ఆంధ్రప్రభ వ్యాసం: 'పెడదారి వీడడానికి మరికొంత సమయం 'మాగ్గావాలె', ప్రస్తుతానికి మాత్రం 'మా తెలంగాణ మాగ్గావాలె' అని పైకి అంటూనే ఉంటం. అంతిమంగా, ఇవ్వకపోయినా 'ఫర్వాలె' గానీ ఇప్పటికిప్పుడే ఇవ్వమని మరీ స్పష్టంగా చెప్పొద్దు, కుండబద్ధలు గొట్టొద్దు' అని బతిమాలుకుంటున్న మన విభజనవాదుల (తమతో రహస్య ఒప్పందం ఉన్న దొరవారితో సహా) ఆక్రందనలకి, 'అఖిల భారత కాంగ్రెస్' కొంత కరుణించిందనుకోవడానికి ఆస్కారమిస్తున్న పరిణామమొకటి గతవారం చోటుచేసుకుంది. అది ఒక రకంగా గొంతులో పచ్చివెలక్కాయపడ్డ రీతిలో ఉన్నా, ఎప్పుడూ మిశ్రమ భాషలో కేకలేసే కెకెతో సహా తెలంగాణ వాదులెవరూ దానిపై పెద్దగా స్పందించలేదు. దొరవారూ కోప్పడలేదు, వీర విభజనవాదులూ పట్టించుకోలేదు. అంతగా రుచించకపోయినా సమైక్యవాద నేతలూ మౌనం దాల్చారు. ఇంతకీ ఆ పరిణామమేమంటే, 31, జనవరి, 2012న అఖిల భారత కాంగ్రెస్ కేంద్రమంత్రి సిబాల్, తదితరుల ద్వారా విడుదలైన, ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రణాళిక (వాగ్దాన) పత్రంలో తెలంగాణ సమస్యపై చేసిన ఒక క్లుప్త ప్రస్తావన! ఉత్తరప్రదేశ్ శాసనసభకు ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలకు వున్న ప్రాధాన్యం దృష్ట్యా, అందులో ప్రస్తావించిన ఏ ఒక్క విషయమూ సోనియా, రాహుల్ గాంధీల ప్రమేయం, పూర్వానుమతి, 'గేమ్' ప్లాన్‌ల ప్రభావం లేకుండా చోటు చేసుకుందని భావించలేం. ఎక్కడో ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి పార్టీ వాగ్దానాల పత్రంలో స్థానం సంపాదించిన ఆ క్లుప్త ప్రస్తావన లోని గుప్తార్థాన్ని విశ్లేషించుకోవాలంటే, దాన్ని యధాతథంగా, తెలుగులోకి అనువదించుకోవాలి. చిన్నదైనా, ఆ పేరానంతా ఒక్కసారే పూర్తిగా కాకుండా ఒక్కోవాక్యాన్ని (ఉన్నవే నాలుగు) అనువదించుకుంటూ అధికార పార్టీ అంతరార్థాన్ని గ్రహించడానికి ప్రయత్నిద్దాం.
మొదటి వాక్యం ఇలా ఉంది. 'మెరుగైన పరిపాలన, అమలు యంత్రాంగం సమర్థ వినియోగం కోసం 'చిన్న రాష్ట్రాలు' అవసరం ఐతే కావచ్చు. ఇందులో చివరి పదం 'కావచ్చు' అన్నదే బహుకీలకం, 'కాకపోవచ్చు' అన్న భావం కూడా ఇందులో ఇమిడి ఉంది! (మే ఆల్సో మీన్స్ మే నాట్!) స్పష్టమైన విధాన నిర్ణయం కాదు. సందేహం పాలే ఎక్కువగా ఉంది. అంతేకాదు అన్ని రాష్ట్రాల్లోని విభజనవాదులకు ఒక హెచ్చరిక కూడా ఉంది ఇందులో. ప్రత్యేకంగా తెలంగాణ వాదులకిదో చురక. కీలెరిగి పెట్టిన వాత కూడా! ఔను మరి, 'మనోళ్లు' పదే పదే వల్లించే చిన్న రాష్ట్రాల మంత్రం లేదా చెప్పే ఏ ఇతర కారణాన్ని వర్తింపజేసినా, హైదరాబాద్‌నీ, ఒక ప్రత్యేక రాష్ట్రంగా, ఆ మాటకొస్తే తెలంగాణ ప్రాంతాన్ని ఎన్నో చిన్ని, చిట్టి రాష్ట్రాలుగా చీల్చాల్సివస్తుంది గదా, 'చిన్న' అనే దానికి ప్రామాణికత ఏముంది?
ఇక రెండో వాక్యం, 'ఒక కొత్త రాష్ట్రం లేదా రాష్ట్రాలను ఏర్పాటు చేసే క్రమంలో అనేక సంక్లిష్ట సమస్యలను ఆహ్వానించరాదు'. పొయ్యిమీద నుంచి పెనంలో పడే ఉద్దేశం లేదని ఆ మధ్యన, సాక్షాత్తు ప్రధానమంత్రి మన్మోహన్, అన్నదాన్నే ఇంకా స్పష్టంగా ప్రతిబింబిస్తోందీ రెండో వాక్యం. మొదటి వాక్యాన్ని మాత్రం చదివి మురిసిపోయే వాళ్లెవరైనా ఉంటే, గింటే వారికిదో చేదుమందు, మంటపుట్టించే మాత్ర. నా చెవిలో 'ఇస్తనని' చెప్పేరులే అని ఇంకా అంటున్న వారికో చెంపపెట్టు. కాంగ్రెస్ హైకమాండ్ ఎప్పటికైనా ఇస్తదిలే అని గప్పాలు కొడుతున్న టి.కాంగ్రేస్సోళ్ల కప్పుల్ని, గొప్పల్ని బద్ధలు చేస్తున్న సుతిమెత్తని దెబ్బ. నిజానికి కాంగ్రెస్ పార్టీ కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఎప్పుడూ తెలంగాణ 'ఇస్తనని' చెప్పనే లేదు, కాంగ్రెస్ పార్టీ 2004లో తెరాసతో కుదుర్చుకున్న లిఖిల ఒప్పందంలో కానీ ఏ ఎన్నికల ప్రణాళికలో కానీ తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేస్తామని నిర్దిష్టంగా చెప్పలేదు.రాష్ట్రంలో, దేశంలో ఏకాభిప్రాయం వంటి షరతులతోబాటు, విభజన మూలంగా సంభవించే పలు సమస్యలను, కాంగ్రెస్ పార్టీ, అధికార ప్రతినిధులు, కేంద్ర మంత్రులు పలు సందర్భాల్లో పేర్కొంటూనే ఉన్నారు. విభజన కుదరదని పరోక్షంగా చెబుతూనే వచ్చారు. 'అమ్మో నీకదిస్తే ఎన్నో వినాశకర పరిణామాలుంటాయి, నీకూ, నాకూ, అందరికీ' అంటే 'ఇవ్వను' అని చెప్పడమే కదా!
ఆ బుల్లి పేరాలోని మూడోవాక్యాన్ని పరిశీలిద్దాం, కొత్త రాష్ట్రాల ఏర్పాటుకి సంబంధించిన డిమాండ్లన్నింటినీ రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ కమిటీ ద్వారా భావోద్వేగాలకతీతంగా చర్చించవలసిన అవసరముంది', దీని అర్థం ఏమిటి? 'మాది మాగ్గావాలె' అంటే కుదరదు. ఇదో జాతీయ సమస్య, మొత్తం దేశానికి ఒకే విధానం ఉండాలి అనేకదా! మేము ఏ మోసమూ చేయలేదు, 1999లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ ఇదే చెప్పాం 2004లో తెరాస కూడా లిఖిత పూర్వకంగా ఎస్సార్సీకి ఒప్పుకుంది. మాదెప్పుడూ ఒకటే మాట, అది ఎస్సార్సీ బాట అని చెప్పుకునే అవకాశం కాంగ్రెస్‌కు ఉంది కదా. 'భావోద్వేగాలకతీతంగా' అన్నమాటను ఇప్పుడు అదనంగా కలిపారు. సెంటిమెంటు (అబద్దాలు చెప్పి చెప్పి దొరవారు, అనుయాయులు రగిల్చిన మంటే తప్ప, నిజానికి ఇది విస్తృత ప్రజాభిప్రాయం కానేకాదు!) 'గింటిమెంట్ జాన్తానై' అన్న బేఖాతరు మాదిరి నిర్ణయం ఉంది ఇందులో. విభజనవాదులకీ ఇది తెలుసు. రెండో ఎస్సార్సీ విషయాన్ని పరిశీలిస్తే, మొదటి ఎస్సార్సీ నిర్ణయాన్నే పునరుద్ఘాటిస్తూ, కలపాలని అది చెప్పింది. కలిసే ఉండాలని నిష్పక్షపాతంగా ఉండే ఏ ఇతర నిపుణుల కమిటీ అయినా, మరోసారి చెబుతుందని తెలుసుకాబట్టే ఎస్సార్సీ, గిస్సార్సీ వద్దంటారు విభజనవాదులు.
ఇక ఆఖరి వాక్యం ఇలా ఉంది. 'ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సమస్యకు (అంటే తెలంగాణతో సహా అన్ని ఇతర రాష్ట్రాలలోని విభజన డిమాండ్లను ఏక మొత్తంగా) పరిష్కారం చూపేందుకు రెండో ఎస్సార్సీ వేయమని కేంద్రాన్ని కోరతాం', శభాష్! ఇందులోనే ఉంది, 125 సంవత్సరాల అనుభవం, రాజకీయ చతురత. ఉత్తరప్రదేశ్‌లో అధికారంలోకి కాంగ్రెస్ రాదని అందరికీ తెలుసు.మహాఅయితే సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామ్యం లభించవచ్చేమో కానీ, అంతకు మించి జరిగేదేమీ లేదు, భాజపా కూడా తెలంగాణ విషయంలో 1999లో అలానే అంది, సంకీర్ణ సంకటాల మూలంగా ఇవ్వలేమంటూ అధికారంలో ఉన్నప్పుడు తప్పించుకుంది. ఎలానూ అధికారంలోకి రాలేములే, అన్న భరోసాతో మళ్లీ ఇప్పుడు ఇస్తానని అంటోంది. సరే ఇదంతా అలా ఉంచి, ఈ వాక్యంలో ఇమిడి ఉన్న కాంగ్రెస్ 'గేమ్ ప్లాన్' ని అర్థం చేసుకోవద్దా? ఇస్తామన్న హామీ లేనే లేదు. ఎస్కేప్ రూటుని ఉంచుకుంటున్నారు కదా. ఎస్సార్సీ సిఫార్సులని యధాతథంగా అమలు చేస్తారన్న గ్యారంటీ కూడా లేదు.
అయినా ఏ ఎస్సార్సీ. ఏ భాషాప్రయుక్త రాష్ట్ర విభజనకూ అనుకూలంగా సిఫార్సు చేసే అవకాశం లేదు. ఒకవేళ చేసినా విభజన ప్రతిపాదన పార్లమెంటులో గట్టెక్కే పరిస్థితి ఉండదు. తెలంగాణ కొరివితో తమ సొంత రాష్ట్రాల సమగ్రతకు చిచ్చుపెట్టే ప్రయత్నాన్ని అన్ని ఇతర రాష్ట్రాల ఎంపీలు (వారేపార్టీవారైనా సరే), అడ్డుకుని తీరుతారు. సంకీర్ణ సంకాటాలు ఎలానూ ఉంటాయి. కాబట్టి ఏతావాతా చూస్తే తెలంగాణ సమస్యను మరి కొంతకాలం నాన్చి తుదకు విభజనేతర పరిష్కారాన్ని సాధించాలన్నదే కాంగ్రెస్ పార్టీ గేమ్‌ప్లాన్ అని అర్థమవుతోంది కదా!
యుపి గురించే ఇదంతా వచ్చింది కాబట్టి మాయావతి గేమ్ ప్లాన్ సంగతీ చెప్పుకోవాలి. కేవలం ఎన్నికల్లో లబ్దిపొందే ధ్యేయంతోనే యుపిని విభజించాలని ఆమె ప్రతిపాదించిందే తప్ప చిత్తశుద్ధి, లక్ష్యసిద్దితో కాదని అందరికీ తెలుసు.ఇప్పటికే ఆమెకు కొంత జ్ఞానోదయమై, ఎన్నికల ప్రచారంలో విభజనాంశాన్ని పెద్దగా ప్రచారం చేయడం లేదు. అధికారంలోకి వచ్చినా, రాకపోయినా చంచల స్వభావురాలైన మాయావతి ఎన్నికలైన తర్వాత తన రూటు ఎలాగైనా మార్చుకోగలరు.
ఇక దొరవారి గేమ్ ప్లాన్ కూడా మనకు తెలిసిందే. తనకు, తన కుటుంబానికి రాజకీయ, ఆర్థిక, రక్షణ ప్యాకేజీ కోసమే ఆయన ప్రయత్నమంతా, అందుకే సంక్రాంతి వెళ్లాక ఇప్పుడు 'మార్చి' అంటున్నారు, కేవలం ప్రజలను ఏమార్చడానికే! టి. కాంగ్రెస్సోళ్ల గేమ్ ప్లాన్ ముందే చెప్పుకున్నాం. టిటి దేశం వాళ్ళు, 'ఇస్తే ఇచ్చుకోండి' అని పైకి అంటున్నా, ఇవ్వకపోతేనే మంచిదన్నది వాళ్ల ఆకాంక్ష. ఇలా ఎవరి గేమ్ ప్లాన్ వారి కున్నా అంతిమంగా విభజనేతర పరిష్కారమే అందరూ కోరుకుంటున్నారు. అదే జరుగుతుంది.
-చేగొండి రామజోగయ్య
విశ్రాంత బ్యాంకు అధికారి, 'విశాలాంధ్రమహాసభ' సభ్యులు
ఉగాది తరువాత ఏదో "పొడి" చేస్తారట కదా.
రిప్లయితొలగించండి