16, అక్టోబర్ 2011, ఆదివారం

... మాటలకు అర్థాలే వేరులే

‎"An RTC bus burns at Tarnaka in Hyderabad"- The Hindu 
ఆంధ్రజ్యోతి సంపాదకపేజీ : ఉద్యమ సందర్భాల్లో ముందుగా బలయ్యేది భాష. పదాలకు అర్థాలు మారిపోతాయి. అవాస్తవాలు నిజాలవుతాయి. భావాలకు నిర్వచనాలు పునర్లిఖించబడతాయి. ఈ భావగందరగోళంలో కొట్టుకుపోతూ నిజమేమిటో, అబద్ధమేమిటో, వాస్తవమేదో, కల్పితమేదో అర్థం చేసుకోలేని అస్పష్టతకు గురవుతాం. ప్రాథమికంగా అహేతుకాలైన గుంపు, తెగ, వర్గ మనస్తత్వాలు, అస్తిత్వాల ఆధ్వర్యంలో జరిగే ఉద్యమాల్లో ఈ ధోరణులు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఏ ఉద్యమంలోనైనా మీడియా తటస్థంగా ఉండదు. ఏదో ఒక వైపు వాదాన్ని భుజానేసుకుంటుంది.

కాబట్టి మీడియాలో వచ్చే ప్రతి సమాచారాన్ని, కథనాన్ని స్వయంగా ఆలోచించాకే దాన్ని పూర్తిగానో, పాక్షికంగానో నమ్మాలో వద్దో నిర్ణయించుకోవాల్సిన బాధ్యత పాఠకులది, వీక్షకులదీ. ఉద్యమ నిఘంటువుల ప్రకారం జాగో, భాగో అన్నది బెదిరింపు కాదట. కేవలం ప్రాంతీయ నుడికారమట. సెలవులకు ఇంటికెళ్తున్న వాళ్ళను పూటల తరబడి నడిరోడ్డు మీద నిలిపివేయడం శాంతియుత ఉద్యమమని సెలవిస్తారు. రోడ్డు పొడవునా బస్సులు, కార్లపైన రాళ్ళేసి అద్దాలన్నీ పగలగొట్టడం కూడా 'శాంతియుత'మేనట.

మతి కోల్పోయి, గతి తప్పిన కొందరు యువకులు చేసిన తొందరపాటు పనులను తప్పు అని ఖండించాల్సింది పోయి, అది మఫ్టీలో ఉన్న పోలీసుల పని అని గౌరవ ప్రొఫెసర్లు వ్యాఖ్యానించడం వాస్తవాలను ఏమేరకు వక్రీకరిస్తున్నారో సూచిస్తుంది. రైళ్ళు నడవకుండా ఆపడం శాంతియుతమైన ఉద్యమమట. అది ఉద్యమకారుల హక్కట. సమ్మె విరమించిన ఆర్టీసీ కార్మికులు బస్సులు నడపడం కవ్వింపు చర్యట. కాబట్టి వాటిని ధ్వంసం చెయ్యడం సబబేనట. రైళ్లు, బస్సుల్లో ప్రయాణించదలచిన వ్యక్తుల హక్కుల మాటేమిటి? మన పిచ్చిగానీ, వ్యక్తులకు హక్కులెక్కడేడ్చాయి? హక్కులు కేవలం గుంపులు, మూకలకు మాత్రమే ఉంటాయి!!

ఈ స్వభావం, ఇలా వాదించే విధానం ప్రస్తుతం నడుస్తున్న ఉద్యమం ఒక్కదానికే పరిమితం కాదు. మూకహక్కుల కోసం చేసే ఉద్యమంలోనైనా ఈ లక్షణాలను చూస్తాం. మూకకు ప్రాతిపదిక ప్రాంతం కావచ్చు, కులం, ఉపకులం, మతం, వర్గం - ఏదైనా కానీయండి, కాలరాయబడేవి మాత్రం వ్యక్తి హక్కులే. బడులు, కాలేజీలు బలవంతాన, బెదిరింపులతో మూసేయిస్తారు. ఇదేమి అన్యాయమని ప్రశ్నించినవాళ్ళను ఉద్యమ విచ్ఛిన్నకారులని నిందిస్తారు. రెచ్చగొట్టవద్దని హెచ్చరిస్తారు.

మనిషి మౌనంగా ఏడవడం తప్ప చేయగలిగిందేమీ లేదు. ఈ అసమానతల నుండి మనిషిని కాపాడ్డానికి, మనిషి హక్కలను రక్షించడానికి బోలెడు పన్నులు కట్టి ఏర్పరుచుకున్న ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్టు? శూన్యం. అసలీ మూకలను పెంచిపోషించేది ప్రభుత్వాలే. ప్రజలను పలువర్గాలు, తెగలు, ప్రాంతాలు, కులమతాలుగా విడగొట్టి, రాజకీయ అవసరాల మేరకు ఒకరిమీద ఒకరిని ఎగదోసి పబ్బం గడుపుకున్న వాళ్ళు ఏ మొహం పెట్టుకుని ఈ అరాచకాన్ని ఆపగలరు?

మిశ్రమ ఆర్థిక వ్యవస్థ రకరకాల గుంపులను తయారు చేస్తుంది. పన్నుల ద్వారా వసూలు చేసిన అపారమైన డబ్బును కొన్ని గుంపులకు ఎక్కువ మొత్తంలో వెదజల్లి, లేదా వెదజల్లుతామని హామీలిచ్చి, ఓట్లేయించికుని, అధికారం హస్తగతం చేసుకుంటారు. కొన్నిరోజుల తర్వాత ఇతర గుంపుల్లో అసహనం, వ్యతిరేకత మొదలవుతుంది. వారిని సంతుష్టులను చెయ్యడానికి కొన్ని ఎంగిలి మెతుకులు విదిలిస్తారు.

ఎన్ని పాట్లు పడినప్పటికీ అన్ని గుంపులను, గుంపుల్లోని అందరినీ తృప్తిపరచడం ఏ పార్టీ, ఏ ప్రభుత్వం వల్లా కాదు. అందుకే అప్పుడప్పుడు ప్రభుత్వాలు, పాలకులు మారుతుంటారు. కానీ గుంపుల మధ్య రగిల్చిన అసూయలు, కక్షలు అలాగే ఉండిపోతాయి. మందబలంతో ప్రభుత్వాన్ని ఉపయోగించుకుని ఎక్కువ లబ్ధి ఎలా పొందాలా అన్న కొట్లాటలే తప్ప, వ్యక్తుల మధ్య ఏ గొడవలూ ఉండవు. ఈ రకమైన ఉద్యమాల్లో అంశాలు, డిమాండ్లు, కోపాలు, అసూయలు, ద్వేషాలు ప్రభుత్వ పెత్తనంలో నడిచే విషయాల చుట్టూనే తిరుగుతుంటాయి.

ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వం చేసిన భూపందేరాలు, మంత్రి పదవులు, అడ్వకేట్ జనరల్ నియామకాలు, ప్రాజెక్టులు, కాంట్రాక్టులు, నువ్వెంత తిన్నావు, నాకెంత పెట్టావు - ఉద్యమాలన్నీ ఈ విషయాల చుట్టే పరిభ్రమిస్తాయి. ప్రైవేటు రంగంలో ఇవేవీ కానరావు. కానీ ఒకసారి ఉద్యమం మొదలయ్యాక అసహాయ స్థితిలో ఉండే ప్రైవేటురంగం మీదే పడతారు, పడ్డారు కూడా. నిధుల సమీకరణకు పాడి ఆవులాంటి ప్రైవేటురంగం సిద్ధంగా కనబడింది. ప్రతి ఉద్యమకారుడు ఈ పాడి ఆవును ఒట్టిపోయే దాకా పిండుకునే వేరే.

ఈ విపరీత ధోరణులు ఈ ఒక్క ఉద్యమానికే పరిమితం కావు, మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. ఈ ఉద్యమాన్ని ఎవరు, ఎందుకు, ఎప్పుడు, ఎలా మొదలెట్టారో, కాలక్రమేణా ప్రజలను ఎంత తప్పుదారి పట్టించి విద్వేషాల్ని రగిల్చారో కాస్త తెలివున్న వారందరికీ తెలుసు. ఎవరికి వారు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఎలా పరితపిస్తున్నారో స్పష్టంగా కనబడుతూనే ఉంది. చివరికి ఎలాంటి ముగింపు వచ్చినా, జనబాహుళ్యానికి ఒనగూడేదేమీలేదని ఉద్యమ నాయకులు, మేధావులు, మీడియాలతో సహా అందరికీ తెలుసు. కానీ ఎవరూ నోరు విప్పి నిజం పలికే స్థితిలో లేరు. తమ వ్యక్తిగత జీవితాల్లోని కష్టాలకు, అనిశ్చితులకు ఎవరు కారణమో, ఎవర్ని నిందించాలో తెలియని అమాయక జనం ఒకరిని ఒకరు వేలెత్తి చూపుకుని ఆత్మ సంతృప్తి పొందుతున్నారు.

లక్షల్లో ఉద్యోగాలు సృష్టిస్తామంటున్న నాయకుల మాటలకు గొర్రెల్లా తలూపుతున్నారు. ప్రస్తుతం జనాభాలో ఒకటి, రెండు శాతం ఉన్న ప్రభుత్వోద్యోగుల జీతభత్యాలకే వేల కోట్లు పన్నులుగా కడుతున్నాం. ఇంకొన్ని వేలకోట్లు లంచాలుగా సమర్పించుకుంటున్నాం. ఇది చాలదన్నట్టు మరో ఒకటి, రెండు శాతం ప్రభుత్వోద్యోగాలు సృష్టిస్తే, వాళ్ళ జీతాలు మనమే కదా చెల్లించాల్సింది? మనమెడకు మనమే ఉరేసుకుందామా? ఆ ముగ్గురు, నలుగురిని మేపడానికి తొంభై ఆరు మంది కష్టపడి, సంపాదించి, పన్నులు కట్టాలి. ఎక్కువ మంది ప్రజలు ఆ తొంభై ఆరుమందిలోనే ఉంటారు కదా! అయినా ఆ ఉద్యోగాలన్నీ తమకో, తమ పిల్లలకో మాత్రమే వచ్చిపడతాయన్న పిచ్చి ఆశలతో ఉద్యమం పేరిట శివాలెత్తుతున్నారు. ప్రభుత్వాల నిష్కృయాపరత్వంతో సమాజం గూండాల జాగీరుగా మారింది.

అబద్ధపు ప్రచారాలతో, వాస్తవాల వక్రీకరణలతో మొగుణ్ణి కొట్టి మొగసాల కెక్కడమే మేధావి తనంగా చెల్లుబాటవుతోంది. ఇటువంటి మూక, మూఢ వాదనల ప్రాతిపదికగా విభజనలు జరిగితే నాజీ ఊచకోతలను తప్పించుకోగలరా? ఆ అరాచకాన్ని ఆపే నైతికస్థాయి ఏ నేతలకైనా ఉందా? అది వ్యక్తుల హననానికి, సమాజ పతనానికి దారితీయడం ఖాయం. సామాజిక, భౌగోళిక, ఉపప్రాంతీయ, కుల, ఉపకుల, మత ప్రాతిపదికలపై మరిన్ని కొత్త మూకలు, ఉద్యమాలు, సెంటిమెంట్లు, ఆత్మగౌరవాలు, అల్లర్లు తప్పవు.

ఈ పరిస్థితుల్లో వ్యక్తులకు దారేది? అరాచక పరిస్థితుల్లో తమను తాము రక్షించుకునే మార్గమేది? స్వీయ రక్షణ కోసం ఆయుధాలు ధరించడం, ఉపయోగించడం వ్యక్తుల ప్రాథమిక హక్కు. 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత భారతీయుల్ని క్రమంగా నిరాయుధుల్ని చేయడం కోసం తెచ్చిన చట్టాల వల్లే ప్రతిమనిషీ స్వీయ రక్షణ కోసం ప్రభుత్వాన్ని దేచిరించాల్సి వస్తోంది. స్వాతంత్రోద్యమ సమయంలో, ముఖ్యంగా జలియన్ వాలాబాగ్ మారణకాండ తర్వాత ఇంకాస్త కఠినంగా అమలు చేసిన ఆయుధ చట్టాలను గాంధీజీ కూడా వ్యతిరేకించారు.

భారత ప్రజల్ని నపుంసకులుగా చేస్తున్నారని దుయ్యబట్టారు. కానీ స్వాతంత్య్రం వచ్చాక నల్లదొరలు ఆ చట్టాలను ఇంకా కఠినతరం చేసి, వ్యక్తిగత రక్షణ కోసం పూర్తిగా ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడేలా చేశారు. దాని ఫలితమే నేటి అభద్రతా పరిస్థితులు. ప్రతి మూకా వ్యక్తుల్ని నిర్భయంగా బెదిరించగలుగుతోంది. తనను తాను రక్షించుకోలేని మనిషి స్వేచ్ఛాజీవి కాదు, బానిస మాత్రమే. ఓట్ల కోసం మూకలను తయారుచేసి వాళ్ళు కొట్టుకుచస్తుంటే గుడ్లప్పగించి చూస్తూ, ఏం చేస్తే ఎన్ని ఓట్లు పోతాయోనని లెక్కేసుకునే ప్రభుత్వాల మీద ఆధారపడడం బుద్ధిహీనత అవుతుంది. ఎవరి స్వీయ రక్షణ వారే చూసుకోవాల్సిన సమయం వచ్చింది. ఆ హక్కు ఎవరూ కాదనలేనిది.

- జాహ్నవి 
https://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2011/oct/16/edit/16edit3&more=2011/oct/16/edit/editpagemain1&date=10/16/2011

5 కామెంట్‌లు:

  1. సమైఖ్యవాదులకు విజ్ఞప్తి కేసీర్ భవిష్యత్తుతో ఆడుకోకండి...వాడి బ్రతుకు తెరువు కోసం ఒక పార్టీ ...దాన్ని బ్రతికించుకోవడానికి ఒక ఉద్యమం....దానికి ఎప్పుడొ జరిగిన కధకు...ఇప్పుడు ప్రాణం పోసి...రియాలిటీ షో నడుపుతున్నాడు...కేటీర్...కవితా...ఈ పుడుంగులు పెద్ద హీరోలూ...హరీష్ అనబడే బ్లాక్ మార్కెట్లో టికెట్ లమ్ముకునే స్టాండర్డ్ వాడు...పెద్ద నాయకుడు...థూ నా తెలుగు ప్రజలరా...ఈ దేశంలో...ఇంతకంటే వెధవలు ఎవరూ దొరకలేదా??మీ నాయకులుగా..??

    రిప్లయితొలగించండి
  2. ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులని (బహుషా దేశపరిస్థితులని) చక్కగా విశ్లేసిస్తూ వ్రాసిన రచయితకి అభినందనలు. బాగా అలోచింపజేసే ఈ వ్యాసం కొంతమంది మూర్ఖులనైనా అలోచింపచేస్తుందీమో అనే "ఆశ" ఎక్కడో మినుకు మినుకు మంటుంది!

    రిప్లయితొలగించండి
  3. చాల చక్కగ వ్రాసారు ఇప్పటి కైనా ఆంద్ర రాష్ట్ర ప్రజలు రాజకీయ నాయకుల మాటలకు రెచ్చి పోకుండా ఉంటారని ఆశిద్దాం.భాదాకర విషయం ఏమిటంటే ఉన్నత చదువులు చదివిన వారు కూడా రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం విచారకరం.

    రిప్లయితొలగించండి
  4. జాహ్నవి పేరుతో రాస్తున్న ఆంధ్ర జ్యోతి యజమాని రాదా కృష్ణ బాగా రాసాడు

    రిప్లయితొలగించండి
  5. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి