23, ఏప్రిల్ 2011, శనివారం

‘వేర్పాటు’కు జిల్లా పాలనే విరుగుడు! - ఎంఎల్ కాంతారావు

జాతీయస్థాయి స్థూల ప్రణాళికలు దేశాభివృద్ధికి ఎంత అవసరమో పంచాయతీ, మండల, జిల్లాస్థాయి అభివృద్ధి ప్రణాళికలు దేశసమగ్రతకు, గ్రామీణ ప్రాంత సమగ్రాభివృద్ధికి అంతే అవసరం. ఈ ప్రణాళికలు ప్రజల భాగస్వామ్యంతో, వారి అవసరాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందాలి. అప్పుడే స్థానిక ప్రజలు ఆ ప్రణాళికలను తమవిగా భావించి, వాటి అమలులో ఇష్టపూర్వకంగా పాల్గొంటారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా ఎన్ని ప్రణాళికలు రూపొందినా లక్ష్యం నెరవేరదన్నది గత ఆరు దశాబ్దాల చరిత్ర గుర్తు చేస్తోంది.

దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఆరు దశాబ్దాలు గడచినా, నేటికీ నాలుగు రకాల దారిద్య్రాలు ప్రజలను పట్టిపీడిస్తుండటం ఆందోళన కలిగించే అంశం. ఆకలి, అనారోగ్యం, అవిద్య, ఆర్థిక దారిద్య్రాలు దుష్ట చతుష్టయంగా మారి జనజీవనాన్ని అతలాకుతలం చేస్తోందన్నది అతిశయోక్తి కాదు. ప్రధానంగా గ్రామీణప్రాంత ప్రజల అభివృద్ధి అగమ్యంగా మారడం మొదటి తరం పాలకులను సైతం తీవ్రంగా ప్రభావితం చేసింది. మరోవైపు, దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలు, రాష్ట్రాల మధ్య ఆర్థిక అసమానతలు పెరిగి, జీవన స్థితిగతుల్లో వ్యత్యాసాలు తారస్థాయికి చేరడం జాతీయ సమగ్రతకు గొడ్డలిపెట్టుగా పరిణమించింది.

అందుకే, దారిద్య్రాన్ని ప్రణాళికాబద్ధంగా ధ్వంసం చే యడానికి పూనుకోవాలని విజ్ఞులు సూచించారు. దానికనుగుణంగానే 1950లో భారత పార్లమెంటు తీర్మానం ద్వారా ‘ప్రణాళికా సంఘం’ ఆవిర్భవించింది. 1951 నుంచి నేటివరకూ దేశసమగ్రాభివృద్ధి కోసం ప్రణాళికా సంఘం ఆధ్వర్యంలో 11 పంచవర్ష ప్రణాళికలు రూపొందాయి. 2012లో ప్రారంభమయ్యే 12వ పంచవర్ష ప్రణాళికలో ఆర్థికాభివృద్ధి మరింత వేగంగానూ, సమ్మిళితంగానూ ఉండాలన్నది లక్ష్యం. ప్రజలకు సుసంపన్నమైన, మెరుగైన, వైవిధ్యంతో కూడిన జీవనాన్ని అందించాలన్న ప్రణాళికా సంఘం లక్ష్యాన్ని నెరవేర్చడంలో గణనీయమైన విజయాన్ని సాధించలేకపోవడం వెలితిగానే భావించాలి.

కేంద్రీకృత ప్రణాళికా విధానాలతో విభిన్న ప్రాంతాల మధ్య, వ్యక్తుల మధ్య అంతరాలను పూర్తిగా తొలగించడం సాధ్యమా అన్నది చర్చగా మారింది. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసి, ఆర్థిక పరిపుష్టతను చేకూర్చాలన్న వాదనకు ఈ నేపథ్యం దోహదం చేసింది. 1993 ఏప్రిల్ 24న 73వ సవరణ ద్వారా భారత రాజ్యాంగాన్ని సవరించి పార్లమెంటు ఆమోదించడంతో పంచాయతీరాజ్ వ్యవస్థకు జవజీవాలను సమకూర్చే ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు.

విభిన్న రాష్ట్రాలు, జిల్లాల మధ్య ఆర్థికపరమైన అంతరాలు ఉన్నట్లే వ్యక్తుల మధ్య కూడా దిగ్భ్రాంతి కలిగించే స్థాయిలో అంతరాలు ఉన్నాయన్నది వాస్తవం. ప్రపంచ కుబేరుల్లో భారతీయుల సంఖ్య పెరగడాన్ని చూసి మురిసిపోతున్న పాలకులకు, దారిద్య్రరేఖకు దిగువన జీవిస్తున్న (బీపీఎల్) భారతీయుల శాతం రోజురోజుకూ పెరిగిపోవడం ముచ్చెమటలు పట్టిస్తోంది. దేశంలో బీపీఎల్ శాతం 28.3గా ప్రణాళికా సంఘం అంచనా వేయగా, టెండూల్కర్ కమిటీ 37.2 శాతంగా లెక్కగట్టింది.

2007-10 సంవత్సరాల మధ్య హైదరాబాద్ జిల్లా సాలుసరి సగటు ఆదాయం రూ. 59,234 కాగా మహబూబ్‌నగర్ జిల్లా తలసరి ఆదాయం రూ. 25,565. కృష్ణా జిల్లా తలసరి ఆదాయం రూ. 40,466 కాగా విజయనగరం జిల్లా తలసరి ఆదాయం రూ. 26,298. అలాగే, నెల్లూరు జిల్లా తలసరి ఆదాయం రూ. 35,700గా నమోదైతే, అనంతపురం జిల్లా సగటు ఆదాయం రూ. 29,421 మాత్రమే కావడం గమనార్హం.

దారిద్య్రం, నిరుద్యోగం బాధ ఎక్కడ ఉన్నా, అవి ప్రపంచ శాంతికి ప్రమాదకరంగా పరిణమిస్తాయన్నది అనాదిగా వినిపిస్తున్న హెచ్చరిక. దేశంలో విస్తృత స్థాయిలో ఉన్న పేదరికమే నేడు మన ముందున్న ప్రధాన సవాలు. అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాలకు సమానంగా అందకపోవడం దీనికి ఒక ప్రధాన కారణమన్నది విమర్శకుల వాదన.
ఆర్థిక అంతరాలు, సాంఘిక అసమానతలు తగ్గేవిధంగా ప్రణాళికలను రూపొందించుకోవాలి. తీవ్రవాద ప్రభావాలను తగ్గించి, ఆయా ప్రాంతాల అభివృద్ధికి సత్వరం కృషి జరగాలి. ఈ రకమైన లక్ష్యాల సాధనకు ఏర్పడిందే ‘వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి నిధి’ (బీఆర్‌జీఎఫ్). వెనుకబడ్డ జిల్లాల అభివృద్ధికి ప్రణాళికాబద్ధమైన చర్యలను చేపట్టడానికి భారత ప్రభుత్వం అనేక చర్యలను చేపట్టింది. 2006లో ఈ నిధిని ఏర్పాటు చేశారు. వెనుకబడ్డ జిల్లాల గుర్తింపుకు అనేక కమిటీలను నియమించారు.

గిద్వాని కమిటీ, పాండే కమిటీ, వాంఛూ కమిటీ, శర్మ కమిటీలు అలా ఏర్పడినవే. అప్పటిదాకా ప్రణాళికా సంఘం ఆధ్వర్యంలో అమలవుతున్న ‘రాష్ట్రీయ సమవికాస్ యోజన’ స్థానంలో ఈ కొత్త పథకాన్ని ప్రారంభించి పంచాయతీరాజ్‌శాఖ నియంత్రణలోకి తేవడం విశేషం. ఈ పథకం ప్రారంభానికి కొన్ని ప్రత్యేక లక్ష్యాలను ప్రకటించారు. వెనుకబడ్డ జిల్లాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో పాటు, పంచాయతీ స్థాయిలో ప్రభుత్వ వ్యవస్థలను బలోపేతం చేయాలన్నది ప్రధానం. ప్రస్తుతం అమలులో ఉన్న పథకాల ద్వారా స్థానికంగా మౌలిక వసతుల కల్పనకు చాలినంత నిధులు లభించని పక్షంలో, ఈ నిధి నుంచి సహాయం పొందవచ్చు. స్థానిక సంస్థలు తమ అవసరాలకు తగినట్టు ప్రణాళికలను రూపొందించి అమలు చేసుకోవడానికి ఈ పథకం ఇతోధికంగా దోహదపడుతుంది. పంచాయతీ సంస్థలు సాంకేతికపరంగానూ పాలనాపరంగానూ తమ నైపుణ్యాన్ని పెంచుకోవడానికి ఇదొక మంచి అవకాశం.

ఆంధ్రప్రదేశ్‌లో ఈ పథకం ప్రస్తుతం 13 జిల్లాల్లో అమలులో ఉంది. హైదరాబాద్ మినహా తెలంగాణలోని 9 జిల్లాలు, కర్నూలు మినహా రాయలసీమలో 3 జిల్లాలు, కోస్తా ప్రాంతంలోని విజయనగరం జిల్లాను ఈ పథకం అమలుకు ఎంపిక చేశారు. తీవ్రవాదాన్ని, పేదరికాన్ని నివారించడానికి ఈ పథకం ద్వారా ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. గతంలో దేశవ్యాప్తంగా వంద జిల్లాలను ఎంపిక చేసినప్పుడు, రాష్ట్రం వాటా 10 జిల్లాలు మాత్రమే. తదనంతరం ఆ సంఖ్య 250కి పెరగడంతో, రాష్ట్రంలో అదనంగా అనంతపురం, కడప, రంగారెడ్డి జిల్లాలు చేరాయి. 11వ పంచవర్ష ప్రణాళికలో ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌కు మంజూరు చేసిన ఆర్థిక సహాయం సుమారు రూ. 1,676 కోట్లు. అంటే ఏడాదికి సగటున దాదాపు రూ. 335 కోట్లు. జిల్లాల అభివృద్ధికి, అసమానతల తగ్గింపుకు బీఆర్‌జీఎఫ్ ఒక పాక్షికమైన పరిష్కారం మాత్రమేనన్నది మరువ కూడదు. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి సూక్ష్మ స్థాయిలో మరిన్ని ప్రణాళికలు ఎంతైనా అవసరం.

దేశ సమగ్రతను, ఐక్యతను కాపాడి సుపరిపాలన సాధించడానికి పేదరికాన్ని తొలగించడం, అసమానతలను రూపుమాపడం ప్రధాన ఎజెండా కావాలి. పంచవర్ష ప్రణాళికల అమలులో నేర్చుకున్న ప్రధాన గుణపాఠంతోనే వికేంద్రీకృత, సూక్ష్మస్థాయి ప్రణాళికల ఆవశ్యకతను గుర్తించామన్నది గమనించదగ్గది. జాతీయస్థాయి స్థూల ప్రణాళికలు దేశాభివృద్ధికి ఎంత అవసరమో, పంచాయతీ, మండల, జిల్లాస్థాయి అభివృద్ధి ప్రణాళికలు దేశ సమగ్రతకు, గ్రామీణప్రాంత సమగ్రాభివృద్ధికి అంతే అవసరం. ఈ ప్రణాళికలు ప్రజల భాగస్వామ్యంతో, వారి అవసరాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందాలి. అప్పుడే స్థానిక ప్రజలు ఆ ప్రణాళికలను తమవిగా భావించి, వాటి అమలులో ఇష్టపూర్వకంగా పాల్గొంటారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా ఎన్ని ప్రణాళికలు రూపొందినా లక్ష్యం నెరవేరదన్నది గత ఆరు దశాబ్దాల చరిత్ర గుర్తు చేస్తోంది.

ఆర్థికాభివృద్ధికి, సామాజిక న్యాయ సాధనకు అవసరమైన వార్షిక ప్రణాళికలను ఒక యజ్ఞంలాగా పంచాయతీరాజ్ సంస్థలు రూపొందించి అమలు చేయాలన్నది 73, 74 రాజ్యాంగ సవరణల ముఖ్య ఉద్దేశం. ఈ సవరణలతోనే ‘జిల్లా ప్రణాళికా కమిటీ’ (డీపీసీ)ల ఏర్పాటుకు వెసులుబాటు కలిగింది. ఆంధ్రప్రదేశ్‌లో 2003 నుంచీ డీపీసీలు అమలులోకి వచ్చినట్టు ప్రకటించినప్పటికీ, 2007 నుంచి మాత్రమే అవి అమలుకు నోచుకోవడం ప్రారంభమైంది. ఈ కమిటీలకు జిల్లాపరిషత్ అధ్యక్షులు చైర్‌పర్సన్‌లు కాగా, జిల్లా కలెక్టర్ కార్యదర్శిగా వ్యవహరిస్తారు. వీరుకాక 28 మంది సభ్యులు ఉంటారు. వీరిలో 24 మంది జెడ్పీటీసీ, మునిసిపల్ కమిటీ సభ్యుల నుంచి ఎన్నికవుతారు.

మిగిలిన నలుగురు ప్రణాళికా వ్యవహారాల్లో నిపుణులైనవారుగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా ప్రణాళికా కమిటీలు ఉన్నప్పటికీ, కొన్ని రాజకీయ కారణాల వల్ల అవి కేవలం బీఆర్‌జీఎఫ్ ద్వారా వచ్చే నిధులకు మాత్రమే పరిమితమై ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తున్నాయి. ఇది అంత మంచిది కాదు. అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే జిల్లా ప్రణాళికా కమిటీలు విస్తృత స్థాయిలో ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలి.

ప్రజల భాగస్వామ్యంతో చక్కటి ప్రణాళికలు రూపొందినప్పుడే పంచాయతీరాజ్ వ్యవస్థ పరిపూర్ణమై, మరింతగా పరిపుష్టమవుతుంది. స్థానిక ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు రూపొందాలి. ప్రతి ప్రాంత అభివృద్ధికీ ఒక ప్రత్యేక విజన్ ఉండాలి.

2011 జనవరిలో జిల్లా ప్రణాళికా కమిటీలను దృష్టిలో పెట్టుకుని అనేక మార్గదర్శకాలను రూపొందించారు. స్థానికంగా తయారైన ప్రణాళికలను, ఎంపిక చేసుకున్న పథకాలను డీపీసీలు ఇష్టమొచ్చిన రీతిలో మార్చడానికి వీలులేదు. ప్రణాళికల్లో మార్పులను కిందిస్థాయి సంస్థలకు తెలియజేయాలి. తమవద్దకు చేరిన స్థానిక ప్రణాళికలను క్రమబద్ధీకరించి, క్రోడీకరించి జిల్లా ప్రణాళిక ను స్థిరీకరించుకోవాలి. ప్రణాళికల్లో నిర్దేశించిన పనుల నిర్వహణ, పర్యవేక్షణతో పాటు నెలవారీ పనిని కూడా సమీక్షించుకుని గుణాత్మకమైన విజయాలను సాధించడానికి డీపీసీలు కృషి చేయాలి.

జిల్లా ప్రణాళికా కమిటీలు సమగ్రంగా రూపుదిద్దుకోవడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధను కనపరచినపుడే, అవి మంచి విజయాలను సాధించడం సులభతరమవుతుంది. నిష్ణాతులైన సిబ్బందిని నియమించి, ఆర్థికపరమైన ఆసరాను అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాల్సిన అవసరం ఉంది. జిల్లా ప్రణాళికాధికారి అన్నిరకాలుగా సహాయ సహకారాలు అందించాలి. 12వ పంచవర్ష ప్రణాళికను రాష్టస్థ్రాయిలో ఆమోదించే తరుణంలో, ఆయా ప్రణాళికలు కింది స్థాయి నుంచి, గ్రామ సభలు మొదలైనవాటి ద్వారా సంపూర్ణ ఆమోదంతో రూపొందేలా చర్యలు తీసుకోవాలి. గ్రామీణాభివృద్ధిలో పాలుపంచుకుంటున్న స్వచ్ఛంద సంస్థలను కూడా భాగస్వాములను చేయాలి.

వేగవంతమైన అభివృద్ధి, సమగ్రమైన సమ్మిళత అభివృద్ధిని సాధించడానికి వికేంద్రీకృత, సూక్ష్మస్థాయి ప్రణాళికలు ప్రధాన కార్యరంగంగా ప్రభుత్వాలు కృషి చేయాలి. 73, 74 రాజ్యాంగ సవరణలు పంచాయతీరాజ్ వ్యవస్థను తృతీయ అంచె ప్రభుత్వాలుగా గుర్తించాయన్నది దృష్టిలో ఉంచుకుని తదనుగుణంగా వాటి కార్యాచరణను రూపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధతో చర్యలు చేపట్టినప్పుడే గ్రామీణప్రాంతాల సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుంది. స్థానిక స్థాయిలోని ప్రభుత్వ వ్యవస్థలు ఎంత పటిష్టంగా పనిచేస్తే, ఉగ్రవాదాలను, వేర్పాటువాదాలను అంత త్వరగా రూపుమాపవచ్చన్నది పాలకులు ఇప్పటికైనా గుర్తించాలి.

-  ఎంఎల్ కాంతారావు, విశ్రాంతాచార్యులు, ఎస్.కె.యూనివర్శిటీ
( ఏప్రిల్ 24 జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా సాక్షి వార్తాపత్రికలో ప్రచురితమైనది )

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి