4, మే 2011, బుధవారం

2010 జనవరి 18 - తెలంగాణ ఉద్యమంలో కంచె అయిలయ్య రోజు!


తెలంగాణ ఉద్యమంలో 2010 జనవరి 18 న హఠాత్తుగా కులం ప్రసక్తి తలెత్తింది. ఉద్యమ నేతల కులాలను ఎత్తిచూపి, ఎందుకు వాళ్లకింత ప్రాముఖ్యత, దళిత బహుజనులకు ప్రాముఖ్యత ఎందుకు లేదు అంటూ కంచె అయిలయ్య ప్రశ్నిస్తూంటే చర్చలో పాల్గొన్న ఇతర నాయకులు, విశ్లేషక శేఖరులూ కొండొకచో మాటల కోసం తడుముకోవాల్సి వచ్చింది.

అయిలయ్యవి సూటిప్రశ్నలు.., తెలంగాణ రాజకీయ జేయేసీకి కోదండరామిరెడ్డి నాయకుడు. తెదేపా తరపున నాగం జనార్దనరెడ్డి, కాంగ్రెసు తరపున జానారెడ్డి, రామిరెడ్డి దామోదరరెడ్డి,.. అంతా వీళ్ళేనా? ఏఁ, జేయేసీ నాయకుడిగా కోదండరామిరెడ్డి కాకుండా మంద కృష్ణ మాదిగను ఎందుకు పెట్టలేదు? మంద కృష్ణను జేయేసీ నాయకుడిగా చేసి, తెలంగాణ ఏర్పడ్డాక ఆయన్ను ముఖ్యమంత్రిగా చేస్తామని ప్రకటించండి అని అన్నాడు. మొన్నమొన్నటిదాకా సిద్ధాంతకర్త జయశంకర్ ఉండేవాడు, ఇప్పుడసలు కనబడ్డమే లేదు. ఎందుకు ఆయన్ను పక్కనబెట్టారు? -ఇదీ వరస!

జేయేసీ నాయకుడిగా కోదండరామిరెడ్డి తెలంగాణ వ్యాప్తంగా సర్పంచులను, స్థానిక ప్రజా ప్రతినిధులను తమ పదవులకు రాజీనామాలు చెయ్యమని అడుగుతున్నాడు. అసలు ముందు ఆయన రాజీనామా చెయ్యాలి. ఆయన చెయ్యకుండా ఇతరులను చెయ్యమనడం ఏంటి? అని అయిలయ్య ప్రశ్నించాడు. ఉద్యమం జరుగుతున్న కాలంలో ఒకరోజున హరీష్ రావు పెట్రోలు పోసుకుని అంటించుకుంటానన్నాడు. కానీ అందరూ ఆపారు. ఆ తరవాత పదుల సంఖ్యలో దళిత బహుజన పిల్లలు పెట్రోలు పోసుకుని కాల్చుకుని చనిపోయారు. ఇప్పుడు జేయేసీ నాయకుడు మీరు రాజీనామాలు చేసెయ్యండి అని అంటున్నాడుగానీ తాను మాత్రం రాజీనామా చెయ్యడం లేదు అని పాయింటు లాగాడు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన అత్యంత నిష్పాక్షిక (నిష్పాక్షికత = తెలంగాణ వాదం) రాజకీయ విశ్లేషకుడైన ఘంటా చక్రపాణి తన మామూలు ధోరణిలోనే - కోస్తా విద్యార్థి నాయకులను గౌరవించినట్టుగానే- అయిలయ్యనూ గౌరవించబోయాడు. 'ఆయా రాజకీయ పదవుల్లో ఉన్నవారు రాజీనామా చెయ్యడానికీ కోదండరామ్ రాజీనామా చెయ్యడానికీ సంబంధం ఏంటి? ఆ పదవుల్లో ఉన్నవాళ్లకు ఆ పదవే జీవనాధారం అంటే వాళ్లను అవమానించడమే' అని అన్నాడు. 'ఏదో బీసీలు బీసీలూ అని అంటున్నారే.. ఇంత ఉద్యమం జరుగుతూంటే బీసీలు ఎందుకు పాలుపంచుకోడం లేదండి?' అని అడిగాడు.  వెంటనే అయిలయ్య బీసీలను అవమానిస్తున్నారు అంటూ అనబోయాడు. నిష్పాక్షిక విశ్లేషకుడు వెంటనే సర్దుకుని, 'మీరెందుకు ఉద్యమంలో పాలుపంచుకోవడంలేదు?' అని అడిగాడు. 'మనలాగా స్టూడియోలకొచ్చి విమర్శించడం కాదండీ గొప్ప, ఉద్యమంలో చేరి, ప్రత్యక్ష కార్యాచరణలో పాలుపంచుకోవాలి' అనీ అన్నాడు. 'యూనివర్సిటీలో అంత ఉద్యమం జరుగుతూంటే కనీసం అటు తొంగైనా చూళ్ళేదు గానీ నాయకత్వం వహించి ఉద్యమాన్ని నడిపిస్తున్న కోదండరాం గారిని రాజీనామా చెయ్యమని అడగడమేంటండి' అంటూ ఈసడించాడు.

చర్చలో 'ఇప్పటిదాకా ఆయన్ను కోదండరామ్‌గానే ప్రజలెరుగుదురు. ఇప్పుడు మీరు రెడ్డి అంటూ కులం పేరుతో పిలిచి కులాన్ని మధ్యలోకి లాగుతున్నారు' అనే విమర్శ తలెత్తినపుడు, అయిలయ్య 'నేనేమీ కొత్తగా పిలవడం లేదు. యూనివర్సిటీలో ఆయన్ను కోదండరామిరెడ్డిగానే అందరూ పిలుస్తారు. ఇక్కడ కోదండరామ్ అని పిలుస్తున్న సంగతి నాకు తెలవదు' అని అన్నాడు.

అయిలయ్య కమ్యూనిస్టులను విమర్శిస్తూ, 'ఒక్క పుచ్చలపల్లి సుందరయ్య తప్పించి కమ్యూనిస్టుల్లో సరైన నాయకుడంటూ లేడు. అందరూ అగ్రకులాలకు చెందినవాళ్ళే. బెంగాల్లో కూడా అంతే.. బసులు, బెనర్జీలు, ముఖర్జీలు, .. అందరూ అగ్రకులాలవాళ్ళే', అంటూ విమర్శించాడు. చర్చలో మంద కృష్ణ పాల్గొంటూ, 'దళిత బహుజనులకు జేయేసీలో ప్రాముఖ్యత లేద'ని అయిలయ్యతో ఏకీభవించాడు. కడియం శ్రీహరి దళితులకు ప్రాధాన్యత లేదని అంగికరిస్తూనే, ప్రస్తుతం ఉద్యమమున్న పరిస్థితిలో ఏ కులాలను పట్టించుకోకూడదనీ, పక్కనబెట్టాలనీ అన్నాడు.

అయిలయ్యది దళిత బహుజనవాదం. ఈ వాదాన్ని ముందుకు తీసుకురావడానికి ఇది సందర్భమా కాదా అనేది ఆయనకు అనవసరం. తెలంగాణ ఏర్పడటం కంటే, దళిత బహుజనులు అధికారంలోకి రావడమే ఆయనకు ముఖ్యం. చర్చలో అయిలయ్య సమైక్యవాద నాయకులకు కూడా ఒక ప్రతిపాదన చేసాడు.. ఆంధ్ర ప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ధర్మాన ప్రసాదరావును, ఉపముఖ్యమంత్రిగా తెలంగాణ నుండి దామోదర్ రాజనర్సింహను పెట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి నడిపిద్దాం రండి, నేనూ సమర్ధిస్తాను అని అన్నాడు. అదీ సంగతి!
http://chaduvari.blogspot.com/2010/01/2010-18.html

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి