ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రాంతీయ కాంగ్రెస్ సమావేశం హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో ఏప్రిల్ 20 ,1969 న జరిగింది. పీ వీ నరసింహారావు గారి ప్రసంగం ప్రారంభం కావడానికి ముందు కొంత మంది గందరగోళం సృష్టించతలపెట్టినా ఆయన తొణకక,బెణకక తన వాణిని వినిపించారు.
ఆంధ్రపత్రిక, ఏప్రిల్ 21,1969: ఆంధ్ర దేశంలో ప్రజల భవిష్యత్తు దృష్ట్యా, భారతదేశ భవిష్యత్తు దృష్ట్యా, ఆంధ్రప్రదేశ్ విచ్ఛిత్తి మంచిది కాదు, విశాల దృక్పథం కలిగి దేశంలో వెనుకబడిన ప్రాంతాల ప్రజలను ముందుకు తీసుకుపోయే కార్యక్రమాన్ని మనం రూపొందించుకొని అమలు చేయవలసి వుంది అని విద్యా మంత్రి శ్రీ పీ.వీ.నరసింహారావు నేడు గాంధీ భవన్ లో జరిగిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లోని తెలంగాణ సభ్యుల సమావేశంలో గంటకు పైగా చేసిన గంభీర ప్రసంగం లో ఉద్భోదించారు.
ప్రజాప్రతినిధులైన వారు ఉభయప్రాంతాలలో పర్యటించి, ఒకరి కష్టసుఖాలు ఒకరు గ్రహించి, సంస్కృతీ సమైక్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని, గతంలో జరగవలసినంతగా ఈ పని జరుగలేదని విద్యా మంత్రి ఉద్గాటించారు.ఉద్యోగాల గూర్చి, అన్యాయాల గూర్చి పరీక్షించి చూస్తే ఆరోపణలు అతిశయోక్తులని తేలిపోగలదని అన్నారు
|
ఆంధ్ర పత్రిక April 21,1969 |
ఆంధ్ర జనత, 21 ఏప్రిల్,1969 :
ప్రసంగపాఠం: ఈనాడు ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణా ప్రాంతంలో ఉత్పన్నమైన సమస్య ఒక్క ఈ రాష్ట్రానికే పరిమితమైనది కాదు.యావత్ భారత దృష్టి నుండి దీనిని పరిశీలించ వలసివున్నది. స్వాతంత్ర్యానికి పూర్వం నుండి ఈ సమస్య దేశవ్యాప్తంగా వుంది. భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ పట్ల అనేక దశాబ్దాల క్రిందటి నుంచీ కాంగ్రెస్ విశ్వాసంగా వుంటూవచ్చింది.1905 లో బెంగాల్ విభజన నాటినుంచీ కూడా భాషా ప్రాతిపదికను కాంగ్రెస్ స్వీకరిస్తూ, ప్రచారం చేస్తూ వచ్చింది.
భాషాప్రాతిపదికపై ఏర్పడిన రాష్ట్రంలో జనసామాన్యాన్ని సమీకరించి,సంఘటిత మొనర్చి , సంఘీభావాన్ని సాధించి, వారి ఆదర్శాలు,ఆశయాలు,కోరికలు గ్రహించి నెరవేర్చడానికి మార్గం ........ఉంటుందని భారత జాతీయ కాంగ్రెస్ పదే పదే చెప్తూ వచ్చింది.
ఆ తర్వాతకూడా కేవలం ఒక్క భాషా ప్రాతిపదికమీదన రాష్ట్రాలు ఏర్పాటు చేయాలా...ఆర్ధిక పరిపాలన సౌలభ్యాది అంశాలను కూడా పరిగణించాలా అని ఆలోచించడం,ఈ ఇతర అంశాలను కూడా దృష్టిలో ఉంచుకొని భాషా రాష్ట్రాల సరిహద్దులను నిర్ణయించాలని భావించడం జరిగింది.ప్రాతిపదిక మాత్రం భాషే ఉంటుందన్న మౌలిక సిద్ధాంతం మాత్రం మారలేదు
ఆంధ్రప్రదేశ్ అవతరణ
1953 లో అఖిల భారత స్థాయిలో భాషారాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ ప్రాతిపదికనను పరిశీలించడానికి కేంద్రం ఒక కమిషన్ను నియమించింది. భాషా ప్రాతిపదికను 1953 లోజరిగిన హైదరాబాద్ మహాసభలో కూడా ఆమోదించడం జరిగింది.
ఆ కమిషన్ హైదరాబాద్ వచ్చింది.తెలంగాణలోను మిగత హైదరాబాదు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో కూడా పర్యటించి సాక్ష్యాలు సేకరించింది. హైదరాబాద్ రాష్ట్రాన్ని ఉన్నదిఉన్నట్లుగానే ఉంచాలని చెప్పినవారు చాలా కొద్దిమంది. తెలుగు, మహారాష్ట్ర, కన్నడ ప్రాంతాలుగా రాష్ట్రాన్ని మూడు ముక్కలుగా చేయాలని హెచ్చుమంది సూచించారు.తెలుగు ప్రాంతాన్ని(తెలంగాణ ను )వేరుగా వుంచాలా, ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేయాలా అన్న సమస్యపై కూడా కాంగ్రెస్ వాదులు తమ సాక్షాల్నిచ్చారు.ఆనాడు విలీనీకరణపై భిన్నాభిప్రాయాలు లేకపోలేదు. అయితే చివరకు అఖిల భారత స్థాయిలో కేంద్ర ప్రభుత్వం అన్ని అంశాలను పరిశీలించి భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్వ్యవస్థికరణ సిద్ధాంతాన్ని అంగీకరించి,..హిందీ రాష్ట్రాలను అలాగే వుంచి మిగతా దేశాన్ని ఆయా భాషల ప్రాతిపదికపై భాషా రాష్ట్రాలుగా పునర్వ్యవస్థీకరించడం జరిగింది. 1956 లో సమగ్ర ఆంధ్ర ప్రదేశ్ అవతరించింది.
తిరిగి ఉద్భవించిన సమస్య
ఆ సమస్యే మళ్ళీ మనముందుకు వచ్చింది. రెండు విధాలవాదనలో మార్పు లేదు అయితే ఈ సమస్యను అఖిల భారత స్థాయిలో మాత్రమే జాతీయ దృష్టితో మాత్రమే పరిశీలించి నిర్ణయం తీసుకోవలసివున్నది. ఏ ఒక్క రాష్ట్రానికి పరిమితంగా నిర్ణయించే వీలులేదు.
యావద్భారతదేశాన్ని చిన్న చిన్న రాష్ట్రాలుగా విభజించాలన్నా అది మాత్రం కుదిరేదికాదన్న నిర్ణయాన్ని ఇదివరకే సకల అంశాలు పరిశీలించి తీసుకోవడం జరిగింది. ఈనాడు ఆంధ్రప్రదేశ్ ను రెండు మూడు ముక్కలు చేయాలా వద్దా అన్నది ఇక్కడ హైదరాబాద్లో కూర్చొని చర్చించి తీసుకోవలసిన నిర్ణయం కాదు. అది అఖిల భారత స్థాయిలో జరుగవలసిన చర్చ. చరిత్రకందని కాలంలో ఎన్నడో అంగ,వంగ, కళింగ..ఇలా 56 రాష్ట్రాలు, రాజ్యాలు భారతదేశంలో ఉండేవి.ఇవాళ మళ్ళీ అన్ని రాష్ట్రాలు కావాలంటే అఖిల భారత స్థాయిలోనే చర్చ జరగాలి.
అయితే ఈ నిర్ణయం జరిగిపోయింది.విశాలమైన రాష్ట్రంలో నైసర్గిక సంపదను ఇతర సౌకర్యాలను గరిష్ట స్థాయిలో హెచ్చు ప్రయోజనం సాధించుకోవడానికి వినియోగించుకొని గొప్ప అభివృద్ధిని సాధించుకోవచ్చునని,ప్రజలకు అవకాశాలు బాగా వుంటాయని భావించడం జరిగింది.అందువల్ల దేశం యాభైఆరో, అరవయ్యో ముక్కలైతే తప్ప ఆంధ్ర ప్రదేశ్ ముక్కలై ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రాదు, వచ్చినా అప్పుడు ఒక్క తెలంగాణ రాష్ట్రం వస్తుందో రెండు ముక్కలుగా రెండు తెలంగాణ రాష్ట్రాలు వస్తాయో చెప్పలేము
పన్నెండేళ్ళ చరిత్ర
గత పన్నెండేళ్లలో మనకు అన్యాయం జరిగిందని అభిప్రాయం వచ్చింది. ఈ సందర్భంగా మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవలసి వుంది. సమైక్యత అన్నది విలీనం అన్నది ఒక కాగితంపై సంతకం చేసినంతమాత్రం చేత యాదృచ్చికంగా , మానవ కృషి అవసరం లేకుండా రాదు. ప్రజల సమైక్యతకు ఇరు ప్రాంతాల ప్రజల విలీనీకరణ, ఏకీకరణకు ఉద్దేశపూర్వక చర్యలు తీసుకొన్నట్లు లేవు.ఒక మన రాష్ట్రంలోనే కాదు దేశంలోని ఇతర రాష్ట్రాలలో కూడా ఇది జరుగలేదు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సమయంలో మన కాంగ్రెస్ అధ్యక్షుడిగా వుండిన శ్రీ యు యెన్ దేబార్ గారిని నేను ఇటీవల కలుసుకొన్నప్పుడు వారు కూడా ఇదే చెప్పారు.విలీనీకరణ అయిపోయిందన్న ఉదాసీన వైఖరితో వారున్నారు,ప్రజల విలీనీకరణ చట్టాల ద్వారా రాదు,చాలా చర్యలు తీసుకోవలసి వుంది,మీరు చర్యలు తీసుకోండి,తెలంగాణ ఉద్యమం ఆందోళన కలిగిస్తున్నది అని వారు చెప్పారు.
నేడు మనం మొత్తం చరిత్రనంతా సింహావలోకనం చేస్తే, ఈ చర్యల అవసరం మనకు స్పష్టమవుతుంది.
స్కాట్లాండ్ ఇంగ్లాండ్ విలీనమై 250 ఏళ్ళు గడిచినా ఇంకా ప్రజలలో సమైక్యతా భావం రాలేదు.కావున దీనిపై మనం తొందరపడడం మంచిది కాదు. నిర్ణయాన్ని మార్చుకొనరాదు.స్కాట్లాండ్ ఇంగ్లాండ్ విలీనీకరణ జరిగిన అర్థరాత్రి జరిగిన సభలో స్కాట్లాండ్ కు చెందిన పార్లమెంట్ సభ్యుడు మాట్లాడుతూ ఈ విలీనీకరణ వల్ల ఉత్పన్నం కానున్న అనేక సమస్యల గురించి ముందే హెచ్చరించడం జరిగింది.అప్పుడు ఇంగ్లాండ్ ప్రధాని మాట్లాడుతూ సంవత్సరంలోపల ఈ సమస్యలను పరిష్కరించి పార్లమెంట్ సభ్యుడిని సంతృప్తి పరచి, మొత్తం స్కాట్లాండ్ ప్రజలను సంతృప్తి పరచడానికి చర్యలు తీసుకొంటానని వాగ్దానం చేసారట.
అందువల్ల సానుభూతితో చర్యలు తీసుకొని సమస్యలను పరిష్కరించుకోవలసి వుంది. అంతేకాని,కేవలం 12 సంవత్సరాల అనుభవంతో, ఆవేశంతో నిరాశ చెంది మళ్ళీ విడిపోదామనుకోవడం తొందరపాటు అవుతుంది. అందుకు జరుగుతున్న ఉద్యమాన్నితమకు నైవేద్యం పెట్టుకొని, మనల్ని అనుకరించమని చెప్పడం కూడా సమంజసం కాదు
సాంస్కృతిక ప్రాతిపదిక పై నాకు అచంచలమైన విశ్వాసం వుంది. సాంస్కృతికంగా ఆంధ్ర -తెలంగాణ ప్రాంతాలను సమైక్యం చేయడానికి విలీనం చేయడానికి ప్రయత్నం జరగలేదు.దేశంలో అనేక విచ్చిన్నకర ధోరణులకు కూడా ఇదే కారణం. మన పార్లమెంట్ సభ్యులు ఉభయప్రాంతాలవారూ పార్లమెంట్లో నాగార్జునసాగర్ ప్రాజెక్టు గురించి, పోచంపాడు ప్రాజెక్టు గురించి అడుగుతారు కాని దేశం గురించి అడగరు.మన శాసనసభ్యులు వారి వారి నియోజకవర్గాలు గురించి అడుగుతారు.వారి ఆలోచనలు వారి వారి నియోజకవర్గాలకు పరిమితమయిపోయాయి.జిల్లా పరిషత్ సభ్యుల ఆలోచనలు వారి వారి బ్లాకులకు పరిమితమైపోయాయి. విశాల దృక్పథం లేకపోవడమే నేటి దేశ పరిస్థితికి కారణం.ఇందులో మన బాధ్యత కూడా ఎంతవుంది అని మనమందరం ఆత్మ పరిశీలన చేసుకోవలసివుంది. సాంస్కృతికంగా చూసినా,ఆర్థికంగా చూసినా ఇది అభివృద్ధికి అవరోధం,అసంతృప్తికి దారి తీస్తుంది.
స్వార్థ ప్రయోజనాలు
మనకీ నేడు స్వార్థ ప్రయోజనాలు తయారయ్యాయి. వెనుకబడిన ప్రాంతంఅని చెప్పుకోవడం ఫ్యాషన్ అయిపోయింది.వెనుకబడిన ప్రాంతాల సమస్యలు దేశంలో ఎక్కడ చూసినా ఒకటే అనే చైతన్యం రాలేదు. రాయలసీమ,కల్యాణదుర్గం,పొదిరి(నెల్లూరు జిల్లా )వంటి ప్రాంతాలు వెళ్లి చూస్తే మన తెలంగాణాయే మేలనిపిస్తుంది.
పెద్దమనుషుల ఒప్పందం
1956 లో పెద్దమనుషుల ఒప్పందం కుదిరింది.ఆ ఒప్పందం ఎంతవరకూ అమలు జరిగిందో చూడాలి.ఆ ఒప్పందం యొక్క భావము,లక్ష్యము ముఖ్యం. అన్ని సమస్యలకు ఆ ఒప్పందం పరిష్కారం కాదు.అది ఒక ప్రాథమిక పత్రమే , తుది పత్రమనుకోవడం పొరబాటు. 1956 లో ఊహించగలిగినంత మేరకు ఊహించి ఆ సూత్రాలను ఆ ఒప్పందంలో చేర్చారు.భవిష్యత్తులో ఉత్పన్నమయ్యే సమస్యలకు ఆ ఒప్పందం పరిష్కారం కాదు. అందువల్ల భావం ముఖ్యం గాని అందులోని భౌతిక అర్థం ముఖ్యం కాదు. భావం వుంటే ఒప్పందమే అనవసరం. ఈ ఒప్పందానొక తుది పత్రంగా, దానికొక జటిలత్వాన్ని ఇచ్చి అర్థం చేసుకోలేకపోయాం.భావబలం వుంటే అక్షరాలా ఏముందన్నదాన్ని పట్టించుకోనవసరం వుండదు. ఆ భావాన్ని ఆచరణలో పెట్టడంలో లోపాలు గురించి ఆ వైపునా, ఈ వైపునా ఎంతైనా చెప్పవచ్చు. జనవరి 19 వ తేదీ అఖిలపక్ష ఒప్పందంలో ప్రభుత్వం ఈ లోపాలను స్వయంగా ఒప్పుకున్నది. ఇదొక పెద్ద కన్సెషన్ అయినప్పటికీ పర్యవసానం తద్విరుద్ధంగా వచ్చింది.పొరపాటును ఒప్పుకుంటే, ప్రజలు సంతృప్తి పడి భవిష్యత్తు గురించిన విశ్వాసం ఏర్పడుతుందనుకొన్నాము. కాని ప్రజాహృదయాల్ని సక్రమంగా అవగాహన చేసుకోనలేకపోయారేమోనన్నదే ప్రశ్న.
ముల్కి నిబంధనలు
హైదరాబాద్ రాష్ట్రంలో కూడా ముల్కి నిబంధనలు ఉండేవి కాని ఆ రోజుల్లో ముల్కి సర్టిఫికేట్ ఇచ్చేవారే నాన్ ముల్కీలు. అందువల్ల న్యాయం జరుగలేదు.పెద్ద మనుషుల ఒప్పందంవల్ల 1956 లో రక్షణలు వచ్చాయి. వెనుకబడినతనం వల్ల రాలేదు.వెనుకబడినతనం వల్లనే వస్తే మనకన్నా వెనుకబడివున్న ప్రాంతాలకూ వచ్చేవి.మైసూర్ లో విలీనమైన కర్ణాటక ప్రాంతానికి రాలేదు, మహారాష్ట్రలో విలీనమైన మరాట్వాడా ప్రాంతానికి రాలేదు. దేశంలో ఏ రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతానికి రాలేదు.పెద్ద మనుషుల ఒప్పందం నుంచి మనకు మాత్రమే వచ్చింది.ఆ ఒప్పందాన్ని కేంద్రం గౌరవించడం వల్లనే వచ్చింది. ఈ ఒప్పందం భగ్నమైతే రక్షణలు వుండవు. పన్నెండు సంవత్సరాల కాలంలో జరిగిన లోపాల పరిమాణాన్ని అంచనా వేయాలి.దాని ఫలితాన్ని అంచనా వేయాలి. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, అంచనాల సంఘం నివేదికలలో లోపాలే కనిపిస్తాయి.లోపాలు చూపించడమే వాటి పని, అందుకనే అన్నీ లోపాలే వున్నాయనలేము కదా.అలాగే ప్రాంతీయ సంఘం నివేదికలలో లోపాలు గురించే వుంటుంది. ఎందుచేతనంటే వున్న లోపాలను చూపించడమే కమిటీ పని. అంత మాత్రాన అన్ని లోపాలే జరిగాయనుకోరాదు.
తెలంగాణకు చెందిన శ్రీ విటల్ రావు గారు జిల్లాల్లో తిరిగి అంకెల వివరాలు సేకరించారు.నాన్ ముల్కీల సంఖ్య నిచ్చారు. దాదాపు 5200 మంది నాన్ ముల్కీలు ముల్కీలకు ఉద్దేశించిన ఉద్యోగాల్లో వున్నట్లు తేలింది. ఇందులో 1600 మంది ఉపాధ్యాయులు ,1800 మంది నర్సులు,ఆగ్జిలరీ నర్సులు, మిడ్ వైఫ్లు, 400 మంది స్టెనోగ్రాఫర్లు, 300 మంది ప్యూన్లు మిగిలినవారు ఇతరులు.లోపం యొక్క పరిమాణాన్ని ఆలోచించక తప్పదు. ఈ 1600 మంది ఉపాధ్యాయులను జిల్లా పరిషత్ వారే శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఇప్పుడు లభించకపోవడం వల్లనే చేర్చుకొన్నారు. 1956 తర్వాత శిక్షణ అవకాశాలను ఎంతో అభివృద్ధి చేసుకొన్నాము.మరో రెండు శిక్షణ కళాశాలలు ఈ మే నుంచి ప్రారంభమవుతున్నాయి.భవిష్యత్తులో ఈ లోపం జరుగదు. నర్సులున్నారంటే దేశమంతా కేరళ నర్సులున్నారు. స్థానికంగా మహిళలు లభించక కేరళవారిని నియమించుకోవలసి వచ్చింది . ఇప్పుడు ప్రభుత్వము, ఆంధ్రమహిళాసభ నర్సుల శిక్షణా సౌకర్యాలను పెంపొందిస్తున్నాయి.అయినా ఎక్కువమంది ఈ సౌకర్యాల్ని ఉపయోగించుకోవడం లేదు.స్టెనోగ్రాఫర్లు ఆనాడు ఇక్కడ లభించలేదు. సౌకర్యాలను ఉపయోగపరచుకొనే చైతన్యాన్ని కూడా వెనుకబడిన ప్రాంతాల్లో కలిగించవలసివుంటుంది.
ఇవన్నీ తీసేస్తే ఇక 1200 మంది మేరకు ముల్కీలకు రావలసిన ఉద్యోగాలు రాలేదని తేలుతుంది. తెలంగాణ ప్రాంతంలో లక్షాఏడు వేల ముల్కీ ఉద్యోగాలలో ఈ 1200 ఎంత అని ఆలోచించాలి.
మిగులు నిధులను ఉన్నతాధికారుల సంఘం నిర్ణయించనున్నది కనుక ఇప్పుడు చర్చించడం సమంజసం కాదనుకొంటాను.
లోపాలు ఎందుకు జరిగాయని ఆలోచిద్దాం. పరిపాలన రంగంలో లోపాలు సర్వత్రా వుంటాయి.రక్షణల అమలును అధికారులకు అప్పగించాము.అందువల్ల లోపాలు అమలు జరిగాయి. సమీక్షాయంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోలేదు. ఇప్పుడు ఏర్పాటు చేసుకొంటున్నాము కనుక, అవకాశం ఇచ్చి చూడడం మన ధర్మం