2, ఆగస్టు 2011, మంగళవారం

ఢిల్లీ మజిలీ కథ

వీక్ పాయింట్, ఆంధ్రభూమి : దుర్యోధనుడు దురదృష్టవంతుడు. శకుని మామను నమ్ముకుని నిండా మునిగాడు. అతడి రోజులు బాగుండి, భారతకాలంలో పి.చిదంబరం పుట్టి సుయోధన్ సర్కారులో మంత్రి అయి ఉంటే ఏ గొడవా ఉండేది కాదు. అరణ్యవాసాలూ, అజ్ఞాతవాసాలంటూ టైములిమిట్లు పెట్టి పాండవులకు కమిట్ కాకుండా మనవాడు ఎంచక్కా ఏకాభిప్రాయం ఠస్సా వేసేవాడు. కౌరవులూ, పాండవులూ మరియు రాజ్యంలోని పిల్లామేకా కలిసి సంపూర్ణ ఏకాభిప్రాయానికి వచ్చి, ఏకగ్రీవ తీర్మానం చేస్తేగాని పాండవులకు ప్రత్యేక రాజ్యం వీలుపడదని కండిషను పెట్టేవాడు. ఏకాభిప్రాయం మాయలేడిని పట్టుకోవటానికి పాండునందనులు హస్తినాపురం చుట్టూ కలియుగాంతందాకా తిరుగుతూనే ఉండేవాళ్లు.ఇప్పుడు తెలంగాణ నేతాశ్రీలు చర్చల తరవాత చర్చల తరవాత చర్చల కోసం ఢిల్లీ చుట్టూ ఆసులో కండెలా తెగతిరుగుతున్నట్టు!

వరమివ్వగలిగిన దేవర అది ఇవ్వకుండా మాట్లాడుదాం రమ్మన్నాడంటే ఇచ్చే ఉద్దేశం లేదనే అర్థం. చర్చలనేవి ఉద్యమాల ఉష్ణోగ్రతను చల్లబరిచే కూలింగ్ ఏర్పాట్లే తప్ప సమస్యను తెగ టార్చే సాధనాలు కానేకావు. ఆ ఉపాయం చల్లనితల్లి ఇందిరాజీ ఏనాడో కనిపెట్టింది. కావాలంటే నాలుగు దశాబ్దాల కింద ‘జై ఆంధ్ర’ ఉద్యమకాలంలోఆంధ్రపత్రిక వేసిన ఊమెన్ కార్టూనును చూడండి. 

గుండ్రంగా ఉండే పట్టాలపై రైలుబండి రవుండ్లు కొడుతుంటుంది. ‘‘ఈ విధంగా ఆడిస్తూ ఉంటే పరిస్థితి చల్లబడుతుంది’’ అని ఇందిరమ్మ ఎవరికో చెబుతుంటుంది.ఇప్పటికీ అదే ఆట. అప్పుడు సందర్భం ‘జై ఆంధ్ర’. ఇప్పుడు ‘జై తెలంగాణ’. అంతే తేడా.

రాజుగారు అట్టహాసంగా ఊరేగుతుంటారు. ఆయన ఒంటిమీద బట్టల్లేవు. ఆ సంగతి చూసేవారందరికీ తెలుసు. అయినా ఆ మాట అంటే తమ తల్లి రంకు ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో ఎవరూ పైకి తేలరు.పైగా రాజుగారి దేవతా వస్త్రాలు మహాదివ్యంగా ఉన్నాయని పోటీలు పడి పొగిడేస్తుంటారు - కాశీ మజిలీ కథలో.ఇప్పుడు నడుస్తున్న ఢిల్లీ మజిలీకథ కూడా అదే టైపు.


తెలంగాణ ఇచ్చే ఉద్దేశం దేశానే్నలే వారికి ఏ కోశానా లేదు. నిజంగా ఇవ్వాలనుకుంటే వారూ వీరూ కలిసి ఏకాభిప్రాయానికి వచ్చి అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయాలన్న అసాధ్యపు కండిషను నడమంత్రంగా పెట్టేవారే కాదు. కక్షిదారులిద్దరూ ఏకాభిప్రాయానికి వస్తేగానీ కుదరదంటే ప్రపంచంలో ఏ తగవూ ఎప్పటికీ తేలదు. అన్నివర్గాలతో చర్చించి, ఏమి చేయాలో చెప్పడానికే ఒక హైలెవెల్ కమిటీని వేశారు. సంవత్సరంపాటు తెగ తిరిగి,రెండున్నర కోట్ల ప్రజాధనం ఖర్చు పెట్టి ఆ కమిటీ పంచ పాండవులు -మంచంకోళ్లలా ఆరు సూచనలు చేసి, అందులో మూడు పనికిరానివని తానే తేల్చి... బెస్టు, సెకండ్ బెస్టు అంటూ చివరికి రెండు దారులు చూపాక ఆ రెంటిలో ఏది మేలన్నదే కేంద్ర సర్కారు తనకు తాను తేల్చుకోవలసింది. ఆ పని చేయకుండా, మళ్లీ చర్చలంటూ కథ మొదటికి తెచ్చి, తమ పార్టీలోనే ఏకాభిప్రాయం లేదన్న సంగతి వాటంగా దాటవేసి, మిగతా అన్ని పార్టీల్లో, అన్ని ప్రాంతాల్లో తలలు పూర్తిగా కలిస్తేగానీ అడుగు ముందుకు వేసేది లేదని మొరాయించటాన్ని బట్టే తెలంగాణ ఇంతే సంగతులని మెడమీద తలకాయ ఉన్న ప్రతివాడికీ అర్థమైంది. అయినా ఆ సంగతి పెద్దమనుషులెవరూ పైకి చెప్పరు. చర్చిస్తున్నాం...చర్చిస్తాం... ఇంకా ఇంకా చర్చిస్తూనే ఉంటాం అని నమ్మకంగా చెబుతూనే ఉంటారు. కర్ణపిశాచి చెప్పింది...రెండు వారాల్లో ప్రకటన వస్తుంది. రెండు నెలల్లో తెలంగాణ ఉరికొచ్చేస్తుంది అంటూ తెలంగాణ పిట్టలదొర లొట్టలు వేస్తూనే ఉంటాడు. జయశంకర్ సారు రాసిచ్చిన ప్రకారం తెలంగాణను ఇచ్చేస్తున్నామంటూ పార్లమెంటు ముందు చిలకలా పలికి, ఆ వెంటనే సీమాంధ్రసార్లు వద్దన్న ప్రకారం నాలుక మడతవేసి, మాటమార్చి, అదీ రైటే, ఇదీ రైటే, మేము తాంబూలాలిచ్చాక మీరు తన్నుకు చావలసిందేనని అరవ చిదంబరం పార్టీల, ప్రాంతాల జుట్టూ జుట్టూ ముడివేసి తమాషా చూస్తూనే ఉంటాడు. నేను కాస్త ఆలస్యంగా వచ్చాను కాబట్టి చిదంబరం డిసెంబరు 9న అలా అన్నాడు; నేనే ఉంటే అంతదాకా రానిచ్చేవాడిని కానని బడాయిలాడిన ప్రణబ్‌బాబు నల్లరాయిలా తాను ఉండీ వ్యవహారాన్నిచిక్కుముడిమీద ముడిని వేయిస్తూనే ఉంటాడు. 

2004లో రాజశేఖరరెడ్డి వద్దు వద్దని మొత్తుకున్నా వినకుండా దగ్గరుండి కాంగ్రెసు - తెరాసల ఎన్నికల కాంట్రాక్టు మారేజికి పౌరోహిత్యం వహించి, తెలంగాణకు ఆశలు రేపిన గులాంనబీ గారు సీమాంధ్రులు ఒప్పుకోకుంటే తెలంగాణ ఎలా వస్తుందని అడ్డం తిరిగి ప్రశస్తమైన మొండిచెయ్యి చూపిస్తూనే ఉంటారు. తెలంగాణ వారి పవర్ పాయింట్ ప్రజంటేషన్లకూ, సీమాంధ్ర వారి ప్రజంటేషన్లకూ సమానంగా ముగ్ధులై ‘‘ఔనా, నిజమేనా, పాపం మీకు అంత అన్యాయం జరిగిందా’’ అని బోలెడు ఆశ్చర్యం కుమ్మరిస్తూనే ఉంటారు. మీరంతా శతాబ్దాలపాటు కలిసుండాలని చెబుతూనే రాయలరాజ్యాన్నీ, మన్యం రాష్ట్రాన్నీ వేర్పాట్ల కుంపట్లోకి ఎలా లాగాలా అని కొత్తకొత్త ప్లాన్లు వేస్తూనే ఉంటారు. ఇచ్చేదీ, ఇవ్వాల్సిందీ అయిన కాంగ్రెసును పూలచెండ్లతో సుతారంగా కొట్టి వదిలేస్తూ తెలంగాణ వీరాధివీరుడు తన జోలికిరాని ఆంధ్రోళ్ల మీద ఒంటికాలిమీద లేస్తూ, రెండు కళ్ల పచ్చబాబు మీద ముళ్లకచీ ఝళపిస్తూనే ఉంటాడు. ఢిల్లీ వాళ్లు తెలంగాణ ఇచ్చేట్టులేరంటూ పాఠాలు మానిన పంతులయ్య జనాంతికంగా ఉసూరుమంటూనే ఉంటాడు. అయినా మళ్లీ రాజీనామాలిస్తే తెలంగాణ పరిగెత్తుకొస్తుందని జోస్యాలు చెబుతూ బంద్ మీద బందు చేయస్తూనే ఉంటాడు. దేవతా వస్త్రాలు ఆహా, ఓహో అంటూ ప్రతి రాజకీయ జీవీ రంగస్థలం మీద తన పాత్రను రక్తికట్టిస్తూనే ఉంటాడు. దిగంబరరాజు కాంగ్రెసు యుగాంతందాకా దర్జాగా ఊరేగుతూనే ఉంటాడు.

- సాక్షి 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి