4, మే 2011, బుధవారం

విగ్రహాలను కూలుస్తున్న ముష్కరులెవరు?


విగ్రహాలను కూల్చింది ఎవరో మాకు తెలవదు అన్నారు. అదంతా సీమాంధ్రుల కుట్ర అని చెప్పారు. ఆ విగ్రహాల స్థానంలో తెలంగాణ అమరవీరుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్లు చేసారు. మార్చికి అనుమతినిచ్చి ఉంటే ఈ విధ్వంసం జరిగి ఉండేది కాదంటూ చెప్పుకొచ్చారు. తెవాద నాయకులు ఎలా మాట్టాడ్డానికైనా సమర్ధులే! ఇవ్వాళ టీవీ 9 లో వచ్చిన వార్త చూసాక వీళ్ళు ఏం చెయ్యడానికైనా సమర్ధులేనని తెల్లమైంది.



మూడు రోజుల కిందట మెదక్ జిల్లా దౌలతాబాదు వద్ద తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాల్చి పడేసారు ఎవరో దుండగులు. ఆ పాపాన్ని మంత్రి సునీతా లక్ష్మారెడ్డి మీదకు నెట్టడానికి ప్రయత్నించారు. ఎందుకంటే ఆ మధ్య ఎవరో ఆమె భర్త విగ్రహాన్ని విరగ్గొట్టారంట. అందుకు ప్రతీకారంగానే తెలంగాణ తల్లి విగ్రహాన్ని తగలబెట్టాం అని రాసిన కాగితాన్ని అక్కడ పెట్టి నేరాన్ని ఆమె మీదకు తోసారు. నాకే పాపం తెలీదని ఆమె చెప్పుకున్నారు. అయితే ఇవ్వాళ అసలు విషయం బయట పడింది. పోలీసులు దుండగులను పట్టుకున్నారు. వాళ్ళను టీవీ కెమెరాల ముందు పెట్టి నిజాన్ని వాళ్ళచేతే చెప్పించారు. సంగతేంటయ్యా అంటే వాళ్ళు తెరాస కార్యకర్తలు! తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాల్చింది తెరాస కార్యకర్తలే! కాల్చేసి ఆ నేరాన్ని మంత్రి మీదకు నెట్టారు. ఇప్పుడు దొరికిపోయారు. ఏకంగా తల్లినే అవమానించారు వాళ్ళు. ఇదీ ఈ ఉద్యమకారుల సంస్కృతి.

ట్యాంకు బండ్ మీది విగ్రహాలు ధ్వంసమయ్యాక ఏం చెబుతున్నారు వీళ్ళు? ప్రజల మనోభావాలు ఎంతలా దెబ్బతినకపోతే విగ్రహాలను ధ్వంసం చేస్తారు? వాళ్ళ మానసిక స్థితిని అర్థం చేసుకోవాలి అని మాట్టాడారు. తల్లి విగ్రహాన్నే కాల్చేసిన వాళ్ళ చిత్తవృత్తిని మనం ఎలా అర్థం చేసుకోవాలి?

ట్యాంకుబండ్ మీది సీమాంధ్రుల విగ్రహాలు కూలిపోతాయ్ అని కొన్ని నెలల కిందట చెప్పారు తెరాస నాయకులు. ఇప్పుడు అవి ధ్వంసం అయి పోయాయి కూడా.  విగ్రహాలను ధ్వంసం చేసిన వారెవరో,  చేయించిన వారెవరో తేలాలి. వాళ్ళను పట్టుకుని కెమెరాల ముందు నిలబెట్టి, ప్రజలకు ఆ మొహాలను చూపించాలి. మా సంస్కృతి ఇదీ అంటూ దేశమంతా చాటింపు వేసిన దుండగులెవరో తేల్చాలి. మన చారిత్రిక వ్యక్తుల విగ్రహాలను అవమానించిన చరిత్రహీనులను బోనెక్కించాలి.
http://chaduvari.blogspot.com/2011/03/blog-post_12.html

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి