22, ఆగస్టు 2011, సోమవారం

సకల వికల సమ్మె


ఆగష్టు ౧౭ (17) తర్వాత ఏమవుతుందీ రాష్ట్రానికి అనే ఒక గొప్ప ప్రశ్న రాష్ట్ర ప్రచారమాధ్యమాలకి ఉదయించింది మన తెలంగాణవాదుల (ఉరఫ్ తెలబాన్) హడావుడి చూసి. ఇక కొత్తబిచ్చగాడు పొద్దెరగడన్న రీతిలో ఊకదంపుడు, వాటి ఆస్థాన విద్వాంసుల చొప్పదండు విశ్లేషణలతో సామాన్య జనాన్ని హడలగొట్టి మూడుచెరువుల నీళ్ళు తాగించేసినంత పనిచేశాయి. పాపం నీళ్ళు దొరకని హైదరాబాదువారి పరిస్థితి మరీ దారుణం. మురికి మూసీనీళ్ళు, గబ్బులేచిపోయిన హుస్సేన్ సాగరునీళ్ళూ తాగవలసిన అగత్యంపట్టబోతోందా అని మరీ హడలి చచ్చారు. అప్పుడెప్పుడో మన గవర్నరు గారిని ఏదో అలవాటుగా అడిగేశారు కడుపుబ్బరం ఆగలేక డిశెంబరు ౩౧ (31) తర్వాత ఏమవుతుందీ అని. ఆయనేమో పరమ భక్తుడు వీళ్ళకి బెదురుతాడా! తాపీగా ఆఁ! ఏముంది జనవరి ౧ (1) వస్తుంది అన్నాడు. జనవరి ౧ (1) ఏమి కర్మ ఏకంగా ఆగష్టే వచ్చేసింది.

సరిగ్గా ఇప్పుడు కూడా మనం ఈ ఆగష్టు ౧౭ (17) తర్వాత ఏమవుతుందీ అనే ప్రశ్నకు హడలి జడుపుజ్వరాలూ అవి తెచ్చుకోకుండా నిమ్మళంగా జరిగేది జరక్కమానదని కర్మసిద్ధాంతాన్ని నమ్ముక్కూచుందాం. నేనామధ్య హైదరాబాదులో ఉండే నా పరిచయస్తుడొకరికి ఇలాగే ఙ్ఞానబోధ చెయ్యబోయాను. అయినా వింటేనా?!! నేను హైదరాబాదులో ఉద్యోగం వెలగబెట్టే రోజుల్లో మా హాస్టలు యజమాని ఆయన. కరీంనగర్ జిల్లా నుంచి పొట్టకూటికోసం హైదరాబాదొచ్చి ఇలా హాస్టలు పెట్టుకుని కుటుంబాన్ని నడుపుకుంటున్నాడు. వయసురీత్యా నాకూ ఆయనకీ పదేళ్ళు తేడా. నేనూ ఆఫీసునుంచీ రాగానే పనీపాటా ఏమీలేవు కనుక పిచ్చాపాటీ మాట్లాడుకునేవాళ్ళం. నాకోసం ప్రత్యేకంగా కాకపోయినా కరీంనగర్ వంటకం గుంటపొంగనాలు (రుచికి దిబ్బరొట్టెలాగా, ఆకారానికి పునుగుల్లాఉంటాయి) ఎక్కువగా తయారవుతూండేవి అక్కడ. అవి తింటూ వాళ్ళ మూడేళ్ళ చంటిదానితో ఆడుకుంటూ లోకవ్యవహారాలను మా సూక్ష్మబుద్ధితో విచారించి తీర్పులిచ్చేయటం మాకు అలవాటు. మీ తీర్పులు ఎవడు వినొచ్చాడు అనడక్కండి. ఏదో మా కాలక్షేపం మాది.

మా హాస్టలుకెదురుగా ఓ ముసలి మొగుడూ పెళ్ళాల కుటుంబం ఉండేది. కూతురు, అల్లుడూ పిల్లాడికన్నా వాళ్ళ ఉద్యోగాలనే ఎక్కువ ముద్దుచేస్తుంటారని పాపం ముసలాయన ఫిర్యాదు. ఆప్పుడప్పుడూ ఆయనా చేరేవాడు మాతోటి. ఆయనది విజయవాడ. నాది రాత్రివేళ ఉద్యోగం కనుకా, పగలు నా ఇతర స్నేహితుల ఉద్యోగాలవల్లా మా ముగ్గురికీ ఇలా స్నేహం కుదిరిపోయింది. నేను ఇంగ్లాండు వచ్చినా అప్పుడప్పుడూ ఫోనుచేసుకునేవాళ్ళం. ఈ మధ్య ఇద్దరూ కొన్నిరోజుల వ్యవధిలో హైదరాబాదు విడిచి స్వంత ఊళ్ళకు వెళ్ళిపోదామని నిశ్చయించామని కబురందించారు. అదన్నమాట నేను కాస్త చనువుకొద్దీ ఙ్ఞానబోధ చెయ్యబూనిన సందర్భం.

ద్వాపర యుగాంతం సమయములో యదుకుల నాశనం సంభవించిన సంగతి మనకి తెలిసిందే కదా! అందులో పొడుచుకున్నవారు ఇరువురూ యాదవులే చనిపోయినవారూ యాదవులే ఎవరినని తప్పుపడతాం? అలాగే ఇక్కడా కచరా అనే ముసలం పుట్టి దినదినం దాని ప్రభ మద్యందిన మార్తాండునివలే ఎదిగిపోతూ ఆంధ్రా ద్వేషం అనే సోపానపథం తోడుగా అధికారమనే అందలాన్ని ఎక్కాలని తెగ ఉబలాటపడిపోతుంది. ఇందులో మాత్రం కచ్చితంగా తప్పు ఎవరిదో ఒకరిది కనబడాలన్నట్లు వేరుజాతుల సిద్ధాంతాన్నొకటి కనిపెట్టి జనమ్మీదకి వదిలారు. అది దొరికిన నలభైయేళ్ళ వయసున్న ఉస్మానియా నూత్నయౌవ్వన విద్యార్థులు (నలభయ్యేళ్ళే అని నీకెలా తెలుసురా భడవా అంటే నేను మాత్రం చూశానా పెట్టానా ఏదో ప్రాస బాగుందని వాడేశాను. అయినా అదీ నిజమే అని విశ్వసనీయవర్గాల భోగట్టా!) చెలరేగిపోతున్నారు. దక్షునిశాపం అప్రతిహతం అని జనం అప్పట్లో జడిసి చచ్చినట్లు ఇప్పుడూ ఉస్మానియా అంటే చాలు హైదరాబాదీ గుండె గుభేలుమనటానికి. దిక్కుమాలిన తనానికి స్థానికత ముసుగేసుకునేసి సొంతల్లుడికే (చంద్రుడు) క్షయవ్యాధితో చావమని శాపమిచ్చిన దక్షుడిలా మన ఉస్మానియా కలియుగ దక్షుళ్ళు వీరంగమేస్తూంటే అబ్బ హైదరాబాదు నగరం అంటే చాలు చూసే జనాలకి వెగటుపుట్టి పారిపోవటానికి.

ఉస్మానియాలో చదివిన విద్యార్థులు ఉద్యోగాలకు దరఖాస్తు చేయనవసరమేలేదు అనే గొప్ప పేరు పడటానికి అల్లరిమూకల ఆస్థాన,కుల గురువుల్లా వ్యవహరించే మన పనిచేయని పంతుళ్ళూ ఇతోధికంగా సాయపడిన సంగతి మనమెరిగిందే. ఇప్పుడివన్నీ ఎందుకురా అనే కదా మీ సందేహం అక్కడికే వస్తున్నా. శవరాజకీయాలు, ఆంధ్రా ద్వేషం, వసూళ్ళమత్తు ఇవన్నీ కొంచెం బోరనిపించిందో ఏమో ఈసారి కాస్త వెరైటీగా ఉంటుందని సకల జనుల సమ్మె అని మన తెలంగాణవాద కపిగణం (త్రేత్రాయుగ కపిగణం నన్ను క్షమించుగాక) ముచ్చటపడింది.

ఇప్పుడు మళ్ళీ నా స్నేహితుల దగ్గరికొద్దాం ఇద్దరూ జడిసింది ఈ సమ్మె దెబ్బకే. పాపం ముసలాయన మనవడి చదువు గురించి బెంగపడితే, హాస్టలు యజమాని ఈ గొడవల పుణ్యమాని ఈ మధ్య విద్యార్థులనే (వీళ్ళు నిజమైనవాళ్ళేలెండి) కొన్ని ప్రాణాలు హైదరాబాదు చుట్టుపక్కల చూడకపోవటంవల్ల ఇంకా హైదరాబాదులో ఈగలు తోలుకోవటం ఎందుకులే అని ఈయన కరీంనగరుకు తెలంగాణ ఆయన బెజవాడకి జన్మభూమి ఎక్కేసేరు. ఈ దెబ్బకి భయపడే ఆంధ్రాలో సాధారణంకన్నా రమారమి ౩౦-౪౦ శాతం అధికంగా విద్యార్థుల ప్రవేశాలు జరిగితే తెలంగాణలో గతేడాది ఉన్న ప్రవేశాలకే దిక్కూదివాణం లేదని వినికిడి. వీళ్ళకంటే వెళ్ళినా వాళ్ళవాళ్ళ ఊళ్ళల్లో బతగ్గలమనే ధైర్యం ఉంది వెళ్ళిపోయారు కానీ సొంతూళ్ళకు వెళ్ళనూ లేక ఇక్కడ పనులూ దొరక్క అల్లాడుతున్న జనం ఎంతమందో?

కర్ణుడి చావుకు కారణాలు వంద అన్నట్టు అసలా సమ్మె చేసిందీ పెట్టిందీ ఏమీ లేకపోయినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నాకు తెలిసి హైదరాబాదు వదిలింది ఇద్దరే కానీ తెలియకుండా చాలా ఎక్కువే అని లెక్కలు నొక్కి చెబుతున్నాయి. ఇదికాదూ కూచున్న కొమ్మని నరుక్కున్న కోతి వాలకం అంటే! ఆ సమ్మేదో జరక్కుండానే హైదరాబాదు ఇంత నష్టం చూడాల్సివస్తే ఇక జరిగుంటే ఎంచక్కా హైదరాబాదు రోడ్ల విస్తరణా కార్యక్రమం వాయిదా వేసుకునేదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం!  ఇంకా దేవుడు తెలుగుజాతి పక్షాన ఉండబట్టి సకలాన్ని వికలం చేసే ఈ సమ్మెను వాయిదానో మాన్పించటమో చేశాడు. అయినా మొన్నామధ్య ఇంకేముంది రెండువారాల్లో తెలంగాణ అని ఏ ఢిల్లీ చిలుకో చెప్పిందన్న కచరా మాత్రం  యధావిధిగా తన కార్యక్రమాల్లో తానుండగా ఇతర భజనపరులు విశ్రాంతి తీసుకుంటున్నారు. మొత్తమ్మీద బతుకు భారమయింది మాత్రం సగటు హైదరాబాదీది.


మూలం: కృష్ణవేణీతీరం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి