30, అక్టోబర్ 2011, ఆదివారం

భవిష్యత్తుపై బెంగ

ఆంధ్రజ్యోతి సంపాదకీయ పేజి: సకలజనుల సమ్మె ముగిసిందనుకున్నా, లేక వాయిదా పడిందన్నా, ప్రస్తుతానికి కొంత ప్రశాంత వాతావరణం ఏర్పడింది. సమ్మె జరిపిన తీరు, అందులో పాల్గొన్న వారెవరు, ఎందరు, ఎవరికి ఎంత నష్టం జరిగింది, ఎవరు లాభపడ్డారు అన్న విషయాలపై రకరకాల భాష్యాలు వినపడడం అనివార్యం. వాస్తవాలు చూస్తే, ఎన్ని రోజులు పని ఎగ్గొట్టినా తమకు వ్యక్తిగతంగా నష్టం లేని వర్గాలే సమ్మెను సాగదీశాయి. దీనివల్ల వివిధ వృత్తుల్లోని ప్రైవేటు వ్యక్తులకు, అసంఘటిత వర్గాలకు, తద్వారా రాష్ట్రం మొత్తానికి జరిగిన నష్టం అపారం, అది ఎవరూ పూడ్చలేనిది.

బొగ్గు కొరత కారణంగా మన రాష్ట్రమే కాక పొరుగున ఉన్న దక్షిణాది రాష్ట్రాలు కూడా భారీగా నష్టపోయాయి. విపరీతమైన కరెంటు కోతలతో అల్లాడిన మన రాష్ట్రంలోనయితే కోల్పోయిన ఉత్పత్తిని లెక్కించడం కూడా కష్టం. ఆర్థిక నష్టం మాత్రమే కాక, చెప్పిన సమయానికి సరుకు అందజేయలేకపోవడంతో ఫార్మా, రసాయన, ఇంజనీరింగ్ ఉత్పత్తుల రంగా లు తమ కస్టమర్ల వద్ద నమ్మకం, విశ్వసనీయత కోల్పోవాల్సి వచ్చింది.

టెక్నాలజీ, రవాణా వ్యవస్థలు ఆధునికమై, విపరీతమైన పోటీ వాతావరణం కారణంగా, యంత్రాలు, వినియోగ వస్తువులు తయారుచేసే వారందరూ ఏ గంటకు కావలసిన ముడిసరుకు అప్పుడే దించుకునే వ్యవస్థ ఏర్పడింది. నెలల తరబడి ఉత్పత్తికి కావలసిన ముడి సరుకు ఎవరూ తమ దగ్గర పేర్చి పెట్టుకోవడం లేదు. ఈ పరిస్థితుల్లో ఒక్క రోజు రవాణా లేదా ఉత్పత్తి స్తంభించినా కూడా ఉత్పత్తి గొలుసు కట్టుమీద తీవ్రమయిన దుష్ప్రభావం చూపుతుంది. అలాంటిది నెలరోజుల పాటు జరిగిన సమ్మెతో ఉత్పత్తి రంగం పడినపాట్లు వర్ణనాతీతం. పోయిన కాలం తిరిగిరానిది.

ముఖ్యంగా విద్యార్థులు, రైతులకు, ప్రతిరోజూ పది, పదిహేను గంటల బోధన, చదువు ఆటంకాలు లేకుండా కొనసాగితే తప్ప జాతీయ స్థాయిలో జరిగే పరీక్షల్లో ర్యాంకులు సాధించలేని పరిస్థితి. అలాంటిది కనీసం ఇరవై, ఇరవై అయిదు రోజులు చదువు కోల్పోయిన విద్యార్థులు ఎలా కోలుకుంటారు? తెలంగాణ కాలేజీలు బందు పెట్టారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల విద్యార్థులకు, ఇతర రాష్ట్రాల్లోని విద్యార్థుల చదువుకు ఏ విఘాతమూ లేదు. దీంతో నష్టపోయిందెవ రు? పోటీ పరీక్షల్లో తెలంగాణ విద్యార్థులకు జరిగే నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు? పూనక పరిస్థితుల్లో కేజీ నుండి పీజీ దాకా విద్యాసంస్థల నిరవధిక బందుకు ఏ ఆచార్యులు ఏ అధికారం, ఏ నైతిక హక్కుతో పిలుపులిచ్చారు?

అలాగే కరెంటు కోతల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ఎవరు, ఏవిధంగా పరిహారమివ్వగలరు? అధికారికంగా ఆరుగంటలు కరెంటిచ్చినట్లు చెప్పినా, అది అయిదారు విడతల్లో, పూర్తిగా రాత్రివేళల్లో ఇచ్చి, పొట్టమీదున్న పంటలను ఎండగట్టిన పాపం ఎవరిది? ఇప్పటికే ప్రతిదానికీ ప్రభుత్వాన్ని అడుక్కోవలసిన స్థితికి దిగజారిన రైతులు, ఇకనుంచి తమను కాపాడమని ఉద్యమ నాయకులను కూడా అడుక్కోవాలా?

ఈ సకలజనుల మీద సమ్మె వల్ల రాష్ట్రవ్యాప్తంగా నష్టపోయారు. ఒక కంటికి దెబ్బతగిలితే రెండు కళ్ళలోనూ నీరుబుకుతుందని రుజువైంది. దీన్ని ఆపడమో, వాయిదా వెయ్యడమో ఎందుకు చేశారన్న చర్చ కంటే, భవిష్యత్తులో మళ్ళీ ఇలా జరగదని నమ్మకం లేకపోవడమే భయాందోళనలకు గురిచేస్తోంది. పోలవరం టెండర్లకూ, సమ్మె నిలుపుదలకు సంబంధం ఉందో లేదో గానీ, ముందు ముందు ఇంకెవరన్నా ఇలాగే ఉద్యమాలు లేవదీసి, సమాజాన్ని బ్లాక్‌మెయిల్ చేసి, ప్రభుత్వాలను బెదిరించి సొమ్ము చేసుకోరనే గ్యారంటీ అయితే లేదు. ఇలాంటి ఉద్యమాలకు ఉచిత శలభాలుగా మారుతున్న వ్యక్తులు ఆత్మపరిశీలన చేసుకోవాలి. వారి ఆలోచన, రాజకీయ విశ్లేషణలో తీవ్రమైన మార్పులొస్తే తప్ప, ఇటువంటి పరిస్థితుల నుంచి సమాజం బయటపడదు.

ఏదైనా సంక్లిష్టమైన రాజకీయ ప్రశ్న ఎదురైనపుడు దాన్ని నైతికత అనే గీటురాయి మీద పరీక్షించి చూడాలే తప్ప, ప్రజాస్వామ్యం, మెజారిటీ వాదనల త్రాసులో తూయకూడదు. అలా తూస్తే అది చాలా ప్రమాదకరమైన పరిణామాలకు దారితీస్తుంది. ఉదాహరణకు, ప్రజాస్వామ్యం, మెజారిటీ వాదనలే ప్రామాణికాలయితే జర్మనీలో యూదుల ఊచకోత, గుజరాత్ మారణకాండ, కాందమాల్‌లో క్రిస్టియన్ ఫాదరీల సజీవ దహనం - వీటన్నిటికీ మెజారిటీ ప్రజల మద్దతు ఉంది. కాబట్టి తెలంగాణ అయినా, రాయలసీమ, ఉత్తరాంధ్ర అయినా ప్రతి విభజన వాదాన్నీ నైతికత దృష్ట్యా పరిశీలించి, పరీక్షించాల్సిందే.

ఇవాళ విభజన వాదులు చెబుతున్న తెలంగాణ ప్రజల స్వయం పరిపాలనాభిలాష రేపు హైదరాబాద్ ప్రజల స్వయంపాలనాభిలాషగా, తర్వాత ఆదిలాబాద్ మొదలుకుని ఏ జిల్లాకు, ఆ జిల్లా, ఏ మండలానికా మండలం, చివరికి ఏ ఊరికావూరు స్వయంపాలనాభిలాషగా మారే అవకాశం లేకపోలేదు. అలా జరిగిన నాడు ఆ అభిలాషలను గౌరవిస్తామని, అంగీకరిస్తామని చెప్పగలిగితేనే స్వయం పరిపాలనాభిలాష ప్రాతిపదికపై తెలంగాణ విభజన సమర్థనీయమవుతుంది. ప్రతి ఊరిలోని ప్రతి వ్యక్తీ స్వయం పాలనాభిలాషను వ్యక్తం చేసిననాడు ప్రభుత్వమే మాయమవుతుంది. స్వేచ్ఛావాదులు కోరుకునేది కూడా అదే.

అలా కాకుండా తెలంగాణపై పరిపాలనాధికారాలు తెలంగాణ వారికే ఉండాలనడం, దాని కోసమే విభజన కోరడం అస్పష్టం, అహేతుకం. పరిపాలనాధికారాలు దేనికోసం? ప్రభుత్వ భూములు తమకిష్టమైన వాళ్ళకు కట్టబెట్టడానికా? ప్రభుత్వ పనులు టెండర్లన్నీ తనవారికే ధారపోయడానికా. దొంగల పేర్లు, ముఖాలు మారడం తప్ప దోపిడీ తప్పనప్పుడు విభజన జరిగితేనేం జరక్కపోతేనేం? భౌగోళిక తెలంగాణ, సామాజిక తెలంగాణ మీమాంసలు, ఉద్యమ నాయకత్వం కోసం ఎత్తులకు పైఎత్తులు చూస్తుంటేనే అర్థమవుతోంది - రాజ్యాధికార రొట్టెకోసం ఎన్ని కొట్లాటలు జరగబోతున్నాయో.

ముఖ్యంగా రెండు విషయాల్లో స్పష్టత అవసరం. ఒక మిత్రుడన్నట్లు తెలంగాణ కావాలనుకునేవారు అధికారాభిలాషతో కాక, కేవలం వెనుకబాటు తనం పోగొట్టడానికే విభజన కోరుకుంటున్నారనుకుందాం. తెలంగాణ వెనుకబాటుతనం చారిత్రక కారణాల వల్ల ఉండిందా లేక కోస్తా, రాయలసీమ ప్రాంతాలతో కలిసి ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడ్డం వల్ల వచ్చిందా?

ఒకవేళ చారిత్రక కారణాల వల్ల ఉండుం టే, ఆంధ్రప్రదేశ్ అవతరణ తరువాత వెనుకబాటు తనం తగ్గిందా, పెరిగిందా? కళ్ళకు కనబడ్డమే కాక, గణాంకాలతో సహా రుజువై, ఆంధ్రప్రదేశ్ అవతరణానంతరం తెలంగాణలో జరిగిన అభివృద్ధికి కారకులెవరు? ఉమ్మడి రాష్ట్రంలోని ఇతర ప్రాం తాల నుండి ప్రవహించిన నిధులు, మాన వ వనరుల ప్రభావమెంత? ఈ విషయాల్లో శాస్త్రీయ ఆధారాలతో కూడిన స్పష్టత రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇక రెండోది, విభజనలు, విడిపోవడాలు కోరుకునే హక్కెవరికుంటుంది? ఏ పరిస్థితుల్లో ఉంటుంది? స్వేచ్ఛాభిలాషతో ఒక నియంతృత్వం నుంచి వేరుపడే అ«ధికారం, హక్కు ప్రతి మానవుడికి, ప్రతి సమూహానికి ఉంటుంది. అంతే తప్ప ఒక నియంతృత్వం నుంచి ఇంకో నియంతృత్వంలోకి వెళ్ళేందుకు, ఒక లంచగొండి ప్రభుత్వం స్థానంలో ఇంకో లంచగొండి ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేందుకు జాతీయత లేదా ప్రాంతీయతల్లాంటి అహేతుక ప్రాతిపదికలపై విభజన కోరుకునే హక్కు ఎవరికీ, ఎప్పటికీ ఉండదు.

విభజన తర్వాత తెలంగాణలో ప్రజలకు పూర్తి స్వేచ్ఛనిచ్చి, ఎవరి బ్రతుకు వారిని బతకనిస్తారనే నమ్మకముంటే విభజనను సమర్థించొచ్చు. అంతే తప్ప ఇప్పుడున్న పాలకవర్గాల స్థానే కొత్త దొరల మోచేతి నీళ్ళు త్రాగుతూ బతకాల్సొస్తే, ఈ తెలంగాణ వద్దు, నీ రాజ్యం వద్దు, ఆ రాజ్యం వద్దు అని ప్రజలు గ్రహించాలి. స్వేచ్ఛకోసం త్యాగం చేసినా అర్థం ఉంది, కొత్త దొరల దగ్గర బానిసత్వం కోసం త్యాగాలు చెయ్యడం శుద్ధదండగ.

- జాహ్నవి

1 కామెంట్‌: