( నేడు మాతృభాషా దినోత్సవం )
ఆంధ్రజ్యోతి సంపాదకీయ పేజీ: పాశ్చాత్య దేశాలు ముఖ్యంగా అమెరికా కేంద్రంగా ప్రపంచీకరణ ఫలితంగా ఆంగ్ల భాష ఆధిపత్యం ప్రపంచంలోని మాతృభాషలకు ప్రమాదంగా పరిణమించింది. ప్రపంచంలోని సుమారు 6,500 భాషల్లో సగానికిపైగా అంతరించిపోతున్నాయని ఐక్యరాజ్యసమితి సాంస్కృతిక విభాగం 'యునెస్కో' 12 ఏళ్ళ క్రితం ప్రపంచంలోని భాషా జాతులను హెచ్చరించింది. ప్రజల భాషలు నశిస్తే భాషా వైవిధ్యంతోపాటు జీవ వైవిధ్యం కూడా నశిస్తుందని, ఈ పరిస్థితిని ఎదుర్కొని మీ మీ భాషల్ని కాపాడుకోండని పిలుపునిచ్చింది. ప్రతి ఏటా ఫిబ్రవరి 21ని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా ప్రకటించింది.
ఈ పిలుపునందుకొని తమ తమ భాషల్ని రక్షించుకోవడానికి ఉద్యమించిన భాషా ప్రజల్లో తెలుగువారు కూడా ఉన్నారు. 2003లోనే తెలుగువారు ఇందుకోసం తెలుగు భాషోద్యమ సమాఖ్య పేరుతో ఉద్యమం ప్రారంభించారు. అయితే ప్రభుత్వాలు తెలుగుపట్ల ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యం వల్ల తెలుగును కాపాడుకోవడం కోసం దీర్ఘకాల ఉద్యమం అవసరమయ్యేట్లే ఉంది. మన రాష్ట్రంలో విచిత్రమేమిటంటే ప్రజల భాషపట్ల ప్రభుత్వాలు విముఖంగా ఉండటం. ఇది భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోని ఏ దేశంలో కూడా కనిపించని ప్రత్యేక పరిస్థితి.
ఈ పట్టనితనం వల్ల ఏ భాషా ప్రాతిపదికపైనేతే ఈ రాష్ట్రం ఏర్పడిందో, ఆ మౌలిక అవసరాలే దెబ్బతింటున్నాయి. ప్రజల భాషలో పరిపాలించుకోవాలని, వారి భాషలోనే పిల్లలకు చదువు చెప్పాలని, వారి భాషా సంస్కతులు అన్నివిధాలా విలసిల్లేందుకు, వారి సాహిత్యం, వారి ప్రతిభా సంపత్తి అనంతంగా ఎదగాలనే మహత్తర ఆశయంతో ఏర్పడిన రాష్ట్రంలో ఈ మౌలిక అంశాలకే హానికలిగించి, ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకమైన విధానాలను ఈ 60 ఏళ్ళుగా ప్రభుత్వాలు అనుసరించబట్టే ఇప్పుడు ఈ అన్నిరంగాల్లో అస్తిత్వ ఉద్యమాలు తలెత్తి ముందుకు సాగుతున్నాయి.
ఈ ప్రజల భాష తెలుగు. తెలుగుజాతి విస్తరించేకొద్దీ భాషా సంస్కృతుల్లో ప్రాంత ప్రాంతానికీ వైవిధ్యం తొణికిసలాడుతుంటుంది. ఆ క్రమంలో ఎన్నో మాండలికాలు భాషలోనూ, ఎన్నో రీతుల జానపద కళలు, జీవన విధానాలు మనకు కనిపిస్తాయి. వీటన్నింటినీ అర్థం చేసుకోవాలంటే జాతికి ప్రాణమైన తెలుగు భాషకు పాలనావ్యవస్థలో ఒక మంత్రిత్వశాఖ ఉండాలి. పొరుగు రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటకలలో ఇలాంటి ఏర్పాటు ఉంది. మన పాలకులకు మాత్రం ఈ ఆలోచనే ఇన్నేళ్ళుగా ముందుకు రాలేదు. తెలుగును విద్యారంగంలో, శాస్త్ర సాంకేతిక అవసరాలకు సరిపడే విధంగా అభివృద్ధి చేసుకునే ప్రయత్నమే కనిపించదు.
పైగా, తెలుగును సాహిత్యం వరకే పరిమితం చేసి, ఇతర జీవన రంగాల్లో, ఆధునిక జ్ఞాన సంబంధమైన అవసరాల్లో పూర్తిగా ఆంగ్లానికి తావివ్వడం వల్ల తెలుగు ఎదుగుదలకు గల అవకాశాలను మనం నిరోధించడమవుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగును ఒక మాతృభాషగా రక్షించుకోవడానికి ప్రజలే ఉద్యమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అవసరమైన ఏ ఇతర భాషనైనా నేర్చుకోవద్దని ఎవరూ అనరు. తల్లి భాషలో గట్టి పట్టు ఉంటే, ఆ పునాది మీద ఇతర భాషలు నేర్చుకోవచ్చు.
తల్లి భాషనే కోల్పోయినప్పుడు ఇక జ్ఞానార్జనకు కావలసిన ప్రాతిపదికనే కోల్పోతాము. మన భాషను కాపాడుకుంటూ, అభివృద్ధి చేసుకుంటూ అన్ని అవసరాలకు తగ్గట్లుగా వినియోగించగల పరిస్థితికి మనం చేరుకోవాలి. ఈ లక్ష్యం దిశగా జాతిని పురోగమింపజేసేందుకు తెలుగు భాషోద్యమం దీక్ష వహించింది. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో తెలుగు భాషోద్యమం ప్రభుత్వం ముందు తొమ్మిది అత్యవసర డిమాండ్లు ఉంచింది. వీటిని సాధించడం కోసం ఈ మాతృభాషా దినోత్సవం నాడు రాష్ట్రమంతటా దీక్షా దినంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నది.
(1) తెలుగు భాష రక్షణ, అభివృద్ధికై ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను వెంటనే ఏర్పాటు చేసుకోవాలి. (2) రాష్ట్రంలో అన్ని స్థాయిల్లో అధికార భాషగా తెలుగును అమలుచేయాలి. చట్టసభలు, ముఖ్యమంత్రి కార్యాల యం, సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లో వెంటనే దీన్ని అమలుచేయాలి. జిల్లా స్థాయివరకు న్యాయస్థానాల్లో తెలుగులో వ్యవహారాలు జరిగేందుకు జి.ఓ.నెం. 485(1974)ను అమలుపరచాలి. అధికార భాషా సంఘానికి తగిన అధికారాలు కల్పించి వెంటనే నియమించాలి. (3) ప్రభు త్వ, ప్రభుత్వేతర పాఠశాలలన్నింటిలోనూ మాతృభాషలోనే పాఠశాల విద్యను బోధించడాన్ని తప్పనిసరి చేయాలి. మొదటి తరగతి నుంచి ఒక సబ్జెక్టుగా మాత్రమే ఆంగ్లాన్ని బోధించాలి.
(4) ఇంటర్మీడియట్, డిగ్రీ, పి. జి. ఎం.బి.బి.యస్ వంటి వృత్తి విద్యాకోర్సులలోను, సాంకేతిక విద్యారంగంలోను రాష్ట్రంలో తెలుగుభాషను ఒక సబ్జెక్టుగా తప్పనిసరి చేయాలి. (5) ఇతర రాష్ట్రాల్లోని తెలుగువారి విద్య, భాషా సంస్కృతుల రక్షణకై శాశ్వత స్థాయిన సంయుక్త సభాసంఘాన్ని అన్ని వనరులతో ఏర్పరచాలి. (6) క్లాసికల్ భాషగా తెలుగులో పరిశోధనా కేంద్రానికి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసినా, దాన్ని ఆంధ్రప్రదేశ్‌లో స్థాపించడానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ వహించకపోవడం అన్యాయం. వెంటనే తగిన సౌకర్యాలు చూపడంతోపాటు తమిళ, కన్నడలకు దీటుగా క్లాసికల్ తెలుగు అధ్యయన సంస్థను పూర్తిస్థాయిలో స్థాపించడానికి తగిన చర్యలు తీసుకోవాలి.
(7) పోటీ పరీక్షల్లో తెలుగు మాధ్యమ అభ్యర్థులను ప్రోత్సహించడానికి 5 శాతం అదనపు మార్కులు కలపాలి. (8) ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీని, రద్దయిన తక్కి న అకాడమీలను తిరిగి నెలకొల్పాలి. (9) ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో తెలుగు మాట్లాడడాన్ని నేరంగా పరిగణించి శిక్షలు వేయడం రాష్ట్రమంతటా ఒక అలవాటుగా మారింది. తెలుగు భాషను తక్కువ చూపు చూడడం, పలు రంగాల్లో తెలుగును అవమానించడం సర్వసాధారణమైంది. వివిధ ప్రాంతాల మాండలికాలను, యాసలను హేళనచేయడం, వక్రీకరించడం జరుగుతోంది. ఈ పరిస్థితిని నివారించి తెలుగుభాషా సంస్కృతుల పట్ల గౌరవాన్ని ఇనుమడింపజేసేందుకు వెంటనే ఒక చట్టాన్ని తీసుకురావాలి.
పై డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తీర్చాలని, తెలుగు భాషపట్ల, తెలుగు జాతిపట్ల తన నిబద్ధతను నిరూపించుకోవాలని కోరుతున్నాను. చివరగా తెలుగు భాషోద్యమం చెప్పదలచుకున్నదొక్కటే. తెలుగు ప్రజలు రాష్ట్రంలో కోట్లుండగా బయటి రాష్ట్రాల్లో కూడా ఇంచుమించి అంతమందే ఉన్నారు. అనేక చారిత్రక కారణాల వల్ల దూర దూర ప్రాంతాల్లో ప్రత్యేకమైన రాజకీయ నేపథ్యాల్లో, సాంస్కృతిక భిన్నత్వంలో ఉన్నారు. అయినా అందరి భాషా మౌలికంగా తెలుగే. అందులోనే ఎవరి ప్రత్యేకతలు వారికున్నాయి.
అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రాంతీయ వైవిధ్యం ఉంది. ప్రత్యేక తెలంగాణ కోసం సాగుతున్న ఉద్యమం అనేక ఆర్థిక, రాజకీయ, సామాజిక కారణాల మీద ఆధారపడి ఉంది. పరిపాలనా యంత్రాంగాన్ని పేదల వద్దకు తీసుకుపోవడానికై భాష ఉపయోగపడడమే కాకుండా ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరుస్తుంది. కోర్టులలో క్లైంట్ యొక్క భాషే తీర్పులకు జవాబుదారీతనం యిస్తుంది. భాషలోను, పాఠ్యపుస్తకాల్లోని బోధనాంశాల్లోనూ ఎంతో విప్లవం జరిగితే గానీ మన పిల్లలకు చదువు అబ్బడానికి తగిన పరిస్థితులు ఏర్పడతాయని నా దృఢమైన అభిప్రాయం.
- డా. చుక్కారామయ్య
శాసనమండలి సభ్యులు, తెలుగు భాషోద్యమ సమాఖ్య గౌరవాధ్యక్షులు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి