4, మే 2011, బుధవారం

చౌకబారయ్యాం - మసకబారిపోయాం - మసిపట్టిపోయాం.........................

పెద్దమనిషి ఇటీవల రాసిన రాతలు కనిపించాయి. తెలుగువాళ్ళని అపహాస్యం చేస్తున్నాడాయన."తామేదో పెద్ద మహాజాతి అని చెప్పుకుంటారీ తెలుగువాళ్ళు. వాళ్ళ బొంద ! ఒకడంటే ఒకడికి పడిచావదు. ఉదాహరణకి తెలంగాణా గొడవ చూడండి. రేపో మాపో పొడుచుకుని చచ్చేట్టున్నారు. మేమే నయం."అన్నట్లున్న శైలిలో రాసుకొచ్చాడు. ఆ మాటల్ని యథాతథంగా ఇక్కడ ఉటంకిస్తే నాలాగే మీరూ బాధపడతారు కనుక నేను ఉటంకించదల్చుకోలేదు. అందుకనే చదివి వదిలేశాను. నేను ఆ రాతలమీద వ్యాఖ్య కూడా ఏమీ రాయదల్చుకోలేదు. ఆ పెద్దమనిషి మనమీద ద్వేషంతో అన్నప్పటికీ ఆ మాటల్లో నిజం ఉంది కనుక.

గత 7 ఏళ్ళ ప్రత్యేక తెలంగాణా నినాదం ఒక జాతిగా మనకూ మన ప్రతిష్ఠకూ ఇంటా బయటా చాలా చెఱుపు చేస్తోందనడానికి ఇదొక నిదర్శనం. ప్రత్యేక తెలంగాణా సాధించడం ప్రాంతీయవాదులకు అంతిమంగా సాధ్యపడదు. కాని వాళ్ళు ఇలా మన జాతిని బట్టలువిప్పి అంతర్జాతీయవేదికలముందు నిలబెట్టడంలో మాత్రం సఫలీకృతులయ్యారు. వాళ్ళు మన పరువు నిట్టనిలువునా తీసేశారు. సోదరుణ్ణి బద్నామ్ చేస్తే తామూ అతనితో సమానంగా బద్నామ్ అవుతామనే సత్యాన్ని వాళ్ళ తమ ప్రాంతీయ-ఉన్మాదంలో పడి కొట్టుకుపోతూ విస్మరించారు. వాళ్లు తమ నోళ్ళకు కాకుండా తమ మెదళ్ళకెప్పుడు పనిచెప్పడం మొదలుపెడతారు ?

పరిస్థితులెప్పుడూ ఇలాగే ఉండవు. మన జాతికీ మంచిరోజులొస్తాయి. అందుకు ముందుగా జరగాల్సింది - నిజాం కాలంలో పుట్టిన ముసలాళ్ళందరూ నిశ్శేషంగా చావడం. వీళ్ళు అడపా దడపా తమ స్వార్థం కోసం ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత జన్మించిన యువతరాల్ని ప్రాంతీయంగా రెచ్చగొడుతూ ఎప్పటికప్పుడు మన జాతి కొట్టుకు చావడానికి కావాల్సిన బీజాల్ని సజీవంగా సచేతనంగా ఉంచుతున్నారు. మనల్ని మానసికంగా క్రీ.శ.1930 లో ఉంచుతున్నారు. ముందుకు చూడనివ్వడంలేదు.

పైగా ఈ స్తంభితాలోచనలకు ఆత్మగౌరవమని ఒక పెద్ద పేరు. తెలుగు జాతీయత అనే మొక్క వటవృక్షంలా ఎదక్కుండా మధ్యలోనే తినేసే ఆకుతొల్చు పురుగులు వీళ్ళు. మన జాతికి పట్టిన కేన్సర్లు వీళ్ళు. యావత్తు తెలుగు జాతి యొక్క విశాలహితం గుఱించి ఆలోచించిన పూర్వకాలపు Statesmen ప్రస్తుతం లేకపోవడంతో ఆ రాజకీయశూన్యాన్ని ఇలా అక్రమంగా ఆక్రమించుకున్నారు. సమైక్యాన్ని బూతుమాట చేశారు. ప్రాంతీయవాదాన్ని పవిత్రవేదంగా మార్చారు. ప్రజాసమస్యల పరిష్కారానికి గల వేర్పాటేతర మార్గాలన్నింటినీ ఉద్దేశపూర్వకంగా మూసెయ్యడానికీ ఆంధ్ర-తెలంగాణా ప్రజల మధ్య ఒక రకం ఇండియా-పాకిస్తాన్ లేదా బ్రిటిష్-ఇండియా తరహా శాత్రవ సంబంధాన్ని సృష్టి చెయ్యాలని తహతహలాడుతున్నారు.

సర్వసాధారణంగా వర్ధమాన ఆర్థిక వ్యవస్థల్లో సర్వత్రా ఉండే ప్రజాసమస్యలకు ఒక ప్రాంతీయ రంగు మేళవించి ఆ ప్రాతిపదికన ఒక జనాభా మీదికి ఇంకొక జనాభాని ఉసిగొల్పుతున్నారు. మన తెలుగునౌకకు సరైన తండేలు (captain) లేకపోవడంతో చిన్నా పొన్న సరంగులు తమ లైఫ్‌బోట్లనే నిజమైన ఓడలుగా ప్రచారం చేస్తూ అసలైన ఓడని ముంచెయ్యడానికి సమకడుతున్నారు. కానీ తెలుగుజాతికి వ్యతిరేకంగా తాము తీస్తున్న ఈ గోతుల్లో ఏదో ఒకరోజున తామే పడతారు. జర్మనీ మనకంటే అనైక్యంగా ఉండేదొకప్పుడు. మనకొక్క నిజామే కాని వాళ్ళకు అలాంటివాళ్ళు చాలామంది ఉండేవారు. శేషప్రశ్నల్లా ఆ శుభదినం ఎంత తొందఱగా వస్తుందనేదే !
http://naasaahityam.blogspot.com/2008/03/blog-post_17.html

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి