4, మే 2011, బుధవారం

మే..ధావుల ’వర్గవివక్ష’


తెలంగాణ వాదులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని చీల్చి, తమకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చెయ్యమని డిమాండుతున్నారు. అంటే వేరు పడతామంటున్నారు. వేర్పాటువాదులన్నమాట! కానీ, ’దాన్ని ప్రత్యేకవాదమని అనాలిగానీ, వేర్పాటువాదమని అనకూడదు’ అని పాత్రికేయుడొకాయన చెబుతున్నారు. ఈ ముక్క గతంలో కొందరు రాజకీయులూ అన్నారు. సమాధానం చెప్పాల్సిన వాళ్ళు చెప్పారు. బ్లాగుల్లోనూ అన్నారు, అప్పుడూ తగు సమాధానాలే చెప్పారు. కాకపోతే ఇప్పుడు అంటున్నది, మేధావి వర్గానికి చెందిన పాత్రికేయుడు. ఏప్రిల్ 4, ఆదివారం నాడు హెచ్చెమ్ టీవీలో పాల్గొన్న పాత్రికేయులకు 'వేర్పాటువాదం’ అనే మాట తప్పనిపించింది. ఆ మాటను దేశం నుండి విడిపోవాలని కోరితేనే అనాలంట. తెలంగాణ డిమాండును ఆ పేరుతో పిలిస్తే ఉద్యమాన్ని, తెలంగాణ ప్రజల్ని అవమానించినట్టేనంట!! ఈ ముక్కలన్నది ఎ.శ్రీనివాసరావు. 


ఓ పాత్రికేయ మేధావీ.. మీ తెలంగాణ పక్షపాతం చూపించుకోడానికి పదాల అర్థాలను కూడా మార్చేస్తారా? ఇదిగో, బ్రౌణ్యం ఏం చెబుతోందో చూడండి.. వేర్పాటు అంటే ప్రత్యేకపడటమే! దేశం నుంచి విడిపోతారా, రాష్ట్రం నుంచి విడిపోతారా, తండ్రి ఆస్తిని విడగొట్టుకుంటారా,.. అనేవి ఆ పదానికి అనవసరం, దానికి వివక్షలేమీ లేవు. అంచేత, మీ తె.వాద పక్షపాతాన్ని చూపించుకోడానికి మరో పద్ధతిని - మరే పద్ధతినైనా - ఎంచుకోండి. భాషకు కొత్తర్థాలు చెప్పకండి.

’అన్నల్దమ్ముల్లాగా విడిపోదాం’ అనే మాట వినని ఆంధ్రుడున్నాడా ఇవ్వాళ?  ఇది తె.వాదుల ఊతపదం కాబట్టి, దాన్ని వాళ్ళు విచ్చలవిడిగా వాడతారు కాబట్టి ఇప్పుడే పుట్టిన పసిపిల్లాడు కూడా ఈ మాట బారిన పడకుండా తప్పించుకోలేడు. అన్నల్దమ్ములు విడిపోయి ఆస్తులు అప్పులూ పంచుకోడాన్ని ఏర్లు పడటం / వేర్లు పడటం / వేరు పడటం అనే అంటారు.వేరు పడటం అనే మాట తప్పేమీ కాదు, గౌరవహీనమైనదేమీ కాదు. కాకపోతే వేరుపడటం అనే పని ఏమంత ఉదాత్తమైనదేమీ కాదు, అంచేత ఆ మాట ఈ పాత్రికేయుడికి తప్పుగా అనిపించి ఉండొచ్చు.
 
ప్రత్యేకరాష్ట్రం కావాలని అడగడం వేర్పాటే. అలా అడిగేవాడు వేర్పాటువాదే! తె.వాదుల కోసం దాన్ని మార్చనక్కర్లేదు. ఈ మేధావులు తమ నూత్న తె.వాద మహా విజ్ఞానంతో టీవీ కెమెరాల ముందుకొచ్చి నిష్పాక్షికులమంటూ పోజు కొడుతూ అబద్ధాలు చెప్పుకుపోతూంటారు. మనకు జ్ఞానదానం చేసేద్దామని చూసేస్తుంటారు. పాత్రికేయుడు, ప్రొఫెసరు, ఆచార్యుడు,.. అంటూ తమకో ట్యాగు తగిలించుకు తిరుగుతూంటారు. వీళ్ళు చెప్పే అబద్ధాలు వింటూ, టీవీల లంగర్లు కొందరు పళ్ళికిలించి ఆహా ఓహో అని అంటూంటారు.

ఈ కార్యక్రమంలో ఆ లంగరు ’అదేంటండీ ఆ మాట తప్పెలా అవుతుంది’ అని అడగలేదు. లంగరు పని వాళ్ళ చేత వాగించడం వరకేను, సొంత అభిప్రాయాలు చెప్పడం కాదు అని అంటారా.. అది నిజమే, లంగరు వాళ్ళ చేత వాగించాలిగానీ తాను వాళ్ళ అభిప్రాయాలను ఖండించడం లాంటివి చెయ్యకూడదు. మరి అదే లంగరు ఓ పక్కన తిరపతి నుండి ఒక ప్రొఫెసరు గారితో కూడా మాటలు కలిపాడు. మాటల్లో ఆయనేదో చెప్పబోగా, ఈయన కలిగించుకోని ఆయన అభిప్రాయాలను తోసిపుచ్చాడు. ఈ లంగరుకెందుకంత పక్షపాతం?
................
 
నిష్పాక్షిక విశ్లేషకులమని చెప్పుకుంటూ ’వక్రవాణి’ వినిపించే ప్రొఫెసర్లు మనకు కొంతమంది ఉన్నారు. వీళ్ళతో పోలిస్తే, ఈ పాత్రికేయ మేధావులు చాలా నయం. మీరు ఏ టైములోనైనా టీవీ పెట్టండి.. ఏదో ఒక చానల్లో మొహం గంటు పెట్టుకునో, ఎవడో ఒకణ్ణి తిడుతూనో కనిపిస్తారీ వక్రవాణులు. అసలు వీళ్ళు కాలేజీలకి పోయి పిల్లలకు పాఠాలెప్పుడు చెబుతారో అర్థం కాదు. ఇక్కడ మాత్రం లంగర్లకు, తోటి విశ్లేషకులకు క్లాసులు పీకుతూంటారు.

ఈమధ్య ఐన్యూస్ లో ఒక చర్చ చూసాను. లంగరు పేరు అంకం రవి. ప్రభాకరు అనే తెరాస నాయకుడు, చక్రపాణి అనే ప్రొఫెసరు :) , ఈమధ్య కాలంలో ఉస్మానియా ఐకాసలో నాయకుడై ఆ తరవాత టీవీల్లో విశ్లేషకుడైన ఒక విద్యార్థి -ఈ ముగ్గురూ చర్చించేవారు.

తెరాస నాయకులు రాజీనామాలు చెయ్యగా ఏర్పడిన ఖాళీల్లోఆత్మహత్య చేసుకున్న కుర్రాళ్ళ కుటుంబీకుల్ని నిలబెట్టాలని ఆ కుర్రాడు (విద్యార్థి) అంటున్నాడు.  ప్రభాకరు, చక్రపాణీ కలిసి అతగాడి నోరు మూయిస్తున్నారు. ప్రభాకరు చాలా నయం.. నువ్వు అలా మాట్టాడ్డం తప్పు, ఇలా మాట్టాడ్డం తెలంగాణ ఉద్యమానికి చేటు అంటూ మాట్టాడుతున్నాడు. చక్రపాణి మాత్రం ఆ కుర్రాడి నోరు బలవంతానా నొక్కెయ్యాలనే చూసాడు (ఈయనలో తెలంగాణ పట్ల నిష్పాక్షికత ఎల్లప్పుడూ పొంగి పొర్లుతూ ఉంటుంది). ఇలాంటి వాళ్ళను ఇక్కడికి తీసుకొచ్చి చర్చలు పెట్టి తెలంగాణ ప్రజలను అవమానిస్తున్నారు అంటూ లంగరు మీద ఆవేశపడి, ఆయాసపడి పోయాడు. ’ఇతణ్ణి మాట్టాడకుండా ఆపుతారా నన్ను వెళ్ళిపొమంటారా’ అని లంగరును బెదిరించాడు.

