16, ఏప్రిల్ 2011, శనివారం

తెలు'గోడు'

తెలు'గోడు'
అయ్యా కే.సి.ఆర్. గారు,

పాపం ఇన్నాళ్ళు మీకు తల్లే లేదని తెలిసినప్పటి నుంచి ఎంతో మనోవేదన చెంది ఈ ఉత్తరం వ్రాస్తున్నాను! తెలుగు వాళ్ళందరికీ తల్లి అయిన తెలుగుతల్లి, మీకు మరియు మీరు మాత్రమే యావత్ తెలంగాణకి ప్రతినిధిగా భావించే మీ వంధిమాగధులకీ, మాత్రం తల్లి కాదని తెలిసి ఎంతో బాధ పడ్డాను. తెలుగు తల్లి కేవలం కోస్తాకి లేదా మీరు అనుకునే ఆంధ్రాకి మాత్రమే తల్లి అని తెలియ చెప్పి, మీకు, అజ్ఞానాంధకారం లోంచి వెలుగు చూపిన మీ ప్రొఫ్.జయశంకర్ సర్వదా అభినందనీయులు.

ఏ నిరంకుశ పాలన నుంచి విముక్తి పొందాలని తెలంగాణా యోధులు ప్రాణాలు అర్పించారో ఆ నియంత నిజాంని కీర్తించిన మీ ఉదార బుద్ది శ్లాఘనీయం. మీరు ఆ రావణ పరబ్రహ్మ కన్న చాలా ఘనులు. వివిధ వేదికలపై "తెలంగాణా కోసం తల నరుక్కుంటాను" అని ప్రకటించిన సందర్బాలు పదికి పైచీలే. పైగా ఇంకా ఒకటి మిగిలే వుంది! ఆ మధ్య తెలంగాణా కోసం మీరు చేసిన ఒక పూట "ఆమరణ నిరాహారదీక్ష" వంటి సాహస కార్యక్రమాలు మాకు ఇంకా గుర్తువున్నాయి.

చైతన్యం కొరవడిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పునఃఉత్తేజితం చేసి తమిళనాడు ,బీహార్, ఉత్తరప్రదేశ్ ల స్థాయికి తీసుకువెళ్ళగలిగిన సత్తా మీకు మాత్రమే వుంది. ఎంతో స్వార్ధ ప్రాంతీయ అభిమానాలున్న రాజకీయనాయకుల మధ్య మీ విజయనగరాన్ని కలలో కూడా తలవకుండ తెలంగాణా విముక్తి కోసం “ఆంధ్రోళ్ళ బొంద“ పెడుతున్న మీరు నిజమైన ఆదర్శ మూర్తులు.

తెలంగాణా నుంచి 20 వేల కిలోమీటర్లు తరలి వచ్చి పరాయి దేశాల్లో స్థిరపడి అక్కడే వుద్యోగాలు చేసుకుంటూ ఎన్నో యేళ్ళుగ ఎంతో సంపద కూడబెట్టినా మాతృభూమి పై మమకారం చావక, తెలంగాణా వాళ్ళ వుద్యోగాలను హరిస్తున్న పక్క జిల్లా సాటి తెలుగు వాళ్ళని తెలంగాణా గడ్డ పైనుంచి తరిమి కొట్టాలని అకుంఠిత దీక్షతో కోట్లు కుమ్మరిస్తున్న ప్రవాస ఆంధ్రుల కాదు కాదు ప్రవాస తెలంగాణీయుల అండ దండలు మీకు సర్వదా వుండాలని అభిలషిస్తున్నాను.

"స్వార్ధ సమైఖ్యాంధ్ర" నినాదంతో పనిచేసిన తెలుగుదేశం పార్టీ హయంలో, ఎన్నో మంత్రి పదవుల శిక్షల్ని ఓర్పుతో భరించిన మీ త్యాగనిరతిని తెలంగాణా ప్రజలు ఎప్పటి మరచి పోరాదని తెలంగాణా దేవుడైన ఆ యాదగిరి గుట్ట నృసింహ స్వామిని వేడుకుంటున్నాను.

మీ తెలు"గోడు"
Posted by Phani Polapragada - ఫణి పోలాప్రగడ at 5:14 PM

4 కామెంట్‌లు:

  1. తెలుగు తల్లి మీ తల్లయితే భరతమాత సవతి తల్లి అవుతుందా? ఎక్కడా భాషలను కలుపుతూ తల్లులుండరు, ప్రపంచంలో ఎక్కడయినా ప్రాంతాలకే తల్లులుంటారు. ఇక్కడ తల్లి అనేది వాస్తవం కాదు, కేవలం ఒక కాల్పిక భావన అయినప్పుడు తెలంగాణ తల్లే మా తల్లి అని తెలంగాణవారు భావిస్తే మీకభ్యంతరం ఏమిటి? ఎవరిని మోసగించడానికి ఇలాంటి రాతలు?

    రిప్లయితొలగించండి
  2. విశ్వరూప్ గారు ,
    "ఎక్కడా భాషలను కలుపుతూ తల్లులుండరు" అని వ్రాశారు. ఫణి పోలాప్రగడ గారు వ్రాసింది భాష గురించి కాదుగా?
    "తెలుగు తల్లి పాలవెల్లి తేట మాటల పూలు జల్లి ","మాతెలుగు తల్లికి మల్లె పూదండ " చదివారా? లేక విన్నారా ?
    ఎవరిని మోసగించడానికి ఇలాంటి రాతలు మీరు వ్రాసేది ?

    రిప్లయితొలగించండి
  3. శ్రీ విశ్వరూప్ గారు,తె లంగాణా వారికి ఒకరు కాదు ఇద్దరు కాదు ప్రస్తుతం అనేకమంది తల్లులు ఉన్నారు. ఒకటి వారి కన్న తల్లి, భారత మాత, తెలుగుతల్లి, కెసీఆర్ ఇచ్చిన తెలంగాణా తల్లి, విజయశాంతి ఇచ్చిన తల్లి తెలంగాణా ఇంకా ఎన్నో తెలిసిన, తెలియని తల్లులు. ఈ తల్లులన్దరిలోను ఎ తల్లిని కెసీఆర్ గారు కొలుస్తారు సార్. కెసీఆర్ గారి అనుయాయులు మాత్రం వారి స్వంత తల్లిని వదలి, కెసీఆర్ గారి తల్లినే కొలుస్తారని మాత్రం ఘంటపథంగా చెప్పగలను.

    రిప్లయితొలగించండి
  4. రవీంద్రనాథ్,

    మీరు గంగాభవాని తల్లినీ, నన్నెపనేని తల్లినీ, లక్ష్మీపార్వతి తల్లినీ, సోనియమ్మ తల్లినీ మరిచినట్టున్నారు. ఇవ్వాలనే కడపలో చెప్పగా విన్నాను, విజయమ్మ గారు రాష్ట్రమంతటికీ తల్లట (విడిపొయ్యాక సీమాంధ్రకే తల్లనుకోండి). మరింతమంది తల్లులుండగా అదేంటి అమాయకంగా ఫని పోలాప్రగడ గారేమో తెలుగుతల్లి లేకపోతే ఇన్నాల్లు తల్లే లేదా అంటూ అమాయకంగా అడుగుతున్నాడు?

    రిప్లయితొలగించండి