29, నవంబర్ 2011, మంగళవారం

విభజన పరిష్కారం కాదు !

ఆంధ్రభూమి సంపాదకీయ పేజీ: నైజాం రాజ్యాన్ని అప్పటి కేంద్ర మంత్రి సర్దార్‌పటేల్ సైనిక చర్యతో పాకిస్థాన్‌లో కలవకుండా విమోచనం చేసి భారత్‌లో విలీనం చేసిన తర్వాత భాషా రాష్ట్రాల ఏర్పాటు జరిగింది. నైజాంలోని మరాఠా మాట్లాడే ప్రాంతాలను కన్నడం మాట్లాడే ప్రాంతాలను విడదీసి, మహారాష్టల్రోను, కర్నాటకలోను కలిపారు. మిగిలిన తెలుగు తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర రాష్ట్రంతో కలిపి ఆంధప్రదేశ్ ఏర్పరిచారు. దానికి అప్పటి హైదరాబాద్ అసెంబ్లీలోని మెజారిటి తీర్మానంతోనే చేశారు. దాన్ని ‘టీరనీ ఆఫ్ మెజారిటి’అనో కుట్ర, మోసం అనో అప్పుడెవరూ గోల చేయలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత అధికారం, పదవులకోసం కొందరు రాజకీయవాదులు, తెలంగాణకు అన్యాయం జరిగిందని, వెనుకబడి అభివృద్ధి చెందలేదని తెలంగాణను వేరే రాష్ట్రంగా విడగొట్టాలని ఉద్యమం లేవదీశారు. దానిమీద శ్రీకృష్ణ కమిటీని వేస్తే, రాష్ట్రాన్ని ముక్కలు చేయకుండా తెలంగాణకు వేరే ప్రాంతీయ సంఘంతో కొంత ఆర్థిక ప్యాకేజి ఇచ్చి అభివృద్ధిచేయాలని నివేదిక ఇవ్వగా దాన్ని తెలంగాణవాదులు అంగీకరించలేదు. ఇపుడు ఆ వేర్పాటువాదులు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నవంబరు 1వ తేదీని విద్రోహ దినమని నల్లజెండాలు ఎగురవేశారు.

సీమాంధ్ర ధనికవర్గాలు తెలంగాణాను కొల్లగొడుతూ, తెలంగాణను విడిపోనివ్వరని కొందరి వాదన. తెలంగాణకు అన్యాయం జరిగిందంటే అందుకు గతంలో వివిధ పదవులు పొందిన తెలంగాణ వారు కూడా కారణమే. మరి తెలంగాణలోని ధనిక వర్గాలు దోపిడి చేయనట్టుగా మాట్లాడ్డం విడ్డూరం. తెలంగాణ ప్రజా ఉద్యమమని, సమైక్యవాదం పెట్టుబడిదారుల డబ్బుతో నడిచే ఉద్యమమని తెలంగాణ వాదులు చిత్రిస్తున్నారు. ఉదారవాదులు కొందరు ఎందుకీ గోల తెలంగాణ ఇచ్చేస్తే పోలా అంటున్నారు. ఒకవేళ తెలంగాణ ఇచ్చినా పదవుల పేచీతో అందులో కొన్ని జిల్లాలు వెనుకబడ్డాయని ఫలానా జిల్లాలవారు తమకు అన్యాయం చేస్తున్నారని విడిపోవాలంటే చిన్న రాష్టవ్రాదులు ఒప్పుకొని మళ్లా విడగొడతారా? ఈమధ్యనే నెల రోజులు పైగా చేసిన సకల జనుల సమ్మెలో మద్యం దుకాణాలను, సినిమాలను మినహాయించడం, రైలు రోకోను మార్పుచేయడం విమర్శలకు తావిచ్చాయి. బలవంతపు బంద్‌లు సమ్మెలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం, దిన కూలీలకు ఉపాధి లేకుండా చేయడం, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడినా శిక్షలొద్దనడం, పనిచేయకపోయినా జీతాలివ్వాలనడం ఈ ఉద్యమాలు నడిపే వారికే చెల్లింది! ఈ ఉద్యమ నేపథ్యంలో సాగదీయడం కేవలం ఈ రెండు ప్రాంతాల్లో అధికారంలోకి రావడమే కాంగ్రెస్ లక్ష్యమని కొందరంటున్నారు. ఇక బిజెపి రాజకీయ ప్రయోజనాలకోసం తెలంగాణ ఏర్పాటును సమర్థిస్తుండగా, పెద్ద రాష్ట్రాలకంటె చిన్న రాష్ట్రాల్లో పోలీసు బలగాలు తక్కువగా ఉంటాయి కనుక వారిని సులభంగా ఎదుర్కోవచ్చని మావోయిస్టులు చిన్న రాష్ట్రాల వేర్పాటు ఉద్యమాన్ని బలపరుస్తున్నారని కొందరి అభిప్రాయం.

1969 లో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎందుకు తిరస్కరించారో గమనించాలి. చిన్న రాష్ట్రాల ఏర్పాటుతో రాజధాని, సచివాలయం, శాసనసభా మందిరాలు, హైకోర్టు, ఉద్యోగులు వారికి ఇళ్లు, నదీ జలాలు తదితర సమస్యలు పరిష్కరించాల్సి వుంటుంది. తెలంగాణ ఒక్కటే కాదు. ఆంధ్రప్రదేశ్‌ను మూడు నాలుగు ముక్కలు చేయడం, ఇతర రాష్ట్రాల్లో కూడ చిన్న రాష్ట్రాల సమస్యలను పరిష్కరించవలసి ఉంటుంది. దానికి బదులు రాష్ట్రాలను విడదీయడానికయ్యే పైన చెప్పిన ఖర్చులతో ఆ వెనుకబడిన ప్రాంతాల్లో స్కూళ్లను, ఆసుపత్రులను, త్రాగునీరు- సాగునీరు, రోడ్లు మొదలైన వాటిని సమకూరిస్తే ప్రజలకు మేలు జరుగుతుంది. తెలంగాణ లాయర్లు డిమాండ్ చేసినట్టు 42 శాతం పదవులు/ ఉద్యోగాలు తెలంగాణ వారికిచ్చి వాటిని అమలుచేయడానికి- ముఖ్యమంత్రి ఇతర మంత్రి పదవులను తెలంగాణలోని దళిత, ముస్లిం, బి.సి, స్ర్తి పురుషులకు ఇవ్వడం ద్వారా- మొత్తం ఆంధ్రప్రదేశ్‌ను పరిపాలించనియ్యాలి. దీనివల్ల వేర్పాటువాదం, విభజన సమస్యలు లేకుండా సామాజిక న్యాయం కూడ కలసి వస్తుంది. పశ్చిమ బెంగాల్లో ‘గూర్ఖా ల్యాండ్’ సమస్య పరిష్కార పద్ధతిని గురించి తెలుసుకోవాలి.

 - పాలంకి అంబరీషుడు

3 కామెంట్‌లు:

  1. "చిన్న రాష్ట్రాల ఏర్పాటుతో రాజధాని, సచివాలయం, శాసనసభా మందిరాలు, హైకోర్టు, ఉద్యోగులు వారికి ఇళ్లు, నదీ జలాలు తదితర సమస్యలు పరిష్కరించాల్సి వుంటుంది."

    అదే ఇందిరా గాంధీ గారు ఆతరువాత మేఘాలయ సహా అనేక చిన్న రాష్ట్రాలు ఏర్పరిచారని రచయితకు తెలియదు కాబోలు. ఆవిడకు జ్యానోదయం జరిగాక మనసు మార్చుకున్నారా?

    "ఆ వెనుకబడిన ప్రాంతాల్లో స్కూళ్లను, ఆసుపత్రులను, త్రాగునీరు- సాగునీరు, రోడ్లు మొదలైన వాటిని సమకూరిస్తే ప్రజలకు మేలు జరుగుతుంది"

    ఈ విషయాలలో తెలంగాణా బ్రహ్మాండంగా ఉందని చక్రవర్తుల వారి ఉవ్వాచ మీరు వినలేదా?

    రిప్లయితొలగించండి
  2. "అదే ఇందిరా గాంధీ గారు ఆతరువాత మేఘాలయ సహా అనేక చిన్న రాష్ట్రాలు ఏర్పరిచారని రచయితకు తెలియదు కాబోలు. ఆవిడకు జ్యానోదయం జరిగాక మనసు మార్చుకున్నారా?"

    వాదనకు అర్థంపర్థం వుండాలి. అస్సాం, మేఘాలయాలకు ఏయే అంశాలలోస్వారూప్యం ఉండేదంట తెలుసునా? శ్రీమతి ఇందిరాగాంధీ భారత పార్లమెంట్లో బాషాప్రయుక్త రాష్ట్రాల పై ,తెలంగాణాలో వేర్పాటువాదం,విశాలాంధ్ర/సమైక్యాంధ్ర పై ఏమ్మన్నారో ఇక్కడ చదివి http://visalandhra.blogspot.com/2011/06/blog-post_8637.html చరిత్రను తెలుసుకోండి.పిట్టల దొరల కథలు వినీ వినీ మీ మెదడు మోద్దుబారిపోయుంటుంది. ఇందిరా గాంధీ చనిపోయేంత వరకూ మనసు మార్చుకోలేదు

    అయినా ఈశాన్య రాష్ట్రాలతో మనకు పోలికా?అక్కడ కావాలనుకుంటే జిల్లాకు ఒక ముఖ్య తెగ చొప్పున మరో 10-15 రాష్ట్రాలు సృష్టించవచ్చు.ఇప్పటికే అక్కడి చిన్న రాష్ట్రాలలో వ్యవహారాలు ఎలా తగలయ్యాయో తెలియంది కాదు.కొంత కాలం క్రితం మేఘాలయలో ముఖ్యమంత్రి హోదాకలిగిన వారు నలుగురు ఉండేవారు.

    "ఈ విషయాలలో తెలంగాణా బ్రహ్మాండంగా ఉందని చక్రవర్తుల వారి ఉవ్వాచ మీరు వినలేదా?"

    రచయిత వెనుకబడిన ప్రాంతాలు అన్నాడు.తెలంగాణా వెనుకబడిన ప్రాంతానికి పర్యాయపదమా? వెనకబాటుతనం రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో,మండలాల్లో ఉంది. మానవాభివృద్ధి అంశాలపై పై దృష్టిపెట్టమని(అంటే మన వేర్పాటువాద నాయకుల దృష్టంతా వసూళ్లు ,బెదిరింపులు,వీధి నాటకాలు పైనే వుంటుంది అనేది అందరికి తెలిసిన విషయమే) చెబితే తప్పా? చక్రవర్తి గారు లెక్కలతో సహా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత తెలంగాణ మిగిలిన ప్రాంతాల కన్నా వేగంగా అభివృద్ధి చెందింది అని నిరూపించారు గాని వెనకబాటుతనం అన్నిచోట్లా మటుమాయం అయ్యింది అని ఎప్పుడూ అనలేదు.

    రిప్లయితొలగించండి