ఆంధ్రప్రభ వ్యాసం : ఇంకో పది, పదిహేను రోజుల్లో మన రాష్ట్ర శాసనసభ శీతాకాలం సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈసారి మరీ వారం పదిరోజులకు పరిమితం కాకుండా, ఏకంగా నెల రోజులకు పైనే జరుగుతాయి. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు కూడా వచ్చేనెల మొదటివారంలో ప్రారంభం కానున్నాయి. ఈ మధ్యకాలంలో మన రాజకీయ నేతలే కాదు పార్టీలు కూడా వాద ప్రతివాదాల ముసుగులో ఎంత విపరీతంగా, అసభ్యంగా పరస్పరం దూషించుకుంటున్నాయో చూస్తున్నాం వింటున్నాం. విమర్శను ఎదుర్కోవడానికి, ప్రత్యర్థుల వాదాన్ని తిప్పికొట్టడానికి, తిట్ల పురాణాన్ని ఆశ్రయించటం తప్పని సరన్న రీతిలో అన్ని పార్టీలు వ్యవహరిస్తున్నాయి. మన రాజకీయ నేతలు, ఉద్యమకారులు (రాజకీయ, ఆర్థిక, సామాజిక, సమైక్య, విభజన, వర్గ ప్రయోజన, ఇలా ఉద్యమం ఏదైనా కానీండి) కొంత హాస్య ప్రియత్వం, సమయస్ఫూర్తి, సందర్భ శుద్ధి నేర్చుకుంటే ఎంతో బాగుంటుంది. అందుకే ఈ వారం 'రిపార్టీ' కళ గురించి చెప్పుకుందాం.
నవరసాలలో హాస్యం అందరికీ ఇష్టమైందని తెలిసిందే. హాస్యం లాస్యం చేసే 'రిపార్టీని' కూడా అందరూ మెచ్చుతారు. 'రిపార్టీ' అనే ఆంగ్లపదానికి నిఘంటువులో ఉన్న అర్థం -తెలివిగా, హాస్యాన్ని జోడించి వెంటనే ఇచ్చే జవాబు -ఇది సమస్త ప్రజల్ని మెప్పించి, నవ్వించటంతో బాటు, కువిమర్శ చేసిన ప్రబుద్ధుణ్ణ నవ్వులపాలు చేసే, అతడికి కూడా నవ్వితీరాల్సిన (ఏడ్వలేకే) అనివార్యత కల్పించే ఒక చమత్కార ప్రక్రియ -ఇదేదో ఆంగ్లేయులే మనకి నేర్పించారనుకోరాదనడానికి, మన ప్రాచీన సాహిత్యంలో కూడా కొన్ని ఉదాహరణలున్నాయి.
ఒక్కటే చెప్పుకుందాం 'తెనాలి రామకృష్ణుడు కోడిపెట్టను ఒళ్లో పెట్టుకుని ఉన్న 'మొల్ల'ను ఏదో అశ్లీలంగా అడిగితే, ఆమె సాంతంగా 'నేనమ్మనుగా' అంటుంది -నీకు మాతృ సమానురాలిని, విక్రయించను అనే అర్థాల్లో -సరే ప్రస్తుతాంశం చట్టసభలలో, వాద ప్రతివాదాల్లో చర్చల్లో హాస్యం లాస్యం చేయాలన్న దాని గురించి కాబట్టి, ప్రజాస్వామ్య విధానాలకి 'మూలపుటమ్మ' లాంటి బ్రిటిష్ పార్లమెంటులో నవ్వులు పూయించిన ఉదంతాల గురించి, ముందుగా కొన్ని చెప్పుకుని, తర్వాత మన దేశానికి, రాష్ట్రానికి వద్దాం -హౌస్ ఆఫ్ కామన్స్ (బ్రిటన్‌లో దిగువసభ) లో ఒకసారి చర్చ సందర్భంగా సభా నాయకుడు గ్లాడ్‌స్టన్‌కి విపరీతమైన ఉక్రోషం వచ్చి 'డిజ్రేలి' (ప్రతిపక్ష నాయకుడు) తో ఇలా అన్నాడు 'నువ్వు ఎప్పటికైనా ఏదో గుడిసెలో భయంకరమైన సుఖవ్యాధితో దిక్కులేని చావు చస్తావ్ -తప్పదు'. దానికి డిజ్రేలీ అతిశాంతంగా 'ఆ ఖర్మ నాకు నీ విధానాల్ని గానీ, నీ భార్యని గానీ కౌగిలించుకుంటే మాత్రమే సంభవిస్తుంది -అలా చేయనులే' అన్నాడు. ఈ జవాబుతో ప్రత్యర్థికి చావురాలేదు గాని, ముఖంలో ప్రేతకళ వచ్చింది. అయినా నవ్వాల్సి వచ్చింది.
మన పార్లమెంటుకి వద్దాం. బ్రిటిష్ వారి కాలంలో, మన పార్లమెంటులో పాలకుల తాబేదార్లే ఎక్కువమంది ఉన్నప్పుడు బిపిన్ చంద్రపాల్‌కి ప్రసంగించే అవకాశం వచ్చింది.ఆయన గొప్ప వక్తే గాని, పార్లమెంటుకి ఎన్నికైన తర్వాత చేస్తున్న తొలి ప్రసంగం అదే కాబట్టి కొంత తత్తరపాటుకిగురై, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి హెచ్చు స్వరంలో మాట్లాడసాగేరు. సభా నాయకుడు 'సర్ మాల్కొమ్‌హైలీ' ఆయన్ని అపహాస్యం చేయాలన్న ఉద్దేశంతో తన చెవుల్ని రెండు చేతుల్లో మూసుకున్నాడు. అది చూసిన ఇతర సభ్యులు పాల్‌ని గేలి చేయడానికి చప్పట్లు కొట్టేరు. అప్పుడు పాల్ ఒక్క క్షణం మాత్రం మౌనం వహించి, వెంటనే ఇలా అన్నారు. 'ప్రజలగోడు పట్టని' వినపడని చెవిటి ప్రభుత్వానికి ఏం చెప్పాలన్నా గట్టిగా అరవాల్సి వస్తోంది'. దాంతో హైలీ చేతులు చెవులమీద నుంచి తొలగిపోయాయి, అందరూ ఆయన ప్రసంగాన్ని కిమ్మనకుండా విన్నారు. లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానిగా ఉన్నప్పుడు ఓ ప్రతిపక్ష సభ్యురాలు తను ప్రధానికి రోజుకో ఉత్తరం రాస్తున్నా అసలేం పట్టించుకోవటం లేదని ఆరోపిస్తూ 'నా ఉత్తరాల్ని చించి చెత్తబుట్టలో పారేస్తున్నారా' అని నిలదీసింది. దానికి శాస్త్రీజీ అమాయకంగా ముఖం పెట్టి' 'మీకెలా తెలిసిందో గాని నిజమేనండి. మీ ఉత్తరాల్ని వచ్చినవి వచ్చినట్లుగా చించి పడేస్తున్నా. ఎందుకంటే ఒక అందమైన స్త్రీ నాకు రోజూ ఉత్తరం రాస్తోందని నా భార్యకు తెలిస్తే ప్రమాదం కదా మరి, అన్నారు. దాంతో ఆ ప్రతిపక్ష నాయకురాలి బుగ్గలు కందిపోయేయి. నాడు మంత్రిణిగా సభలో ఉన్న ఇందిరాగాంధీతో సహా అందరి పొట్టలు పగిలిపోయేయి. ఆపుకోలేని నవ్వులతో, ఇలాంటిదే మరో రిపార్టీ ఉదంతం -ఒకసారి విదేశీయులతో భారతీయుల వివాహాల గురించి పార్లమెంటులో వాడి వేడి చర్చ జరుగుతున్న సందర్భమది. రామ్‌మనోహర్ లోహియాని ఉద్దేశించి మంత్రి తారకేశ్వరి సిన్హా 'బ్రహ్మచారి అయిన లోహియాకు సంసారాల గొడవెందుకు?' అని ఎత్తిపొడిస్తే, దానికి ఆయన వెంటనే 'నేను పెళ్లి చేసుకోవడానికి రెడీనే. నువ్వే ఛాన్స్ ఇవ్వటంలేదు' అని తిప్పికొట్టేరు. ఇంకోసారి బక్కగా ఉన్న ఒక కేంద్రమంత్రిని చూపిస్తూ పీలూమోడీ అనే స్వతంత్ర పార్టీ సభ్యుడు దేశంలో కరవుకు ప్రతిరూపంలో ఉన్నావని అన్నారు. దానికాయన కరవు దేశంలో ఎందుకు వచ్చిందో నిన్ను చూస్తే తెలుస్తోందని బదులిచ్చారు.మోడీ చాలా స్థూలకాయుడు లెండి.
ఇక మన శాసనసభకి వద్దాం. బడ్జెట్ ప్రసంగం చేస్తూ గౌతు లచ్చన్న 'ప్రభుత్వం దగ్గర కాసులు లేవు, ప్రజలకు నూకలు లేవు' అన్నారు. నాడు కాసు బ్రహ్మానందరెడ్డి ఆర్థికమంత్రి నూకల రామచంద్రారెడ్డి, వ్యవసాయ శాఖామంత్రి ముందే చెప్పినట్టు ఈ 'మాటకు మాట' (రిపార్టీ) కళ సాహితీ మూర్తులలోనే చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణలు పెక్కు. కొన్ని చెప్పుకోవాలన్నా ఒక పెద్ద గ్రంథం రాయాలి. ఒకట్రెండు మాత్రం చెప్పుకుందాం -ఒకసారి ఏదో కవి సమ్మేళనానికి హాజరవ్వడానికి వచ్చిన శ్రీశ్రీ విశ్వనాథలకు ఒకేచోట బసకల్పించారు. శ్రీశ్రీ తువ్వాలు కట్టుకుని, ఆరుబయట నూతిదగ్గర స్నానం చేస్తూంటే చూసి, విశ్వనాథ, 'కవిశ్రేష్టులు నీళ్లాడుచున్నారు' అని చమత్కరిస్తే, శ్రీశ్రీ తడుముకోకుండా 'ఔను కవిసార్వభౌములు కనుచుండగా' అనేశారు. నెలతప్పిన అనే అర్థంలో నీళ్లాడుతున్నావా అని ఆయన అంటే 'ప్రసవిస్తున్న' అనే అర్థంలో ఈయన కనుచుండగా అన్నారన్నమాట. ఇంకోసారి విశ్వనాథ వారు 'నా అంతటికవి మరో వెయ్యేళ్లదాకా పుట్టడు' అంటే శ్రీశ్రీ 'తమరు వెయ్యేళ్ల కిందటే పుట్టేరు' అన్నారట, ఆయన ఛాందసత్వాన్ని ఎత్తిపొడుస్తూ. ఇద్దరూ నవ్వుకున్నారని వేరే చెప్పాలా -కూర్మా గోపాలస్వామి నాయుడు ఆంధ్రా యూనివర్శిటీలో రిజిస్ట్రారుగా ఉన్నప్పుడు ఒక సభలో ఆయన్ని ఉద్దేశించి ఒక విద్యార్థి ఆయన స్థూలకాయాన్ని ఎద్దేవా చేయాలని, 'హాయ్ భీమా' అని అరిస్తే దానికాయన 'ఓయ్! ఘటోత్కచా!' అని చేతులూపి అందర్నీ నవ్వించేరు.
ఇలాంటి చమత్కార భరిత వాద ప్రతివాద పటిమను మన రాజకీయనేతలు, ఉద్యమకారులు అలవర్చుకోవాలి గాని, దొరవారు నేర్పుతున్న తిట్ల పురాణాల్ని కాదు
-చేగొండి రామజోగయ్య,
విశాలాంధ్ర మహాసభ సభ్యులు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి