ప్రజాశక్తి , జూన్ 20 :తెలంగాణా  ప్రాంత ప్రజా ప్రతినిధుల ఢిల్లీ యాత్ర ఫలితాలపై వస్తున్న కథనాలు పాలక పక్ష  రాజకీయ క్రీడ పరాకాష్టకు చేరిన వైనాన్ని స్పష్టం చేస్తున్నాయి. వరుసగా  రాజధానికి ప్రదక్షిణల ప్రహసనం సాగించే నాయకులకు అక్కడ ఏం ఆలోచిస్తున్నారో  తెలియదనుకోవడం పొరబాటు.అలాగే వారికి చెప్పిందంతా బయిటకు వచ్చాక  చెబుతున్నారనుకోవడం ఇంకా పొరబాటు. వారు చెప్పే మాటలకు, చేస్తున్న  విన్యాసాలకు పొంతన వుండటం లేదని కాస్త పరిశీలించే వారెవరైనా చెప్పగలరు. గత  పది రోజుల్లో, ప్రధానితో సహా కేంద్ర ప్రతినిధులందరూ చెప్పిన మాటలను బట్టి  రాష్ట్ర విభజన విషయమై కేంద్రం ఒక నిర్ణయం తీసుకోలేదని స్పష్టమవుతోంది.  అయితే ఆ మాట సూటిగా చెప్పడానికి మాత్రం సిద్ధంగా లేరు. ప్రధానిని కలిసిన  తర్వాత కూడా ఏ విధమైన అధికారిక వ్యాఖ్య వెలువడలేదంటే కేంద్రం అంతకన్నా  చెప్పేదేముంటుంది? జటిలమైన సమస్య అనీ, సమయం పడుతుందనీ రకరకాలుగా సన్నాయి  నొక్కులు నొక్కడం అందులో భాగమే. డిసెంబర్ 9 ప్రకటన కేంద్రం చేసింది  తప్ప(అదీ క్యాబినెట్‌లో చర్చించకుండా) కాంగ్రెస్‌ది కాదని జైపాల్ రెడ్డి  వివరణ, సవరణ వగైరాల సారాంశం. ప్రధాని స్వయంగా మౌనయోగం పూనిన తర్వాత ఆయన  క్యాబినెట్ సహచరులేవో చెబుతారనుకోవడం హాస్యాస్పదం. హోం మంత్రి చిదంబరాన్ని  కలసినపుడు ఈ విషయంలో కాంగ్రెస్ ఇంకా ఒక వైఖరి తీసుకోలేదని అన్నట్టు వారు  చెప్పారు. గతంలో అఖిలపక్షం గురించి చెబుతూ వస్తున్న చిదంబరం ఇప్పుడు తమ  పార్టీయే వైఖరి తీసుకోలేదనడం ఎంత బాధ్యతా రహితమో చెప్పనవసరం లేదు. మరి  డిసెంబర్ 9 ప్రకటన, శ్రీకృష్ణ కమిటీ సిఫార్సులు వగైరాలకు ఏ విలువ  లేనట్టేనా? శ్రీకృష్ణ కమిటీ ఆరు సిఫార్సులు చేసినందువల్ల కేంద్రం ఏం చర్య  తీసుకోలేకపోతున్నదని చెప్పిన గులాం నబీ ఆజాద్‌కు ఆ కమిటీ సమైక్య రాష్ట్రంలో  తెలంగాణాకు రాజ్యాంగ రక్షణలు కల్పించడం అత్యుత్తమ సిఫార్సుగా పేర్కొన్న  సంగతి తెలియదనుకోవాలా? దాన్ని ఆమోదిస్తున్నదీ లేక తిరస్కరిస్తున్నదీ  చెప్పకుండా ఎవరిపైనో నెపం పెట్టడం కూడా బాధ్యతా రాహిత్యమే కదా? ఇప్పుడు  మధుయాష్కీ వంటి వారు సూటిగానే తమ పార్టీ ఆలోచనా ధోరణని బయిటపెట్టారు.  నిజంగా ఆ పని చేయదల్చుకుంటే అప్పుడు పారదర్శకంగా, ప్రజాస్వామికంగా  ప్రకటించాలి గాని దాగుడుమూతలెందుకు?
టిఆర్‌ఎస్ తెలంగాణా విభజన  అన్న నినాదంతో రాజకీయ భవిష్యత్తు నిర్మించుకోవడానికి చేసే ప్రయత్నం అందరికీ  కనిపిస్తుంది గాని ఈ విషయంలో కాంగ్రెస్ కపట నాటకం అంత స్పష్టంగా  అగుపించదు. ఆ విధంగా చూస్తే టిఆర్‌ఎస్ చాలా తాజా రాజకీయ శక్తి అని  చెప్పాలి. ఈ ఎత్తులు, పై ఎత్తుల్లో జూనియర్ కూడా. అయితే వివాదాస్పద  వ్యాఖ్యలు ఉద్రేక పూరిత పిలుపుల కారణంగా దానిపై విమర్శలు కూడా తీవ్రంగానే  వున్నాయి. విశ్వసనీయత దెబ్బతిన్న సందర్భాలూ వున్నాయి. కానీ ప్రాంతీయ  సమస్యను రాజకీయంగా సొమ్ము చేసుకోవడానికి కాంగ్రెస్ చరిత్ర పొడుగునా  పాచికలు వేస్తూనే వుంది. ఇటీవల కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ  కాంగ్రెస్ జాతీయ పార్టీ అని గొప్పగా చెప్పుకున్నారు గాని వాస్తవంలో అన్ని  ఉప ప్రాంతాల్లోనూ అక్కడి పాట పాడి పబ్బం గడుపుకోవడం కూడా కాంగ్రెస్‌కు బాగా  అలవాటు. వాస్తవంలో యాభైల నాటి కమ్యూనిస్టు ప్రాబల్యాన్ని దెబ్బ తీయడానికే  కాంగ్రెస్ భూస్వాములు ప్రత్యేక తెలంగాణా నినాదం తీసుకొచ్చారు తప్ప అప్పటి  వరకూ తెలుగువారంతా ఒకటేనన్న భావన వుంది. 1952కు ముందు ప్రత్యేక రాష్ట్రం  అన్న మాట వినిపించేది కాదని సుందరయ్య ఆత్మకథలో రాశారు. యాభైయ్యేళ్ల నినాదం  అంటున్న వారు ఆనాడు అది ఆ విధంగా వచ్చిందని మర్చిపోతుంటారు. తెలంగాణా  ప్రాంతానికి ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాలను కూడా సుందరయ్య శాసనసభ వేదికపై  ఎత్తి చూపించారు గానీ కాంగ్రెస్ నాయకులు వాటినే ఆధారం చేసుకుని రెండు  చోట్లా రెండు రకాలుగా విన్యాసాలు సాగించారు. 1969లో తెలంగాణా ప్రాంతంలో  గాని, 1972లో కోస్తా, రాయలసీమ ప్రాంతాలలో గాని ప్రత్యేక ఉద్యమాలు వచ్చిన  నేపథ్యంలో ఉద్రిక్తతలను పెంచి ముఠా రాజకీయాలు నడిపింది కాంగ్రెస్ నేతలే.  అప్పుడు ఆ స్థాయిలో మరో బలమైన పార్టీ లేదు కూడా. బ్రహ్మానందరెడ్డిని గద్దె  దింపడం ఒకసారి, నరసింహారావును సాగనంపడం మరోసారి జరిగాక అవి చల్లబడిపోయాయి.  పదవుల పంపకాలతో కథ కంచికి పంపించి వివిధ ప్రాంతాల ప్రజలకు ఇచ్చిన హామీలు,  అభివృద్ధి అవసరాలను గాలికొదిలేశారు.
అదంతా ఒకటైతే రాజీనామాల  సంగతి మరొకటి. 1969లో వి.బి.రాజు తదితరులు రాజీనామాలు చేశారు గాని దానివల్ల  రాజకీయ సంక్షోభమేమీ రాలేదు. తెలంగాణా ప్రాంత మంత్రుల మాదిరిగా ఆంధ్ర  ప్రాంత మంత్రులు రాజీనామా చేయలేదని 1972లో విమర్శలు వస్తే పదిహేను మంది  మంత్రులలో పదిమంది రాజీనామాలు చేశారు. రాజకీయ సంక్షోభం రాష్ట్రపతి పాలనకు  దారి తీసిందే గాని రాష్ట్ర విభజనకు కాదు. ఇప్పటి వరకూ టీఆర్‌ఎస్ నేతలు  ఒకటికి రెండు సార్లు చేసిన రాజీనామాలు ఉప ఎన్నికలకు దారి తీశాయే గాని  రాజ్యాంగ సంక్షోభానికి కాదు. ఇప్పుడు కాంగ్రెస్ వారంతా కనీసం ప్రజా  ప్రతినిధులంతా ఒకే విధంగా మాట్లాడ్డం లేదు. కొందరు తీవ్రంగానూ, కొందరు రాజీ  ధోరణిలోనూ, కొందరు మధ్యస్థంగానూ మాట్లాడుతున్నారు. కనక వీరంతా ఒకే మాటపై  అడుగు వేయడం దుస్సాధ్యమైన విషయం. పదవులు వదలిపెట్టాలనే మాటలు  వినిపిస్తుండగానే పదవుల కోసం ఎదురు చూస్తున్నట్టు మాట్లాడే నాయకులు కూడా  వున్నారు. కనక టిఆర్‌ఎస్ తరహాలో కాంగ్రెస్ నేతలంతా కట్టకట్టుకుని  వ్యవహరించడం కుదరని పని. తెలుగుదేశంకు, టిఆర్‌ఎస్‌కు ఎలాగూ ఉప్పూ నిప్పుగా  వుంది గనక వారు కూడా ఏమి చెప్పినా విడిగానే వ్యూహరచన చేస్తారు. అందరం  జెండాలు లేకుండా ఒకే పతాకం కింద పోటీ చేద్దామని తెలుగుదేశం నేతలు చెప్పేది  కళ్లముందు కనిపిస్తున్న వాస్తవానికి పూర్తి విరుద్ధంగా వుంది గనక  విశ్వసించడానికి లేదు. బిజెపి విషయానికి వస్తే ఇద్దరు శాసనసభ్యుల్లో ఒకరు  ఇది వరకే రాజీనామా చేసి గెలవగా మరొకరు రాష్ట్ర పార్టీ అద్యక్షునిగా వుండి  రాజీనామా చేయకుండానే కొనసాగుతున్నారు. ఆ వైఖరి మారకపోవచ్చు. అందువల్లనే  జూన్ 25 తర్వాత జెఎసి విధించిన డెడ్‌లైన్ ప్రభావం పెద్దగా వుండకపోవచ్చు.  పైగా ఆ డెడ్‌లైన్‌లోగా నాటకీయమైన నిర్ణయాలు వెలువడే అవకాశమూ లేదు.  తెలుగుదేశం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కూడా టిఆర్‌ఎస్ వారి దాడులను ఎదుర్కొని  తమ కార్యక్రమాలు తాము జరుపుకోవడం చూస్తే ఇతరులు కూడా నిలదొక్కుకోవడానికే  ప్రయత్నిస్తారని అర్థమవుతుంది. రాజకీయాల్లో ఒకరి అభిప్రాయం మరొకరు  అనుసరించడం గాని, కేవలం వత్తిడి వల్లనే వైఖరి మార్చుకోవడం కాని అరుదుగానే  జరుగుతుంది.
ఆందోళన ప్రచార కార్యక్రమాలు ఏమైనప్పటికీ టిఆర్‌ఎస్  స్థానిక ఎన్నికలలో బలం పెంచుకోవడంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తుంది. ఆ  పార్టీ రాజకీయ ప్రాధాన్యత ప్రారంభమైంది కూడా రెండు జిల్లా పరిషత్‌లు  గెల్చుకోవడంతోనే. కనక ఇప్పుడు బలం పెంచుకోవాలని చూడటంలో ఆశ్చర్యం లేదు.  ప్రచారం కోసం ఎవరు ఏమి చెప్పినా రాజకీయ చదరంగంలో రాష్ట్ర భవిష్యత్తుపై  నిర్ణయం ప్రతిష్టంభనలో పడిపోయందని అర్థమవుతూనే వుంది. ఇక గడువులను ఎవరూ  తీవ్రంగా తీసుకోకపోవచ్చు. డిసెంబరు 9 ప్రకటన అంతిమమైనట్టు మాట్లాడిన వారు  ఇప్పుడు నాలుక కరచుకుంటున్నారు. కేంద్ర పాలక వర్గాలు రాజకీయ ప్రయోజనాల కోసం  ఎలాటి ఎత్తుగడలకైనా వెనకాడబోరని ఇప్పుడు తేటతెల్లమవుతున్నది. ఈ సమయంలో  కేంద్రం పాత్రను సూటిగా ఎదుర్కోకుండా ఇతర ప్రాంతాల నేతలపై విమర్శలు  ఎక్కుపెట్టడం రెండు విధాల చెల్లుబాటు కాదు- మొదటిది- ఒకే ప్రాంతంలో  పార్టీలు, పార్టీలలో వ్యక్తులు రకరకాలుగా వ్యవహరిస్తున్నారు. రెండవది-  విధానమే నిర్ణయం కాలేదని కేంద్ర మంత్రులు చెబుతుంటే దాన్ని ఇతరులు  అడ్డుకోవడం అనే ప్రసక్తి ఎక్కడి నుంచి వస్తుంది? రాబోయే రోజులు ఇలాటి అనేక  చిక్కు ప్రశ్నలను ముందుకు తెస్తాయి.
ఇక కాంగ్రెస్ నేతలైతే తమకు  పూర్తి విశ్వాసం కలిగిందని అంటూనే మరో వైపున త్రిముఖ కార్యాచరణ వ్యూహం  ప్రకటిస్తున్నారు. నిజంగా కేంద్రం అనుకూలంగా మాట్లాడితే ఈ వ్యూహాల అవసరం  ఏమిటి? తమ నియోజకవర్గాలలో మళ్లీ గెలవడం వారికి ప్రధాన సమస్యగా  కనిపిస్తుండవచ్చు గాని కేంద్రంలోని వారి నాయకత్వం ఆ పరిమితిలోనే  ఆలోచిస్తుందా? లోగడ తమ అంతర్గత సంక్షోభాన్ని పరిష్కరించుకోవడానికి వారు  ప్రాంతీయ వివాదాలకు ఆజ్యం పోశారు. ఇప్పుడు ఆ అవసరం తీరాక మరో విధంగా  మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా ప్రజలు పూర్తిగా విడిపోయారని చెప్పడం మాత్రం  అతిశయోక్తి. ఇన్ని వివాదాల మధ్యనా వివిధ తరగతుల ప్రజలు ఉద్యోగులు సమస్యలపై  ఐక్యంగానే పోరాడి హక్కులు, కోర్కెలు సాధించుకుంటున్నారు. తాజాగా పంచాయతీ  రాజ్ ఉద్యోగులు కొన్ని హామీలు పొందారు. రేబిస్ మందు లేక అన్ని చోట్లా ఒకే  విధంగా ప్రాణాలు కోల్పోతున్నారు. రైతాంగం బాధలు కూడా ఇంచుమించు ఒకటిగానే  వున్నాయి. పాలకవర్గ రాజకీయ అవసరాల మేరకు ఏ విధమైన ఉద్యమాలైనా  తీసుకురావచ్చు, నిర్ణయాలు తీసుకోవచ్చు. ఆ క్రమంలో ప్రజలు కూడా భాగస్వాములై  మనోభావాలను బలంగా ప్రదర్శించవచ్చు. అంతమాత్రాన ప్రజల మధ్య శాశ్వత విభజన  ఏర్పడిందన్న మాట నిజమై పోదు. ఇందుకు భిన్నమైన వాతావరణం తీసుకువస్తే అప్పుడే  ఇదే ప్రజలు పరస్పరం సుహృద్భావం చూపించే ఉదాహరణలు కూడా చాలానే వున్నాయి.  కనక రాజకీయాంశాలను భావోద్వేగ ప్రధానమైందిగా చిత్రించడం ఎక్కడో ఒక చోట  నిలిచిపోక తప్పదు. అలా చేసే వారికి అవకాశమిచ్చి అసలు సమస్యలను దారి  తప్పించే పాలకుల క్రీడకు కూడా ఎప్పుడో తెరపడకా తప్పదు. ఇప్పుడు  ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి అలాటి ఘట్టం వచ్చేసిందా అన్నది త్వరలో మరింత  స్పష్టమవుతుంది. గూర్ఖాలాండ్ అభివృద్ధి మండలిపై కొత్తగా ఏర్పడిన మమత  ప్రభుత్వంతో అవగాహనకు వచ్చిన జిజెఎం సిపిఎం లేదు గనక ఒప్పుకుంటున్నామని  చెప్పడం గమనించదగ్గది. నిన్నటి వరకూ రాష్ట్రం కావాలనే జిజెఎం విభజన వద్దనే  మమతా లక్షణంగా కలసి పోటీ చేయడంలో రహస్యం మార్క్సిస్టు వ్యతిరేకతే.  వాస్తవానికి గూర్ఖా హిల్ కౌన్సిల్ గత ప్రభుత్వమే ఏర్పరచింది. కనక  రాజకీయావసరాల కోసం రగుల్కొన్న నినాదాలు దానిపై అవగాహన కుదరగానే సర్దుకోవడం  గతంలో చాలా సార్లు జరిగింది. రాజ్యాంగ ఏర్పాటు గురించి కేంద్రం ఏం  చెబుతుంది, దానిపై ఎలాటి స్పందనలు వుంటాయి అనేది కూడా చూడవలసి వుంటుంది.  ఎందుకంటే దాన్ని ఆమోదించకపోవచ్చు గాని అడ్డుకోవడం రాజ్యాంగ పరంగా  సాధ్యమయ్యేది కాదు. వారాలు, నెలలు గడువులు పెట్టిన టిఆర్‌ఎస్ నాయకులే  కొందరు ఇప్పుడు జార్ఖండ్ ఏర్పాటుకు అరవయ్యేళ్లు పట్టిందని, మరోచోట ఇంకా  ఆలస్యమైందని చెప్పడం మొదలు పెట్టారంటే అందులో వారు కూడా తమ అనుయాయులను  మానసికంగా సిద్ధం చేస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. ఇదంతా అయిన తరువాత  నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్రాన్ని వదిలివేసి లగడపాటి రాజగోపాల్, పొన్నం  ప్రభాకర్ చేరో వైపు నుండి వాగ్బాణాలు విసురుకోవడం కొసమెరుపు. టిఆర్‌ఎస్  వంటా-వార్పు కార్యక్రమం కొనసాగింపు.
-తెలకపల్లి రవి
http://www.prajasakti.com/todaysessay/article-244763
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి