16, ఏప్రిల్ 2011, శనివారం

వేర్పాటుపై ‘శ్రీకృష్ణ’ ఒంటరి కాదు!

తనది ‘వీర తెలంగాణయే గాని వేరు తెలంగాణ కాదు’ అని నిర్ద్వంద్వంగా ప్రకటించిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు రావి నారాయణరెడ్డి తెలంగాణ భవితవ్యాన్ని, మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఎంతో ఆవేదనతో చేసిన ప్రతిపాదనకు మించి, శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో అదనంగా ప్రత్యేకించి చెప్పిందేమీ లేదు!

2002 నాటి బొంబాయి ఘటనలపై నిష్పాక్షిక విచారణ జరిపిన జస్టిస్ శ్రీకృష్ణ ఉభయ మతాలకు చెందిన వారిని శఠిస్తూ, రుజువులతో కేసులు నమోదు చేయడానికి అనువైన విస్పష్ట నివేదికను సమర్పించినందుకే ఆ ఘర్షణలలో ప్రత్యక్ష పాత్ర వహించిన రెండు మత రాజకీయ పక్షాలు ప్రస్తుతపు శ్రీకృష్ణ కమిటీ నివేదికను వ్యతిరేకిస్తున్నాయన్నది దాచేస్తే దాగని సత్యం.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వ్యక్తుల పదవీకాంక్ష చుట్టూ తిరుగుతూ తెలుగుజాతిని తమ స్వార్థం కోసం విభజించి తాము ఎలా లబ్ధిపొందాలన్న ‘ఆబ’ చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. ‘మేధావులు’ అనుకుంటున్న కొంతమంది ‘మేతావులు’గా మారి అనాలోచితంగా వ్యవహ రిస్తున్నారు. రాష్ట్ర సమస్యల పరిశీలనకు కేంద్రాధికారంతో ఏర్పడిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ రూపొందించిన నివేదిక గురించి, ముఖ్యంగా పదవీ వేటలో ఉన్న కొందరు రాజకీయులు సృష్టించిన ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా విభిన్న కోణాల నుంచి రాష్ట్రంలో ‘‘శాంతి-భద్రతల’’ సమస్యపైన కమిటీ వెలిబుచ్చిన అభిప్రాయాల గురించీ ఎవరికి తోచిన వ్యాఖ్యలు, విమర్శలూ వారు చేస్తున్నారు. ఇక కొంత మందైతే కమిటీ కేంద్రానికి సమర్పించిన నివేదికలో భాగంగా ఆంతరంగిక శాంతి-భద్రతలకు చెందిన 8వ అధ్యాయాన్ని ఏదో ‘దేవతా వస్ర్తాల కథ’లా భావించారే గాని ‘సమస్య’ను మరింత జటిలం చేస్తూ మరిన్ని సమస్యల్ని పెంచకుండా ఉండేందుకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఏ పూర్వరంగంలో కమిటీ ఆవేదన వెలిబుచ్చిందో అర్థం చేసుకోడానికి ప్రయత్నించలేదు.

శ్రీకృష్ణ కమిటీ ఆంధ్రప్రదేశ్ భవితవ్యాన్ని, రాష్ట్ర ప్రజల విశాల ప్రయోజ నాలను, దేశ సమగ్రతను, తెలుగుజాతి సమైక్యతనూ, మూడు ప్రాంతాల ప్రజల మనోభావా లనూ దృష్టిలో పెట్టుకొని పరిపూర్ణమైన, ఆచరణ సాధ్యమైన చర్చ కోసం సమస్యా పరిష్కారానికి ఆరు ప్రత్యామ్నాయ సూచనలు చేసింది. 8వ అధ్యాయంలో చర్చించిన అంశాలను, రాజ కీయులు కల్పించిన అవాం ఛనీయ వాతావరణంలో బహి రంగపరచడం మంచిది కాదని కమిటీ భావించి ఉండవచ్చు. అయినా రాష్ట్ర సమస్యపైన పరిశీలనకు శ్రీకృష్ణ కమిటీని ఏర్పరచినప్పుడే కేంద్రప్రభుత్వం కమిటీ పరిశీలనలోకి తీసుకోవలసిన అంశాల్ని ఖరారు చేసింది. కమిటీ ‘‘కార్యాచరణ ప్రణా ళికను, మార్గ నిర్దేశాన్ని సూచించాలి.. కమిటీ ఏది తగిన పరిష్కారమనుకుంటుందో అందుకు సంబంధించిన ఏ ఇతర సూచనలనైనా లేదా ఏ సిఫారసు లనయినా కమిటీ చేయవచ్చు’’ అని ‘‘టరమ్స్ ఆఫ్ రిఫరెన్సు’’లో స్పష్టంగా ఉన్నది.

ఇలాంటి పరిస్థితే గతంలో ఆంధ్రప్రదేశ్ అవతరణకు ముందు అటూ ఇటూ కాకుండా ‘గోడ మీద పిల్లివాటం’గా సిఫారసులు చేసిన ఫజల్‌అలీ కమిషన్ విషయంలో కూడా తెలుగు జాతికి ఎదురయిందన్నది మరచిపోరాదు. రెండు పడవలపైన కాళ్లు పెట్టిన ఫజల్‌అలీ కమిషన్ ఆనాడు ఒక వైపున ఆంధ్ర జాతి అంతా కలిసి ఉంటే ఒనగూరగల అపారమైన ఆభివృద్ధి అవకాశాలూ, సౌలభ్యాలు ఏమిటో చెప్పి, ఇంకో వైపు నుంచి ప్రత్యేక రాష్ట్రంగా యథాతథంగా హైదరాబాద్ స్టేట్ కొనసాగితే మంచిదని కూడా సూచించింది! కాగా ప్రస్తుతపు శ్రీకృష్ణ కమిటీ కూడా రాష్ట్ర సమస్యలన్నింటినీ ప్రాంతాల వారీగా, గత 55 ఏళ్లుగా సమైక్యాంధ్రప్రదేశ్‌గా కొనసాగిన పూర్వరంగంలో కమ్యూ నికేషన్స్, విద్య, వైద్యం, నీటిపారుదల, ఉపాధి రంగా లలో సాధించిన ప్రగతి (1956 నాటితో పోల్చి)పై సాధికారికంగా అంచనాలు వేసింది. 17 జిల్లాలు పర్య టించి అన్ని ప్రాంతాల ప్రతినిధులతోనూ చర్చించింది.

రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలోనూ వెనుకబడిన ప్రాంతాలున్నాయని చెబుతూనే, బడుగు భాగాలను ప్రత్యేక ప్యాకేజీల ద్వారా ఎలా మరింత వృద్ధిలోకి తీసుకురావచ్చునో చర్చించింది. మూడు ప్రాంతాలలోని సమస్యలతోను, అభివృద్ధి శాతాలతోనూ పోల్చితే రాయల సీమ ఎలా అన్నింటికన్నా వెనుకబడి కుందుతోందో కూడా చెప్పింది. మూడు ప్రాంతాలలోనూ ఏ జిల్లాలు ఇంకా అభివృద్ధి చెందాలో, చెందగల అవకాశాలున్నాయో కూడా చెప్పింది. మొత్తం పరిశీలనానంతరం రాష్ట్ర సమస్యకు పరిష్కారంగా ఆరు సూచనలు ప్రతిపాదించింది.

అంతర్జాతీయ స్థాయిగల మహానగరంగా హైదరా బాద్ ఎదిగి ఉన్నందున దాని ప్రతిపత్తిని గురించి కూడా కమిటీ రెండు మూడు రకాల ప్రతిపాదనలు చేసింది. ఎందుకంటే రెండు రకాల అభిప్రాయాలను వెలిబుచ్చిన ఫజల్ అలీ కమిషన్ (1954-55) నివేదిక మనకు రుచిం చగా లేనిది రాష్ట్ర సమైక్యతకు మొదటి ప్రాధాన్యతనిస్తూ పలు ప్రత్యామ్నాయాలు సూచించిన శ్రీకృష్ణ కమిటీ నివేదికను అంతే సంయమనంతో ఎందుకు స్వీకరించరు?

దేశ భద్రతకు, రాష్ట్రంలో శాంతిభద్రతలకు సంబం ధించిన విషయంలో విచారణ కమిటీల నివేదికలను గానీ, వాటిలోని కొన్ని అధ్యాయాల్ని రహస్యంగా ఉంచడం గానీ బహిరంగపరచకుండా కేవలం ప్రభుత్వ పాలనా యం త్రాంగం పరిశీలనకుగానీ గతంలో కొన్ని సందర్భాల్లో కమిషన్లు/కమిటీలు వదిలిపెట్టాయి. చివరికి రాజకీయ వేత్తలకు-మాఫియాకు-పోలీసులకూ మధ్య సంబంధా లపై నివేదిక రూపొందించిన వోహ్రా కమిటీ కూడా సంపూర్ణ నివేదికను చాలా కాలం వరకూ అందుబాటులో ఉంచలేదు! అయితే ఈ ‘చూపకపోవడం’ ఎందుకు ఎలాం టి పరిస్థితులలో జరుగుతుందో తెలుసుకోవాలంటే... తెలంగాణ సాయుధ పోరాట యోధుడైన స్వర్గీయ రావి నారాయణరెడ్డిగారు తన ‘అనుభవాలు - జ్ఞాపకాలు’ రచనలో చెప్పిన ఆ నాడు జరిగిన కొన్ని అవాంఛనీయ పరిణామాలను తెలుసుకోవాలి. అందులోనే ఆయన తెలంగాణ చీలిపోతే ప్రజలకు ఎదురయ్యే అనూహ్యమైన ఇబ్బందులను ఏకరువు పెట్టారు.

ఆ మాటకొస్తే నేడు జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని 8వ అధ్యాయంలో కమిటీ ఏ ‘శాంతి- భద్రతల’ పరిస్థితి గురించి ఆవేదనపడి ఆ సమస్యలను వివరించే అంశాలను ప్రభుత్వ పరిశీలనకు వేరుగా పంపించిందో, ఏ ‘శాంతి-భద్రతల’ గురించి అది అం తగా ఆందోళన పడిందో-సరిగ్గా ఆ ఆందోళన ఎంత సరైనదో, ఎక్కడో కాదు, ఎప్పుడో కాదు, ఇటీవలనే మన కళ్ల ముందు రుజువయింది! రాష్ట్ర గవర్నర్‌పైన, రాష్ట్ర శాసనసభ సభ్యులు కొందరిపైన శాసన వేదికలోనూ, వేదిక బయట ‘మీడియా పాయింట్’ వద్దా కొందరు తెలంగాణ ఉద్యమ నాయకులే దౌర్జన్యానికి, హింసాకాం డకు పాల్పడటమూ, తెలుగుజాతి గర్వించదగిన, సాహితీ, సంస్కృతీ తేజోమూర్తుల విగ్రహాలను విధ్వంసం చేయ డమూ, శాంతి-భద్రతల సమస్యపై శ్రీకృష్ణ కమిటీ నిర్ణ యం (రహస్య నివేదన) సబబైనదని నిరూపించడం లేదా? ఈ పూర్వరంగంలో రావి నారాయణరెడ్డిగారు తన ‘అనుభవాలు-జ్ఞాపకాలు’ గ్రంథంలో నమోదు చేసిన రెండు మతాలకు చెందిన సంస్థలు తెలంగాణ ప్రజలకు ఆనాడు కలిగించిన క్షోభనూ, సృష్టించిన ప్రమాదకర పరిస్థితులనూ, రేకెత్తించిన అశాంతినీ, కల్లోలాన్నీ వివరిం చారు.

ఒక వైపున ఆ నాటి అభ్యుదయ నిరోధక సంస్థ అయిన ‘అంజుమన్ తబ్లీ గులిస్లాం’ అనే సంస్థ వారు, దానికి ప్రతిగా ‘ఆర్యసమాజం’, ‘హిందూ మహాసభ’ వారూ పరస్పరం బద్ధ విరోధులుగా బలవంతపు మతాం తరీకరణలకు, పునః మతాంతరీకరణలకు గజ్జె కట్టారు. ఆ సందర్భంగా ఒక మతం వారిని శుద్ధి చేసి తిరిగి హిందువు లుగా మార్చడానికి వేరే ‘శుద్ధి సభ’ అనే ప్రత్యేక సంస్థను నెలకొల్పడమూ జరిగింది. రావి నారాయణరెడ్డిగారు ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ‘ఈ రెండు మత సంస్థల కార్యకలా పాలవల్ల హైదరాబాద్ సంస్థానంలో మతోద్రేకాలు’ పెచ్చరిల్లడంతో చివరికి ఏ నిజాం నవాబు సాయంతో, ఆశీస్సులతో ‘తబ్లీ’ సంస్థ ఏర్పడిందో ఆ నిజామే ఈ రెం డు సంస్థలనూ నిషేధించవలసి వచ్చిందని వెల్లడించారు.

ఈ పద్ధతి ఘర్షణలను, మత ప్రాతిపదికపై తలెత్తే ఉద్య మాలను ఆంధ్ర మహాసభ, ఆంధ్ర జనసంఘం, కమ్యూ నిస్టు పార్టీ, కాంగ్రెస్‌లోని కొందరు సెక్యులర్ వాదులూ ఎదిరించి నిలబడ్డారు. ఆ నాడు తెలంగాణలో ఏ మత శక్తుల్ని ప్రజలు అదుపు చేయవలసివచ్చిందో, నేడు వేర్వేరు పార్టీల పేర్ల చాటున మరొక రూపంలో మత ఘర్షణలకు ఈ రోజూ హైదరాబాద్‌నూ, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలనూ ఉభయ పక్షాలకు చెందిన చాందస ఉగ్రవాద శక్తులు దఫదఫాలుగా కేంద్రాలుగా చేసుకుంటు న్నాయి. ఆనాడు ‘‘తబ్లీ’’ స్థానంలో ఎంఐఎం, నాటి ఆర్య సమాజ్, హిందూ మహాసభల స్థానంలో ఈ రోజున బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు రంగంలో ఉన్నాయి.

2002 నాటి బొంబాయి ఘటనలపై నిష్పాక్షిక విచా రణ జరిపిన జస్టిస్ శ్రీకృష్ణ ఉభయ మతాలకు చెందిన వారిని శఠిస్తూ, రుజువులతో కేసులు నమోదు చేయడానికి అనువైన విస్పష్ట నివేదికను సమర్పించినందుకే ఆ ఘర్షణలలో ప్రత్యక్ష పాత్ర వహించిన రెండు మత రాజ కీయ పక్షాలు ప్రస్తుతపు శ్రీకృష్ణ కమిటీ నివేదికను వ్యతిరేకి స్తున్నాయన్నది దాచేస్తే దాగని సత్యం. ఈ మత పక్షాలకు శ్రీకృష్ణపై ‘గుర్రు’కు అసలు కారణం అదే!

అలాగే మావోయిస్టులు / నక్సల్స్ గురించి కమిటీ చేసిన ప్రస్తావన కూడా కొత్తదేమీ కాదు. రావి నారాయణ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో ‘అసమానాభివృద్ధి’కి కారణాలపై శాస్ర్తీయ దృష్టితో ఇలా అంచనా వేశారు.
‘‘ఆంధ్రదేశంలో జరిగిన అభివృద్ధిని పరిశీలిస్తే కనబ డేదేమిటి? ఆంధ్ర ప్రాంతంలోని 70 నుండి 80 తాలూ కాలలో కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరులు, నెల్లూరు జిల్లాలలోని 20 తాలూకాలు మాత్రమే వ్యవసా యంలో అభివృద్ధి చెందాయి. ఈ 20 తాలూకాలలో వచ్చిన అభివృద్ధి అంతా గత 12 సంవత్సరాలలోనే (1960-1972) జరగలేదు. ఈ జిల్లాల్లో జరిగిన అభివృద్ధికి తొలి కారణం అక్కడ ప్రకృతి సిద్ధంగా భౌగోళికంగా ఉన్న పరిస్థితి, సారవంత మైన భూమి, సర్ ఆర్థర్ కాటన్ కృష్ణా, గోదావరి ఆనకట్టలను శతాబ్దం క్రితమే నిర్మించి కాలవల ద్వారా చేసిన నీటి సరఫరా ఇందుకు కారణాలు.

ఈ 20 తాలూకాలు మినహా మిగిలిన ఆంధ్ర ప్రాంతమంతా తెలంగాణ జిల్లాల వలెనే వెనుకబడి ఉంది. కొన్ని ప్రాంతాలు ఇంకా వెనుకబడే ఉన్నాయి. రాయలసీమ నిత్యం కరువులకు ఆటపట్టుగా ఉంది. ఈ కరువు నివారణకు గత 12 సంవత్సరాలలో (1960- 1970) ప్రభుత్వం ఇంచుమించు ఏమీ చేయలేదని చెప్పవచ్చు’’!

‘పెద్దమనుషుల ఒప్పందం’ ప్రకారం రక్షణలకు సంబంధించి అమలుజరగని కొన్ని భాగాలు అమలు జరపకపోవడానికి రావి నారాయణరెడ్డి చూపిన కారణా లలో ప్రధానమైనవిగా పేర్కొన్న రెండు రాజకీయ కారణా లలో ఒకటి ‘‘కాంగ్రెస్ వారిలో పదవుల కోసం వచ్చిన లోలోపలి కీచులాటలు కాగా, రెండవది తెలంగాణ నాయ కుల పచ్చి అవకాశవాద స్వార్థపరత్వం, మూడవ కారణం విద్యాధికుల నిరుద్యోగ సమస్య’’ 1955-56 నాటి తెలం గాణలోని పరిస్థితితో 1972 నాటి పరిస్థితిని పోలుస్తూ ఆయనే ఇలా చెప్పారు; ‘‘లోగడ 1955-56లో వచ్చిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కాలానికీ, 1969లో వచ్చిన ఉద్యమ కాలానికీ మధ్య తెలంగాణలో విద్యాలయాలు పెరిగి విద్యార్థుల సంఖ్యా పెరిగింది. ఒక్కొక్క జిల్లాలో వందలకొలదీ హైస్కూళ్లు నెలకొన్నాయి. ప్రభుత్వ దుష్ట విధానాలవల్ల నిరుద్యోగ సమస్య భయంకరంగా తయార యింది. దీన్ని ప్రత్యేక తెలంగాణవాదులయిన నాయకులు తమ స్వార్థానికి ఉపయోగించుకున్నారు.’’

అయితే, ఈ పరిస్థితులలో ‘ఉద్యమం విపరీతమైన వెర్రితలలు’ వేసినప్పుడు తెలంగాణ ప్రాంతంలో కమ్యూ నిస్టు పార్టీ, నాయకులు ఇచ్చిన ఉపన్యాసాల ప్రభావం ఆంధ్ర ప్రజల్లో సద్భావాన్ని కలిగించింది. అలాగే ఆంధ్ర ప్రాంతాల్లో పార్టీ నాయకులు ఇచ్చిన ఉపన్యాసాలూ తెలం గాణ ప్రాంత ప్రజలపైన చక్కని ప్రభావాన్ని కలిగించా యని, ఆయన చెప్పారు. అయితే ఆనాడు తెలంగాణ ప్రాంతంలో ‘అవకాశవాద స్వార్థపరత్వపు నాయకత్వం’ కారణంగా అవమానకరమైన రాతలతో గోడలు నింపే శారనీ, ఈ ‘రాతలను చూస్తే తెలంగాణ వాడినైన నాకు సిగ్గేసింద’నీ, ‘తలాతోకాలేని అపవాదులను ప్రచారంలో పెట్టారనీ’ రావి నారాయణరెడ్డి పేర్కొన్నారు.

రావి నారాయణరెడ్డిగారు ప్రత్యేక తెలంగాణ ఉద్య మం వల్ల ప్రజాజీవనానికి కలిగే దుష్ఫలితాలను ఇలా ఏకరువు పెట్టారు. ‘‘ఉద్యమం దుష్ఫలితాలు నగర ఆర్థిక జీవితంపై స్పష్టంగా అగుపడుచున్నవి. ఎన్నో భవనాల నిర్మాణం ఆగిపోయింది; కష్టజీవులకు కూలీ తగ్గింది. వర్తక వ్యాపారాలు సన్నగిల్లుతున్నాయి. టాక్సీల, రిక్షాల గిరాకీ తగ్గి పోతుంది. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే ఈ పరిణా మాలింకా తీవ్ర తరమౌతాయి.

‘‘అంతేకాదు, దివాళాకోరు ఆర్థిక పరిస్థితులు మాత్రమే ప్రత్యేక తెలంగాణకు సంక్రమిస్తాయి. ఇప్పుడు తెలంగాణ నిధులు అంటూ ఉన్న మిగులు, ప్రస్తుతం తెలంగాణలో వస్తున్న ఎక్సైజ్ ఆదాయం తెలంగాణ రాష్ట్రానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఏర్పరచడంలోనే హరించు కుపోతాయి. తెలంగాణ ఆంధ్ర నుండి విడిపోతే ఇన్నేళ్లుగా ఏర్పడిన మిగులు నిధులు చేతికి రావు. ఆస్తులు అప్పులు అన్నీ తేల్చేసరికి ఉమ్మడి రాష్ట్రం చేసిన అప్పు లన్నీ ఆ నిష్పత్తిలోనే తెలంగాణ మెడకు చుట్టుకుంటాయి. కేంద్రం నుండి వచ్చే వాటాల నిష్పత్తీ తగ్గిపోతుంది. అందుచేత ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే ఏదో అమాంతం అభివృద్ధి జరిగి పోతుందని కలలుకనే వారికి ఇవి పీడ కలలుగా పరిణమిస్తాయి. ఏ ఇతర అభివృద్ధి కార్యకలా పాలకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో డబ్బు ఉండదు. ప్రత్యేక తెలంగాణ ఆర్థికంగా స్వయంపోషకం గాని రాష్ట్రంగా తయారవుతుంది.’’

అంతేగాదు, చిన్న రాష్ట్రాల ఏర్పాటు కోసం ఉవ్వి ళ్లూరే వారిని ప్రస్తావిస్తూ రావి నారాయణ రెడ్డిగారు ఇలా జోస్యం పలికారు. ‘‘రాష్ట్రం చిన్నదైన కొద్దీ దేశంలోని గుత్త పెట్టుబడిదారీ వర్గాలకు ఆ రాష్ట్రంలో పెత్తనం చెలా యించడానికీ, కుట్రలు చేయడానికీ ఎక్కువ వీలుగా ఉంటుంది. రాష్ట్రాలను ముక్కచెక్కలుగా చేస్తే వాటిని సులువుగా తమ గుప్పెట్లో పెట్టుకోవచ్చు. పెద్ద రాష్ట్రాల యితే వారికి కొరుకుడు పడటం కష్టం. అందుకే నిజానికి బిర్లాలు, టాటాలు చిన్న రాష్ట్రాలను నేడు కోరు తున్నారు. సౌరాష్ట్ర, మధ్య భారత్, జార్ఖండ్, ఉత్తర, దక్షిణ యూపీలు ప్రత్యేక రాష్ట్రాలుగా కావాలని ఈ గుత్త వర్గాలు ఉబలా పడుతున్నాయి. ప్రత్యేక విదర్భ ఆందోళన ఇదివరకే ఉంది. అసలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర నినాదం ఆచరణ సాధ్యమైన నినాదం ఎన్నటికీ కాజాలదు. తెలంగాణకు ఇచ్చిన ప్రత్యేక రక్షణలను అమలు జరిపించుకోవడానికి ఎడతెగని ఐక్య ఆందోళన సాగించడం ఒక్కటే మార్గం, చీలిక వాదానికి వ్యతిరేకంగా ఉభయ ప్రాంతాలలోని ప్రజాతంత్ర అభివృద్ధికర శక్తులన్నీ ఏకం కావాలి’’,

నిజానికి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడైన రావి నారాయణరెడ్డి తెలంగాణ భవితవ్యాన్ని, మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఎంతో ఆవేదనతో చేసిన ప్రతిపాదనకు మించి, శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో అదనంగా ప్రత్యేకించి చెప్పిందేమీ లేదు!

‘‘విశాలాంధ్ర సమస్యను కాంగ్రెస్‌లోని అధికార గుద్దులాటల్లో ఒక భాగంగానే వీరు గుర్తించినట్టు స్పష్టమవుతోంది. జాతి సమైక్యతపైన వీరి నిర్లక్ష్య భావం క్షమించరానిది. ఈ ఒడంబడిక యథార్థంగా అమలు జరగలేదు. ఒడంబడికపైన సంతకాలు చేసిన వారందరూ అధికారానికి వచ్చిన వెంటనే ఆ ఒడంబడికను విస్మరిం చారు. ఇరుపక్షాల వారూ తమ మంత్రి పదవులకు రక్షణ కల్పించుకోవడంలోనే నిమగ్నులైపోయారు. తెలంగాణ మంత్రులు బాధ్యతగల శాఖలను నిర్వహిస్తూ కూడా ఒడంబడికలోని అంశాలను అమలు జరిపే బాధ్యత తమపై ఉండి కూడా పదవుల వేటలో వాటిని పూర్తిగా మరచిపోయారు’’.

ఈ లోటుపాట్లను శ్రీకృష్ణ కమిటీ కూడా గుర్తించి నివేదికలో ప్రస్తావించబట్టే రక్షణలకు సంబంధించి మెరు గైన పద్ధతిలో కొన్ని ప్రత్యేక సూచనలను చేసిందని గమనించాలి. ఈ రక్షణలను అన్ని పక్షాలూ కలిసి అమలు జరిగేటట్లు అవిశ్రాంతంగా పోరాడుతూ ఒత్తిడి తేవాలే గాని చీలికవాదం తెలంగాణ ప్రయోజనాలకు హానికర మనీ, అందుకే తనది ‘వీర తెలంగాణయే గాని వేరు తెలంగాణ కాదు’ అని రావి నిర్ద్వంద్వంగా ప్రకటించారు. ఆ ఒత్తిడికి తగిన బలమైన ప్రాతిపదికలను శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో పొందుపరచిందని గమనించాలి!

ఏబీకే ప్రసాద్
సీనియర్ పాత్రికేయులు
(ఈ రోజు సాక్షిలో ప్రచురితమైనది) 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి