27, జూన్ 2011, సోమవారం

జూలూరి 'తోక' పివరుండిట్లనియెన్

మొత్తానికి జూలూరి గౌరీశంకర్ తెరవే ప్రధాన కార్యదర్శి హోదాలో శ్రీశ్రీ విశ్వేశ్వరరావులో ఏవో 'అతీత' 'అతీంద్రియ' శక్తులు ఉన్నట్టు పసిగట్టేసాడు. మాకు ఎవరికీ దక్కని 'భలే ఛాన్స్' కొట్టేసాడు. 'తెలంగాణ రాష్ట్రం రాక తప్పదు లేదా తెలంగాణ ప్రజలు స్వరాష్ట్రాన్ని తెచ్చుకోక తప్పదని టిఆర్ఎస్ వ్యవస్థాపకుడి కన్నా ముందుగానే గ్రహించేసాడట విశ్వేశ్వర్రావు. '2001కి పూర్వం నుంచే సాహితీమిత్రులు-విజయవాడ పేరిట కవిత్వంతో సాయంకాలాలు నడపడంలో కూడా సాంస్కృతిక కుట్రలు, ప్రతికుట్రలు' ఉన్నాయష. '12 ఏండ్ల క్రితమే మొదలైన ఈ కవిత్వ సాయంకాలాలు నడపడంలో భవిష్యత్తును ముందుగానే అంచనా వేశారు'ష. చూసారా బ్రహ్మంగారిలా విశ్వేశ్వర్రావు ఎంత కాలజ్ఞానో?!

జూలూరి గౌరీశంకర్ 'తోకూపుకుంటూ' వెళ్లిన కవిత్వంతో ఒక సాయంకాలానికే మాబోటి వాళ్లు కూడా 1999 నుండీ తోకలు ఊపకుండానే శ్రోతలుగా వెళ్లినవాళ్లం. మాకు గుర్తుండీ ఇప్పటి తెరాస వ్యవస్థాపకుడు అప్పటి నారా చంద్రబాబు నాయ్డు ఏలుబడిలో ఏవో పదవులు అనుభవిస్తున్న గుర్తు. అది కూడా తెలంగాణా 'కోటా'లో...


నారా చంద్రబాబు నాయ్డు ఒకరోజు తెల్లారగట్టే శ్రీశ్రీ విశ్వేశ్వర్రావుని పిలిపించుకుని- 'చూడు విశ్వేశ్వర్రావూ! ఈ మాటు కూడా నేను కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి మంత్రిపదవి ఇవ్వబోవడం లేదూ... అందుకు అతగాడు అలిగి మా పార్టీ విడిచి వెళ్లిపోతాడూ. 2001లో తెరాస అనే పార్టీ పెట్టుకుంటాడూ. ఓ పన్నెండు - పధ్నాలుగేళ్లకయినా తెలంగాణా రాష్ట్రం తెచ్చేస్తాడూ - కాబట్టి ముందే జాగ్రత్తపడి నువ్వే ఏదో ఒక కుట్ర చెయ్యి నాయనా. నాకు వైస్రాయి కుట్రలు చేతవచ్చుకానీ, సాంస్కృతిక కుట్రలు రావూ. అది నువ్వే చెయ్యాలా... అలా మనం ముందుకుపోదాం' అని రహస్యంగా కాళ్లూ చేతులూ పట్టుకుని బతిమాలిన మీదట - సదరు విశ్వేశ్వర్రావు అనబడే ఈ వ్యక్తి విజయవాడలో 1999 నుండే తెలంగాణాకు వ్యతిరేకంగా సాంస్కృతిక కుట్రకు తెరదీసాడట.


ఈ సాంస్కృతిక కుట్రని అప్పట్లో పసిగట్టలేని అమాయకత్వంతో జూలూరి 'తోకూపుకుంటూ' 'కవిత్వంతో ఒక సాయంకాలం'కు హాజరయి కవిత్వం చదివి ఇచ్చిన చెక్కషీల్డులు తీసుకుని వెళ్లిపోయేడట. చెక్కషీల్డులు కాక విశ్వేశ్వర్రావు చెక్కులిచ్చి పంపే నవాబు అనుకున్నాడేమో జూలూరి, అప్పటి మోసాన్ని ఇపుడు చెప్పుకొస్తున్నాడు.


ఇంతకీ జూలూరికి ద్రావక స్నానం చేసి వొళ్లు మండినట్టు ఎందుకనిపించిందీ? కవిత 2010 సంకలనంలో 'పుష్కర కవితా స్నానం' పేరిట విశ్వేశ్వర్రావు రాసినదాంట్లో ఎక్కడ పేచీ వచ్చింది? జూలూరి విమర్శనా వ్యాసం మరలా మరలా చదివినా అర్థం కాని పరిస్థితి.


మే డేని కవిత్వంతో ఒక సాయంకాలం కార్యక్రమంగా మార్చడం గురించి వివరించిన విశ్వేశ్వర్రావు వాక్యాల్లో కవిత్వం పట్ల ప్రేమకన్నా, శ్రామిక జన పక్షపాతంకన్నా విశ్వేశ్వర్రావు ప్రాంతీయాభిమానం కనిపించిందట జూలూరికి. ఆనందం కూడా వేసిందట. ఆంధ్ర దేశం అన్నాడు, ఆంధ్ర మహాసభ అన్నాడు.


విశాలాంధ్ర అన్నాడు- ఇది చాలదా జూలూరికి. ద్రావక స్నానం చేసినప్పటి మంటలా ఒళ్లు మండడానికి. అంతేనా ఇంకేమైనా కారణం ఉందా జూలూరి అసందర్భ ప్రేలాపనలకి.


ఉందనే తడుతుంది. కవులు ఏం రాయాలన్నది, ఏం రాస్తారన్నది విశ్వేశ్వర్రావుకి అవగాహన లేదుట జూలూరి దృష్టిలో. గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించినట్లు జూలూరి లాంటి యశో'కవి'కి కవిత్వంతో ఓనమాలు తెలియని విశ్వేశ్వర్రావు సుద్దులు చెప్పడమా? ఎంతటి అహంకారము. ఎంతటి కండకావరమూ?! విశ్వేశ్వర్రావులాంటి కవిత్వ ప్రేమికులు-పాఠకులు లేకపోయినంత మాత్రాన యశోకవులకు వచ్చిన లోటు ఏంటంటా? పాఠకులు, శ్రోతలు, ప్రేమికులు, పఠితలు లేకపోయినా కవిత్వం గులాబిలా గుబాళిస్తుందనే నమ్మకం జూలూరిది. వారి విశ్వాసం వెయ్యేళ్లు వర్థిల్లుగాక.


'విగ్రహాలు కూలిన తరువాత కూడా వివక్షతతో మాట్లాడడం వివక్షకే వివక్ష' అంటున్నాడు జూలూరి. విశ్వేశ్వర్రావు అలాంటి వివక్షకు పాల్పడ్డాడని జూలూరి వారి ఆక్రోశం, ఆక్షేపణ, ఆగ్రహమూను. వాస్వవానికి విశ్వేశ్వర్రావు అన్నదాంట్లో విగ్రహాల కూల్చివేతకన్నాdisplaced anger మూలంగా ఏ ప్రజాస్వామిక ఉద్యమానికైనా జరిగే కీడు పట్ల concern కనబడుతుంది. 'లాంగ్‌మార్చ్' ద్వారా చైనాపై అరుణతారను ఎగురవేసిన మావో కూడా నాలుగువందల ఏళ్ల రాజరిక భూస్వామ్య పాలన రథచక్రపు టిరుసుల కింద పడి నలిగి జనజీవితం అస్తవ్యస్తమైపోయిన కారణాన కుపితులైన ప్రజానీకం రాజరికపు సాంస్కృతిక చిహ్నాలను, కట్టడాలను ధ్వంసం చెయ్యబోతుంటే వారించాడు.


ఇప్పటికీ ఈ సాంస్కృతిక కట్టడాలను చరిత్రకు ఆనవాళ్లుగా కాపాడుకుంటున్నారు అక్కడి ప్రజానీకం. ఇక్కడ టాంక్‌బండ్ మీద విగ్రహ విధ్వంసం ఒక ఎత్తయితే, దానికి 'అంగీకారోత్పత్తి' (Manufacturing Concent) ప్రక్రియగా కవులు, సాహిత్యవేత్తలు చేసిన విన్యాసాలు విజ్ఞులెవరికైనా ఆందోళన కలిగిస్తాయి. సాహిత్య సృజన, అనుసృజనలు దేశదేశాల ప్రజలను ఏకం చేస్తాయి, 'సాహిత్య ప్రయోజనమూ పరమార్థమూ అదే' అని నమ్మినవారికి మరింత ఆందోళన కలిగిస్తాయి.


రాజకీయులకి- సాహిత్యకారులకి మధ్య విభజన రేఖ ఉంటుంది. 'రాజకీయ నాయకులు ఏకం అవుతారు, ప్రజలు విడిపోతారు, రాజకీయ నాయకులు విడిపోతారు, ప్రజలు విడిపోతారు - అయినా ఎప్పటికైనా ప్రజలు ఏకం అవుతారు' అన్న ఆధునికానంతర కవి 'మో' మాటలు ఎలాంటి మొహమాటం లేకుండా సత్యమని కాలం నిరూపిస్తుంది. అంతవరకూ వేచి ఉందాం. అసందర్భ ప్రలాపాలు, కుపిత విమర్శలు, కుప్పిగంతులు, తోకపీకుళ్లూ ఇకనైనా కట్టిపెడదాం. సరేనా జూలూరి.


- సత్యరంజన్ కె.

k.satyaranjan@gmail.com

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి