20, మే 2011, శుక్రవారం

మసకబారుతున్న ఓ.యు. ప్రతిష్ట

ఒకప్పుడు ఉస్మానియా యూనివర్శిటీ అంటే దేశ,దేశాలలో గొప్ప ఖ్యాతి ఉండేది. వేలాది మంది విద్యార్ధులు ఈ యూనివర్శిటీలో చదవడం ద్వారా విజ్ఞాప ప్రపంచంలో విహరించాలని ఆకాంక్షించేవారు.కాని ఇటీవలికాలంలో ఆ గొప్పదనం కాస్త మసకబారుతోంది.

ఇప్పుడు ఉస్మానియా యూనివర్శీటీలోకి వెళ్లాలంటే ఏదో తెలియని భయం ఆవహిస్తుంది. ప్రాంతాలకు, కులాలకు, మతాలకు అతీతంగా ఉండవలసిన ఈ ఆధునిక దేవాలయాలు అనేక రుగ్మతలతో సతమతమవుతున్నాయి. ఈ ఒక్క విశ్వవిద్యాలయమే కాకపోవచ్చు. అనేక యూనివర్శీటీలలోఈ పరిస్థతి ఉండవచ్చు. కాని వీటిలో ఉస్మానియా పరిస్థితి ఇంకొంచెం తీవ్రంగా ఉంటోంది.అందువల్లనేమోకాని ఉస్మానియాలో చదవడం కోసం దరఖాస్తు చేసుకుంటున్న విద్యార్దుల సంఖ్య క్రమేపి తగ్గుతున్నట్లు ఓ ఆంగ్ల పత్రిక ఒక విశ్లేషణ ఇచ్చింది.దాని ప్రకారం ఉస్మానియా పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులలో చేరడానికి గాను నిర్వహించే ఎంట్రన్సు పరీక్షలు రాయడానికి ముందుకు వచ్చిన విద్యార్దుల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఉదాహరణకు ఇంగ్లీష్ కోర్సుకు గాను ఈ ఏడాది 3997 మంది మాత్రమే ఎంట్రన్సు రాయడానికి దరఖాస్తు చేసుకున్నారు. రెండేళ్ల క్రితం ఈ కోర్సుకోసం 5368మంది దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఎంతమంది తగ్గిపోయారో అర్దం చేసుకోవచ్చు.గత ఏడాది ఎకనామిక్స్ కోర్సు కోసం 5283మంది అప్లై చేస్తే, ఈ ఏడాది ఈ ఏడాది కేవలం 3213 మంది మాత్రమే ఎంట్రన్స్ రాయడానికి ముందుకు వచ్చారు.ఉస్మానియాలో సైన్స్ కోర్సులకు మంచి డిమాండు ఉంటుంది. కాని అలాంటి కోర్సులకు సైతం దరఖాస్తులు సగానికి సగం పడిపోయాయి. కెమిస్ట్రీ కోర్సుకుగాను20481 మంది గత ఏడాది అప్లై చేస్తే, ఈ ఏడాది అది 11765 కి పడిపోయింది.ఇలా ఏ కోర్సు చూసుకున్నా మామూలుగా పెరగవలసింది పోయి దరఖాస్తులు తగ్గిపోవడంపై యూనివర్శిటీలో ఆందోళన వ్యక్తం అవుతోంది.

తెలంగాణ ఉద్యమం యూనివర్శిటీ ఇమేజీని కొంత దెబ్బతీసిందని టీచర్లు వ్యాఖ్యానిస్తున్నారు. సీరియస్ గా చదువుకోవాలనుకునే విద్యార్ధులు ఈ యూనివర్శిటీకి రావడానికి వెనుకంజ వేస్తున్నారని అంటున్నారు.యూనివర్శీటీలో తరచూ హింసాకాండ జరుగుతున్నట్లుగా మీడియాలోతరచూ వచ్చే వార్తలు యూనివర్శిటీ ప్రతిష్టను దెబ్బతీశాయి.తాను తెలంగాణ రాష్ట్రం కోరుకునే వాడినే అయినా, తన కుమార్తెను ఈ యూనివర్శిటీలో చేర్చజాలనని, ఎందుకంటే కూతురు భవిష్యత్తు కూడా తనకు ముఖ్యమని ఒక తండ్రి వ్యాఖ్యానించారు. రాజకీయ పార్టీలు యూనివర్శిటీలకు ఒక బెడదగా మారి , విద్యార్ధుల భవిష్యత్తుకు ఆటంకంగా మారాయన్న వాదన కూడా ఉంది.కొందరు విద్యార్ధులు పేరుతో అక్కడే తిష్టవేసి రాజకీయ నాయకులు చెప్పినట్లు చేస్తూ యూనివర్శిటి భవిష్యత్తుకు ప్రతిబందకంగా మారుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి.

Source: http://kommineni.info/articles/dailyarticles/content_20110519_20.php


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి