మారిషస్ లొ జరిగిన తెలుగు భాషా బ్రహ్మోత్సవాల సందర్భముగా నేను రాసి, పంపిన వ్యాసము.
ఎందఱో మహానుభావులు అందరికీ మారిషస్ దీవి లో జరుగుతున్నా తెలుగు భాషా బ్రహ్మోత్సవములకు విచ్చేసిన వారందరికీ వందనములు.
ఈ రోజు అనగా ఖర నామ సంవత్సరం శ్రావణ మాసం కృష్ణ పక్షం చతుర్దశి తిథి నాడు అనగా 28 వ తారీఖు ఆగష్టు 2011 న తెలుగు బ్రహ్మోత్సవములు మారిషస్ దీవిలో జరుపుకోవడం ఎంతో ఆనందదాయకమైన విషయం. ఈ సందర్భముగా మారిషస్ ద్వీపానికి విచ్చేసిన విశేష అతిథి శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారికి మరియూ వేదిక నలంకరించిన పెద్దలు అందరికీ నా నమస్సుమాంజలులు.
1. తెలుగు భాష యొక్క ఔన్నత్యము
తేనే కన్నా తీయనైన, పంచదారకన్నా మిన్ననైన, పనస తొనల వలె తీయదనము కలిగిన తెలుగు భాష యొక్క ఔన్నత్యము గురించి ఎంత చెప్పిన తక్కువే. ప్రపంచ భాషలలో తెలుగు భాష 14 వ స్థానములోను,భారత దేశములో 4 వ స్థానము లోను ఉంది. ప్రపంచం మొత్తం మీద కనీసము 10.0 కోట్ల ప్రజలు తెలుగులో మాట్లాడగలరు. భారత దేశములోని ఒక్క ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోనే 8.50 కోట్ల ప్రజలు తెలుగు మాట్లాడుతారు. ఇదీ తెలుగు భాష యొక్క గొప్పదనం. తెలుగు భాష గురించి కృషి చేసిన వారు ఎందఱో మహానుభావులు. తెలుగు భాషలో మొత్తం 52 అక్షరములు/శబ్దములు ఉన్నాయి.అందులో 16 అచ్చులు, 36 హల్లులు. ఈ 52 అక్షరాల వలన తెలుగు భాష పరిపూర్ణమైన భాషగా వర్ధిల్లుతోంది. ఇంత చక్కటి భాషని మాట్లాడే వారుగా పుట్టడం నిజంగా మన అదృష్టంగా భావించాలి. దక్షిణ భారత దేశములోని ద్రావిడ భాషలలో ఎక్కువ మంది మాట్లాడే భాష తెలుగు భాష.
తెలుగు భాష లో మాట్లాడితే ఆ భాష ఒక పాటలాగా సాగిపోతూ ఉంటుంది. ఒక తెలుగు పద్యాన్ని చదివితే అందులోని విరుపులు,సొగసులూ చెప్పనలవి కాదు. అందుచేతనే దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీ కృష్ణ దేవరాయల చే పొగడబడి ఆ భాష లోనే తన కావ్యం ఆముక్తమాల్యద రాసారు.
2. తెలుగు సంస్కృతీ సాంప్రదాయాలు:
ఒక ప్రాంతపు కట్టు బొట్టు, ఆహారపు అలవాట్లు,పుట్టినప్పటి నుండి మరణించే వరకూ చేసే సంస్కారాలు, అక్కడి పండుగలు,ఆచార వ్యవహారాలూ మొదలైనవి అన్నీ సంస్కృతీ సాంప్రదాయాల కిందికే వస్తాయి.తెలుగు వారిలో అనేక మతాల వారు ఉన్నారు. వారి వారి మత ఆచారాలు సాంప్రదాయాలు ఉన్నాయి. కానీ ఎక్కువమంది హిందువులు అగుట చేత ముఖ్యంగా తెలుగు హిందువుల గురించి చెప్పుకొందాము.
ఒక తెలుగువాడిని లేదా ఒక తెలుగు స్త్రీ ని పోల్చుకోవడం ఎలా? వారి కట్టు బొట్టూ ఏమిటి ఇవన్నీ చెప్పేదే సాంప్రదాయము.మగవారు పంచ లేదా ధోవతి కట్టుకొని, జుబ్బా వేసుకొని భుజం పై కండువా లేదా అంగవస్త్రం వేసుకొంటారు. స్త్రీలు ముఖ్యముగా చీర (saree) తో పాటుగా రవిక లేదా జాకెట్టు వేసుకొంటారు. స్త్రీ పురుషులు ఇరువురూ ముఖమున కుంకుమ పెట్టుకొంటారు. బాలికలు లంగా, ఓణి, దాని పై రవిక వేసుకొంటారు. బాలలకు వేరే విధమైన కట్టు లేదు కానీ పెద్దవారిలాగే ధోవతి లేదా పంచ, పైన చొక్కా లేదా జుబ్బా తొడుగుతారు.
ఇంక తెలుగువారి ఆహారపు అలవాట్ల లో వారు వందే పిండివంటలు మొదలైనవి చూస్తే వాటిలో బొబ్బట్లు, బూరెలు, పరవాన్నం,పులిహోర, గారెలు, ఆవడలు (curd vada), అట్టు, సంకటి, పేలాలు, ఊరగాయ పచ్చళ్లు ఇంక ఎన్నో ఎన్నెన్నో పదార్థాలు తెలుగువారి సొత్తు. ఈ విషయం బయటి ప్రాంతాల వారికి చాలా మందికి తెలియదు. కానీ పులిహోర బొబ్బట్లు చేసేరు అంటే, వాళ్లు తెలుగువారై ఉంటారని ఘంటాపధంగా చెప్పగలను. పచ్చళ్లు పెట్టడంలో ఆంధ్రా వారికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అందులోనూ ఆవకాయ పచ్చడి. ఇది జాతి, కుల, మత భేదం లేకుండా అన్ని ప్రాంతాల వారు పెడతారు.
పుట్టినప్పటి నుండి రకరకాల సంస్కారాలు తెలుగు వారిలో ఉన్నాయి. మిగిలిన భాషల వారి తో ఈ సంస్కారాలే తెలుగు వారిని వేరు చేస్తున్నాయి. వాటిలో ముఖ్యంగా నామకరణం, డోలా రోహణం లేదా ఉయ్యాలలో వేయడం, అన్నప్రాసన, కేశ ఖండన లేదా పుట్టు వెంట్రుకలు తీయించుట,అక్షరాభ్యాసము లేదా విద్యాభ్యాసము చేయించుట, ఉపనయనము, వివాహ ప్రక్రియలో తెలుగు వారిది వేరైనా శైలి, మరణించిన తరువాత కర్మ కాండలు తదుపరి మాసికములు తో పాటుగా సంవత్సరీకము ఆ తదుపరి ప్రతి స్సంవత్సరమూ శ్రాద్ధము లేదా తద్దినము పెట్టుట మొదలైనవి. ఇందులో వివాహ మరణ సమయాలలో పాటించే సాంప్రదాయాలు వేరు వేరు కులాల వారికి వేరు విధంగా ఉంటాయి. అది వారి వారి కుటుంబ సాంప్రదాయాలు, కుల కట్టుబాట్లతో మారుతుంది కానీ మంగళ సూత్రధారణ, జీలకర్ర బెల్లం నెత్తిమీద పెట్టుట, తలంబ్రాలు పోయుట (తలంబ్రాలు తెలుగు వారి సొంతం) మాత్రం మారవు.
ఇంక తెలుగు వారి పండుగల లో ముఖ్యమైనవి ఉగాది అంటే ఇది నూతన సంవత్సర ప్రారంభ దినము. ఆ రోజున ఉగాది పచ్చడి అనగా ఆరు రుచులు (షడ్రుచులు) అందులో వేప పూవు, మామిడి పిందె ముక్కలు, బెల్లము, చెరకుగడ,ఉప్పు, కారము, చింతపండు వేస్తారు. వీటివలన ఆరు రుచులు అనగా తీపి, కారము, చేదు,వగరు, పులుపు కలిసి ఆ సంవత్సరమంతయూ ఈ షడ్రుచులతో సాగాలని కాంక్షిస్తారు. మిగిలిన పండుగలలో బతుకమ్మ,బోనాలు, రాఖీ పూర్ణిమ, హోలీ (తెలంగాణా ప్రాంతములో జరుపుతారు), దసరా,సంక్రాంతి, జన్మాష్టమి, వినాయక చతుర్ధి, దీపావళి ఇంకా అనేక రకాలైన ప్రాంతీయ పండుగలు జరుపుకొంటారు.
ఈ పైన చెప్పిన వాటిలో చాలా వరకూ సమయాభావము వలన మరియూ వీలు కానీ పరిస్థితి వలన కుదించుట జరిగినది.
3. తెలుగు సాహిత్యం:
తెలుగు సాహితి ప్రపంచములో సేద్యము చేసిన వారు,చేస్తున్నవారు చాలా మందే ఉన్నారు. తెలుగు సాహిత్యములో పద్య సాహిత్యము మారియో గద్య సాహిత్యములు కలగలిసి ఉన్నాయి. 11 వ శతాబ్దము నాటి నన్నయ్య నుండి నేటి వరకూ ఎందఱో కవులు పద్య కవిత్వానికి ప్రాణము పోసి నడిపిస్తున్నారు. పద్య కవిత్వములో మహాభారతాన్ని తెనిగించిన కవిత్రయము నన్నయ, తిక్కన, మరియూ ఎఱ్ఱన. వీరి మువ్వురులో నన్నయ ను ఆదికవిగా అభివర్ణించారు. భాగవతమును బమ్మెర పోతన తెనిగించారు. పద్య కవిత్వములో శ్రీనాథుడు రచించిన శృంగార నైషధము చాలా ముఖ్యమైనది. వీరే కాక పద కవితా పితామహుడు తాళ్ళపాక అన్నమయ్య, భక్త రామదాసు, భక్తీ తో శ్రీ రామచంద్రుని పై అనేక కీర్తనలు రచించిన త్యాగయ్య, వేములవాడ భీమ కవి మొదలైన వారి తో పాటుగా అష్ట దిగ్గజముల పేరుతొ అల్లసాని పెద్దన మొదలైన ఎనిమిదిమంది మహా కవులు శ్రీ కృష్ణదేవరాయల ఆస్థానములో ఉండేవారు.తదనంతర కాలములో ఏనుగు లక్ష్మణ కవి, వేమన 14 వ శతాబ్ది లోను, బద్దెన 13 వ శతాబ్దములోను రాసిన వేమన శతకము, సుమతీ శతకము ఈ నాటికి ప్రజల నోళ్ళలో నానుతూనే ఉన్నాయి. వీరితో పాటు ఎందఱో శతకకర్తలు తెలుగు భూమిలో పుట్టి సేవ చేసిన వారే. వీరితో పాటు పరవస్తు చిన్నయ సూరి రాసిన బాల వ్యాకరణము ఒక ప్రామాణిక వ్యాకరణ శాస్త్రం. దానితో పాటే ఆయన రాసిన మిత్ర లాభము, మిత్ర భేదము అనే పంచతంత్ర కథలు జన బాహుళ్యంలో చొచ్చుకొని పోయి వారి జీవితాలలో కావలసిన విజ్ఞానాన్ని అందిస్తున్నాయి. తరువాత శ్రీ గురజాడ వెంకట అప్పారావు, విశ్వనాథ సత్యనారాయణ, సురవరం ప్రతాప రెడ్డి, గుఱ్ఱం జాషువ, దాశరథి రంగాచార్య, C.నారాయణ రెడ్డి, శ్రీరంగం శ్రీనివాసరావు, దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి, శత శతావధాన ద్వయం తిరుపతి వెంకట కవులు,కొప్పరపు కవులు, కోట సుందర కవులు, స్వర్గీయ ప్రధాన మంత్రి పాములపర్తి వేంకట నరసింహారావు, బోయి భీమన్న వీరందరూ తెలుగు సాహిత్యానికి ఆణిముత్యాల వంటి వారు.
వీరితో పాటుగా ఆధునిక సాహితీ ప్రపంచములో సహస్రావధానులు శ్రీ గరికపాటి నరసింహారావు (మహా సహస్రావధాని), శ్రీ మేడసాని మోహన్, శ్రీ మాడుగుల నాగ ఫణి శర్మ వీరితో పాటుగా శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, చాగంటి కోటేశ్వర రావు, రాళ్లబండి కవితా ప్రసాద్, ద్వానా శాస్త్రి, నాకు తెలిసిన చాలామందిని ఇక్కడ ఉటంకించాలేక పోవుచున్నాను వీరంతా సాహితి సేద్యాన్ని చేస్తున్నారు. తెలుగులో నానీలు మాజీ ఉపకులపతి శ్రీ గోపి, తెలుగు సామెతలను ప్రాచుర్యం లోకి తెచ్చిన ఆచార్య కసిరెడ్డి వెంకట రెడ్డి, సినీ గేయకర్తలుగా పేరు తెచ్చుకొన్న వేటూరి, వీటూరి, జాలాది, కొసరాజు,ఆరుద్ర, సిరివెన్నెల సీతా రామశాస్త్రి,గోరేటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ వీరితో పాటుగా పేరు పేరున చెప్పలేకపోయిన ఎందఱో మహానుభావులు సాహిత్యానికి తమ వంతు సాయం చేస్తున్నవారే.
పురుషులతో పాటుగా కవయిత్రులు కుమ్మరి మొల్ల, ముద్దు పళని, వెంగమాంబల పాత్ర ఎన్నదగినది. వీరితో పాటుగా నేటి కవయిత్రులు మరియూ నవలా రచయిత్రులు ముప్పాళ్ళ రంగనాయకమ్మ, లత, శ్రీమతి లక్ష్మీ పార్వతి, యద్దనపూడి సులోచనారాణి తెలుగు సాహిత్యంలో పేరు తెచ్చుకోన్నవారే. వీరే కాక ఎంతోమంది కవయిత్రులు తమ రచనలతో తెలుగు వారిని మెప్పిస్తున్నారు.
4. తెలుగు యొక్క విశిష్టత:
తెలుగు భాష యొక్క విశిష్టత గురించి చెప్పేటప్పుడు తెలుగులోని సాహితీ ప్రక్రియల గురించి తెలుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. అందులో పద్యం, గద్యం, కథలు, నాటికలు, నాటకములు,అవధానములు, నానీలు, గేయ కవితలు, భక్తి పాటలు, నవలలు మొదలైనవి.
ఇందులో విశిష్టముగా పేర్కొనవలసినది అవధానము గురించి. ఈ అవధాన ప్రక్రియ ప్రపంచములో ఏ భాషలోను లేదు. ఇందులో మూడు రకములు ఉన్నాయి. అవి:
1. అష్టావధానము
2. శతావధానము
3. సహస్రావధానము.
ఈ మూడు ప్రక్రియల లోనూ అవధానము చేసే వారిని అవధాని అంటారు. ఆ అవధానిని అష్టావధానములో ఎనమండుగురు పృచ్చకులు అంటే ప్రశ్నలు సంధించేవారు ఉంటారు. అవధాని ఈ ఎనమండుగురూ వేసిన ప్రశ్నలకు ఏకకాలములో సమాధానము చెప్పి మెప్పిస్తారు. ఆఖరున ఆ ఎనమండుగురి కీ చెప్పిన సమాధానాలు తిరిగి వాళ్లు అడిగిన క్రమం లోనే చెప్తారు.
ఈ విధముగా కొద్ది మార్పులతో శతావధానం మరియూ సహస్రావధానము చేసి ఆఖరులో ప్రుచ్చకులందరికి వారి వారి పద్యాలనూ మొదలైనవి తిరిగి ఒప్ప చెప్తారు. ఇది మన తెలుగు వారు గర్వంగా చెప్పుకొనే విశిష్ట ప్రక్రియ.
ఈ అవధాన ప్రక్రియలో పేరుమోసిన వారిలో తిరుపతి వేంకట కవులు, కొప్పరపు కవులు, కోట సుందర కవులు, వేంకట పార్వతీశ కవులు చేసేవారు. ప్రస్తుతం మన సమకాలీనులు అయిన వారు శ్రీ మేడసాని మోహన్, శ్రీ గరికపాటి నరసింహారావు, శ్రీ మాడుగుల నాగ ఫణి శర్మ,రాళ్ళబండి కవితా ప్రసాద్, వద్దిపర్తి పద్మాకర్ మొదలైనవారు మనతో ఉన్నందుకు తెలుగు వానిగా గర్వ పడుతున్నాను.
5. తెలుగు ప్రపంచ వ్యాప్తము:
భారత పుణ్య భూమి నుండి తెలుగు వారు అనేక మంది విదేశాలలో స్థిరపడి తెలుగు భాష వ్యాప్తి కి ఎంతో కృషి చేస్తున్నారు.చాలామంది తెలుగు వారు అమెరికా, యూరోప్, ఆసియా, ఆఫ్రికా, అన్ని ఖండాలలోనూ స్థిరపడ్డారు. కానీ వాళ్లు తమ తెలుగుదనాన్ని మరిచిపోకుండా తమ వ్యక్తిత్వాన్ని, తమ సంస్కృతి సంప్రదాయాలని గౌరవిస్తూ, పాటిస్తూ ఉన్నారు. కొన్ని తరాల క్రిందట వెళ్లి స్థిరపడ్డ వారి తరువాతి తరముల వారు కూడా ఆ సంప్రదాయాలని పాటిస్తూ తమదైన శైలి లో తెలుగు సంస్కృతికి,తెలుగు భాషకు సేవ చేస్తున్నారు.
6. మారిషస్ లో తెలుగు వారి కృషి:
తరాల క్రిందట మారిషస్ తరలిపోయినవారు చాలా మంది మారిషస్ లో ఉన్నారు. వారు తమ ప్రత్యేకతను సాంప్రదాయములు, కవిత గోష్టులు, కవులు, పండితులు, కళాకారులని పిలిచి సన్మానించడము మొదలైన కార్యక్రమాలు చేస్తూ మారిషస్ లో ఒక ఆకాశవాణి కేంద్రాన్ని, ఒక దూరదర్శన కేంద్రాన్ని నడుప్తున్నారు.
మారిషస్ లో ఉన్న తెలుగువారికి తెలుగు భాష ఒక విషయం గా స్నాతక, స్నాతకోత్తర, డిప్లొమాలని అక్కడి విశ్వవిద్యాలయములో ప్రవేశ పెట్టడానికి చాలా కృషి చేసారు. అంతే కాకుండా సాహితీ మరియూ ఆధ్యాత్మిక సంస్థలను స్థాపించి వాటి ద్వారా తెలుగు కార్యక్రమములు ఏర్పాటు చేస్తూ తెలుగు భాషకు ఇతోధికం గా పాటుపడుతున్నారు. అక్కడి వారిలో శ్రీ సంజీవ నరసింహ అప్పుడూ గారి లాంటి వారు తెలుగు బ్రహ్మోత్సవములను నిర్వహిస్తూ తెలుగు భాషా అభివృద్ధికి పాటుపడుతున్నారు. అక్కడి వారు రంగవల్లులు, భజనలు, త్యాగరాజ, అన్నమయ్య కీర్తనలు వ్యాప్తి చేస్తున్నారు. తెలుగు భాషా అభివృద్ది కి వారు చేస్తున్న సేవను మనం వేనోళ్ళ కీర్తిద్దాము.
ఆంధ్ర, తెలుగు శబ్దములు రెండూ పర్యాయపదాలే!
రిప్లయితొలగించండిఆరవ ఆంధ్ర మహాసభ: నిజామాబాదు: 3వ బహమన్ 1349 సాయంత్రం
శ్రీ మందుముల నర్శింగరావు: అధ్యక్షుడు
అధ్యక్షోపన్యాసమునుండి
ఈ వుద్యమముయొక్క విస్తీర్ణత, విశాలతనుగురించి విమర్శించు సందర్భములో, విమర్శకుడు తెలంగానోద్యమము అనుటకు మారుగా ఆంధ్రోద్యమమను పేరిట ఎందుకు వ్యవహరింపబడవలయునని ప్రశ్నించవచ్చును. ఈ విమర్శకుడు తెలంగానా అను పేరును అనుశృతిగా వినుచున్నందున ఇట్టి ప్రశ్న సవ్యముగా అగుపడుచున్నది. ఈ ప్రశ్నకు సమాధానము చెప్పెదను. "ఆంధ్ర" అను పదము చాల పురాతనమైనది. ఋగ్వేదములోకూడ వాడబడినది. వింధ్య పర్వతములకు దక్షిణ దిగ్భాగములో నివసించుచుండిన జాతుల ప్రశంస సందర్భములో ఆంధ్రుల ప్రశంసకూడ వచ్చినది. ఈ ప్రదేశమునకు ఆర్యులు దండకారణ్యమనియు, రాకపోకల సౌలభ్యము లేక అరణ్యప్రదేశమైనందున అంధకార ప్రదేశమనియు, యీ భాగములో నివసించుచున్నవారిని ఆంధ్రులనియు వ్యవహరించిరని చరిత్రకారులు చెప్పుచున్నారు. హైందవుల పవిత్రమైన పురాణములగు రామాయణ, భారతాదు లలోకూడ ఆంధ్రుల ప్రశంస వచ్చినది.
వేదకాలములో, పురాణ కాలములో, యీ దండకారణ్య ప్రదేశములో నివసించువారు నాగరికత లేని జాతివారో ఏమో? కాని, అశోక సార్వభౌముని కాలములోమాత్రము, ఆంధ్రులు మహోన్నత నాగరికత జెందినట్లు చరిత్ర వుద్ఘోషించుచున్నది. అశోకుని పితామహుడును, మౌర్యవంశ మూలపురుషుడునగు, చంద్రగుప్తుని దర్బారునందుండిన మెగాస్తనీస్ వ్రాసిన వ్రాతలవల్ల ఆంధ్ర సామ్రాజ్యమునకు ముప్పది దుర్గములు, లక్ష పదాతులు, రెండువేల అశ్వ దళము, ఒక వేయి ఏనుంగులు వున్నట్లు తెలియుచున్నది.
అశోక మహారాజు కాలధర్మము నొందిన అచిరకాలములోనే ఉత్తర హిందూస్తానములో మౌర్యవంశము అంతమొందినది. అప్పుడు దక్షిణ హిందూస్తానములో ఆంధ్ర సామ్రాజ్యము విజృంభించినది. ఈ సామ్రాజ్యము తూర్పు సముద్రమునుండి పశ్చిమ సముద్రమువరకు వ్యాపించి, నాలుగు వందల సంవత్సరములవరకు దక్షిణ హిందూస్తానమునేకాక, ఉత్తర హిందూస్తానములో పెద్ద భాగమును తన పరిపాలనలో యిమిడ్చుకొనినది. ఆ కాలమున దక్షిణ హిందూస్తానము మహోన్నత అభ్యుదయము గాంచినది. సముద్రము దాటిన ప్రదేశములతో వర్తక వ్యాపార సంబంధము కలిగించుకొనుటతో ఆంధ్రులకు ప్రత్యేక విశేషత కలిగినది. ఆంధ్రులు ఓడల నిర్మాణములోను, వానిని నడిపించుటలోను ప్రఖ్యాతి బడసిరి. అప్పటి చరిత్రకారులు వ్రాసిన వ్రాతలవల్ల దక్షిణ హిందూస్తానము లోని యీ ఆంధ్రులే క్రీ. శ. లో పూర్వద్వీపములకు వలసపోయి, యావద్భారతదేశమునకై మార్గదర్శులై మలయా, జావా, సుమత్రా, బర్మా, సియాం మరియు ఇండోచైనాలో స్థిరనివాస మేర్పరచుకొని భారతీయ సభ్యత, భారతీయ సాహిత్యము, చిత్రకళలు మున్నగువానిని ఆయాప్రదేశమలలో వ్యాపింప జేసిరి.
మహాశయులారా! పురాతన చారిత్రక గాథలతో తమ కాలయాపనము చేయ నుద్దేశించలేదు. కాని పూర్వమొకసారి ఆంధ్ర దేశముతో వ్యవహరింపబడుచున్న దేశము తెలంగానా [గా] ఎట్లు పరివర్తనము పొందినదో చెప్పదలచినాను. చంద్రవంశరాజగు కళింగరాజు యీ దేశమునకు రాజు కావడముతోనే [యిది] కళింగ దేశమని వ్యవహరింపబడుచు వచ్చెను. క్రమక్రమేణ 'కళింగము' 'త్రికళింగము' గా వ్యవహరింపబడెను. త్రికళింగము మారి త్రిలింగమైనదని చరిత్రకారులు చెప్పుదురు. చాళుక్యుల, కాకతీయుల నాటి చారిత్రక నిదర్శనములవల్ల త్రిలింగ దేశమని వాడబడినట్లు తెలియుచున్నది. ఇట్లు ఆంధ్ర దేశము, త్రిలింగ దేశము పర్యాయపదములుగా వ్యవహరించబడుచు వచ్చెను. ఆంధ్ర పండితుల అభిప్రాయముప్రకారము త్రిలింగములగు శ్రీశైలము, భీమేశ్వరము (లేక ద్రాక్షారామము), కాళేశ్వరముల లోని మధ్య ప్రదేశము త్రిలింగ దేశమని తెలియుచున్నది. ఈ ప్రదేశము యొక్క జనుల భాష తెలుగు. ఈ భాష ఆధారమున తెలుగు దేశమైనది. కాన తెలుగు దేశము, ఆంధ్ర దేశము ఏకార్థమును తెలుపునవి. "తెనుగు" "ఆంధ్రము" పర్యాయ పదములు – తెనుగు పండితులు గ్రాంథిక భాషలో "ఆంధ్ర" పదము వుపయోగపరచితే, సామాన్యులు వ్యవహారిక భాషలో "తెనుగు" పదము ఉపయోగించుచుందురు. తెనుగు, ఆంధ్రము – తెనుగు దేశము, ఆంధ్ర దేశములను పదములలో వ్యత్యాసము ఏమియు లేదు. ఈ ఉద్యమమునకు జాతి, సంతతి, మతములతో సంబంధము లేదు. ఈ దేశముననే జనించి, ఇక్కడనే జీవనోపాయముల సంపాదించుకొని, తుదకు యిక్కడనే మృతి నొందనున్న వారైనందున వారందరు ఆంధ్రులే. వంగదేశములో నుండువారు వంగీయులు, సింధుదేశములో నుండువారు సైంధవులు, పాంచాలదేశములో నుండువారు పాంచాలీయులని అనుట లేదా? అటులనే ఆంధ్రదేశములో నుండువారిని ఆంధ్రులనుటలో దోషమేమి? ఆంధ్రులని ఉచ్చరించినమాత్రమున భయమొందుట ఎందులకు? ఈ యుద్యమము పవిత్రమైన ఒక సూబాకు సంబంధించిన ఉద్యమము. సూబాలో నివసించు యావన్మానవకోటి అభ్యుదయమునకై యేర్పడినది.
ధన్యవాదములు మల్లికార్జున శర్మ గారు. మీరు చెప్పిన వివరములు నాకు ఇక ముందు రాయబోయే బ్లాగులకు ఉపయోగపడుతుంది. మీ అనుమతితో.
రిప్లయితొలగించండిఎన్నో తెలవని, తెలియాల్సిన విషయాలను ఎంతో చక్కగా వివరించినందుకు నా హృదయపూర్వక నమస్కారములు.
రిప్లయితొలగించండి@రాల్లభండి రవీంద్రనాథ్ గారు & ఐ .మ్. శర్మ గారు..