1, ఆగస్టు 2011, సోమవారం

సకల 'జన హితం' ఎవరికి పట్టేను?

ఆంధ్రజ్యోతి : రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? ఇది ఓ సామాన్యుడి మాట. హైదరాబాదులో ఒక్క పనీ అవడం లేదు, ఒక్క ఫైలూ కదలడంలేదు... ఇదొక వ్యాపారవేత్త కామెంట్. ప్రస్తుతం పరిస్థితి ఇదికాగా, నేటి నుంచి తెలంగాణలో జరగనున్న సకల జనుల సమ్మె మరింత అయోమయానికి గురి చేస్తోంది. విద్యాసంవత్సరం గురించి విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కోస్తాఆంధ్రా, రాయలసీమ జిల్లాల్లో పెద్దగా అవాంతరాలు లేకపోయినా తెలంగాణలో బంద్‌లు, ఆందోళన కార్యక్రమాలతో క్లాసులు జరగడంలేదు. రాష్ట్రం మొత్తానికి ఒకే బోర్డులు ఉండడంతో ప్రస్తుత పరిణామాల ప్రభావం విద్యార్థులందరిపైనా వుంటుంది.

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియపై కూడా సకల జనుల సమ్మె ప్రభావం పడనున్నది. సర్టిఫికెట్ల విచారణ పూర్తవడంతో ఆప్షన్లు ఇచ్చే ప్రక్రియ ప్రారంభమైంది. ఇది పూర్తయితేనేకానీ సీట్ల కేటాయింపు జరగదు. జేఎన్‌టీయూలో కౌన్సెలింగ్ జరుగుతుంది. సమ్మె ప్రభావంతో ఇది ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు. తెలంగాణలో ఆందోళనల కారణంగా పన్నుల వసూళ్ళు తగ్గి ప్రభుత్వ రాబడి తగ్గుతుందని అధికారులు విశ్లేషిస్తున్నారు. ఈ కారణంగానే జిల్లాలోని పలు శాఖలకు బడ్జెట్ కేటాయింపులు కూడా సక్రమంగా రావడం లేదు. మండలాల్లో పరిపాలన స్తంభించింది. చిన్నచిన్న పనులు కూడా జరగడంలేదు. ప్రత్యేక ప్రాజెక్టులకు నిధులు మంజూరు లేదు. కొన్ని శాఖల కార్యాలయాలలో అధికారులు గోళ్ళు గిల్లుకుంటూ కూర్చుంటున్నారు. వీడియో కాన్ఫరెన్సులు, టీవీ కాన్ఫరెన్సులతో గతంలో అధికారులకు నిమిషం ఖాళీ ఉండేదికాదు. ఇప్పుడు కేవలం మొక్కుబడి సమీక్షలు తప్ప పనులు జరుగుతున్న పరిస్థితి ఎక్కడా లేదు. గ్రామీణ ప్రాంతాలలో రహదారుల మరమ్మతులకు కూడా నిధులు మంజూరు కావడం లేదు.

ఒక్క చెక్కూ మారడంలేదు : స్థానిక సంస్థల పరిస్థితి మరీ దారుణంగా వుంది. ఒక్క చెక్కు కూడా మారడం లేదంటున్నారు. మేజర్ పంచాయతీలు అయితే తప్ప మిగిలిన పంచాయతీల్లో సిబ్బంది జీతాలకు కూడా ఇబ్బంది పడే పరిస్థితి. పంచాయతీల్లో పన్నులు వసూలు చేయాలని అధికారులు వత్తిడి చేస్తున్నారు. వాటిలో 30 శాతం మించి డ్రా చేసే అధికారం ఇవ్వడంలేదు. ఎస్‌జీఆర్‌వై, ఎస్ఎఫ్‌సి 13వ ఆర్థిక సంఘం కేటాయింపులు పూర్తిగా ఆగిపోయాయి. పంచాయతీలకు ఎక్కువగా 13వ ఆర్థిక సంఘం నుంచే నిధులు మంజూరవుతాయి. అవి కూడా ఆగిపోవడంతో అక్కడ పాలనే లేకుండా పోయింది.

ఫ్యూజ్‌లు పీకేస్తున్నారు.. కరెంటు బిల్లులు చెల్లించలేక పోతున్న గ్రామాలలో ట్రాన్స్‌కో సిబ్బంది విద్యుత్ సరఫరాను నిలిపి వేస్తున్నారు. పలు గ్రామాలు వీధి లైట్లు లేక అంధకారంలో మునిగి తేలుతున్నాయి. జిల్లా ఉన్నతాధికారులు పంచాయతీల్లో పారిశుధ్యం, నీటిసరఫరా, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని వత్తిడి చేస్తున్నారు. అంటు రోగాలు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవడానికి డబ్బులు కావాలని అడుగుతుంటే ఆ విషయం మీరే చూసుకోమని సలహా ఇస్తున్నారు.

ఏ శాఖ మంత్రి ఎవరో? అసలు కొన్ని శాఖలకు మంత్రి ఎవరో కూడా తెలియని అయోమయ పరిస్థితి వుంది. తెలంగాణ మంత్రులు విభజన ఆందోళనతో బిజీగా వున్నారు. కీలకమైన గ్రామీణ నీటి పారుదల, పంచాయతీరాజ్, నీటి సరఫరా, స్త్రీ సంక్షేమం, పౌర సరఫరాలు, వ్యవసాయం, పశుసంవర్థకశాఖ, సంక్షేమ శాఖల మంత్రులు ఇంతవరకు ఒక్కసారికూడా జిల్లాకు వచ్చిన సందర్భాలు లేవు.

2 కామెంట్‌లు:

  1. Who all will work? All jobless JAC members,street rowdies and extortionists who are thriving in the name of agitation would also like to work and have their share. Where do you propose to accommodate them?

    ఉన్న ఇల్లు తగలబడిపోతుందిరా బాబు అంటే దాని స్థానంలో కొత్త భవంతి రాబోతుంది అని కబుర్లు చెబితే ఎలాగా? జనులను వారి పేరుతోనే బందులు, సమ్మెలు చేసి బాధపెట్టడం దేనికి?సమ్మె చేస్తాం అందరు చేయాలి లేకపోతే అంతు చూస్తాం అన్నట్లుగా మాట్లాడి మళ్లీ దాన్ని "సకల" జనుల సమ్మె అనడం ఎంత వరకు భావ్యం? సకల జాక్ల సమ్మె అన్నా బాగుండేది.

    రిప్లయితొలగించండి