18, ఏప్రిల్ 2011, సోమవారం

ప్రభుత్వోద్యోగుల సహాయనిరాకరణ ఎవరెవరి నడ్డి విరిచింది?

 ఈ ప్రశ్నకు అంత సులువుగా  సమాధానం దొరకదు. ఎవరైనా మాకు అన్యాయం జరిగింది అన్నారంటే  వారిని తెలంగాణా  ద్రోహులగానో, సీమాంధ్ర నుండి వలసవచ్చిన వారిగానో ముద్రవేయడం ఖాయం. ప్రభుత్వోద్యోగులు తమ విధులకు హాజరు కాకపొతే సంక్షేమ కార్యక్రమాల లబ్దిదారులు ఎన్నో ఇబ్బందులకు గురవుతారు. అందులో అర్థం కాకపోవడానికి ఏమి లేదు. సంఖ్యాబలం మెండుగా ఉన్నా అటువంటివారికి బారెడు నోరు ఉండదు కాబట్టి వారి మాటలు మీడియాకు వినిపించవు. జనాభాలో ఒక్కశాతం కూడా లేనివారు చేసే పార్ట్ టైం ఆందోళనలకు(  ఆఫీసు ముందు టెంట్ వెయ్యడం, ఒక పూట ధర్నాకు కూర్చోవడం, ఫోటోలకు ఫోజులివ్వడం, ఐదు కాగానే నిమ్మకాయి రసం పుచ్చుకొని సెలవు తీసుకోవడం) అటువంటివారు బలి అవుతూనే వుంటారు. 

ఈ రిపోర్ట్ ను చదవండి

 ఈ సంవత్సరం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ  ఉపాధి పథకం  పనులలో  నిజామాబాదు జిల్లా మొదటి స్థానం నుండి నాల్గవ స్థానానికి పడిపోయింది. ఇతర తెలంగాణా జిల్లాల పరిస్థితి మనకు తెలియదు. ఒక పక్క ప్రభుత్వోద్యోగులు సహాయనిరాకరణ పేరుతో గుర్రుపెట్టి ఇంట్లో నిద్రపోయినా వారి జీతాలకు ధోకా ఉండదు. ఆ పరిస్థితే వస్తే  ఎందుకూ కొరగాని 'రకరకాల' జేఏసి సభ్యులు టివీ స్టూడియోలకెక్కి ప్రభుత్వాన్నే బెదిరిస్తారు.మరో పక్క రోజు కూలీలకు పనిచేసే వాళ్ళు మాత్రం ఖాళీ చేతులతో ఇంటికి వెళ్ళాల్సి వచ్చినా పట్టించుకునే దిక్కు లేదు. హైదరాబాద్ మహానగరం విషయాన్నే తీసుకుంటే చీటికి మాటికి ఇచ్చే బంద్ పిలుపులు మూలంగా సగటు పౌరుడు రవాణా సౌకర్యం లేక రోడ్డుపై తిప్పలుపడుతుండగా, చిన్న వ్యాపారులు మరియు  రోజు కూలీలు బాగా నష్టపోతున్నారు. ఇంత జరుగుతున్నా ఒక ప్రాంతీయ పక్షపాతి జడ్జి గారి ముసుగు వేసుకొని విధ్వంసకారుల ప్రజాస్వామ్యక హక్కుల గురించి ఉచిత అభిప్రాయాలు చెబుతారు. ఆయనలాంటి వారు  హైదరాబాద్ లో బందు రోజున సగటు పౌరుడిగా జీవిస్తే ప్రజాహక్కుల గురించి ఇంకా బాగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తారేమో!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి