22, జూన్ 2011, బుధవారం

బిజెపికి ఇది తగునా?

గత కొద్ది వారాలుగా బిజెపి నేత చెన్నమనేని విద్యాసాగర్‌రావు వ్యాసాలు చూస్తూ ఉంటే బిజెపిది ఆత్మస్తుతి పరనిందలాగా ఉంది. కాంగ్రెస్, టిడిపి, టిఆర్ఎస్‌ను విమర్శించే ముందు ఒక్కసారి బిజెపి పరిస్థితిని కూడా దృష్టిలో ఉంచుకోవాల్సింది. రాష్ట్ర విభజన విషయమై ఆయన ఆంధ్రులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, ట్యాంక్‌బండ్‌పై ఉండకూడని విగ్రహాలు ఉన్నాయన్న వ్యాఖ్య ఒకప్పుడు కేంద్రహోంశాఖకు సహాయమంత్రిగా ఉన్న వ్యక్తి చేయతగ్గవా అన్నది విద్యాసాగర్‌రావు విజ్ఞతకే వదిలివేద్దాం.

నీటి పారుదల విషయంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మధ్య వివాదమేర్పడినప్పుడు విద్యాసాగర్‌రావు మన రాష్ట్రం పక్షాన పోరాడారా? గిరిజనులపై జరుగుతున్న రాజ్యహింసపై ఆయన ఒక్కమాట ఎందుకు అనలేకపోతున్నారు? జాతీయవాదినన్న జైపాల్‌రెడ్డిని విమర్శించేముందు తమ పార్టీ గతంలో అనుసరించిన విధానాలను విద్యాసాగర్‌రావు మరచిపోకుండా ఉండాల్సింది. 1997లో తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన బిజెపి రాష్ట్రస్థాయి సమావేశంలో 'ఒక ఓటు రెండు రాష్ట్రాల' నిర్ణయాన్ని నిర్ద్వంద్వంగా ప్రకటించారు.

ఒంటరిగా ఎన్నికలకు వెళ్ళి కాకినాడ, రాజమండ్రి లోక్‌సభ స్థానాలను గెలుచుకొని బిజెపి చరిత్ర సృష్టించింది. ఆ తరువాత కేంద్రంలో అధికారాన్ని కాపాడుకోవడానికి ఆ పార్టీ తన నిర్ణయాన్ని పక్కన పెట్టిన విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు ఇంకా మరచిపోలేదు. అప్పటి ఎన్నికలలోనే తెలంగాణ నేత పి.శివశంకర్‌ని తెనాలి నియోజకవర్గ ప్రజలు గెలిపించిన విషయాన్ని విద్యాసాగర్‌రావు గుర్తుంచుకోవాలి. ఇతర పార్టీల నాయకులను అవకాశవాదులుగా ముద్రవేసి, వారు వెంటనే రాజీనామా చేయాలని అడుగుతున్నారు కదా. మరి కేంద్రంలో మంత్రి పదవిలో ఉన్నంతకాలం మీకు తెలంగాణపై రాజీనామా ఎందుకు చేయాలనిపించలేదో వివరిస్తారా విద్యాసాగర్‌రావు? ఇతర పార్టీలను విమర్శించే ముందు మీ సొంత పార్టీ విధానాలను వివరిస్తారా?


పదవులను త్యజించడంలో కనీసం టిఆర్ఎస్‌కి ఉన్న నిబద్ధత బిజెపికి లేకపోవటం స్పష్టంగా కనిపిస్తుంది. 2004 ఎన్నికల తరువాత కూడా బిజెపి అధ్యక్షులు, హైదరాబాద్‌తో కూడిన రాష్ట్రం ఏర్పాటు అవడంపై అభ్యంతరాలు ప్రకటించారు. పైగా శాసనసభ తీర్మానం కావాలన్నారు. 2006 కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికలో టిఆర్ఎస్, కాంగ్రెస్, టిడిపిలకు ఏడు లక్షలకు పైగా ఓట్లు వచ్చాయి. మరి ప్రత్యేక తెలంగాణ వాదాన్ని గట్టిగా వినిపించినా బిజెపి అభ్యర్థి విద్యాసాగర్‌రావుకి వచ్చిన ఓట్లు 21,144 మాత్రమే. ఇప్పుడు జిల్లాల్లో ప్రజాభిప్రాయం ప్రత్యేక తెలంగాణకి అనుకూలంగా ఉంది.


అందుకే కాబోలు బిజెపి వారు తెలంగాణకి అనుకూలంగా ఉద్యమిస్తున్నారు. 1969-72 మధ్యకాలంలో ప్రత్యేక తెలంగాణ, జైఆంధ్ర ఉద్యమాలలో భారతీయ జనసంఘ్ (అప్పటి బిజెపి) వేర్పాటు వాదాలకు మద్దతునిచ్చింది. ఆ తరువాత తన విధానాన్ని ఎందుకు మార్చుకుందో ఆలోచించాలి. ఉత్తరాఖండ్ ఏర్పాటుపై ఉత్తరప్రదేశ్ శాసనసభ మూడుసార్లు (1991, 95, 97లో) ఏకగ్రీవ తీర్మానాలు చేసింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ఆకాంక్ష 1924 నుంచి ఉంది.


ఈ విషయమై 1994లో మధ్యప్రదేశ్ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసింది. జార్ఖండ్ డిమాండ్‌కు సుదీర్ఘ చరిత్ర ఉంది. 1952, 57 ఎన్నికలలో జార్ఖండ్ పార్టీ 30కి పైగా స్థానాలను గెలుచుకొని బీహార్ అసెంబ్లీలో ముఖ్య విపక్షంగా ఉండేది. ఈ మూడు రాష్ట్రాలు 2000లో మాత్రమే ఏర్పడ్డాయి. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు చట్టసభల్లో తీర్మానాలు ఆమోదించిన 27 సంవత్సరాలకు గానీ రాష్ట్రం ఏర్పడలేదు.


ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లంత సులభంగా మన రాష్ట్ర విభజన సాధ్యం కాదనేది విజ్ఞులు అర్థం చేసుకుంటున్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో పడిన వానలో చుక్కనీరు కూడా మధ్యప్రదేశ్‌కి పోదు. అలాగే జార్ఖండ్ ద్వారా బీహార్‌కి చుక్కనీరు వెళ్ళదు. రాజ్యాంగంలోని అధికరణ 3 ప్రకారం ఆమోదంతో నిమిత్తం లేకుండా నిర్దిష్ట కాలపరిమితికి లోబడి అసెంబ్లీ అభిప్రాయం మాత్రం కావాలన్నది నిజమే. అయితే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లు రాష్ట్ర విభజనకి ఎందుకు ఏకగ్రీవ తీర్మానాలు చేశాయో ఆలోచించారా? రాంచీలో బీహార్ వాసులు భయపడనక్కరలేదని ఏ జార్ఖండ్ వాద పార్టీ హామీ ఇవ్వాల్సిన అవసరం రాలేదు.


ఇక్కడ కూడా అలాంటి పరిస్థితే ఉంటే ఆప్యాయంగా విడిపోయేవారు. 1972లో జైఆంధ్ర ఉద్యమం వచ్చినప్పుడు కొద్దిమంది మినహా తెలంగాణ మేరు, ధీర నాయకులందరూ ఎందుకు సమైక్యవాదం అన్నారు? మౌనముద్ర ఎందుకు దాల్చారు? క్రమశిక్షణ కలిగిన జాతీయ పార్టీగా ఉన్న బిజెపి రాష్ట్రంలోని రెండు ప్రాంతాల వారిని సమానంగా చూడకపోవడం భావ్యమేనా? రాష్ట్ర రాజధానిలో ఇతర జిల్లాలవారిని, రాజ్యాంగాన్ని సవరించైనా స్థానికేతరులుగా చేయాలని డిమాండ్ చేయడం సరైనదేనా?


అదే విధానాన్ని మనదేశ రాజధాని ఢిల్లీలోని లక్షలాది పోలీస్, ఇతర ఉద్యోగాల విషయంలో అనుసరించాలని, అంటే ప్రస్తుతం దేశ ప్రజలందరికీ ఉన్న సమాన అవకాశాలను తీసివేసి కేవలం ఢిల్లీ లేదా హర్యానా, ఉత్తరప్రదేశ్ వారికే ఇవ్వాలని, బిజెపి డిమాండ్ చేయగలదా? ఈ వాస్తవాల దృష్ట్యా రాష్ట్ర విభజనకి అడ్డు వచ్చే సమస్యలపై మేధావులతో చర్చించి రెండు ప్రాంతాల హక్కులకి, ఆత్మగౌరవానికి భంగం కలగకుండా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత బిజెపిపై లేదా? ఒక ప్రాంతం ప్రజలపై విద్వేష ప్రచారం నడుస్తున్నప్పుడు ఖండించాల్సింది పోయి ప్రోత్సహించేటట్లు మాట్లాడటం జాతీయత ఎలా అవుతుంది?


బిజెపి వారు తెలంగాణలో ఉన్న ఇతర ప్రాంత ఐఏఎస్ అధికారులను, వారి కార్యాలయాలకు వెళ్ళి తమ ప్రాంతాన్ని వదిలిపొమ్మనడం భారత జాతీయతకి భంగం కలిగించడం కాదా? కోస్తా, సీమ వాసులు, ఉద్యోగులు భారతదేశపౌరులు కాదా? బిజెపి ఉద్యమకారులు కోస్తా, రాయలసీమ, ఇతర భారతీయ పౌరులకు ఏం సందేశం పంపించదలిచారు?


కొన్ని వామపక్షాల వారి పోరాట విధానాలను ఒంటికాలిపై లేచి తూర్పారా పట్టే బిజెపి మొదటగా కుల, మత, ప్రాంత, భాషా విద్వేషాలను రూపుమాపినప్పుడే అసలైన భారతీయత పెరుగుతుందని గుర్తించాలి. జగన్, చంద్రబాబు, చిరంజీవి తమ అభిప్రాయాలను ప్రజాస్వామ్యయుతంగా చెప్పుకుంటామంటే ఈ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో తిరగనివ్వమని అనడం ఏ తరహా జాతీయభావమో బిజెపివారే చెప్పాలి. తెలంగాణలో కొందరు బిజెపి నాయకుల వ్యాఖ్యల వల్ల సీమాంధ్రలోని ఆ పార్టీ నాయకులు ప్రత్యేకాంధ్రకై ఉద్యమించలేక ఇబ్బంది పడుతున్నారు.


ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని కొన్ని ఇబ్బందికర సంఘటనలు మినహా శాంతియుతంగా నడుపుతున్నందుకు టిఆర్ఎస్‌తో సహా అన్ని వర్గాలవారికి అభినందనలు తెలపాల్సిందే. ఉద్యమం హింసాయుతం అయితే ఎవరి ఆకాంక్షలు నేరవేరే అవకాశం ఉండదు. పైగా హైదరాబాద్ ఇమేజ్, ఉపాధికల్పనావకాశాలు కోల్పోయి దశాబ్దాలు వెనక్కువెళ్ళే అవకాశం ఎంతైనా ఉంది.


1969/72లలో ప్రత్యేక తెలంగాణ, జైఆంధ్ర ఉద్యమాల వల్ల రాష్ట్ర అభివృద్ధి దశాబ్దంపైగా వెనక్కు వెళ్ళిన విషయం, యువత ఒకతరం దెబ్బతిన్న విషయం తెలుసుకున్న తరువాతైనా సమస్య తక్షణ పరిష్కారం కోసం ప్రయత్నించకపోతే ఎలా? ఇందుకు బిజెపి చొరవ తీసుకుని రెండు ప్రాంతాలలో విద్వేషాలు రెచ్చగొట్టే వారి పన్నాగాలు పారకుండా, నిబద్ధతతో పరిష్కార మార్గాలు ప్రతిపాదించాలి.


సోదర భావం ప్రబోధిస్తేనే రెండు ప్రాంతాలలో విశ్వసనీయత పెంచుకోవడం సాధ్యమవుతుంది. జాతీయతపై అర్థవంతంగా మాట్లాడి ప్రజలను ఉత్తేజపరచవచ్చు. రెండు ప్రాంతాలవారు కొంత తగ్గి సర్దుకుపోతే విడిపోయినా తెలుగువారిగా ఉన్న కొండంత ప్రతిష్ఠని నిలుపుకునే అవకాశం ఉంటుంది. పట్టు విడుపులు లేకపోతే ఇప్పటికే అల్లరైన తెలుగు వారు అందరిలో అలుసవ్వడమే కాక విభజనకు పరిష్కారం కూడా లభించదు.


- చలసాని శ్రీనివాస్

https://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2011/jun/21/edit/21edit4&more=2011/jun/21/edit/editpagemain1&date=6/21/2011


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి