తెలంగాణ ప్రాంతానికి వచ్చి, 'ఆంద్రోళ్ళు' పెద్దాళ్ళై పోయారు, మా భూముల్ని ఆక్రమించారు అనే వాదన వినిపిస్తారు తెలంగాణవాదులు. దాని వెంటనే మరో ముక్క చెబుతారు.. పొట్ట చేతపట్టుకొచ్చిన వాళ్ల గురించి మాకేం ఇబ్బంది లేదు, మా ఆస్తులని అక్రమంగా ఆక్రమించుకున్నవాళ్ల గురించే మా వ్యతిరేకతంతా అని అంటారు. ఎవరో కొందరు రావుల గురించో, కొందరు రెడ్డిల గురించో, కొందరు చౌదర్ల గురించో వీళ్ళ ఫిర్యాదు! వాళ్ళెవరో అక్రమంగా ఆస్తుల్ని సంపాదించుకుంటే యావజ్జాతీ తప్పు చేసినట్టా? ఆ కొందరి కారణంగా కోస్తా సీమల వాసులంతా దురాక్రమణదారులెలా అయ్యారు? 'అందరూ దురాక్రమణ దారులే అని మేమెక్కడన్నాం? కొందరే దురాక్రమణదారులు' అని అంటారు వెంటనే! మరి, ఎవరో కొందరి కారణంగా రాష్ట్రాన్ని ఎందుకు విడదీద్దామనుకుంటున్నారు? అటువంటి కబ్జాలే చేసిన తెలంగాణ వాళ్ళ సంగతేంటి? వాళ్ళ గురించేమీ మాట్టాడరేఁ? వాళ్ళ కోసం తెలంగాణను మళ్ళీ చీలుస్తారా?
సరే.., ఎవరో కొందరి కోసం రాష్ట్రాన్ని చీలుస్తారు, బానే ఉంది. జరిగిపోయిన దురాక్రమణలను ఎలా సరిదిద్దుతారు? ఆయా భూములను తిరిగి లాక్కుంటారా? అది సాధ్యమయ్యే పనేనా? చట్టపరమైన చిక్కులెన్ని? అసలు చట్టంతో చుట్టరికం నెరపి చట్టవిరుద్ధమైన పనులు చేసే రాజకీయ నాయకులు తెలంగాణ రాష్ట్రంలో ఉండరా? వాళ్ళు డబ్బుకు గడ్డి తినరా? ఇప్పటి ఉద్యమ నాయకుల సారథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినా సరే.., ఇప్పటిదాకా తమ బద్ధవిరోధి అయిన ఫలానా వారి లాంకో కొండలను స్వయంగా ప్రభుత్వమే లోపాయికారీగా రక్షిస్తుందనే విషయంలో ఎవరికైనా సందేహాలున్నాయా? సందేహాలున్నవారు 2004 కు ముందు పేపర్లనిండా పరుచుకున్న సవాళ్ళను, 2004 తరవాత జరిగిన వాస్తవాలనూ బేరీజు వేసి చూడాలి. చరిత్రను మళ్ళీ ఒకసారి చదూకోవాలి. ఐ.ఎమ్.జి భారత తప్ప మిగతా ఆరోపణలు, సవాళ్ళకేమయినా అయిందా అనే సంగతిని ఆరా తీయాలి.
కాబట్టి, తెలంగాణ ఏర్పడినంత మాత్రాన తెలంగాణవాదులు చెబుతున్న దురాక్రమణల విషయంలో అద్భుతాలేమీ జరగవు. అప్పుడు కూడా పరిస్థితులు ఇలాగే ఉంటాయి. అంతేకాదు, ఆ దురాక్రమణలు అప్పుడూ జరుగుతూనే ఉంటాయి. కానీ తిట్టడానికి 'ఆంద్రోడుం'డడు. అప్పుడెవరితో పోరాడతారు? పాలమూరు జిల్లావాళ్ళు, కరీంనగరంతోటి, నల్లగొండ వాళ్ళు నిజామాబాదుతోటీ పోట్టాడతారా? పోరాటాల పురిటిగడ్డ కదా!
పోరాటాల పురిటిగడ్డ తెలంగాణ అని అంటూంటారు, నిజమే. నిజాముతో పోరాడారు, చారిత్రాత్మకమైన విముక్తి పోరాటం చేసారు. కానీ ఇప్పుడు చేస్తున్నదేమిటి.. శత్రువెవరో తెలుసుకోకుండా పోరాటం చేస్తున్నారు -కాదు చేయిస్తున్నారు. లక్ష్యం ఒకదాన్ని పెట్టుకున్నారు -ప్రత్యేకరాష్ట్రం.. అంతే! అది సాధించడం కోసం శత్రువుగా ఎవర్ని ఎంచుకుంటే బాగుంటుందో చూసుకుని, 'ఆంద్రోళ్ళ'ను ఎంచుకున్నారు. ఇక ప్రచారం మొదలుపెట్టి ప్రజల మనసులను కలుషితం చేసి, పోరాటం చేయిస్తున్నారు. నిజమైన శత్రువెవరో గుర్తించలేక కాదు, గుర్తిస్తే, ఆ శత్రువు నెదిరించడానికీ, రాష్ట్ర విభజనకూ సంబంధమేంటీ అనే ప్రశ్న తలెత్తుతుంది. దానికి సమాధానం లేదు కాబట్టి 'ఆంద్రోళ్ళం'దరినీ శత్రువుగా చూపించారు. పోరాట సంప్రదాయాన్నే కొనసాగించాలనే తలంపుతో ఎవరితో పోరాడాలో చెప్పకుండా ఒక దిశలేని పోరాటం చేయిస్తున్నారు.
అంచేత, 'ఆంద్రోళ్ళ' దురాక్రమణ వాదం అనేది కూడా అబద్ధమే! కేవలం జనాల్లో తెలంగాణ వాదాన్ని నిలబెట్టి ఉంచడం కోసం, కొత్త తరానికి ఆ వాదాన్ని తలకెక్కించడం కోసం, కోస్తా, సీమల వ్యతిరేక భావోద్వేగాన్ని నిలబెట్టి ఉంచడం కోసం తెలంగాణ వాదుల చేతిలో ఉన్న మరో ఆయుధం 'ఆంద్రోళ్ళ' దురాక్రమణ అనే అబద్ధం. అంతేకాదు ఈ వాదనను నిరంతరం నిలబెడుతూ ప్రజల్లో సమైక్య భావన అనేది పాదుకొనకుండా పాటుబడుతున్నారు ఈ తెలంగాణ వాదులు.
అక్రమంగా ఆస్తులను సంపాదించుకున్న కొందరు తెలంగాణేతరులపై ఉన్న కోపాన్ని మొత్తం తెలంగాణేతరులపై మళ్ళిస్తున్నారు. అలా చూపెట్టి రాష్ట్రాన్ని విడగొట్టమంటున్నారు.
---------------------------------------
ఇవ్వాళొకాయన టీవీలో ఓ అబద్ధం చెప్పాడు. ఆయన చెప్పినదాని ప్రకారం.. తెలంగాణలో సహజవనరులు సమృద్ధిగా ఉన్నాయి. రాయలసీమలో ఏవో కాసిని గ్రానైటు లాంటివున్నాయిగానీ, కోస్తాలోనైతే అసలేమీ లేవు. విడిపోతే తమ మనుగడ ప్రశ్నార్థకమౌతుందని వాళ్లకు తెలుసు. అంచేతే సమైక్య వాదాన్ని ముందుకు తెచ్చారు. (తన వాదనకు నిరూపణగా అన్నట్టు, తెలంగాణలో బొగ్గు ఉంది, కోస్తాలో లేదని కూడా అన్నాడు) ఎలాంటి అబద్ధాలు, అసంబద్ధాలు చెప్పుకుపోతున్నారో చూడండి.
ఒకవేళ ఆ మాట నిజమే అయితే, రాష్ట్రాన్ని విడగొట్టడం తప్పే కాదు, దేశద్రోహ నేరం కూడా!
http://chaduvari.blogspot.com/2009/12/blog-post_16.html
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి