- రాష్ట్రవిభజన తెలంగాణవాదులకు రాజకీయ పార్టీలకూ సంబంధించిన సంగతి మాత్రమేనా? ఈ గొడవతో కోస్తా సీమ ప్రజలకేమీ సంబంధం లేదా?
- వాళ్ళెన్నుకున్న నాయకులు వాళ్ళ మనోభావాలను ప్రతిబింబించాల్సిన అవసరం లేదా? అక్కడి నేతలు కూడా తెలంగాణవాదుల నినాదాలకు జైకొట్టాలా? తెలంగాణవాదాన్ని సమర్ధంగా వినిపించిన తెలంగాణ నాయకులను నెత్తికెత్తుకుని, సరిగ్గా వినిపించని వాళ్ళను ఎత్తి కుదెయ్యలేదా, ఈ తెలంగాణవాదులు? ఏఁ, ఆ మాత్రపు స్వాభిమానం, నాయకులమీద ఆ మాత్రపు హక్కు ఇతరులకుండదా?
- తమ నాయకులు తమ అభిప్రాయాలను వినిపించనపుడు ఉద్యమాలు చేసి, సదరు నాయకులు తమ వాణిని వినిపించేలా చెయ్యకూడదా?
- ఈ పనులు చేసే హక్కు తెలంగాణ వాదులకు మాత్రమే ఉందా? వీళ్ళు చేస్తే ఆత్మగౌరవమూను, వాళ్ళు చేస్తే అణగదొక్కడమూనా?
..............................
మీ నుంచి మేం విడిపోతామని ఎవరైనా అంటే అవతలివాడికి ఇబ్బందేమీ ఉండకూడదు, ఉండదు కూడా! కానీ, వెళ్తూ వెళ్తూ 'మనందరం కలిసి కూడబెట్టుకున్న ఆస్తిపాస్తులని (హైదరాబాదును) మేం మాత్రమే పట్టుకుపోతాం' అనడం మాత్రం అతితెలివి! 'మేమలా పట్టుకుపోతుంటే నువ్వుమాత్రం నోరు మెదపకూడదు' అని అనడం కంత్రీతనం!! ఓపక్కన ఈ రకంగా వాదిస్తూ, మరోపక్క అన్నల్దమ్ముల్లాగా విడిపోదామనడం జగత్కంత్రీతనం!!!
..............................
దేశంలో చాలా రాష్ట్రాలు విడిపోయినై.. తెలంగాణ విడిపోడానికేంటి ఇబ్బంది అంటూ ఆవేశపడిపోతూ, ఆవేదన చెందుతూ ఉంటారు, తెలంగాణావాదులు. ఆయా రాష్ట్రాల్లో విడిపోయినవాళ్ళు తాము విడిపోయారు, విడిపోయి తమ రాజధాన్ని తాము ఏర్పాటు చేసుకున్నారు. అంతేగానీ రాజధాన్ని మేం పట్టుకుపోతాం మీరు వేరే రాజధాన్ని చూసుకోండి అని అనలా! ఆ మాటే గనక అని ఉంటే ఆ రాష్ట్రాలు విడిపోయేవి కావు. అంతేకాదు, బహుశా బీహార్లో రక్తపాతం జరిగుండేది. ఎంచేతంటే, అవి కోస్తా, తెలంగాణా, సీమలంత ప్రశాంతసీమలు కావు.
---------------------
తమిళనాడులోని హోసూరుకు శాసనసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నది, గోపీనాథ్ అనే తెలుగువాడు. తెలుగు పట్ల ఎంతో అభిమానం ఉన్నవాడు. ఇప్పుడాయన రాష్ట్రాన్ని చీల్చాలనే మన గొడవగురించి ఆవేదన చెందుతూ 'మనలో మనం గొడవ పెట్టేసుకుంటున్నామే..' అని బాధపడ్డాడంట! పాపం మన ఆత్మగౌరవం, మనాళ్ళ సెంటిమెంట్లు ఎక్కడున్నాయో ఆయనకు తెలిసినట్టు లేదు. తెలుగు, ఆంధ్రం వేరువేరనే మన ఆత్మగౌరవ రవాల గురించి, అమ్మను పూజించడంలో కాదు, తిట్టిపోయడంలో ఉన్న మన సెంటిమెంటు గురించీ పాపమాయనకు తెలిసుండదు.
http://chaduvari.blogspot.com/2010/01/blog-post_07.html
!!!
రిప్లయితొలగించండి