10, ఆగస్టు 2011, బుధవారం

సీమాంధ్రుల పరిశ్రమలు ఉన్నట్టా?లేనట్లా

kommineni.info : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఒక్కొక్క వర్గాన్ని కలుపుకుంటున్న క్రమంలో భాగంగా పారిశ్రామిక వర్గాలను కూడా ఆకట్టుకోవడానికి ప్రయత్నం జరిగింది. ప్రత్యేక తెలంగాణతోనే పారిశ్రామికాభివృద్ది జరుగుతుందని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్.పిలతో సహా పలువురు తెలంగాణ నేతలు అభిప్రాయపడ్డారు.ఇంతవరకు బాగానే ఉంది. కాని కొన్ని విషయాలు చెప్పిన తీరు వారిలోని వైరుధ్యాలు బయటపెట్టేవిగా ఉన్నాయి. కొంతకాలం క్రితం కాంగ్రెస్ తెలంగాణ ఎమ్.పిలు కేంద్ర మంత్రి , రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జీ గులాం నబీ అజాద్ కు ఒక నివేదిక ఇస్తూ తెలిపిన అంశాలకు, ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వ్యక్తం చేసిన అంశాలకు కాస్త తేడా కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.గులాం నబీ కి ఇచ్చిన రిపోర్టులో హైదరాబాదు నగరంలో సీమాంద్రులు ఐదు లక్షల మంది మాత్రమే ఉన్నారని, ఇక్కడ స్థాపించిన పరిశ్రమలు వారివి తక్కువేనని, హోటళ్లు వంటివి మాత్రమే వారు స్థాపించారని తెలిపారు.అయితే ఈ రౌండ్ టేబుల్ లో మాత్రం హైదరాబాద్ చుట్టు ఉన్న పరిశ్రమలలో ఎనభై శాతం సీమాంధ్రుల చేతులలో ఉన్నాయని, పది శాతం గుజరాతిలవని, కేవలం రెండు నుంచి మూడు శాతం తెలంగాణవారివని పేర్కొన్నారు.జెఎసి ఛైర్మన్ కోదండరామ్ మాట్లాడుతూ ఉత్తరాఖండ్ లో మాదిరి పరిశ్రమలలో స్థానికులకు ఎనభై శాతం మందికి ఉపాధి కల్పించాలని డిమాండు చేశారు.గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ సీమాంధ్రులు ఐడిపిఎల్ ను మూసివేసి రెడ్డి ల్యాబ్స్, అరవిందో, హెటిరో వంటి పరిశ్రమలు స్థాపించారని వీటిలో తెలంగాణ ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వకుండా వివక్ష చూపారని ఆరోపించారు.సంఖ్యాపరంగా మైనారిటీగా ఉండబట్టే ఎమ్.పి,లు,ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో రాజీనామాలు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని అన్నారు. ఇవన్ని బాగానే ఉన్నా హైదరాబాద్ చుట్టూరా సీమాంధ్రులకే పరిశ్రమలు ఉన్నాయని ఒకసారి, మరో ఇక్కడ అసలు వారికేమీ లేవని పరస్పర విరుద్దంగా చెప్పడం వల్ల వారి వాదనకు నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి