26, ఫిబ్రవరి 2012, ఆదివారం

రాష్ట్రం సమైక్యంగా ఉండాలి : తిరుపతి సదస్సులో వక్తలు

ఆంధ్ర భూమి: అధికార దాహంతో కూడిన కొందరు రాజకీయ నాయకులను మినహాయిస్తే తెలంగాణలో సైతం రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకునే వారి సంఖ్యే అధికంగా ఉందని, ఇది వాస్తవమని విశాలాంధ్ర మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరకాల ప్రభాకర్ అన్నారు. తిరుపతిలోని నెహ్రూ లలిత కళా ప్రాంగణంలో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి (శాప్స్), విశాలాంధ్ర మహాసభ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన విశాలాంధ్ర మహాసభను, గణాంక ప్రదర్శనను రిటైర్డ్ విసి వెంకట్‌రెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల అభివృద్ధిపై వాస్తవాలను గణాంకాలతో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అన్ని రంగాల్లోనూ తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి పథంలో నడుస్తోందో విస్పష్టంగా చూపించారు. అంతేకాకుండా రాష్ట్ర సమైక్యతను కాపాడుదాం అనే పేరుతో ముద్రించిన బుక్‌లెట్స్‌లో నాగం జనార్దన్‌రెడ్డి ఒకప్పుడు తాను తెలంగాణ వాదినని - ఇప్పుడు సమైక్య వాదినని చేసిన వాఖ్యలను, అలాగే కోస్తా మహానుభావులే తమకు చదువులు చెప్పించారని దేవేంద్ర గౌడ్ చేసిన వ్యాఖ్యలను, ముసలివాళ్లకు విడాకులు ఇప్పిస్తారా.. అని కడియం శ్రీహరి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను చదవి వినిపించారు. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమమే నాదని చెప్పుకుంటున్న కెసిఆర్ జై తెలంగాణ నినాదాలు పెరగకుండా ముఖ్యమంత్రి తక్షణం చర్యలు చేపట్టాలని అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను కూడా చదివి వినిపించారు. ఉద్యోగాలు రానంత వరకూ తెలంగాణ, రాయలసీమ ఉద్యమాల పేరుతో సంఘాలు, సమితులు ఏర్పాటు చేస్తారని ఉద్యోగాలోస్తే వాటి గురించి పట్టించుకోరని కెసిఆర్ చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. స్వాతంత్ర సమర యోధుడు నర్రా మాధవరావు, మహమ్మద్ ఆలీ, విశాలాంధ్ర మహాసభ రాష్ట్ర అధ్యక్షులు నలమోతు చక్రవర్తి, మాజీ డిజిపి ఆంజనేయరెడ్డి, సుగుణమ్మ, కరీంనగర్‌కు చెందిన శ్రీనివాసులరెడ్డికన్నా తెలంగాణ ప్రజలను కెసిఆర్ ఎక్కువగా ప్రేమిస్తున్నాడా? అని ప్రశ్నించారు. తమను సభలు పెట్టమని తెలంగాణ ప్రాంతం నుండి అనేక మంది అడుగుతున్నారన్నారు. అయితే నిజాలు మాట్లాడిన వారి పీకనొక్కి అసత్య ప్రచారాలు బయటపడకుండా తెలంగాణ వాదులు జాగ్రత్త పడుతున్నారన్నారు. తెలంగాణ ఉద్యమం చల్లారిందనే నిర్లక్ష్యం తగదని సమైక్యావాదులను హెచ్చరించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన స్వాతంత్ర సమరయోధుడు నర్రా మాధవరావు మాట్లాడుతూ తెలుగువారంతా సమైక్యంగా ఉండాలని కోరుతూ 8 వేల మంది స్వాతంత్ర సమరయోధులు అనేక పోరాటాలు చేశామన్నారు. నిజాం నవాబులకు, రజాకార్లకు, పటేల్, పట్వారీ వంటి అనేక బానిసత్వాలకు వ్యతిరేకంగా పోరాడామన్నారు. తాము చేసిన ఉద్యమాల ఫలితంగానే నేడు తెలంగాణ ఈ స్థాయిలో అభివృద్ధి చెందిందిన్నారు. నలబోతు చక్రవర్తి, శ్రీనివాసరెడ్డి, మహమ్మద్ ఆలీ, మాజీ డిజిపి ఆంజనేయరెడ్డి, శాప్స్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం, ఎన్ రాజారెడ్డి, తదితరులు మాట్లాడుతూ కెసిఆర్ ఓడిపోయినప్పుడు ఒక మాట, గెలిచినప్పుడు మాత్రం తెలంగాణ వాదం పేరు చెప్పడం విడ్డూరంగా వుందన్నారు.

బూర్గుల విగ్రహాన్ని ఎర్పాటు చేయాలి
తెలుగు ప్రజల చిరకాల స్వప్నమైన విశాలాంధ్ర ఆవిర్భావానికి తన ముఖ్యమంత్రి పదవిని సైతం త్యాగం చేసిన ప్రముఖ తెలంగాణ ప్రాంత నేత బూర్గుల రామకృష్ణారావు విగ్రహాన్ని తిరుపతిలో ఏర్పాటు చేయాలని శనివారం తిరుపతి నెహ్రూ లలిత కళా ప్రాంగణంలో జరిగిన విశాలాంధ్ర మహాహభ తీర్మానించింది. విశాలాంధ్ర రాష్ట్ర అధ్యక్షుడు రవితేజ అధ్యక్షతన జరిగిన ఈ సభ జరిగింది. ఈ సందర్భంగా పలు ముఖ్యమైన తీర్మానాలకు సంబదింధించి శాప్స్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ కోడూరు బాలుసుబ్రహ్మణ్యం, ఎన్ రాజారెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌లో ట్యాంక్‌బండ్‌పై తెలుగు వైతాళికు విగ్రహాలను ధ్వంసం చేయడాన్ని సమావేశం తీవ్రంగా ఖండించిందని తెలిపారు. అంతేకాకుండా విగ్రహాలను పునః ప్రతిష్ఠించాలని తీర్మానించామన్నారు.

ఆంధ్రప్రభ : తెలంగాణాలోని మెజారిటీ ప్రజలు రాష్ట్రం సమైక్యంగా వుండాలని కోరుకుంటున్నారని విశాలాంధ్ర మహాసభ ప్రధాన కార్యదర్శి పరకాల ప్రభాకర్‌ అభిప్రాయపడ్డారు. శనివారం స్థానిక నెహ్రూ లలితకళా వేదికలో రాష్ట్ర సమైక్యతను కాపాడుకుందామన్న నినాదనంతో విశాలాంధ్ర మహాసభ, సమైక్యాంధ్ర పరిరక్షణ సమితీలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అబద్దాలు చెప్పి ప్రజలను రెచ్చగొట్టే వారిని కోతలరాయుడు అంటారని, ఆ పేరు తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావుకు చక్కగా సరిపోతుందని అన్నారు. మోసపు మాటలతో ప్రజలను ఎల్లకాలం వంచించలేరని, అసత్య ప్రచారాలు, అభూత కల్పనలతో తెలంగాణా ప్రత్యేక ఉద్యమం సాగుతోందని ఆయన ఆరోపించారు. తెలంగాణా ప్రాంతానికి చెందిన సాయుధపోరాట యోధులు నర్రా మాదవరావు, మహబూబ్‌ అలి, విశాలాంధ్ర మహాసభ నాయకులు నలమోతు చక్రవర్తి, పదిరి రవితేజ, కె.శ్రీనివాసులురెడ్డి, చేగొండి రామజోగయ్యలు రాష్ట్రం సమైక్యంగా వుండాలని పోరాడుతున్నారని ఆయన పేర్కొన్నారు.

వీరికంటే కె.చంద్రశేఖర్‌రావు తెలివైన వాడేమీకాదని ఆయన అన్నారు. సిక్స్‌ పాయింట్‌ ఫార్ములాలు, జోనల్‌ సిస్టంలు పెట్టుకుని మనందెబ్బ తింటున్నామని, ఎక్కడైనా ప్రాజెక్టుల కింద స్టాప్‌ మిగిలి పోతే వారిని రాష్ట్రంలో ఏ మూలనైనా సరె వాడుకునేందుకు వెసులు ఉండాలని ఈ జోనల్‌ సిస్టంను తొలగించుకునే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టాలని కె.చంద్రశేఖర్‌రావు 1996 జూలై 18న అసెంబ్లిdలో వాదించారని ప్రభాకర్‌ గుర్తు చేశారు. అలాగే తెలంగాణా - రాయలసీమల్లో ఉద్యమాల కోసం ఏదో సమితి అని పెడుతున్నారని, రాయలసీమ విమోచన సమితి, తెలంగాణా ప్రజాసమితిలు అలాంటివేనని, ఉద్యమం చేపట్టే ఉద్యమకారులు ఏవైనా ఉద్యోగం దొరికితే దాన్ని అనుభవిస్తున్నారని ముఖ్యమంత్రి ఇలాంటి వాటిపై తక్షణం చర్యలు తీసుకోవాలని 1997 ఫిబ్రవరి 26న కె.సి.ఆర్‌ అసెంబ్లిdలో మాట్లాడారని ఆయన తెలిపారు.

సదస్సులో విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు నలమోతు చక్రవర్తి, కార్యదర్శి పదిరి రవితేజ, చేగొండి రామజోగయ్య, తెలంగాణా సాయుధ పోరాట యోధులు నర్రా మాదవరావు, మహబూబ్‌ అలి, సమైక్యాంద్ర పరిరక్షణ సమితి అధ్యక్ష, కార్యదర్శులు కోడూరు బాలసుబ్రమణ్యం, ఎన్‌. రాజారెడ్డిలు పాల్గొన్నారు.

సాక్షి:  సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి(సాప్స్) విశాలాంధ్ర మహాసభల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ఆలోచింప చేసింది. మొదట ఈ ఎగ్జిబిషన్‌ను ఎస్‌కే యూనివర్సిటీ మాజీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కె.వెంకటరెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఇందులో రాష్ట్ర విభజన పేరుతో రాష్ట్రంలో చోటుచేసుకున్న పలు హింసకాండకు సంబంధించిన దృశ్యాలు, వేర్పాటువాదుల అరాచకాలు కళ్లకు కట్టినట్టు ఫొటో ఎగ్జిబిషన్‌లో ఉంచారు. అందులో శాసనసభలో గవర్నర్‌పై దాడి, శాసనసభ ఆవరణలో లోక్‌సత్తా, బీజేపీ నాయకులపై తెలంగాణా వాదుల దాడులు, ఓ కానిస్టేబుల్, వేర్పాటు వాదుల పైశాచికదాడి, పోటీపరీక్షలను తెలంగాణావాదులు అడ్డుకుంటున్న దశ్యం, ట్యాంకుబండ్‌పై మహనీయుల విగ్ర హాలను ధ్వంసం చేస్తున్న దృశ్యాలు ప్రతి ఒక్కరినీ ఆలోచింప చేశాయి. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి వాస్తవ గణాంకాలు తెలిపే పోస్టర్లు ఆకట్టుకున్నాయి. ఈ ఎగ్జిబిషన్‌ను నగరంలోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు తిల కించారు. అనంతరం ఏర్పాటు చేసిన సదస్సుల్లో వక్తలు సమైక్యాంధ్ర పరిరక్షణ గురించి ప్రసంగించారు. అనంతరం మాతెలుగు తల్లికి మల్లెపూదండ , మాకన్నతల్లికి మంగళారతులు అంటూ జయం కళాశాల అధ్యాపక, విద్యార్థులు రాధికా సౌజన్య బృందం ఆలపించిన గీతం సభికులను అలరించింది. కార్యక్రమంలో విశాలాంధ్ర మహాసభ అధ్యక్ష, కార్యదర్శులు నలమోతు చక్రవర్తి, పరకాల ప్రభాకర్, కార్యదర్శి రవితేజ, శ్రీనివాసరెడ్డి (కరీంనగర్), చేగొండి రామజోగయ్య, తెలంగాణా సాయుధపోరాట యోధులు న ర్రామాధవరావు, మహబూబ్‌ఆలీ, సాప్స్ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం, ఎన్.రాజారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌రెడ్డి, జయం షరీఫ్ మహ్మద్ఫ్రీ, వెంకటరెడ్డి పాల్గొన్నారు.

2 కామెంట్‌లు:

  1. "వీరికంటే కె.చంద్రశేఖర్‌రావు తెలివైన వాడేమీకాదని ఆయన అన్నారు"

    ఎవరు ఎవరికంటే తెలువైన వాడో మీకెట్ల తెలుసు? అందరికి IQ టెస్టు పెట్టిన్రా మీరు?

    అయినా తెలివికి ప్రజాస్వామ్యానికి సంబంధం ఏమిటి? తామే తెలివి మంతులమని జబ్బలు చరుచుకొని ప్రచారం చేసుకుంటె ఏం సంతోషం వస్తదో ఏమో ఈయనకు?

    రిప్లయితొలగించు