25, అక్టోబర్ 2011, మంగళవారం

మేం బకరాలా?


ఆంధ్రప్రభ : మరిమామాటేమిటని అడుగుతున్నారు సకల జనుల సమ్మె కాలంలో విధులకు హాజరైన ఉద్యోగులు. తెలంగాణ నాన్‌గెజిటెడ్‌ అధికారుల సంఘంతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలంకావడంతో సమ్మె విరమించడంపై తీసుకున్న నిర్ణయాన్ని ఆహ్వానిస్తూనే మరి సమ్మె కాలంలో పని చేసిన తాము బకరాలుగానే మిగిలిపోవాలా? సమ్మెలో పాల్గొనకుండా అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు అండగానిలిచి అనేక వత్తిళ్లు తట్టుకుని పనిచేసినందుకు ఏం లాభం?... 42 రోజులు పనిచేసినవారితో సమ్మెలో పాల్గొన్నవారినీ సమానంగా “ట్రీట్‌’ చేసి అన్ని సౌకర్యాలు సమకూర్చినప్పుడు తమకు చివరకు మిగిలింది నిరాశేనా? అని విధులకు హాజరైనవారు అడుగుతున్నారు.

సమ్మె విరమణపై టిఎన్‌జివో నాయకులతో ప్రభుత్వం జరిపిన చర్చల సారాంశం బయటకు పొక్కగానే తాము బకరాలుగా మిగిలిపోయామని విధులకు హాజరైన ఉద్యోగులు వాపోయారు. ముఖ్యంగా సమ్మె విరమణపై కుదిరిన అంగీకారంలో భాగంగా 42 రోజులు విధులకు దూరంగా ఉన్న సమయాన్ని ప్రత్యేక సెలవు దినాలుగా పరిగణించడంపై వీరు పూర్తి అభ్యంతరం తెలియజేస్తున్నారు. సుదీర్ఘంగా 42 రోజులు సమ్మెలో పాల్గొన్న వారు హాయిగా ఇంటి దగ్గర కూర్చుని వారి జీతాలు తీసుకుంటున్నారని, ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి తాము విధులకు హాజరయినందుకు తమకు వెంటనే ప్రభుత్వం ఇన్సెంటివ్‌ ప్రకటించాలని వీరు డిమాండ్‌ చేస్తున్నారు.

1983లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఎన్‌జివోలు చేసిన సమ్మెకు దూరంగా ఉన్నవారికి ప్రోత్సాహకరంగా ఒక ఇంక్రిమెంట్‌ ఇచ్చిందని, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ దిశలో ఆలోచించకపోతే విధులకు హాజరైన ఉద్యోగుల నైతికస్థైర్యం దెబ్బతినే ప్రమాదముందని వారు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. గతంలో ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం 1983లో స్వర్గీయ ఎన్‌టిఆర్‌ అధికారంలో ఉండగా రాష్ట్రవ్యాప్తంగా ఎన్‌జివోలు 43 రోజులు సమ్మెలో పాల్గొన్నారు. తర్వాత సమ్మె విరమణ అంగీకారం కుదరడంతో ఈ ఉద్యోగులు విధులకు హాజరయ్యారు. అయితే, ఈ అంగీకారంలో భాగంగా సమ్మె కాలాన్ని ప్రత్యేక సెలవు దినాలుగా ప్రకటించి ప్రభుత్వం జీతం చెల్లించడానికి అంగీకరించింది. కాగా, సమ్మెలో పాల్గొనని ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఒక ప్రత్యేక ఇంక్రిమెంట్‌ ఇచ్చి ఉద్యోగుల అంకితభావాన్ని ప్రోత్సహించిందని, ప్రస్తుత కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రభుత్వం కూడా తక్షణం ఈ దిశగా ఆలోచించవలసిన అవసరం ఉందని సమ్మెకాలంలో పనిచేసిన ఉద్యోగులు అంటున్నారు.

ఎన్‌టిఆర్‌ ప్రభుత్వం ఆగస్టు 8, 1983న ఆర్థిక శాఖ విడుదల చేసిన జీవో ఎంఎస్‌ నెంబర్‌.226 ద్వారా సమ్మెలో పాల్గొనని ఉద్యోగులకు స్పెషల్‌ ఇంక్రిమెంట్‌ ఇచ్చిందని అదే విధంగా ప్రస్తుతం సమ్మెలో పాల్గొనని ఉద్యోగుల గురించి ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టవలసిన అవసరం ఉందని వీరు గట్టిగా డిమాండ్‌ చేస్తున్నారు. సకల జనుల సమ్మె వలన రవాణా సౌకర్యం లేకపోయినా ఎన్నో కష్టాలకోర్చి తమ విధులకు హాజరయ్యామని, ఎన్నో వత్తిళ్ల మధ్య పనిచేశామని, ఈ కష్టం నిరాశగా మిగిలిపోకూడదని అంటున్నారు. సమ్మెలో పాల్గొన్న వారు చాలా మంది కుటుంబ సభ్యులతో హాయిగా విహారయాత్రలకు వెళ్ళారని, కొంతమంది 'కాలక్షేపం క్రీడలతో' గడిపారని, వీరందరికీ సమ్మె కాలాన్ని ప్రత్యేక సెలవుదినాలుగా పరిగణించి వారి జీతాలకు ఎలాంటి ఢోకా ఉండదని ప్రకటించడం సోదరభావంతో తమకు సంతోషమే అయినా, తమ కష్టానికి కూడా తగిన ప్రతిఫలం లేకుంటే కష్టపడిన వారికి అన్యాయం చేసినట్లు అవుతుందని అంటున్నారు.

2 కామెంట్‌లు:

  1. true.. It really hurts and diminish the morale of these employees. The govt should compensate the employees who performed their duties despite of all hardships.

    రిప్లయితొలగించండి
  2. Yes. The employees who did not participate in the agitation and also faced the trauma from both the parties (govt & agitators) should get extra benefits for their efforts and work attitude.

    రిప్లయితొలగించండి