చక్రపాణి, ప్రభాకరు ఆ కుర్రాణ్ణి నానామాటలూ అన్నారు. మరో విద్యార్థి నాయకుడు ఫోనులో చెప్పిన మాటలను పట్టుకుని, నువ్వసలు ఉద్యమంలో పాల్గొననేలేదు, నువ్వు సమైక్యవాదుల తొత్తువు అనే అర్థం వచ్చేలా చిన్నబుచ్చబోయారు. ఇవన్నీ నేరుగా అతణ్ణి అనలేదు, తెలివిగా ఆ ఆర్థం వచ్చేలా మాట్టాడారు. నువ్వసలు తెలంగాణ వాడివే కాదు, ఖమ్మం జిల్లా సరిహద్దుకు చెందిన కృష్ణా జిల్లా వాడివి అనీ అన్నారు.

పాపం అతడు సమాధానం చెప్పుకోబోతే మధ్యలోనే అడ్డుపడి నోరు మూయించారు. నేను ఉద్యమంలో పాల్గొని జైలుకు పోయాను, చంద్రబాబు ఇంటిదగ్గర ధర్నా చేసి అరెస్టయ్యాను. అంటూ తన ఉద్యమ నేపథ్యాన్ని చెప్పుకోబోతే చక్రపాణి అరిచేసి నోరు మూయించాడు. ఏంమాట్టాడుతున్నావు నువ్వు అంటూ ఆ కుర్రాణ్ణి బెదిరించబోయాడు. ఆ కుర్రాడు చక్రపాణిని ఎదిరించేందుకు ప్రయత్నించాడు. అయితే చక్రపాణికి దీటుగా రౌడీతనం చెయ్యలేకపోయాడు పాపం! అంకం రవి ప్రేక్షకుడే అయ్యాడు.  ఇదే చక్రపాణి గతంలో ఒక కోస్తా ప్రాంతపు విద్యార్థిపై కూడా జులుం చేసాడు. అప్పుడు నే రాసిన టపా చూడండి.

ఇదే చక్రపాణి, నెల్లూరులో హెచ్చెమ్ టీవీ వాళ్ళ దశ దిశ కార్యక్రమంలో కూడా ఇలాంటి 'నిష్పాక్షిక' వ్యాఖ్యలే చేసాడు.. తెలంగాణ రాజకీయ నాయకులు విద్యార్థులను రెచ్చగొట్టి ఉద్యమాలు చేయిస్తున్నారు అని వచ్చిన ఆరోపణను ప్రస్తావిస్తూ... ’ఎవరో రెచ్చగొట్టినంత మాత్రాన ప్రజా ఉద్యమాలు రావు. ప్రజల్లో సహజంగా ఉప్పొంగిన చైతన్యమే తెలంగాణ ఉద్యమంగా రూపుదిద్దుకుంది.’ అని చెప్పుకుపోయాడు. కానీ, అదే లెక్క కోస్తా సీమల్లో వచ్చిన ఉద్యమానికి వర్తింపజేయడాయన. కోస్తా సీమల ఉద్యమం, కేవలం నాయకులు చేస్తున్నదేగానీ ప్రజల్లోంచి వచ్చినది కాదని టీవీల్లో చెబుతూంటాడిదే వ్యక్తి!

నిష్పాక్షిక విశ్లేషకులమని చెప్పుకుంటూ, టీవీల ముందు దొంగ కబుర్లు చెబుతూ, వక్రవాణి వినిపించే నిష్పాక్షికుల నోరు మూయించే రోజు ఎప్పుడొస్తుందో! ఈ మే..ధావుల వర్గవివక్ష నుండి సామాన్యులకు ఎప్పటికి విముక్తి కలుగుతుందో!!
http://chaduvari.blogspot.com/2010/04/blog-post.html

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి