25, ఏప్రిల్ 2011, సోమవారం

మనిషి లోపలి విధ్వంసం


అసెంబ్లీ ఆవరణలో లోక్‌సత్తా నాయకుడు జయప్రకాశ్ నారాయణ్‌పై దాడి జరిగినప్పుడు, ఆ దాడిని అందరూ ఖండించారు. కానీ, తెలంగాణ ఉద్యమనాయకులు మాత్రం తెలంగాణ రాష్ట్రం కోసం ఆరు వందల మంది యువకులు చేసుకున్న ఆత్మాహుతిముందు ఈ సంఘటన ఏ పాటిది అంటూ తేలిగ్గా తోసిపుచ్చారు. అదే కోవలో ట్యాంక్‌బండ్‌పై తెలుగు వైతాళికుల విగ్రహాలను ధ్వంసం చేస్తే, వార్తా సంస్థల సామగ్రిని నాశనం చేసి విలేకరులపై దాడిచేస్తే ఈ సంఘటనను సభ్యసమాజమంతా ముక్త కంఠంతో ఖండించినా, తెలంగాణ ఉద్యమ నాయకులు మాత్రం వందలాది యువకుల ఆత్మార్పణతో పోల్చుతూ ఇదేం పెద్ద ఘటన అని తోసిపుచ్చుతున్నారు.

తెలంగాణ ఉద్యమం అరవై సంవత్సరాల నుండి సాగుతోందని ఉద్యమ నాయకులు చెబుతూంటారు. కేసీఆర్ తెరాసను ప్రారంభించిన తరువాత తెలంగాణ ఆకాంక్ష ఇక్కడి ప్రజల్లో బలంగా చోటుచేసుకుందని అన్ని రాజకీయ పక్షాలకు చెందిన తెలంగాణ నాయకులు అంగీకరిస్తున్నారు. అయితే 58 సంవత్సరాలుగా ఏనాడూ ఒక్కరు కూడా ఆత్మాహుతికి పాల్పడకుండా కేవలం డిసెంబర్ 9న చిదంబరం ప్రకటన తరువాత మాత్రమే వందలాది మంది యువకులు ఎందుకు ఆత్మహత్యలకు పాల్పడ్డారో, వారిని ఇందుకు ప్రేరేపిస్తోంది, ప్రోత్సహి స్తోంది ఎవరో తెలంగాణ ఉద్యమ నాయకులు ప్రజలం దరికీ సంజాయిషీ చెప్పుకోవాలి.

కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష విరమింపజేయడా నికి ‘‘కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను చేపట్టిందని, అందుకు అనుగుణంగా రాష్ట్ర అసెంబ్లీలో తగిన తీర్మానాన్ని ఆమోదించడం జరుగు తోందని’’ డిసెంబర్ తొమ్మిదిన చిదంబరం ప్రకటిం చారు. ఆ తరువాత దీనికి వ్యతిరేకంగా సీమాంధ్ర ప్రాంతంలో ఉద్యమం చెలరేగింది. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పక్షాలన్నీ ప్రాంతాలవారీగా చీలిపోయాయి. వెంటనే కేంద్ర ప్రభుత్వం తన ప్రకటనను పక్కన పెట్టి ఈ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని లోతుగా అధ్యయనం చేయడానికి సమకట్టింది. అందుకు అనుగుణంగా శ్రీకృష్ణ కమిటీని నియమించింది.

ఇదంతా బహిరంగంగా అందరికీ తెలిసిన విషయం. ఈ విషయాన్ని తెలంగాణ ఉద్యమ నాయకులు తీవ్రంగా వక్రీకరించి, దానికి అనేక అసత్యాలను జోడించారు. కేసీఆర్ ‘‘డిసెంబర్ 9నే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చివేయ డం జరిగింది. కానీ కొందరు సీమాంధ్ర పెట్టుబడిదారు లు దానికి అడ్డుపడుతున్నారని’’ పదేపదే చెప్పసాగారు. తెరాసా నాయకులందరూ ఇదే విషయాన్ని ప్రతి సందర్భంలోనూ చెప్పసాగారు. ప్రముఖ కాంగ్రెస్ నేత కేశవరావు కూడా ‘‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పరచడం ఎప్పుడో జరిగిపోయింది’’ అని ఎన్నోసార్లు చెప్పారు. చిదంబరం డిసెంబర్ 9న చేసిన ప్రకటనను వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందిన తెలంగాణ నాయకులు పదేపదే చెప్పడం ప్రారంభించారు.

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయమై పునరాలోచనలో పడిందని, శ్రీకృష్ణ కమిటీ నివేదికలో వెల్లడయ్యే అంశాల ఆధారంగానే కేంద్ర నిర్ణయం ఉండబోతుందని ఒక్కరంటే ఒక్క ఉద్యమ నాయకుడు కూడా చెప్పలేదు. ఇందుకు భిన్నంగా వీరంతా తమకు ఇచ్చిన రాష్ట్రాన్ని సీమాంధ్ర పెట్టుబడి దారులు తమకు దక్కకుండా చేశారన్న భావనను యువకుల్లో కలిగించారు. తామంతా ఏదో కోల్పోయా మన్న వేదనను, తమ బంగారు భవిష్యత్తు చేజారి పోయిందన్న నైరాశ్యాన్ని, ఏం చేయాలో తెలియని నిస్సహాయతను, నిస్పృహను ఉద్యమ నేతలంతా కలసి యువకులలో ప్రేరేపించారు. ఫలితంగా ఈ నైరాశ్యాన్ని తట్టుకోలేక యువకులు వందల సంఖ్యలో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునర్వి చారిస్తోందని, రాజకీయ ప్రక్రియ ద్వారానే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సాధ్యమని, ఆత్మహత్యలకు పాల్పడేవారు అందుకు దోహదం చేసినవారు కాబోరని ఉద్యమ నాయకులెవ్వరూ చెప్పిన పాపాన పోలేదు. ఒకరిద్దరు మాత్రమే ఈ ప్రాణత్యాగాల వలన ఫలితం ఉండబోదని, బతికివుండి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుదామని చెప్పినా, ఆ మాటలకు, వారి ఇతర ప్రకటనలకు పొంతన లేకుండా పోయింది.

‘‘ఇంతమంది యువకుల ప్రాణత్యాగం తరువాతైనా ఆలస్యం చేయకుండా ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించాలని ఉద్యమ నేతలు ప్రతి ఒక్కరూ పదేపదే ప్రకటించడంతో తమ తమ ఆత్మార్పణకు, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కచ్చితమైన సంబంధం ఉందన్న భావనను ఈ ఉద్యమ నాయకులు యువకులలో కలిగించగలిగారు. అలా ప్రాణత్యాగం చేసిన వారిని అమరవీరులుగా కీర్తించసాగారు. అదే సమయంలో ఉద్యమనేతలు ఆంధ్ర ప్రాంతం వారిని దోపిడీదారులుగా అభివర్ణిస్తూ, ఇక్కడి ప్రజలు అనుభవించే కష్టాలన్నింటికి వారే కారకులుగా చిత్రించసాగారు. తమకు న్యాయంగా రావలసిన ఉద్యోగాలు వారే కాజేస్తున్నారని, తమను వివక్షకు, అన్యాయానికి లోను చేస్తున్నారని నమ్మించగలి గారు. ఫలితంగా తాము ఆత్మాహుతి చేసుకుంటే, అది ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎంతో కొంత దోహదం చేస్తుందని, ఫలితంగా తమ ప్రాంత ప్రజలకు కష్టాల నుండి, బాధల నుండి విముక్తి లభిస్తుందని విశ్వసించిన యువకులు పెద్ద సంఖ్యలో ఆత్మహత్యలకు పాల్పడ్డారు.

‘‘ఆంధ్రులు ఆగర్భ శత్రువులు. వారు నిరంతరం తెలంగాణ ప్రజల ప్రయోనాలను కాలరాస్తున్నారు. వారే సర్వ అరిష్టాలకు కారణం. వారి విషబంధనాల నుండి విమోచన లేకపోతే ఇక్కడి ప్రజల మనుగడే ప్రశ్నార్థక మవుతుంది. ఇందుకు ప్రత్యేక రాష్టమ్రే ఏకైక శరణ్యం. ఇక్కడి ప్రజలందరూ ప్రత్యేక రాష్ట్రం కోరుతున్నారు. చివరకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినా, దుర్మా ర్గులైన ఆంధ్రపెట్టుబడిదారులు అడ్డుపడ్డారు. శ్రీకృష్ణ కమిటీ సభ్యులకు కోట్లాది రూపాయలు ఇచ్చి తప్పుడు నివేదిక ఇప్పించారు.’’ ఈ అంశాలన్నింటినీ తెలంగాణ నేతలు ప్రతినిత్యం వల్లెవేస్తున్నారు. ఈ కారణంగా ఇక్కడి యువకులు తీవ్ర నిస్సహాయభావనలో చిక్కుకుంటు న్నారు. నిస్సహాయభావనలో ఉన్నప్పుడు ఎవరికైనా ఈ ప్రపంచమంతా శూన్యంగా కనిపిస్తుంది. ‘‘ఆంధ్ర పెట్టు బడిదారులు ఎప్పుడూ అడ్డుపడుతూనే ఉంటారు. ఇక తెలంగాణ రావడం అసాధ్యం’’ అనే భావాన్ని తెలంగాణ నేతలు అన్యాపదేశంగా ప్రజలకు నూరిపోస్తున్నారు.

చిదంబరం ప్రకటన తరువాత తెలంగాణనేతలు, పరిస్థితిని ఉద్రేక భరితం చేసి, తమ ఏకపక్ష వాదనలతో విద్వేషాలను ప్రేరేపించి అసలు హేతుబద్ధమైన చర్చకు ఆస్కారం లేకుండా చేశారు. ఫలితంగా తెలంగాణ యువ కులు ఈ నేతలు చెప్పే విషయాలను అక్షర సత్యాలుగా పరిగణిస్తూ, తీవ్ర ఉద్వేగాలకు లోనవుతున్నారు.

తెలంగాణ ఉద్యమ నాయకులు వందలాది ఆత్మహత్యలకు పాల్పడిన భయంకర విషాదాన్ని తమ ప్రత్యేక రాష్ట్ర వాదనకు అనువైన సాధనంగా, తమతో విభేదించే వారి నోరు మూయించే ఆయుధంగా వినియోగించుకోవడం చూసి ప్రతిఒక్కరూ సిగ్గుపడాలి. ఈ ఆత్మహత్యలకు పరోక్షంగా తామే కారకులమని ఈ ఉద్యమ నాయకులు గుర్తించాలి. ఈ యువకుల సమాధు లపై తమ పదవుల సౌధాలను నిర్మించుకునే ప్రయత్నాలను తక్షణమే విరమించుకోవాలి.
-సి.నరసింహారావు
విశాలాంధ్ర మహాసభ సభ్యులు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి