10, జూన్ 2011, శుక్రవారం

తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ?

ఆంధ్ర భూమి, జూన్ 9: తెలంగాణ ఉద్యమం తీవ్రం కానున్న తరుణంలో కాంగ్రెస్ అధిష్ఠానంలో ‘ట్రబుల్ షూటర్’గా పేరొందిన కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ రంగంలోకి దిగారు. తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఈ నెల పదిహేనో తేదీన ఢిల్లీలో ప్రణబ్ భేటీ కానున్నారు. ఈ మేరకు ఢిల్లీకి రావలసిందిగా తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు సమాచారం అందింది. తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులతో భేటీ సందర్భంగా ప్రణబ్‌ముఖర్జీ తెలంగాణకు ఒక ప్రత్యేక ప్యాకేజిని ప్రతిపాదించనున్నట్లు తెలిసింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను కొనసాగిస్తూనే తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజిని ప్రణబ్ ప్రతిపాదించనున్నట్లు తెలిసింది. పశ్చిమబెంగాల్‌లో గూర్ఖాలాండ్ ఏర్పాటు చేయాలంటూ చేపట్టిన ఆందోళనను దృష్టిలో పెట్టుకుని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డార్జిలింగ్ ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజిని ప్రకటించారు. ప్రత్యేక గూర్ఖాల్యాండ్ ఏర్పాటు డిమాండ్‌ను తాత్కాలికంగా పక్కన పెట్టి ప్రత్యేక ప్యాకేజిని ప్రకటించారు. ఈ ప్యాకేజి రూపకల్పనలో ప్రణబ్‌ముఖర్జీ కీలక పాత్ర వహించినట్లు చెబుతున్నారు. ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు డిమాండ్ విషయంలో కూడా ఒక ప్యాకేజిని రూపొందించినట్లు చెబుతున్నారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ తెలంగాణకు సంబంధించి తన నివేదికలో పేర్కొన్న అంశాల ప్రాతిపదికగా ఈ ప్యాకేజిని రూపొందించినట్లు భావిస్తున్నారు. అయితే గూర్ఖాల్యాండ్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ను అక్కడి ఆందోళనకారులు తాత్కాలికంగా పక్కన పెట్టేందుకు అంగీకరించగా ఇక్కడ తెలంగాణ వాదులు తమ డిమాండ్‌ను పక్కన పెట్టేందుకు సుముఖంగా ఉండకపోవచ్చని అధిష్ఠానవర్గం భావిస్తున్నట్లు తెలిసింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు డిమాండ్‌ను గౌరవిస్తూనే, ఇందుకు సంబంధించిన సంప్రదింపుల ప్రక్రియను కొనసాగిస్తూనే ఈ లోగా తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజిని ప్రకటించే విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు ప్రణబ్ ముఖర్జీ తెలియజేయనున్నట్లు తెలిసింది.

రాజకీయంగా, ఆర్థికంగా ప్రత్యేక ప్యాకేజిని ప్రకటించినట్లయితే రాజకీయ నాయకుల ధోరణిలో మార్పు రాకపోయినా ప్రజల్లో కొంత మార్పు రావచ్చని అధిష్ఠానవర్గం అభిప్రాయపడుతున్నట్లు తెలిసింది. వాస్తవానికి తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజిని ప్రకటిస్తామన్న విషయాన్ని గతంలోనే అధిష్ఠానవర్గం కాంగ్రెస్ నేతల దృష్టికి తెచ్చినట్లు తెలిసింది. ప్రజల్లో మార్పును తీసుకురాగలిగితే ఉద్యమ తీవ్రత తగ్గవచ్చని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు మూల కారణమైన ‘స్వయం పాలన’ గురించి కూడా ప్యాకేజిలో పొందుపరచినట్లు తెలిసింది. రాష్ట్ర విభజన విషయంలో ప్రస్తుతం ఒక నిర్ణయం తీసుకునే స్థితిలో లేమన్న అభిప్రాయంతో ఉద్యమ తీవ్రతను తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలన్న ఉద్దేశంతో అధిష్ఠానం ఉన్నట్లు చెబుతున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి