10, జూన్ 2011, శుక్రవారం

విజయవాడకు 'తెలంగాణ' విద్యార్థి

ఆంధ్ర జ్యోతి, జూన్ 10 :   ఈసారి విజయవాడలోని కార్పొరేట్ కాలేజీలు కిటకిటలాడుతున్నాయి. 'భరించలేని' స్థాయిలో అడ్మిషన్లు వచ్చి పడుతున్నాయి. అంతకుముందుతో పోల్చితే... 30 నుంచి 40 శాతం అడ్మిషన్లు పెరిగాయి. దీనికి కారణమేమిటో తెలుసా! విజయవాడ 'విద్యల వాడ'గా పేరు పొందడం, ఇక్కడి విద్యా సంస్థలు ర్యాంకుల పంట పండించడం మాత్రమే కాదు! ఇదంతా తెలంగాణ ఉద్యమ మహిమ! ఔను... నిజం! తెలంగాణ జిల్లాలకు చెందిన విద్యార్థులు భారీ సంఖ్యలో విజయవాడ విద్యా సంస్థల్లో చేరుతున్నారు.

గత ఏడాది అనుభవం... ఈసారి ఆందోళనలు మరింత బలంగా జరిగే అవకాశం ఉండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఎందుకైనా మంచిదని తమ పిల్లలను విజయవాడలో చేర్పిస్తున్నారు. గతంలో రాయలసీమ జిల్లాల నుంచి భారీ స్థాయిలో విద్యార్థులు వచ్చేవారు. ఈసారి సీమతోపాటు తెలంగాణ విద్యార్థులూ పెద్దసంఖ్యలో వస్తున్నారని విద్యా సంస్థలు చెబుతున్నాయి. గత ఏడాది ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ ఫలితంగా... సుమారు నెలరోజులపాటు తరగతులు నడవలేదు. అదనపు సెలవులూ ఇవ్వాల్సి వచ్చింది. ఇది విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేసింది.

పరీక్షల సమయంలో ఉద్యమానికి వెసులుబాటు ఇచ్చినప్పటికీ... ఈ నెలలో మళ్లీ ఉద్యమ సెగ రగిలే అవకాశం కనిపిస్తోంది. వెరసి... కాలేజీలు మొదలైన మొదటి నెలలోనే అలజడి తప్పదని స్పష్టమైపోయింది. "ఉద్యమాల హడావుడి ఎక్కువగా ఉండటంతో మా పిల్లలను విజయవాడలో చేర్పించాం'' అని వరంగల్‌కు చెందిన రాజమౌళి అనే పేరెంట్ చెప్పారు. ఉద్యమ ప్రభావం ఒక్కటే కాదు... ఇక్కడ విద్యా బోధనను కూడా దృష్టిలో ఉంచుకుని విజయవాడకు వస్తున్న వారూ ఉన్నారు.

"విజయవాడ విద్యకు బాగా పేరుపొందింది. మంచి ర్యాంకులు వస్తున్నాయి. పైగా... తెలంగాణ ఉద్యమం ప్రభావం ఎక్కువగా ఉండటంతో పిల్లలను ముందు జాగ్రత్త చర్యగా ఇక్కడ చేర్పిస్తున్నాం'' అని ఖమ్మం జిల్లాకు చెందిన వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ ఏడాది కృష్ణా జిల్లా నుంచి 32 వేల మంది విద్యార్థినీ, విద్యార్థులు ఎంసెట్ పరీక్ష రాశారు. ఇందులో 75శాతం మంది కార్పొరేట్ కళాశాలల వారే. ఈ ఏడాది ఇంజనీరింగ్, మెడికల్ విభాగాలు రెండింటిలోనూ విజయవాడ విద్యార్థులు రాష్ట్ర టాపర్‌లుగా నిలవడంతో విద్యార్థులు కుప్పలు తెప్పలుగా చేరుతున్నారు. 

https://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2011%2Fjun%2F10%2Fmain%2F10main17&more=2011%2Fjun%2F10%2Fmain%2Fmain&date=6%2F10%2F2011

1 కామెంట్‌: