23, అక్టోబర్ 2011, ఆదివారం

గవర్నర్‌ను కలిసిన విశాలాంధ్ర మహాసభ ప్రతినిధులు

ఆంధ్ర భూమి, హైదరాబాద్, అక్టోబర్ 22: విశాలాంధ్ర మహాసభ సదస్సును రాజధానిలో ఏర్పాటు చేసేందుకు వీలు కల్పిస్తూ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని విశాలాంధ్ర మహాసభ ప్రతినిధులు పరకాల ప్రభాకర్, నర్రా మాధవరావు, డాక్టర్ సయ్యద్ ఫాహిమ్, సూర్యమోహన్, కుమార్ చౌదరి యాదవ్ తదితరులు గవర్నర్‌ను కోరారు. వారు గవర్నర్ ఇఎల్‌ఎస్ నరసింహన్‌ను శనివారం మధ్యాహ్నం కలుసుకుని వినతిపత్రం సమర్పించారు. అంతకుముందు విశాలాంధ్ర మహాసభ 21, 22 * తేదీల్లో జూబ్లీహాల్‌లో సదస్సు, ప్రదర్శనను నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. కాని పోలీసులు చివరి నిమిషంలో ఈ సదస్సు నిర్వహణకు అనుమతిని నిరాకరించారు. జూబ్లీహాల్‌ను ఈ సభ నిర్వహించేందుకు ఇవ్వబోమంటూ అనుమతిని సంబంధించిన అధికారులు రద్దు చేశారు. దీంతో నిర్వాహకులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసి సభ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని హౌస్ మోషన్ ప్రతిపాదించగా స్వీకరించలేదు. కోర్టును ఆశ్రయించాలని ఆదేశించారని విశాలాంధ్ర మహాసభ ప్రతినిధి పరకాల ప్రభాకర్ తెలిపారు. దీంతో నిర్వాహకులు గవర్నర్‌ను కలుసుకుని తమకు సభను నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. భావస్వేచ్ఛ, వ్యక్తీకరణను హరించే విధంగా అధికారుల ధోరణి ఉందన్నారు. గతంలో ఢిల్లీలో తమ సంస్ధ మహాసభను నిర్వహించామన్నారు. ఆంధ్రమహాసభ స్ఫూర్తితో సభను నిర్వహించాలనుకున్నట్లు తెలిపారు. మహానుభావులు రావి నారాయణ రెడ్డి, మాడపాటి హనుమంతరావు, సురవరం సుధాకర్ రెడ్డి**, అయ్యదేవర కాళేశ్వరరావు, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, బూర్గుల రామకృష్ణారావు తెలుగు ప్రజల ఐక్యత కోసం కృషి చేశారన్నారు. రాష్ట్ర విభజన కోసం జరుగుతున్న ఉద్యమాల తీరు తమకు ఆందోళన కలిగిస్తోందన్నారు. తెలుగు ప్రజల ఐక్యత కోసం విశాలాంధ్ర మహాసభను హైదరాబాద్‌లో కూడా నిర్వహించాలని చాలా మంది కోరారని చెప్పారు. కాగా జూబ్లీహాల్ వద్ద ముందు జాగ్రత్త చర్యగా శనివారం ఉదయం నుంచి పోలీసులు భద్రత ఏర్పాట్లు చేశారు.


 * 22, 23

**సురవరం ప్రతాపరెడ్డి అని చదవగలరు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి