29, నవంబర్ 2011, మంగళవారం

విఫల సమ్మె చాటిన జన మనోరథం

ఆంధ్రజ్యోతి జనవాక్యం: 'వేరు తెలంగాణ' తెలంగాణ ప్రాంతంలోని సకల జనుల మనోరథం కాదని ఇటీవలి 'సకల జనుల సమ్మె ఘోర వైఫల్యం' సువ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన ఈ 55 ఏళ్లలో ముఖ్యంగా ఒక దశాబ్దంగా 'చిచ్చు బుడ్డి' వలే పొంగి చల్లారుతున్న ఉద్యమం కేవలం అసంతృప్తులు, ఆత్మన్యూనతా వంచితులు, అధికార స్వార్థ వాంఛా పరులు కాలక్షేపానికి నడుపుతోన్నదేనని తిరుగు లేకుండా తేలిపోయింది. రావి నారాయణ రెడ్డి, రామానంద తీర్థ, రామకృష్ణ రావు తరాలవారూ, ఎంఎస్ రాజలింగం, పాగ పుల్లారెడ్డి తరాలవారూ, నర్రా మాధవరావు, ఎన్.రాజేశం, నాగేందర్, జనార్ధన్‌రెడ్డి, ముఖేష్ ప్రభృత తరాల వారూ ఆంధ్రప్రదేశ్ యథాతథంగా ఉండాలని అభిలషించేవారూ తెలంగాణ అంతటా ఎందరో వున్నారు.

దూషణ తిరస్కారాలకూ దౌర్జన్య హింసాకాండలకూ వెరచి వారు నోరుతెరవలేకున్నారు. 'ఆకాశిక్' రాజేశం వంటి వారు వెరపులేక రాస్తూనే ఉన్నారు. అది నిష్ఠుర నిజం. సాటి తోటి ఇతర ప్రాంతీయులను దుష్టులు, దుర్మార్గులు, దొంగలు, దోపిడీదారులు అని దుర్భాషలాడేవారికి ఈ 55 సంవత్సరాలలో రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిన వారిలో తెలంగాణ ప్రముఖులు ఎందరో వున్నారని తెలుసా, తెలియదా? వారంతా 'ఆత్మ గౌరవం' లేని 'చవటలూ, దద్దమ్మలే' అని వీరి ఉద్దేశమా? మరీ పదేళ్లుగా, కొత్తగా కొమ్ము లు వచ్చిన కోడెలు వలే చెలరేగుతున్నవారు అడ్డూ, అదుపూ లేకుండా నోరు పారవేసుకుంటూ వుండటాన్ని అసహ్యించుకుంటున్న వారు తెలంగాణ అంతటా ఎందరో వున్నారు.

ఏమంటే ఏమి తలనొప్పో అనే భీతితో ఉదాసీనంగా ఉంటున్నారు. ఏ ఎన్నికలు వచ్చినా వారు తమ అభిమానం వెల్లడిస్తూ వుండటమే ఇందుకు తార్కాణం. ఎన్నికల ఫలితాలను ఒక్కసారి పరకాయించి చూస్తే 'కుహనా' తెలంగాణవాదుల 'స్థితిగతులు' ఏమిటో సుస్పష్టం. 90 ఏళ్ల కమ్యూనిస్టు పార్టీ వారివలెనే వీరికీ 'పరాలంబనం' అనివార్యం అనేది కనపడేదే! నిన్న మొన్నటి ఉప ఎన్నిక కూడా, ఎంత ఉద్రేక ఆవేశాల మధ్య జరిగినా ఈ సంగతినే ధ్రువపరిచింది కదా! సకల జనులూ 'వేరు తెలంగాణ' కోరేవారైతే అట్లా ఎందుకు జరుగుతోంది? అన్ని ఆగాలనూ, ఆగడాలనూ సహిస్తూ ఉన్న వారు సమయం వచ్చినప్పుడు తమ మనోరథం, నిజాభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లే కదా. మొన్నటి సకల జనుల సమ్మె కాలసర్పం వలె, 'ఆంధ్రజ్యోతి' సంపాదకుడు వివేకంతో సరిగ్గా సందర్భోచితంగా ఊహించినట్లు 'వైకుంఠపాళిలోని పెద్ద పామై' కాటు వేయటంతో కృత్రిమ ఉద్యమం కుదేలై కూలబడింది.

సకల ఆంధ్ర జనులకూ సత్యమైన 'పరమ పథం' ఏమిటో అందుకు అవసరమైన 'సోపానా'లేవో సావధానంగా ఆలోచించుకునే అవకాశం మరోసారి అందుకే లభించింది. అందుకే నర్రా మాధవరావూ, 'ఆకాశిక్' పత్రికా సంపాదక నిర్వాహకుడు ఎన్. రాజేశం ప్రభృతులే కాక కొండంత మనిషి కొండా లక్ష్మణ్ బాపూజీ వంటి వారు కూడా 'సద్భావన'తో 'సన్మార్గ' అన్వేషణకు నడుం కట్టారు. 'తెలంగాణ అన్యాయానికి గురైంది. వలస వచ్చిన వారు దోచుకుపోతున్నారు. సహజ సంపద అంతా అన్యాక్రాంతం అయిపోతుంది' అనే అంగలార్పు ఎంత సబబో సమంజసమో చర్చలు, సమాలోచనల ద్వారా తేల్చుకునే ప్రయత్నం ప్రారంభించారు. కొంచెం ఆలస్యమైనా ఇది వాంఛనీయ పరిణామం.

దీనికి ఆటంకాలు కలిగించటం, దౌర్జన్యానికి పాల్పడటం, సభలు కూడా జరుపుకోనివ్వక పోవడం అవివేకం అవుతుంది. ఆక్రోశంతో, ఆవేశకావేశాలతో 'ఉడికి'పోతున్నవారు ఇకనైనా తిట్లు, శాపనార్థాలు, అఘాయిత్యాలు, దౌర్జన్య హింసాకాండలు కట్టిపెట్టి శాంతియుత పరిష్కారానికి కలిసిరావటం అత్యవసరం.....ఆంధ్రప్రదేశ్‌లో సకల జనులు ఇతోధిక శాంతి, సౌభాగ్యాలు, అభ్యుదయం సాధించి, సమకూర్చుకోవచ్చు. ఇళ్లు పడగొట్టడం కష్టం కాకపోవచ్చు. కాని కట్టుకోవటం ఎంత కష్టమో గ్రహించాలి. జై సకలాంధ్ర జనులకూ జై. 

- మద్దాలి సత్యనారాయణ శర్మ, హైదరాబాద్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి