మే 28,2011 ఆంధ్రజ్యోతి సంపాదకీయం పేజి నుండి
సురవరం ప్రతాపరెడ్డికి, తెలంగాణ రాజకీయ, సాహిత్య, సాంస్కృతిక పునరుజ్జీవనానికి విడదీయరాని లంకె వుంది. శ్రీకృష్ణ దేవరాయ భాషాంధ్ర నిలయం స్థాపన ( 1901) యీ పునరుజ్జీవనానికి నాంది అని భావించినా, ఆ తర్వాతి కాలంలో తెలంగాణను తట్టి మేల్కొల్పిన గ్రంథాలయోద్యమానికి సురవరం వారు ఆయువు పట్టుకాగా, 1921లో స్థాపించిన ఆంధ్ర జనసంఘ కార్యకలాపాల్లో సురవరం పాత్ర గణనీయం. తెలంగాణ మేల్కొంది.
కనీసం చిన్న సారస్వత సభ పెట్టుకోడానికి కూడ నైజాం ప్రభుత్వ అనుమతి పొందాలని నియమం వున్న రోజులు. అయిదు శాతానికి మించని అక్షరాస్యత. వెట్టిచాకిరి బానిస విధానంలో మగ్గుతున్న సామాన్య ప్రజానీకం. తెలుగు భాష అత్యంత నిరాదరణకు గురైన గడ్డుకాలం. ఇంతటి సాంస్కృతిక వెనుకబాటుతనానికి గురయిన తెలంగాణ ప్రాంతంలో తెలుగు వెలుగులు ప్రసరింపబూనుకొన్న వైతాళికుల సరసన చేరి, అగ్రగణ్యతను సాధించి, జన జీవితంలో సమూల మార్పు రావడానికి కృషి చేసిన ఆంధ్ర మహాసభ మొదట సమావేశానికి జోగిపేటలో అధ్యక్షత వహించి, మాడపాటి వారి ప్రశంసలందుకొన్నారు, సురవరం ప్రతాపరెడ్డి.
సాహిత్య, భాష, పత్రికా రంగాల్లో సురవరం గావించిన కృషి ప్రశంసనీయం. దాదాపు 40 గ్రంథాలకు (ముద్రిత, అముద్రితాలు) పైగా రచించారు. వీటిలో పలువురు ప్రశంసలు అందుకొన్న వాటిలో చెప్పుకోదగ్గవి , 'రామాయణ విశేషాలు', ' హిందువుల పండుగలు' (యీ గ్రంథానికి సర్వేపల్లి రాధాకృష్ణన్ పీఠిక రాశారు). వీటి గురించి, యింకా వారి ఇతర రచనల గూర్చి మేమిక్కడ వివరించబూను కోవడం లేదు, కానీ, ఒకటి, రెండు విషయాలు యీ సందర్భంలో ప్రస్తావించుకోవాలి.
' గోలకొండ కవుల సంచిక' ను వెలువరించి , తెలంగాణలో కవులే లేరన్న నిరాధార, అభ్యంతరకర వ్యాఖ్యలకు దీటైన సమాధానమిచ్చారు. 'నిజాం రాష్ట్ర పాలనము' హైదరాబాద్ రాజ్య వ్యవస్థ గూర్చి పలు అంశాలను వివరించి, ప్రజా చైతన్యానికి దోహదపడింది. ప్రముఖ చరిత్రకారులు మల్లంపల్లి సోమశేఖర శర్మ యీ గ్రంథాన్ని సురవరం వారి 'ఆంధ్రుల సాంఘిక చరిత్ర'తో పోల్చి 'ఆ రెంటిలో యేది గొప్పదో , ఏది తక్కువదో తరతమ భేదాలు నిర్ణయించడం చాల కష్టం' అన్నారు. సంస్కృతం, పారశీక, ఉర్దూ భాషల్లో (ఆంగ్లాంధ్రాలు కాక) పాండిత్యం గడించిన సురవరం, మధ్యయుగాల భావజాల నేపథ్యం నుంచి వచ్చినా , వ్యక్తి స్వేచ్ఛ , సమానత్వ భావాలను పుణికిపుచ్చుకొని నిజాం నిరంకుశాధికారాన్ని ప్రశ్నించాడు.
'ఆంధ్రుల సాంఘిక చరిత్ర' రాయపూనుకున్నప్పుడు సురవరం ఎదుర్కొన్న రెండు ముఖ్య సమస్యలు, ఒకటి, సాంఘిక చరిత్ర అంటే ఏమిటన్నది? అంతవరకూ రాజకీయ, పరిపాలనాంశాలకే చరిత్ర పరిశోధనలు దాదాపుగా పరిమితమయ్యాయి. సాంఘిక చరిత్ర గురించి సురవరం యిలా నిర్వచించుకొన్నారు వారి గ్రంథంలో.
"సాంఘిక చరిత్ర మానవచరిత్ర - ప్రజల చరిత్ర, అది మన సొంత కథ... అది మన తాతముత్తాతల చరిత్ర! వారి యిండ్లు, వారి కట్టు, వారి తిండి, వారి ఆటలు, వారి పాటలు, వారు పడిన పాట్లు, వారు మనకిచ్చిపోయిన మంచి చెడ్డలు...''. ఇక సురవరం ఎదుర్కొన్న రెండవ సమస్య; మొదటిదాని కంటే కీలకమైనది; సాంఘిక చరిత్ర రాయడానికి అవసరమైన ఆధారాలు. సురవరం ఎంపిక చేసుకొన్నవి ప్రధానంగా సాహిత్య ఆధారాలు, కొంతవరకు శాసనాలు, యాత్రా చరిత్రలు, చాటువులు, సామెతలు, నిఘంటువులు, అప్పటికి లభ్యమవుతున్న ఆంగ్ల గ్రంథాలు - విన్సెంట్ స్మిత్, ఆర్.సి.దత్తు, బిల్‌గ్రామి తదితరులు రాసినవి.
తెలుగు ప్రబంధాలన్నీ తన రచనకు ఉపయోగపడవన్నారు. కైఫీయత్తులు, నాణేలు, విదేశీ యాత్రికుల రచనలు, శిల్పాలు, చిత్రలేఖనం, సుద్దులు, జంగమ కథలు, జానపదుల పాటలు - వీటన్నిటిని వాడుకోవడంలో సురవరం చూపిన సమగ్రదృష్టి శ్లాఘనీయం. ఆధారాలు లభ్యం కాలేదంటూ సురవరం తన 'తొలిమాట'లో యిలా రాసుకున్నారు. "నేను అలంపూరు తాలూకాలోని "నీళ్ళులేని యిటికెలపాడు'' అను కుగ్రామమందుండి యీ గ్రంథము వ్రాసినందున నా వద్ద నుండు గ్రంథసామగ్రి తప్ప వేరే ఆధారము లేకపోయెను. సమీపమున నుండు కర్నూలులో ఎంత వెదికినను కావలసిన కొన్ని గ్రంథాలు లభించలేదు. అందుచేత నాకు యీ గ్రంథము తృప్తినొసగలేదు.''
గ్రంధ పరిధి తూర్పు చాళుక్యులతో ప్రారంభమై కాకతీయులు, రెడ్డిరాజులు, నాయకరాజులు, విజయనగర, బహ్మనీ, కుతుబ్‌షాహీ రాజ్యాలను దాటి ఆధునిక యుగంలో 1907 దాకా కొనసాగింది. జనజీవనంలోని సూక్ష్మాంశాలన్నింటిని, ఆ కాలంలో ప్రజలు ఏం తిన్నారు, తాగారు, ఏం కట్టుకున్నారు, ఏ పాటలు పాడి, యే ఆటలు ఆడారు.
ఇవి జన జీవితంలోని రోజువారీ వ్యవహారాలు. ఇవిమాత్రమే సాంఘిక చారిత్రకాంశాలు కావు కదా! ఒక జీవనంతో ముడిపడిన వ్యవసాయం (ఏం తింటారన్న దానికి మూలం), వ్యాపారాలు, చదువులు, యుద్ధతంత్రం, సైనికవ్యవస్థ, చేతి పనులు, గ్రామ సభలు, మతం, మతంతో ముడిపడిన కర్మకాండలు వీటిలో చోటుచేసుకున్నాయి. 1949లో ప్రధాన ముద్రణ కాగానే, రెండవ ముద్రణ 1950లోనే రావడం, (ఇటీవల మరోముద్రణ వెలువడింది) కేంద్ర సా హిత్య అకాడమీ అవార్డు (తెలుగు సాహిత్యంలో యిది మొదటిదా?) పొందింది. 'ఆంధ్రా కా సామాజిక ఇతిహాస్' హిందీలోకి అనువదింపబడింది కూడా.
ఈ గ్రంథ రచనతో సంతృప్తి పొందలేదని సురవరం చెప్పడం వారి వినయశీలతను తెలియజేసినా, యీ రచన సమగ్రమా? సమగ్రం అని మనం దేన్నీ అనలేం. ఏదైనా సాపేక్షమేనన్న సత్యాన్ని అటుంచి, అప్ప టి పరిస్థితుల్లో యిది సమగ్రం కావడానికి అనువైన మేధోపర చారిత్రక వాతావరణం లేదు. అంతేగానీ, గ్రంధకర్త లోపం కాదు. అప్పటి చరిత్ర రచనా పద్ధతిలోని పరిమితులు, సైద్ధాంతిక అంశాలు దీనికి కారణాలు.
సవిమర్శక చారిత్రక గ్రంధాలు, ఆంధ్రుల చరిత్రపై సమగ్ర విశ్లేషణలూ రావల్సి వుంది (యిప్పటికీ). పైగా, చరిత్ర రచన జాతీయోద్యమ భావజాల ప్రభావం నుంచి పూర్తిగా బయటపడి, ఆర్థిక, సామాజిక, సాంస్కృతికాంశాలపై దృష్టిపెట్టలేదు. జాతీయోద్యమ భావజాలమే కాదు, వలసవాదుల చరిత్ర రచనా దృక్పథమూ పూర్తిగా తొలగలేదు. ఈ ప్రభావాలు సురవరం వారి గ్రంథంలో, ప్రత్యేకించి ఆధునిక యుగంపై రాసిన అధ్యాయాల్లో కన్పిస్తాయి.
ఏ సమాజంలోనైనా, స్థలకాలాదులను దృష్టిలో ఉంచుకొని , అప్పటి సామాజిక పరిస్థితులు, ప్రధానంగా ఆర్థిక వ్యవస్థ, సాంకేతికాభివృద్ధి అంశాలపై ఆధారపడివుంటాయి. ఒక ఉదాహరణ. కాకతీయుల, విజయనగర రాజుల కాలంలో చేపట్టి పెంపొందించిన నీటి పారుదల సౌకర్యాలు, వ్యవసాయాధారిత చేతి వృత్తులు, పరిశ్రమలు, అప్పటి ఆర్థిక వ్యవస్థను బలోపేత ం చేసి సమాజాన్ని ప్రభావితం చేశాయి. అసంప్రదాయ మతశాఖలు, సూఫీ, భక్తి ఉద్యమాలు, వైదిక మతాచారాలను నిరసించి , రాజ్యాధికారాన్ని ప్రశ్నించాయి.
ఇదే కాలంలో , వీటి ప్రభావంలో విలక్షణమైన సంకీర్ణ సంస్కృతి నిర్మితమైంది. వివిధ ఉద్యమాల అంతస్సంబంధాలను, ఆర్థిక, రాజకీయ వ్యవస్థలకు మధ్య నెలకొన్న పరిస్థితులకును సామాజిక వ్యవస్థ గూర్చి వివరించడానికి బేరీజు వేసుకోవాల్సి వుంటుంది. సురవరం గ్రంథాన్ని యింకా సమగ్రం చేయడాన్కి, కాకతీయుల పూర్వ తెలుగువారి సమాజాన్ని గూర్చి రాయాల్సి వుంది. ఆధునిక యుగాన్ని గూర్చి రేఖా మాత్రంగా వారు చేసిన కృషిని పూరించాల్సి వుంది. విడివిడిగా ఒక్కో యుగాన్ని గూర్చో, లేక ఒక రాజవంశ కాలాన్ని గూర్చో గ్రంథాలు వచ్చాయి.
మొత్తం ఆంధ్రుల సమగ్ర సాంఘిక చరిత్ర యింకా రావాల్సే వుంది. సురవరం చూపిన బాటను అనుసరించి, యీ కర్తవ్యాన్ని పూరించాల్సిన అవసరాన్ని ఖండవల్లి లక్ష్మీరంజనం గారితో పాటు పలువురు చెప్పారు. సురవరం వారి కృషికి మల్లంపల్లి వారు ప్రశంసాపూర్వకంగా ' శ్రీ రెడ్డిగారు విశాలాంధ్రకే మణిపూస' అంటూ అభినందించారు. సాంఘికచరిత్ర గ్రంథం వెలువడ్డాక నార్ల వెంకటేశ్వరరావు 'ఆంధ్రప్రభ'లో 'మన తాత ముత్తాతలు' అన్న శీర్షికతో సంపాదకీయం రాసి , 'ఒక జీవిత కాలపు ముక్తాఫలం'గా గ్రంథాన్ని పేర్కొన్నారు.
రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ అభినందించి , చేసిన కొన్ని సూచనలను రెండో ముద్రణలో సరిచేశారు. సురవరం తెలంగాణ జాతీయ పునరుజ్జీవకానికి మాత్రమే వేగుచుక్క, వైతాళికుడు కాదు. మొత్తం తెలుగు జాతికి, తెలుగు భాషా చరిత్ర సంస్కృతులకు వైతాళికుడు.
-వకుళాభరణం రామకృష్ణ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి