29, అక్టోబర్ 2011, శనివారం

ఆచార్యుని గందరగోళం

ఆంధ్రజ్యోతి సంపాదకీయ పేజి: మన దేశంలో అసలు లోపమంతా ప్రజాస్వామ్య వ్యవస్థలోనే వుందని సూత్రీకరించడానికి మావోయిస్టు మేధావులు నిరంతరం తాపత్రయపడుతుంటారు. ఈ కోవలో జి.హరగోపాల్ వ్యాసం (అక్టోబర్ 26, ఆంధ్రజ్యోతి 'స్నేహపూరితంగా విడిపోవాలి') మావోయిస్టు ఆలోచనలకు ప్రాంతీయ విద్వేషవాదాన్ని పెనవేసి, తెలంగాణ విభజనవాదాన్ని మన ముందుకు తెచ్చింది.

తెలంగాణ ఉద్యమంలో వేర్పాటువాద నాయకులు రెండు ప్రాంతాల మధ్య విద్వేషాలు రగిల్చినా ప్రజాప్రతినిధులపై దాడులు చేసినా మరో అభిప్రాయం వ్యక్తం కాకుండా సమావేశాలను అడ్డుకున్నా సినిమా షూటింగులపై దండెత్తినా, మహనీయుల విగ్రహాలను పడగొట్టినా, విచ్చలవిడిగా బంద్‌లు ప్రకటించినా, బలవంతంగా స్కూళ్ళు మూయించినా బస్సు ప్రయాణీకులపై రాళ్ళ వర్షం కురిపించినా, బస్సులను తగులబెట్టినా రెండు సంవత్సరాలుగా ప్రజాజీవనాన్ని అతలాకుతలం చేసినా పోలీసులు మౌన ప్రేక్షకులుగా మిగిలిపోయారు. ఇటీవల రైల్‌రోకో సందర్భంలో మాత్రం ఆందోళన కారులను అడ్డుకొని వారిపై కేసులు పెట్టారు. బహుశా అందుకే అయివుంటుంది ఆయన పోలీసులపై విరుచుకుపడటం. పోలీసులు క్రూరంగా, కఠినంగా, విచ్చలవిడిగా హింసను ప్రయోగిస్తారని చెబుతూ పోలీసుల బలప్రయోగం రాజకీయ ప్రక్రియకు ప్రత్యామ్నాయం కాదని తెలియజేశారు.

ఈ సందర్భంలోనే విప్లవకారులకు కూడా రాజ్యాంగబద్ధ పౌరహక్కులు ఉంటాయని చెప్పారు. చట్టబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాలపై యుద్ధం ప్రకటించి నిరంతరం ఆయుధాలతో సంచరిస్తూ విచ్చలవిడిగా హత్యాకాండకు పాల్పడుతూ అజ్ఞాతంలో వుం టున్న వారికి కూడా సాధారణ పౌరులలాగా పౌర హక్కులుంటాయని చెప్పే హరగోపాల్ తెలంగాణ వాదులు నిరంతరం చట్టాలను ఉల్లంఘించడాన్ని కూడా ప్రజాస్వామ్య ఉద్యమంలో భాగంగా చెప్పడంలో ఆశ్చర్యం లేదు. చట్ట విరుద్ధంగా మారణాయుధాలతో సంచరించే వారు పౌరహక్కుల పరిధిలోకి రారనిగాని, ప్రజల మధ్య విద్వేషాలు పౌర జీవనానికి విచ్చలవిడిగా ఆటంకం కలిగించే వారిపై చట్టపరమైన కేసులు పెట్టి వారిని న్యాయస్థానాల ముందు నిలిపే బాధ్యత పోలీసులదనిగాని హరగోపాల్ వంటి పౌరహక్కుల నేతలు ఎన్నడూ చెప్పరు.

పోలీసు వ్యవస్థ పట్ల ఆయన అభిప్రాయాలు మావోయిస్టు మేధావులందరూ ప్రకటించే పాత ఆలోచనలే. కాని హరగోపాల్ తనదైన శైలిలో ప్రాంతీయ విద్వేషాన్ని వెళ్లగక్కడం వామపక్ష మేధావుల దిగజారుడుతునానికి ఒక మచ్చుతునక. 'ఆ ప్రాంతం నుంచి వచ్చి తెలంగాణలో స్థిరపడ్డ వారు తెలంగాణ జీవన వైవిధ్యంలో వాళ్ళ చైతన్యంలో మమేకం కావాలి'. ఇంతటి దుర్మార్గపు ప్రతిపాదన చేసిన వారు మరొకరు లేరు. తెలంగాణ జీవన వైవిధ్యంలో, వాళ్ళ చైతన్యంలో మమేకం కావాలంటే ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి స్థిరపడినవారు ఏమి చేయాలి? ఆంధ్ర ప్రాంతపు వారి ఆస్తులపై దాడిచేయాలా? బందులు చేయించాలా? సమైక్యవాదులను తరిమికొట్టాలా? టిఆర్ఎస్‌లో సభ్యత్వం తీసుకోవాలా? నమస్తే తెలంగాణ పత్రికనే చదవాలా? టి ఛానెల్‌ను మాత్రమే చూడాలా? ఆంధ్రప్రాంతం నుంచి వచ్చి తెలంగాణలో స్థిరపడ్డ వారి దృక్పథం మారాలని హరగోపాల్ హెచ్చరిస్తే అలా మార్చుకున్న వారిపట్ల జాలితో వ్యవహరించాలని కూడా ఆయన తెలంగాణ ఉద్యమకారులకు సలహా ఇచ్చారు.

అలాగే ఇక్కడ స్థిరపడ్డ బెంగాలీలు, మళయాళీలు, మరాఠీలు, కన్నడ ప్రాంతీయులు ఎవ్వరూ ఈ చైతన్యంలో మమేకం కావాలని ఆయన కోరలేదు. భారతదేశంలో ఉన్న క్రైస్తవులు, ముస్లింలు, తమ మత సంప్రదాయాలకు తిలోదకాలిచ్చి, భారతీయతను అలవర్చుకోవాలనే హిందూ మతతత్వవాదల కోవలో హరగోపాల్ కూడా ఇక్కడ స్థిరపడిన ఆంధ్రప్రాంతం వారిని బెదిరించడానికి పూనుకున్నారు. 'ఆంధ్రప్రాంతం వారిమీద దాడులంటూ జరిగితే అవి సాధారణ, అమాయకపు కుటుంబాల మీద ఎక్కువ జరిగే ప్రమాదముందని' ఆయన హెచ్చరించడం చూస్తే ఆ దాడులు సంపన్నులపై జరిగితే పట్టించుకోనక్కర లేదనే భావం ధ్వనిస్తోంది. అలాగే 'హైదరాబాద్ తన సంయమనాన్ని కోల్పోతే, ఆ ప్రాంతం పట్ల అసహనం పెరిగితే పరిస్థితి విషమంగా మారే ప్రమాదముంది' అని బెదిరించడం ఆయన నిజస్వరూపాన్ని తెలియజేస్తోంది.

ఎవ్వరిపై ఎవ్వరు దాడులు చేసినా, అది నేరమని, పోలీసు యంత్రాంగం అటువంటి వారి పట్ల కఠినాతి కఠినంగా వ్యవహరించాలని ఆయన ఎన్నడూ చెప్పరు. అందుకు భిన్నంగా తెలంగాణావారి చైతన్యంలో మమేకం కావాలన్న ఆయన వికృత ప్రతిపాదనను సభ్యసమాజం అసహ్యించుకుంటుంది. ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి తమ దృక్పథం మార్చుకున్న వారితో సఖ్యంగా వుండాలని సలహా ఇచ్చే సమయంలోనే హరగోపాల్‌లోని మావోయిస్టు మేధావి భీకరరూపంలో బయటకు వచ్చారు. తన ఈ ప్రజాస్వామ్య దృక్పథం పెట్టుబడిదారులకు, దోపిడీదారులకు, భూ ఆక్రమణదారులకు వర్తించదని, వాళ్ళ విషయంలో అసలు మానవీయంగా ఆలోచించడమే సాధ్యం కాదని స్పష్టం చేశారు. అంటే ఆం ధ్ర పెట్టుబడిదారుల పట్ల అమానవీయంగా అంటే దౌర్జన్య పూరితం గా, హింసాయుతంగా వ్యవహరించాలన్నట్లు ఆయన సూచించారు.

ప్రజాస్వామ్య వ్యవస్థ పారిశ్రామికవేత్తలను, వాణిజ్యవేత్తలను సంపదను సృష్టించేవారిగా, లక్షలాది మందికి జీవనోపాధి కల్పించే వారిగా, కోట్లాది మంది జీవన ప్రమాణాలు పెంపొందించే వారిగా గుర్తించి గౌరవిస్తుంది. ఇందుకు భిన్నంగా మావోయిస్టు సిద్ధాంతీకులు వారిని పెట్టుబడిదారులుగాను, దోపిడీదారులుగాను, వర్గ శత్రువులుగాను పరిగణిస్తూ ఆ శత్రుసంహారంతోనే విప్లవం సాధ్యమవుతుందని నమ్ముతుంటారు. పారిశ్రామికవేత్తలు ఎవరైనా చట్టాలను ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడుతుంటే వారిని శిక్షించడానికి తగిన చట్టాలు, న్యాయస్థానాలు మనకు ఎలాగూ ఉన్నాయి.

ఇక రాజ్యాంగంపట్ల, చట్టాల పట్ల ఏమాత్రం నమ్మకంలేని మావోయిస్టులు మాత్రం వారిని ప్రజాద్రోహులుగా పరిగణిస్తూ తామే వారిని శిక్షించాలనుకుంటారు. హరగోపాల్ కూడా అదే కోవలో వారిపట్ల మానవీయంగా ఆలోచించడమే అసలు సాధ్యం కాదంటున్నారు. అలాగే తెలంగాణ ఉద్యమం సఫలమై ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే మావోయిస్టు విప్లవం వచ్చినట్లేనని అప్పుడు పెట్టుబడిదారులపట్ల కనికరం చూపాల్సిన అవసరం కూడా వుండదని వారు భావిస్తున్నారు. వేర్పాటువాదాన్ని అతి తీవ్రంగా సమర్ధించే హరగోపాల్ అసలు రాష్ట్రాన్ని ఏ ప్రాతిపదికన విభజించాలో తన వ్యాసంలో ఎక్కడా పేర్కొనలేదు.

విభజనకు ప్రాతిపదిక ఏమిటి? వెనుకబాటుతనమా? వేరుభాషా? భిన్న జాతా? రాజధానికి దూరంగా వుండటమా? అనేది చెప్పకుండా ఈ ఉద్యమం ఎందుకు సాగుతుందో ఒకే ఒక వాక్యంలో చెప్పారు. "ఆంధ్ర పెట్టుబడిదారుల లూటింగ్‌లకు వ్యతిరేకంగా ఈ ఉద్యమం జరుగుతోంది'' అని అన్నారు. అంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈ రాష్ట్రంలో మావోయిస్టు వ్యవస్థ ఏర్పడుతుందా? అసలు పెట్టుబడిదారులే లేని, ప్రపంచంలో మరెక్కడాలేని, సోషలిస్టు సమాజం ఏర్పడుతుందా? ఇటువంటి పెట్టుబడిదారుల లూటింగ్ భారతదేశంలో మరెక్కడైనా వుందా? లేక కేవలం తెలంగాణలో మాత్రమే వుందా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అసలు పెట్టబడిదారీ వ్యవస్థ వుండని విధంగా రా జ్యాంగాన్ని, చట్టాల్ని మార్చివేస్తారా? ప్రజాస్వామ్యం పట్ల, మార్క్సి జం పట్ల, నేటి ఉద్యమం తీరుతెన్నుల పట్ల కనీస పరిజ్ఞానం లేని వారు మాత్రమే ఇటువంటి విపరీతమైన సూత్రీకరణలు చేయగలరు.

రాష్ట్ర విభజన ఎందుకు జరగాలో ఆయన మరో చోట ఇలా వివరించారు. "ఒక ప్రాంత ప్రజలు తమ పాలన తాము చేసుకుంటామన్నప్పుడు ఆ భావనకుండే ప్రజాస్వామ్య కోణాన్ని గౌరవించడం కనీసం బాధ్యత లేదు. మా ఆధిపత్యంలోనే తెలంగాణ వుండాలనడం ఎంతవరకూ సమంజసం?'' ఒక రాజకీయ శాస్త్ర ఆచార్యుడు ఇంతటి అయోమయంగా అవివేకంగా, అమాయకంగా మాట్లాడడం విస్తుగొలుపుతోంది. ప్రజాస్వామ్యం అంటే స్వయంపాలన. స్వయంపాలన అంటే ప్రజాస్వామ్యం. రాజరికాలకు, విదేశీ పాలనకు వ్యతిరేకంగా తలెత్తిన 'స్వయంపాలన' సిద్ధాంతాన్ని ఇప్పుడు వల్లెవేయడం కంటే ప్రమాదకరమైన అంశం మరొకటి వుండదు.

ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం లేనివారు, ఈ వ్యవస్థను కుప్పకూల్చాలని భావించే వారు మాత్రమే ఈ స్వయంపాలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించగలరు. ఈ స్వయంపాలన క్రింది స్థాయి వరకు విస్తరించడానికి స్థానిక సంస్థలు ఏర్పడ్డాయి. పంచాయతీలలో, మున్సిపాలిటీలలో, జిల్లా పరిషత్‌లలో పాలకులు స్థానికులు కారా? ఎంపీలు, ఎమ్మెల్యేలు స్థానికులు కారా? ఈ స్వయంపాలన అనే బూటకపు సిద్ధాంతాన్ని ఉపేక్షించితే అది క్రమంగా దేశవిచ్ఛిత్తికి త్రోవతీస్తుంది. స్వయంపాలన, ఆత్మగౌరవం పేరిట భారతదేశం నుంచి ఏ రాష్ట్రమైనా మరోదేశంగా విడిపోవచ్చా? ఆ తరువాత ఇదే నినాదాలతో అలా విడిపోయిన ప్రాంతం నుండి వివిధ జిల్లాలు విడిపోవచ్చా? దేశాన్ని ముక్కలు చెక్కలు చేసే ప్రతిపాదన చేయడం కంటే దేశద్రోహం మరేంవుంటుంది? "తెలంగాణను తన ఆధిపత్యంలో వుంచుకోవడం ఎంతవరకు సమంజసం'' అని ప్రశ్నిస్తున్న హరగోపాల్ అసలు రాజకీయ శాస్త్ర ఆచార్యులుగా పనిచేశారా? అని అనుమానం కలుగుతోంది.

నేటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ప్రాంత ఆధిపత్యంలో మరొక ప్రాంతం వుండడం సాధ్యమా? తెలంగాణ అంటే ఒక ముఖ్యమంత్రి పదవి, ఇతర మంత్రి పదవులు కాదు. కోట్లాది మంది సామాన్య ప్రజల విస్తృత ప్రయోజనాలు, ఈ ప్రయోజనాలను పరిరక్షించటానికి విస్తృత ప్రభుత్వ యంత్రాంగం, అనేక రాజ్యాంగబద్ధ సంస్థ లు, న్యాయస్థానాలు నిరంతరం కృషి చేస్తుంటాయి. ఈ కనీస వాస్తవాన్ని గుర్తించకుండా ఒకే భాషా ప్రాంతం వారి మధ్య ఆధిపత్య భావనను ప్రవేశపెట్టి విద్వేషాలు రెచ్చగొట్టగలిగిన విద్వేషవాదులు, తమ ప్రయత్నాలలో విజయం సాధిస్తే ఏమి జరుగుతుంది? అతి త్వరలోనే వివిధ మతాల మధ్య, వివిధ భాషా ప్రాంతాల మధ్య సులభంగా విద్వేషాలు సృష్టించి భారతదేశాన్ని కల్లోలభరితం చేయగలుగుతారు. బహుశా మావోయిస్టుల అంతిమ లక్ష్యం అదేకావచ్చు. మావోయిస్టు సిద్ధాంతకారులు, ప్రాంతీయ విద్వేషవాదు లు అసత్యాలను జంకుబొంకు లేకుండా అలవోకగా వల్లించుతూ వుం టారు. అసత్య పునాదులపై తమ వాదనలు నెలకొల్పుతూ ఉంటారు. హరగోపాల్ గారికి అసత్యాలు వల్లించడం వెన్నతో పెట్టిన విద్య.

"ప్రభుత్వంలో గత ఇరవై సంవత్సరాలుగా ప్రపంచబ్యాంకు పుణ్యమా అని మూడు, నాలుగు లక్షల ఉద్యోగాలు మాయమయిపోయాయి'' అని ఆయన తన వ్యాసంలో పేర్కొన్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 1981 నాటి ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 7 లక్షల 66వేలు. (ప్రభుత్వ ఉద్యోగులు 3.43 లక్షలు. ప్రభుత్వరంగ సంస్థలలో 1.65 లక్షలు, స్థానిక సంస్థలలో 2.26 లక్షలు, యూనివర్సిటీలలో 14వేలు) 2006 నాటి ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 12.16 లక్షలు (ప్రభుత్వ ఉద్యోగులు 6.16 లక్షలు, ప్రభుత్వరంగ సంస్థలలో 2.54 లక్షలు, స్థానిక సంస్థలలో 3.30 లక్షలు, యూనివర్సిటీలలో 16 వేలు) గత పాతిక సంవత్సరాలలో ప్రభుత్వరంగంలో కొత్తగా నాలుగున్నర లక్షల ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. హరగోపాల్ గారు మాత్రం నాలుగు లక్షల ఉద్యోగాలు మాయమయిపోయాయి అని తన సహజ ధోరణిలో చెబుతున్నారు.

"కృష్ణానది 300 కిలోమీటర్లు ప్రవహిస్తున్నా, ఏ మాత్రం నీటి వసతిలేని మహబూబ్‌నగర్ జిల్లా రైతులు ఏం చేయాలి? సమైక్యంగా వున్నప్పుడు మహబూబ్‌నగర్ జిల్లా రైతుల మీద ప్రేమ, సానుభూతి అవసరం లేదా? ఏ సానుభూతి లేని వాళ్ళకు సమైక్యతను గురించి మాట్లాడే నైతికత ఎక్కడ వస్తుంది?'' అని హరగోపాల్ తన వ్యాసంలో సూటిగా ప్రశ్నిస్తున్నారు. ప్రాంతీయ విద్వేషవాదాన్ని ఝుళిపించడానికి, సమైక్యవాదులను తెలంగాణలోని పేద ప్రజల కష్టాలను పట్టించుకోని వారిగా, నైతిక విలువలు లేనివారిగా చిత్రీకరిస్తూ, వారిపై విషం చిమ్మడానికి, బాగా వెనుకబడి వుందనుకున్న మహబూబ్‌నగర్ జిల్లా రైతులను హరగోపాల్ ఒక ఉదాహరణగా ఎంచుకొన్నారు.

మహబూబ్‌నగర్ జిల్లా వెనుకబాటుతనాన్ని గురించి తాను ఎప్పుడో విన్న విషయాలను హరగోపాల్ ప్రస్తావిస్తున్నారే తప్ప ఆ జిల్లా ప్రస్తుత స్థితిగతుల గురించి ఆయనకు కనీస అవగాహన గాని, పరిజ్ఞానం గాని లేదు. 2009-10 సంవత్సరంలో మహబూబ్‌నగర్ జిల్లాలో 20 లక్షల 23వేల ఎకరాల విస్తీర్ణంలో మొదటి పంట సాగుచేయడం జరిగింది. 2 లక్షల 22 వేల ఎకరాలలో రెండవ పంట సాగుచేయడం జరిగింది. అంటే మొత్తం 22 లక్షల 65 వేల ఎకరాల విస్తీర్ణంలో మహబూబ్‌నగర్ జిల్లాలో సాగుచేయడం జరిగింది. సాగు విస్తీర్ణంలో ఇది రాష్ట్రంలోని జిల్లాల్లో మూడవ స్థానంలో వుంది. ఇంతటి విస్తీర్ణంలో కోస్తా జిల్లాల్లో ఎక్కడా సాగు చేయడం జరగలేదు.

ఇక మహబూబ్‌నగర్ జిల్లాలో 13 లక్షల 83 వేల ఎకరాలలో ఆహార ధాన్యాలను పండించారు. ఆహార ధాన్యాలను పండించడంలో కూడా కృష్ణా జిల్లా (14 లక్షల 95 వేల ఎకరాలు), గుంటూరు జిల్లా (14 లక్షల 45వేల ఎకరాలు) తరువాత మహబూబ్‌నగర్ జిల్లా మూడవ స్థానంలో వుంది. కోస్తా జిల్లాలన్నీ సముద్ర మట్టానికి 100 అడుగుల లోపు వుంటే మహబూబ్‌నగర్ జిల్లా సముద్ర మట్టానికి 1700 అడుగుల ఎత్తున వుంది. ఆ జిల్లాను ఆనుకుని వున్న శ్రీశైలంలోని గరిష్ట నీటి మట్టం కూడా సముద్రపు మట్టానికి 1000 అడుగుల లోపే! అయినా మహబూబ్‌నగర్ జిల్లాలో వ్యవసాయం ఉచ్ఛస్థాయిలో వుంది. సమైక్యవాదులు సానుభూతి చూపవలసింది హరగోపాల్ మాటల్లో "నీటి వసతి లేని మహబూబ్‌నగర్ జిల్లా రైతుల'' పట్ల కాదు. మిడిమిడి జ్ఞానంతో, మావోయిస్టు సిద్ధాంతాలను, ప్రాంతీయ విద్వేషవాదాన్ని కలగలిపి వేర్పాటు వాదులకు సైద్ధాంతిక ప్రాతిపదిక ఏర్పరచుతున్నానని భ్రమలలో మునిగి తేలుతున్న విశ్రాంత ఆచార్యులు హరగోపాల్ గందరగోళం పట్ల!

- అడుసుమిల్లి జయప్రకాష్
మాజీ శాసనసభ్యులు

3 కామెంట్‌లు:

  1. gowravaneeyulu aina jaya prakash gariki

    mee vyasalu chala artha vantham ga vuntaaee. daya chesi meeru delhi police meeda RTI application file chesi ahankari Harish Rao case status adagandi.
    AP police and Railway police meeda kuda RTI application file chesi, recent ga pettina casula paristiti adangandi.

    రిప్లయితొలగించండి
  2. Jayaprakash garu chala baaga raasaru.T prajalani KCR laanti vaalu andhakaramloki nettestunnaru. Nizamki(read muslims),Naxaliteski, Andhraski vyatirekamga vandala years guddiga poradutu, T prantanni elanti abhivruddhiki nochkokunda chestunnaru. Telugu bratikinchina Andhras miku satruvula?

    రిప్లయితొలగించండి