5, ఆగస్టు 2011, శుక్రవారం

అసహజ వాక్కులు

ఆంధ్ర జ్యోతి : చాలా కాలం తర్వాత ఇటీవల ఒక ఛానెల్‌లో రాజకీయేతరమైన చర్చకు వెళ్లాను. ఆత్మహత్యలను నివారించడానికి సంబంధించిన ఆ చర్చలో నాతో పాటు మానసిక వైద్య నిపుణులు కూడా పాల్గొన్నారు. రాజకీయేతరమనుకుంటున్నా పదే పదే ఉద్యమాలలో ఆత్మహత్యల గురించిన ప్రస్తావనలకు దారితీస్తూ వుంటే నియంత్రించడానికి చాలా ప్రయత్నించాల్సి వచ్చింది. బహుశా. వీటినే టిఆర్ఎస్ నాయకులు అసహజ పరిణామాలు అంటుంటారు. ఆ నాయకులతో సహా మనుషులకూ వారి ప్రాణాలకూ విలువనిచ్చే వారెవరైనా ఈ అసహజ పరిణామాలను కోరుకోరు.

అయితే మా చర్చ ప్రసారమైన రోజునే టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు ఏ కారణం వల్లనైనా తెలంగాణ రాకపోతే తాను విషం తాగుతానని ప్రకటించారు. ఈ మాట్లాడిన సందర్భాలేమిటో సవరణలు ఏమైనా వున్నాయో లేదో ఖచ్చితంగా తెలియదు గాని మరోసారి ఆత్మహత్యల గురించి అం దరూ మాట్లాడటానికి ఆ వ్యాఖ్యలు కారణమైనాయి. రాజకీయ నా యకులందరూ అన్నట్టు ఇలాటి మాటలు బొత్తిగా అవాంఛనీయమైనవి.

మరుసటి రోజున కావచ్చు జేఏసీ కన్వీనర్ కోదండరామ్ ఆత్మహత్య చేసుకున్న యువకుడిని భగత్‌సింగ్‌తో పోల్చి మాట్లాడినట్టు ప్రతికల్లో వచ్చింది... ఆత్మహత్యలకు పాల్పడటం ఎప్పుడైనా విషాద మే. అసహాయస్థితిలో అలా అంతమై పోయిన వారు ఎంతైనా సానుభూతి పాత్రులు. వారి కుటుంబాలకు సహాయం చేయడం అందరి బాధ్యత కూడా. అయితే ఏ పరిస్థితులలోనైనా ఆత్మహత్యలను ఆదర్శీకరించడం లేదా ఆ ధోరణులను ప్రోత్సహించేలా మాట్లాడ్డం, వ్యవహరించడం బాధ్యతగల వారెవరూ చేయరాని పని. అసహజ అనిశ్చిత ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత దురదృష్టకరమైన పరిస్థితి ఇది.

కెసిఆర్ రాజకీయాల పట్ల ఎవరి అభిప్రాయాలు ఏమైనా ఆయన వాగ్ధాటి గురించి వ్యూహ చతురుత గురించి భిన్నాభిప్రాయాలుండవు. అలాటి వ్యక్తి నోట విషం తాగడం లాంటి మాటలు వస్తాయని వూహించడం కష్టం. ఒక విధంగా ఇది నిరూత్సాహ ఫలితం కావచ్చు. ఎందుకంటే రెండు వారాల్లో తెలంగాణ ప్రకటన రాబోతున్నట్టు తనకు సంకేతాలు అందాయని కాంగ్రెస్ వాదుల సభలో వారికే తెలియని రహస్యం ప్రకటించి అప్పటికి రెండు వారాలు దాటి రెండు రోజులైంది.

ఇలాటి గడువులు ఆయన ఎన్నెన్నో ప్రకటిస్తూనే వస్తున్నారు గనక ఈ మాత్రానికే అంత మాట అనివుంటారనుకోలేము. ప్రధానంగా విద్యార్థులు యువజనులు వున్న సభలో ఆయన ఈ మాట అనడం ప్రత్యేకించి గమనించదగ్గది. ఈ మాటలు అమాయకులైన వారు ప్రాణం తీసుకోవడానికి ప్రేరణ కావచ్చని ఆయన గుర్తించలేకపోయారా? గతంలో ఆయన నిరాహారదీక్ష ప్రారంభించిన రోజున నేను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్‌లో అల్లం నారాయణ, హరగోపాల్‌లతో కలిసి మాట్లాడుతున్నాను.

ఆయన అరెస్టును ఖండించడంలో అందరం గొంతు కలుపుతుంటే ఆ పార్టీ శాసనసభ్యుడు మీద పెట్రోలు పోసుకోవడం దిగ్భ్రాంతి కలిగించింది. నాటి నుంచి నడుస్తున్న ఈ కాలమంతటా వివిధ చర్చల్లో అనివార్యంగా ఆత్మహత్యల ప్రస్తావన బలిదానాలు త్యాగాల పేరిట వాటిని అభివర్ణించే ప్రయత్నం జరుగుతూనే వుంది. కెసిఆర్ మాటలతో ఆ ధోరణి పరాకాష్టకు చేరిందనుకోవాలి. తెలంగాణ ప్రజలు ముఖ్యం గా యువజనుల భవిష్యత్తు బాగుండాలని కోరేవారెవరూ దీన్ని హర్షించరు. ప్రాంతం కలిసున్నా విడిపోయినా కేవలం దాన్నిబట్టే ప్రజల పరిస్థితి స్వర్గతుల్యమైపోతుందని చరిత్ర తెలిసిన వారెవరూ చెప్పరు గనుక అందుకోసం విలువైన ప్రాణాలు బలికావడాన్ని కూడా భరించలేరు.

కెసిఆర్ సంగతి అటుంచి వామపక్ష చైతన్యం గల కోదండరాం కూడా ఆత్మహత్య చేసుకున్న వారిని భగత్‌సింగ్‌తో పోల్చడం అసంబద్ధం. ప్రపంచ చరిత్రలో ఎన్నో మహత్తర పోరాటాలు విప్లవాలు జరిగాయి. ఈ తెలంగాణాలోనే వీరోచిత రైతాంగ సాయుధ పోరాటం సాగింది. ఏ పోరాటంలోనూ ఈ విధంగా ఆత్మహత్యలు జరగలేదు.

ఎక్కడి సంగతో ఎందుకు కోదండరాం చెప్పిన భగత్‌సింగ్ కూడా సుఖదేవ్‌కు ఉత్తరం రాస్తూ ఆత్మహత్య చేసుకోవడం పొరబాటని గట్టిగా మందలించాడు. "నీకు ఇప్పటికీ జ్ఞాపకముండొచ్చు. ఒక రోజు నేను ఆత్మహత్య గురించి నీతో చర్చించాను. కొన్ని పరిస్థితుల్లో ఆత్మహత్య సమర్థనీయం కావచ్చు అన్నాను.

ఆనాడు నువ్వు నా అభిప్రాయంతో విభేదించావు. చర్చ స్థలం సమయం కూడా నాకు గుర్తున్నాయి. సాహం షామి కుటీరంలో ఒక సాయంకాలం పూట ఆ చర్చ జరిగింది. అలాటి పిరికి పని ఏ పరిస్థితులలో కూడా సమర్థనీయం కాదని నీవన్నావు. అది అసహ్యకరమైన భయంకరమైన పని అని కూడా నీవన్నావు. ఆ విషయంలో ఇప్పుడు నీ అభిప్రాయం పూర్తిగా తలకిందులైంది. కొన్ని పరిస్థితులలో ఈ పని సరైందని మాత్రమే గాక తప్పని సరని కూడా భావిస్తున్నాను. నా విషయానికి వస్తే మొదట్లో నీకున్న అభిప్రాయమే ఇప్పుడు నా అభిప్రాయం. ఆత్మహత్య ఒక అసహ్యకరమైన నేరం. పూర్తిగా పిరికి వాడు చేయవలసిన పని. విప్లవ కారుల సంగతి పక్కన పెట్టి మామూలు మనిషి ఎవరైనా దీన్ని సమర్థించరు.''

"......నా వంటి భావాలు గల వ్యక్తి నిష్కారణంగా చావాలనుకోడని నేను బదులిచ్చాను. మా జీవితాల విలు వ సాధ్యమైనం త ఎక్కువ పెం చుకోవాలనే మేము చూస్తాము. వీలయినంత ఎక్కువ మానవాళికి సేవలు చేయాలని చూస్తాము. మా జీవితాల నుంచి వీలైనంత ఎక్కువ మూల్యం పొందాలని చూస్తాము. ప్రత్యేకించి ఏనాడూ ఎలాటి దిగులూ నిరుత్సాహం దరిచేరని నా వంటి వాడు ఆత్మహత్య చేసుకోవడం కాదు గదా దాని గురించిన ఆలోచనైనా దరికి రానివ్వడన్నాను. అదే మాట నీకూ చెబుతున్నాను.'' (జైలు నోట్సు, లేఖల నుంచి) భగత్ సింగ్ మాటలను మన యువత తప్పక గమనంలోకి తీసుకుంటుందని ఆశించాలి.

వారిని ఇలాటి పరిస్థితికి గురిచేస్తున్న కేంద్రం బాధ్యతా రాహిత్యం, దానికి ఆజ్యం పోస్తున్న ప్రాంతీయుల వీరంగాలూ ఏ మాత్రం ఆమోదించరానివి. నిరంతరం ఏకాభిప్రాయం జపం చేసే చిదంబరాదులు ఇప్పటికే రాజ్యాంగ బద్ధంగా శాసనసభ వేదికపై ఏకగ్రీవంగా తీర్మానం చేసిన 14(ఎఫ్) రద్దుకు ఎందుకు అడ్డు పెడుతున్నారు? అనేక అవరోధాల మధ్య అయిందనిపించిన తతంగాన్ని తిరగదోడాలని ఎందుకు పరీక్ష పెడుతున్నారు? ఏదో విధంగా ఈ రాష్ట్ర రాజకీయాలు ప్రజలు అనిశ్చిత వూబిలో కూరుకుని వుండాలని కాదా? గులాం నబీ ఆజాద్ తమతో జరిపిన చర్చలు రాజకీయ డ్రామా అని ఆ పార్టీ సీనియర్ నాయకుడు కేశవరావే ప్రకటిస్తుంటే దానిపైన కొండంత భ్రమలు కలిగించే వారు కూడా ఇందుకు బాధ్యత పంచుకోనవసరం లేదా? ఆజాద్‌ది డ్రామా అయితే అందులో పాత్రధారులుగా తామంతా వున్నామని కెకె ఒప్పుకుంటారా? సూత్రధారి స్థానం అధిష్టానానికి ఇస్తారా? ఈ డ్రామాలో ప్రాంతాలను బట్టి విలన్లు హీరోలు తారుమారవుతుంటారా? ఇవన్నీ కళ్లముందు కనిపిస్తున్నవే గనక పెద్దగా తర్కించనవసరం లేదు.

రెండు చోట్ల రెండు రకాలుగా మాట్లాడే ఈ ద్వంద్వ రాజకీయాలలో తెలుగుదేశం నేతలు ఏమాత్రం తీసిపోవడం లేదు. అటు నుంచి పయ్యావుల కేశవ్, ఇటు నుంచి రేవంత్ రెడ్డి మాట్లాడితే వారి అధ్యక్షుడైన చంద్రబాబే మందలించవలసి వచ్చింది. ఆ మాటకొస్తే హోం మంత్రి హోదాలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కుదరదని తమ సభ్యుడైన నరేంద్రకే లేఖ రాసిన అద్వానీ ఇప్పుడు ప్రతినిధివర్గాలను కలుసుకుని కబుర్లు చెబితే సరిపోతుందా? సమైక్యత గురించి రోజూ చెప్పే టిజి వెంకటేశ్ తాము ఆంధ్ర వారి మోచేతి నీళ్లు తాగడానికి సిద్ధంగా లేమని ప్రకటించడం ప్రహసనం కాదా? ఇదే చివరి రాష్ట్రమంటే తమకు అభ్యంతరం లేదని లగడపాటి ఏ హోదాలో ప్రకటిస్తున్నారు? ప్రధాన పార్టీలు ఇన్ని విన్యాసాలు చేస్తుంటే ప్రాణాలు తీసుకోవడం గురించి మాట్లాడ్డం ఎంత అనుచితం?

కెసిఆర్ మాత్రమే గాక రాష్ట్రంలో ప్రధాన పార్టీల నాయకులందరూ ఆచితూచి మాట్లాడకపోతే అగమ్య ఆంధ్రప్రదేశ్ వాసులకు మరింత అన్యాయమే జరుగుతుంది. కేంద్రం ఎత్తుగడలు స్పష్టమైనాక కూడా కీలకం ఎక్కడుందో తెలియనట్టే ప్రాంతాల మధ్య పంతాలు పెంచుకోవడం అర్థ రహితం. రాజ్యాంగ రీత్యా రాజకీయంగా రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయమయ్యేలా చూడాలి గాని ఈ సమస్యను వారాలు రోజుల గడువుతో ముడిపెట్టినందువల్ల ఫలితం లేదు.

అలాగే కేంద్ర కాంగ్రెస్ వాణిని మరెవరో వినిపించవలసిన అవసరమూ లేదు. జైపాల్‌రెడ్డి, ఆజాద్, చిదంబరం, ప్రణబ్‌ముఖర్జీ ఆఖరుకు ప్రధాని కూడా కుండబద్దలు కొట్టి చెబుతుంటే ఇక్కడ వ్యూహాగానాలు చేయనవసరం లేదు. వాస్తవిక దృక్పథంతో తమ లక్ష్యాన్ని ఎలా ముందుకు తీసుకుపోవాలో ఎవరైనా ఆలోచించుకోవచ్చు గాని అఘాయిత్యపు మాటల వల్ల కలిగేది మాత్రం అనర్థమే.

- - తెలకపల్లి రవి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి