగున్నర కోట్లయినప్పుడు నాలుగు కోట్లు 18 కోట్లు అవదా?"
వాళ్ళు చెప్పేవన్నీ అబద్దాలని అంటూనే "అదియున్ జనాభా లెక్కలు తక్క" అంటారా?
"ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా కొంచెం తక్కువగా తొమ్మిది కోట్లు ఒక సంవత్సరం గడిచింది. కాబట్టి అది నేడు తొమ్మిది కోట్లు దాటింది"
మాటలు రాని పసి కూనలను కూడా కలుపుకున్నారు బాగుంది కానీ కల్లా కపటం తెలియని వారికి మీరు ఆపాదించిన తెగుళ్ళు లేవేమో?
"అందుకే మన సంఖ్యాబలాన్ని తగ్గించి చెప్పడానికి ఇతరులు చేసే ప్రయత్నాల్ని ఖండించాలి"
ఎందుకు? తెలుగు వారి జనాభా ఆరు కోట్లయినా పద్దెనిమిది అయినా భాష గొప్పదనం ఇసుమంతయినా తగ్గదు, పెరగదు. ఇంచుమించు మూడు కోట్ల జనాభా ఉన్న మలయాళీలకు, ఒరిస్సా వారికి కూడా రాష్ట్రాలు ఉన్నాయి. తెలుగు వారు పాతిక కోట్లయినా దేశానికి రెండో భాష అయ్యే అవకాశం లేదు.
As an honorary Tamil (by your definition), I can only say "ஏன்னா சார் இந்த கன்னாகுள்".
Chaitanya, before you "point out" the census 2001 is "obsolete", the decadal % change in 1991-2001 was around 15%. Sixteen becoming eighteen looks OK if (a big if) it was sixteen in the first place.
రిప్లయితొలగించండి